రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జనవరి 2017, ఆదివారం

రివ్యూ!




దర్శకత్వం : సంజయ్ గుప్తా 



తారాగణం : హృతిక్ రోషన్, యామీ గుప్తా, సురేష్ మీనన్, రోణిత్ రాయ్, రోహిత్ రాయ్, సాహిదుర్ రెహ్మాన్, గిరీష్ కులకర్ణి, నరేంద్ర ఝా తదితరులు 

రచన : సంజయ్ మాసూమ్, విజయ్ కుమార్ మిశ్రా 

సంగీతం : రాజేష్ రోషన్,  సలీం- సులేమాన్ 
ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, ఆయనంకా బోస్ 
బ్యానర్ : ఫిలిం క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రై. లి. 
నిర్మాత : రాకేష్  రోషన్ 
విడుదల : జనవరి 25, 2017
                              ***
      యాక్షన్ సినిమాల సంజయ్ గుప్తా సరైన సక్సెస్ కోసం పోరాడుతూ కేవలం యాక్షన్ తో పని జరగదని, కాస్త ఫీల్ కూడా అవసరమని ‘కాబిల్’ (సమర్ధుడు) తో సమర్ధవంతంగా తిరిగొచ్చేశాడు. షారుఖ్ తో పోటీగా హృతిక్ రోషన్ ని దింపేశాడు. థియేటర్లు పంచుకోవడం దగ్గరే తేడాలొచ్చి  హృతిక్ తండ్రి, నిర్మాత, అలనాటి హీరో రాకేష్ రోషన్ సినిమాలే తీయడం మానేస్తానని హెచ్చరించాడు. మానేస్తే డిస్ట్రిబ్యూటర్లకి పోయేదేం లేదుగానీ, తమ్ముడు రాజేష్ రోషన్ కి మళ్ళీ సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు రాకపోవచ్చు. 1974లో రంగప్రవేశం చేసిన తను, కాలక్రమంలో అన్న రాకేష్  రోషన్ సినిమాలకే పరిమిత మైపోయాడు. నాన్న, బాబాయిలు తప్పుకుంటే హృతిక్కి వచ్చే లోటేమీ లేదు-  తను నటుడుగా ‘కాబిల్’ అని ‘కోయీ మిల్ గయా’ తోనే ఎప్పుడో నిరూపించుకున్నాడు. ప్రస్తుత ‘కాబిల్’ మళ్ళీ  అలాటి పరీక్షపెట్టే పాత్రే. ఈ పాత్రతో తనెలా పరీక్ష నెగ్గాడో చూద్దాం...

 కథ 
      అంధుడైన రోహన్ భట్నాగర్ (హృతిక్ రోషన్) డబ్బింగ్ ఆర్టిస్టు. యానిమేషన్స్ కి డబ్బింగ్ చెప్తూంటాడు. అంధురాలైన సుప్రియ ( యామీ గౌతమ్) పియానో ప్లేయర్. ఓ డాన్స్ స్కూల్లో పని చేస్తూంటుంది. ఒక మేడమ్  వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పరస్పరం నచ్చుతారు. స్నేహం మొదలెడతారు. షికార్లు తిరుగుతారు. ఆడతారు, పాడతారు, పెళ్ళయిపోతుంది. అదే వీధిలో  ఆవారా బ్యాచ్ అమిత్ (రోహిత్ రాయ్), వసీం (సాహిదుర్ రెహ్మాన్) లుంటారు. వీధి అరుగుమీద కూర్చుని వచ్చే పోయే రోహన్ ని ఆటలు పట్టిస్తూంటారు.  రోహన్ పెళ్ళి చేసుకోగానే భార్య  సుప్రియతో మిస్ బిహేవ్ చేయడం మొదలెడతారు. ఒకరోజు రోహిత్ ఫ్లాట్ లో లేని సమయంలో సుప్రియని రేప్  చేస్తారు. సుప్రియ రోహన్ ల జీవితం తలకిందులై పోతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఆ పోలీసు అధికారి (నరేంద్ర ఝా) సుప్రియని వైద్యపరీక్షకి పంపించబోతే అమిత్, వసీం లు సుప్రియతో బాటు రోహన్ నీ కిడ్నాప్ చేసి బంధించి, మర్నాడు విడుదల చేస్తారు. 24 గంటలు గడిస్తే మానభంగం జరిగిన ఆనవాళ్ళు చెరిగిపోతాయనీ,  ఇప్పడు వైద్య పరీక్ష లాభంలేదనీ డాక్టర్ చెప్పడంతో షాకవుతారు. పోలీసు అధికారి కూడా చేతులెత్తేస్తాడు. 

