రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 18, 2015

సాంకేతికం

       
   శరవేగంగా టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు సినిమా రంగానికి ఎప్పటికప్పుడు అనేక సవాళ్ళు విసురుతున్నాయి. హోం థియేటర్లు, హెచ్ డీ స్క్రీన్లు, ఆన్ లైన్ పైరసీ మొదలైన టెక్నాలజీ పరమైన సవాళ్ళకి తోడూ సెల్ ఫోన్లలో సైతం షార్ట్ ఫిలిమ్స్ చూసుకునే సౌకర్యం ఏర్పడడంతో, ఇంకా వీడియో గేమ్స్ వంటి కాలక్షేపాలతో ప్రేక్షకులు థియేటర్ల మొహం చూడ్డం  మానేస్తున్నారు. ఇలాటి ప్రేక్షకుల్ని నిత్యం థియేటర్లకి రప్పించే ప్రయత్నాలు టెక్నాలజీ పరంగా జరుగుతూనే వున్నాయి.
తాజాగా దక్షిణ  కొరియా దిగ్గజం సామ్ సంగ్ వర్చువల్ రియాలిటీ మూవీ ప్రొజెక్షన్ ని ప్రవేశ పెట్టింది. దీంతో సినిమా చూసే అనుభవం- వూహ కందని ప్రపంచంలో మనం ఉన్నట్టుగా చూపించే అద్భుత విన్యాసంతో - అదీ థియేటర్లలో మాత్రమే అభించే అనుభవంగా మారబోతోంది.  

దక్షిణ కొరియాలో స్థానిక సినిమా నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు 3డీ,  4డీ  సినిమా ప్రదర్శనలకంటే  ఇంకా హై ఎండ్ 5 డీ  వీ ఆర్’ ( వర్చువల్ రియాలిటీ ) ప్రదర్శనలకి అప్ డేట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఈ దృష్ట్యా వర్చువల్ రియాలిటీ ని వినూత్న ప్లాట్ ఫాం గా పరిచయం చేయదలచుకున్నామని సామ్ సంగ్ సీ ఈ ఓ  జేకే షిన్ చెప్పారు.
        అప్పుడే జియాన్ వూ- యెల్ అనే దర్శకుడు  మొట్ట మొదటి కొరియన్ వీ ఆర్ మూవీ గా టైం పారడాక్స్’  అనే షార్ట్ ఫిలిం ని రూపొందించారు. ఇది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకా వీ ఆర్ వీడియో గేమ్స్ ని డెవలప్ చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుందనీ, కానీ వీఆర్ సినిమాలు నిర్మించాలంటే చాలా తక్కువ సమయం పడుతుందనీ దర్శకుడు జేయోన్ చెప్పారు. ఈయన మరో నాల్గు వీ ఆర్ మూవీస్ పై వర్క్  చేస్తున్నారు.
     వీఆర్ టెక్నాలజీ థియేటర్ ఒనర్లని కూడా ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియాలో అతిపెద్ద థియేటర్  నెట్ వర్క్ సంస్థ  సిజె- సిజివి  స్క్రీన్ ఎక్స్’  అనే సరికొత్త వెండి తెరని ఏర్పాటు చేసింది.  దీన్ని కొరియా అడ్వాన్స్ డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది.
        ప్రపంచంలో మొత్తం నాల్గు దేశాల్లో ఇంతవరకూ 84 స్క్రీన్ ఎక్స్ వెండి తెరలు ఏర్పాటయ్యాయి. రానున్న మాసాల్లో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. చైనాకి చెందిన అతిపెద్ద థియేటర్ల గ్రూప్ వాండా గ్రూప్’  ఈ బృహత్కార్యానికి పూనుకుంటోంది. చైనాలో వాండా సినిమా గ్రూప్, ఉత్తర అమెరికాలో ఎ ఏం సీ, ఆస్ట్రేలియాలో హైట్స్ అనే  పేర్లతో ఈ సంస్థ థియేటర్ లని  నిర్వహిస్తోంది. 2020 నాటికల్లా వెయ్యి  థియేటర్లని వీ ఆర్ థియేటర్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
      దక్షిణ కొరియాలో వీ ఆర్ ఫార్మాట్ లో కాయిన్ లాకర్ గర్ల్అనే థ్రిల్లర్ హిట్టయింది. వాండా గ్రూప్ సినిమా నిర్మాణం లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వీ ఆర్ ఫార్మాట్ లో  ది ఘౌల్స్’  అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించింది.
        ‘ఇళ్ళల్లో కూర్చుని సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్న కాలంలో వీ ఆర్ టెక్నాలజీ ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల వైపుకు లాగుతుంది. వీ ఆర్ ఫార్మాట్ లో సినిమాలు చూస్తే  ఆ అనుభవమే వేరు. దీనికి ఇంకేదీ సాటి రాదుఅని వాండా గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

-సికిందర్