రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

877 :


          చివరికి సినిమాలు సేఫ్ అవడానికి ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా కూడా లాభించడంలేదు. డియర్ కామ్రేడ్ తో మొదలైన ఫ్లాపుల పరంపర ఈ ఫార్ములాకి గండి కొడుతోంది. డియర్ కామ్రేడ్ తర్వాత స్టార్ సినిమాలు 5 విడుదలయ్యాయి - మన్మథుడు -2, రణరంగం, సాహో, గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్. వీటిలో మొదటి నాల్గూ వరసగా ఫ్లాపయ్యాయి. గద్దలకొండ గణేష్ బ్రేక్ ఈవెన్ సమస్యలో పడింది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కి ముందు ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టయ్యింది. మరి అలాటిదే మాస్ యాక్షన్ సినిమా గద్దలకొండ గణేష్ కి సమస్య ఎదురయ్యింది. ఓవర్సీస్ లో ఫ్లాప్ అనుకుని ఆశ వదులుకున్నారు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో గద్దలకొండ గణేష్ కంటే, నగర బ్యాక్ డ్రాప్ లో ఇస్మార్ట్ శంకర్ ఎక్కువ యూత్ ఫుల్ గా వుంది.

         
దిహేనేళ్ళ క్రితం ఈ ఫార్ములా మొదలయ్యింది... ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా. అప్పట్లో ప్రింట్లు, ఇప్పడు డిజిటల్. అప్పట్లోనే నాల్గు వారాలు, యాభైరోజులు, వందరోజులు, మూడు రకాల జూబ్లీలూ వగైరా ఆడే రోజులు పోయి చాలా కాలమైంది. కనీసం ఒక వారం మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. అందుకని వీలైనన్ని ఎక్కువ  ప్రింట్లతో - థియేటర్లతో – శుక్ర శని ఆదివారం వారాంతపు మూడు రోజుల్లో విడుదల చేసి వీలయినంత వసూళ్లు లాగెయ్యాలన్న ఫార్ములా మొదలయ్యింది. ఇది సక్సెస్ అవుతూ వచ్చింది కూడా సినిమాల క్వాలిటీ ఎలా వున్నా. ఇప్పుడు చూస్తే ఈ మూడు గోల్డెన్ రోజుల మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. మొదటి రోజే ఎండుటాకులా టపటప రాలిపోతున్నాయి. ఒకవేళ వారాంతం ఆశాజనకంగా వున్నా, సోమవారం నుంచి గుండెల్లో గుబులు మొదలవుతోంది. పై 5 సినిమాలూ ఈ సోమవారం సిండ్రోం బాధిత సినిమాలే. అంటే స్టార్ సినిమాల క్వాలిటీ ఎలాగూ పెరగదు కాబట్టి ఇక బడ్జెట్లు సగానికి సగం తగ్గించుకోవడమే సేఫ్ అవడానికి మార్గం.

      తె
లుగు రాష్ట్రాల కంటే హిందీ రాష్ట్రాల మాస్ జనం ఎక్కువ. అయినా అక్కడ హిందీ సినిమాలు పాత మూస మాస్ ఫార్ములా ధోరణికి స్వస్తి చెప్పాయి. సగటు ప్రేక్షకులు సహా ఓవర్సీస్ ప్రేక్షకులవి కూడా నేలబారు అభిరుచులే అని చీప్ గా ట్రీట్ చేస్తూ, ఇంకా పాత మూస మాస్ ఫార్ములా స్టార్ సినిమాలు తీయడం తెలుగులోనే చెల్లింది. కానీ నెట్ యుగపు ప్రేక్షకుల అరచేతిలో కొత్త ప్రపంచాలు ఆవిష్కృత మవుతున్నాయి. ఇది గమనించే హిందీలో మాస్ ప్రేక్షకుల్ని క్లాస్ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ విభిన్న స్టార్ సినిమాలు తీస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. నూరు కోట్ల క్లబ్ లో హిందీ సినిమాలు చేరుతున్నాయంటే క్లాస్ క్లబ్ లో మాస్ ప్రేక్షకులు చేరకపోతే సాధ్యం కాదు. తెలుగులో మాస్ వర్గాల్ని క్లాస్ క్లబ్ లోకి చేర్చుకోవడానికి మేకర్లు ససేమిరా అంటున్నారు కల్లెక్షన్లు మొరాయిస్తున్నా. తెలుగు మేకర్ల దృష్టిలో ప్రేక్షకులు ఇంకా మేకలు.

