రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, July 29, 2019

856 : స్క్రీన్ ప్లే సంగతులు

            A TALE exists with no greater sense of its self, no greater purpose beyond a simple rehashing of events...127 Hours isn’t the only one—Taken, Coraline, Battle: LA, True Grit, Inglorious Basterds, 2012, Where the Wild Things Are, The Informant, Public Enemies—all tales with little to say.  All works of fiction that are easily forgotten.
            A STORY  gives audience members an experience they can’t have on their own. This experience is why audience members return to a film over and over again. Star Wars, The Shawshank Redemption, The Lives of Others, The Godfather, The Apartment, The Sound of Music, Toy Story, Toy Story 2 (pretty much anything Pixar), The King’s Speech, The Dark Knight, Good Will Hunting, Chinatown—all stories with much to say. All works of fiction that are not so easy to forget
.
―From Narrative First 



                   విజయ్ దేవరకొండ 2017 లో ఆల్రెడీ ‘ద్వారక’ అనే ఫ్లాపయిన ‘గాథ’ లో నటించాక తిరిగి డియర్ కామ్రేడ్’ అనే ఇంకో ‘గాథ’ లో నటించే పొరపాటు చేశాడు.  గాథతో సినిమా అంటేనే గ్యారంటీగా ఫ్లాప్. కమర్షియల్ సినిమాలు డిమాండ్ చేసేది కథలే గానీ  చప్పిడి గాథలు కాదు. ఒకసారి ఫ్లాపయిన గాథల లిస్టు చూస్తే- మొగుడు, పైసా, ఓకే బంగారం, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా, జక్కన్న, ఉన్నది ఒకటే జిందగీ, రాజుగారి గది -2, అంతరిక్షం, బ్రహ్మోత్సవం, కబాలీ, ద్వారక...ఇలా చాలా వుంది, ఇప్పుడు బాధాకరంగా డియర్ కామ్రేడ్ ని లిస్టులో కలుపుకోవాలి. అసలు కథలు వేరు, గాథలు వేరనీ, గాథలు సినిమాలకి పనికి రావనీ కనిపెట్టిన హాలీవుడ్ లోనే తెలియక కొందరు గాథలతో సినిమాలు తీస్తూంటారు.


          తెలుగులో తెలిసి గాథలు తీస్తున్నారా అంటే అదేం కాదు, కథే తీస్తున్నామనుకుంటారు. తీరా అది గాథగా తేలి బెడిసి కొడుతుంది. కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తేడా తెలిసి, ఉద్దేశపూర్వకంగానే  గాథలు తీస్తే, పైన చెప్పుకున్న సినిమాల్లా వుండవు. మోహన్ బాబు నటించిన విజయవంతమైన గాథ ‘పెదరాయుడు’ లా వుంటాయి. ఉద్దేశపూర్వకంగా, ప్రామాణికంగా తీసే గాథల్లో ఉదాత్త పాత్ర వుండి, ఉదాత్త కథా కథన నియమాల పాలన వుండి అప్పుడు సక్సెస్ అవుతాయి. ఇది అందరివల్లా కాదు. 

          కథలే తీస్తున్నామనుకుంటూ తెలియక తీస్తున్న గాథలు ఎంత మభ్య పెట్టేవిగా వుంటాయంటే, గాథల పరిజ్ఞానం వున్న వాళ్ళు  సైతం  సినిమా చూస్తూ ఇది గాథ అని వెంటనే కనిపెట్ట లేరు. చూస్తున్నది కథే అనుకుంటూ, ఫస్టాఫ్ లో ఇక ప్లాట్ పాయింట్- 1 వస్తుందని, హీరోకి గోల్ ఏర్పడి కథ ప్రారంభమవుతుందని అరగంట, ముప్పావు గంట, పోనీ ఇంటర్వెల్ వరకూ ఎదురు చూస్తారు. 

