రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 5, 2018

681 : స్ట్రక్చర్ అప్డేట్స్



    S –Specific : మీ ప్రధాన పాత్ర గోల్ నిర్దిష్టంగా, పటిష్టంగా వుండాలి. అస్పష్టంగా, నైరూప్యంగా వుండకూడదు. మీ ప్రధాన పాత్ర గోల్ విస్పష్టంగా లేనప్పుడు, కథనాన్ని థీమ్ మింగేసి, కథ నత్తనడక నడుస్తూ లక్ష్య రహితంగా వుంటుంది. దీనికి మీ ఫ్యాన్స్ సంతృప్తి చెందే అవకాశం లేదు. 

     SMART ఫ్రేమ్ వర్క్ లోని అన్ని ఎలిమెంట్స్ లో S ఎలిమెంట్ అత్యంత ముఖ్యమైనది. అందుకని మీ ప్రధానపాత్ర గోల్ నిరుష్టంగా వున్నప్పుడు, ఇక మిగతా కథా పథకం పరికరాలన్నీ యాదృచ్ఛికంగా వాటి స్థానాల్లో అవి భర్తీ అయిపోతాయి. ఉదాహరణకి, మీరు తన నుంచి తాను విముక్తి పొందాలనుకుంటున్న ప్రధాన పాత్రతో కథ రాయాలనుకున్నా రనుకుందాం – చూడ్డానికి ఈ గోల్ అర్ధవంతంగానే, ఆకట్టుకునేదిగానే వుంటుంది గానీ తగినంత నిర్దుష్టంగా వుండక, అస్పష్టంగా వుంటుంది.

      
అందుకని ఆ ప్రధానపాత్ర తన నుంచి తాను ఎలా విముక్తి పొందగలడో ఒక బాహ్య చర్యని మీరు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. ‘ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్’ నే తీసుకుంటే, ఇందులో ప్రధాన పాత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. ఇతడికి గతంలో జాన్ ఎఫ్ కెన్నెడీని కాపాడలేక పోయానన్న అపరాధభావం వెన్నాడుతూంటుంది. అందుకని ప్రస్తుత అమెరికా  అధ్యక్షుణ్ణి కాపాడి, ఆ అపరాధభావం నుంచి విముక్తి పొందుతాడు. ఇప్పడు గోల్ ఎంత నిర్దుష్టంగా, విస్పష్టంగా వుందో గమనించండి. అధ్యక్షుడి ప్రాణాలని కాపాడే గోల్ తో వున్న ప్రధానపాత్రని చూస్తే, ఇతను గతం తాలూకు అపరాధభావం నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేస్తున్నాడని ప్రేక్షకులు వెంటనే అర్ధం జేసుకుంటారు.



     మీరు యాక్షన్, మిస్టరీ, లేదా థ్రిల్లర్ కథ రాస్తూంటే, ప్రత్యర్ధి పాత్ర పాయింటాఫ్ వ్యూతో మేధోమధనం జరిపి రాయడం మొదలెట్టి నప్పుడు, అది నిర్మాణాత్మకంగా వస్తుంది. అసలు ప్రత్యర్ధి పాత్ర ఏం చేయాలనుకుంటోంది? దీన్ని నిర్దుష్టంగా నిర్వచించండి. దీని తర్వాత సింపుల్ గా, ప్రధాన పాత్ర గోల్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. అప్పుడిక ప్రత్యర్ధి పాత్ర ఏ అపాయం తలపెట్ట బోతోందో దాన్ని ప్రధాన పాత్ర ఆపేందుకు SMART ఫ్రేమ్ వర్క్ లోని ఒక్కో ఎలిమెంట్ తో తీర్చిదిద్దుకుంటూ పోండి.  

(రేపు M ఎలిమెంట్)