రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, డిసెంబర్ 2015, ఆదివారం

చరిత్రకి స్క్రీనీకరణ!








 దర్శకత్వం : స్టీవెన్ స్పీల్ బెర్గ్ 

తారాగణం : లియాం నీసన్, బెన్ కింగ్స్ లే, రాల్ఫ్ ఫిన్నెస్, కరోలిన్ గూడాల్, జోనాథన్ సాగాల్, ఎంబెత్ డేవిట్జ్  తదితరులు
కథ : థామస్ కెనెల్లీస్క్రీన్ ప్లే : స్టీవెన్ జిలియన్సంగీతం : జాన్ విలియమ్స్, ఛాయాగ్రహణం : జానస్ కామిన్ స్కీ , కూర్పు : మైకేల్ కాన్ 
బ్యానర్ : యాంబ్లిన్  ఎంటర్ టైన్ మెంట్ , నిర్మాతలు : స్టీవెన్ స్పీల్ బెర్గ్, గెరాల్డ్ మోలెన్, బ్రాంకో లస్టిగ్ 
విడుదల : నవంబర్ 30, 1993 

              మహోజ్వల చిత్రరాజాలు చరిత్ర పుటల్ని ఓసారి తిరగేస్తాయి. ప్రజలకి తెలియని, తెలిసినా మర్చిపోయిన కఠోర సత్యాల్ని మరొక్క సారి గుర్తుకు తెస్తాయి. ప్రపంచానికి అద్దం  పట్టడం మహోజ్వ చిత్ర రాజం నిర్వర్తించే మహా కార్యమైతే,  దానికి పట్టం గట్టడం మిగతా సభ్య ప్రపంచపు కర్తవ్యం. పట్టం గట్టడమే ఏమిటి,  అవార్డుల పంటలతో సమాదరిచకుండా మానవాళి కూడా నిద్రపోదు. నిద్రపోనివ్వని నిజాల చిత్రణకి అంతటి విలువ వుంటుంది. ఆ విలువని చాటిన ఒక అపురూప కళాఖండమే  హాలీవుడ్ విజువల్ మాంత్రికుడైన స్టీవెన్ స్పెల్ బెర్గ్ సృష్టి  ‘షిండ్లర్స్ లిస్ట్’.

           షిండ్లర్స్ లిస్ట్ అనగానే హిట్లర్ పాలనలో శవాల గడ్డగా మారిన నాటి జర్మనీ చటుక్కున మనో ఫలకాల మీద మెరుస్తుంది. ఒడలు జలదరించేట్టుగా హిట్లర్ సాగించిన దురాగతాలు ఒకటొకటిగా కళ్ళ ముందు కదలాడతాయి. ఈ దారుణ మారణ హోమాన్ని  చరిత్రలోంచి తవ్వి తీసి చలన చిత్రంగా నిర్మించాలన్న కోరిక స్టీవెన్ స్పీల్ బెర్గ్ కి బలపడింది. కానీ ఈ కలని నిజం చేసుకోవడానికి పదేళ్ళూ పట్టింది. అయినా ఇది ప్రపంచ వెండి  తెరలకి ఎక్కేటప్పటికి ప్రేక్షకులు దీని తీవ్రతకి దిగ్భ్రాంతి చెందారు. ఇంకిలాటి చరిత్ర అస్సలు పునరావృతం కాకూడదని ఎలుగెత్తి చాటారు. ప్రేక్షకుల్ని ఇంతలా కదిలించిన ఈ దృశ్య  బీభత్సంలో అసలేముందో తెలుసుకుంటే...

