రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, డిసెంబర్ 2015, శనివారం

తారుమారు!!




దర్శకత్వం : జి. శ్రీనివాస రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, మోహన్ బాబు, పూర్ణ, మీనా, రమ్యకృష్ణ, వరుణ్ సందేశ్, అలీ, జీవా, కృష్ణ భగవాన్, రఘుబాబు, రాజా రవీంద్ర, సురేఖా వాని తదితరులు 
సంగీతం : కోటి, రఘు కుంచె, అచ్చు , ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత : విష్ణు మంచు
విడుదల : 25 డిసెంబర్, 2015
***
        కుటుంబ కథా చిత్రాల పేరుతో ఇవ్వాళ్ళ వస్తున్న సినిమాలు అయితే రాక్షస కుటుంబాల కథలుగా, కాకపోతే 1990 లనాటి పాత వాసన కథలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లోఫర్, సౌఖ్యం వంటి నరుక్కునే రాక్షస కుటుంబాల ‘ఫ్యామిలీ సినిమా’లు మళ్ళీ మళ్ళీ  ప్రేక్షకులు చూశాక, ఈసారి ‘మామ మంచు- అల్లుడు కంచు’ పేరుతో  1990 ల నాటి ‘ఫ్యామిలీ కామెడీ’ని వడ్డించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జి. శ్రీనివాస రెడ్డి. ఇందుకు మోహన్ బాబు- అల్లరి నరేష్ లతోబాటు,  నాటి హీరోయిన్లు మీనా- రమ్యకృష్ణ లతో కలర్ ఫుల్ గా  కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అయితే ఎంత కలర్ ఫుల్ గా సినిమా తీర్చిదిద్దారన్న కుతూహలం ఈ సినిమాకిచ్చిన పబ్లిసిటీతో ప్రేక్షకులకి ఏర్పడుతుంది. అలాటి  కుతూహలాన్ని శ్రీనివాస రెడ్డి ఎలా తీర్చారు, అసలు తీర్చాలా లేదా తెలుసుకోవాలని మనకి వుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం...

స్టోరీ @ 1990
        బిజినెస్ మాన్ భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) కి ఇద్దరు భార్యలు. ఒక భార్య సూర్య కాంతం (మీనా) భర్తని  ‘బాయ్యా’ (బావయ్యా కి షార్ట్ ఫాం) అని ప్రేమగా పిలుస్తూ కూకట్ పల్లిలో వుంటుంది. ఇంకోభార్య ప్రియంవద ( రమ్యకృష్ణ) భర్తకి కడుపునిండా తిండి పెడుతూ జూబ్లీ హిల్స్ లో వుంటుంది. ఆమెకి శృతీ నాయుడు ( పూర్ణ) అనే కూతురుంటుంది, ఈమెకి గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్) అనే కొడుకుంటాడు. ఇలా ఇద్దరు భార్యల్నీ సపరేట్ గా వుంచి వాళ్లకి తెలీకుండా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తూంటాడు భక్తవత్సలం. ఖర్మకాలి ఓనాడు ఆ శృతీ- ఈ గౌతమ్ లు లవ్ లో పడతారు. భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. పిక్చర్లోకి బాలరాజు ( నరేష్) ఎంటరవుతాడు. భక్తవత్సలం ఇచ్చిన ప్లాను పట్టుకుని శృతి దృష్టిని  గౌతమ్ మీంచి మళ్ళించడానికి పూనుకుంటాడు. ఖర్మకాలి శృతితో తనే లవ్ లో పడతాడు. మళ్ళీ భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఎంటరవుతాడు. ఇక ఇటు భార్యనీ, అటు భార్యనీ, ఇటు కూతుర్నీ అటు కొడుకునీ కన్ఫ్యూజ్ చేసి పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దూకుతారు. మధ్యలో తన కూతురు ప్రేమిస్తున్న బాలరాజుని అవుట్ చేసేందుకు భక్తవత్సలం ఎత్తుగడలతో... భక్తవత్సలంని తిప్పికొట్టేందుకు అతడి  ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసిపోతాయి బాలరాజుకి. ఇక తను ఆడుకోవడం మొదలెడతాడు..

        అసలు భక్తవత్సలం ఎందుకు ఇద్దర్నీ పెళ్ళిచేసుకున్నాడు, ఆ నిజమేమిటి, అది తెలుసుకున్న బాలరాజు భక్తవ్సలం ఫ్యామిలీ సమస్యనీ, తన లవ్ సమస్యనీ ఎలా తీర్చుకున్నాడు,  చివరికి భార్యలతో భక్తవత్సలంకి సుఖాంతమయిందా, దుఖాంతమయిందా తెలుసుకోవాలంటే ఈ ఫ్యామిలీ కామెడీ- డ్రామా పూర్తిగా చూడాల్సిందే- 1990 స్టయిల్లో. 

