స్క్రీన్ ప్లే-
దర్శకత్వం : రాహుల్ ఢొలాకియా
తారాగణం : షారుఖ్ ఖాన్, మాహిరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, షా మహ్మద్ జీషాన్ ఆయూబ్, షీబా చద్దా, అతుల్ కులకర్ణి, సన్నీ లియోన్ తదితరులు
రచన : రాహుల్ ఢొలాకియా, హరిత్ మెహతా, ఆశీష్ వశి, నీరజ్ శుక్లా
సంగీతం : రామ్ శుక్లా, ఛాయాగ్రహణం : కె యు మోహనన్
బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రీతేష్ సిధ్వానీ, ఫర్హాన్ ఖాన్, గౌరీ ఖాన్
విడుదల : జనవరి 25, 2017
***
సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘రయీస్’ తో వూరించీ వూరించీ
రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీసుకి చేరుకున్నాడు. పాకిస్తానీ హీరోయిన్ మాహిరా
ఖాన్ తో రచ్చ జరిగీ జరిగీ క్షేమంగా బయటపడి బాక్సాఫీసు దగ్గర తేల్చేద్దామని
ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందు కొచ్చింది ‘రయీస్’. ‘పర్జానియా’ తో జాతీయ
అవార్డు పొందిన దర్శకుడు రాహుల్ ఢొలాకియా తిరిగి గుజరాత్ కథనే చెప్పాలనుకుని
‘రయీస్’ కి తెరతీశాడు. రిపబ్లిక్ డేకి షారుఖ్ ‘రయీస్’ తో బాటు హృతిక్ రోషన్ ‘కాబిల్’
కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి దిగింది. తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్లు నువ్వా
నేనా అన్నట్టు సంక్రాంతి బరిలోకి దిగినట్టు- అసలే ఆసక్తికరంగా మారిన రయీస్- కాబిల్ ల అమీతుమీలో మొదటిది జాతి వ్యతిరేకమనీ, రెండోది
దేశభక్తియుతమనీ, రెండో దానికే జైకొట్టాలనీ
బిజెపి నేత నిప్పు రాజెయ్యడంతో, ఇదేంటో చూద్దామని ప్రేక్షకులు పనిగట్టుకుని బిజీ
అయిపోయారు. కొందరు నేతలు బాక్సాఫీసులు కళ కళ లాడేట్టు చేయడానికే పుడతారు!
కథ
1970- 90 ల మధ్య కాలంలో
గుజరాత్ లోని ఫతేపూర్ లో జరిగే కథ. గాంధీ
పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్య నిషేధం అమల్లో వున్నా, నాటు సారా తయారీ, అమ్మకపు సిండికేట్లు యదేచ్ఛగా కొనసాగుతున్న రోజులవి. పేద కుటుంబంలో
పుట్టి పెరిగిన రయీస్ (షారుఖ్ ఖాన్) చిన్నప్పుడు తల్లి (షీబా చద్దా) చెప్పిన మాటల్ని
బాగా వొంటబట్టించుకుంటాడు. ఏ దందా
(బిజినెస్) కూడా దేనికంటే తక్కువది కాదనీ, అలాగే ఏ దందా కంటే కూడా మతం గొప్పది కాదనీ
చెబుతుంది తల్లి. మొదటి ‘నేరం’ గాంధీ
విగ్రహానికున్న కళ్ళద్దాల్ని దొంగిలించడంతో చేస్తాడు. అతడికి చిన్నప్పుడే దృష్టి
లోపం. కళ్ళజోడు అరువు మీద ఇస్తానని పార్సీ వైద్యుడు అన్నా, ఆత్మాభిమానంతో అప్పు తీసుకోదు రయీస్ తల్లి.
దాంతో గాంధీ కళ్ళద్దాలు దొంగిలిస్తాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జైరాజ్ (అతుల్ కులకర్ణి) అనే బనియా (వ్యాపారి) గ్యాంగ్ లో చేరతాడు.
