రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

23, సెప్టెంబర్ 2019, సోమవారం

875 : స్క్రీన్ ప్లే అప్డేట్స్

‘లేడీ బర్డ్’ లో దృశ్యం 

      మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్...హాలీవుడ్ లో విజయవంతమైన టీనేజీ జానర్. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వయస్సుకు రావడం. పదహారేళ్ళకూ నీలో నాలో ఆ వయసు చేసే చిలిపి పనులకు కోటి దండాలు - అని పాడుకోవడం. కౌమారపు గొంగళి పురుగు కాస్తా రంగులేసుకుని యవ్వనపు సీతాకోక చిలుకలా ఎగిరే నూనూగు మీసాల, ఎదిగి వచ్చిన ఎదల, వయసొచ్చిన లేలేత టీనేజీ దశ. హై స్కూలైపోయి కాలేజీలో అడుగుపెట్టే బాధ్యతల వల. తల్లి పక్షి రెక్క లొచ్చిన పిల్లలకి ఇక తిండి పెట్టేది లేదని గూట్లోంచి తోసి పారేస్తుంది. ఇక కీచు కీచుమంటూ నట్టనడి లోకంలో పడి, రెప రెప రెక్కలు కొట్టుకుని ఎగరడం నేర్చుకుంటూ, తిండి వెతుక్కునే పనిలో జీవనపోరాటం మొదలెడతాయి పక్షి పిల్లలు. లేత టీనేజర్లదీ ఇదే పరిస్థితి. కుటుంబ సౌఖ్యంలోంచి సంక్లిష్ట ప్రపంచ ప్రాంగణంలోకి...బాధ్యతల బరిలోకి. వ్యక్తిగా పరిణతి చెందే అనుభవాల్లోకి. బాల్యపు దృక్కోణం చెదిరి ప్రాపంచిక దృక్పథంలోకి. పదేళ్ళ బాల్యం నుంచీ పంతొమ్మిదేళ్ళ టీనేజీ  వరకూ కథలు చెప్పే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ని హాలీవుడ్  కమర్షియలైజ్ చేసింది.

          తెలుగులో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో దాసరి నారాయణ రావు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘నీడ’ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ. అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ జిజ్ఞాసని, కుతూహలాన్నీ చంపేస్తూ ప్రేమించడం, ప్రేమలో పడ్డంగా చూపడం ఎదుగుదలని ఆపేసే అపరిపక్వత. చిత్రం, టెన్త్ క్లాస్ లాంటివి అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్నికనే ఇలాటి సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి. ఇవి కమర్షియల్ కోణాన్ని మాత్రమే చూస్తాయి. హాలీవుడ్ నుంచి కూడా ఇలాటి సినిమాలొచ్చినా, ఎక్కువ సినిమాలు ఎదుగుదల గురించే వుంటాయి. మనం ఇప్పుడున్న తీరులో వున్నామంటే ఎలా పరిణామం చెంది ఇలా తయారయ్యామో చెప్తాయి ఈ రకం సినిమాలు. మానసిక పునాదిని  వయస్సొచ్చాక అయిన అనుభవాలే వేస్తాయి. ‘బోర్న్ టు విన్’ అనే గ్రంథంలో సైకాలజిస్టులు ఒక మాట అంటారు : కడుపులో వున్నప్పుడు బిడ్డ తలరాత దేవుడు రాస్తాడో లేదో గానీ, పుట్టాక తల్లిదండ్రులు మనసు మీద రాస్తారని. వయస్సొచ్చాక ఈ మనసు మీద రాతతోనే సంఘర్షణ వుంటుంది స్వేచ్ఛకోసం. తమ రాత, తమ చేత తామే నిర్ణయించుకోవాలనుకుంటారు రెబెల్ మనస్తత్వంతో.

          కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది :  అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.

          ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.

అదే రూటులో తెలుగు 
           కానీ తెలుగులో దీనికి భిన్నంగా, హైస్కూలు - ఇంటర్ పిల్లల ప్రేమలే వర్కౌటవుతాయని అవే కాలక్షేపంగా తీయడం. తాజాగా మలయాళంలో హిట్టయిన ఇలాటి దొకటి ‘తన్నీర్ మథన్ దినంగళ్’ (పుచ్చకాయల రోజులు) తెలుగు రీమేక్ హక్కులు కొనే పోటీ కూడా మొదలైందని తెలుస్తోంది. ఒక దర్శకుడు దీని మీద ఆసక్తి పెంచుకుని రీమేక్ చేస్తే ఎలా వుంటుందని అడిగారు. తెలుగులో రెగ్యులర్ గా వస్తున్న రోమాంటిక్ కామెడీలకి  గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లేక, నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సే వరసగా చూస్తున్న మార్పు కన్పిస్తోంది. ఇప్పుడీ రీమేక్ తలపెడితే రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టం. పైగా అది మలయాళ కొత్త దర్శకుడు తన పర్సనల్ డైరీలాగా ఫీలై తీశాడు. ఎవరివో పర్సనల్ డైరీలూ, ముచ్చటైన ఫోటో ఫ్రేమ్ కథలూ, పోయెట్రీలూ  రీమేక్ చేసేకంటే, అలాటివి స్వయంగా ఫీలై క్రియేట్ చేసుకోలేరా అన్నది ప్రశ్న.

          హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

          సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు :  ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు.  ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు...


ఇదో పెద్ద పరిశ్రమ

          టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35  తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.

         తెలుగులో ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ (16 -19 ఏజి గ్రూపు) సినిమాల సెగ్మెంట్ ఖాళీగా పడివుంటోంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇంతవరకు లేని కొత్త ట్రెండ్ ని సృష్టించే ఆలోచన చేయడం లేదు. ఎంత సేపూ ఇరవై పైబడిన హీరోహీరోయిన్లతో అవే ముదురు రోమాంటిక్ కామెడీలు. థ్రిల్లర్ తీసినా గడ్డాలు పెంచుకున్న హీరోల హీరోయిజాలే. హాలీవుడ్ లో ‘బ్లడ్ సింపుల్’ తీసిన కోయెన్ బ్రదర్స్ ఇంకో ప్రయోగం చేశారు. నియో నోయర్ జానర్లో ‘బ్రిక్’ అనే నూనూగు మీసాల టీనేజీ జ్యూనియర్ కాలేజీ మర్డర్ మిస్టరీ తీసి సంచలనం సృష్టించారు. ‘బ్లడ్ సింపుల్’ లాగే ఇది కూడా యూనివర్సిటీల్లో కోర్సుగా నమోదైంది. నియో నోయర్ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ!

          మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.

          ప్రేమల్ని కామెడీల్ని కాసేపు పక్కనబెడదాం. ఎదుగుదల గురించిన కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ‘హోం ఎలోన్’ వుంది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ వుంది. మొన్న వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘అలీటా’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే అంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లో ఫ్లాష్ బ్యాక్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ ప్రమాణాలతో వుంటుంది. హిందీలో వచ్చిన ‘కయీ పోచే’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. ఇండియన్ కథతో డానీ బాయల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఇంకొకటి.

చుట్టూ వయోలెంట్ లోకం
               ఈ నేపథ్యంలో ఎదుగుదల లేని, యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అనే ఏ వెరైటీలేని, మరో ఉత్త హైస్కూలు ప్రేమల మలయాళ  ‘తన్నీర్ మథన్ దినంగళ్’ ని రీమేక్ చేయడం ఎంత వరకు అవసరమో వాళ్ళకే వదిలేద్దాం. కానీ తాము ఎలాటి ప్రపంచంలో వున్నారో టీనేజర్లకి తెలుసు. తియ్యటి అమాయక ప్రేమ సినిమాలు వాళ్ళనింకా మభ్య పెట్టలేవు. ప్రపంచం అతి సంక్లిష్టంగా, కన్ఫ్యూజింగ్ గా వుంది. పరమ వయోలెంట్ గా వుంది. ఇంకా చెప్పాలంటే అరచేతిలో విజువల్స్ కి దిగి వయోలెంట్ గా వుంది. వీడియో గేమ్స్ దగ్గర్నుంచీ సెల్ఫీల వరకూ. టిక్ టాక్ ల వరకూ. పబ్ జీ ల వరకూ. పోర్న్ వరకూ. టీనేజర్ల గ్యాంగ్ రేపుల వరకూ. పిల్లల కిడ్నాపుల వరకూ. తమతో ఆడుకునే పిల్లల రేపుల వరకూ. మార్కుల రేసుల వరకూ. కారు రేసుల వరకూ. బైక్ చోరీల వరకూ. చైన్ స్నాచింగుల వరకూ. బెట్టింగుల వరకూ. మాదక ద్రవ్యాల వరకూ. సోషల్ మీడియాల్లో వయోలెంట్ కామెంట్స్ వరకూ. వయోలెంట్ కానిదేదీ లేదు. ఒక విషయంపై ఎవ్వడూ వినడం లేదు. మాట్లాడ్డం లేదు. సమాచార మివ్వడం లేదు. అరుస్తున్నాడు. తిడుతున్నాడు. ఎవర్ని అడగాలి? ఎవర్ని అడిగి మార్గం నిర్దేశించుకోవాలి? ఈ ముళ్ళ చక్రం అనే ప్రపంచంలో ఇరుక్కోకుండా ఎలా వుండాలి? ఇరుక్కుంటే ఎలా బయట పడాలి?

          రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు. ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచాన్ని మనం దాటేశాం. అదృష్టవశాత్తూ మనం గడిపిన ప్రపంచం వేరు. కానీ మన వెనక వచ్చిన టీనేజర్లకి మనం కాకపోతే ఇంకెవరు చేతనయింది చేస్తారు? 


          చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని  ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. కళా సేవ కాదు, కాసు లొచ్చేదే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ! ఈ వ్యాసం మేసేజీలా వుందేమో, ఇదొక వ్యాసమంతే!



next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రాయడమెలా?
సికిందర్



27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

876 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ సంగతులు


నిన్నటి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ వ్యాసంతో కొంత కదలిక వచ్చినట్టుంది, ఇక నిర్మాతలూ కదిల్తే మేకర్లకి రిలీఫ్. నిర్మాతల్లో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ తో కదలిక వుంది. ఎంత మైక్రో బడ్జెట్ లో వుంటే అంత ముందు కొచ్చే పరిస్థితి. చిక్కల్లా మేకర్లు ఇంకా రోమాంటిక్ కామెడీల మేకింగ్ ఆలోచనలతో వుండడమే. థ్రిల్లర్స్ రాత, తీత వేరే టెక్నిక్స్ ని కోరుకుంటాయని  తెలుసుకోక పోవడమే. ఇదలా వుంచితే, అసలు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీస్ రాయాలంటే ఎన్ని పద్ధతులున్నాయో చూద్దాం. ఈ విషయ సమాచారానికి కేరాఫ్ అడ్రస్ హాలీవు   డ్. సినిమా రాతకి, తీతకి సంబంధించి సాంకేతిక సమాచారమంతా హాలీవుడ్ లో నిక్షిప్తమై వుంది. అక్కడ్నించి అసంఖ్యాక నిపుణులు అందించే సమాచారానికి స్ట్రక్చరే మూలం. స్ట్రక్చరాస్యులు కాని సొంత క్రియేటివ్ స్కూలు మేకర్లకి ఈ సమాచారం  అర్ధంగాక పోవచ్చు. కానీ ఇలా తీసే సినిమాలు ప్రేక్షకులకి అర్ధమవుతాయి, అర్ధవంతంగా వుంటాయి. ఇలా వివిధ ప్రాప్తి స్థానాలనుంచి సేకరించిన ఈ సమాచారమేమిటో ఓసారి పరికిద్దాం...           

           కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో బాటు అమెరికాలో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలలకీ పెద్ద మార్కెట్ వుంది. ఈ మార్కెట్లో ఒకప్పుడు మిల్స్ అండ్ బూన్ టీనేజి చాక్లెట్ ప్రేమ నవలలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ లో రియలిస్టిక్ నవలలు రాజ్యమేలుతున్నాయి. ఇవి రాయడంలో అమెరికన్ రచయితలు, రచయిత్రులు ఆరితేరి పోయారని ‘ది గార్డియన్’  పత్రిక పేర్కొంది. కనుక ఈ జానర్ సినిమాలతో బాటు, నవలలకి కూడా ఏం మెళకువలు ప్రదర్శిస్తున్నారో గమనిద్దాం.

          టీనేజి పాత్రల
ఎదుగుదలచిత్రణలకి స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో నాల్గు పద్ధతులున్నాయి. మూమెంట్ ఇన్ టైం పద్ధతి, లాంగ్ హాల్ పద్ధతి, బిగ్ ఈవెంట్ పద్ధతి, పెట్రి డిష్ పద్ధతి. మూమెంట్ ఇన్ టైం పద్ధతిలో - పాత్ర దినచర్యల్నిఆ పాత్ర భవిష్య ప్రయాణానికి సింబాలిక్ గా చూపిస్తారు. దీన్ని ఒక రోజుకో, అతి కొద్ది రోజులకో పరిమితం చేస్తారు. ‘లేడీ బర్డ్’ (2017) లో టీనేజీ హీరోయిన్ రోజువారీ జీవితంలో ఇమడడానికి చేసే స్ట్రగుల్ లో, అవకాశాల్లేని ఆ చిన్నవూరు దాటేసి ఎదగాలన్న తాపత్రయం సింబాలిక్ గా ప్రతిబింబిస్తుంది.

          లాంగ్ హాల్ - అంటే సాగలాగే పద్ధతిలో – టీనేజి పాత్ర పరిణతి చెందే దిశగా చేసే ప్రయాణాన్ని సాగలాగుతూ, కొన్నేళ్ళ స్పాన్ లో చూపిస్తూ పోతారు. బాల్యం నుంచీ టీనేజీ మీదుగా ఇరవయ్యో పడిలోకి.  ‘లయన్’ (2019) లో ఈ పద్ధతి చూడొచ్చు. బిగ్ ఈవెంట్ పద్ధతిలో – ఒకే ఒక్క పెద్ద సంఘటనతో మార్పు చూపిస్తారు. ఈ సంఘటన తోటి పాత్రల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక్కో పాత్ర ఈ సంఘటన వల్ల ఒక్కో విధంగా మార్పు చెందుతాయి. ‘అమెరికన్ పై’ (1999) అనే కాలేజీ కామెడీలో టీనేజీ పాత్రలు వర్జినిటీ కోల్పోవడానికి పడే పోటీలో కొన్నిటికి ఆ అవకాశం లభిస్తుంది, కొన్నిటికి లభించదు. అయితే అన్ని పాత్రలూ ఈ వర్జినిటీ  కోల్పోవడమనే బిగ్ ఈవెంట్ నుంచి ఏదోవొకటి నేర్చుకుంటాయి.  పెట్రి డిష్ పద్ధతి - పెట్రి డిష్ అంటే బాక్టీరియాల్ని పెంచడానికి శాస్త్రవేత్తలు వాడే వెడల్పాటి గాజు పాత్ర. ఈ పెట్రి డిష్ లాంటి సిట్యుయేషన్ లోకి టీనేజి పాత్రల్నిఇరికిస్తారన్న మాట. ఇరికించి పెంచి పోషిస్తారు. హాలీవుడ్ హై స్కూల్ సినిమాల్లో ఈ ప్లే కన్పిస్తుంది. ఒక సృష్టించుకున్న విషమ పరిస్థితిలో పాత్రలు అనుకోకుండా ఒకదానికొకటి తగుల్కొని, పీక్కోలేక అందులోనే పడి ఎదగడం నేర్చుకుంటాయి.

మర్యాద జానర్ మర్యాద!

        ఈ నాల్గు పద్ధతుల్నీ ఏ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కథలకైనా వాడొచ్చు. ఈ నాల్గు పద్ధతుల్లోనే కమర్షియాలిటీ వుంటుంది. కాదని సొంతంగా పద్ధతి కాని పద్ధతికి పోతే కమర్షియాలిటీ కాకుండా పరిపూర్ణ క్షవరం వుంటుంది షాంపూతో.
 
