రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, July 27, 2017

488 - రివ్యూ!

     రచన – దర్శకత్వం : అలంకృతా శ్రీవాస్తవ్
తారాగణం : కొంకణా సేన్ శర్మరత్నా పాఠక్ఆహనా కుమ్రాప్లబితా బోర్థాకూర్సుశాంత్ సింగ్విక్రాంత్ మాసీ, జగత్ సింగ్ సోలంకీ తదితరులు 
సంగీతం : జేబున్నీసా బంగాష్మంగేష్ ధక్డేఛాయాగ్రహణం : అక్షయ్ సింగ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్
నిర్మాత ; ప్రకాష్ ఝా
విడుదల : 21 జులై, 2017 
                                                                                                                                                   ***


     సెన్సార్ బోర్డుతో యుద్ధానికి దిగి,  భారీగా 27 కట్స్ తో పహ్లాజ్ నిహ్లానీతో మోరల్ పోలీసింగ్ చేయించుకుని, ఎట్టకేలకు విడుదలైన ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ ఒక కరకు వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది మోరల్ పోలీసింగ్ చేయకుండానే  : మధ్యతరగతి స్త్రీలు   స్వేచ్ఛ కావాలనో, హక్కులుండాలనో ఎంత గొంతు చించుకున్నా, ఆ గొంతులకంటే వ్యవస్థలు పెద్దవి. ఒక్క ఇటుకని కూడా కదల్చలేరు- మత వ్యవస్థలోంచి, రాజకీయ వ్యవస్థలోంచీ. వూరికే ఇంట్లో వాళ్ళని అడిపోసుకుంటే కూడా లాభంలేదు. వాళ్ళు కూడా  ఈ రెండు వ్యవస్థలకి తరాలుగా బందీలే. 

          న్నతవర్గాల స్త్రీలకి దాదాపు స్వేచ్ఛ వుంటుంది. ఈ స్వేచ్ఛ ఆకర్షణల్ని సృష్టిస్తూంటుంది.  ప్రపంచం ఆకర్షణలు  – కోరికలు అనే రెండుగా విడిపోయివుంది. ఉన్నత వర్గాలు ప్రదర్శించే ఆకర్షణలు, వాటికోసం అర్రులు చాచే మధ్యతరగతి కోరికలు. ఈ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం పైనుంచి ఉన్నత వర్గాలతో జరగదు, ఎప్పుడూ కింది నుంచి మధ్యతరగతి జీవులతో ఊర్ధ్వ ముఖంగానే  జరుగుతూంటుంది. ఎంతకీ ఆ నీలాకాశం అందదు, ఇంతలో రాలిపడి మళ్ళీ వ్యవస్థల బందీకానాలో ముడుచుకోవడమే.

       రకరకాల స్వేచ్ఛలు  కావాలంటే ముందుగా  ఆర్ధిక స్వేచ్ఛ సాధించేందుకు సమయమంతా వినియోగించు- అప్పుడు పబ్బులు, మాల్సు, మల్టీ ప్లెక్సులు, బాయ్ ఫ్రెండ్స్,  కాస్త వయసు మళ్లినావిడకైతే ఫోన్ సెక్స్- అన్నీ చెంతకు వస్తాయి. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఆర్ధిక స్వేచ్ఛ లేకుండా అప్పుడే స్వేచ్ఛ పేరుతో ఈ ఆకర్షణల వెంట పడ్డావా- ఈ రియలిస్టిక్ మూవీలో అభాగినుల గతే నీకూ పడుతుంది. స్వేచ్ఛని ఉన్నత వర్గాలు బాహాటంగా అనుభవిస్తాయి. అనుకరణ జీవులైన మధ్యతరగతి వర్గాలు దొంగ చాటుగా అనుభవించాలని చూస్తాయి- అదేం స్వేచ్ఛ? ముందు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే ఈ ఖర్మే వుండదు. పొందిన ఆర్ధిక స్వేచ్ఛనంతా కూడా దుర్వినియోగం చేసుకుని డ్రగ్స్ కేసులో దొరికిపోవాలనుంటే దొరికిపో. కానీ డ్రగ్స్ కేసులో దొరికిపోయి హెడ్ లైన్స్ సృష్టించడానికి ఏళ్ల కేళ్ళు  అంత  కష్టపడి గడించిన ఆర్ధిక స్వేచ్ఛంతా  అవసరం లేదు. మధ్యతరగతి జీవిగానే రెండువేలు ఎక్కడ అడుక్కున్నా, చిటికెడు డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు, పట్టుకుని ప్రెస్ మీట్ లో పెట్టేవాళ్ళూ ఎప్పుడూ వుంటారు. 