       తెలుసుకునే ముందు,  ఒకసారి హిట్లర్ ఈ దుష్కృత్యాలకి ఎప్పుడు, ఎందుకు, ఎలా పాల్పడ్డాడో తెలుసుకుందాం...1933 లో హిట్లర్ అధికారం లోకొచ్చి రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. అతను యూదు మతస్థుల్నీ, జిప్సీలనీ (బంజారా జాతి), స్వలింగ సంపర్కుల్నీ, వికలాంగులనీ అపరిశుద్ధులుగా ప్రకటించాడు. వీళ్ళందర్నీ కట్టగట్టి జర్మనీ నుంచీ తద్వారా, మొత్తం మిగతా ప్రపంచాన్నుంచీ సమూలం గా తుడిచిపెట్టేయాలనీ  తీర్మానించాడు. 1935  లో న్యూరెంబర్గ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని ప్రకారం యూదు తండ్రికి పుట్టిన సంతానం మాత్రమే  యూదులవుతారని గాకుండా, వారికి ముగ్గురు క్రైస్తవులైన  తాతలుండి, తర్వాత తండ్రులు మతం మారినా యూదులవుతారని నిర్ణయించాడు. ఒక్క ఆర్యన్ జాతి వాళ్ళు  మాత్రమే పరిశుద్ధులనీ, కనుక మిగతా యూదులందర్నీ తుదముట్టించేందుకు  వీలుగా ఈ చట్టాన్ని తెచ్చాడు.

          దీంతో 1938 లో
  నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ ( అంటే నాజీలు) యూదులకి చెందిన వ్యాపార కేంద్రాలని ధ్వంసం  చేయడం ప్రారంభించారు. యూదు జాతి అంతానికి ఇదే నాంది అన్నట్టుగా ఈ విధ్వంసాలతో ఒక  హెచ్చరిక పంపారు.

          1939 లో పోలాండ్ మీద జర్మనీ దాడి చేసేటప్పటికే జర్మనీ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నీ యూదుల సంహారంతో అట్టుడికి పోతున్నాయి. ఇక పోలాండ్ లోనూ యూదులని వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటికి లాగి మురికి వాడల్లోకి
, వాళ్ళని చంపేందుకు ఏర్పాటు చేసిన  కాన్సంట్రేషన్ క్యాంపులనే నరక కూపాల్లోకీ తండోప తండాలుగా తరలించి కుక్కారు. ఇళ్ళల్లోంచి బయటికి లాగినప్పుడు వాళ్ళని యూదులుగా గుర్తు పట్టేందుకు చేతులకి పట్టీలు కట్టారు. క్రాకోవ్ అనేది అలాటి ఒక మురికివాడ. ఇక్కడ ఇరవై వేలమందిని పశువుల్లా కుక్కారు. వాళ్ళతో కూలి పనులు చేయించుకోసాగారు. అప్పుడప్పుడు మొబైల్ యూనిట్లు వచ్చి వాళ్ళల్లో కొందర్ని సరదాగా చంపేసి  వెళ్ళిపోసాగాయి.

1941 లో ఫైనల్ సొల్యూషన్ ని అమలుపర్చారు. అంటే  మొత్తం యూదుల్నీ, జిప్సీలనీ  భారీ ఎత్తున పోగేసి హతమార్చడమన్న మాట.  మానవ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమది. ఇంతకంటే అమానుష కృత్యాలు మానవ చరిత్రలో ఎక్కడా కన్పించవుయూదుల్ని డెత్ క్యామ్పులకీ, గ్యాస్ ఛాంబర్లకీ తీసికెళ్ళి  అమానుషంగా చంపడం మొదలెట్టారు. ఆ మృత కళేబరాల్ని పెద్ద పెద్ద పొయ్యిల్లో వేసి బూడిద చేశారు. ఆ నల్లని పొగ మేఘాలు సమీప పట్టణాలని  కమ్మేసేవి, చితాభస్మాలు ధూళి మేఘాల్లా ఎగిరి వచ్చి మీద పడేవి.

          క్రాకోవ్ లో దుర్మతుల ఈ మానవసంహారం కొనసాగుతున్న నేపధ్యంలోఆస్కార్ షిండ్లర్ అనే  అతను  తెరపైకొచ్చాడుఇతను యుద్ధ పనుల కాంట్రాక్టర్, పైగా స్త్రీ లోలుడు. ఇతను తన ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న 1100 వందల మంది యూదుల ప్రాణాల్ని కాపాడాడు. ఆ యూదులు మేము షిండ్లర్ యూదులంఅని గర్వంగా, ఒక లైసెన్సు లాగా  చెప్పుకునేంతగా వాళ్ల బానిస జీవితాలకి తోడ్పడ్డాడు. హిట్లర్ కొనసాగించిన యూదుల మారణ హోమంలో లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి వాళ్ళని ఓ 11 వందలమందిని షిండ్లర్  కాపాడితే అదేమంత గొప్ప విషయంగా కన్పించక పోవచ్చు.  కానీ యూదు జాతికి అంటూ మిగిలిన ఆ 11 వందల మందే తర్వాతి కాలంలో ఆరు వేలమంది సంతానాన్ని  కనీ జాతిని వృద్ధి చేసుకున్నారు. దీనికి కారకుడైన  షిండ్లర్,   11 వందల మందిని  ప్రాణాలతో సజీవంగా ఉంచడానికి తన ప్రాణాలని సైతం అడ్డేయడమే గాకుండా, తన సర్వస్వమూ ధారపోశాడు. సంపదనంతా  ఖర్చు పెట్టేశాడు.