          ఈ నాల్గు నమూనాలకీ స్ట్రక్చర్ ఒకటే. కమర్షియాలిటీకి వున్నదొకే వొక్క స్ట్రక్చర్ – త్రీయా క్ట్ స్ట్రక్చర్. పౌరాణికాల నుంచీ పాప్ కార్న్ సినిమాల వరకూ నాల్గు డబ్బులు రావడానికిదే స్ట్రక్చర్. బిగినింగ్, మిడిల్ ఎండ్- వీటిలో వీటికి సంబంధించిన నిర్ణీత కార్యకలాపాలు. ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లేలు రాస్తూంటే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు,  సెకండాఫ్ సిండ్రోములు వగైరా అనేక బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు చొరబడే అవకాశమే వుండదు. త్రీయా క్ట్ స్ట్రక్చర్ డీఫాల్ట్ గా అలా వుంటుంది ఫైర్ వాల్ తో. బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు క్రియేటివ్ స్కూలిష్టులే చేస్తూంటారు. ఒకవేళ తెలుగులో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రావడమంటూ జరిగితే తెలుగుకి అది తొలకరి. దీన్ని కూడా  క్రియేటివ్ ఎలిమెంటరీ స్కూలు గానుగ మరాడించి దుంప నాశనం పట్టించకుండా వుంటే బావుంటుంది. క్రియేటివ్ వీధి బడితో ఇప్పటికే  వున్న అన్ని జానర్లూ కలిసి 90 శాతం అట్టర్ ఫ్లాపులతో కిటకిట లాడుతున్నాయి. 90% హౌస్ ఫుల్!


 స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల  

         ఇక్కడొకటి గమనిద్దాం. ఎదుగుదల, స్వేచ్ఛ టీనేజీ సమస్యలు. టీనేజర్ ఎదుగుదల దృక్పథంతో వుంటే స్వేచ్ఛ వుండదు గానీ ఎదుగుదల ‘లాంగ్ హాల్’ గా నిరంతరం వుంటుంది. స్వేచ్ఛా దృక్పథముంటే ఎదుగుదల వుంటుంది గానీ ‘పెట్రి డిష్’ గా వుంటుంది. అంటే ఎదుగుదలని కోరుకుంటే స్వేచ్ఛ ని వదులుకోవాలి. ఇది పాజిటివిజం. స్వేచ్ఛని కోరుకుంటే ఎదుగుదలని కోల్పోవాలి. ఇది నెగెటివిజం. 

          వీటికి రెండు ఉదాహరణలు చూద్దాం : సత్యజిత్ రే తీసిన ‘అపరాజితో’ (1956) లో, అతను చిన్నప్పుడు గ్రామంలోనే చదువుకుంటాడు. తల్లితోనే వుంటాడు. స్కూలు చదువయ్యాక కాలేజీలో చేరడానికి నగరం వెళ్ళాలనుకుంటాడు. అప్పుడొస్తుంది సమస్య. అతణ్ణి విడిచి తల్లి వుండలేదు. తల్లిని విడిచి అతను నగరం వెళ్ళలేడు. కొడుకు అభివృద్ధిని తల్లి కోరుకునేదే గానీ దూరంగా వుంటే భరించలేదు. ఈ ద్వైదీ భావాన్ని దిద్దుకునేంత మనసు లేదు. చివరికెలాగో నగరం వెళ్తాడుగానీ, మనసంతా తల్లి మీదే వుండి స్ట్రగుల్ చేస్తాడు. తనవల్ల ఆమెకి కలిగిన లోటుని ఉన్నత చదువుతో తీర్చాలనే పట్టుదలతో వుంటాడు. కానీ అప్పటికామె సజీవంగా వుండదు.


          అంటే అతను కోరుకుంటే చదువు మానేసి వూళ్ళో తల్లితోనే వుంటూ, బాధ్యతల్లేకుండా స్వేచ్ఛగా  బ్రతకవచ్చు. ఆ స్వేచ్ఛ వదులుకున్నాడు ఎదగాలనుకుని. ఈ ఎదుగుదల బాధాకరంగా వున్నా వదులుకోలేదు. ఇది ‘లాంగ్ హాల్’ ఎదుగుదల. 


          నాగభూషణం నటించిన ‘నాటకాల రాయుడు’ (1969) టీనేజీ మూవీ కాకపోయినా స్వేచ్ఛ కోసం ఎదుగుదలని వదులుకునే పాత్రగా నాగభూషణం పాత్ర వుంటుంది. నాటకాల పిచ్చితో తన స్వేచ్ఛ తను కోరుకుని ఇంట్లోంచి పారిపోతాడు. తల్లిదండ్రులు, చెల్లెలూ నానా కష్టాలు పడతారు. నగరంలో మహానటుడుగా ఎదిగి ఫుల్ రేంజిలో ఎంజాయ్ చేస్తూంటాడు. ఇటు వూళ్ళో కుటుంబం పేదరికంతో నానాటికీ దిగజారుతూవుంటుంది. ఆఖరికి తల్లి మరణించిన విషయం కూడా అతడికి తెలీదు. అంటే తప్పు చివర్లో ఒక విషమ పరిస్థితిలో తెలుసుకుని మారడం. ఇది పెట్రి డిష్ ఎదుగుదల. 


          ఎదుగుదల అనే ఒకే ట్రాకులో వున్న పాత్రలు ఏ మాత్రమైనా స్వేచ్ఛ కోరుకోవా - అంటే, విసిగినప్పుడు కోరుకోవచ్చు. అపాత్ర దానాలతో  ఈ ఎదుగుదల, మెచ్యూరిటీ అవసరంలేదనుకున్నప్పుడు ప్లేటు ఫిరాయించ వచ్చు. ‘అంతులేని కథ’ (1976) లో జయప్రద పాత్ర ఇలాటిదే. పాజిటివ్ పాత్ర నెగెటివ్ గా మారడం. 


బ్లూ లాగూన్ భాష్యం

         ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచంలో టీనేజి పాత్రలు ఎదగడానికి స్ట్రగుల్ చేయవచ్చు, స్వేచ్ఛకి పోయి దెబ్బ తిననూ వచ్చు. ‘సిక్స్ టీన్’ (2013) అనే హిందీ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీలో, ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయి నైతిక విలువలవైపు వుంటే, ఇంకో అమ్మాయి స్వేచ్ఛగా, విశృంఖలంగా  తిరిగే ధైర్యాన్ని కల్పించుకుంటుంది. ఒకబ్బాయి వీడియోలతో అమ్మాయిల్ని బెదిరిస్తూ చెడ్డగా వుంటే, ఇంకో అబ్బాయి పోర్న్ చూస్తూ తండ్రికి దొరికిపోయి, ఆ ఘర్షణలో ప్రమాదవశాత్తూ తండ్రిని చంపేసి, పోలీసులు పట్టుకోబోతే పారిపోయి, టీనేజి క్రిమినల్ గ్యాంగ్ లో చేరిపోతాడు. చివరికి తప్పు తెలుసుకుని ఈ మూడు నెగెటివ్ పాత్రలూ మారతాయి. వందలకొద్దీ టీవీ ఛానెల్స్, పత్రికల్లో పేజ్ త్రీ లో సెలెబ్రిటీల పోకడలూ, ఇంటర్నెట్ మొదలైనవి టీనేజర్లని ఎలా వయోలెంట్ గా ప్రభావితం చేస్తున్నాయో ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ చూపిస్తుంది. 

          ఈ నాణేనికి ఇంకో వైపు చూస్తే, ‘ది బ్లూ లాగూన్’ కన్పిస్తుంది. 1908 లో రాసిన నవల ఆధారంగా హాలీవుడ్ తీసిన ‘ది బ్లూ లాగూన్’ (1980) లో, ఓడ ధ్వంసమై ఒక చిన్నమ్మాయి, చిన్నబ్బాయి దీవిలో చిక్కుకుంటారు. ఆ దీవిలో పెద్దవాళ్ళే కాదు, మానవ మాత్రులూ లేక ఏం చేయాలో తెలీక స్ట్రగుల్ చేస్తూ చనువుగా, అల్లరిగా జీవించడం నేర్చుకుంటారు. కొన్నేళ్ళు పోయాక శరీరాల్లో వస్తున్న మార్పులు చూసుకుని దూరం దూరంగా వెళ్లిపోతూంటారు. ఇంకో శరీరంగా తమ బాల్యం మారడాన్ని అర్ధం జేసుకోలేకపోతారు. సిగ్గు పడాల్సిన విషయంగా తలదించుకుంటారు. సారాంశ మేమిటంటే, వయసురాగానే మన సినిమాల్లో లాగా హైస్కూలు పిల్లలు ఎగిరి లాంగ్ జంప్ చేసి లవ్ లో పడరు. కొత్తగా మారుతున్న ఈ శరీరాలేమిటో, స్వప్న స్ఖలనాలేమిటో, ఋతు క్రమాలేమిటో, మొటిమెలేమిటో, ఇంకేమిటేమిటో మేనేజి చేసుకోవడానికే బిడియంతో తప్పించుకుని తప్పించుకుని నానా తిప్పలూ పడతారు. శరీరం అర్ధం గాకుండా ఆకర్షణలు మొదలుకావు. ఇవన్నీ మనమూ అనుభవించలేదా? జబర్దస్త్ గా అనుభవించాం. అయినా సినిమాలకి టీనేజీ నిజాలు దాచి తియ్య తియ్యటి ప్రేమ పూతలతో  అడ్డంగా మోసం చేస్తేనే తృప్తి. దీనికి విరుద్ధంగా సహజ కథా కథనాలు - ఎదుగుదల- కమింగ్ ఆఫ్ ఏజ్ -  ‘ది బ్లూ లాగూన్’ లో వుంటాయి. 