      బురఖా పంజరానికి సింబల్. లిప్ స్టిక్ స్వేచ్ఛకి సంకేతం. పంజరంలో ఈ నల్గురు లిప్ స్టిక్ పక్షులు బయట  రహస్యంగా ‘స్వేచ్ఛ పొందుతూంటారు. ముందుగా కాలేజీ టీనేజీ రిహానా (ప్లబితా బోర్థాకూర్) చక్కగా బురఖా వేసుకుని బయల్దేరి దారిలో తీసిపారేసి,  లోపలున్న జీన్సూ టీ షర్ట్స్ తో టూవీలర్ మీద జామ్మని కాలేజీకి దూసుకుపోతుంది. ఆమెకి చాలా కోరికలున్నాయి. అందుకని కాలేజీ నుంచి వస్తూ షాపింగ్ మాల్స్ లో ఖరీదైన వస్తువులు కొట్టేసి వస్తూంటుంది. ఆమెకింకో కోరిక వుంది- మిలీ సైరస్ లాగా సింగర్ నవ్వాలని. దానికి ఓ బ్యాండ్ గ్రూప్ లో చేరి పాడుతూంటుంది. అక్కడ ధృవ్ అనే బాయ్ ఫ్రెండ్ ఏర్పడతాడు. ఈమె చేసే ఈ రహస్య కార్యకలాపాలేవీ ఇంట్లో బురఖాలు తయారు చేసే  తల్లిదండ్రులకి తెలియకుండా వుంటాయి.


          లీలా (
ఆహనా కుమ్రా) అనే ఓ ఇరవై ఏళ్ళు పైబడ్డ అమ్మాయి బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది. ఆమెకి ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ( విక్రాంత్ మాసీ)వుంటాడు. తల్లికి దొరక్కుండా అతడితో ఎక్కడపడితే అక్కడ  సెక్స్ స్వేచ్ఛ పూర్తిగా అనుభవిస్తూ వుంటుంది. కానీ ఈ ఇరుకు వూళ్ళోంచి ఢిల్లీ పారిపోయి, అక్కడ ప్రతిరోజూ బాయ్ ఫ్రెండ్ తో హనీమూన్ లా గడపాలనీ  కోరికలుంటాయి. 

          షిరీన్ (కొంకణా సేన్ శర్మ) అనే ముప్పై పైబడ్డ ముగ్గురు పిల్లల తల్లి వుంటుంది. ఈమె ఓ కంపెనీలో సేల్స్  ఎగ్జిక్యూటివ్. భర్త రహీం (సుశాంత్ సింగ్) సౌదీ వెళ్లి వచ్చి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడు. తన ఉద్యోగం గురించి అతడికి తెలియనివ్వకుండా రహస్యంగా ఆఫీసు కెళ్ళి వస్తూంటుంది. రాత్రయితే ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అతడికి సెక్స్ కావాలి. ఈ మారిటల్ రేప్ ని భరిస్తూ, అనేక గర్భాలు అబార్షన్ చేయించుకుంటూ నిస్సారంగా జీవిస్తూంటుంది. 

     ఉష (రత్నా పాఠక్) అనే 55 ఏళ్ల విడో వుంటుంది. ఈమెకి అప్పుడే వయసై పోలేదనీ, ఇంకా అనుభవించాల్సింది వుందనీ వుంటుంది. హిందీ  రోమాంటిక్ నవలలు చదువుతూ ఫాంటసీల్లో బతుకుతుంటుంది. జగత్ అనే ఒక స్విమ్మింగ్ కోచ్ పరిచయమై, స్విమ్మింగ్ నే ర్చుకునే వంకతో అతడి స్పర్శలోని  హాయిని అనుభవిస్తూ వుంటుంది. రాత్రి పూట రోజీ పేరుతో అతడికి ఫోన్ చేసి ఫోన్ సెక్స్ కి  పాల్పడుతూంటుంది. చాలా గ్లామరస్ గా తయారై హుషారుగా తిరుగుతూంటుంది. 