         1983 లో థామస్ కెల్లీ అనే ఆస్ట్రేలియన్ రచయిత షిండ్లర్స్ ఆర్క్అనే నవల రాశాడు. నాటి మారణహోమానికి ప్రత్యక్ష సాక్షులైన యూదుల కథనాలు ఆధారంగా ఆ నవల రాశాడు. అది స్పీల్ బెర్గ్ దృష్టిని ఆకర్షించింది. అప్పుడే దాన్ని చలన చిత్రంగా నిర్మిం చాలని నిర్ణయించుకున్నాడు.

          ఇక్కడ విశేష మేమిటంటే,  స్పీల్ బెర్గ్ కూడా యూదు జాతీయుడే. 1947 లో అమెరికాలో పుట్టి పెరిగాడు గానీ తన మూలాల్ని మర్చిపోయాడు. ఆ నవల తన అస్తిత్వాన్ని
, చేపట్టాల్సిన మహాత్కార్యాన్నీ గుర్తు చేసింది. అయితే 1993 లో గానీ ఇది సాధ్యం కాలేదు.

షిండ్లర్స్ స్టోరీ

క్లోజప్ లో రెండుచేతులు  ఒక కొవ్వొత్తిని వెలిగించడాన్ని చూపుతూ సినిమా ప్రారంభమవుతుంది. మతాచారం ప్రకారం సబ్బాత్ ( విశ్రాంతి సమయం) నాడు వెలిగించే కొవ్వొత్తిని సబ్బాత్ కొవ్వొత్తి అంటారు. ఈ ప్రారంభ దృశ్యం సినిమాలో వున్న కొద్ది పాటి కలర్ సీన్లలో ఒకటి. ఆ కొవ్వొత్తి ఆరిపోయి సన్నటి పొగ కెరటం దూసుకు పోతుంది. డిజాల్వ్ అయి ఆ పొగ కెరటం తర్వాతి సీనుకి మారుతుంది. అక్కడ రైలింజను పొగలో సూపర్ ఇంపోజ్  అవుతుంది. ఇది తెలుపు- నలుపు దృశ్యం. అది క్రాకోవ్ రైల్వే స్టేషన్. ప్లాట్ ఫాం మీద ఒక ఫోల్దింగ్ టేబుల్ దగ్గర ఒక యూదు కుటుంబం తమ వివారాలు నమోదు చేయించుకుంటారు. ఆ ఒక్క టేబుల్ మరిన్ని టేబుళ్లు గా, అసంఖ్యాకమైన టేబుళ్లు గా మారిపోతాయి..ఆ ఒక్క యూదు కుటుంబం అనేక యూదు కుటుంబాలుగా, అసంఖ్యాక యూదు కుటుంబాలుగా దృశ్యం కడతాయి..అంటే భారీ ఎత్తున యూదు కుటుంబాల్ని ఇక్కడి మురికి వాడల్లో కుక్కడానికి నాజీలు తరలిస్తున్నారన్న మాట.

          ఒక హోటల్ రూమ్ లో ఆస్కార్ షిండ్లర్ ఓపెనవుతాడు. అతడి ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని వున్న నాజీ ఉన్నతాధికారిని చూసి
, అతడి దగ్గరికి ఖరీదైన డ్రింకూ, ఫుడ్డూ పంపిస్తాడు. అధికారుల్ని మంచి చేసుకుని లంచాలతో మేపి యుద్ధ పనుల కాంట్రాక్టుల్ని కొట్టేయడం షిండ్లర్ నిత్య కార్యక్రమం. చూస్తూండగానే ఈ సీను గుంపుగా చేరిన  నాజీ అధికార్లకి షిండ్లర్ బ్రహ్మాండమైన పార్టీ నిచ్చే మాస్టర్  సీనుగా మారిపోతుంది. వాళ్లతో ఫోటోలు కూడా దిగుతాడు.

