రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, డిసెంబర్ 2022, శుక్రవారం

1273 : రివ్యూ!


దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
తారాగణం : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, తులసి, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం : బీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

నిర్మాతలు : టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్  
విడుదల : డిసెంబర్ 23, 2022
***
        మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  గత ఖిలాడీ’, రామారావు ఆన్ డ్యూటీ రెండూ ఫ్లాప్ అవడంతో అసహనంగా వున్నారు. మాస్ మహారాజా కావడంతో ఆప్షన్స్ ఎక్కువ వుండవు. అవే మాస్ సినిమాలు అలాగే నటించాలి. ఈడియట్ నాటి ముద్రపడిన క్యారక్టరైజేషన్, యాక్టింగ్ కొనసాగిస్తూ పోవాలి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఇమేజి చట్రంలో ఇరుక్కున్నాడని అనుకునే వాళ్ళు. ఇదే పరిస్థితి రవితేజది. కాబట్టి ఇప్పుడు తాజా ధమాకా ని వేరే ఆశలేం పెట్టుకోకుండా చూడాలి. ఈసారి అలా చూస్తే ఎలా వుంటుంది? ఫ్యాన్స్ కి ఓకేనా? దర్శకుడు నక్కిన త్రినాధరావు మాస్ మహారాజాకి హిట్ ఇచ్చినట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ  
వైజాగ్ లో నంద గోపాల చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) ఓ కంపెనీ బాస్. కంపెనీకి కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ)ని సీఈఓ గా నియమించాలని నిర్ణయిస్తాడు. ఇది నచ్చని కంపెనీలో వ్యతిరేకులు జెపి (జయరాం) తో కలిసి కుట్ర చేస్తారు. జెపికి కొడుకుని సీఈఓ చేయాలని పథకం. ఇంకోవైపు మధ్యతరగతికి చెందిన స్వామి(రవితేజ) వుంటాడు. ఇతడికి తండ్రి వాసుదేవరావు (తనికెళ్ళ భరణి), తల్లి దేవకి (తులసి), చెల్లెలు (రాజశ్రీ నాయర్) వుంటారు. స్వామికి చేస్తున్న ఉద్యోగం పోవడంతో చెల్లెలి పెళ్ళి సమస్య అవుతుంది. ఇతను చెల్లెలి ఫ్రెండ్ పావని (శ్రీలీల) ని ప్రేమిస్తూంటాడు. పావని తండ్రి (రావు రమేష్) కి స్వామి నచ్చడు. దీంతో ఒకేలా వున్న స్వామి, ఆనంద్ లని పరీక్షించి ఎవర్ని చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలో జెపి కుట్ర అమలుకావడంతో ఆనంద్ ప్రమాదంలో పడతాడు. ఆనంద్ ని కాపాడేందుకు స్వామి రావడంతో జెపి, శ్రీలీల సహా అందరూ వూహించని షాక్ కి లోనవుతారు.
        
ఏమిటా షాక్? దేని గురించి? ఆనంద్, స్వామిలకి సంబంధించిన రహస్యమేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? జెపి కుట్రని స్వామి ఎలా ఎదుర్కొన్నాడు? అసలు తనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా ధమాకా ఏమిటో చూడాల్సిందే. 

ఎలావుంది కథ 

రవితేజ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ వున్న కథ. లేనిదల్లా కథే. కథ బదులు కామెడీలు, పాటలూ వస్తూంటాయి. ఫ్యాన్స్ అదృష్టం బావుండి మధ్య మధ్యలో వచ్చే కామెడీలూ పాటలూ బావుండడంతో, పాటలకి మాస్ మహారాజా విరగదీసి డాన్సులు చేయడంతో, పక్కన అందమైన శ్రీలీల వుండడంతో ఫుల్ ఖుష్ అవుతారు.  
        
ఫ్యాన్స్ కాని వాళ్ళకి ఇంటర్వెల్లో రవితేజ ద్విపాత్రాభినయానికి సంబంధించి ట్విస్టు రావడంతో, అది మంచి కమర్షియల్ ధమాకాలా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో ధమాకా ఏమీ వుండదు. చిచ్చుబుడ్డి ఇంటర్వెల్లోనే పేలిపోవడంతో సెకండాఫ్ సైలెంట్ గా వుండిపోతుంది.  సైన్స్ ప్రకారం చూసినా పేలిన చిచ్చుబుడ్డి ప్రకంపన లుంటాయి. కానీ ప్రకంపనలు లేకపోవడంతో విలన్ కూడా వీక్ అయిపోయాడు. ఆ ప్రకంపనలు సెకండాఫ్ లో వుండి వుంటే, మరో చిచ్చుబుడ్డి చివర్లో పేలివుంటే డబుల్ ధమాకాగా వుండేది.