          ఇంటర్వెల్ కైనా ఇది జరిగిందా, పోనీలే ఇప్పుడైనా కథ ప్రారంభమైందనుకుంటారు. ఇంటర్వెల్ కి కూడా హీరోకి గోల్ ఏర్పడక, కథ ప్రారంభం కాకపోయిందా, ఇదిక మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుందని డౌట్ వస్తుంది. హీరోకి గోల్ ఏర్పడనంత వరకూ అది స్క్రీన్ ప్లే స్పేస్ లో బిగినింగ్ విభాగమే. గోల్ ఏర్పడితేనే స్క్రీన్ ప్లే మిడిల్లో పడి కథ నందుకుంటుంది.

          కనుక ఇంటర్వెల్లో కూడా గోల్ ఏర్పడలేదంటే, సెకండాఫ్ లో ఇంకా ఈ బిగినింగ్ అన్యాయంగా ఇంకెంత స్పేస్ తీసుకుంటుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. రెండు గంటల సినిమాలో గంటన్నర గడిచిపోయి, చివరి అరగంటకి బిగినింగ్ పూర్తయి, అప్పుడు హీరోకి గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై మిడిల్లో పడితే, ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని తేలిపోతుంది. 

          అంటే ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంటకి రావాల్సిన మిడిల్, పోనీ ఇంటర్వెల్ కైనా రావాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో చివరి అరగంటలో వచ్చిందంటే,  ఆ మిడిల్ అనేది స్క్రీన్ ప్లేలో మటాష్ అయిపోయినట్టే. రెండు గంటల సినిమాలో యాభై శాతం, అంటే గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సిన మిడిల్ విభాగం, చివరి అరగంటకి జరిగిపోయి, అక్కడున్నకొద్ది స్పేస్ లో ఎండ్ విభాగంతో కలిసి పంచుకుందంటే, అది మటాష్ అయినట్టే లెక్క. ఇంకో మాటల్లో చెప్పుకుంటే, ఎప్పుడో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింటు వన్ తర్వాత మొదలవాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర మొదలవుతుందన్న మాట! 

          స్క్రీన్ ప్లేలో ఆ చివరి అరగంటలో ఎండ్ తో కలిసి స్పేస్ ని పంచుకోవడమంటే మిడిల్ కి మిగిలేది ఓ పావుగంటే. ఈ పావుగంటలోనే ప్లాట్ పాయింట్ -1 వచ్చి, గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై చప్పున ముగిసి పోతుందన్న మాట. అంటే స్క్రీన్ ప్లేలో గంటన్నర పాటూ బిగినింగ్ విభాగమే కథ ప్రారంభం కాకుండా, హీరో ఏమీ చేయకుండా గడిచిపోతుందన్న మాట. ఇలా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలు 2000 నుంచీ కథ - మాటలు-  స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకునే నయా దర్శకుల ట్రెండ్లో వచ్చినవే, ఇంకా ఇప్పటికీ వస్తున్నవే.

          సరే, ఇంతవరకూ సినిమా చూస్తూ కూర్చుంటే, ఇలా చివర్లోనైనా  ప్లాట్ పాయింట్ వన్ వస్తే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనైనా తెలుస్తుంది. ఇప్పటికైనా  ప్లాట్ పాయింట్ వన్ రాకపోతే అప్పుడు తెలుస్తుంది, ఇది మిడిల్ మటాష్ కూడా కాదనీ, ఇంత సేపూ వృథాగా చూస్తూ కూర్చున్నది గాథ అనీ! సినిమా చివరి అరగంట కొస్తే గానీ చూస్తున్నది గాథ అని తెలుసుకోలేమన్నమాట. పరిజ్ఞానం వున్న వాళ్ళని కూడా ఇలా మభ్యపెడతాయి గాథలతో వచ్చే
సినిమాలు.

