ఎం కె
మోహన్ కుమార్, సీనియర్ కలరిస్ట్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్
|
“ సినిమా రీళ్లే వుండని, ఇప్పుడున్న ప్రొజెక్టర్లే వుండని రోజులు
మరింకేంతో దూరం లేవు! డిజిటల్ ప్రొజెక్షన్ విధానంతో సినిమాలు తీసే, చూసే తీరే
పూర్తిగా మారిపోనుంది!” అన్నారు సీనియర్
కలరిస్టు ఎం. కె. మోహన్ కుమార్ పూర్తి నమ్మకంతో. అంత విప్లవాత్మక మార్పు తీసుకు రానున్నది
డిజిటల్ ఇంటర్మీడియేట్ (డీ ఐ) అనే ఈ సాంకేతిక పరిజ్ఞానం. ఈ రోజుల్లో సినిమా
జనాల్లో విరివిగా విన్పిస్తున్న మాట డీ ఐ! ఈ డీ ఐ టెక్నాలజీని వినియోగించుకోని
నిర్మాత అంటూ ఇటీవల ఎవరూ వుండడం లేదని చెప్పొచ్చు. అసలేమిటి ఈ డీ ఐ? ల్యాబ్స్
ఉనికినే ప్రశ్నార్ధకం చేసేంత మహా శక్తిగా ఇదెలా మారింది?
సింపుల్ గా చెప్పాలంటే డీ ఐ అంటే కలర్ కరెక్షనే. ఓ
ఐదేళ్ళ క్రితం సినిమాలకీ, ఇప్పటి సినిమాలకీ ఓ తేడా వుంది. ఇప్పటి సినిమాల్లో
దృశ్యాలు మరింత ఉద్విగ్నంగా, కళ్ళు తిప్పుకోలేనంత కళాకారుడు వేసిన పెయింటింగులా ఉండడాన్ని
గమనిస్తున్నాం. ఇదంతా ఏ సూపర్ 35 లాంటి అత్యాధునిక కెమెరా మహాత్మ్యమో నని పొరబడతాం
సహజంగానే. కానీ అదేం కాదు. సంతోష్ శివన్ లాంటి కాకలు తీరిన కెమెరామానే వచ్చి
చిత్రీకరించినా, ఈ స్థాయి క్వాలిటీని రాబట్టడం అసాధ్యం. కెమెరామాన్ తీసిన
దృశ్యాల్ని లస్టర్ ( Lustre ) సూట్ లో డిజిటల్ గా కలర్ కరెక్షన్ చేస్తే మాత్రమే
ఇది సాధ్యం.
లస్టర్
సూట్
|
ఈ పనే చేస్తూంటారు మోహన్ కుమార్. ‘ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్’ హైదరాబాద్ శాఖలో గత
నాలుగేళ్ళుగా కలరిస్టుగా పనిచేస్తున్న ఈయన ఊటీలో జన్మించిన తమిళుడు. తెలుగు చక్కగా
మాట్లాడతారు. ఓపెన్ గా మాట్లాడతారు. 1989 లో మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఫిలిం
ప్రాసెసింగ్ కోర్సు పూర్తి చేసి, 1990 నుంచీ రామానాయుడు స్టూడియోలో చీఫ్
టెక్నీషియన్ గా పనిచేస్తూ, ప్రస్తుతం ఇదే స్టూడియో ప్రాంగణం లో నెలకొల్పిన ‘ప్రైమ్
ఫోకస్’ లో కలరిస్టు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ప్రైమ్ ఫోకస్’ భారతీయుడికి చెందిన బహుళ జాతి సంస్థ. ఉత్తర
అమెరికా, బ్రిటన్, ఇండియాలలో దీనికి శాఖలున్నాయి. దీని ఎండీ నమిత్ మల్హోత్రా
ముంబాయిలో ఉంటారు. ముంబాయితో బాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవాలలో బ్రాంచీలున్నాయి.
డి ఐ
కి ముందు- డి ఐ కి తర్వాత
|
నాల్గేళ్ళ క్రితం మహేష్ బాబు నటించిన ‘సైనికుడు’ తో తమ డీ
ఐ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు మోహన్ కుమార్. చరిత్ర లో కెళ్తే,
హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ క్రిస్ ఎఫ్. వుడ్స్ మొట్టమొదటి సారిగా
1993 లో డిజిటల్ గా ‘సూపర్ మారియో బ్రదర్స్’ అనే సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించారు.