జైరాజ్ తనకి బనియా బుర్ర కి తోడూ ముసల్మాను ధైర్యం కూడా వుందని ఉబ్బి తబిబ్బు
అవుతూంటాడు. సారా స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ దందాలు నిర్వహిస్తూంటాడు. పోలీసులు
ఇతడితో చేతులు కలుపుతారు. పెద్దయ్యాక రయీస్ కి సొంత దందా
మొదలెట్టుకోవాలన్పిస్తుంది. దీంతో జైరాజ్ తో తేడా వస్తుంది. మూసా (నరేంద్ర ఝా) అనే
ఇంకో సారాకింగ్ తో స్మగ్లింగ్ దందా మొదలెడతాడు. చూస్తూండగానే తనే డాన్ అయిపోతాడు.
పేద ప్రజలకి నాయకుడు అవుతాడు (రయీస్ అంటే నాయకుడు
లేదా గొప్ప వాడు అని అర్ధం). ఒక ప్రతిపక్ష పార్టీ మొదలెట్టిన “యాత్ర” ని శాంతి
భద్రతల దృష్ట్యా అడ్డుకుని ప్రజల్లో మరింత అభిమానం సంపాదించుకుంటాడు. సీఎం
దృష్టిలో పడతాడు. సీఎం తన దందాలకి, రాజకీయాలకీ
వాడుకోవడం మొదలెడతాడు. తేడా వచ్చి జైల్లో పడేస్తాడు. జైల్లోంచే ఎమ్మెల్యేగా
గెలిచి వస్తాడు రయీస్. ఇప్పుడు ప్రజాబలంతో తిరుగు లేని నాయకుడైన రయీస్ చరిత్రని
ఎలాగైనా ముగించాలని సీఎం అదే ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలుపుతాడు...
ఈ కథలో ఇంకా రయీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆసియా (మాహిరా ఖాన్) వుంటుంది, రయీస్ ఏకైక అనుచరుడు సాదిక్ (షా మహ్మద్ జీషాన్ ఆయూబ్) వుంటాడు. ఇంకా రయీస్ దందాలు ఖతం చేయాలనుకుని ప్రయత్నించే ఎసిపి జైదీప్ అంబాలాల్ మజ్ముదార్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) వుంటాడు.
ఎలావుంది కథ
ఇది అప్పట్లో గుజరాత్ అండర్ వరల్డ్ డాన్ అబ్దుల్ లతీఫ్ నేరచరిత్ర ఆధారంగా తీసిన కథ అని తెలిసిందే. కాకపోతే ఆ నేరచరిత్రని వున్నదున్నట్టుగా సినిమాగా తీయడం సాధ్యం కాదు- తీస్తే గొడవలవుతాయి. కాంగ్రెస్ పార్టీ పరువు మళ్ళీ పోతుంది, బిజెపి ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది. లతీఫ్ వల్లే గుజరాత్ లో కాంగ్రెస్ భూస్థాపితమైంది, లతీఫ్ వల్లే గుజరాత్ లో బిజెపి తిరుగులేని పార్టీ అయింది. పార్టీల విషయం అలావుంచితే, కరుడు గట్టిన నేరస్థుడు లతీఫ్ జీవితం ఎవరికీ ఆదర్శం కాదు సినిమాగా తీయడానికి. కనీసం అతడిలో హాజీ మస్తాన్, వరదరాజన్ ల లాంటి పూర్వపు ముంబాయి డాన్ లలో వున్న దయాగుణం లేదు- లౌకిక తత్త్వం లేదు. అతను దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపిన మతోన్మాది, టెర్రరిస్టు కూడా. సారా దందాతో ప్రారంభమయ్యాడు లతీఫ్. అల్లా రఖా
గ్యాంగులో చేరి గాంబ్లింగ్ డెన్లు నడిపాడు.
అల్లా రఖా నుంచి విడిపోయి సొంత దందా నడుపుకుంటూ స్మగ్లర్లతో, క్రిమినల్స్ తో,
పోలీసులతో, రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ వెన్ను దన్నులతో బలవంతపు
వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు మొదలెట్టాడు. మరోవైపు దావూద్ ఇబ్రహీంతో గ్యాంగ్
వార్స్ మొదలెట్టాడు.