తర్వాత షిండ్లర్  యూదుల క్యాంపుకి వెళ్తాడు. అంతులేని బారులు తీరి  నించున్న ఆ యూదుల్ని చూసుకుంటూ అక్కడున్న తన ఎక్కౌంటెంట్ ఐజాక్ స్టెన్ ని కలుసుకుంటాడు. తను పెట్టబోతున్న ఎనామిల్ వంట సామగ్రి ఫ్యాక్టరీకి పెట్టుబడిదార్లుగా కొందరు యూదులు కావాలని అంటాడు. ఆ ఫ్యాక్టరీని ఐజాకే నడిపేందుకు ఆఫరిస్తాడు. యూదులు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు గాబట్టి వాళ్ళు తమ శ్రమని పెట్టుబడిగా పెట్టాలి. వాళ్లకి ఉత్పత్తుల రూపం లో తను  చెల్లింపులు చేస్తాడు.అక్కడ్నించీ ఒక చర్చికి వెళ్తాడు. అక్కడ యూదు స్మగ్లర్లు స్మగ్లింగ్ కార్యాకలాపాలు సాగిస్తూంటారు. పాడ్లాక్ అనే స్మగ్లర్ దగ్గరికి వెళ్లి,  రానున్న రోజుల్లో తనకి విలాసవంతమైన వస్తుఫులు సరఫరా చేయాలనీ కోరతాడు.
  మార్చి 20, 1941 అని అక్షరాలూ పడతాయి. సమూహం గా యూదుల్ని మురికి వాడల్లోకి తీసుకుపోతున్న దృశ్యం. షిండ్లర్ తన ఖరీదైన ఫ్లాట్ కొస్తాడు. ఆ ఫ్లాట్ యూదు కుటుంబానిది. ఆ యూదు కుటుంబాన్ని అవతలి దృశంలో  నాజీలు మురికి వాడ  వైపుకు నడిపిస్తూంటారు.

         
ఇక షిండ్లర్, ఎక్కౌంటెంట్  ఇజాక్ సహాయంతో ఎనామిల్ ఫ్యాక్టరీ పెడతాడు. అక్కడి యూదు కార్మికులకి  ఎస్సెన్షియల్స్అనే గుర్తిపుని నాజీల నుంచి సాధిస్తాడు. అంటే వాళ్ళని ఇక డెత్ క్యాంపు లకి తరలించడం నుంచి మినహాయింపు లభించిందన్న  మాట.  ఈ అవకాశంతో వీలైనంత ఎక్కువ మంది యూదుల్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ని నింపేస్తాడు ఐజాక్.
          ఒక చోట లేబర్ క్యాంప్ నిర్మాణం ప్రారంభమవుతుంది. నాజీ కర్కోటకుడు అమోన్ గోలియెత్ ఆ పనులు చూస్తూంటాడు. దీని నిర్మాణం పూర్తయ్యాక క్రాకోవ్ మురికి వాడల్లో కుక్కిన యూదుల్ని ఇక్కడికి తరలించి చంపుతారన్న మాట. ఈ దృశ్యాన్ని షిండ్లర్ తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం నుంచి చూస్తూంటాడు. యూదుల సమూహం తో నడుస్తున్న ఒక చిన్న పాపని చూసి గర్ల్ ఫ్రెండ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. షిండ్లర్  అమోన్ దగ్గరికి వచ్చి- తన ఫ్యాక్టరీలో యూదు కార్మికుల కోసం ఒక సబ్ క్యాంపు  నిర్మించుకోవడానికి ఒప్పిస్తాడు.