           ‘డియర్ కామ్రేడ్’ ఇలా మభ్యపెట్టేదే. ఐతే ఈ గాథలో స్పెషాలిటీ ఏమిటంటే, అంతవరకూ ప్రేమగాథగా వున్న దాన్ని చివర్లో హీరోయిన్ మీద లైంగిక వేధింపుల ‘కథ’ గా అతికించి ముగించడం! గాథకి చివర ఓ కథని అతికించడం. విచిత్రం. కథో గాథో చేస్తున్నప్పుడు ఏ నియమాలూ పాటించనవసరం లేదనుకోవడం. మంచిదే, వాళ్ళ పెట్టుబడి వాళ్ళిష్టం. 

          ఇప్పుడేం జరిగిందంటే, ప్రేమ గాథ అకస్మాత్తుగా లైంగిక వేధింపుల కథగా మారడంతో మూవీ టోన్ (స్వరం) మారిపోయి, రసభంగమై, మూడ్ - ఫీల్ అనేవి కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది. జానర్ మర్యాద చెడిపోవడం సరే. 

కామ్రేడ్  మెచ్యూరిటీ 
       విజయ్ దేవరకొండ పాత్ర ఫస్టాఫ్ లో కాలేజీలో కామ్రేడ్ గా వున్నంతవరకూ యాక్టివ్ పాత్రే. కామ్రేడ్ పాత్ర కోసం స్టూడెంట్ యూనియన్లూ, వాళ్ళ మీద ‘శివ’ టైపు రాజకీయ పెత్తనాలూ, ఎలక్షన్లూ అనే ఇప్పుడు లేని ఒక అవాస్తవిక గాథా ప్రపంచాన్ని సృష్టించారు. పూర్వం వామపక్ష నేత అయిన తాత నుంచి స్ఫూర్తి పొంది కామ్రేడ్ గా స్టూడెంట్ లీడర్ అయిన తను, రొటీన్ మాస్ క్యారక్టర్ లా ఆవేశ ప్రకోపితుడై దెబ్బలాటలకి దిగడమే  కన్పిస్తుంది. 

          తర్వాత హీరోయిన్ రస్మికతో ఈ రోమాంటిక్ సీన్స్ పాత్ర స్వభావంలోకి ఇమిడేవి కావు. పేరుకి మాత్రం కామ్రేడ్, మిగతా పాత్ర చిత్రణంతా రొటీన్ లవర్ బాయ్ తరహానే. హీరోయిన్ అక్కకి లవ్ లెటర్ రాసే చిలిపి పని కూడా చేస్తాడు. కామ్రేడ్ అన్నాక, ఒక లీడర్ అన్నాక  మంచి మెచ్యూర్డ్  పాత్రయి వుంటుందని ఆశిస్తాం. ఆ మెచ్యూరిటీ ఏమీ కన్పించదు. కామ్రేడ్స్ అన్నాక శల్య పరీక్షలు చేసి భావజాల సామీప్యమున్నఅమ్మాయిని  ప్రేమిస్తారేమో కానీ, మరోలా బిహేవ్ చేయరు. చాలా వరకూ తమ  వర్గంలో, తమతో కలిసి పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడతారు. ఇక్కడ హీరోయినేమో పెట్టుబడిదారీ వర్గపు ఆట అయిన  క్రికెట్ క్రీడాకారిణి! ఎలా కుదురుతుంది ఈ గాథా నేపథ్యంతో పాత్రల ప్రొజెక్షన్.

          ఈమెతో ప్రేమలో విడిపోయాక సాత్వికుడుగా మారిపోయి హిమాలయాల్లో గడ్డం పెంచుకుని మూడేళ్ళు వుండిపోవడం రెడ్ రెబెల్ కామ్రేడ్ గిరీకి ఇంకో గొడ్డలి పెట్టు. కమ్యూనిస్టు, కేపిటలిస్టుగా, స్పిరిట్యువలిస్టుగా ఎలా పడితే అలా కనపడతాడు. పాత్ర చిత్రణకి ఓ దృక్పథం, స్థిరత్వం కన్పించవు. ‘శంకరాభరణం’ లో శంకర శాస్త్రి సాంప్రదాయవాది  కాదు, అభ్యుదయవాది, సెక్యులరిస్టు. ఈ పాత్ర చిత్రణ ఇలాగే స్థిరంగా కొనసాగుతుంది. 