తన
గ్యాంగులో మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళనే చేర్చుకునే వాడు. మైనారిటీ పేదలకే
సాయపడేవాడు. ఆ విధంగా తను మైనారిటీ వర్గానికి పెద్ద దిక్కు అన్నట్టు
ప్రవర్తించేవాడు. మైనారిటీ వర్గంలో తగినంత ఓటు బ్యాంకు నిర్మించుకుని, 1986-87 లో
అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఐదు
వార్డుల్ని గెల్చుకున్నాడు. ఆ సమయంలో జైల్లో వున్నాడు.
కానీ
అతడి ఎన్నికని కోర్టు కొట్టేయడంతో అతడి
రాజకీయ జీవితం అక్కడే సమాప్తమైంది. అయినా మైనారిటీల్లో అతడికున్న పట్టు చూసి
కాంగ్రెస్ నేతలు దగ్గరవసాగారు. తాము ఎన్నికలు గెలవడానికీ, ప్రత్యర్ధుల్ని
ఎదుర్కోవడానికీ అతడితో చేతులు కలిపారు. కాంగ్రెస్ లో అతడి పలుకుబడి ఎంతగా
పెరిగిందంటే, తన చిన్న నాటి స్నేహితుడు హసన్ లాలాని గుజరాత్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిపారేశాడు.
1980 లలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం
లతీఫ్ ని దింపింది. ఆ ఆందోళనని అతను
మతకలహాలుగా మార్చేశాడు. అక్కడ్నించీ రాష్ట్రంలో ఎక్కడ మతకలహాలు జరిగినా
అందులో అతడి గ్యాంగులు వుండేవి. మెజారిటీ వర్గ ప్రజలే చనిపోయేవారు. దీంతో రాష్ట్రంలో,
ముఖ్యంగా అహ్మదాబాద్ లోని మెజారిటీ వర్గ ప్రజలు అతడి నుంచి తమని కాపాడే నాయకుడి కోసం ఎదురుచూసే
వాళ్ళు.
లతీఫ్ బలం గురించి తెలుసుకున్న దావూద్ ఇబ్రహీం కూడా అతడితో సంధి చేసుకున్నాడు. దీంతో 1992 లో వాడుకోవడానికి ఏకే ఫార్టీ సెవెన్లు చేతికొచ్చాయి. ఒక జిమ్ ఖానాలో త్రివేదీ అనే వ్యక్తిని చంపిరమ్మని ఏకే ఫార్టీ సెవెన్లు ఇచ్చి గ్యాంగుని పంపిస్తే, వాళ్ళు త్రివేదిని గుర్తు పట్టక పోవడంతో, అక్కడున్న వాళ్ళందర్నీ కాల్చెయ్య మన్నాడు లతీఫ్. ఆ విచ్చలవిడి కాల్పులకి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహ్మదాబాద్ నగరం ఈ దుశ్చర్యకి వణికిపోయింది.
అక్కడ్నించీ లతీఫ్ టెర్రర్ కి హద్దులేకుండా పోయింది. 1993లో ముంబాయి పేలుళ్లు జరిపిన దావూద్, లతీఫ్ సాయం తీసుకోకపోయినా, గుజరాత్ లో మాత్రం లతీఫ్ మెజారిటీ వర్గానికి టెర్రర్ గా మారిపోయాడు. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. 1995 ఎన్నికల ప్రచారంలో బిజెపి లతీఫ్ టెర్రర్ ని ప్రధానాంశం చేసి, అతణ్ణి జైల్లో వేస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ ఇక ఎప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బతిని పోయింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లతీఫ్ ని పట్టుకుని జైల్లో వేసింది. రెండేళ్ళ తర్వాత అతను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంటూ ఎన్ కౌంటరయ్యాడని వార్తలొచ్చాయి...