ఎవరెలా చేశారు
       
నిజానికి మోహన్ బాబు దారి తప్పి ఈ సినిమాలో నటించారు గానీ, లేకపోతే ఇప్పటికీ  చెక్కుచెదరని ఫిజిక్ తో, యాక్టింగ్ లో టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో వేరే పవర్ఫుల్ సినిమా ఏదైనా చేసివుంటే 181 వ సినిమా ధన్యమయ్యేది. ప్రస్తుత సినిమాలో ప్రధాన కథ తనదే, అల్లరి నరేష్ ది కాదు. అల్లరి నరేష్ ది తోడ్పడే పాత్ర మాత్రమే. ఇది బాగా మైనస్ అయింది యూత్ అప్పీల్ కి. పూర్తిగా మోహన్ బాబు సినిమానే అన్నట్టు తయారవడంతో యువ ప్రేక్షకులు ఫస్టాఫ్ లోనే, కొందరు ఇంటర్వెల్లోనే వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తాం. అల్లరి నరేష్ మెయిన్ రోల్ దక్కే కథలో మోహన్ బాబు సపోర్టింగ్ రోల్ వేయాల్సిన లెక్కలు తారుమారయ్యాయి. దీంతో మోహన్ బాబు ఈ పాత్రలో ఎంత బాగా చేసినా, నవ్వించినా  బూడిదలో పోసిన పన్నీరే  అయింది. నరేష్ సంగతి చెప్పక్కర్లేదు. తను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న 50 వ సినిమా కూడా ప్లస్ కాని పరిస్థితి.

        హీరోయిన్ పూర్ణ ఎంతసేపూ చిరునవ్వుతో చూడ్డం తప్ప ఇంకేమీ చేయదు. సీనియర్ హీరోయిన్ లిద్దరూ వాళ్ళ టాలెంట్ బాగానే చూపించుకున్నా,  ఇదీ మోహన్ బాబు పాత్రకి లాగే యూత్ అప్పీల్ కి నప్పలేదు. హీరోకి కత్తి లాంటి ఇద్దరు యువ హీరోయిన్లు, సీనియర్ హీరోకి ఒక సీనియర్ హీరోయినూ వుండి రక్తి కట్టించాల్సిన కామెడీ  ఇది. అంటే అల్లరి నరేష్ కే ఇద్దరు భార్యలుండాల్సిన ట్రెండీ కామెడీ, కాంబినేషన్లు తారుమారై కాలం చెల్లిన రూపాన్ని సంతరించుకుంది.
        అలీకి సినిమా ఆసాంతమూ చిక్కుల్ని పరిష్కరించే పాత్రదక్కింది. పాత్రకి ఆడపిచ్చి అతి గా మారింది. ఇతరపాత్రల్లో మిగిలిన నటీనటులు- వరుణ్ సందేశ్ సహా సోసోగా నటించేశారు.

        టెక్నికల్ గా, సంగీత సాహిత్యాల పరంగా చెప్పుకోవడానికేమీ లేదు.

చివరికేమిటి?
        ర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుల కుతూహలం తీరుస్తున్నాననుకుంటూ నీరుగార్చాడు. ఉత్త డైలాగుల మోతతో సినిమా అంతా కామెడీగా నడుపుదామనుకోవడంలో కూడా వెనకబాటు తనమే కనిపిస్తోంది. టేకింగ్ కూడా పాత సినిమా శైలిలో వుంది. ఆఫ్ కోర్స్, ఈ డైలాగుల మోతతోనే కొన్ని చోట్ల బాగా నవ్వొచ్చేట్టు  సీన్లు తీసిన మాట నిజమే. ఇలాగైనా వీలైనన్ని చోట్లా సీన్లు స్టాండప్ కామెడీగా తీసివుండాల్సింది. ఇక మోహన్ బాబు పాత్ర రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అగత్యం గురించి తెలిపే ఫ్లాష్ బ్యాక్ విషయంలో కూడా అలసత్వమే కనబరచాడు దర్శకుడు. మోహన్ బాబు- మీనా- రమ్య కృష్ణలు ఆనాడు నటించిన ‘అల్లరిమోగుడు’ దృశ్యాల్లోంచే క్లిప్పింగ్స్ తీసి ఫ్లాష్ బ్యాక్ గా వేశారు. ముందు పెళ్లి చేసుకున్న భార్యగా మీనా పాత్ర వుండగా, రెండో పెళ్లి ఆమెకి తెలీకుండా రమ్యకృష్ణ పాత్రని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన  కారణాన్ని  ‘ జీవిత చక్రం’ లోంచి ఎత్తేశారు. నందమూరి తారకరామారావు నటించిన ‘జీవిత చక్రం’ లో కమల (శారద) జబ్బుతో మరణం ఖాయమైపోయిన స్థితిలో చివరి కోరిక కోరుతుంది. రాజా (ఎన్టీఆర్) చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని. రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. చివరి కోరిక తీర్చుకుని చచ్చి ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే,  ఇలా సుశీల (వాణిశ్రీ) కి కి అడ్డు అయ్యిందేమిటి? రాజాకీ ఏమీ తోచని స్థితి! ఇదీ ట్విస్టు.

ఈ ట్విస్టే పెట్టి  ఫ్లాష్ బ్యాక్ చెప్పారు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆనాడు దర్శకుడు, గొప్ప కథా రచయిత సిఎస్ రావు పెట్టిన ఈ ట్విస్టు గొప్ప సంచలనమైతే ...ఈనాడు..???


-సికిందర్