రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2017, గురువారం

రివ్యూ!





కథ దర్శకత్వం : రాజకిరణ్ 

తారాగణం : విష్ణు మంచు, హన్సిక, తనికెళ్ళ, జయప్రకాష్, పోసాని, ప్రభాస్ శీను, సత్యం రాజేష్, ఎం వివి సత్యనారాయణ తదితరులు
 స్క్రీన్ ప్లే- మాటలు : డైమాండ్ రత్నబాబు, సంగీతం : అచ్చు రాజమణి, ప్రవీణ్ లక్కరాజు,   ఛాయాగ్రహణం : పిజి విందా
బ్యానర్:  ఎంవివి సినిమా
నిర్మాత : ఎంవివి సత్యనారాయణ
విడుదల : జనవరి 26, 2017
***
త సంవత్సరం ‘ఈడో రకం-  ఆడో రకం’ తో అంతగా సక్సెస్ ని  చవిచూడని మంచు విష్ణు,  రిపబ్లిక్ డే కి మళ్ళీ విడుదల వాయిదా పడిన ‘యముడు -3’ స్పేస్ ని ఉపయోగించు కుంటూ హడావిడిగా విడుదల తేదీని ప్రకటించుకుని ఇప్పటికిప్పుడు  ‘లక్కున్నోడు’ తో తిరిగి వచ్చేశాడు. 2015 లో ‘శంకరాభరణం’ తీసి ఫ్లాప్ నెదుర్కొన్న నిర్మాత ఎంవివి సత్యనారాయణ, ఈసారి సినిమా జాతకం ఎలా తేలినా విలన్ గా మాత్రం తను నిరూపించుకుందామని ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు పక్కన తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తూ హన్సిక వచ్చేసింది. ‘గీతాంజలి’ అనే హార్రర్ కామెడీతో వెలుగులోకొచ్చిన దర్శకుడు రాజ కిరణ్, ‘త్రిపుర’ తో ప్రతిష్ఠ మసకబారి ఇప్పుడు కామెడీతో అదృష్టాన్ని  పరీక్షించుకుందామని - అదే సమయంలో సరైన కామెడీలు తీయగల దర్శకులు ఇప్పుడున్నారా అనే ప్రశ్నకి సమాధానం కూడా చెపుదామని అన్నట్టుగా జానర్ జంప్ చేశారు. ఇన్నీ కలిసి ఈ ప్రయత్నం అనుకున్న ఫలితం రాబట్టిందా లేదా ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ
          లక్కీ ( విష్ణు) అదృష్ట జాతకుడు కాదు. చిన్నప్పట్నించీ ఏది పట్టుకున్నా కుటుంబానికి  దురదృష్టమే వెంటాడేసరికి తండ్రి భక్త వత్సలం (జయప్రకాష్) విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తల్లీ చెల్లెలు సానుభూతితోనే వుంటారు. పుట్టాక పేరు పెట్టేటప్పుడు కూడా ఆ ముహూర్తానికి లక్కీ వల్ల జరిగిన అనర్ధానికి పేరే పెట్టకుండా వదిలేస్తాడు భక్తవత్సలం. అవమానపడుతూ అలాగే పేరు లేకుండా పెరిగిన లక్కీ, హైదరాబాద్ వచ్చేస్తాడు ఫ్రెండ్ (సత్యం రాజేష్) దగ్గరికి. రాగానే ఆ ఫ్రెండ్ దివాలా తీసి వీధిన పడతాడు.

          పాజిటివ్ పద్మ (హన్సిక) అనే అమ్మాయి పరిచయమవుతుంది- ఈమె ఇంట్లో అందరూ కీడు జరిగినా పాజిటివ్ గానే ఆలోచిస్తారు. గడ్డం గీసుకునేప్పుడు చర్మం చిట్లి రక్తం వచ్చినా తండ్రి (తనికెళ్ళ భరణి) పీక తెగనందుకు సంతోషించాలని పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇల్లుపోయినా గుండాగి చావనందుకు సంతోషించాలని పాజిటివ్ గా చెప్తుంది వదిన. ఇలా పాజిటివ్ పద్మ లక్కీకి పరిచయమైనా అతడిని శని వెంటాడుతూనే వుంటుంది. తనకి రావాల్సిన ఉద్యోగం ఆమెకొస్తుంది. 