          ఇక్కడేమైందంటే, వీళ్ళు సిగ్గుతో చిన్నప్పటి స్వేచ్ఛని  కోల్పోయారు. యౌవనం ఒక బందీకానాలా మారింది. వికసించిన అంగాలతో ఏం చేసుకోవాలో కూడా తెలీని అయోమయంలో పడ్డారు. ఇలా ప్రకృతి తప్ప ఇంకో మనిషీ, ఆధునిక సంపత్తీ లేని దీవిలో వాళ్ళిద్దరూ శారీరక, మానసిక సంచలనాలని తమకి తామే ఎలా అవగాహన చేసుకుని జయించారనేదే ఈ కథ. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కి ఇది శాస్త్రీయ భాష్యం. 


          ఎదుగుదల నిరంతర ప్రక్రియ, స్వేచ్ఛ పరిమిత వ్యాపకం. ఈ వ్యాసం రాయకుండా స్వేచ్ఛగా బలాదూరు తిరగ వచ్చు, ఎన్నాళ్ళు తిరుగుతాం? తిరగడం ఆపి రాయాల్సిందే. ఏమైనా కాస్త  ఎదుగుతామేమో రాసి తెలుసుకోవాల్సిందే. స్వేచ్ఛ సెల్ఫీ తీసుకుంటూ సింగిల్ టీ లాగించడం, ఎదుగుదల అంతా బాగానే వుందని పిండి రుబ్బడం. 


మైండ్ సెట్ స్టడీ

         రాజ్ కపూర్ తీసిన మేరానాం జోకర్ (1970) లో, రాజ్ కపూర్ 14 ఏళ్ల టీనేజీ పాత్రగా రిషీ కపూర్ నటించాడు. ఇతను టీచర్ (సిమీ గరేవాల్) పట్ల ఎట్రాక్ట్ అవుతాడు. ఆమె నుంచి స్త్రీల ఆంతరంగిక లోకం గురించి, కోర్కెల గురించీ తెలుసుకుంటాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఏమిటో అర్ధంగాని బాధకి లోనవుతాడు. ఈ అనుభవమే వ్యక్తిగా (రాజ్ కపూర్) ఎదిగాక జీవితాన్ని మార్చేస్తుంది. తను బాధల్ని దాచుకుని, లోకానికి నవ్వుల్ని పంచడానికే ఈ లోకంలోకి వచ్చాడని. ఏదైతే ఆమెతో స్వేచ్ఛగా ఎంజాయ్ చేశాననుకున్నాడో అది తాత్కాలికమే. స్వేచ్ఛ బాధకి కూడా లోనుచేయవచ్చు. కానీ స్వేచ్ఛ కి లేని గమ్యం -దిశా దిక్కూ-  ఎదగడంలో వున్నాయి. 

           వార్నర్ బ్రదర్స్ తీసిన ‘ది వాండరర్స్’ (1979)  కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. కాకపోతే టీనేజీ యాక్షన్ జానర్లో కల్ట్ మూవీగా నిలబడింది. ఇది టీనేజర్స్ గ్యాంగ్ కథ. ఇదే పేరుతో  వచ్చిన నవల దీని కాధారం. సినిమా కంటే ఈ నవలని బాగా ఎంజాయ్ చేయవచ్చు. టీనేజర్ల పాత్రచిత్రణలు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే పనులు మతిపోయేలా వుంటాయి. ఇదికూడా స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల గురించే. రిచర్డ్ ప్రైస్ రాసిన ఈ నవల మీద చాలా స్టడీస్ జరిగాయి. వయోలెంట్ ప్రపంచంలో టీనేజర్ల మైండ్ సెట్ ఎలా వుంటుందో స్టడీ చేసుకోవడానికి ఈ నవల పనికొస్తుంది. ఇంకా వీలైనన్ని హాలీవుడ్ లేదా కొరియన్ కమింగ్ ఆఫ్ మూవీస్ కొత్తవీ పాతవీ చూస్తూంటే వాటి మేకింగ్ తెలుస్తుంది. కొరియన్ ఎందుకంటే హాలీవుడ్ లాగే కొరియన్ మూవీస్ స్ట్రక్చర్ లో వుండి కమర్షియల్ గా వుంటాయి. వరల్డ్ మూవీస్ జోలికి పోవద్దు.  

next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్ట్రక్చర్ విభాగాల సంగతులు
సికిందర్


18, డిసెంబర్ 2019, బుధవారం

900 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


        మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులకి సంబంధించి స్ట్రక్చర్ వ్యాసం సాంప్రదాయ దృశ్యం’ తర్వాత ఇప్పుడు ‘ఆధునిక దృశ్యం’ ఎలా వుంటుందో చూద్దాం. సాంప్రదాయ కథలు, ఆధునిక కథలు ... సాంప్రదాయ కథలు ఓల్డ్ స్కూల్ డ్రామాలుగా వుండొచ్చు గానీ, ఆధునిక కథలు రియలిస్టిక్ కథలుగా వుంటేనే యూత్ కి కనెక్ట్ అయ్యేది. సినిమా మార్కెట్ ప్రధానంగా యూత్ దే. ఈ యూత్ కాలేజీ, ఆ పైన జాబ్ మార్కెట్లోకి ప్రవేశించిన ఏజి గ్రూప్ యూతే తప్ప; హైస్కూల్, అంతకి తక్కువ టీన్ - ప్రీటీన్ పిల్లకాయలు కాదు. మేమిలాటి పిల్లకాయలుగా వున్నప్పుడే పైసలెత్తుకు పోయి శుభ్రంగా సినిమాలు చూసేసే వాళ్ళం - తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అప్పుడప్పుడు అరవ సినిమాలూ వదిలిపెట్టకుండా. వారానికో రోజు స్కూలు పిల్లలకోసం కన్సెషన్ షోలు వేస్తే థియేటర్ నిండా పిల్లలే. అవి పిల్లల సినిమాలు కూడా కావు, ప్రదర్శించే రెగ్యులర్ సినిమాలే వారానికో రోజు స్కూలు పిల్లలకి. అలా అన్ని జానర్ల సినిమాలూ పిల్లకాయలప్పుడే అలవాటయ్యాయి. ఏ జానరూ కాని అజానరీయ అమర్యాదకర లపాకీ సినిమా లొచ్చినా అవీ అడ్డంగా ఆరగించడమే. అంత విశేష ‘జ్ఞాన సంపద’ సొంతమన్నమాట. సినిమాలు చూసి అట్ట ముక్కల కిరీటాలు పెట్టుకుని, కర్రల్ని కత్తులుగా చేసుకుని, గడ్డి మేటుల్లో ఫైటింగు దృశ్యాలు కూడా రక్తి కట్టించే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే బజార్లలో ఫిలిం ముక్కలు అమ్మేవాళ్ళు. అట్ట పెట్టెలకి రంధ్రం చేసి, అందులో బల్బు పెట్టి, ఎదురుగా భూతద్దం పెట్టి, ఫిలిం ముక్కల్ని గోడల మీద ‘సినిమాలు’ గా బ్రైట్ గా ఫోకస్ చేసే టెక్నాలజీని కూడా వాడేశాం. ఎనిమిదో తరగతప్పుడే యాక్షన్ తో కూడిన ఏవో పిచ్చి పిచ్చి నాటకాలు రాయడం, బొమ్మల కథలు వేయడం వగైరా కార్యకలాపాలు అదనంగా నిర్వహించాం. ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో, అంత సాహిత్యమూ చదివే వాళ్ళం. ఈ పరిస్థితి మారింది. థియేటర్ల బుకింగ్స్ దగ్గర పిల్లలు కన్పించడం లేదు. పట్టణాల్లో, పల్లెటూళ్ళల్లో కూడా. వాళ్ళు వస్తే గిస్తే ఎప్పుడో పేరెంట్స్ తో తప్ప రావడం లేదు.  