         షిండ్లర్ కి యూదు కార్మికులని ఉపయోగించుకుని ఫ్యాక్టరీ  ద్వారా బాగా డబ్బు గడించాలన్నదే ఆశయం. ఏం చేసినా ఈ దృష్టితోనే చేస్తూంటాడు. అయితే ఇందాక యూదు సమూహంతో నడుస్తున్న చిన్నపాప  దృశ్యం అతడికి ఎక్కడో కలుక్కు మన్పిస్తూనే వుంటుంది.
        రెజీనా అనే మరొక చిన్న పాప షిండ్లర్ దగ్గరికి వచ్చి,  తన తల్లి దండ్రుల్ని ఫ్యాక్టరీ లో చేర్చుకొమ్మనీ, లేకపోతే  వాళ్ళని కూడా నాజీలు పట్టుకు పోతారనీ ఏడుస్తుంది. ఆమెని కోప్పడి వెళ్ళ  గొట్టేస్తాడు. అడ్డంగా యూదుల్ని కాపాడేందుకు తను  ఫ్యాక్టరీ పెట్టాడా ఏమిటీ అని ఐజాక్ మీద అరుస్తాడు. మళ్ళీ  శాంతించి ఆలోచిస్తాడు. తన బంగారపు వాచీని ఐజాక్ కి ఇచ్చేసి, ఆ పాప తల్లిదండ్రుల్ని తీసుకు రమ్మంటాడు. ఇక్కడ్నించీ షిండ్లర్ యూదుల్ని కాపాడడం పైనే  దృష్టి పెడతాడు. తన దగ్గరున్న డబ్బుతో బాటు ఖరీదైన వస్తువులూ ఖర్చులకి ఐజాక్ కి ఇచ్చేస్తూ,  వీలైనంత మంది యూదు బాధితుల్ని ఫ్యాక్టరీకి కి తరలించ మంటాడు.


       కొంత కాలం గడుస్తుంది. శాడిస్ట్ అమోస్ పదివేల మంది యూదుల్ని ఊచకోత కోస్తాడు.  షిండ్లర్ తన యూదు వర్కర్లకి  ప్రమాదాన్ని శంకిస్తాడు. ఫ్యాక్టరీ లోనే కాక బయట వున్న యూదుల్నీ కాపాడేందుకు ఇక  నడుం కడతాడు. ఒక లిస్టు తయారు చేస్తాడు. అమోస్ దగ్గరికి వెళ్లి యూదుల్ని తనకి అమ్మాలని కోరతాడు. అమోస్ దగ్గరున్న యూదు పని మనిషి హెలెన్ ని కూడా తనకి అమ్మేసేందుకు ఒప్పిస్తాడు. వీళ్ళందరూ చెకెస్లోవేకియాలో వున్న తన ఫ్యాక్టరీలో పనిచేసిందుకు అవసరమని నమ్మిస్తాడు. రెండు రైళ్లల్లో  యూదుల్ని చెకెస్లోవేకియాకి తరలిస్తున్నప్పుడు, ఒక చోట స్త్రీలున్న రైలుని  దారి మళ్ళించి నాజీలు మళ్ళీ షిండ్లర్ కి బేరం పె డతారు. వాళ్ళని మళ్ళీ కొనుక్కుంటాడు షిండ్లర్.  వాళ్ళందర్నీ  చెకెస్లోవేకియాలో తన ఫ్యాక్టరీ కి తరలిస్తాడు. ఇక యుద్ధం ముగిసే దాకా వాళ్ళు అక్కడే క్షేమంగా వుంటారు.
          యుద్ధం ముగిశాక,  మీకిక స్వేచ్చ లభించింది పొమ్మని  ప్రకటిస్తాడు షిండ్లర్.  అయితే యుద్ధ  నేరస్తుడిగా తను పట్టుబడే అవకాశం ఉన్నందున  ఈ అర్ధరాత్రి పారిపోతాననీ అంటాడు. విషణ్ణ వదనాలతో వాళ్ళందరూ ఒక బంగారపుటుంగరాన్ని అతడికి బహూకరిస్తారు. దాని మీద – ‘ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాతారో వారు మొత్తం ప్రపంచాన్ని కాపాడినట్టే’  అన్న  అక్షరాలు  చెక్కి వుంటాయి. షిండ్లర్  బాగా ఏడ్చేస్తాడు. తను ఇంకా ఎక్కువ మందిని రక్షించి వుండాల్సిందని విపరీతంగా బాధ పడతాడు. ఆ తర్వాత  భార్యని తీసుకుని  పారిపోతాడు. 