          ఇలావుండగా, చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికి వెళ్తాడు లక్కీ. అక్కడొక బాధ్యత నెత్తినేసుకుని  నగరానికి వస్తే, దురదృష్టంతన్ని చెల్లెలి పెళ్లి ఆగిపోయే గతి పడ్తుంది. దీంతో ఆత్మహత్య చేసుకోబోతూంటే, ఒక దొంగోడు (ప్రభాస్ శీను) జొరబడి డిస్టర్బ్ చేస్తాడు. ఇంకో  క్రిమినల్ వచ్చి, తన దగ్గరున్న బ్యాగు ఈ పూట వుంచుకుంటే కోటి రూపాయలిస్తానని ఆఫర్ చేసేసరికి- లక్కీ తన లక్ దారిలో పడిందని ఓకే అంటాడు- ఈ ఓకే తో అతడి కథ ఏ మలుపులు తిరిగిందో వెండి తెర మీద చూడాలి. 

ఎలావుంది కథ
          కథ పాతదే అయినా ఇదొక కుటుంబ సమస్యతో కూడిన సమంజసమైన కథ. దర్శకుడి తాజా దృష్టివల్ల ఈ కథ కొత్త ఫీల్ తో ఫన్నీగా మారింది. ఈనాటికి అవసరమైన యూత్ అప్పీల్ తో, ఒక ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనరయ్యే అవకాశాలన్నీ వున్నాయి దీనికి. దురదృష్టవశాత్తూ  ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఫస్టాఫ్ వరకే ఈ తాజాదనాన్ని ప్రదర్శించి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫస్టాఫ్ లో సున్నిత హాస్యంతో, అదుపులో వుంచిన భావోద్వేగాలతో ఒక పూర్తి  స్థాయి కామెడీ జానర్ అన్పించేట్టు చేసుకొచ్చి, ఆ  తర్వాత కథతోనూ  జానర్ తోనూ మర్యాద తప్పి, ఏదేదో గోల కామెడీ చేసేశారు. పైగా దీనికి క్లయిమాక్స్ లో రచయిత తనకు తానే ఇలా కీర్తించుకుంటాడు- “ఇది ఎంటర్ టైన్మెంట్ ఫార్ములా అనుకున్నా, రివెంజి ఫార్ములానా! వాటే స్క్రీన్ ప్లే సర్జీ!” అని ఒక పాత్ర చేత అన్పిస్తాడు- క్లయిమాక్స్ కొచ్చేసరికి  ఇది కూడా పూర్తిగా ఓ స్టేజి నాటకంలా మారిపోయి ప్రేక్షకులు లేచిపోతున్నా ... స్క్రీన్ ప్లే అనీ, ఫార్ములాలనీ అంటాడు. ఇకనైనా  సినిమాల్ని అల్లాటప్పాగా మార్చేస్తున్న ఈ ఫార్ములాల వంటకాల్ని మానుకుని, జానర్ల మాట మటాడుకుంటే స్క్రీన్ ప్లేలు బాగుపడతాయేమో.

ఎవరెలా చేశారు
          మంచు విష్ణుకి నిజానికిది  సెన్సిబుల్ పాత్ర ఫస్టాఫ్ వరకూ. తన దురదృష్టాలతో  స్ట్రగుల్ చేస్తూ ప్రతీమాటా హాస్యంగా, ప్రతీ ఆలోచనా  హాస్యంగానే వుంటూ, యూత్ అప్పీల్ తో  – బాక్సాఫీసు అప్పీల్ తో చాలా ఫ్రెష్ గా, చూపులు తిప్పుకోలేనంతగా  వుంటుంది  క్యారక్టర్. తన పాత్రని నిలబెట్టడానికి ఫస్టాఫ్ అంతా గత జీవితాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా  చెప్పడం బాగా తోడ్పడింది. కథలో ఇప్పటి వరకూ పోషించుకుంటూ వస్తున్న ఈ  కామెడీ జానర్ లోనే  ఇంటర్వెల్ కూడా-  దొంగోడితో, క్రిమినల్ తో- బాగా నవ్వొచ్చే బ్యాంగు ఇచ్చింది- ‘స్వామి రారా’ ఇంటర్వెల్ ని గుర్తుకు తెస్తూ- తర్వాతేమిటో  వెంటనే చూడలన్నంత ఉత్కంఠని రేకెత్తిస్తూ. ఇలా సెకండాఫ్ మీద ఆసక్తి రేపే ఇంటర్వెల్ ‘స్వామిరారా’ తర్వాత మళ్ళీ ఇదే. నైస్ క్రియేషన్ క్రియేటివిటీతో. 

