రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Friday, January 15, 2016

డబుల్ గేమ్

 దర్శకత్వం : మేర్లపాక గాంధీ  
తారాగణం :  శర్వానంద్, సురభి, ప్రభాస్ శీను, సప్తగిరి, షకలక శంకర్, బ్రహ్మాజీ, హరీష్ ఉత్తమన్, ఊర్వశి, సుప్రీత్, దువ్వాసి మోహన్, నాగినీడు, సూర్య, పోసాని తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : మేర్లపాక గాంధీ - షేక్ దావూద్ జి.,  మాటలు : మేర్లపాక గాంధీ
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం :  కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్ : యువి క్రియేషన్స్, నిర్మాతలు : వంశీ, ప్రమోద్
విడుదల :  జనవరి 14, 2016 

        చాపకింద నీరులా ఒక ట్రెండ్ తెలుగులో దారులు చూసుకుంటోంది. ఇది  దర్శకులకే తెలియకుండా జరిగిపోతోంది. అటు హిందీలో ఈ ట్రెండ్ ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించారు. తెలుగులో ఉద్దేశం లేకపోయినా, తెలియకుండా ఈ ట్రెండ్ లో భాగస్వాములై పోతున్నారు. దశాబ్దంన్నర క్రితం దేశంలో  మల్టీ ప్లెక్స్ థియేటర్లనే కాన్సెప్ట్ ఎప్పుడయితే ప్రారంభమయిందో, అప్పట్నించీ హిందీలో కేవలం అలాటి మల్టీప్లెక్స్ థియేటర్లకే ఉద్దేశించి,  లో- బడ్జెట్ సినిమాలు, ఆ తర్వాత ఇండీ ఫిలిమ్స్ అనే దర్శకుడి పర్సనల్ టేస్ట్ వున్న  సినిమాలూ తీయడం ప్రారంభించారు. మల్టీ ప్లెక్స్ థియేటర్ల  ప్రేక్షకులు వేరు. కేవలం నగరాలకే పరిమితమైన ఆధునికులు వాళ్ళు. మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రేక్షకులు  పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో సైతం క్లాస్- మాస్ ప్రేక్షకులుగా వుంటారు. మల్టీ ప్లెక్స్ లకే ఉద్దేశించిన లో- బడ్జెట్ సినిమాలతో బాటు, ఇండీ ఫిలిమ్స్,  సింగిల్  స్క్రీన్ థియేటర్ ప్రేక్షకులు చూసేందుకు పట్టణాల్లో, పల్లెల్లో  పనికిరావు. ఎందుకంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్ సినిమా అంటే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా. వీటి పాత్రలు, కథల తీరుతెన్నులు, వాటి కాన్వాసులు, ఫార్మాట్ లూ విస్తృతమైనవి; కమర్షియల్- మూస ఫార్ములా మసాలా దినుసులతో కూడినవి. ఇలా కాకుండా మల్టీప్లెక్స్ సినిమాల పాత్రలు, కథల తీరుతెన్నులు, చిన్న చిన్న కథలతో వాటి కాన్వాసులు పరిమితమైనవి. సింగిల్  స్క్రీన్స్ కి నప్పని ఎలాటి కథయినా, పాత్రయినా  తీసుకునే స్వేచ్ఛ ఇక్కడుంటుంది. గత దశాబ్దం న్నర కాలంగా హిందీలో ఇలా వస్తున్నవే భేజా ఫ్రై, ఫస్ గయారే ఒబామా, కాఫీ బ్లూమ్, తిత్లీ వంటి అసంఖ్యాకమైన లో- బడ్జెట్ మల్టీప్లెక్స్ సినిమాలు. ఇవి నగరాల్లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో ఆడవు, బి-సి సెంటర్లకి అసలే వెళ్ళవు. అక్కడి  ప్రేక్షకులకి చూపిస్తే ఇదేం  సినిమారా బాబూ అని తిట్టుకుంటూ వెళ్లిపోతారు.