       
కాబట్టి ఒకప్పటి లాగా ఏది పడితే అది, ఎలా బడితే అలా తీసి చూపించేందుకు ప్రేక్షక లోకంలో మాలాగా అమాయక - వెర్రి మాలోకం బాలలోకం లేదిప్పుడు. కాలేజీ ఈడు నుంచే ప్రేక్షక వర్గం ప్రారంభమవుతోంది. ఈ వయసుకి కాలీన స్పృహ వుంటుంది. గ్లోబల్ గా చూస్తున్న ఆధునికత, వాస్తవికత, వర్తమాన స్పృహలతో ఒక యూత్ అప్పీల్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ వయసు నుంచీ ఇలా ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన కాలేజీ - జాబ్ మార్కెట్ యూత్ వరకే రెగ్యులర్ ప్రేక్షక లోకంగా లెక్కేసుకోవాలి. మళ్ళీ ఈ యువ ప్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులు సినిమాలకి రాని పరిస్థితి కూడా వుంది. ఎప్పుడో ఎంతో టాక్ వస్తే తప్ప చిన్న హీరోల సినిమాలకి యువతులు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలూ కట్, యువతులూ కట్. మిగిలింది కొత్త మీసాల మస్తీ యూతే. పెద్ద స్టార్ సినిమాలకి ఎలాగూ కుటుంబాలు సహా అందరూ తరలి వస్తారు. ఒకవేళ యువ ప్రేక్షకుల్లో యువతుల్నీ లెక్కేసుకున్నా ‘వెంకీ మామ’ లాంటి దాన్లో వెంకటేష్, నాగ చైత్యనలని యూత్ అప్పీల్ లేని ఓల్డ్ స్కూల్ డ్రామాతో చూపించలేరు. రియలిస్టిక్ గా రావాల్సిందే. పెద్ద హీరోల మూస సినిమాలకి టీఆర్పీరాక, యాడ్స్ కూడా తగ్గిపోతున్నాయని, అందుకని ఇకపైన భారీ మొత్తాలు వెచ్చించి వీటి శాటిలైట్ హక్కులు కొనేది లేదని చెప్పే స్థితికి ఛానెల్స్ కూడా వచ్చేశాయి. ఇక ప్రేమ సినిమాలే తీసినప్పుడు అవెంత యూత్ అప్పీల్ తో రియలిస్టిక్ గా వుండాలి? వర్తమాన కాలం ప్రతిబింబిస్తేనే యూత్ అప్పీల్. ఇక ఆధునిక ‘కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ తీస్తే ఇంకెంత రియలిస్టిక్ గా, వర్తమాన యూత్ జీవితం ప్రతిబింబిస్తూ వుండాలి?

విశాలి కథ
        కనుక కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఆధునిక దృశ్యం చూసినప్పుడు, ఇది కూడా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే వుంటుంది. కాకపోతే విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించి వుంటుంది. రిపీట్ - విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించే  వుంటుంది. మూస లవ్వు స్టోరీ తీసి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే నవ్విపోతారు. ఆధునిక కమింగ్ ఆఫ్ ఏజ్ కి ఉదాహరణ -  విశాలి అనే టీనేజర్ వుందనుకుందాం, ఆమెకి పద్నాల్గేళ్ళు. స్కూల్లో పదో తరగతి చదువుకుంటోంది. చదువు తప్ప ఆమెకేమీ తెలీదు. ఆమె పుట్టిన రోజుకి పేరెంట్స్ ఒక లాప్ టాప్ కొనిచ్చారు. అప్పుడామె చాలా తెలుసుకోవడం మొదలెట్టింది. ఇక ఏదో స్వతంత్రం, ఏదో వ్యక్తిత్వం తనకొచ్చేసినట్టూ, తను ఎదిగిపోయినట్టూ ఫీలింగ్ వచ్చేసింది. అలా ఆన్ లైన్లో ఆమెకి విద్యుత్ పరిచయమయ్యాడు. వెంటనే కనెక్ట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యమేసింది. తానింతవరకూ అబ్బాయిలవైపు చూడాలంటేనే, వాళ్లతో మాట్లాడాలంటేనే బిడియపడి దూరంగా వుండేది. అబ్బాయిలెవరూ తనకి స్నేహితులుగా లేరు. అలాటిది ఆన్ లైన్లో ఇంత చొరవ వచ్చేసింది. 


        విద్యుత్ తనకి పదహారేళ్ళని చాటింగ్ లో చెప్పాడు. విశాలికి ఉత్సాహమొచ్చింది. తోచిన కబుర్లాడింది. క్రమంగా చాటింగ్ నుంచి నేరుగా మొబైల్ మెసేజిలకి కమ్యూనికేషన్ మారింది. అప్పుడతను తనకి ఇరవై ఏళ్లని చెప్పాడు. ఏం ఫర్వాలేదనుకుంది. మళ్ళీ పాతికేళ్ళని మెసేజి కొట్టాడు. నో ప్రాబ్లమనుకుంది. ఒకబ్బాయితో ఇలా కమ్యూనికేట్ అవడమే గొప్పనుకుంది. అంతేకాదు, తనలో ఇంకేదో ఫీలింగ్స్ మొదలవడం గమనించింది. ఆ ఫీలింగ్స్ ప్రేమనుకుంది. 

        అలా రెండు నెలలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తో గడిపాక, కలుద్దామన్నాడు. మాల్ లో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. విశాలి మాల్ కెళ్ళి అతడితో ముఖాముఖీ భేటీ కోసం వెయిట్ చేస్తోంది. అతనొచ్చాడు. చూసి షాకైంది. ముప్పై ఏళ్ళు పైనే వుంటాడు. అఫెండ్ అయింది. అతను అద్భుతంగా మాటాడి ఆమెని ఆకట్టుకుని హోటల్ గదికి తీసికెళ్ళాడు. ఆమె కోసం కొనితెచ్చిన డ్రెస్సూ, లోదుస్తులూ ఆమెకి తొడిగిస్తూ ఫోటోలు తీశాడు. ఆమెని కిస్ చేయబోతూంటే ఆగమంది. ఆగకుండా ఆమెని బెడ్ మీదికి లాగి  మీద పడ్డాడు...(ప్లాట్ పాయింట్ వన్)


       ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ విశాలికి ఆ వయసులో అపరిచితుడితో రిలేషన్ షిప్ అనే తొందరపాటు నిర్ణయం తీసుకున్న అప్రియ వాతావరణం, 2. పాత్రల పరిచయం : స్కూల్లో చదువుతున్న విశాలితో బాటు, మధ్య తరగతికి చెందిన ఆమె తల్లిదండ్రులు, విద్యుత్ అనే ఇంకా వివరాలు తెలీని ఆగంతకుడులతో, ఈ బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అవసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : అంతవరకూ అబ్బాయిలంటే బెరుకు వున్న విశాలికి, పేరెంట్స్ లాప్ టాప్ కొనివ్వడంతో అపరిచితుడితో ఉత్సాహపడి ప్రేమలో పడ్డం, అతను తడవకో వయసు చెబుతూ మభ్యపెడుతున్నా ఆంతర్యం గ్రహించక పోవడం, ఆన్ లైన్ వల్ల తానెంతో స్వతంత్రంగా ఎదిగిపోయినట్టు భావించుకుని, తల్లిదండ్రులనుంచి ప్రైవసీని మెయింటెయిన్ చేయడం, అతను కలుద్దామంటే గుడ్డిగా వెళ్లి కలుసుకోవడం, తన కంటే చాలా పెద్దవాడైన అతణ్ణి చూసి షాకవడం, అతడి తియ్యటి మాటలకి పడిపోయి హోటల్ కెళ్ళి పోవడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : అతడి మీద ప్రేమ పెరిగిపోయి హోటల్ గది కెళ్ళి పోయిన ఆమె, తన దుస్తులు మారుస్తున్నా, తనని ఫోటోలు తీస్తున్నా, అప్రమత్తం కాక అతడి కుట్రకి బలై పోవడం. 