          కార్పొరేటర్ మాధవరావ్ (రోణిత్ రాయ్) తమ్ముడు అమిత్. ఇతను తమ్ముడి మీద  కేసులేకుండా చేస్తాడు. రోహన్ కి ఎటూ తోచదు. ఇక తన గురించి పోరాడ్డం మానెయ్యమనీ, ఇప్పుడు మనం విడిపోతేనే మనిద్దరికీ మంచిదనీ చెప్పేస్తుంది సుప్రియ. కానీ మర్నాడు ఉరేసుకుని చనిపోతుంది. అవాక్కవుతాడు రోహన్. ఆత్మహత్యగా తేల్చేసి చేతులు దులుపుకుంటాడు పోలీసు అధికారి. కార్పొరేటర్ మాధవరావ్ వచ్చి ముసలి కన్నీళ్లు కారుస్తాడు. అయినా మొదటిసారి రేప్  జరిగినప్పుడు ఆత్మహత్య చేసుకోని మనిషి, రెండోసారి జరిగితే ఎందుకు చేసుకున్నట్టు?-  అని బాంబు పేలుస్తాడు. రోహన్ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది. అదే రేపిస్టులు  తెగించి రెండోసారి అఘాయిత్యం తలపెట్టడాన్ని  ఇక  సహించలేకపోతాడు- ఇప్పుడు కూడా సహకరించని పోలీసు అధికారిని సవాలు చేసి,  చెప్పి మరీ తన ప్రతీకార కాండ మొదలెడతాడు రోహన్...

ఎలావుంది కథ
         రొటీన్ రివెంజి కథ. ఇలాటి కథలు లెక్కలేనన్ని వచ్చాయి. ఈ మధ్య దుష్ట పాత్రలు కూడా రాజకీయనాయకుడి కొడుకో, తమ్ముడో అయివుంటున్నారు రొటీన్ గా. ‘పింక్’ లో రాజకీయ నాయకుడి కొడుకు. కేసులేకుండా ఆ నాయకుడి ఎత్తుగడలు. ఇదే పునరావృతమయింది ప్రస్తుత కథలోనూ. కథానాయకుడు కూడా రొటీన్ గానే చంపుకుంటూ పోతాడు పోలీసులతో దాగుడుమూత లాడుతూ. చివరికి దొరికిపోవడమో, తెలివిగా తప్పించుకోవడమో ఇలాటి కథల్లో చేస్తూంటాడు హీరో. ‘కహానీ -2’ లో చంపడాలు కానిచ్చి పోలీసు అధికారి సహకారంతో  తప్పించుకుంటుంది హీరోయిన్ - ‘డెత్ విష్’ లో హీరోలాగే.
         

        ‘డెత్ విష్’- ఇది ఇలాటి రివెంజి డ్రామాలకి రొటీన్ చెర విడిపించింది. తన కూతుర్ని రేప్  చేసిందెవరో పోలీసులు పట్టుకోకపోతే, అసలు వాళ్ళెవరో  గుర్తించకపోతే- అప్పుడా హీరో కేవలం తన ప్రతీకారం గురించి ఆలోచించడు- సమాజం గురించి ఆలోచిస్తాడు. తన కుటుంబానికి వచ్చిన   పరిస్థితి ఇంకే కుటుంబానికీ  రాకూడదని, రాత్రి పూట సంచరిస్తూ అసాంఘీక శక్తుల్ని వధిస్తూంటాడు! రొటీన్ రివెంజి కథల్ని విశాల దృష్టితో విజిలాంటీ కథగా మార్చేశాడు. ఇది చాలా ప్రఖ్యాతి చెందిన హాలీవుడ్ సినిమా. దీని సీక్వెల్స్ కూడా చాలా వచ్చాయి.