ఫస్టాఫ్ లో స్వామి పాత్రలో రవితేజ ఉద్యోగం పోవడంతో మాస్ తిరుగుళ్ళు తిరగడం, హీరోయిన్ శ్రీలీలని రౌడీల బారినుంచి కాపాడడం, సాంగ్, సాంగ్ తర్వాత శ్రీలీలతో లవ్ ట్రాక్, మరోవైపు కంపెనీ మీద కుట్రతో సీన్లు, ఆనంద్ పాత్రలో రవితేజని స్వామి అనుకుని శ్రీలీల ప్రేమించడం, కన్ఫ్యూజ్ కామెడీ, మరో సాంగ్... ఇలా రెగ్యులర్ టెంప్లెట్ లో కొత్తదనం లేని కథనంతో సాగుతూ, పైన చెప్పుకున్న ధమాకాతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ లో సమస్యేమిటంటే, ఇంటర్వెల్ ధమాకాతో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం తెలిశాక, సెకండాఫ్ లో ఇక స్వామి పాత్రతోనే నడపాల్సి వచ్చింది. చాలా సింపుల్ గా ఆలోచిస్తే, ద్విపాత్రాభినయం రహస్యం విలన్లకి తెలియకుండా, ప్రేక్షకులకి మాత్రమే తెలిసి వుంటే, సెకండాఫ్ లో ద్విపాత్రాభినయం కంటిన్యూ అయి విలన్లతో కన్ఫ్యూజింగ్ గేమ్ గా కథంటూ వుండేది. ఇలా చేయకపోవడంతో, చేయడానికేమీ లేక, కామెడీలూ పాటలతో భర్తీ చేశారు. ముగింపు కూడా కుదర్లేదు.

నటనలు –సాంకేతికాలు

ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకులకి నచ్చే అదే వెటకారం, నటన, కామెడీలతో మార్పులేకుండా ఇమేజి చట్రంలో ఎంటర్ టైన్ చేశాడు రవితేజ. ఇంత పెద్ద స్టార్ కి ఎమోషనల్ బ్యాగేజీ లేని పాత్రచిత్రణ, కథా కథనాలు సరిపెట్టడం కూడా ఇందుకే. రామ్- లక్ష్మణ్, వెంకట్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ అంత హైపర్ నటనతో వున్న రవితేజని అందుకోలేదు. ఒక గ్రౌండ్ లో, ఒక యార్డులో సెట్ చేసిన ఫైట్ సీన్లు మాస్ మహారాజానీ కట్టేశాయి. ఛేజింగ్స్ తో మూవ్ మెంట్లో యాక్షన్ సీన్స్ వుండి వుంటే రవితేజ హైపర్ యాక్షన్ కి జోడు గుర్రంలా వుండేది.
        
అన్ని పాటలకి చేసిన డాన్సులు, రెండు పాత్రలపట్ల చూపిన వేరియేషన్స్ కమర్షియల్ విలువలకి తగ్గట్టున్నాయి. పాత్రల పరంగా కష్టపడి నటించాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ శ్రీలీల కేవలం ప్రేమ కోసం వుండే గ్లామర్ పాత్ర, నటన. రావురమేష్, పక్కన హైపర్ ఆది చేసే కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. తనికెళ్ళ రొటీనే. కానీ ఫోన్ తీసుకుని ఇంటర్వెల్లో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం ఇతర పాత్రలకి టాంటాం చేయడంతో సెకండాఫ్ విషయం లేకుండా పోయింది. శివ లాంటి సినిమాకి రచయిత అయిన తను- ఇలా చెయ్యకయ్యా బాబూ, సెకండావ్ కొంప కొల్లేరవుతుందని ఈ సినిమా రైటర్ కి చెప్పి వుండాల్సింది.
        
కాస్ట్యూమ్స్, సెట్స్, ఔట్ డోర్స్ ప్రొడక్షన్ విలువలతో అత్యంత రిచ్ గా, కలర్ఫుల్ గా వున్నాయి. కార్తీక్ ఘట్టమేని కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. బీమ్స్ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం ఇంకో హైలైట్. దర్శకుడు త్రినాధరావు దర్శకత్వం బాగానే వుందిగానీ, ఇంకెన్ని సినిమాలు అవే మూస కథలతో తీస్తారనేది ప్రశ్న.

—సికిందర్