         
కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ లక్షణాల ప్రకారం, ఇందులో విశాలి పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల ఆమె అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ఈ బిగినింగ్ విభాగంలో జరగాలి. జానర్ మర్యాదలననుసారం పాత్ర మానసికంగా అస్తిరత్వం లోంచి స్థిరత్వం లోకి చేసే టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి అవసరాలు పెరిగిపోయాయని భావించుకోవడం వల్ల. ఇదంతా విశాలి పాత్ర పరిచయంలో జరిగాయి. 

        ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. ఇంటర్వూలో వంకర సమాధానాలు చెప్తే లేచెళ్లి పొమ్మంటాడు ఆఫీసర్. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ గా ఏదైనా ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. 

        కనుక విశాలితో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన పై చట్రంలో జరగాలి. జరిగింది కూడా. తను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. లోపల ప్రేమ అనుకుంటోంది, బయట కుట్ర జరుగుతోంది. ఒక్కో అడుగూ కుట్ర కేసే వేస్తోంది. మొదటి సారిగా అతణ్ణి చూసినప్పుడు, అతడి అసలు వయసు ముప్పై అని తెలిసినప్పుడు, భౌతిక ప్రపంచం అర్ధమై, ఆ భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది వయోభేదం రూపంలో. అస్థిర మనస్తత్వ పరిణామం. ఉత్తుత్తి జీవిత లక్ష్యపు  ప్రమాదం. ఆ వయసులో ఆమెది ప్రేమే అయితే ఇలా చెయ్యదు. ఆ వయసులో వుండేది ఆకర్షణే కాబట్టి ఇలా చేసేసుకుంటూ వెళ్లి పోయింది. ఆకర్షణని ప్రేమనుకుంది. భౌతిక ప్రపంచం తిరస్కరించినా ఆ ఆకర్షణ వికర్షణగా మారకుండా అపరిపక్వ ప్రేమే అడ్డుపడింది. అందుకని అతడి వల్లో పూర్తిగా పడిపోయింది. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కిచ్చి,  కన్యాత్వాన్ని పోగొట్టుకోవడంతో సమస్య ఏర్పాటయింది ప్లాట్ పాయింట్ వన్ లో. 

           ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక, తర్వాత వచ్చే టూల్ ‘గోల్’ ఏర్పాటు గురించి. ఇప్పుడు విశాలి గోల్ ఏమిటి? ఇది మానభంగం అనుకునే వయసు కాదు, అతడి ప్రేమే అనుకునే వయసు. అందుకని ఈ ‘ప్రేమ’ ని కొనసాగించడమే ఆమె గోల్. 

        ఎప్పుడైనా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో పాత్ర గోల్ మూర్ఖంగానే వుంటుంది. ఆ వయసులో జీవితమంటే ఏమిటో తెలీదు కాబట్టి. ఇలాటి సాంప్రదాయ కథలో కూడా హీరో గోల్ మూర్ఖంగానే వున్నట్టు గత వ్యాసంలో గమనించాం. పొరపాటున కూడా పాజిటివ్ గోల్ ఇవ్వకూడదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకి అపరిపక్వ పాత్ర ప్రయాణం కాబట్టి.

        మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : విశాలి కోరిక ఇక పెళ్లి చేసుకుంటాడనే కావొచ్చు. 2. పణం : కన్యాత్వాన్ని పణంగా పెట్టేసింది, అది రమ్మన్నా తిరిగిరాదు, ఎట్టి పరిస్థితిలో అతడితో పెళ్లి జరగాల్సిందే. 3. పరిణామాల హెచ్చరిక : ప్రెగ్నెన్సీ ప్రమాదం పొంచి వుంది. 4. ఎమోషన్ : ఒకవైపు కన్యాత్వాన్ని పోగొట్టుకుని, ఇంకోవైపు పెళ్లవుతుందో లేదోనన్న సందిగ్ధావస్థ. దీన్నెలా హేండిల్ చేస్తుందో తెలీదు. పైగా పద్నాల్గేళ్ళకే పెళ్ళేమిటి? రెండింతల పైగా వయసున్న వాడితో? 

        ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ నీ  సెట్ చేసుకున్నాక ముందు మిడిల్ కథేమిటో చూద్దాం...

సికిందర్

29, అక్టోబర్ 2020, గురువారం

991 : హాలీవుడ్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు ఈ రోజు సాయంత్రం



...(మల్టీ టాస్కింగ్ మెడకి చుట్టుకుని బ్లాగు రెగ్యులారిటీ మీది కొచ్చింది...)


 రచన : దర్శకత్వం : జూ క్విర్క్ 
తారాగణం: సిడ్నీ స్వీనీ, మెడిసన్ ఐజ్మన్, జాక్స్ కొలిమన్, ఇవాన్ షా, జూలీ బెంజ్, బ్రాండన్ కీనర్ తదితరులు 
సంగీతం : గజెల్ ట్విన్, ఛాయాగ్రహణం : కార్మన్ కబనా, కూర్పు : ఆండ్రూ డెజెక్ 
బ్యానర్ : బ్లమ్ హౌస్ టెలివిజన్ 
విడుదల: అమెజాన్ స్టూడియో 
నిడివి : 90 నిమిషాలు
***

      మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ జానర్ హాలీవుడ్ లో పెద్ద మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ మార్కెట్. ఏడాదికి యాభై వరకూ విడుదలవుతాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 26 విడుదలయ్యాయి. వీటిలో రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు, హార్రర్ లు, సైన్స్ ఫిక్షన్లు, హై స్కూల్ రోమాన్సులు, హై స్కూలు హార్రర్లు ఇలా అన్నిరకాల సబ్ జానర్లు వున్నాయి. 13 నుంచి 19 ఏళ్ల మధ్య టీనేజీ పాత్రల మూవీస్ ని కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అంటారు. దీని గురించి సవివరమైన ఆర్టికల్స్ ఇటీవల బ్లాగులో ఇచ్చాం. ఇక్కడ క్లిక్ చేయండి. దురదృష్టవశాత్తూ తెలుగు సినిమాలు ఈ జానర్ని గుర్తించి సొమ్ము చేసుకోవడం లేదు. అవే పాతికేళ్ళ వయసు పాత్రల డ్రై మార్కెట్ రోమాంటిక్ కామెడీలు, డ్రామాలు మాత్రమే పదేపదే తీస్తున్నారు. వీటిని కాస్త వాస్తవ జీవితాల్లోకొచ్చి, నేటి కెరియర్ ప్రభావిత రిలేషన్ షిప్స్ లో యువతీ యువకులెదుర్కొంటున్న వివిధ సమస్యల మీదనో, వికట ప్రేమల మీదనో ఫోకస్ పెట్టి రియలిస్టిక్ మూవీస్ తీసినా ఓ అర్ధం పర్ధం, బిజినెస్ మార్కెట్టు. 

    మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఏ సబ్ జానరైనా ప్రేమల గురించి కాదు, నేర్చుకోవడం గురించి. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం పాయింటు చుట్టూ వుంటాయి. దురదృష్టమేమిటంటే, తెలుగులో ఈ ఏజి గ్రూపు టీనేజర్లు తమ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలకి కనెక్ట్ కాలేక, తమకోసం సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు. ఇంకా మేకర్ల వాళ్ళ అమ్మా నాన్నల కాలం నాటి పురాతన సినిమాలే!

    హాలీవుడ్ కమింగ్ ఆఫ్ ఏజీ మూవీలు తమ ఈ టీన్ క్లయంట్స్ సముదాయాన్ని  గౌరవిస్తున్నాయి. ఏటా యాభయ్యేసి సినిమాలతో వాళ్ళ ఆర్తిని తీరుస్తున్నాయి. ఈ కోవలో తాజా విడుదల నాక్టర్న్ సాఫ్ట్ సైకో హార్రర్ రూపాన్ని సంతరించుకుంది. పువ్వుపుట్టగానే వికసించిన రెండు నైపుణ్యాల కథ. అనుకున్నది సాధించడానికి ఎంత దాకా పోతావ్? పోయే దమ్ముందా? లేక రాజీపడి టాలెంట్ ని చంపుకుంటావా? పోయే దమ్మున్నా అది పోగాలపు దమ్ము కాకుండా చూసుకోగలవా? ఇదీ ఈ కవల టీనేజీ సోదరీమణులతో కొత్త దర్శకురాలి పాయింటు.