        సరీగ్గా చెప్పాలంటే,  ఆర్ట్ సినిమాలు అంతరించిపోయిన కాలంలో శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లవంటి దర్శకులు కింకర్తవ్యం ఆలోచించి,  ఇహ తమ ఆర్ట్ సినిమాలకి మళ్ళీ జనాకర్షణ తీసుకురావాలంటే బాలీవుడ్ స్టార్స్ తో తీయక తప్పదని రాజీ పడి, అలా తీసినవే కమర్షియలార్ట్ అనే క్రాసోవర్ సినిమాలు. ఇకప్పుడు చిన్న చిన్న న్యూవేవ్ కథలతో అవకాశాల కోసం చూస్తున్న ఎందరెందరో కొత్త కొత్త దర్శకులు, మల్టీ ప్లెక్స్ థియేటర్లు కూడా పెరగడంతో - ఈ మార్గం పట్టుకుని మల్టీ ప్లెక్స్ సినిమాలకీ, ఆ తర్వాత ఏ సినిమా రూల్సూ వుండని ఇండీ ఫిలిమ్స్ కీ దారి తీశారు.

        తెలుగులో ఇలాటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం అసలుండదు. తెలుగు సినిమా అంటే అది క్లాస్ -మాస్ అందరూ చూడాలని తీసే ఎ-బి-సి సెంటర్ సినిమాలై వుండాలని కోరుకుంటారు నిర్మాతలూ దర్శకులూ. అయితే ఈ సంధి కాలంలో వాళ్ళకే తెలియకుండా జరుగుతున్నదేమిటంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అనుకుని మల్టీప్లెక్స్ సినిమాలు తీసేస్తున్నారు. ఇటీవలే శంకరాభరణం, భలే మంచి రోజు, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా తీశారు. వీటికి ముందుకూడా కొన్ని తీశారు. వాటి సంగతి అలా ఉంచుదాం. 

        ‘ఫస్ గయారే  ఒబామా’  లాంటి ఒక పరిమిత కాన్వాస్ గల, నేపధ్యం గల, స్టార్ కాస్ట్ గల చిన్న కథతో కూడిన మల్టీ ప్లెక్స్ సినిమాని పూర్తి  స్థాయి కమర్షియల్ సినిమాకి పెంచి ‘శంకరాభరణం’ తీస్తే ఏం  జరిగిందో తెలిసిందే. అలాగే పరిమిత కాన్వాస్ తో కథ గల ‘భలే మంచి రోజు’ కూడా మల్టీ ప్లెక్స్ సినిమానే. ఈ సినిమా చివర్లో ఈ జానర్ కి అతకని పృథ్వీ  రెగ్యులర్ కమర్షియల్ కామెడీతో కిచిడీ చేసి అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకున్నారు.  అలాగే ఇప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి చాలని అన్నివిధాలా చాలా చిన్న కథతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తీశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ని  హిందీవాళ్ళు తీస్తే అది కేవలం మల్టీ ప్లెక్స్ సినిమానే అవుతుంది. ఈ నేపధ్యంలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ దాని జానర్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని, తెలియకుండా మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ ల ట్రెండ్ లో అటూఇటూ కాని రోమాంటిక్ థ్రిల్లర్ గా తీసి మన ముందుంచారు.