          విజయ్ కి తాతే సలహా ఇచ్చి హిమాలయాలకి వెళ్ళేలా చేస్తాడు - దూర ప్రయాణం చెయ్, జీవితంలో  నువ్వేం చేయాలో తెలుస్తుందని. చే గువేరా మోటార్ సైకిల్ డైరీస్ ఐడియానేమో. కానీ మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా లాటిన్ అమెరికా పర్యటించింది సామాజిక స్థితిగతుల్ని తెలుసుకోవడానికి, వాటి పక్షాన తిరుగుబాటు చేయడానికి. అల్లూరి సీతారామరాజు కూడా దేశపరిస్థితిని  ఆకళింపు చేసుకోవడానికి దేశాటన చేసి వచ్చే తుపాకీ చేపట్టాడు. 

          ఆల్రెడీ ఒక స్టూడెంట్ లీడరే అయిన కామ్రేడ్ బాబీకి ఇంకా పర్యటనేమిటి? జగన్ పర్యటన చేసి వచ్చే సీఎం అయ్యాడు. అంటే కామ్రేడ్ బాబీ సమాజం గురించి ఏమీ  తెలుసుకోకుండా కామ్రేడ్ అయిపోయాడా? మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా పర్యటనతో విప్లవ వీరుడయ్యాడు. ఎర్ర కామ్రేడ్ బాబీ పర్యటనలో ఎర్ర రంగు తుడిపేసుకుని మెడికల్ ఎక్స్ పర్ట్ అయ్యాడు. హిమాలయాల్లో ప్రకృతి ధ్వనుల్ని రికార్డు చేసి ఆ ధ్వనులతో మనుషుల్ని బాగుపర్చే సౌండ్ థెరపిస్టు అయిపోయాడు! మాజీ కామ్రేడ్ అయిపోయాడు.  ఒక పాత్రలో, ఒక గాథలో ఎన్ని పరస్పర విరుద్ధ విషయాలు అడ్డగోలుగా జొప్పించారు...ఏక సూత్రత అనేదే లేదు. 


          కానీ సౌండ్ థెరపీతో తనని తానే బాగుపర్చుకోలేకపోయాడు. ఆ మూడేళ్ళూ ఆమె జ్ఞాపకాలతో రోదించాడు. కలవరించాడు. కునారిల్లి పోయాడు. విచిత్రంగా ఈ సౌండ్ థెరపీతో తర్వాత ఆమెని బాగుపర్చాడు. ఆమె ఎర్ర రంగు తుడిపేసుకో మనలేదు. కొట్లాటలు, హింస మానుకోమని మాత్రమే చెప్పింది. మానుకుని సైద్ధాంతిక పోరాటాలు చేస్తే సరి. కమ్యూనిజాన్నే వదిలించుకోవాలన్నట్టుగా హిమాలయాలకి పోయాడు. ఆ తర్వాత ఈ గాథలో కామ్రేడే కాకుండా పోయాడు. ఇదిగో నేనీ ప్రేమని బలిచ్చే రెబలిజాన్ని వదిలి పారేశా, వస్తున్నా - అని ఒక్క కాల్ ఆమెకి చేయలేకపోయాడు. ఇదీ యాక్టివ్ క్యారక్టర్ పాసివ్ గా మారిపోతూ వచ్చిన గాథా క్రమం.

రెండు పిపి వన్లు
      
            ఇది కథే అనుకుని చూస్తూంటే ఫస్టాఫ్ లో రెండు ప్లాట్ పాయింట్ వన్ లు వస్తాయి విచిత్రంగా. రస్మిక క్రికెట్ ఆడి విజయ్ టీము గెలుపొందేలా చేసిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో రాజకీయ కార్యకర్తలతో ఘర్షణ చూసి, రస్మిక చెప్పేస్తుంది - ఇలాటి గొడవలు తన కిష్టముండదని. ఇదొక ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఇంటర్వెల్లో మళ్ళీ భీకర గొడవ జరుగుతుంది. ఆ హింస మళ్ళీ చూసి తనకి  గొడవలంటే ఇష్టం లేదని మళ్ళీ అంటుంది. వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఇదింకో ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

        బయ్యర్లు కాల్స్ చేసి సినిమా నిడివి ట్రిమ్ చేయమంటున్నారనీ, ఎక్కడ చేయాలో అర్ధం గావడం లేదనీ వార్త వచ్చింది. మొదటి గొడవ తీసేసి, ఇంటర్వెల్ గొడవ వుంచుకుంటే సుదీర్ఘమైన ఫస్టాఫ్ నిడివి గంటన్నర నుంచి గంటంపావుకైనా తగ్గుతుంది. రిపీటీషన్ ని కత్తిరిస్తే ట్రిమ్ ఐపోతుంది సింపుల్. ఇలాటి రిపీటిషన్లు ఇంకా వున్నాయి. ఈ సినిమానే వొక రిపీటీషన్ల పిటిషన్. 

          ఇక ఇంటర్వెల్ కి రెండో సారైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది కాబట్టి. ఈ బారుగా సాగిన బిగినింగ్ విభాగం పూర్తయి, విజయ్ కి ఒక గోల్ ఏర్పడుతుందనీ, ఇక కథ ప్రారంభమవుతుందనీ సంతోషిస్తాం. కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే జరిగేదేమిటంటే, విజయ్ హిమాలయాలకి జంప్. అంటే ఇది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదన్న మాట - అని మనకి ఇప్పుడు అర్ధమవుతుంది. అంటే బిగినింగ్ ఇంకా ముగియలేదన్న మాట. కథే ప్రారంభం కాలేదన్న మాట. ఇక ఈ సెకండాఫ్ ని చాలా
భరించాలన్న మాట. హీరోయే ప్రేమ కథని వదిలేసి సెకండాఫ్ స్పేస్ ని ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోతే, హీరోయిన్ కూడా ఏటో వెళ్ళిపోతే, మనమెందుకు ఆ స్పేస్ లో కూర్చుని వుండడం.  హీరోహీరోయిన్లు కన్పించుట లేదు అని కంప్లెయింట్ చేయడమే. 

          మూడేళ్ళ తర్వాత తను హిమాలయాల్లో చేస్తున్న రీసెర్చికి డిమో కోసం హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కాల్ రావడం, అక్కడికెళ్తే  అక్కడే డిప్రెషన్ పేషంటుగా హీరోయిన్ వుండడం! కథా సౌలభ్యం కోసం పాత్రల్ని కిల్ చేస్తూ ఇలాటి కో ఇన్సిడెన్సులు ఇంకొన్ని  పంటికింద రాయిలా అడ్డుపడతాయి. ఎందుకంటే ఇక్కడ కథకుడు హీరో పాత్రని తన గ్రిప్ లోకి తెచ్చుకుని తన ఇష్టానుసారం కథ నడిపిస్తున్నాడు. యాక్టివ్ పాత్రయితే హీరో పాత్ర తన కథ తనే నడుపుకుంటుంది. కథకుడు జోక్యం చేసుకోడు. సినిమా కథలలోనే కాదు, సాహిత్యంలో కూడా కథకుడు కథలో జోక్యం చేసుకోకూడదన్నజనరల్ రూలుంది. కానీ ఇప్పటి సినిమా కథల్లో ఏం జరుగుతోందంటే, కథకుడు కథలో జోక్యం చేసుకోవడంతో పాసివ్ పాత్రలు పుట్టుకొచ్చి సినిమాల్ని ముంచేస్తున్నాయి. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు ఇంత పనీ చేస్తున్నాయి అజ్ఞానంతో సృష్టించుకుంటున్న పాసివ్ పాత్రలు. 20 - 30 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నపుడు యాక్టివ్, పాసివ్ క్యారక్టర్ లంటే ఏమిటో తెలియకపోవడం తెలుగు సినిమాల విచిత్ర విషాదం. ఈ విషాదం కూడా 2000 నుంచీ నయా దర్శకులతోనే మొదలైంది. నయా దర్శకులకి రచనా సామర్ధ్యం లేదు. వాళ్ళు  సాహిత్య మూలాల్నుంచీ, నాటక మూలాల్నుంచీ వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. 

      ఇంటర్వెల్లో ప్రేమలో సమస్య దగ్గర్నుంచే కథకుడు పాత్రని హిమాలయాలకి పంపేసి  పాసివ్ గా మార్చడంతో, ఇక కోలుకోలేదు సెకండాఫ్ అంతా విజయ్ దేవరకొండ కామ్రేడ్ పాత్ర. హైదరాబాద్ హాస్పిటల్లో యాక్సిడెంటల్ గా హీరోయిన్ పేషంట్ గా ఎదురయ్యిందే తప్ప, ఆమె ఏమయివుంటుందనే ఆలోచన ఇంతకాలం కామ్రేడ్ కి లేదు. పెళ్లి చేసేసుకుందేమోనన్నవర్రీ కూడా లేదు. అతడి మనోగతం మనకి తెలీకుండా మూసేసి యాంత్రికంగా నడుపుతున్నాడు కథకుడు. ఇక పాత్ర బోరు కొట్టకుండా ఎలా వుంటుంది. 

          ఆమెకి యాక్సిడెంట్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లిందని మళ్ళీ గాథ వెనక్కొస్తుంది. రిపిటీషన్. అతనెలా హిమాలయాలకి వెళ్లి తనని తానూ ‘బాగు’ చేసుకున్నాడో. అలా ఆమెని ప్రకృతిలోకి తీసికెళ్ళి బాగు పర్చడం.  గాథయినా ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్ళే ఇంకో రిపీటీషన్ ఏమిటంటే, తను కాకినాడలో ఇంటికెళ్ళడం. మూడేళ్ళూ కన్పించని క్షేమ సమాచారం తల్లి అడగడం. ఈ సమాచారం ప్రేక్షకులకి తెలిసిందే, ఇంకెందుకు? ఇంకో రిపీటీషన్ హీరో ఫ్రెండ్ పెళ్లి అని కల్పించి, మళ్ళీ గాథని వెనక్కి కాకినాడకి షిప్ట్ చేయడం. ఆ పెళ్ళిలో ఆడి పాడడం. ఆల్రెడీ ఈ పెళ్ళిలో ఆటాపాటా ఫస్టాఫ్ లో హీరోయిన్ అక్క పెళ్ళిలో అయ్యిందే. 

          ఈ పెళ్లి పెరంటాల వ్యవహారం ఎలా వుందంటే, ఈ లెఫ్ట్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ జానర్ లో పానకంలో పుడకలా వుంది. కనీసం తన కామ్రేడ్ సిద్ధాంతాల ప్రకారం ఫ్రెండ్  పెళ్లయినా ఆదర్శ దండల మార్పిడి పెళ్లి కాలేదు. ఈ పెళ్ళిళ్ళతో కాన్సెప్ట్ కి వచ్చిన ఉపయోగం కూడా లేదు.  

          ఇది కథైతే హీరోకో గోల్ వుంటుంది. దాంతో  కథ ఏక త్రాటిపై నడుస్తుంది. గాథ అన్నాక, అందులో పాసివ్ పాత్ర అన్నాక, గోల్ వుండదు. అందుకని ఎలా పడితే అలా టైం పాస్ సన్నివేశాలు భర్తీ అవుతూ పోతాయి. కథకి స్ట్రక్చర్ వుంటుంది కాబట్టి  ఈ టైం పాస్ సన్నివేశాలు బిగినింగ్ లోనే వుంటాయి. మిడిల్లో వుండవు. స్ట్రక్చర్ వుండని గాథల్లో మిడిల్ వుండదు. బిగినింగే అంతులేకుండా సాగుతూ వుంటుంది ఇలాటి విషయం  లేని సన్నివేశాలతో. 

మార్కెట్ యాస్పెక్ట్ లేని కథ 
చివరిగా -  ఇక హిమాలయాలనుంచి వచ్చిన  హీరో మారాడని హీరోయిన్ తిరిగి ప్రేమిస్తుంది. ఎన్ని సార్లని  తిరిగి ప్రేమిస్తుంది? ఇంటర్వెల్ కి ముందు ప్రత్యర్థులతో ఘర్షణ పడినప్పుడు మారతానన్నాడు. అప్పుడు నమ్మి తిరిగి ప్రేమించింది. ఇంటర్వెల్లో ఇంకా భీకరంగా ప్రత్యర్ధులతో ఘర్షణ పడ్డాడు. ఇక ఇతణ్ణి నమ్మనని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ రౌడీ కొట్లాటల కారణం చేత హీరోయిన్ విడిపోవడమన్నది చాలా పాత టెంప్లెట్టే, కొత్త పాయింటేమీ లేదు. 

          ఇక సెకండాఫ్ లో హిమాలయాల్లో మారిపోయి వచ్చాడని తిరిగి రెండోసారి ప్రేమిస్తుంది. అంతలోనే తడాఖా చూపిస్తూ ఆమె క్రికెట్ బాస్ ని కొట్టి నానా బీభత్సం చేయడం తో షాక్ తిని, ఛీ నిన్నిక ప్రేమించను పొమ్మంటుంది. ఎన్నిసార్లని ఇలాగే  అంటుంది. ఇలా ఈ ప్రేమ గాథైనా ముందుకే పోదు. మాటిమాటికీ వెనక్కే పోతోంది. హీరోయిన్ కి ఓ స్పష్టత లేదు. పాసివ్ పాత్ర. మూడేళ్ళూ ఇంకా ఎందుకిలా వుండిపోయింది? అతడి కోసం ఎదురు చూస్తోందా? లేక ప్రేమలో దెబ్బ తిన్నది కాబట్టి, ఇక ప్రేమించనే కూడదని, పెళ్ళే చేసుకోకూడదనీ  ఇలా వుండి పోయిందా? ఈమె మానసిక లోకం కూడా అర్థం గాకుండా మూసేశాడు కథకుడు. భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశాడు. పాత్రలతో తన స్వభావ ప్రకటనా స్వేచ్ఛ మాత్రం ఎలా పడితే అలా మారిపోతూ వుంది. 

          ఆమె యాక్సిడెంట్ కి కారణం ఆమె క్రికెట్ బాస్ ఆమెని నేషనల్ కి సెలెక్ట్ చేయాలంటే సెక్సువల్ ఫేవర్ డిమాండ్ చేయడం, దీని మీద ఆమె తోటి ప్లేయర్ కంప్లెయింట్ చేయడం, దీంతో ఆమెని చంపడానికి యాక్సిడెంట్. ఇదంతా విషయం లేకుండా నడుస్తున్నరెండు గంటల 20 నిమిషాల సుదీర్ఘ గాథకి, ఆకస్మికంగా విషయాన్ని సమకూర్చుకుని, 30 నిమిషాల కథగా - ముగింపుగా అతికింపు. 