          అయినా ప్రస్తుత కథ ఎక్కడెక్కడ ప్లస్ అవుతోందంటే, ముఖ్యంగా రెండు- ఒకటి అంధ పాత్రలు కావడం, రెండు- భిన్న ప్రపంచాల్ని ఒక ఉద్దేశంతో చూపడం. అంధురాలు రేప్ కి గురై ప్రాణాలు తీసుకుంటే,  తోటి అంధుడు ప్రతీకారం  తీర్చుకోవడం ఎంతైనా రొటీన్ కి ఒక ఫ్లేవరే. రెండో ఫ్లేవర్- భిన్నప్రపంచాలు : హీరో హీరోయిన్ల అందమైన ఆనందమయ కథా ప్రపంచం, ఆ తర్వాత దుష్టుల దుర్మార్గపు కథా లోకం. ఇక్కడ పోలిక : కళ్ళున్న మనుషుల లోకం కంటే, కళ్ళు లేని అంధుల ప్రపంచమే మనోహరంగా వుండడం. ఆ ప్రపంచాన్ని  కళ్ళున్న మనుషులు చిదిమేస్తే, వాళ్ళ లోకాన్ని కళ్ళు లేని  కబోది ఛిద్రం  చేశాడు. కథలు అవే వుంటాయి, వాటిని భావాత్మకంగా చెప్పడంలో వుంటుంది. ఇది పైకి మన మనసుకి  తెలియకపోయినా, సబ్ కాన్షస్ గా గాలం వేస్తుంది. మరపురాని విధంగా సబ్ కాన్షస్ గా గాలం వేసే రొటీన్ రివెంజి కథ ఇది. ఇంతవరకూ ఇలాటిది వచ్చి వుండకపోవచ్చు. 

ఎవరెలా చేశారు 
       స్టార్లు కూల్ గా నటిస్తే అభిమానులు ఏమాత్రం గొడవచెయ్యరని నిరూపిస్తూ కూల్ గా నటించాడు హృతిక్ రోషన్. చాలా కూల్ గా తన యాక్షన్  చేసుకుపోతాడు. ఒకసారి గనుక కథాపరంగా నేపధ్యంలో భావోద్వేగాలు బలంగా ఏర్పాటయ్యాక, ఇక నటుడు ప్రత్యేకంగా వాటిని ప్రదర్శిస్తూ రెచ్చిపోనవసరం లేదని ఈ తరహా ప్రెజెంటేషన్ తెలియజెప్తుంది. నేపధ్యంలోని భావోద్వేగాలకి కదిలిపోవాల్సింది డబ్బెట్టి టికెట్లు కొనుక్కున్న విధేయులైన ప్రేక్షకులే. వాళ్ళు సినిమాకొచ్చేదే కదిలిపోవడానికి, దిష్టి బొమ్మల్లా కూర్చోవడానిక్కాదు. నటుడు కేవలం నిమిత్త  మాత్రుడు. హృతిక్ తో బాటు, యామీ గౌతమ్ పాత్రచిత్రణల్లో మరో కొత్తదనం ఏమిటంటే- సర్వసాధారణంగా, కరుడుగట్టిన, కాలప్రవాహంలో ఎక్కడో గడ్డ కట్టుకుపోయిన-  అదే పాత మూస ఫార్ములాగా, అంధుల్ని వీళ్ళు అంధులూ అని ముద్రేసినట్టు, కనుగుడ్లు పైకి తిప్పుతూ, తడుముకుంటూ నడుస్తూ,  ఏవో విషాద శోక రసాలతో బోలెడు సానుభూతిని పొందేట్టూ చూపిస్తూంటారు ఇంకా. లేకపోతే  బ్లైండ్ అని తెలియడానికి బ్లాక్ స్పెక్ట్స్ పెట్టేయడం.  ఈ రెండు బ్రాండింగులూ కట్ అయ్యాయిక్కడ. కొత్త ప్రతీకల్ని కనిపెట్టని సినిమాలు  అనాగరికంగా కన్పిస్తాయి. ముఖ్యంగా యూత్ అప్పీల్ ని కోల్పోతాయి.  ఇవాళ్టి మోడల్ సెల్ ఫోన్ రేపు వుండడం లేదు, ఇవాళ్టి తరహా సీను రేపు వుండకూడదు- ఇదే సక్సెస్ మంత్రం. 

       హృతిక్ మనలాగే చూస్తూ తిరుగుతూంటాడు. అతడికి పరిచయం లేని వాళ్ళకి  అంధుడని కూడా అన్పించనంత చక్కగా ఎవరి సాయమూ లేకుండా తనపనులు తాను  చేసుకుపోతాడు. చూపు లేకపోయినా మనోనేత్రంతో చూస్తాడు- పైగా ఘ్రాణశక్తి ఎక్కువ. దుస్తుల వాసనని బట్టి అదెవరో చెప్పేస్తాడు. దుష్టుడు అలికిడవకూడదని బూట్లు విడిచి, నిశ్శబ్దంగా వెనకనుంచి దాడి చేయడానికి వస్తూంటే- గిరుక్కున తిరిగి గట్టి పంచ్ ఇస్తాడు- నీ సాక్సు వాసన శవం కూడా పసిగడుతుందిరా- అని కూల్ గా అనేస్తాడు. దద్దరిల్లిపోతుంది థియేటర్  ప్రేక్షకుల కేరింతలతో 

          అతడికి కోపం, బాధ, విసుగు, అసహనం తెలియవు- తనకు లేనిది ఇతరులకుందన్న ఈర్ష్యాసూయలూ వుండవు- అంత ప్రేమగా వుంటాడు. చిరునగవు చెరగదు. ఆ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో అతనంటే అందరికీ ప్రేమ. అతడికి షాకు మీద షాకులు తగులుతూంటాయి, అయినా కన్నీళ్లు రావు- కాసేపు అలా కూర్చుండిపోతాడు. ఆ కూర్చుండి పోవడంలో చాలా అర్ధాలుంటాయి- డైలాగులు అవసరంలేని సబ్ టెక్స్ట్. లోకం తనతో ఇలా దయలేకుండా  ప్రవర్తిస్తోందని  అనుకుంటున్నాడేమో, గుడ్డోడని కూడా చూడకుండా పోలీసులిలా చేస్తున్నారని అనుకుంటున్నడేమో అలా కూర్చుని పాపమని మనకి అన్పిస్తుంది!

         ఇంటర్వెల్ సీన్లో హృతిక్ పోలీసు అధికారిని ఎదుర్కొన్నప్పుడు చెప్పే నాల్గు మాటలు - యే ఖేల్ ఉన్హోనే షురూ కియా థా...తమాషా ఆప్ లోగోనే దేఖాహై ... ఖతం మై కరూంగా!’  (ఆట వాళ్ళు మొదలెట్టారు, తమాషా మీరు చూశారు,  నేను ఫినిష్ చేస్తాను) ఎంత సింపుల్ గా వుంటాయో, అంత  టెర్రిఫిక్ గా వుంటాయి. ఇంటర్వెల్ పడ్డాక అవి వెంటాడుతూ వుంటాయి

      యామీ గౌతమ్ అంధ పాత్ర కాస్త తేడా. ఆమె మొహం ఎప్పుడూ నవ్వుతో వెలిగిపోతూ వుంటుంది. అంగవైకల్య పాత్రల్ని ఇలా రిచ్ గా, గ్లామరస్ గా, కలర్ఫుల్ గా చూపించడంతో కథలో శాడ్ ఫీల్ తొలగిపోయి ఆసక్తికరంగా తయారయ్యాయి. ఈ పాత్రల్లో హృతిక్, యామీలు ఏవో ఫాంటసీల్లో యాంజెల్స్ లా కన్పిస్తారు. యామీ ఇలా కన్పించేది ప్లాట్ పాయింట్ వన్ వరకూ మొదటి ముప్పావు గంటే అయినా,  ఆతర్వాత సినిమా ముగింపువరకూ ఆమె ప్రభావాన్ని- ఆ నవ్వు ముఖాన్ని  ఫీలవుతూనే వుంటాం. 

          రేపిస్టు లిద్దరూ బాగానే నటించారు. వీళ్ళని కాపాడే కార్పొరేటర్ గా రోణిత్ రాయ్ మరాఠీ యాస మాటాడే పవర్ఫుల్ విలన్ గా దర్శన మిస్తాడు. రేపిస్టుల్లో ఒకడైన రోహిత్ రాయ్ నిజజీవితంలో కూడా ఇతడి తమ్ముడే. హృతిక్ ఫ్రెండ్ జాఫర్ గా సురేష్ మీనన్ స్మూత్ గా కన్పిస్తాడు. గిరీష్ కులకర్ణి, నరేంద్ర ఝాలు బ్యాడ్ పోలీసు పాత్రల్ని భద్రంగా హేండిల్ చేశారు.

          సుదీప్ ఛటర్జీ, ఆయనంకా బోస్ ల కెమెరా వర్క్, మానినీ మిశ్రా ఆర్ట్ డైరెక్షన్; కరిష్మా ఆచార్య, నాహిద్ షా ల కాస్ట్యూమ్స్ వర్క్ ఒక శైలిని పాటించాయి : మొదటి అందమైన ప్రపంచం  ఒక రంగుల స్వప్నంలా, తర్వాత మొదలయ్యే రెండో అంధకార లోకం ఒక పీడకలలా ఆవిష్కరించారు దర్శకుడి విజన్ ప్రకారం. అయితే తను తీసే యాక్షన్ సినిమాలకి దర్శకుడు అలవాటు పడ్డ ఎలాటి టింట్ (సాధారణంగా డార్క్ గ్రీన్ టింట్ తో సినిమాలు తీస్తాడు) నీ వాడలేదు. ఓన్లీ ‘ఈస్ట్ మన్ కలర్’. అలాగే ఎడిటర్ అకీవ్ అలీ కూడా దృశ్యాల్ని నీటుగా వుంచాడు. జంప్ కట్స్, స్పీడ్ ర్యాంపులు, స్వైపులు వంటివి వేసి గజిబిజి చే యకుండా,
simple editing technique will make your scenes more dramatic and powerful కాన్సెప్ట్ ని పాటించాడు. దృశ్య కాలుష్యం లేని విజువల్స్ ని ప్రదర్శించాడు. సౌండ్ విషయంలో- ఇది భారీ యెత్తున సౌండ్ ఓరియెంటెడ్ స్క్రిప్టు కావడంతో, ఆస్కార్ విన్నర్ రసూల్ పోకుట్టికి మంచి ఆట స్థలమైంది. 

          మొత్తం ప్రాజెక్టుని సంజయ్ గుప్తా చాలా సున్నితంగా, సునిశితంగా, ఏంతో  ప్రేమిస్తున్నట్టు ప్రత్యేక అభిరుచితో,  హృదయపూర్వకంగా,  కథతో ఇంత రోమాన్స్  చేస్తూ దర్శకత్వం వహించడం ఆశ్చర్య పరుస్తుంది. హార్డ్ కోర్ యాక్షన్స్ తీసే సంజయ్ గుప్తా ఇక్కడ మళ్ళీ కన్పించడు.

స్క్రీన్ ప్లే సంగతులు

          యాక్షన్ సినిమాల సీనియర్ దర్శకుడు సంజయ్ గుప్తా పదిహేడు సినిమాలు తీస్తే, అందులో పన్నెండుకి పన్నెండూ  హాలీవుడ్, కొరియన్ కాపీలే. ‘రిజర్వాయర్ డాగ్స్’ లాంటి ప్రపంచ ప్రసిద్ధ సినిమాని  కూడా కాపీ కొట్టేందుకు ఏ మాత్రం మొహమాట పడడు. రొటీన్ గా ఈసారి కూడా  కాపీ ఆరోపణలే వున్నాయి- ‘కాబిల్’ కూడా హాలీవుడ్ ‘బ్లయిండ్ ఫ్యూరీ’, కొరియన్ ‘బ్రోకెన్’ లకి కాపీ అని  న్యూస్ వచ్చినా వీటితో సంబంధం లేని కథ ఇది. కథతో వేరే వివాదాలేర్పడ్డాయి. తను చెప్పిన ‘ఫర్మాయీష్’ (అభ్యర్ధన) కథ సంజయ్ గుప్తా కొట్టేసి  ‘కాబిల్’ గా తీశారని సుధాంశూ పాండే అనే మోడల్ కోర్టుకెక్కితే, ఆ ‘ఫర్మాయీష్’ నే నా దగ్గర్నుంచి సుధాంశూ పాండే కొట్టేశాడని ఈ సినిమా రచయితలలో ఒకడైన విజయ్ కుమార్ మిశ్రా పోలీస్ స్టేషన్ కెక్కాడు. అసలు మా ‘డార్క్ నైట్’ సిరీస్ నే  కాపీ కొట్టి ‘కాబిల్’ తీశారని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా లీగల్ చర్యలకి దిగుతోంది. సంజయ్ గుప్తా కాపీ యావ పండి పాకాన పడింది. సినిమా మాత్రం భలేగా ఆడేస్తోంది. 

          రొటీన్ తో రోమాన్స్ చేశాడు ఈ స్క్రీన్ ప్లే తో సంజయ్ గుప్తా. ఒక రేప్, దానికి ప్రతీకారమనే - మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతున్న- పురాతన కథతో రోమాన్స్ చేసి, పాత వాసనని వదిలించాడు. అంధ పాత్రలతో ఈ రేప్ అండ్ రివెంజి కథ పెట్టడం రోమాన్స్ లో ఒక భాగమైతే, దీన్ని రెండు ప్రపంచాలుగా విడగొట్టడం రెండో భాగం. పైన చెప్పుకున్నట్టు,   అంధు లైన హీరో హీరోయిన్ల అందమైన కథా ప్రపంచం ఒకటి, ఆ తర్వాత దుష్టుల దుర్మార్గపు కథా లోకం. తద్వారా కళ్ళున్న మనుషుల లోకం కంటే, కళ్ళు లేని అంధుల ప్రపంచమే మనోహరంగా వుంటుందని చూపడం. అంధుల ప్రపంచాన్ని కళ్ళున్న మనుషులు చిదిమేస్తే, కళ్ళున్న మనుషుల  లోకాన్ని కళ్ళు లేని కబోది  పొడిచేశాడు. ఈ కవితాత్మక ధోరణి  రివెంజిని ఒక మెట్టు పైకి తీసికెళ్ళి,   అనాదిగా వస్తున్న రొటీన్ బానిస సంకెళ్ళని తెంపేసింది. ఉన్నదానికి ఇన్నోవేషన్ (నూతన కల్పన) అంటే ఇదే. 

          బిగినింగ్ మొదటి ముప్పావు గంటకి  కుదించాడు. ఇందులో అంతా హీరో హీరోయిన్ల మెచ్యూర్డ్ లవ్ తో కూడిన దృశ్యాలే. వాళ్ళ బాండింగ్ ని బలీయం చేసే సన్నివేశాలే. ముప్పావు గంటలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఈ ప్రపంచం తలకిందులవబోతోంది కాబట్టి, దీన్ని వీలైనంత అందంగా చూపాడు. ఒడిదుకుల ప్రపంచాన్నే చూపిస్తే ఆ  తర్వాత తలకిం దులవడానికేమీ వుండదు- వున్నా తేడా అన్పించదు. అదే సమయంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోయిన్ రేప్  అయి, ఆ తర్వాత చనిపోతుంది కాబట్టి- అదంతా విషాదమే కాబట్టి- దానికి కాంట్రాస్ట్ గా బిగినింగ్ విభాగమంతా ప్రతీ సీనులో ఆమెని చెరగని చిరునవ్వుతో అందమైన, సుకుమారమైన అమ్మాయిగా చూపించాడు. ఇలాటి అమ్మాయి ట్రాజెడీ పాలైతే వుండే బాధని ప్రేక్షకులు బాగా ఫీలయ్యేట్టు కథా పథకం కొనసాగించాడు. 

      అలాగే కథనీ, పాత్రల్నీ వేరు చేశాడు. కథ ముందా, పాత్రలు ముందా అంటే, బిగినింగ్ లో పాత్రలే ముందు కాబట్టి- ఆ తర్వాతే మిడిల్లో కథ ప్రారంభమవుతుంది కాబట్టి- పాత్రల్ని మాత్రమే బిగినింగ్ విభాగపు హైలెట్స్ గా చేసుకున్నాడు. ఇందులోకి కథ తాలూకు ఛాయల్ని ఏమాత్రం రానీయలేదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సంఘటనతో కథే ప్రధానం కాబట్టి,  అక్కడ్నించీ మిడిల్లో కథలోకి పాత్రలూ రాకుండా చేశాడు. పైన చెప్పుకున్నట్టు- కథాపరమైన, కథకి మాత్రమే చెందిన భావోద్వేగాల్ని నేపధ్యంలో వుంచుతూ,  హృతిక్ పాత్రని నడిపాడు. అంటే బిగినింగ్ లో ఆడియెన్స్ ముందు పాత్రల్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి, లేదా ఫీలవ్వాలి. ఆతర్వాత ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ప్రారంభమయ్యే మిడిల్ లో, కథ మాత్రమే ఫీలవ్వాలి. ఇక  కథ ముగింపుకొచ్చేసరికి మళ్ళీ  ఆ విజయం సాధించిన పాత్రనే ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేశాడు. 

          నిజమే, కథంటూ  ప్రారంభమయ్యాక ప్రేక్షకుల దృష్టి పాత్రల మీదికి ఎందుకు పోవాలి? అప్పుడు కథకి ఎలా కనెక్ట్ అవుతారు? సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు మీడియా వాళ్లకి ఏమని బైట్స్ ఇస్తారు? డాన్సులు అదిరాయి, ఫైట్లు అదిరాయి, కామెడీ సూపర్- అంటారు. ఇంతే,  కథ బావుంది సూపర్ అని ఒక్కరూ అనరు, లేడీస్ కూడా అనరు.  సినిమా అంటే డాన్సులూ ఫైట్లూ,కామెడీయేనా? అంటే కథ ప్రారంభమయ్యకా ఇంకా ప్రేక్షకుల దృష్టి పాత్రల  మీదికే పోయేట్టు చేయడంవల్ల కథ పట్టక ప్రేక్షకులు అలా బైట్స్ ఇస్తూండొచ్చు. 

          కాబట్టి ఒకసారి కథంటూప్రారంభమయ్యాకా, కథనే ప్రేక్షకులు చూడాలి, కథలోంచే  పాత్రల్ని చూడగలగాలి, పాత్రల్లోంచి కథని అస్సలు చూడకూడదని, అలా చూడడం సాధ్యం కాదని - ఇదే పొరపాటు చాలా సినిమాల్లో జరిగిపోతోందని అన్పిస్తుంది ‘కాబిల్’ మేకింగ్ ని చూస్తూంటే. 

          ఎంగేజిమేంట్ తో ప్రారంభమయ్యే బిగినింగ్, పెళ్లి జరిగి, తర్వాత రేప్ తో ముగుస్తుంది. ఇక్కడ కథ పుట్టి, ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచి మిడిల్ ప్రారంభమై, సమస్యతో సంఘర్షణ మొదలవుతుంది.  ఇక్కడ్నించీ ఇదంతా కళ్ళున్న మనుషుల కసాయి ప్రపంచం. ఈ ప్రపంచానికి పెత్తందార్లయిన పోలీసులూ కార్పొరేటరూ రేపిస్టుల ఎత్తుగడలు. అలవాటు లేని ఈ ప్రపంచంలో హీరోహీరోయిన్ల ఉక్కిరిబిక్కిరి. సాధారణంగా ఇలాటి కథల్లో ఒక్క సారే రేప్ జరుగుతూ వచ్చింది. ఈ 
కథలో రెండో సారి జరగడం కొత్త ఐడియా. దీంతో కథ మళ్ళీ ఓ కుదుపు నిస్తుంది. మొదటి రేప్ తో పోలీసుల నిర్వాకం చూసి నిస్సహాయుడై పోయిన హీరోకి- ఈ రెండో రేప్, హీరోయిన్ ఆత్మహత్య రగిలిస్తుంది. ఇప్పుడూ నిమ్మకునీరెత్తినట్టున్న పోలీసులతో  ఇక లాభంలేదని,  హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఇంటర్వెల్. 

          ఇక సెకండాఫ్  మిడిల్ టూ ప్రారంభించి- హీరో పథకం ప్రకారం చంపడం మొదలెడతాడు. పోలీసులకి ఎవిడెన్స్ దొరక్కుండా చేస్తాడు. చివరికి పోలీసులు అతడి మీద నిఘా పెట్టడంతో, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి మిడిల్ ముగుస్తుంది. ఇక్కడ్నించి  ప్రారంభమయ్యే ఎండ్ విభాగం పోలీసుల కన్ను గప్పి మిగిలిన హత్య ఎలా చేశాడన్నది తెలియజెప్తుంది. ఇక హీరోని కిల్లర్ గా పట్టుకోవడానికి పోలీసు అధికారికి ఒక కీలక ఆధారం దొరుకుతుంది – అది దొరుకుతుందని ముందూహించే హీరో దానికీ ప్లానేస్తాడు. ఈ ప్లానుతో  పోలీసు అధికారికి ముందు దారంతా మూసుకుపోతుంది. ఇది గుర్తుండి పోయే ఫినిషింగ్ టచ్ కథకి.
***
      ఐతే స్ట్రక్చర్, పాత్రచిత్రణ, కథానిర్వహణా ఇంత పకడ్బందీగా వున్న ఈ స్క్రీన్ ప్లేలో  పెద్ద పెద్ద లోపాలూ లేకపోలేదు. ఈ లోపాలతో చూస్తే ఈ కథే వుండదు, కథే పుట్టదు. ఒక నేరానికి హీరో బలై నప్పుడు ఎంత పకడ్బందీగా అతను పథకం వేస్తాడో, అంతే  పకడ్బదీగా, లాజికల్ గా  ఆ జరిగిన నేరంతో రచయిత ఎందుకుండడు?  హీరో మీద నెట్టేసి ఎందుకు కూర్చుంటాడు?

          సినిమాలో ఒక నేరం తాలూకు దర్యాప్తు ఒక విధంగా చూపిస్తున్నారంటే అదే నిజమని అనుకోవచ్చు ప్రేక్షకులు. ఆ చూపడం లోపభూయిష్టంగా వుంటే మాత్రం తప్పుడు సంకేతాలు, తప్పుడు సమాచారమూ  వెళతాయి ప్రేక్షకుల్లోకి. ఫలితంగా వాళ్ళూ  అదే ఫాలో అయితే తీవ్రంగా నష్టపోతారు. ఉదాహరణకి, ఈ సినిమాలో చూపించినట్టు- రేప్ జరిగిం తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తారు హీరో హీరోయిన్లు. పోలీసులు వెనకాముందాడి ఎలాగో వైద్య పరీక్షలకి పంపిస్తారు. రేపిస్టులు జొరబడి ఆ వైద్య పరీక్షల్నిఅసాధ్యం చేస్తారు. ఇలాటివి జరక్కూడదనే పోలీసుల పరిధి నుంచి వైద్య పరీక్షల్ని తొలగించింది మూడేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి రేప్ బాధితురాలు ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ చేయనవసరం లేదు. ఏ డాక్టర్ దగ్గరికైనా  వెళ్లి వైద్య పరీక్షలు కోరవచ్చు. ఆ రిపోర్టుతో వెళ్లి పోలీసు కంప్లెయింట్ ఇవ్వొచ్చు. డాక్టర్లు పరీక్షకి నిరాకరించినా, పోలీసులు ఆ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేయకపోయినా జైలుకి పోతారు!

          ఇప్పుడు సినిమాలో చూపించింది రద్దయిన పాత  ప్రక్రియ. ఇది చూపిస్తూ ఇది సినిమా అనీ,  సినిమాకి లాజిక్ ఏమిటనీ అంటే మాత్రం చెప్పేదేమీ వుండదు. ప్రభుత్వ పాలనా పరమైన విధివిధానాలతో  మెడికో లీగల్ కథలు చేయనవసరం లేదనుకుంటే వాళ్ళిష్టం.  కేంద్ర ప్రభుత్వం వైద్య పరీక్షల్లో రేప్ బాధితురాలికి అవమానకరంగా వుండే కొన్ని పాత ప్రక్రియల్ని కూడా రద్దు చేసింది. 

          సినిమాలో 24 గంటలు దాటితే బాధితురాలి శరీరంమీద రేప్ జరిగిన ఆనవాళ్ళు వుండవనడం వరకూ కరెక్టే. అయితే ఆమె ఫ్లాట్ లో రేప్ జరిగినప్పుడు రేపిస్టుల తాలూకు ఇతర సాక్ష్యాధారాలు లభించ వచ్చుకదా? సరే, పోలీసులు సహకరించలేదని అనుకుందాం, తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి రెండోసారి రేప్ జరిగినట్టు తెలియదనే అనుకుందాం- అప్పుడు పోస్ట్ మార్టం లోనే రేప్ జరిగినట్టు తెలుస్తుందిగా? ఆ ఎవిడెన్స్ పట్టిస్తుందిగా? అసలు అది ఆత్మహత్య అని హీరో ఎందుకు నమ్మాలి, రేపిస్టులే చంపేసి వుండొచ్చుగా? 

          బ్రెయిలీ భాషలో ఉత్తరం రాసి పెట్టిన హీరోయిన్ రెండు వాచీల్ని కూడా ప్రస్తావిస్తూ- వీటిలో  ఒకదాన్ని దహనం చేయమనీ, రెండో దాన్ని ఖననం చేయమనీ కోరుతుంది రేపిస్టుల్ని ఉద్దేశించి. మంచం కింద తర్వాత హీరోకి దొరికే  ఈ ఉత్తరం, వాచీలూ ఫోరెన్సిక్ టీం అప్పుడెందుకు చూడలేకపోయారు?  ఘటనా స్థలంలో మంచం కింద కూడా  చూడరా?  ఆమె మంచం కింద ఎందుకు తోసింది? ఆత్మహత్య చేసుకునే మనిషి రాసిన చీటీ కన్పించేలానే పెడుతుంది. వాచీలు పోలీసులకి దొరక్కూడదని మంచం కిందికి తోసిందా? మంచం కిందా పోలీసులు చూడరని ఎలా గెస్ చేసింది? 

          ఇదంతా అలావుంచి, ఇంత జరుగుతున్నా అపార్ట్ మెంట్ వాసులు ఒక్కరూ కన్పించరు. రేప్ ముందు వరకూ మాత్రం దగ్గరుండి అపురూపంగా చూసుకుంటారు- వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళంతా సాయానికొస్తే రెండోసారి రేప్ జరిగేది కాదుగా? పోలీసుల ఆటలూ సాగేవి కాదుకదా? ...అసలు హీరోయిన్ ఒకణ్ణి దహనం చేయమనీ, ఇంకొకణ్ణి ఖననం చేయమనీ ఉత్తరంలో కోరిందంటే వెళ్లి చంపమనేగా అర్ధం?  మళ్ళీ పోలీసుల్ని ఆశ్రయించి లాభం లేదనే కదా?  అలా ఆమె చివరికోరిక తీర్చకుండా, వృధాగా  పోలీసుల దగ్గరికే మళ్ళీ ఎందుకెళ్ళాడు?.... ఇలాటి ప్రశ్నలు తలెత్తకుండా  సహేతుకంగా వుండాల్సి వుంటుంది  ఈ జానర్ కథనం.

-సికిందర్
http://www.cinemabazaar.in