కథ 

    జూలియెట్ (జూల్స్- సిడ్నీ స్వీనీ), వివియన్ (వివి- మెడిసన్ ఐజ్మన్) లిద్దరూ టీనేజీ కవలలు. వివి రెండు నిమిషాలు పుట్టింది. కేసీ (జూలీ బెంజ్), డేవిడ్ (బ్రాండన్ కీనర్) లు తల్లిదండ్రులు. చిన్నప్పట్నుంచీ జూల్స్, వివిలు క్లాసికల్ పియానో సంగీతానికి జీవితాన్నితాకట్టు పెట్టేశారు. జూల్స్ కంటే వివికి టాలెంట్ ఎక్కువ. టీనేజర్లుగా మ్యూజిక్ అకాడెమీలో చేరతారు. జూలీకి సిగ్గెక్కువ, తడబడుతూ వుంటుంది. వివికి తెగువ ఎక్కువ. దూసుకుపోతుంది. టాలెంట్ ఒక్కటే చాలదని ప్రపంచ పోకడ అర్ధం జేసుకుని, అప్పుడే అకాడెమీలో బాయ్ ఫ్రెండ్ గా మాక్స్ (జాక్స్ కొలిమన్) ని పట్టేస్తుంది. తను ఉన్నత స్థాయి జులియర్డ్స్ లో పాల్గొనే అవకాశం పొందడానికి మ్యూజిక్ టీచర్ డాక్టర్ హెన్రీ కస్క్ (ఇవాన్ షా) ని లైంగికంగా లొంగ దీసుకుంటుంది. తాగుతుంది, పార్టీలు చేసుకుంటుంది. 

    ఇవేవీ చేయలేని జూల్స్ కుములుతూంటుంది. తన మ్యూజిక్ టీచర్ రోజర్ (జాన్ రోథ్మన్) చెప్పే నిదానమే ప్రధానం మాటలు నచ్చవు. వివి మీద ఈర్ష్యపుట్టి ఎలాగైనా ఆమెని బీట్ చేయాలనుకుని అహర్నిశలూ పియానో పాఠాల మీద వుంటుంది. ఇంతలో జులియర్డ్స్ లో పాల్గొనేందుకు వివి ఎంపికై పోతుంది. దీంతో జూల్స్ కి మతిపోతుంది. 

    వీళ్ళు అకాడెమీలో చేరే  ఆరు వారాల ముందు మోయిరా అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె రాసిన నోట్ బుక్ జూల్స్ కి దొరుకుతుంది. అందులో మోయిరా గీసిన భయానక రేఖా చిత్రాలు, అర్ధం గాని భాషా వుంటాయి. జూల్స్ కిది థియరీ బుక్ లా కన్పిస్తుంది. దీంతో తిరుగుండదనుకుంటుంది. దాన్ని అనుసరిస్తూ పియానో ప్రాక్టీసు చేస్తూ, తననేదో ఆవహించినట్టు ట్రాన్స్ లోకెళ్లి పోతూంటుంది...

     ఏమిటీ ఈ నోట్ బుక్? వివి మీద పైచేయి కిది తోడ్పడిందా? దీంతో ఎదురైన  విపరిణామాలేమిటి? జూల్స్  ఏ జీవిత పాఠం నేర్చుకుంది? దాని ఫలితంగా చివరికి ఏం పొందింది? ఇదీ మిగతా కథ...

సిడ్నీ స్వీనీ సీన్ 

    ఇది పూర్తిగా జూల్స్ పాత్ర కథ. పాత్ర ఎజెండానే డ్రైవ్ చేసే పాత్ర ప్రయాణం. ఆమె దృక్కోణంలో మనం చూస్తూంటాం. ఈ పాత్ర నటించిన సిడ్నీ స్వీనీ లేని సీనంటూ లేదు. 23 ఏళ్లకే పన్నెండు సినిమాలు నటించింది. తన పాత్రలకి బయోగ్రఫీలు తయారు చేయించుకుంటుంది. పాత్ర శిశువుగా పుట్టినప్పట్నుంచీ స్క్రిప్టులో మొదటి పేజీ కొచ్చేవరకూ ఆఫ్ స్క్రీన్ జీవితాన్ని రాయించుకుని, ఆ మూలాల్నుంచీ పాత్రని పట్టుకుని నటిస్తుంది. దటీజ్ గ్రేట్. అందుకే పాత్రలా వుంది, రిపీటయ్యే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తాలూకు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, గుండె దడలతో, చేతివేళ్ళ వణుకుడుతో. మైక్రోలెవెల్ పాత్రచిత్రణకి మైక్రోలెవెల్ నటన. ఆమె డార్క్ మైండ్ లో గూడుకట్టుకున్న ఆలోచనలకి మొహం అద్దంలా. నోట్ బుక్ లోని డెవిల్స్ గైడెన్స్ జులియర్డ్స్ కి ఎంపికవ్వాలన్న ఏకైక గోల్ కోసమే తప్ప, సైకోగా మారిపోయి అల్లకల్లోలం సృష్టించాడానికి కాదు. గుంభనంగా తన గోల్ ని తను సైలెంట్ గా నెరవేర్చుకునే ఎజెండా. ఆ బుక్ వల్ల ట్రాన్స్ లో కెళ్ళిపోయి చిత్తభ్రమలకి లోనయ్యే షాకింగ్ సన్నివేశాలు కూడా మనకి తప్ప చుట్టూవున్న పాత్రలకి అర్ధం గావు. కేవలం మనకి జాలి పుట్టిస్తుందే తప్ప కథలో మరెవ్వరికీ కాదు. చివరికి ఆమె ఏం చేసిందో, ఎందుకు చేసిందో మనకి తప్ప పాత్రలకి కూడా తెలియని నిష్క్రమణ అసంపూర్ణంగా వున్న నోట్ బుక్ లో లిఖిస్తుంది. అదెవరూ తెలుసుకునే అవకాశం లేదు, మనం తప్ప. సిడ్నీ స్వీనీ ఈ పాత్రతో చాలా కాలం గుర్తుండి పోతుంది.

వివిగా మెడ్సన్ ఐజ్మన్ ఎక్స్ ట్రోవర్ట్ క్యారక్టర్ అయిప్పటికీ కవల జూల్స్ రహస్య ఎజెండా వల్ల కలల్ని భగ్నం చేసుకుని, హూందాగా ఓటమినొప్పుకుని తప్పుకునే కాంట్రాస్ట్ పాత్రలో వైబ్రంట్ గా కన్పిస్తుంది. తల్లిదండ్రుల పాత్రల్లో జూలీ బెంజ్, బ్రాండన్ కీనర్ లు డీసెంట్ గా వుంటారు. అయితే కూతుళ్ల మధ్య ఏం జరుగుతోందో, ప్రత్యేకించి చిన్నప్పట్నుంచీ స్ట్రగుల్ చేస్తున్న జూల్స్ గురించి అన్నేళ్లూ తెలుసుకోనే లేదా? ఇదొక అడ్డుపడే లోపం. మ్యూజిక్ టీచర్స్ గా ఇవాన్ షా, జాన్ రోథ్మన్ లకి కూడా కథకి తోడ్పడే మంచి పాత్ర చిత్రణలున్నాయి. టీచర్స్ గా వాళ్ళ డొల్లతనాన్ని సిడ్నీ స్వీన్ కడిగి పారేసే రెండు సన్నివేశాలు బలమైనవి. తక్కువ పాత్రలతో ఎక్కువ కథాబలమున్న మేకింగ్ ఇది.  