          దీన్తర్వాత తద్దినం పెట్టడం మొదలయ్యింది తన పాత్రకి. ఆ జీవితం, ఆ హాస్యం ఎటుపోయాయో,  ఆ ఫస్టాఫ్ ఫన్ ఎటుపోయిందో, అసలు కథ వదిలేసి కొసరు సీరియస్ యాక్షన్ కథ పట్టుకుని –కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టయి పోయింది. ఆ గోదారిలో నీళ్ళు కూడా లేవు. పోలవరం వెళ్ళినా పనిజరిగేట్టు లేదు, అప్పటికి స్టేజి నాటకమైపోయింది. పాటలూ ఫైట్లూ బాగానే చేసినా అవి కథలో, పాత్ర చిత్రణలో కలిసిపోయి వుంటేనే ఎవరికైనా తదనుగుణ హుషారు తెప్పిస్తాయి- లేకపోతే వూరికే శబ్ద కాలుష్యాన్నే సృష్టిస్తాయి. 

          పాజిటివ్ పద్మగా హన్సిక ఫస్టాఫ్ ఫన్నీ క్యారక్టర్ కాస్తా- సెకండాఫ్ లో పాత్రకి పనిలేక క్లయిమాక్స్ కి దర్శనమిస్తుంది. ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ఫ్రెష్ కామెడీని అందించారు. తండ్రి పాత్రలో జయప్రకాష్ ఒక్కడే  సీరియస్ గా వుంటాడు. కథలో మిగతా పాత్రలన్నీ హాస్యంగా మాటాడేవే. ఇక విలన్ గా వేసిన నిర్మాత సత్యనారాయణ, బలమైన విలన్ గా నటించి తన నటనాభిలాషకి న్యాయం చేసుకున్నారు. తెలుగు విలన్లు కరువైన ఈ రోజుల్లో తను ప్రకాశించ వచ్చు.

          పాటల గురించి చెప్పుకోవడానికేమీ లేదుగానీ, పిజి విందా ఛాయాగ్రహణం అత్యంత కలర్ఫుల్ గా వుంది. డైమండ్ రత్నబాబు రాసిన మాటలు, స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకే సినిమాకి పనికొచ్చాయి. ఫస్టాఫ్ లో తను ఇంతకి  ముందు లేని క్రియేటివిటీతో ఆశ్చర్య పర్చాడు. సెకండాఫ్ కథనేం చేసుకోవాలో అర్ధంగాక కలగాపులగం చేసేశాడు.

చివరికేమిటి
          ఒక మంచి ఫన్నీ  ఫ్యామిలీ డ్రామా, నవంబర్ ఎనిమిదిన దేశంలో ఏం జరిగిందో,  అలా ఇంటర్వెల్ తర్వాత  చెల్లని చిత్తు కాగితమైపోయింది. కొత్త నోట్ల దోపిడీతోనే ఈ కథ మొదలవుతుంది గానీ, ఈ కొత్త నోట్ల కొసరు కథే  సెకండాఫ్ లో అసలు కథై కూర్చుంది – దోపిడీ దొంగల రొటీన్ తో. ఫ్యామిలీలో అంత పనికొచ్చే ప్రాబ్లమ్స్ తో అసలు కథని వదిలేశారు. ఇంటర్వెల్ కి హీరో చుట్టూ చాలా వ్యక్తిగత సమస్యలుంటాయి. దురదృష్ట జాతకుడుగా తండ్రి తో సంబంధాలు పూర్తిగా చెడిపోయి ఒక నింద మోస్తాడు, చెల్లెలి పెళ్లి ప్రమాదంలో పడి, మరో వైపు హీరోయిన్ కూడా చీదరించుకుని చాలా దయనీయ పరిస్థితిలో హీరో పడతాడు.  పాత్రకి బలమైన ఎమోషన్, ఆ ఎమోషన్ తాలూకు గోల్, శత్రువులా వెంటాడే దురదృష్టం...కానీ వీటితో ఏనాడూ కోల్పోని ధైర్యం, చాలా హాస్యప్రియత్వమూనూ...