ఎలాగంటే...
        ఇందులో  హీరోయిన్ ఓ చిన్న కుక్క పిల్ల గురించి విడిపోయే కథనం, అసలు ప్రేమ కుదరడానికి డిక్షనరీ తో ఎపిసోడ్లు అనే కథనమూ... రెగ్యులర్ కమర్షియల్ సినిమా పరిధికి/ ప్రేక్షకుల సంతృప్తికి చాలని అంశాలు. రెగ్యులర్ సినిమాల్లో కాన్ ఫ్లిక్ట్ అనే ప్రధాన మలుపుకి - కుక్క పిల్ల అనే తేలికపాటి చైల్డిష్ కారణం వుండదు. ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏదో వుంటుంది. బ్యాక్ డ్రాప్, కాన్వాస్ ఇంకా విస్తృత పరిథుల్లో వుంటాయి. 2006 లో  రవిబాబు అల్లరి నరేష్ తో తీసిన ‘పార్టీ’ మల్టీ ప్లెక్స్ సినిమా అనుకునే  ఫిక్స్ అయి మల్టీ ప్లెక్సుల్లోనే రిలీజ్ చేశారు. ఆ కథ, పాత్రల పరిధి ఎంతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లోనూ అంతే.

        కాకపోతే దీన్ని కమర్షియల్ ఫార్మాట్ తో కలిపి తీశారు. అలా మల్టీ ప్లెక్స్ కథ రెగ్యులర్ ఫార్మాట్ లో ఒదగనందువల్లే ఈ సినిమా ఒడిదుడుకుల ప్రయాణంలాగా అన్పిస్తుంది.  

ఇదీ అదే
        రెండోది, ఒక రోమాంటిక్ థ్రిల్లరో, సస్పెన్స్ థ్రిల్లరో అనగానే,  ‘స్వామి  రారా’  అప్పట్నించీ అదే మూసలో, అలాటివే కథలతో, అలాటివే పాత్రలతో తీయడం కన్పిస్తోంది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇందుకేమీ తీసిపోలేదు. పెద్ద హీరోల సినిమా లనగానే అవే రొటీన్ గా ఫార్ములా కథలు, హార్రర్ సినిమా లనగానే అవే హార్రర్ కామెడీలు, థ్రిల్లర్స్ అనగానే అవే థ్రిల్లర్స్ తీస్తున్నారు. ఫస్టాఫ్ తో ముగిసిపోగల కుక్క పిల్లతో ప్రేమ కథ- ఫార్ములా కథలోకి తిరగబెట్టి- దాని బెల్టులో డైమండ్ పెట్టడంతో ఆ డైమండ్ కోసం వెంటపడే ముఠాలతో మళ్ళీ  ‘స్వామీరారా’ టైపు కాపీ థ్రిల్లర్ గా మారింది. ‘స్వామీరారా’ క్రాఫ్ట్ వేరు- అది ఎప్పుడో 1994లో ‘పల్ప్ ఫిక్షన్’ తీసిన క్వెంటిన్ టరాంటినో వాడిన మూడుకథలతో ఒక కథ అనే- ఒక కామన్ గా వుండే బిందువు దగ్గర్నుంచీ ప్రారంభమయ్యే వేట. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో హీరో ఇలాటి బిందువు దగ్గరే కుక్క పిల్లని కిడ్నాప్ చేసే ఘటన లోంచి ఇంకో మూడు ఉపకథలు పుడతాయి. ఇవి కథా క్రమంలో  కొత్త కొత్త పాత్రలతో ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటాయి. ఇదంతా ‘స్వామి రారా’ లో చూసిందే.

        టూకీగా ఈ కథ ఏమిటంటే, వైజాగ్ లో తాగుబోతుగా ఆవారాగా తిరిగే, తండ్రి మాటంటే గౌరవం లేని హీరో ( శర్వానంద్), ఆ తండ్రికి ఫ్రెండ్ అయిన పోలీసు అధికారి (పోసాని) వార్నింగ్ ఇచ్చి పంపిస్తే జాబ్ లో చేరేందుకు హైదరాబాద్ వస్తాడు ఫ్రెండ్ ( ప్రభాస్ శీను) తో కలిసి.