***
ఇలా వున్న లతీఫ్ నేరచరిత్రని రయీస్ కథగా సినిమాగా తీసినప్పుడు అతనో గొప్పవాడుగా చిత్రించారు. హిందూ ముస్లిం ఎవరూ ఆకలితో వుండరాదన్న డైలాగులు పలికించి సెక్యులర్ గా మార్చేశారు. తెలియకుండా తను బాంబు పేలుళ్ళకి కారకుడయ్యాడ ని తెలుసుకుని, నిష్కృతిగా పోలీసు చేతిలో మరణాన్ని కోరుకున్న మహోన్నతుడిగా గ్లామరైజ్ చేశారు.
ఒక క్రిమినల్ నేర చరిత్రని షారుఖ్ కోసం గ్లామరైజ్ చేశారా, లేకపోతే ప్రపంచానికి తెలిసిన ఆ క్రిమినల్ నేర చరిత్ర తప్పని షారుఖ్ నుపయోగించుకుని చెప్పాలనుకున్నారా అర్ధంగాదు. కానీ రెండూ తప్పుగానే కన్పిస్తాయి. పైగా ఆ ఏదోవొకటి చెప్పడంలో కూడా రచయితలకీ, దర్శకుడికీ, షారుఖ్ కీ ఎవరికీ కమిట్ మెంట్ గానీ, అవగాహనగానీ లేవని తెలిసిపోతూంటుంది. చాలా తమాషాగా నేరచరిత్రని ఫిక్షన్ చేశారు. ఇది మాత్రం అర్ధం పర్ధం లేని క్రియేటివిటీ అని అర్ధమైపోతుంది... ఎంతగా నంటే, నవ్వొచ్చే విధంగా!
ఎవరెలా చేశారు
1975
లో సలీం- జావేద్ లు రాసి, యశ్ చోప్రా తీసిన ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ పాత్రతో
గానీ, 1987 లో మణిరత్నం తీసిన ‘నాయకన్’ లో
కమల్ హాసన్ పాత్రతోగానీ పోలికలేని పాత్ర షారుఖ్ ఖాన్ నటించాడు. హాజీ మస్తాన్,
వరదరాజన్ ముదలియార్ ల పాజిటివ్ డాన్ ల పాత్రలు అమితాబ్, కమల్ లవి. ఈ పాత్ర
చిత్రణలకి అంతర్జాతీయంగా కూడా ఎన్నో పేరుప్రఖ్యాతు లొచ్చాయి. అబ్దుల్ లతీఫ్
నెగెటివ్ డాన్ పాత్ర షారుఖ్ ది. నెగెటివ్ ని పాజిటివ్ గా మార్చినా, ఈ
పాజిటివిజంలోనూ సారా అమ్ముకునే పాత్రగా షారుఖ్ స్థాయికి తగని యాంటీ హీరో పాత్రయి
పోయింది. సారా అమ్మడం, చంపడం, చివరికి చచ్చిపోవడం బాక్సాఫీసు అప్పీల్ కి తగని
వ్యవహారమైపోయింది. పూర్తిగా డార్క్ షేడ్స్ తో, డార్క్ మూడ్ ని క్రియేట్ చేసే
వాతావరణంతో ఈ పాత్ర అభిమానులతో, రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియెన్స్ తో ఎలా వర్కౌట్
అవుతుందనుకున్నారో ఏమో. షారుఖ్ నుంచి వాళ్ళు ఆశించేది గ్లామరస్ కమర్షియల్ ఎంటర్
టైనర్ అనుకుంటాం. మైనారిటీల ఇమేజిని పెంచడానికి షారుఖ్ వరసగా మైనారిటీ పాత్రలు పోషిస్తున్నాడని ఇప్పటికే విమర్శ వుంది.
గాంధీ పుట్టిన రాష్ట్రంలో లతీఫ్ సారా అమ్మడమే
తప్పు. ఆ తప్పుని షారుఖ్ గ్లామరైజ్ చేస్తే అది మైనారిటీల ఇమేజిని పెంచడమెలా
అవుతుందో అర్ధంగాదు. ఒక సూపర్ స్టార్ గా ఏవొక వర్గ కొమ్ము కాస్తున్నట్టూ తను
కన్పించకూడదసలు.
