రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 11, 2017

రివ్యూ!






రచన -దర్శకత్వం:  అశోక్ .జి
తారాగణం: అంజలి, సింధుతులానీ,  దీపక్, రాజా వీంద్ర, ప్రకాష్, ప్తగిరి, స్వాతీ దీక్షిత్, సాక్షీగులాటీ  దితరులు
సంగీతం: సెల్వణేష్, స్వామినాథన్, ఛాయాగ్రణం: బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్
బ్యానర్ : శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్
నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్
విడుదల : మార్చి10, 2017

***
         సైకలాజికల్ థ్రిల్లర్ తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే సైకియాట్రిస్టో, సైకాలజిస్టో అయి వుండనక్కరలేదు గానీ;  థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తీయగల జానర్ పరిజ్ఞానంతో బాటు, డైనమిక్స్ తెలిసిన దర్శకుడు అయివుండడం అవసరం. దర్శకుడు జి. అశోక్ గతంలో తీసిన ‘పిల్ల జమీందార్’, ‘సుకుమారుడు’ అనే రోమాంటిక్ కామెడీల జానర్ నుంచి  కొత్తగా ‘చిత్రాంగద’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కి మారినప్పుడు  చాలా కష్టపడాల్సి వుంటుంది. రోమాంటిక్ కామెడీల కుండేంత  మంది ప్రేక్షకులు హార్రర్ కామెడీల కుంటారేమోగానీ, సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కి వుండే అవకాశం లేదు- తెలుగులో కొద్దిపాటి మార్కెట్ వుండే ఈ జానర్ తో కెరీర్ కెటూ ఉపయోగం వుండదు. పైగా ఇప్పుడు దర్శకులు ఏవి పడితే అవి తీసేస్తూ ఒక ఐడెంటిటీ లేకుండా- ఫలానా ఈ దర్శకుడు ఫలానా ఈ తరహా సినిమాలకి పేరు అనే ముద్ర లేకుండా ప్రేక్షకుల దృష్టిలోనే పడలేకపోతున్న కాలంలో, దర్శకుడు  అశోక్ ఇప్పటికైనా తనకి ఏ జానర్ మీద పట్టుందో ఆ జానర్ కి కట్టుబడితేనే  బావుంటుంది. తోచిన జానర్ నల్లా తీసిన వాళ్ళు పేర్లు కూడా గుర్తురాకుండా పోయారు. ఏటా తొంభయ్యేసి శాతం ఫ్లాపులకి ఈ ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’ తత్త్వం  కూడా కారణమే. 

          ‘గీతాంజలి’ ఫేం అంజలి సినిమా మొత్తాన్నీ మొదలు పెడితే చివరి దాకా వదలకుండా భుజాన మోయగల సత్తావున్న హీరోయినే. దెయ్యంగా కనపడినా, సైకోగా కనపడినా అందులో పూర్తిగా జీవించిగానీ వదిలిపెట్టదు. అయితే ఈసారి జీవించడానికి ఎన్నో జీవితాలున్నాయి, ఒక్కో జీవితం ఒక్కో షేడ్ తో వుంది- ఈ షేడ్స్ ని  ప్రకటించిందో ఓ సారి చూద్దాం...
కథ
       వైజాగ్ లో సైకాలజీ బోధించే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చిత్ర (అంజలి) కాలేజీ అమ్మాయిలతో బాటు హాస్టల్లో వుంటుంది. హాస్టల్ లో దెయ్యం తిరుగుతోందనీ, ఆడ దెయ్యం మగవాడిలా మీద పడి కోరిక తీర్చుకుంటోందనీ అమ్మాయిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతూంటారు. దెయ్యం చిత్రే  అని బయటపడుతుంది. తనెందుకు మగపిశాచిలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలని  నీలకంఠ (జయప్రకాష్)  అనే సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తుంది. హిప్నాటిక్ సెషన్ లో  ఒకావిడ ఎవరో ఒక వ్యక్తిని చెరువులో చంపేస్తున్నట్టు కన్పిస్తోందని చెప్తుంది. హత్య కలలోకి కూడా వస్తోందని చెప్పి, చెరువు  అమెరికాలో వుందని తెలుసుకుని ఫ్రెండ్ సువర్ణ (స్వాతీ దీక్షిత్) తో అక్కడికి బయల్దేరుతుంది.

