రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2016, మంగళవారం

వీకెండ్ కామెంట్

ఇవి విచారణా సంఘాల  రిపోర్టులా?

       దేశంలో వివిధ భాషలకి చెందిన సినిమా పరిశ్రమలున్నాయి. కానీ అసహనమంటూ ఏ భాషా సినీరంగమూ ఫీలవని సమస్యని   ఒక్క బాలీవుడ్ మాత్రమే ఫీలవుతోంది. మొత్తం బాలీవుడ్ అని కాదుగానీ, అందులో ప్రముఖులనదగిన ఇద్దరు ఖాన్ స్టార్లు, మరికొందరు దర్శకులూ దేశంలో తమ వృత్తి వ్యాపారాలతో  సంబంధం లేని  అసహనంగురించి అడపాదడపా వివాదాలు సృష్టిస్తున్నారు. ఇలా కొందరు ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఖాన్ స్టార్లు. ఖాన్ స్టార్ల విషయమే తీసుకుంటే,  వాళ్ళు తాము కొనసాగుతున్న  బాలీవుడ్ రంగంలో నిర్మాతల నుంచో, దర్శకుల నుంచో అలాటి అసహనాన్ని గానీ, వివక్షని గానీ, అణిచివేతని గానీ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అని అడగాలి. వీళ్ళని మోస్తూ ఇంతటి వాళ్ళని చేసిందెవరని కూడా అడగాలి. అసలు బాలీవుడ్ ఒక సెక్యులర్ రంగం, ఇక్కడ అందరి సహకారంతో మైనారిటీలమైన మేము ఇంతటి వాళ్ళమాయ్యమని ఎప్పుడైనా చెప్పుకున్నారా?  అలాంటప్పుడు దేశం గురించి మాట్లాడ్డం ఏం బావుంటుంది. 
          ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆరిపోతున్న అసహనం  కుంపటిని రగిలించారు. యధావిధిగా మళ్ళీ దీనిమీద రాజకీయ పార్టీలు గళమెత్తాయి.
         
ఇలా బాలీవుడ్ ప్రముఖులే  ఎందుకు అసహనం గురించి మాటాడుతున్నారు. దేశంలో మిగతా బెంగాలీ, తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ తదితర సినిమా పరిశ్రమల నుంచి ఈ వ్యాఖ్యలు ఎందుకు రావడం లేదు. ఇక్కడి వ్యక్తులకి దేశంలో అసహనముందని అన్పించడం లేదా, లేక పోతే మనకెందుకులే అనుకుని మౌనం దాల్చారా? ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖుల్ని సమర్ధిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా?          అసలు బాలీవుడ్ ప్రముఖులకి దేశంలో అసహనం వుందని ఎందుకు అన్పించింది. అన్పించినా ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది. మౌలికంగా కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా  బాలీవుడ్ తో సంబంధంలేని కొందరు మేధావులూ, రచయితలూ అసహనం మీద మాట్లాడడం మొదలు పెట్టారు. అవార్డులు వెనక్కి ఇవ్వడం మొదలెట్టారు. దీంతో బాలీవుడ్ లో  కూడా రాగాలు తీయడం మొదలెట్టారు. అకాడెమిక్ మేధావులు చూసుకుంటున్న అంశంలో  వాళ్ళతో  ఎందులోనూ పోలికగానీ, సంబంధంగానీ  లేని, కమర్షియల్ సినిమాలు తీసి జనాన్ని వినోదపర్చే బాలీవుడ్ వ్యక్తులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజాసమస్యల మీద సినిమాలు తీయని బాలీవుడ్ కి అకస్మాత్తుగా ఈ స్పృహ ఏమిటి
          తాము తీసే  సినిమాల మీద దాడులు జరిగినప్పుడో, అవి నిషేధానికి గురయినప్పుడో  అసహనమంటూ మాట్లాడితే అర్ధముంది. అంతవరకే సంబంధం. కానప్పుడు అరకొర జ్ఞానంతో దేశ సమస్యల్లో జోక్యం చేసుకుంటే శృంగభంగమే బహుమానం.  అసహనం గురించి  ఈ గళాల్నిచూసి చూసి,  ఇందుకే శత్రుఘ్న సిన్హా సినిమా స్టార్లు రాజకీయాలు  మాట్లాడ వద్దన్నారు. 
         