ఇక
ఈ పాత్రలో షారుఖ్ ఎలా నటించాడన్న ప్రశ్నే తలెత్తదు. పాత్రల్లో ఆదర్శ పాత్ర, మంచి
పాత్ర, అమాయక పాత్ర, దుష్ట పాత్ర మొదలైనవి చాలా వుంటాయి. ఇలాటి దుష్ట పాత్రలో సూపర్ స్టార్ ఎలా నటించాడో చెప్పడానికేమీ
వుండదు- దుష్ట (విలన్) పాత్రలేసే నటుడెవరైనా ఈ పాత్ర పోషించి వుంటే చెప్పుకోవడానికి చాలా వుండేది-
ఇరగ దీశాడని, విరగబూశాడని! ఇప్పుడు మనం షారుఖ్ ని పొగిడితే రేపు ఇంకో స్టార్ ఇలాటి
పాత్ర వేస్తాడు.
ఎన్నో వివాదాలకి కారణమైన హీరోయిన్ మాహిరా ఖాన్ కూడా కథ ప్రకారం ‘80ల నాటి పాత్రలోనే కనిపిస్తుంది. ఈ పురాతన పాత్రలోనే ఇంకే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కన్పించినా ఈలలు పడేవి. మాహిరా ఇలా కూడా ప్లస్ కాలేకపోయింది. ఈమెతో ఇంత నిస్తేజంగా సీన్లు వెళ్లిపోతూంటే, కోరి ఈమెని ఎందుకు పెట్టుకుని కష్టాలు తెచ్చుకున్నట్టో! పాత్ర కూడా షారుఖ్ బయట ఏం చేసినా ఆమోదించేలా వుంటుంది. ఒక సన్నివేశంలో కొట్ట బోతాడు- అప్పుడైనా వాకౌట్ చేస్తే పాత్ర యాక్టివ్ అయ్యేది. ప్రేమించడంలో, భార్యగా బ్రతకడంలో, పిల్లాణ్ణి కనడంలో వున్న మెళకువలు ఈ తరానికి నేర్పుతున్నట్టు వుంటుంది.
ఎసిపి గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంకో వృధా అయిన టాలెంట్. షారుఖ్ కి వ్యతిరేక పాత్రగా తను చేసేదేమీ వుండదు- చివర్లో వచ్చి రెండు గుళ్ళు పేల్చి చంపడం తప్ప. షారుఖ్ అంతు చూసేందుకు ముఖ్యమంత్రికే విలనీ పెరిగిపోవడంతో – అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ తో సింగిల్ లైన్ పంచ్ డైలాగులు కొట్టడమే నవాజుద్దీన్ నమ్మిన కార్యక్రమమై పోయింది.
ఈ సినిమాకి సరైన సంగీతం ఇద్దామని సంగీత దర్శకుడుకి కూడా కమిట్ మెంట్ లేదు, రెమ్యునరేషన్ తాలూకు అగ్రిమెంట్ తప్ప. పాట వచ్చినప్పుడల్లా బి గ్రేడ్ సినిమా పాట చూస్తున్నట్టు వుంటుంది. ఏం మ్యూజిక్ కొట్టాడో ఎంతకీ అర్ధంగాదు. కెమెరా మాన్ కూడా- కానీ కెమెరా మాన్ దర్శకుడు కోరుకున్న రెగ్యులర్ కమర్షియల్ లుక్ కాని డార్క్ మూడ్ కెమెరా వర్కే చేశాడు కథ ప్రకారం. రిచ్ లుక్ అన్నమాటకి తావే లేదు.
ఇరుకు గల్లీలు, పాత ఇళ్ళు, బస్తీ జనం- సారాబట్టీలు, సీసాలూ - వీటితో కళా దర్శకత్వం కథా కాలానికి తగ్గట్టే వుంది. కానీ అప్పటి కథాకాలం ఇప్పుడెవరికి అవసరం, ఫ్రెష్ గా ఇప్పుడు జరుగుతున్న కథలు కాక!
