రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

876 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ సంగతులు


నిన్నటి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ వ్యాసంతో కొంత కదలిక వచ్చినట్టుంది, ఇక నిర్మాతలూ కదిల్తే మేకర్లకి రిలీఫ్. నిర్మాతల్లో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ తో కదలిక వుంది. ఎంత మైక్రో బడ్జెట్ లో వుంటే అంత ముందు కొచ్చే పరిస్థితి. చిక్కల్లా మేకర్లు ఇంకా రోమాంటిక్ కామెడీల మేకింగ్ ఆలోచనలతో వుండడమే. థ్రిల్లర్స్ రాత, తీత వేరే టెక్నిక్స్ ని కోరుకుంటాయని  తెలుసుకోక పోవడమే. ఇదలా వుంచితే, అసలు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీస్ రాయాలంటే ఎన్ని పద్ధతులున్నాయో చూద్దాం. ఈ విషయ సమాచారానికి కేరాఫ్ అడ్రస్ హాలీవు   డ్. సినిమా రాతకి, తీతకి సంబంధించి సాంకేతిక సమాచారమంతా హాలీవుడ్ లో నిక్షిప్తమై వుంది. అక్కడ్నించి అసంఖ్యాక నిపుణులు అందించే సమాచారానికి స్ట్రక్చరే మూలం. స్ట్రక్చరాస్యులు కాని సొంత క్రియేటివ్ స్కూలు మేకర్లకి ఈ సమాచారం  అర్ధంగాక పోవచ్చు. కానీ ఇలా తీసే సినిమాలు ప్రేక్షకులకి అర్ధమవుతాయి, అర్ధవంతంగా వుంటాయి. ఇలా వివిధ ప్రాప్తి స్థానాలనుంచి సేకరించిన ఈ సమాచారమేమిటో ఓసారి పరికిద్దాం...           

           కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో బాటు అమెరికాలో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలలకీ పెద్ద మార్కెట్ వుంది. ఈ మార్కెట్లో ఒకప్పుడు మిల్స్ అండ్ బూన్ టీనేజి చాక్లెట్ ప్రేమ నవలలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ లో రియలిస్టిక్ నవలలు రాజ్యమేలుతున్నాయి. ఇవి రాయడంలో అమెరికన్ రచయితలు, రచయిత్రులు ఆరితేరి పోయారని ‘ది గార్డియన్’  పత్రిక పేర్కొంది. కనుక ఈ జానర్ సినిమాలతో బాటు, నవలలకి కూడా ఏం మెళకువలు ప్రదర్శిస్తున్నారో గమనిద్దాం.

          టీనేజి పాత్రల
ఎదుగుదలచిత్రణలకి స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో నాల్గు పద్ధతులున్నాయి. మూమెంట్ ఇన్ టైం పద్ధతి, లాంగ్ హాల్ పద్ధతి, బిగ్ ఈవెంట్ పద్ధతి, పెట్రి డిష్ పద్ధతి. మూమెంట్ ఇన్ టైం పద్ధతిలో - పాత్ర దినచర్యల్నిఆ పాత్ర భవిష్య ప్రయాణానికి సింబాలిక్ గా చూపిస్తారు. దీన్ని ఒక రోజుకో, అతి కొద్ది రోజులకో పరిమితం చేస్తారు. ‘లేడీ బర్డ్’ (2017) లో టీనేజీ హీరోయిన్ రోజువారీ జీవితంలో ఇమడడానికి చేసే స్ట్రగుల్ లో, అవకాశాల్లేని ఆ చిన్నవూరు దాటేసి ఎదగాలన్న తాపత్రయం సింబాలిక్ గా ప్రతిబింబిస్తుంది.