        కొత్త దర్శకురాలు జూ క్విర్క్ డ్రమెటిక్ గా, టెక్నికల్ గా ఎంత కళాత్మక చిత్రణ చేసి, కొత్త క్రియేటివ్ ఆలోచనలు రేకెత్తించిదో రేపు సమగ్ర స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

సికిందర్  

23, ఏప్రిల్ 2022, శనివారం

1161 : టిప్స్


 

        అంతిమంగా  తెరమీద సినిమా ఎలా కన్పిస్తుందో నిర్ణయించేది డైలాగ్ వెర్షనే అయినప్పుడు డైలాగ్ వెర్షన్ని తీసుకుని ఇదివరకు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు.  నిశ్శబ్ద వాతావరణం లో, మౌన ముద్రలో కెళ్ళి పోయి- మనసు తెర మీద డైలాగ్ వెర్షన్ని రన్ చేసుకుంటూ, దీన్ని శైలీ శిల్పాలతో తెరకెక్కించాలో మనసులో ముద్రించుకుని- శబ్ద ఫలితాలు  సహా తీవ్రమైన  పేపర్ వర్క్ చేసుకుని, సర్వసన్నద్ధులై సెట్స్ కి వెళ్ళేందుకు వచ్చేవాళ్ళని వినికిడి. ఇదేదో బావుంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ధ్యానించడమంటే సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకోవడమే.  ఒకసారి సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకున్నాక ఆ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలు చేయిస్తుంది.

తే ఒకసారి అజ్ఞాతంలోకంటూ వెళ్ళిపోయాక  బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోకూడదు. సోషల్ మీడియా జోలికి అసలు పోకూడదు. 24x7 తామేం చేస్తున్నారో  ఫేస్ బుక్ లో ప్రపంచానికి చెప్పుకుంటే గానీ కడుపు చల్లబడని చాంచల్యానికి పోకూడదు. మనసు మీద అదుపు లేని వాడు సగటు మనిషే - వాడు మేకర్, క్రియేటర్, ప్రొప్రయిటర్ కాలేడు.  మనమైతే  డైలాగ్  వెర్షన్ పూర్తి చేసుకున్నాక ఈ నియమాలు పాటించాలని చెప్పుకుంటున్నాం గానీ, హాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అయితే అసలెప్పుడూ ప్రపంచంతోనే  సంబంధాలు పెట్టుకోడు. ఫోన్ వుండదు, టీవీ వుండదు, కంప్యూటర్ వుండదు, ఈ మెయిల్ వుండదు, సోషల్ మీడియా వుండదు- ఏమీ వుండవు. ఆదిమ కాలంలో మునిలా ఎక్కడో మారు మూల కూర్చుని సినిమాల సృష్టి గావిస్తాడు. సబ్ కాన్షస్ మైండ్ తో అతడి చెలిమి అలాటిది. మునుల తపస్సు కూడా సబ్ కాన్షస్ మైండ్ తోనే. సృష్టి రహస్యమంతా సబ్ కాన్షస్ మైండ్ లోనే వుంది... 

2. స్క్రీన్  ప్లే కి చక్కగా  మూడంకాలు (త్రీ యాక్ట్స్) పెట్టుకుని, బిగినింగ్- మిడిల్ - ఎండ్ అనే మూడంకాలకి రెండు  ప్లాట్ పాయింట్స్ తో రెండు మూలస్థంభాలు పెట్టుకుని, వాటి మధ్య వాటికి దారి తీయించే  ఉత్సుకతని రేపే కథనాన్ని మాత్రమే చేసుకుంటేఆస్వాదించడానికి  సినిమా ఎంత హాయిగా వుంటుందో తెలిపే ఉదాహరణ ఇదే- కొరియన్ మూవీ మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టర్'

3. వేరే సినిమాల్ని భక్తిభావంతో పరమ పవిత్రంగా కాపీ కొట్టేటప్పుడు, లేదా నీతీ నిజాయితీలతో చట్టబద్ధంగా రుసుము చెల్లించి రీమేక్ చేసేప్పుడు, వాటిని కూలంకషంగా విశ్లేషించుకుని, కథా నిర్మాణం, పాత్రచిత్రణలు, వాటి దృశ్యీకరణల వెనకున్న ఉద్దేశాల్నీ, వ్యూహాల్నీ, అనుసరించిన విధానాల్నీ మదింపు చేసి, వీలయితే అందులోంచి కొంత నేర్చుకుని, మొత్తం సబ్జెక్టునీ ఓన్చేసుకుని ముందుకెళ్తే బాక్సాఫీసు బకాసుర ప్రమాదాలు కచ్ఛితంగా తప్పుతాయి.

4. బయట ప్రపంచం చూస్తే యమ స్పీడందుకుని జోరుగా ముందుకు దూసుకు పోతూంటే, తలుపులు మూసిన చీకటి థియేటర్లో మాత్రం సినిమాలు ఇంకా తీరుబడిగా, పాత  కళా ప్రదర్శన చేస్తూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోలేవు. జీవించే కళే మారిపోయాక కళా ప్రదర్శనేమిటి? అందుకని 1990 నుంచీ ఇవాళ్టి దాకా హాలీవుడ్ కి కొత్త బైబిల్ సిడ్ ఫీల్డ్ పారడైం మాత్రమే. స్పీడు ఈ పారడైం లక్షణం.

        5. హై కాన్సెప్ట్ కథల పాయింటు ఒకవేళ ఇలాజరిగితే?’ (what if?) అన్న ప్రశ్నతో వుంటుంది. ప్రశ్నే కథకి ఐడియా నిస్తుంది. గ్రహాంతర వాసులు భూమ్మీదికి దండ యాత్ర కొస్తే? (‘ఇండిపెండెన్స్ డేఐడియా). డైనోసారస్ లని మళ్ళీ పుట్టిస్తే? (‘జురాసిక్ పార్క్ఐడియా). సముద్ర గర్భంలో రాజు సప్త సముద్రాల్ని జయించాలనుకుంటే? (‘ఆక్వామాన్ఐడియా). ఇలా చాలా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎప్పుడైనా ఇలా ట్రై చేసిన పాపాన పోయారా?

6. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రేక్షకులకైనా సింపుల్ గా అర్థమై పోతాయి హై కాన్సెప్ట్ కథలు. ఒక వేళ ఇలా జరిగితే? - అన్న ప్రశ్నే సాధించాల్సిన సమస్య వీటిలోని ప్రధాన  పాత్రకి. ఈ ప్రశ్నని ఎదుర్కోవడమే యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండే కథ. ప్రశ్నని ఎదుర్కోవడం గోల్,   ప్రశ్నని నిర్వీర్యం చేయడం గోల్ సాధన. సింపుల్  గా అర్ధమైపోతాయి ఈ కథలు మూడు ప్లాట్ పాయింట్ల పారడైంతో. ఇలా ప్రశ్నని పట్టుకుని కథ తక్కువ, తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ - ఇదే హై కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) అన్నమాట.

7. అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంటుంది సింబాలిక్ గా. ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టే వుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

8. పై చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు -  దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. ఒక అస్తమయంతో ఒక  సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... ఇలాటి భావుకతని  తెలుగు సినిమాల్లో కూడా సాధిస్తే బావుంటుందేమో? 

9. ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ  ప్రేక్షకులు నున్నగా తిన్నగా తయారై వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలోకి మేకర్లు వెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలూ జరగవు.

10.
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అనే జానరనేది ప్రేమల గురించి కానే కాదు, అవి నేర్చుకోవడం గురించి మాత్రమే. ప్రేమ సినిమాల్ని కాస్త స్టయిలిష్ గా తీస్తే ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అంటూ రివ్యూ రైటర్లు కూడా రాసి పారేస్తున్నారు. ఇలా వుంటే ఓ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీని తెలుగులో ఎప్పటికి చూడగలం.
11. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి, 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం అనే పాయింటు చుట్టూ వుంటాయి. హాలీవుడ్  లో ఏడాదికి 36 క్రమం తప్పకుండా తీస్తూంటారు. తెలుగులో అర్ధం లేని  హై స్కూలు ప్రేమలే  తీస్తారు. ఆ ఏజిలో వికసించే టాలెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, స్వభావ విరుద్ధంగా ప్రేమలు కాదు. ఒకసారి మనమీ వయసులో ఏం చేసేవాళ్ళమో గుర్తుచేసుకుంటే తెలుస్తుంది. 

12. తెలుగులో 13-19 ఏజి గ్రూపు టీనేజి ప్రేక్షకులు తమ నిజ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని కథలతో, తమకి సంబంధం లేని  అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలతో వస్తున్న సినిమాలకి కనెక్ట్ కాలేక, తమ మనసెరిగి సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి - ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో ఖాళీగా వున్న మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు.

        సరే, ఇక  నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ ఫైనాపిల్ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్