చివరికేమిటి
‘కబాలీ’
ని చూసి ఎంత నవ్వొచ్చిందో, ‘రయీస్’ నీ చూస్తే అంతే నవ్వొస్తుంది. ఈ రెండిటి
దర్శకులూ సమాంతర సినిమా ప్రేమికులే. సమాంతరం
నుంచి అమాంతంగా కమర్షియల్ గా రూపాంతరం చెందాలని సూపర్ స్టార్స్ నే బలిచేశారు.
‘కబాలీ’ తీసిన పా. రంజిత్ గతంలో ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ అనే రెండు సమాంతర సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. చాలా పూర్వం కమర్షియల్ సినిమాలనుంచి ఆర్ట్ (సమాంతర) సినిమాల్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు ప్రేక్షకులు. ఇప్పుడా ఆర్ట్ సినిమాలు చచ్చి పోయాయనుకుంటున్నారు. అవి బతికే వున్నాయి. కాకపోతే గుర్తు పట్టలేకుండా క్రాసోవర్, మల్టీ ప్లెక్స్, ఇండీ ఫిలిమ్స్ రూపాల్లో. ఈ స్కూలు నుంచి వచ్చిన రంజిత్, రజనీకాంత్ తో ‘కబాలీ’ అనే బిగ్ కమర్షియల్ తీస్తే, అది ఇందుకే అలావుంది- ఏ కథా లక్షణాలూ లేకుండా.
రాహుల్ ఢొలాకియాది డాక్యుమెంటరీల పోర్టుఫోలియో. మూడు డాక్యుమెంటరీలు తీశాక, ఒక ‘పర్జానియా’ అనే సమాంతరం తీసి జాతీయ అవార్డు తీసుకున్నాడు. ఆ ‘పర్జానియా’ 2002 గుజరాత్ అల్లర్లలో తప్పిపోయిన పార్సీ బాలుడి కథ. ఇలాటి పోర్టుఫోలియోతో ఇప్పుడు షారుఖ్ లాంటి సూపర్ స్టార్ తో ‘రయీస్’ తీస్తే, ఇది ‘పెద్ద పర్జానియా’ అయింది, అంతే.
సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు. కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది ఈ సినిమాలు చూడలేక. స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు. ఎందుకంటే ఈ దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. ఈ లెక్కన కొంత కాలం పోయాక, ఓ షార్ట్ ఫిలిం చూసి ఆ టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు.
కమర్షియల్ గా ఏ కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ గణరాజ్యాల్ని ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. ‘రయీస్’ కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ. గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి.
ఇలా సమాంతర ‘రయీస్’ కి ఒక పాయింటు అంటూ వుండదు, ఫలితంగా సంఘర్షణ కూడా వుండదు. ఒక్కో ప్రత్యర్ధితో ఒక్కో సమస్య పుట్టినప్పుడల్లా దాన్ని అణుస్తూ పోవడమే జరుగుతూంటుంది. ఎపిసోడ్లు గా కథనం సాగుతూంటుంది. అఆ అంటూ మొదలెట్టి అం అః వరకూ అదే వరస. కమర్షియల్ కథలు ‘అఆ’ అంటూ మొదలెట్టినా ‘ఋ’ దగ్గరో, ‘ఎ’ దగ్గరో పాయింటు కొచ్చి, దాంతో పోరాడి ‘అం అః’ అన్పిస్తాయి. రయీస్ రాగం తీయడమే గానీ పల్లవే అందుకోదు. చిన్నప్పటి కథ పూర్తి చేయడానికే చాలా సమయం తీసుకుంటుంది. పెద్దయ్యాక జైరాజ్, మూసా, ఎసిపి, సీఎం ఇలా ప్రత్యర్ధులు ఒకరితర్వాత ఒకరు వస్తూంటారు. ఇందరు విలన్లతో కథేమిటో అర్ధంకాదు, మొదలు కాదు. ఎసిపి నాంకే వాస్తే వుంటాడు, సీఎం విలన్ పార్టు అందుకున్నా క్లయిమాక్స్ లో అతను కూడా వుండడు – ఎవరో అదృశ్య విలన్ వుంటాడు. ఉన్న వాళ్లతో కథ కుదరడం లేదన్నట్టు అదృశ్య విలనెవరో వుంటాడు. తను స్మగ్లింగ్ చేస్తున్నవి బాంబులని తెలియకుండా రయీస్ సరఫరా చేస్తే, నగరంలో పేలుళ్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. వాటిని ఎవరికి పంపాడో కూడా రయీస్ కి తెలీదు. ఆ పేలుళ్ళకి తనే కారణమని ఎన్ కౌంటర్ అయిపోవడానికి సిద్ధ పడతాడు. ఒక పాసివ్ క్యారక్టర్ లా కథ ముగించుకుంటాడు. ఆ శత్రువెవరో వాణ్ణి పట్టుకుని చంపి లొంగి పోవచ్చుగా? ‘వాణ్ణి’ ఎందుకు వదిలేశాడు? ‘వాణ్ణి’ పట్టుకుంటే వున్న మాహిరా ఖాన్ తో కష్టాలు కాక, మరిన్ని కష్టాలు చుట్టుకుంటాయనేమో!