          లాంగ్ హాల్ - అంటే సాగలాగే పద్ధతిలో – టీనేజి పాత్ర పరిణతి చెందే దిశగా చేసే ప్రయాణాన్ని సాగలాగుతూ, కొన్నేళ్ళ స్పాన్ లో చూపిస్తూ పోతారు. బాల్యం నుంచీ టీనేజీ మీదుగా ఇరవయ్యో పడిలోకి.  ‘లయన్’ (2019) లో ఈ పద్ధతి చూడొచ్చు. బిగ్ ఈవెంట్ పద్ధతిలో – ఒకే ఒక్క పెద్ద సంఘటనతో మార్పు చూపిస్తారు. ఈ సంఘటన తోటి పాత్రల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక్కో పాత్ర ఈ సంఘటన వల్ల ఒక్కో విధంగా మార్పు చెందుతాయి. ‘అమెరికన్ పై’ (1999) అనే కాలేజీ కామెడీలో టీనేజీ పాత్రలు వర్జినిటీ కోల్పోవడానికి పడే పోటీలో కొన్నిటికి ఆ అవకాశం లభిస్తుంది, కొన్నిటికి లభించదు. అయితే అన్ని పాత్రలూ ఈ వర్జినిటీ  కోల్పోవడమనే బిగ్ ఈవెంట్ నుంచి ఏదోవొకటి నేర్చుకుంటాయి.  పెట్రి డిష్ పద్ధతి - పెట్రి డిష్ అంటే బాక్టీరియాల్ని పెంచడానికి శాస్త్రవేత్తలు వాడే వెడల్పాటి గాజు పాత్ర. ఈ పెట్రి డిష్ లాంటి సిట్యుయేషన్ లోకి టీనేజి పాత్రల్నిఇరికిస్తారన్న మాట. ఇరికించి పెంచి పోషిస్తారు. హాలీవుడ్ హై స్కూల్ సినిమాల్లో ఈ ప్లే కన్పిస్తుంది. ఒక సృష్టించుకున్న విషమ పరిస్థితిలో పాత్రలు అనుకోకుండా ఒకదానికొకటి తగుల్కొని, పీక్కోలేక అందులోనే పడి ఎదగడం నేర్చుకుంటాయి.

మర్యాద జానర్ మర్యాద!

        ఈ నాల్గు పద్ధతుల్నీ ఏ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కథలకైనా వాడొచ్చు. ఈ నాల్గు పద్ధతుల్లోనే కమర్షియాలిటీ వుంటుంది. కాదని సొంతంగా పద్ధతి కాని పద్ధతికి పోతే కమర్షియాలిటీ కాకుండా పరిపూర్ణ క్షవరం వుంటుంది షాంపూతో.
 
          ఈ నాల్గు నమూనాలకీ స్ట్రక్చర్ ఒకటే. కమర్షియాలిటీకి వున్నదొకే వొక్క స్ట్రక్చర్ – త్రీయా క్ట్ స్ట్రక్చర్. పౌరాణికాల నుంచీ పాప్ కార్న్ సినిమాల వరకూ నాల్గు డబ్బులు రావడానికిదే స్ట్రక్చర్. బిగినింగ్, మిడిల్ ఎండ్- వీటిలో వీటికి సంబంధించిన నిర్ణీత కార్యకలాపాలు. ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లేలు రాస్తూంటే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు,  సెకండాఫ్ సిండ్రోములు వగైరా అనేక బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు చొరబడే అవకాశమే వుండదు. త్రీయా క్ట్ స్ట్రక్చర్ డీఫాల్ట్ గా అలా వుంటుంది ఫైర్ వాల్ తో. బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు క్రియేటివ్ స్కూలిష్టులే చేస్తూంటారు. ఒకవేళ తెలుగులో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రావడమంటూ జరిగితే తెలుగుకి అది తొలకరి. దీన్ని కూడా  క్రియేటివ్ ఎలిమెంటరీ స్కూలు గానుగ మరాడించి దుంప నాశనం పట్టించకుండా వుంటే బావుంటుంది. క్రియేటివ్ వీధి బడితో ఇప్పటికే  వున్న అన్ని జానర్లూ కలిసి 90 శాతం అట్టర్ ఫ్లాపులతో కిటకిట లాడుతున్నాయి. 90% హౌస్ ఫుల్!