         
అక్కడ పరిచయమైన పోలీస్ కానిస్టేబుల్ సంయుక్త (సాక్షీ గులాటీ) ఇంట్లో వుంటూ చెరువు దగ్గర వుండాల్సిన అరేబియా రెస్టారెంట్  కోసం వెతుకుతూంటుంది. తన ప్రవర్తనకీ, తనకి వస్తున్న కలకీ ప్రాంతంతో వున్న సంబంధం ఏమిటా అని శోధిస్తున్నప్పుడు, ఆమె నమ్మలేని నిజాలు ఆమె గురించే బయటపడతాయి- ఏమిటవి? నిజాలు తెలుసుకుంటే ఆమెకేం జరిగింది? నిజాలు బయట పడకుండా ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మొత్తం మిస్టరీ ఏమిటి? దీంతో ఆమెకున్న సంబంధమేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ 
     సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మర్యాదని కాపాడుతూ కొత్తగానే  వుంది కథ - ఇది నవలగా వచ్చిన నిజకథ అన్నారు.  గత డిసెంబర్ ఫస్టున విడుదలైన తమిళంలో  విజయ్ ఆంటోనీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘సైతాన్’ (‘బేతాళుడు’) కూడా  తమిళ రచయిత ‘సుజాత’ నిజ కథ ఆధారంగా రాసిన ‘ఆహ్’ అనే నవలకి చిత్రానువాదమే. సరీగ్గా ఈ కథని పోలి వుంటుంది ‘చిత్రాంగద’ కథ.  ‘బేతాళుడు’ లో హీరోకి కూడా ఇలాటివే పారానార్మల్ అనుభవాలెదురై, సైకియాట్రిస్టు దగ్గరికెళ్తే అతను పాస్ట్  లైఫ్ రిగ్రెషన్ ద్వారా గత జన్మలోకి తీసికెళ్తే- అక్కడ గతజన్మలో తానెవరో తెలుసుకుని- గతజన్మలో తన జీవితం ఎలాముగిసిందీ, తనని చంపినా భార్య  ఎందుకలా చంపిందీ తెలుసుకోవడానికి మాచర్ల ప్రయాణం కడతాడు.

         
‘చిత్రాంగద’ కథలో కూడా హీరోయిన్ ఇలాటివే పారానర్మల్ అనుభవాలతో డిస్టర్బ్ అయి, సైకియాట్రిస్టు చేసే  హిప్నాటిజంతో, తదనంతర ప్రయత్నాలతో, అమెరికా వెళ్లి అక్కడ  గత జన్మలో తాను  ఒక భర్త అనీ, తనని భార్య చంపేసిందనీ తెలుసుకుంటుంది...

          ‘
బేతాళుడులో గత జన్మ తాలూకు తన ఆత్మ తనని పట్టుకుని ఒకానొక  ‘జయలక్ష్మిని చంపమని  వేధించినట్టే, ప్రస్తుత కథలోనూ హీరోయిన్ ని పట్టుకున్న గతనజ్మలో భర్త అయిన ఆమె ఆత్మే, ప్రతీకారం కోసం రగిలిపోతుంది.

           
కాకపోతే బేతాళుడుజానర్ మర్యాద తప్పి- ఎత్తుకున్న కథ వల్లకాదని వదిలిపా రేసి- సెకండాఫ్ లో  అవయవాల అమ్మకపు మెడికల్ మాఫియా దుకాణం తెరిచి కూర్చుంది. అట్టర్ ఫ్లాప్ అయింది. కథ దివాలా తీశాక దుకాణాలెందుకుంటాయి. 

ఇది చాలనట్టు,  ప్రియుడితో కలిసి భార్య భర్తని చంపే నేరాలు ఘోరాల బాపతు క్షుద్ర కథగా బాక్సాఫీసు సెంటిమెంట్లకి విరుద్ధంగా తేల్చారు. ‘చిత్రాంగద’  కథలో గతజన్మలో భార్య భర్తని చంపాల్సివచ్చే కారణానికి బలమైన  పునాదులున్నాయి- బాక్సాఫీసుని ఒప్పిస్తూ.  

ఎవరెలా చేశారు 
      అంజలి నంబర్ వన్. కాకపోతే స్కర్ట్స్ లో ఆమె వేషధారణ భరించలేం. ఆమె ఫిజిక్ కి స్కర్ట్స్ ఎబ్బెట్టుగా వున్నాయి,  ‘బి’ గ్రేడ్ మూవీ ఫీలింగ్ కల్గించేలా.  తను అంత బరువెక్కి పోవడం కూడా ఎందుకో తెలీదు. వైజాగ్ లో స్కర్ట్స్ వేసుకు తిరిగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడుంటుందో దర్శకుడికే తెలియాలి. నటించడంలో గానీ, జీవించడంలో గానీ ఏ తేడా రానివ్వలేదు. ముందే చెప్పుకున్నట్టు పాత్రకి చాలా  షేడ్స్ వున్నాయి : స్ప్లిట్ పర్సనాలిటీతో ప్రారంభమై, పారానార్మల్ బిహేవియర్ తో కొనసాగి, పాస్ట్ లైఫ్ సిండ్రోంకి వచ్చి ... మళ్ళీ వీటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ తన తప్పే తెలుసుకునే రియలైజేషన్ ... ఇవన్నీ కలగలిసిన సంక్షుభిత వ్యక్తిత్వాన్ని సమర్ధవంతంగా  ప్రకటించింది. ఒకటి : తాను ఆడేపాడే గ్లామర్ హీరోయిన్ కాలేనప్పుడు సమస్యాత్మక పాత్రల్ని నటించే సామర్ధ్యం పెంచుకోవడమే. అయితే తను చేసిన  ఈ ప్రయత్నానికి దర్శకుడి పని తనంగానీ,  సంగీతదర్శకుడి సరిగమలు గానీ ఏమేరకు సహకరించాయో తర్వాత చూద్దాం. 

          రెండో బలమైన పాత్ర సింధూ తులానీ పోషించిన భార్య పాత్ర. ఆశ్చర్యకరంగా  సింధూ తులానీ స్లిమ్ గా తయారయ్యింది! స్లిమ్ గా వున్నందుకే ‘కంచె’లో క్షత్రియ యువతి పాత్ర పోషించిన ప్రగ్యా జైస్వాల్ లాంటి  పర్ఫెక్షన్ తో వుంది క్షత్రియురాలి పాత్రలో తను కూడా తులానీ. తను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వివరించే ఘట్టాలతో పాత్ర పట్ల సానుభూతి రేకెత్తే విధంగా పాత్రపోషణ చేసింది. 

          ఇక స్వాతీ దీక్షిత్, సాక్షీ గులాటీలవి కూడా నీటైన పాత్రలు. సైకియాట్రిస్టుగా జయప్రకాష్ ది ఏదో చక్రం తిప్పుతున్నట్టు వుండే పాత్ర గానీ, ఏం తిప్పుతూంటాడో మనకి అర్ధం గాదు. పైగా క్లయిమాక్స్ లో అర్జెంటుగా అమెరికాలో కళ్ళముందు చూస్తున్న యాక్షన్ దృశ్యానికి తొత్తు ఒకడు ఫోన్ చేస్తే, టకటకా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసేసి, తాను ఇప్పుడే వస్తున్నానంటాడు- అమెరికా వెళ్ళడమంటే గాజువాక సెంటర్లో అర్జెంటుగా వాలిపోయే పనే అన్నట్టు.  పైగా తను అమెరికా చేరుకునే వరకూ రీళ్ళకి రీళ్ళు  క్లయిమాక్స్ జరుగుతూనే వుంటుందన్నట్టు (ఇప్పుడు రీళ్ళు లేకపోయినా ఇలాగే అనుకోవచ్చు తన తెలివి తేటలతో).  ఇంతా చేసి ఏమైపోతాడో అమెరికాకే వెళ్ళడు! 

          ఇక కామెడీ వుండాలన్నట్టు సప్తగిరీ రొటీన్ నాటు కామెడీ వుంటుంది. 
          టెక్నికల్ గా కెమెరా  వర్క్, ఆర్ట్ వర్క్ ఉన్నతంగా వున్నాయి- ఎంచుకున్న లొ కేషన్స్ , తీసిన విజువల్స్ చాలాచోట్ల కళాత్మకంగా వున్నాయి. సెకండాఫ్ నుంచి పూర్తిగా యూఎస్ లోనే వుంటుంది- అక్కడి దృశ్యాల చిత్రీకరణకి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోతే పాటల నాణ్యతే నొచ్చుకునే విధంగా వుంది. 

చివరికేమిటి 
      మంచి కథకి జరగాల్సిన న్యాయం జరగ లేదు. 2015 లో జానర్ మర్యాదని కాపాడిన తెలుగు సినిమాలే విజయాలు సాధించాయని గుర్తించిన మీదట, 2016లో జానర్ మర్యాద అవసరం గురించి ఈ బ్లాగు ద్వారా చేయాల్సిన ప్రచారమంతా చేశాం. అయితే తెలుగు సినిమాల విజయాలకి తప్పనిసరై పోతున్న జానర్ మర్యాద అనే డిసిప్లిన్ కి- ఇంకో విధంగా కూడా విఘాతం కలిగే అవకశం పొంచి వుందని  ఈ సినిమా చూస్తూంటే బోధపడుతుంది. జానర్ మర్యాదని కాపాడుతూ చిత్రీకరణ అంతా చేస్తే చాలదనీ, ఈ చిత్రీకరణకి తగిన నేపధ్యసంగీతం కూడా జతపడకపోతే జానర్ మర్యాదంతా పోతుందనీ తెలుసుకోగలుగుతాం. సంగీత దర్శకుడు సెల్వ గణేష్ స్క్రిప్టులో, పాత్రలో లీనమయ్యే నేపధ్యసంగీతాన్ని అందించకుండా రొడ్డకొట్టుడుగా వాయించుకుంటూ పోయాడు. ఈ కథ ఎంత బలమైనదో, ఒకమ్మాయి జీవితంతో  అంత సున్నితమైనది కూడా. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తున్నప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో బాజాలు మోగిస్తున్న చందాన చెలరేగిపోయాడు. చాలా వరస్ట్! నిజానికి ఈ చిత్రీకరణ చాలా వరకూ నిశ్శబ్దాన్నే డిమాండ్ చేస్తోంది. నిశ్శబ్దమే ఈ సినిమా బలం. సమయమెరిగి సంగీతదర్శకుడు కీబోర్డు కట్టేసినప్పుడే తన నేపధ్య సంగీతపు బలమేమిటో తెలుపుకోగల్గుతాడు. నిశ్శబ్దం కూడా సంగీతమే. పారితోషికం తీసుకుంటున్నాం కదా అని మొత్తమంతా వాయించుకుంటూ కూర్చుంటే సినిమానే నాశనం చేస్తాడు. ప్రేక్షకులు కథనీ, పాత్రనీ ఫీలవ్వడానికి సంగీతపరంగా ఏ మాత్రం అవకాశమివ్వలేదు. ఈ కథ మన వాకిట వాలిన పిట్ట లాంటిది. ఏ మాత్రం అలికిడి చేసినా ఎగిరిపోతుంది. 

