రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 19, 2016



        కొందరు అడుగుతూంటారు- తెలుగు సినిమాల స్క్రిప్ట్స్ ఎక్కడ దొరుకుతాయని. తెలుగులో కాదుకదా ఏ దేశభాషలోనూ ఏ సినిమా స్క్రిప్టూ ఎక్కడా దొరకదనేవి రికార్డయిన సత్యం. హాలీవుడ్ అంత అభివృద్ధి పథంలో లేదు మన దేశ సినిమా రచనా రంగం. హాలీవుడ్ లో స్క్రిప్టులు ప్రింటయి వస్తాయి. నెట్ లో వాటి పీడీఎఫ్  లు లభిస్తాయి ఉచితంగా. తెలుగు సినిమా స్క్రిప్టులకి ఈ సదుపాయం లేదు. షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ ఈ మూడూ పూర్తయ్యే వరకే వుంటాయి. సినిమా విడుదలయ్యాక ఎటుపోతాయో ఎవరికీ తెలీదు. వాటి అవసరం కూడా అంతగా ఫీలవరు. ఒకవేళ ఏ సినిమా ఆఫీసులోనైనా ఏదైనా స్క్రిప్టు అదృష్టవశాత్తూ వుంటే దాన్నిచదవడం బ్రహ్మ కైనా సాధ్యం కాదు. స్క్రిప్ట్ అంటే డైలాగ్ వెర్షనే కాబట్టి- అది షూటింగ్ దగ్గర్నుంచీ డబ్బింగ్ వరకూ రకరకాల కొట్టివేతలతో,  మార్పుచేర్పులతో  గజిబిజిగా తయారై వుంటుంది. కాబట్టి చదవడం సాధ్యం కాదు. డైలాగ్ వెర్షన్ కాకుండా, చక్కగా ఒక కథలా చదువుకోవడానికి- దాన్ని విశ్లేషించుకోవడానికీ ట్రీట్ మెంట్ ( స్క్రీన్ ప్లే) కాపీ ఏదైనా వుం టుందా అంటే, అదీ ఇంతే. దాన్నుంచి డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడే ఆ కాగితాలు చెత్త బుట్టలోకి చేరిపోతూంటాయి. కాబట్టి తెలుగు సినిమాల స్క్రిప్టులు చూసి, చదివి స్క్రిప్టులు రాయడం నేర్చుకుందామనుకుంటే కుదరని పని.

          పని ఇంగ్లీషు వచ్చి వుంటే హాలీవుడ్  స్క్రిప్టులతో సులభ సాధ్యమవుతుంది. హాలీవుడ్ స్క్రిప్టులు  అసంఖ్యాకంగా లభిస్తాయి. ఇంకోటేమిటంటే, ఇవి రాసినప్పుడు ఎలా వుంటాయో తీశాక కూడా అలాగే వుంటాయి- రాసింది రాసినట్టే తీస్తారు కాబట్టి. కనుక ఈ స్క్రిప్టులు ముందు పెట్టుకుని ఆ సినిమాలు చూస్తూంటే ఎక్కడా తేడా కొట్టదు. ఒక్కడైలాగూ మారదు. అందుకే నేర్చుకోవడానికి ఈ స్క్రిప్టులు బాగా కలిసివస్తాయి.

        అసలు స్క్రిప్టులు చదివి నేర్చుకోవడం ఎందుకు? సినిమాల్ని చూస్తున్నప్పుడు కంటే వాటిని చదుతున్నప్పుడు లోతుగా బాగా అర్ధమవుతాయి. స్ట్రక్చర్ బాగా అర్ధమవుతుంది. స్ట్రక్చర్  తెలియకుండా ఈ స్క్రిప్టులు చదివి నేర్చుకుందామనుకుంటే కుదరదు. స్ట్రక్చర్ తెలిస్తేనే దాన్ని స్క్రిప్టులో గుర్తు పడుతూ, విశ్లేషించుకుంటూ, అర్ధం చేసుకుంటూ నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. పైగా స్ట్రక్చర్ లో ఏ ప్లాట్ పాయింటు ఎక్కడ వచ్చిందో, క్యారక్టర్ ఆర్క్ ఏఏ సీన్లలో ఎలా కొనసాగిందో, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ఎలా వున్నాయో, మొదలైన స్ట్రక్చర్ సంబంధ ఎలిమెంట్స్ ని  ఆ స్క్రిప్టులు మీద మార్క్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ పోవచ్చు. ఇది రిఫరెన్స్ గా బాగా పనికొస్తుంది. 

          అసలు థ్రిల్లర్స్ స్క్రిప్టులు చదవితే ఇంకా బాగా క్రాఫ్ట్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాటి కథనాల్లో  థ్రిల్స్, యాక్షన్, సస్పెన్స్,  టెంపో, స్పీడు, ట్విస్టులు, ప్లే, పాత్రల ఎత్తుగడలు, కార్యకారణ సంబంధాలు, లాజిక్, అంచెలంచెలుగా బయటపడే మిస్టరీ,  ఇవన్నీ – వీటన్నిటి మీదా  పట్టు సాధించే వీలు కలుగుతుంది. అంతేగాక 
సమయస్ఫూర్తి, సిక్స్త్ సెన్స్ పెరుగుతాయి. మొత్తంగా బ్రెయిన్ షార్ప్  అవుతుంది. ఒకసారి బ్రెయిన్  షార్ప్ అయ్యిందంటే అదలాగే ఉండిపోతుంది. ఇలా  స్క్రిప్టుల్ని క్షుణ్ణంగా అభ్యసించి  పట్టు సాధించ గలిగితే, ఇంకే జానర్ స్క్రిప్టు నైనా ఈజీగా, పకడ్బందీగా  రాసెయ్య గల్గుతారు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తన కెరీర్ ప్రారంభ దినాల్లో తీసిన క్లాసిక్ థ్రిల్లర్ ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ స్క్రీన్ ప్లే స్క్రిప్టు ఒక మంచి ఉదాహరణ. అలాగే కోయెన్ బ్రదర్స్ మాస్టర్ పీస్ ‘ఫార్గో’ కూడా.  ఇలాటివి దృష్టికొచ్చినవి ఏవి వుంటే వాటిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని స్టడీ మొదలెట్టుకోవచ్చు. స్ట్రక్చర్ నేర్చుకుని ఆ స్ట్రక్చర్ ప్రకారం సినిమాలు చూడ్డం వేరు, స్క్రిప్టులు చదవడం వేరు. ఈ కింద ఇస్తున్న రెండు లింకులు ప్రయత్నించండి, ఆల్ ది బెస్ట్. 
       www.dailyscript.com/scripts/RaidersoftheLostArk.pdf
                                        www.coenbrothers.net/scripts/fargo.pdf


-సికిందర్