 స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల  

         ఇక్కడొకటి గమనిద్దాం. ఎదుగుదల, స్వేచ్ఛ టీనేజీ సమస్యలు. టీనేజర్ ఎదుగుదల దృక్పథంతో వుంటే స్వేచ్ఛ వుండదు గానీ ఎదుగుదల ‘లాంగ్ హాల్’ గా నిరంతరం వుంటుంది. స్వేచ్ఛా దృక్పథముంటే ఎదుగుదల వుంటుంది గానీ ‘పెట్రి డిష్’ గా వుంటుంది. అంటే ఎదుగుదలని కోరుకుంటే స్వేచ్ఛ ని వదులుకోవాలి. ఇది పాజిటివిజం. స్వేచ్ఛని కోరుకుంటే ఎదుగుదలని కోల్పోవాలి. ఇది నెగెటివిజం. 

          వీటికి రెండు ఉదాహరణలు చూద్దాం : సత్యజిత్ రే తీసిన ‘అపరాజితో’ (1956) లో, అతను చిన్నప్పుడు గ్రామంలోనే చదువుకుంటాడు. తల్లితోనే వుంటాడు. స్కూలు చదువయ్యాక కాలేజీలో చేరడానికి నగరం వెళ్ళాలనుకుంటాడు. అప్పుడొస్తుంది సమస్య. అతణ్ణి విడిచి తల్లి వుండలేదు. తల్లిని విడిచి అతను నగరం వెళ్ళలేడు. కొడుకు అభివృద్ధిని తల్లి కోరుకునేదే గానీ దూరంగా వుంటే భరించలేదు. ఈ ద్వైదీ భావాన్ని దిద్దుకునేంత మనసు లేదు. చివరికెలాగో నగరం వెళ్తాడుగానీ, మనసంతా తల్లి మీదే వుండి స్ట్రగుల్ చేస్తాడు. తనవల్ల ఆమెకి కలిగిన లోటుని ఉన్నత చదువుతో తీర్చాలనే పట్టుదలతో వుంటాడు. కానీ అప్పటికామె సజీవంగా వుండదు.


          అంటే అతను కోరుకుంటే చదువు మానేసి వూళ్ళో తల్లితోనే వుంటూ, బాధ్యతల్లేకుండా స్వేచ్ఛగా  బ్రతకవచ్చు. ఆ స్వేచ్ఛ వదులుకున్నాడు ఎదగాలనుకుని. ఈ ఎదుగుదల బాధాకరంగా వున్నా వదులుకోలేదు. ఇది ‘లాంగ్ హాల్’ ఎదుగుదల. 


          నాగభూషణం నటించిన ‘నాటకాల రాయుడు’ (1969) టీనేజీ మూవీ కాకపోయినా స్వేచ్ఛ కోసం ఎదుగుదలని వదులుకునే పాత్రగా నాగభూషణం పాత్ర వుంటుంది. నాటకాల పిచ్చితో తన స్వేచ్ఛ తను కోరుకుని ఇంట్లోంచి పారిపోతాడు. తల్లిదండ్రులు, చెల్లెలూ నానా కష్టాలు పడతారు. నగరంలో మహానటుడుగా ఎదిగి ఫుల్ రేంజిలో ఎంజాయ్ చేస్తూంటాడు. ఇటు వూళ్ళో కుటుంబం పేదరికంతో నానాటికీ దిగజారుతూవుంటుంది. ఆఖరికి తల్లి మరణించిన విషయం కూడా అతడికి తెలీదు. అంటే తప్పు చివర్లో ఒక విషమ పరిస్థితిలో తెలుసుకుని మారడం. ఇది పెట్రి డిష్ ఎదుగుదల. 


          ఎదుగుదల అనే ఒకే ట్రాకులో వున్న పాత్రలు ఏ మాత్రమైనా స్వేచ్ఛ కోరుకోవా - అంటే, విసిగినప్పుడు కోరుకోవచ్చు. అపాత్ర దానాలతో  ఈ ఎదుగుదల, మెచ్యూరిటీ అవసరంలేదనుకున్నప్పుడు ప్లేటు ఫిరాయించ వచ్చు. ‘అంతులేని కథ’ (1976) లో జయప్రద పాత్ర ఇలాటిదే. పాజిటివ్ పాత్ర నెగెటివ్ గా మారడం. 