         
సెప్టెంబర్ వరకూ హిందీ బాక్సాఫీసు పనితనం మెరుగ్గా వుంది. 9 సూపర్ హిట్లు, 4 హిట్లు, 4 ప్లస్ లు, 22 ఫ్లాపులు. హిందీలో సూపర్ హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపుపై ఇంకో 50 శాతం అదనంగా వసూళ్లు సాధించడం. డ్రీం గర్ల్ (114.20 కోట్లు), మిషన్ మంగళ్ (200.16), ఆర్టికల్ -15 (65. 05), కబీర్ సింగ్ (278.24), ది తాష్కెంట్ ఫైల్స్ (16.75), బద్లా (88.02), లుకా చుప్పీ (95.14), గల్లీ బాయ్ (139.98), యురీ – ది సర్జికల్ స్ట్రైక్ (244.06) సూపర్ హిట్లుగా నమోదయ్యాయి. వందకోట్లతో తీసి రెండొందల యాభై కోట్లు గడిస్తే సూపర్ హిట్టే, ఐదు కోట్లతో తీసి పన్నెండున్నర కోట్లు గడించినా సూపర్ హిట్టే. ఈ రెండో దానితో పోల్చుకుంటే వందకోట్లతో తీసి రెండొందల కోట్లు గడిస్తే హిట్టే, సూపర్ హిట్ కాదు. పన్నెండున్నర కోట్లు గడించిన 5 కోట్ల సినిమానే సూపర్ హిట్.

         
హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపు రావడం. తెలుగులో బడ్జెట్ మీద పదిశాతం వచ్చినా హిట్టే హిట్టూ అంటూ గంతులు. హిందీలో ఛిచోరే (136.00 కోట్లు), సాహో (148.00), బాట్లా హౌస్ (97.18), కేసరి (153.00) హిట్లుగా నమోదయ్యాయి. ప్లస్ అంటే బడ్జెట్ సేఫ్ అయి కొద్ది శాతం అదనంగా గడించడం. సూపర్-30 (146.10 కోట్లు), భారత్ (209.36), దేదే ప్యార్ దే (102.40), టోటల్ ఢమాల్ (154.10) ఈ కేటగిరిలో వున్నాయి. ఇక ప్లాప్ అంటే, బడ్జెట్ లో 50 శాతానికి పైగా కోల్పోవడం. జబరియా జోడీ, ఖాందానీ షఫాఖానా,అర్జున్ పాటియాలా, జడ్జ్ మెంటల్ హైక్యా, గేమ్ ఓవర్, ఖామోషీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, పిఎం నరేంద్రమోడీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, థాకరే, బ్లాంక్, సెట్టర్స్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2, జంగ్లీ, నోట్ బుక్, సంచరియా, వై చీట్ ఇండియా- ఇవన్నీ స్టార్లు లేని లో- మీడియం బడ్జెట్ ఫ్లాపులు. స్టార్స్ తో పెద్ద బడ్జెట్ ఫ్లాపులు నాల్గున్నాయి : కళంక్, మణికర్ణిక, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లాగా, రాబర్ట్ అక్బర్ వాల్టర్.  ఈ మొత్తం అన్ని కేటగిరీల్లో కళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 తప్ప ఇంకేవీ పాత మూస ఫార్ములాలు కావు.

            
స్టోరీ అయిడియాలు, సినాప్సిస్ లు వాట్సాప్ లో పంపవద్దని మనవి. ఈ మెయిల్ చేస్తే బావుంటుంది. ఈ బ్లాగులో ఇంత రాస్తున్నా ఇంకా పాత మూస ఫార్ములా కథలు పంపే మహనీయులున్నారు. కనీసం తెలుగు సినిమాల ట్రెండ్ ఏమిటో మార్కెట్ వైపు తమ విలువైన, అరుదైన చూపు సారించి- బద్ధకం వదిలించుకుని, సినిమాలు చూడకపోయినా కనీసం రివ్యూలైనా చదివి, ఏ సినిమా ఏమిటో లోకజ్ఞానం పెంచుకుంటే మంచిదని మరోసారి మనవి. అలాటి కథలు చెత్త బుట్టలో పారేసి ఇంటికెళ్ళిపోవడం మంచిది. జీవించడానికి అనేక వృత్తులున్నాయి.

సికిందర్