రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 11, 2017

రివ్యూ!




రచన -దర్శత్వం : లోకేష్ రాజ్ 
తారాగణం :  సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, చార్లీ, ధుసూదన్ దితరులు
మాటలుః శాంక్ వెన్నెలకంటి, సంగీతం: జావేద్ రియాజ్, ఛాయాగ్రహణం : సెల్వకుమార్
బ్యానర్ : ఏకెఎస్ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్స్టూడియోస్
నిర్మాతః అశ్వనికుమార్ దేవ్
విడుదల : మార్చి 10, 2017
***
తెలుగు- తమిళ సినిమాల్లో నటిస్తూ అంతర్రాష్ట్ర హీరోగా వెలుగుతున్న సందీప్ కిషన్, మరో ద్విభాషా చలనచిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగులో నటిస్తే మూస, తెలుగు- తమిళం కలిపి  నటిస్తే వాస్తవికత అనే వ్యత్యాసం  చూపిస్తూ కూడా వర్ధిల్లుతున్నాడు. కాకపోతే మరీ తమిళ ‘నేరం’ తో చేయరాని  ‘రన్’ సపరేట్ గా తెలుగులో చేసి అపూర్వంగా దెబ్బ తినాల్సి వచ్చింది. అపూర్వంగా అని ఎందుకంటే,  తెలిసి ఎవరూ ఇండీఫిలిం ని రీమేక్ చేయరు, ఇంతవరకూ చేయలేదు ఇది తప్ప.
         
       ఇప్పుడు చేసిన మరో ప్రయోగమేమిటంటే, నాల్గు కథలు కలిసే కథా సాగరంలో నటించడం. ఈ ప్రయోగం కొత్తదేం కాదు- చాలామంది చాలాసార్లు చేసిందే. తాజాగా ఏలేటి చంద్రశేఖర్ తీసిన ‘మనమంతా’ (ఆగస్టు, 2016) కూడా వుంది. అయితే కొత్తేమిటంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొత్తవాడు. 

          నగరాలకి వెళ్లి స్ట్రగుల్  చేసే వాళ్ళుంటారు, స్ట్రగుల్ పెట్టే  వాళ్ళూ వుంటారు. ఇలాటి నల్గురి విడివిడి కథలే ఒకచోట కలవడం ఈ కథావస్తువు. ఇందులో ఉద్యోగం కోసం ఊర్నుంచి వచ్చిన శ్రీ ఒక ఐటీ కంపెనీలో చేరతాడు. ఆ ఐటీ కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేసే రెజీనా వుంటుంది. ఈ రెజినాని ప్రేమించే సందీప్ కిషన్ వుంటాడు. ఓ ఆకు రౌడీ ఆమె మీద యాసిడ్ పోస్తానంటే వాడి మీద తను యాసిడ్ పోస్తాడు. ఊర్నుంచి కొడుకు వైద్యం కోసం చార్లీ అని ఇంకొకడు వచ్చి క్యాబ్ డ్రైవర్ గా చేరతాడు. ఒక రౌడీ గ్యాంగ్ వుంటుంది. వీళ్ళు ఓ పిల్లాడు అనుకుని ఇంకో పిల్లాణ్ణి కిడ్నాప్ చేస్తారు. ఆ పిల్లాడు బడా గూండా మధుసూదన్ కొడుకని తెలుసుకుని వణికిపోతారు. అయినా ప్రాణాలకు తెగించి డబ్బుకోసం బెదిరిస్తారు. ఓ ఆ రాత్రి పూట ఓ చోట డబ్బు అందుకునేందుకు ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఈ కిడ్నాప్ లోకి ఇటు సందీప్, రెజీనా;  అటు శ్రీ, క్యాబ్ డ్రైవర్ నల్గురూ ఎలా ఇరుక్కుని కిడ్నాప్ గొడవ ఏఏ మలుపులు తిరిగిందనేది మిగతా కథ. 

          ఫస్టాఫ్- పరస్పర సంబంధంలేకుండా వీళ్ళందరి ట్రాకులు సాగుతాయి. సెకండాఫ్ లో ఇంకా కంటిన్యూ అయి – సెకండాఫ్  సగంలో అందరూ క్లాష్ అవడంతో అసలు కథ మొదలవుతుంది.

          మేకర్లు దీన్ని డార్క్ కామెడీ థ్రిల్లర్ అన్నారు. కానీ కామెడీ ఏమీ వుండదు. అలాగే పాటలూ డాన్సులూ వుండవు. ఇది కమర్షియల్  సినిమా స్ట్రక్చర్ లో వుండదు- నాల్గు కథలతో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలు కావు- రియలిస్టిక్, లేదా సెమి రియలిస్టిక్ సినిమాలు. ఒకే  కథతో సెమీ  రియలిస్టిక్ సినిమాల కైనా స్ట్రక్చర్ వుంటుంది గానీ,  నాల్గు కథలతో చెబితే స్ట్రక్చర్ సెమీ రియలిస్టిక్ కి కూడా వుండదు. అందుకని సెకండాఫ్ సగం పూర్తయ్యే వరకూ ఈ కథలు ఎటుపోతున్నాయో ఎవరికీ అర్ధం కాదు- ఏ ఒక్క కథలోనూ కథ ప్రారంభంగాక ఓపిగ్గా నిరీక్షించాల్సి వుంటుంది. 

