రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 6, 2017

రివ్యూ!







రచన-  దర్శకత్వం: ఎస్‌.కె. సత్య

తారాగణం: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, సంపత్ రాజ్‌,
రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య తదితరులు
సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ రామస్వామి
బ్యానర్‌: క్లాప్స్ అండ్ విజిల్స్
నిర్మాత: శ్రీవరుణ్ అట్లూరి
విడుదల : మార్చి 3, 2017
***


       మంచు మనోజ్ కి ముచ్చటగా ఒక హిట్  అనేది హిమాలయాల ఎత్తున వుండిపోతోంది. ఎప్పుడో 2010 లో బిందాస్అనే సక్సెస్ తర్వాత వరుసగా 8 సినిమాలూ ఘోరపరాజయాలపాలయ్యాకా నైనా, తన ధోరణిలో మార్పు రావడం లేదు- సినిమా  అంటే తన దృష్టిలో ఏమిటో? సినిమాలు చూసే ప్రేక్షకుల గురించి తన అభిప్రాయమేమిటో?  సినిమా అంటే రద్దయిన పెద్ద నోట్లనీప్రేక్షకులంటే ఆ నోట్లు దగ్గరుంచుకున్న నేరస్థులనీ బెదిరిస్తూ  తన నటజీవితం రుద్దుతోంటే సినిమాలు భరిస్తున్న నేరస్థులకీ ఒక రోజొస్తుంది మనోజ్ మంచి సినిమాలు తీసి జన్మ ధన్యం చేసుకోవాలనీ ప్రార్ధించే రోజు! నేరస్థులైనా ప్రేక్షకులు శాంతికాముకులే.

          నేరాలు ఘోరాలు ఇప్పుడు టీవీలో రాకపోవచ్చు- కానీ సినిమాల రూపంలో అవి వారంవారం వస్తూనే వున్నాయి. తీసే విధానమంతా నేరమేచూపించే తీరంతా ఘోరమే. తప్పించుకునే యుక్తీ ఇంతా అంతా కాదు. 2014 లో ఏ స్థాయిలో దర్శకుడు ఎస్కే సత్య తన మొదటి ప్రయత్నం  ‘నా రాకుమారుడుతో చేశాడో, అంతకి  ఒక్క అంగుళం మించని టాలెంట్ తో   ‘గుంటూరోడుకి ప్రయత్నించడం విచిత్రం. వెనక్కి తిరిగి సుదూరంగా 1980ల నాటి కాలంలోకే చూస్తున్నంతవరకూ ఇంతే. ఆ యుగంలోకి చూస్తే టాలెంట్ తో పనుండదు, టెంప్లెట్ తో నింపెయ్యవచ్చు.  టెంప్లెట్ ని నెట్ యుగంలో కనిపెట్టారు. నెట్ యుగపు టెంప్లెట్ లోకి గడచిన వ్యాపార యుగపు స్టోరీ! 


          ‘గుంటూరోడుఇలాటి మరో టెంప్లెట్ సినిమా. విన్నర్కి నేనేం తక్కువా అన్నట్టు పోటీపడే 80 లనాటి కథతో, మారని కథనంతో  మూసఫార్ములా టెంప్లెట్ ఆమ్లెట్. వీటి వ్యవహారం ప్రేక్షకులు పసిగట్టేశారు, కాబట్టి వీటిని పాకిస్తాన్, చైనాలకి ఎగుమతి చేస్తే అక్కడి వాళ్లని  కొత్త ట్రెండ్ గా బుట్టలో వేసుకోవచ్చు - ఒకప్పుడు హాంకాంగ్ కరాటే సినిమాలు డబ్బింగ్ చేసి  మనదేశం మీదికి వదిలినట్టు.

          ఎక్స్ పోర్ట్ బ్రాండ్  గుంటూరోడు80 ల నాటి యాంగ్రీ యంగ్ మాన్ లా గుంటూరులో అన్యాయాల్ని అక్రమాల్ని  సహించడు. ఎవడైనా రోడ్డుమీద మందు తాగుతున్నాకొట్టేస్తాడు. వాడు గాల్లోకి ఎగిరి కన్పించకుండా పోతాడు. డైలాగ్ బలంతో బాటు కండబలం కూడా మెండు గుంటూరోడుకి. గుంటూరోడి  పేరు మాస్ గా కన్నా. మాస్ కన్నా అంటే కన్న తండ్రికి  పడదు.  కన్న తండ్రి చెప్పినట్టు మాస్ కన్నా మారడు. పైపెచ్చు ఒక పెద్ద కరుడుగట్టిన గూండా లాంటి లాయర్ని కొట్టేస్తాడు. ఆ లాయర్ పగబట్టి చంపడానికి వెతుకుతూంటాడు. ఆవారా మాస్ కన్నా పెళ్లి చూపులకి పోతాడు. అక్కడ వేరే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఫార్మాలిటీగా ఛీఛా అంటూ సందు చూసుకుని ఓకే అనేస్తుంది. ఈమె ఎవరంటే ఆ గూండా లాయర్ చెల్లెలే.

          ఇదీ విషయం. ఇక కన్నా పెళ్ళికి ఈ లాయరే  అడ్డు. నేను లోకల్లో పెళ్ళికి అమ్మాయి తండ్రే  అడ్డు, ‘విన్నర్లో పెళ్ళికీ  కన్నతండ్రే అడ్డు-  ఇదే టెంప్లెట్ పాయింటు తో ఇవే సినిమాలు వారం వారం వచ్చి పడ్డం తెలుగునాట  పెళ్లి పండగే! ఇంతకంటే ఏం కావాలి!

          గుంటూరోడు ఇంకా తన స్థూలకాయంతో హీరోలా కనపడకపోయినా, నాటుగా మొరటుగా నటించినా, అరిచినా అదంతా బాక్సాఫీసు మసాలే. బాక్సాఫీసుకి ఇంతకంటే గత్యంతరం లేదు. ప్రేక్షకుల కోసం ఎదురుచూసే  దౌర్భాగ్యం దానికి తప్పదు. ప్రేక్షకులు ఎవరు, మనోజ్ ఎవరు? ప్రేక్షకుల్ని మనోజ్ లీడ్ చేసే ఇంద్రచాపం లాంటి దృశ్యం  సమీప భవిష్యత్తులో కన్పించే అవకాశంలేదు- అతడికి ప్రేక్షకులతో పనిలేదు, సినిమాల తీరుతోనూ పనిలేదు- తను ఉన్నాడు కాబట్టి సినిమాలు తీయాలంతే! ప్రేక్షకుల కోసం తనూ  కాదు, తనకోసం ప్రేక్షకులూ కాదు- ఆ ప్రేక్షకులెప్పుడో సెలవు తీసుకున్నారు ఎనిమిది  వరస దెబ్బల తర్వాత!

-సికిందర్