చాలా కన్వీనియెంట్ గా కథలో ‘వాణ్ణి’ లేకుండా చేశారు. కానీ లతీఫ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం స్పష్టంగా వున్నాడు. వీళ్ళ గ్యాంగ్ వార్స్ ని ఆపాలని, 1989 నవంబర్ లో దుబాయిలో ఒక మత పెద్ద ఇద్దర్నీ కూర్చోబెట్టి, మతగ్రంధం మీద ప్రమాణం చేయించాడు- కొట్టుకోకుండా కలిసి పనిచేసుకోవాలని!
లతీఫ్ నేరచరిత్రలో ఇది కీలక ఘట్టం. కానీ రయీస్ ని గొప్పవాడుగా చిత్రించే పనిలో దీన్ని పక్కన పెట్టారు. ఇందుకే కథకి కేంద్ర బిందువైన పాయింటు అంటూ లేకుండా పోయింది. దర్శకుడి పోర్టు ఫోలియో ప్రకారం చూసినా తన సమాంతర ధోరణికి కేంద్ర బిందువు వుం టుందని కూడా తట్టే అవకాశం లేదు. ఇందుకే సంబంధంలేని సంఘటనలు ఒకదానివెంట ఒకటి వచ్చేస్తూంటాయి. ఫస్టాఫ్ లో "యాత్ర" తీస్తే అదే అంతిమ యాత్రవుతుందని హెచ్చరించడం, ఆ యాత్రని శాంతియుతంగా అడ్డుకోకుండా, హింస ద్వారానే అడ్డుకోవాలన్నట్టు పెట్రోలు సీసాలతో ఆ ప్లానింగ్ అంతా ముందే చేసుకుని హింసకే పాల్పడడం నవ్వు తెప్పిస్తుంది. “యాత్ర” తీస్తే శాంతిభద్రతలు దెబ్బ తింటాయన్న వాడే ఇలా ప్రవర్తిస్తాడు. ఇక సెకండాఫ్ లో అలా జైలు కెళ్ళి ఇలా ఎన్నిక గెల్చి వచ్చేసే ఎపిసోడ్ అతిబలహీన కమర్షియలేతర చిత్రణ పాటతో కలుపుకుని. చాలా పాత సినిమాల్లో చూస్తూంటాం ఇలాటిది. ఇంకా ఆ వెంటనే 2002 గుజరాత్ అల్లర్లు, ఆ వెంటనే 1993 ముంబాయి బాంబు పేలుళ్లు- ఇలా తేదీలు కూడా ఫాలో అవకుండా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయాలనుకున్నారు. కాస్త ధైర్యం చేయడం, అమ్మో ‘వాడు’ న్నాడు మనకెందుకని వెనక్కి తగ్గడం - ఈ డైనమిక్సే గత్యంతరం అయ్యాయి స్ట్రక్చర్ లేని స్క్రీన్ ప్లేకి. కాసేపు లతీఫ్- కాసేపు కటీఫ్, ఇంతే.
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in