 కానీ స్టార్లు ఇలా తమకి వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడేస్తూంటే, చాప కింద నీ రొచ్చేస్తున్నట్టు కేంద్రంలో అధికార పార్టీ కంగారు పడిపోవడం, దీన్ని చూసి ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యల్ని పట్టుకుని అధికార పార్టీని  ఇరుకున బెట్టాలని చూడ్డం పదేపదే జరిగిపోతోంది. ఏమో, ఏం చెప్పగలం.. రేపు ఈ సినీ సెలబ్రిటీలే  తమ పార్టీల్లో చేరి ఓట్లు రాల్చే అధిదేవత లవుతారేమో. 
         
తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్య- దేశంలో భావ స్వేచ్చ ఒక జోక్-  ప్రజాస్వామ్యం రెండో పెద్ద జోక్ అని! తక్షణం దీన్ని పట్టుకుని, ఇదేదో విచారణా  సంఘం రిపోర్టు అయినట్టు, కాంగ్రెస్ వెళ్లి బీజేపీ మీద పడడం,  రొటీన్ గా బిజేపీ ఆ రిపోర్టుని తిప్పికొట్టడం జరిగిపోయాయి. చూస్తే ఈ పార్టీలు ఒక్కో బాలీవుడ్ ప్రముఖుడు అసహనం గురించి ఒక్కో విచారణా  సంఘం రిపోర్టు విడుదల చేస్తున్నట్టే భావిస్తున్నట్టున్నాయి. వాటికంత విలువిచ్చి రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రముఖ వార్త చేస్తున్నాయి. అందుకే కాబోలు  కాంగ్రెస్  పార్టీకి చెందిన మనీష్ తివారీ, కరణ్ జోహార్ ని వెనకేసుకొస్తూ -  మోడీ ప్రభుత్వం ఇంటలెక్చువల్స్ కి వ్యతిరేకమని కేంద్రం మీద విరుచుకు పడ్డారు. విచారణా సంఘం రిపోర్టిచ్చారంటే  కరణ్ జోహార్ ఇంటలెక్చువల్లే అయివుండాలి. ఇంతకి ముందు రిపోర్టు లిచ్చిన బాలీవుడ్ స్టార్లు కూడా ఇంటలెక్చువల్సే అన్నమాట. పాపం అసహనం ఎజెండాతో ప్రారంభమైన అసలైన  ఇంటలెక్చువల్స్ ఈ బాలీవుడ్ హైజాకింగ్ ని చూస్తూ వున్నారు. కరణ్ జోహార్ మసాలా సినిమాలు తీయకుండా, దేశసమస్యల మీద వివాదాస్పద సినిమాలు తీసి వ్యతిరేకత నెదుర్కొన్నప్పుడు,  భావ స్వేచ్చ గురించి, ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడవచ్చు. బాలీవుడ్ సినిమాల కిస్తున్నంత స్వేచ్చ ప్రాంతీయ సినిమాల కివ్వడం లేదు సెన్సార్ బోర్డులు. 
       
టాలీవుడ్ లో బాలీవుడ్ కి మించిన ఫైర్ బ్రాండ్ స్టార్- పోలిటీషియన్ వున్నారు. ఆయనెప్పుడూ  విచారణా సంఘం రిపోర్టులు ఇవ్వలేదు. దాని మీద రాజకీయ పార్టీలు పోట్లా డుకోనూ లేదు. ఇస్తే గిస్తే అప్పుడప్పుడు మాత్రమే సెలెక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లి సమతూకంతో గ్రౌండ్ రిపోర్టు లిస్తారు. తోచినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడం, సమతూకం పాటించడం, ఈ రెండిటి వల్ల మేధావులూ రాజకీయనాయకులూ నోళ్ళు మెదపలేక  పోతున్నారు. బాలీవుడ్ మేధావులుతాము దేశానికే ప్రతినిధులమని భావించుకుంటే భావించుకోవచ్చు. కానీ టాలీవుడ్ ని  కేవలం తెలుగు సినిమాలు రీమేక్ చేసుకోవడానికి మాత్రమే  ఉపయోగించుకోకుండా, ఇక్కడి రాజకీయ టాలెంట్ ని కూడా గుర్తించి, ఆ ప్రకారం కాస్త ప్రజల్లోకి వెళ్లివస్తూ,  గ్రౌండ్ రిపోర్టు లివ్వడం నేర్చుకుంటే ఏ పేచీ వుండదు. లేకపోతే ఇలా స్వయం ప్రతిష్ఠాపిత విచారణా సంఘాల  రిపోర్టులతో ఎప్పటికీ శృంగభంగాలే!

-సికిందర్