బ్లూ లాగూన్ భాష్యం

         ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచంలో టీనేజి పాత్రలు ఎదగడానికి స్ట్రగుల్ చేయవచ్చు, స్వేచ్ఛకి పోయి దెబ్బ తిననూ వచ్చు. ‘సిక్స్ టీన్’ (2013) అనే హిందీ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీలో, ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయి నైతిక విలువలవైపు వుంటే, ఇంకో అమ్మాయి స్వేచ్ఛగా, విశృంఖలంగా  తిరిగే ధైర్యాన్ని కల్పించుకుంటుంది. ఒకబ్బాయి వీడియోలతో అమ్మాయిల్ని బెదిరిస్తూ చెడ్డగా వుంటే, ఇంకో అబ్బాయి పోర్న్ చూస్తూ తండ్రికి దొరికిపోయి, ఆ ఘర్షణలో ప్రమాదవశాత్తూ తండ్రిని చంపేసి, పోలీసులు పట్టుకోబోతే పారిపోయి, టీనేజి క్రిమినల్ గ్యాంగ్ లో చేరిపోతాడు. చివరికి తప్పు తెలుసుకుని ఈ మూడు నెగెటివ్ పాత్రలూ మారతాయి. వందలకొద్దీ టీవీ ఛానెల్స్, పత్రికల్లో పేజ్ త్రీ లో సెలెబ్రిటీల పోకడలూ, ఇంటర్నెట్ మొదలైనవి టీనేజర్లని ఎలా వయోలెంట్ గా ప్రభావితం చేస్తున్నాయో ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ చూపిస్తుంది. 

          ఈ నాణేనికి ఇంకో వైపు చూస్తే, ‘ది బ్లూ లాగూన్’ కన్పిస్తుంది. 1908 లో రాసిన నవల ఆధారంగా హాలీవుడ్ తీసిన ‘ది బ్లూ లాగూన్’ (1980) లో, ఓడ ధ్వంసమై ఒక చిన్నమ్మాయి, చిన్నబ్బాయి దీవిలో చిక్కుకుంటారు. ఆ దీవిలో పెద్దవాళ్ళే కాదు, మానవ మాత్రులూ లేక ఏం చేయాలో తెలీక స్ట్రగుల్ చేస్తూ చనువుగా, అల్లరిగా జీవించడం నేర్చుకుంటారు. కొన్నేళ్ళు పోయాక శరీరాల్లో వస్తున్న మార్పులు చూసుకుని దూరం దూరంగా వెళ్లిపోతూంటారు. ఇంకో శరీరంగా తమ బాల్యం మారడాన్ని అర్ధం జేసుకోలేకపోతారు. సిగ్గు పడాల్సిన విషయంగా తలదించుకుంటారు. సారాంశ మేమిటంటే, వయసురాగానే మన సినిమాల్లో లాగా హైస్కూలు పిల్లలు ఎగిరి లాంగ్ జంప్ చేసి లవ్ లో పడరు. కొత్తగా మారుతున్న ఈ శరీరాలేమిటో, స్వప్న స్ఖలనాలేమిటో, ఋతు క్రమాలేమిటో, మొటిమెలేమిటో, ఇంకేమిటేమిటో మేనేజి చేసుకోవడానికే బిడియంతో తప్పించుకుని తప్పించుకుని నానా తిప్పలూ పడతారు. శరీరం అర్ధం గాకుండా ఆకర్షణలు మొదలుకావు. ఇవన్నీ మనమూ అనుభవించలేదా? జబర్దస్త్ గా అనుభవించాం. అయినా సినిమాలకి టీనేజీ నిజాలు దాచి తియ్య తియ్యటి ప్రేమ పూతలతో  అడ్డంగా మోసం చేస్తేనే తృప్తి. దీనికి విరుద్ధంగా సహజ కథా కథనాలు - ఎదుగుదల- కమింగ్ ఆఫ్ ఏజ్ -  ‘ది బ్లూ లాగూన్’ లో వుంటాయి. 