        రాగానే ఇక్కడ హీరోయిన్ ( సురభి) ని  చూసి ప్రేమలో పడతాడు. ఈమెకి తన బొచ్చు కుక్క అంటే ప్రాణం. ఒకరోజు తెలీక దాన్ని మునిసిపాలిటీ కుక్కల వ్యానులో పడేస్తాడు. దీంతో ఆమె హర్ట్ అయి విడిపోతుంది. ఆ బొచ్చు కుక్కని  వెతికి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అది ఒక డైమండ్ స్మగ్లర్  ఇంట్లో వుంటుంది. ఐటీ వాళ్ళు  రైడింగ్ కి రావడంతో, 75 కోట్లు విలువజేసే ఒక డైమండ్ ని కుక్క బెల్టులో దాచేస్తాడు. ఈ కుక్కని హీరోయిన్ కోసం హీరో కిడ్నాప్ చేస్తాడు- ఈ కిడ్నాప్ జరిగే స్థలంలో వేర్వేరు పన్ల మీద వెళ్తున్న బ్యాచులు ఢీ కొంటారు. వీళ్ళెవరు, వీళ్ళ కథలేమిటనేది తర్వాత్తర్వాత కథా క్రమంలో రివీల్ అవుతూంటాయి. కుక్క కోసం స్మగ్లర్, ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ కోసం హీరో, రికార్డింగ్ డాన్స్ కెళ్ళే ప్రయత్నంలో ఇంకో గ్రూపూ..ఇలా సాగుతూంటుంది కథనం...’స్వామీరారా’ టైపు కథనం అన్నిసార్లూ బావుండదు.  ‘పల్ప్ ఫిక్షన్’ కథనంతోనే మళ్ళీ  హాలీవుడ్ లోనే తీయలేదు. తీస్తే కాపీ కొట్టారని పరువు పోతుంది.

        ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో దర్శకుడు మూస ఫార్ములాకి కూడా పాల్పడ్డాడు. తెలుగు సినిమా హీరో అనగానే, అదెలాటి కథయినా హీరో అనేవాడు సిగరెట్లు తాగే ఆవారా తాగుబోతులాగా వుండడం, ఓపెనింగ్ లో ఓ ఘనకార్యం చేసి గ్రూపుతో ఓ సాంగే సుకోవడం, హీరోయిన్ తో ఓ డ్రీమ్  సాంగ్ కలగనడం...అలాఅలా క్లయిమాక్స్ కి ముందు  హీరోయిన్ తో ఓ ఫోక్ సాంగ్, అ తర్వాత ఫైటింగ్ తో ముగించడమనే రొటీన్నే మళ్ళీ ఇందులో కలిపాడు. దీంతో  సినిమాని జానర్ పరంగా- మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ అనే వర్గీకరణ పరంగా, పాత రొటీనై పోయిన సబ్జెక్ట్ పరంగా- అన్నీ కలగాపులగం చేసి కాక్ టెయిల్ మిక్చర్ గా అందించాడు.

        ఇప్పుడు తెలుగు సినిమాలకి జానర్స్ మర్యాద కాపాడ్డమే  ఒక సవాలుగా వుంటే, దీనికి అదనంగా మళ్ళీ ఆ తీసే జానర్స్ కూడా మల్టీ ప్లెక్స్ ట్రెండ్ లో పడకుండా ( మల్టీప్లెక్స్ సినిమాలు తీయరు కాబట్టి)  పూర్తి స్థాయి సింగిల్ స్క్రీన్ స్పృహతో తీయాల్సి రావడం కత్తి మీద సామే కావొచ్చు.

        గత సంవత్సరం సక్సెస్ అయిన సినిమాల్నిపరిశీలిస్తే, జానర్ మర్యాదని కాపాడిన సింగిల్ స్క్రీన్ కథలకే ప్రేక్షకులు ఓటేశారు. తెలుగు సినిమాకి ఇప్పటికి రెండే  : జానర్ మర్యాద, సింగిల్ స్క్రీన్ సెన్సిబుల్ కథ!

-సికిందర్ http://www.filmyfreak.com

No comments: