రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 4, 2023

1389 : రివ్యూ

 


రచన -దర్శకత్వం: అరుణ్ విక్కిరాల
తారాగణం : సుడిగాలి సుధీర్, డాలీ షా, స్పందన, శివబాలాజీ, రవితేజ నన్నిమాల తదితరులు
నేపథ్య సంగీతం: మార్క్ కె రాబిన్, సంగీతం (పాటలు) : మోహిత్ రెహమానియక్ ఛాయాగ్రహణం: సన్నీ
నిర్మాతలు: వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి
విడుదల :  డిసెంబర్ 1, 2023  
***

        గాలోడు తో హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు. ఇదొక ప్రయోగమని చెప్పాడు. ఈ ప్రయోగంలో కొత్త తరహా పాత్ర పోషించానన్నాడు. కొత్త దర్శకుడు అరుణ్ విక్కిరాలని ఎంతో కొనియాడేడు. కాలింగ్ సహస్ర అనేది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ టైటిల్. చాలా పరిమిత బడ్జెట్ తో అపరిమిత ఆశలతో హీరో, దర్శకుడు కలిసి తెరకెక్కించారు. లేదా బలాత్కరించారు. గాలోడు తో మాస్ కమర్షియల్ హీరోగా పరిచయమైన సుధీర్, మరి మాస్ కమర్షియల్ కాకుండా తన మీద  చేసుకున్న ఈ ప్రయోగంతో ఏం సాధించాడో చూద్దాం...

కథ

అజయ్ శ్రీవాత్సవ (సుధీర్) బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేరతాడు. అతడి అక్క హత్యకి గురైంది. ఆమెలాగా అమ్మాయిలు బలి కా కూడదని ఒక యాప్ డెవలప్ చేస్తాడు. ఇక్కడ అన్నయ్యా అని పిలిచే సత్య (రవితేజ) తో కలిసి వుంటాడు. ఒకరోజు సిమ్ కార్డు కొనుగోలు చేస్తాడు. అప్పట్నుంచీ అతడి ఫోన్ కి సహస్ర (డాలీ షా) కావాలని కాల్స్ వస్తూంటాయి. సహస్ర కోసం ఎవరెవరో కాల్స్ చేస్తూంటే అయోమయంలో పడతాడు. ఇంకో పక్క సత్య పరిచయం చేసిన స్వాతి (స్పందన) తో ప్రేమలో పడతాడు. అయితే సారా పేరుతో ఇంకో అమ్మాయి ఉత్తరాలు రాస్తూంటుంది. ఈ సారా ఎవరు? సహస్ర ఎవరు? తన అక్క చావుకీ, సహస్ర కనిపించకపోవడానికీ సంబంధం ఏమైనా వుందా? లూసిఫర్ అనే డార్క్ వెబ్సైట్ ముఠా వ్యహారమేమిటి? ఇవి తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.  

ఎలావుంది కథ

ఈ కథ ఇలా ఎందుకుంది, ఇలా వుండాలి కదా అని మెదడుకి పని చెపుతూ ఎక్సర్ సైజ్ చేయడానికి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. తద్వారా మంచి సినిమా రైటర్స్ అవచ్చు. దర్శకుడికి ఋణపడి వుండొచ్చు. సుడిగాలి సుధీర్ ప్రయోగమంటే మామూలుగా వుండదు కదా? ప్రేక్షకుల మెదళ్ళపై ప్రయోగం. అన్నట్టు డార్క్ వెబ్సైట్ ముఠా అమ్మాయిల్ని టార్చర్ చేస్తూ ఇలాటి ప్రయోగాలే చేస్తూంటుంది. వీళ్ళు ప్రేక్షకుల వెంట పడకపోవడం మంచిదైంది.
       
హార్రర్ ని కలిపిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లాజిక్స్ ని అడక్కూడదు. ఆత్మతో వుండాల్సిన కథ వుండదు. ఆ సిమ్ కార్డుకి కాల్స్ ఎందుకొస్తున్నాయో తెలీదు. అదే సిమ్ కార్డునుంచి అదే ఫోనుకి మెసేజిలు ఎలా వస్తున్నాయో తెలీదు. ఇవి ఆత్మ చేస్తున్న పనులా తెలీదు. ఇవి తెలుసుకోవడానికి సెకండాఫ్ కెళ్తే ఆత్మ తెలుస్తుంది గానీ
, ఆత్మతో వుండాల్సిన సినిమాటిక్ కథనం వుండదు. కనుక హార్రర్ ఏమీ వుండదు. అమ్మాయిల రక్షణకి యాప్ డెవలప్ చేసిన హీరోకి- ఉత్తరాలు రాసే సారాతో, మెసేజిలు పంపే సహస్రతో సాఫ్ట్ వేర్ సోల్యూషన్ ఏంటో తెలీదు. తెలుసుకునే ప్రయత్నం చేయక, ఇంటర్వెల్ వరకూ కన్ఫ్యూజ్ అవుతూ పిచ్చిగా ఓ కేక వేస్తాడు. ఈ కేకవేసే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మంగళవారం లో పాయల్ రాజ్పుత్ లా సహస్రని దెయ్యంలాగా చూపించి షాకివ్వచ్చుగా? దేని ప్లేస్ మెంట్ ఎక్కడుండాలో కథనం తెలియకపోతే ఎలా?
       
సెకండాఫ్ లో సహస్ర ఎవరో తెలుస్తుంది. ఆమెతో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో సహస్ర కథ అత్యంత నీరసంగా వుంటుంది. ఇలా సహస్ర- సారాల మిస్టరీ వీడాక
, డార్క్ వెబ్ సైట్ ముఠాతో యాక్షన్ సీన్లు మొదలవుతాయి.
       
కథా కథనాలుగానీ
, పాత్రచిత్రణలుగానీ, దర్శకత్వంగానీ ఏవీ కనిపించని పోవడమే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అర్ధం అన్నట్టు వుంటుంది. వీటిని కనుక్కునేందుకు ప్రేక్షకులు చేసే ప్రయత్నంతో అనుభవించేదే, సస్పెన్స్, థ్రిల్! గాలోడు సుడిగాలి సుధీర్ ప్రయోగాత్మకంగా అందించిన గాలి సినిమా ఇది.

నటనలు- సాంకేతికలు

జబర్దస్త్ కమెడియన్ అయిన సుధీర్ సాహసించి ఈ సీరియస్ పాత్ర వేసినందుకు అభినందించి తీరాలి. తన నుంచి ప్రేక్షకులాశించే కామెడీతో అలరించని లోటు కనబడనీయకుండా సీరియస్ పాత్రతో చేసిన ప్రయోగం వరకూ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఈ సీరియస్ పాత్రకి తగ్గ కథ, భావోద్వేగాలు, కథానాయకుడిగా తనే కథని పరుగులెత్తిస్తూ తగిన సస్పెన్స్, థ్రిల్స్ వుండేట్టు చూసుకోవాల్సిన బాధ్యతని మాత్రం మరిచాడు. వీటిని డిమాండ్ చేసి దర్శకుడి నుంచి పొందడం తన డ్యూటీయే. మాస్ సినిమాలు తీసినంత ఈజీ కాదు సస్పెన్స్ థ్రిల్లర్ తీయడం. సస్పెన్స్ థ్రిల్లర్లు, హార్రర్ లు ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలుగా వుండేవి. ఈ శతాబ్దం ఆరంభంలో బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హాష్మీ, జాన్ అబ్రహాం లాంటి స్టార్లు నటించడం మొదలెట్టి వీటికి మెయిన్ స్ట్రీమ్ గ్రేడ్ సినిమాల హోదా కల్పించారు. తెలుగులో బి గ్రేడ్ కే కుదించి వుంచుతున్నారు వీటి విలువ, మార్కెట్ విస్తృతి తెలీక.
       
ఇక ఇందులో హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికేం లేదు. వుమెన్ ప్రొటెక్షన్ గురించి తీసిన సినిమాలో హీరోయిన్లకే స్థానం లేదు. సోషల్ ల్ మీడియా కమెడియన్ రవితేజ సన్నిమాల సోషల్ మీడియాలోనే కామెడీ వీడియోలతో బెటర్. శివబాలాజీ విలన్ పాత్ర వేశాడు. ఇక సంగీతం
, కెమెరా, ఫైట్ సీన్స్ వగైరా హాస్యాస్పదంగా వున్నాయి. దర్శకుడు అరుణ్ విక్కిరాల రాయడంలోనే కాదు, తీయడంలో కూడా సినిమా క్రాఫ్ట్ నేర్చుకోవాల్సిందెంతో వుంది.
—సికిందర్