          ‘భలే భలే మగాడివోయ్’ లో ఇలాటిదే లోపముంటుంది హీరోకి- మతిమరుపనే లోపం. దీంతో  ప్రేమలో చివరంటా దేకుతూ వుంటాడు నవ్వుపుట్టిస్తూ. విష్ణు పాత్రకి కూడా అంతర్గత శత్రువులా వెంటాడే దురదృష్టం అనే లోపం పుట్టుక నుంచీ వుంది- కానీ ఇంటర్వెల్ తర్వాత పాత్ర దీన్నుంచి తెగిపోవడంతో  తెగిన గాలిపటంలా అయిపోయింది.

           దర్శకుడు రాజకిరణ్ కామెడీ జానర్ ని ప్రయత్నించడం మంచిదే. కానీ కామెడీ జానర్ లో దీన్ని ఫ్యామిలీ కామెడీ చేయాలనుకున్నారా, రొటీన్ గా అరిగిపోయిన పనికి రాని  యాక్షన్ కామెడీ చేయాలనుకున్నారా స్పష్టత తెచ్చుకోవాల్సింది. స్పష్టత లేకుండా రెండూ కలిపేస్తే కలవవు. పైగా ఏది అసలు కథ, ఏది కొసరు కథ అన్న స్పష్టత కూడా లేకపోతే ఏం చెప్పాలనుకున్నారో తెలియకుండా పోతుంది. 

          చివర్లో కొడుకు మీద తండ్రి అభిప్రాయం మారడానికి వేసిన సీను ఫస్టాఫ్ లాంటి సీన్లలాగా అర్ధవంతంగా వుందా?  కాబోయే మతిమరుపు వియ్యంకుడు హీరో ఇచ్చిన డబ్బు తీసుకుని మర్చిపోతాడని ప్రేక్షకులకి అప్పుడే తెలిసిపోయేలా లేదూ?  కథలో ఒక సమస్య ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో ఎంత  గోప్యత, సస్పన్స్  పాటించాలి?  ఆ డబ్బు తీసుకుని అతను మర్చిపోవడమే హీరో చెల్లెలి పెళ్లి కొచ్చిన కష్టం. 

          తనకెంత మతిమరుపున్నా పాతిక లక్షలు తీసుకున్న విషయం మర్చిపోయేంత మతిమరుపు కాదంటాడు కాబోయే వియ్యంకుడు. ఆ డబ్బు హీరో చేతిలో ఎక్కడ మిస్సయి  ఎక్కడ దొరికిందో సాక్ష్యాలుండగా ఆ సంగతి ఎందుకు చెప్పడు హీరో తండ్రితో? చెప్తే  ఇక్కడితో కథ అయిపోతుందనా?  చటుక్కున కథ అయిపోయే విధంగా సమస్య ఎందుకు ఏర్పాటు చేయాలి?  ‘శతమానం భవతి’ లో ఇదే జరిగిందిగా? ఇంత జరిగాక చివరి సీనులో ఇదే వియ్యంకుడు,  డబ్బు తీసుకున్న విషయం మతిమరుపు వల్ల  మర్చిపోయానని తనే ముందు కొచ్చి ఎలా అనేస్తాడు? అతనే ప్రాబ్లం క్రియేట్ చేసి అతనే క్లియర్ చేస్తే, ఇక హీరో ఎందుకు? కథలో అతను చేసే దేమిటి?

          సస్పెన్స్ అన్నది క్రైం, మర్డర్, హార్రర్, యాక్షన్ మొదలైన కథల్లోనే వుంటుందని అనుకోవడం వల్ల, ఫ్యామిలీ కథలకీ ప్రేమల కథలకీ ఇలాటి తిప్పలు తప్పడం లేదు. సస్పెన్స్ అనేది ప్రతీ జానర్ కీ ప్రాణం. కాబోయే వియ్యంకుడికి మతి మరుపని అసలు ముందు  చెప్పకుండా, డబ్బు తీసుకుని తిరగబడ్డాక – ఆ  క్యారక్టర్ ని వ్యవహారం కంటిన్యూ చేస్తూ- అంచెలంచెలుగా మతిమరుపు లక్షణాల్ని ఓపెన్  చేస్తూ- చివరికి ఈయనకి మతిమరుపని హీరో పట్టుకుని నాల్గు దులిపితే బావుంటుందా- అమ్మో అది సస్పెన్స్,  అలా వుం డకూడదని- ఏర్పాటు చేసిన ప్రాబ్లంలో ఎలిమెంట్స్ ని కిల్ చేసుకుని, తెలిసిపోయేలా కథ నడిపితే బావుంటుందా ఆలోచించుకోవాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in