          ఈ కథలో హీరోయిన్ పాసివే కాదు, విషాద పాత్ర. ఆమెకి ఈ లైంగిక వేధింపుల మీద పోరాడాలంటే భయం భయం. పరువు బజార్న పడుతుందని. హీరోకి ఏ మాత్రం సహకరించదు, పై పెచ్చు విడిపోతుంది. పాతకాలం టెంప్లెట్ హీరోయిన్ని ఈ కాలంలో  ప్రయోగించారు. 

       హీరోయిన్ పాత్రెలా వుందంటే, లైంగిక వేధింపుల పై అవగాహన ఏ మాత్రంలేదు. ఈ అవగాహన పెంచుకుని బయట యువతులు చుక్కలు చూపిస్తూంటే, ఈమె భయంతో ముడుచుకు కూర్చుంది. నేటి యువతులకి ఆదర్శంగా, సంఘీభావంగా చురుగ్గా వుండాల్సిన తను,  ఈ సినిమా చూసే ప్రేక్షకుల్లో నేటి యువతులకి కనెక్ట్ కాక అసంతృప్తి మిగిల్చే శాల్తీగా వుండిపోయింది. ఇంకా కమర్షియల్ సినిమాల్లో ఇదే వరస. యువతులకి ఒక ఆదర్శప్రాయమైన హీరోయిన్ పాత్రని తెరమీద చూడాలంటే దొరకడం లేదు. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ కి ఇదొక లోపం. కథకుడి క్రియేటివ్ యాస్పెక్ట్ ఎక్కడా మార్కెట్ యాస్పెక్ట్ తో కలవడం లేదు. 

          ఈ సినిమాలో చెబుతున్న విషయం లైంగిక వేధింపుల గురించని చెప్పడానికి అధైర్య పడి రెండున్నర గంటలసేపు దాట వేయనవసరం లేదు. ‘మన్మర్జియా’ లో టౌన్లో మధ్యతరగతి కుటుంబంలో హీరోయిన్ సహజీవన కథ ఎంత సాఫీగా, ఫన్నీగా చెప్పారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా’ లో సాంప్రదాయ కుటుంబంలో హీరోయిన్ స్వలింగ సంపర్కపు కథ ఎంత ముచ్చటగా చూపించారు. ‘లుకా  చుప్పీ’  లో కూడా మధ్యతరగతి కుటుంబంలో సహజీవన కథని ఎంత వినోదాత్మకంగా చూపించారు. బోల్డ్ కథల్ని ఫ్యామిలీ సినిమాలుగా మార్చి  సక్సెస్ అవడానికి ఎంత ధైర్యం కావాలి. ధైర్యం చేయకపోతే దగాపడడమే. 

          ‘డియర్ కామ్రేడ్’ హీరోయిన్ లైంగిక వేధింపుల కథయినప్పుడు అది మొదట్నుంచీ వుండాలి. హీరోయిన్ ఒక కారణం చెప్తుంది, గొడవలంటే తన కెందుకు ఇష్టం లేదో. తన అన్న కూడా గొడవల్లో చనిపోయాడు కాబట్టని. అలాంటప్పుడు లైంగిక వేధింపుల విషయంలో ఈ కారణంగానే భయపడాలి. ఆమె భయపడ్డానికి పరువు కారణంగా చూపించారు. అంటే అన్న మరణించిన భయం వొట్టిదే నన్న మాట. అందుకని కథలో అతకని అన్న మరణించిన భయం కాకుండా,  ఇంటర్వెల్లో  హీరో మీద ఫైర్ అవుతున్నప్పుడు - నేను నీ గొడవలకి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నానో తెలుసా - నాకు ఇంతకంటే పెద్ద డిస్టర్బెన్స్ వాడితో వుంది – అని క్రికెట్ బాస్ గురించి హీరోయిన్ బరస్ట్ అయివుంటే, ఈ భారమైన గాథ హుషారైన కథగా మారేది.

సికిందర్