          ఇక్కడేమైందంటే, వీళ్ళు సిగ్గుతో చిన్నప్పటి స్వేచ్ఛని  కోల్పోయారు. యౌవనం ఒక బందీకానాలా మారింది. వికసించిన అంగాలతో ఏం చేసుకోవాలో కూడా తెలీని అయోమయంలో పడ్డారు. ఇలా ప్రకృతి తప్ప ఇంకో మనిషీ, ఆధునిక సంపత్తీ లేని దీవిలో వాళ్ళిద్దరూ శారీరక, మానసిక సంచలనాలని తమకి తామే ఎలా అవగాహన చేసుకుని జయించారనేదే ఈ కథ. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కి ఇది శాస్త్రీయ భాష్యం. 


          ఎదుగుదల నిరంతర ప్రక్రియ, స్వేచ్ఛ పరిమిత వ్యాపకం. ఈ వ్యాసం రాయకుండా స్వేచ్ఛగా బలాదూరు తిరగ వచ్చు, ఎన్నాళ్ళు తిరుగుతాం? తిరగడం ఆపి రాయాల్సిందే. ఏమైనా కాస్త  ఎదుగుతామేమో రాసి తెలుసుకోవాల్సిందే. స్వేచ్ఛ సెల్ఫీ తీసుకుంటూ సింగిల్ టీ లాగించడం, ఎదుగుదల అంతా బాగానే వుందని పిండి రుబ్బడం. 


మైండ్ సెట్ స్టడీ

         రాజ్ కపూర్ తీసిన మేరానాం జోకర్ (1970) లో, రాజ్ కపూర్ 14 ఏళ్ల టీనేజీ పాత్రగా రిషీ కపూర్ నటించాడు. ఇతను టీచర్ (సిమీ గరేవాల్) పట్ల ఎట్రాక్ట్ అవుతాడు. ఆమె నుంచి స్త్రీల ఆంతరంగిక లోకం గురించి, కోర్కెల గురించీ తెలుసుకుంటాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఏమిటో అర్ధంగాని బాధకి లోనవుతాడు. ఈ అనుభవమే వ్యక్తిగా (రాజ్ కపూర్) ఎదిగాక జీవితాన్ని మార్చేస్తుంది. తను బాధల్ని దాచుకుని, లోకానికి నవ్వుల్ని పంచడానికే ఈ లోకంలోకి వచ్చాడని. ఏదైతే ఆమెతో స్వేచ్ఛగా ఎంజాయ్ చేశాననుకున్నాడో అది తాత్కాలికమే. స్వేచ్ఛ బాధకి కూడా లోనుచేయవచ్చు. కానీ స్వేచ్ఛ కి లేని గమ్యం -దిశా దిక్కూ-  ఎదగడంలో వున్నాయి. 

           వార్నర్ బ్రదర్స్ తీసిన ‘ది వాండరర్స్’ (1979)  కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. కాకపోతే టీనేజీ యాక్షన్ జానర్లో కల్ట్ మూవీగా నిలబడింది. ఇది టీనేజర్స్ గ్యాంగ్ కథ. ఇదే పేరుతో  వచ్చిన నవల దీని కాధారం. సినిమా కంటే ఈ నవలని బాగా ఎంజాయ్ చేయవచ్చు. టీనేజర్ల పాత్రచిత్రణలు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే పనులు మతిపోయేలా వుంటాయి. ఇదికూడా స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల గురించే. రిచర్డ్ ప్రైస్ రాసిన ఈ నవల మీద చాలా స్టడీస్ జరిగాయి. వయోలెంట్ ప్రపంచంలో టీనేజర్ల మైండ్ సెట్ ఎలా వుంటుందో స్టడీ చేసుకోవడానికి ఈ నవల పనికొస్తుంది. ఇంకా వీలైనన్ని హాలీవుడ్ లేదా కొరియన్ కమింగ్ ఆఫ్ మూవీస్ కొత్తవీ పాతవీ చూస్తూంటే వాటి మేకింగ్ తెలుస్తుంది. కొరియన్ ఎందుకంటే హాలీవుడ్ లాగే కొరియన్ మూవీస్ స్ట్రక్చర్ లో వుండి కమర్షియల్ గా వుంటాయి. వరల్డ్ మూవీస్ జోలికి పోవద్దు.  

next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్ట్రక్చర్ విభాగాల సంగతులు
సికిందర్