          ఈ నల్గురూ విడివిడిగా ఈ రహస్య కలాపాలతో ‘స్వేచ్ఛ’ ని పొందుతూ వుంటారు. అప్పుడు మాల్ లో చోరీ కేసులో రిహానా దొరికిపోతుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడు. ఆమెని విడిపించుకున్న తండ్రి,  కాలేజీ మాన్పించి ఇంట్లో బురఖాలు కుట్టమంటాడు. సంబంధాలు చూడమని భార్యతో చెప్తాడు. మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటుంది రిహానా. 

          లీలా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ తల్లికి దొరికిపోతుంది. ఆమెని రెండు పీకి సంబంధం చూసి నిశ్చితార్ధం కూడా చేస్తే, బాయ్ ఫ్రెండ్ తోనే ఎంజాయ్ చేస్తూంటుంది. ఆ తల్లి, పెళ్లి కొడుకు వదిలి పారేస్తారు. 

          షిరీన్ కి నలభై వేల జీతంతో ప్రమోషన్ వస్తుంది. ఆమె ఉద్యోగం చేస్తోందన్న సంగతి భర్తకి తెలిసిపోయి రేప్ చేసి, ఉద్యోగం మానేసి,  ఇంట్లో పడుండమంటాడు.

          ఉష సీక్రెట్ లవ్ చుట్టు  పక్కల తెలిసిపోయి ఆమెని వీధికి లాగి అల్లరల్లరి చేస్తారు. ఇది జగత్ చూస్తాడు. తనతో ఫోన్ సెక్స్ చేస్తోంది ఈమేనని అప్పుడు తెలుసుకుని,  అనరాని మాటనేసి వెళ్ళిపోతాడు.

          ఎలా మొదలయ్యారో మళ్ళీ అదే స్థితికి- అదే పంజరంలోకి వచ్చి  చేరుకున్న  నల్గురూ ఓ గదిలో చేరతారు. ఏదో పైకెగురుదామనుకుంటే, ఇంకింత  అధఃపాతాళంలోకే  పడ్డారు. ధూమపానం  చేస్తూ కబుర్లాడుకుంటారు. జనం చించి పారేసిన ఉష దాచుకున్న నవలలుంటాయి రకరకాల రోమాంటిక్ టైటిల్స్ తో. వాటితో కాసేపు ఆ ఓల్డ్ లేడీని ఆటలు పట్టిస్తారు. ఒక నవల చివరి మూడు పేజీలు  చదవలేదని, చదివి విన్పించమనీ  అంటుందామె. ఇప్పుడా రోజీ కథ ముగింపు చదివి విన్పిస్తుంది రిహానా. చాలా ఫీలవుతారు. 

        ప్రారంభంనుంచీ వాయిసోవర్ లో అప్పుడప్పుడు వచ్చే రోజీ కథ ఈ  నవల్లోనిదన్న మాట. మొత్తం కథలో  ఈ నల్గురికీ వర్తించే వెన్నో వున్నాయి. ఒక ప్రధాన పాత్రంటూ లేకుండా, నల్గురి వేర్వేరు కథలుగా వున్న స్క్రీన్ ప్లేకి,   వాయిసోవర్ లో రోజీ కథనం ఒక బ్రిడ్జింగ్ ఫోర్సుగా కలిపి వుంచుతుందన్న మాట.

          ఈ పాత్రల్ని మర్చిపోలేం, ఈ నటుల్ని మరచిపోలేం, ఈ దర్శకురాలినీ మర్చిపోలేం. ప్రముఖ దర్శకుడైన నిర్మాత ప్రకాష్ ఝానీ కొనియాడలేక వుండలేం. చాలాకాలం పాటు ఈ సినిమా మనుషులనే వాళ్ళని వెంటాడుతూంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటో, అందులోనూ మధ్యతరగతి ఆడవాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన స్వేచ్ఛ అంటే ఏమిటో, అదెలా లభిస్తుందో, ఎలా లభించదో, ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడు లభించదో - ఒక్క డైలగుతోనూ చెప్పకుండా, పరిణామాల క్రమం చూపించి వదిలేసిన ఈ క్రియేషన్ ఒక అద్భుతమైన అనుభవం ప్రేక్షకులకి.

-సికిందర్