          దర్శకుడు కూడా దీనికి బాధ్యత వహించాలి. స్క్రిప్టు రాస్తున్నప్పుడే సౌండ్ డిజైన్ తెలిసిపోతూంటుంది. సౌండ్ ని అనుభవిస్తూ  రాసినప్పుడు స్క్రిప్టు కూడా సంగీతం పలుకుతుంది. సౌండ్, కథ వేర్వేరు కాదు. సౌండ్  అంటే నేపధ్య సంగీతమే కాకుండా, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా. ఇదంతా దర్శకుడికి తెలీదని కాదు- కానీ రొటీన్ గా ఏం జరిగిపోతూందంటే, అన్ని సినిమాలకీ ఒకే మూసలో  ఆర్ ఆర్ (నేపధ్య సంగీతం) చేసేస్తున్నారు. అలాటి మూసే ప్రస్తుత ప్రయత్నం. 

          ఇక కథనంతో ఇక్కడ వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే, సకాలంలో కథని ప్రారంభించకపోవడం.  కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? హీరోయిన్ కి గతజన్మలో తానెవరో తెలిసినప్పుడు. ఇదెప్పుడు తెలిసింది? సెకండాఫ్ సగంలో. అప్పటివరకూ ఏం నడిచింది? ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ సగం వరకూ హీరోయిన్ తనకేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమే. ఒకవిధంగా ఇది ఎండ్ సస్పెన్స్ అనే సినిమాలకి పనికి రాని  కథనం. పాత్ర ఎవరో, కథేమిటో తెలియకుండా మూసి పెట్టినడపడం సస్పెన్స్ అన్పించుకోదు. ప్రేక్షకులకి సహన పరీక్ష అవుతుంది. 

          ఇలాటిదే కథ ‘బేతాళుడు’ లో హీరోకి తన గత జన్మ గురించి ఎప్పుడు తెలిసింది? ఫస్టాఫ్ సగంలో. కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? అప్పుడే – తానెవరో తెలియడం ప్లాట్ పాయింట్ వన్ అయితే- అక్కడ్నించీ ప్రారంభమైన మిడిల్ తో కథ ప్రారంభమయ్యింది. 

          ప్రస్తుత కథలో సెకండాఫ్ సగంలో కథ ప్రారంభమవడం వల్ల ఇంకేం జరిగింది? సినిమా నిడివి రెండున్నర గంటలకి చేరింది. ఫస్టాఫ్ ఉపోద్ఘాతాన్ని తగ్గించి, ఫస్టాఫ్ లో కథ ప్రారంభించి వుంటే నిడివి అరగంటకి తగ్గేది - ఈ అరగంటలో కామెడీ కోసం పెట్టిన కామెడీ కూడా కలుపుకుని. 

          థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు ఎండ్ సస్పెన్స్ సుడిగుండంలో పడే ప్రమాదాన్ని ఎల్లవేళలా కాచుకోవాల్సి వుంటుంది. ఇలాటి హీరో లేకుండా కేవలం రెండు స్త్రీ పాత్రల మధ్య జరిగే కథ నిజానికి చాలా బ్యూటీఫుల్ గా, మహిళా ప్రేక్షకులనే టార్గెట్ ప్రేక్షకుల్ని నిర్ణయించుకుని, ఆ మేరకు మార్కెట్ యాస్పెక్ట్ తో  తీసి వుండాల్సింది.

 -సికిందర్ 
http://www.cinemabazaar.in