          ఇది స్థూలంగా కన్ఫ్యూజ్డ్  కిడ్నాప్ కథ- ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాగే. ఒకరనుకుని ఇంకొకర్ని కిడ్నాప్ చేయడం, ఆపైన గందరగోళం తలెత్తడం... ఐతే కొత్త దర్శకుడు లోకేష్ కనకరాజ్ దీన్ని కావాలని పచ్చిగా తీశాడు. ఈ మధ్య అరవ వాస్తవికత మరీ బస్తీ పాత్రలతో, పెరిగిపోయిన జుట్లూ గడ్డాలతో, కంపుకొట్టే బట్టలతో, ధూమపానం- మద్యపానం చేస్తూ, గల్లీ భాష మాట్లాడుతూ తిరిగే అనెడ్యుకేటెడ్ మొహాలతో  తీయడం ఫ్యాషన్ గా మారింది. ఓ నల్గురైదుగురు తప్ప అందరూ ఇలా వూర మాస్ గా కన్పించే వాళ్ళే. లొకేషన్స్ కూడా అపరిశుభ్రమైన బస్తీలే. ఇది నగరంలో కథ అన్నాక- ఆ చెన్నై మహానగరాన్ని చూస్తున్నట్టు ఎక్కడా వుండదు- ఓ చిన్నపాటి టౌన్లో  మురికివాడల్లో  జరుగుతున్నట్టు వుంటుంది. 

          అరవ వాస్తవికత శృతిమించి స్లమ్స్ లో సెటిలవుతోంది- ఈ వాస్తవికతలో మళ్ళీ ఎన్నో సినిమాటిక్ లిబర్టీలు. చివరికి ఆటలో అన్నిపాత్రలూ ఒక చోట ఢీకొనడంలో లాజిక్ కూడా వుండదు. ఎప్పుడో పగలే కిడ్నాపర్ల బందికానా లోంచి తెలివిగా తప్పించుకున్న పిల్లాడు, అంత తెలివిగా  ఇంటికి పారిపోకుండా, కనీసం తండ్రికి ఫోన్ చేయకుండా, స్కూలుకైనా వెళ్ళిపోకుండా, పోలీస్ స్టేషన్ కైనా పోకుండా- ఏ ట్రాఫిక్ పోలీసుకైనా చెప్పుకోకుండా - అర్ధరాత్రి దాకా ఎందుకు తిరుగుతూంటాడో అర్ధం గాదు- మళ్ళీ దొరికిపోతేనే కథ ప్రారంభమయ్యే అవకాశం వుంటుందనా?  తన గురించే  అందరి కథలూ ప్రారంభం కావాలని ఎదురుచూస్తూంటే, ఇంటికెళ్ళి పోవడం బావోదని పాపం తన బాలల హక్కుల్ని అలసి సొలసిన నిద్రమొహంతో తనే కాలరాసుకున్నాడు  - దర్శకుడు అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పిస్తూ. 

          నైట్ దూరంగా ఆగిన కారు బడా గూండాదే అనుకుని, ఇట్నుంచి కిడ్నాపర్లు హెచ్చరిస్తూంటే, ఆ క్యాబ్ లో వున్న చార్లీ, శ్రీలు రివర్స్ తీసుకుని పారిపోకుండా, ముందుకే వచ్చి వాళ్ళకి దొరికిపోయి తన్నులు తినడం కూడా కథని ప్రారంభించడం కోసమేనా? ఇలా పాత్రల్ని కథల్ని కలపడం కోసం అతకని సంఘటనల్ని సృష్టించాడు. నాల్గు కథలూ ఒక చోట స్పర్శించే ప్రక్రియ అపరిపక్వతతో వుంది. 

          చివరికి పోలీసులూ, హీరో, కిడ్నాపర్, పిల్లాడు, వాడి తండ్రీ – వీళ్ళందరితో క్లయిమాక్స్ అడ్డగోలుగా వుంది. నగరాన్ని వదిలి వెళ్లి పోవాలనుకున్న సందీప్ – క్లయిమాక్స్ ముగిశాక- నగరాన్ని విడిచి వెళ్ళనంటాడు- ఇక  చస్తే వెళ్ళనంటాడు, తనతో కూడా జరిగిన  ఈ అన్యాయం చూశాక. ‘ఈ నగరం నా గుర్తింపు’ అంటాడు. 

          చిత్రీకరణ అంతా డార్క్ మూవీ బాపతు లైటింగ్ తో వుంది. నేపధ్య సంగీతం సన్నివేశాలకి తగ్గట్టే  వుంది. సందీప్ కిషన్ సహజత్వంకోసం సీరియస్ గా కన్పిస్తాడు. రెజీనాకి పెద్దగా పాత్రలేదు. శ్రీ అనే కొత్త నటుడి హావభావ ప్రదర్శన బావుంది.

-సికిందర్
cinemabazaar.in