సినిమా రీలుని డిజిటల్ గా స్కాన్ చేసే ఈ విధానమే డీ ఐ ప్రాసెస్ కి దారితీసి, అదే
సంవత్సరం ‘ఓ బ్రదర్, వేర్ ఆర్ట్ థౌ?’ మొదటి డీ ఐ సినిమా గా విడుదలైంది. అయితే 2005
లోనే ఈ ప్రక్రియ ఊపందుకుని 2007 కల్లా 70 శాతం హాలీవుడ్ సినిమాలు డీ ఐ తో
కళకళలాడుతూ వచ్చాయి. ఇప్పుడు డి ఐ లేని సినిమాయే లేదు. గతంలో కలర్ కరెక్షన్ కి గ్రేడింగ్ అనే
పధ్ధతి వుండేది. దాంతో కనిష్టంగా ఐదు ఫ్రేములకి రంగులు సరిదిద్దేందుకు వీలయ్యేది. డీ ఐ వచ్చాక ప్రతి ఫ్రేముకూ సాధ్యమౌతోంది.
డీ ఐ ప్రక్రియని ఇలా వివరించారు మోహన్
కుమార్ : సినిమా తీశాక నెగెటివ్ మొత్తాన్నీ స్కాన్ చేసి, లస్టర్ మీద డి ఐ పూర్తి చేసి, ఒకే
ఫుల్ నెగెటివ్ గా ఎడిటింగ్ కి పంపిస్తారు. ఈ ఫుల్ నెగెటివ్ ని ఆరీ (Arri) రికార్డర్ తో 5242 కోడక్, లేదా ఫ్యూజీ ఆర్డీ ఏ
8511 మీద ఎక్కించి పంపిస్తారు. దీనికి సౌండ్ మిక్స్ చేశాక ప్రింట్లు లేదా డిస్కులు
తీసి, ప్రదర్శనల కోసం థియేటర్లకి పంపిస్తారు.
ప్రస్తుతం తను పని చేస్తున్న రవితేజ నటిస్తున్న ‘డాన్ శీను’ లో డీ ఐ పూర్వం వున్న
దృశ్యాల స్థితి, డీ ఐ చేసిన తర్వాత వచ్చిన క్వాలిటీ చూపించారు మోహన్ కుమార్.
ప్రొడక్షన్ శాఖల్లో ఒక అభిప్రాయముంది.
డీ ఐ వచ్చాక షూటింగ్ లో పెద్దగా లైట్లు వాడే అవసరం రావడం లేదని. దీన్ని గురించి ప్రస్తావిస్తే, ఇది తప్పన్నారు మోహన్ కుమార్. కెమెరా మాన్
పూర్తి స్థాయిలో లైటింగ్ ని వాడితేనే డీ ఐ తో లైటింగ్, కలరింగ్ సత్ఫలితా లుంటాయని
స్పష్టం చేశారు. డీ ఐ తో ఉన్న ఇంకో సౌలభ్యం గురించి చెప్పారు. ఒక ఆర్టిస్టు తో ఈవెనింగ్
ఎఫెక్ట్ తో తీయాల్సిన షాట్, ఆ ఆర్టిస్టు అర్జెంటుగా వెళ్ళిపోవలసి వస్తే, ఆ షాట్ ని
మధ్యాహ్నం పూటే అత్యవసరంగా తీయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడా తర్వాత దాన్ని డీ ఐ
తో చల్లని సాయంవేళ గా మార్చేయ వచ్చన్నారు.
పూర్వం ఓ సినిమాకి డీ ఐ చేయాలంటే
నిర్మాత 45 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చేదనీ, ఇప్పుడు 10-15 లక్షలకి తగ్గి
వచ్చిందనీ అన్నారు. (ఇప్పుడు 2015 నాటికి ఇది ఎవరుపడితే వాళ్ళు చేసే కుటీర
పరిశ్రమగా మారిపోయి, ఖర్చు వేల రూపాయలకి పడిపోయి, ఆ మేరకు క్వాలిటీ కూడా పతనమైంది)
అలాగే బయ్యర్లు ఒక్కో ప్రింటు కి 60 వేల ఖర్చు
పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడొక 18 వేలకే
డిస్కులు తీసుకెళ్ళి థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్షన్ చేసుకో వచ్చన్నారు మోహన్
కుమార్. దీ నివల్ల సినిమా ఫ్లాపైనా నష్ట తీవ్రత కొంత తగ్గుతుందన్నారు. ఇప్పుడు చాలా థియేటర్లు డిజిటల్
ప్రదర్శనలకి అనుకూలంగా మారిపోతున్నాయని
చెప్పారు.
ఏడాదికి ఇరవై సినిమాలు చొప్పున
ఇప్పటికి 80 సినిమాలకి డి ఐ కల్పించిన ఈయన ప్రస్తుతం ‘డాన్ శీను’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’,
‘ఖలేజా’, ‘చంద్ర ముకి-2’ సినిమాలతో బిజీగా
వున్నారు. ‘అదుర్స్’, ‘కేడీ’, ‘గోలీమార్’
సినిమాలకి చేసిన డీ ఐ తనకు మంచి సంతృప్తి నిచ్చిందన్నారు.
―సికిందర్
(ఆగస్టు 2010 ‘ఆంధ్రజ్యోతి’ సినిమాటెక్ శీర్షిక)
(ఆగస్టు 2010 ‘ఆంధ్రజ్యోతి’ సినిమాటెక్ శీర్షిక)