       మర్నాటి ఉదయంయూదుల దగ్గరికి రష్యన్ సైనికుడు  వచ్చి- మీరందరూ ఇక స్వేచ్చా జీవులని ప్రకటిస్తాడు. యూదులందరూ కోలాహలంగా సమీప పట్టణానికి తరలి పోతూంటారు. ఈ సీను డిజాల్వ్  అయి యూదులందరూ ఒక సమాధి దగ్గర నివాళులర్పిస్తూ వుంటారు. ఆ సమాధి అఖండ మానవతా వాది ఆస్కార్ షిండ్లర్ దే!
 నటనలు అమోఘం 

‘షిండ్లర్స్ లిస్ట్’  సమయంలో స్టీవెన్ స్పీల్ బెర్గ్
     హృదయాల్ని కెలికేసే ఈ మానవ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం ఇంకే దేశపు నియంతా ఇలాటి దారుణానికి పాల్పడకూడదన్న అంతర్లీన  సందేశం తో వుంటుంది. ఒక యూదు జాతీయుడుగా స్పీల్ బెర్గ్  విజన్  ని ఇది అపూర్వ స్థాయికి తీసుకు వెళ్ళింది. ముఖ్యంగా ఇందులో నటీనటుల నుంచి రాబట్టుకున్న నటనలు ప్రత్యేకమైనవి. ప్రధాన పాత్ర షిండ్లర్ ని పోషించిన నటుడు లియాం నీసన్ అయితే నిజజీవిత షిండ్లర్ ని ఆవాహన చేసుకున్నట్టే నటిస్తేఎక్కౌంటెంట్ గా నటించిన బెన్ కింగ్స్ లే చాలా నిగ్రహం తో కూడుకున్న నటనని కనబరుస్తాడు. ఈయన మరెవరో కాదుసర్ రిచర్డ్ అటెన్ బరో తీసిన ఆజరామరమైన గాంధీ’ లో మహాత్మా గాంధీ పాత్ర పోషించి జేజేలందుకున్న మేటి నటుడు. ఇక నాజీ అమోన్ గా శాడిస్టు పాత్రలో రాల్ఫ్ ఫిన్నెస్షిండ్లర్  భార్యగా ఎమిలీ గూడాల్ తదితరులు ఆయా సన్నివేశాల్ని రక్తికట్టిస్తారు.
         స్పీల్ బెర్గ్  ఈ చీకటి చరిత్రకి  చిత్రణ తెలుపు నలుపులో వుంటేనే ప్రభావ శీలంగా ఉంటుందని భావించి, అదికూడా డాక్యుమెంటరీ విధానంలో చిత్రీ కరించాడు. నలభై శాతం సినిమాని హేండ్ హెల్డ్ కెమేరాతో చిత్రీ కరించాడు ఛాయా గ్రహకుడు జానస్ కామిన్ స్కీ.  క్రాకోవ్ లోని నిజ లొకేషన్ లలోనే   73 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. జాన్ విలియమ్స్ సంగీతం ఈ క్లాసిక్ కి మరో ఎస్సెట్ అనవచ్చు. స్పెల్ బెర్గ్ ఈ సినిమా కి కమర్షియల్  గా అంత  సక్సెస్ ఉండదని భావించి, బడ్జెట్ ని బాగా కుదించి కేవలం 22 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే, విడుదలయ్యాక  ఇది కళ్ళు చెదిరే విధంగా ప్రపంచవ్యాప్తంగా 321 మిలియన్ డాలర్లు వసూలు చేసింది!
         ఐతే ఇంత  లాభం గడించినా స్పీల్ బెర్గ్ ఒక్క డాలర్  కూడా పారితోషికంగా తీసుకోలేదు. అలా తీసుకోవడం ఆ నెత్తుటి డబ్బు తీసుకోవడమేనని తిరస్కరించి, ఒక ఫౌండేషన్ కి విరాళంగా ఇచ్చాడు.
        స్పీల్ బెర్గ్ షూటింగ్ పూర్తి చేశాక విఖ్యాత సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ కి చూపిస్తే  ఆయన కదిలిపోయి మాట రాక బయటికి వెళ్ళిపోయాడు. చాలా సేపటికి తిరిగివచ్చి, ఈ మహోజ్వల  సృష్టికి  తన కంటే ఉత్తమమైన సంగీత దర్శకుణ్ణి  ఎంపిక చేసుకోవాల్సిందిగా  కోరాడు. వాళ్ళందరూ చనిపోయారని స్పీల్ బెర్గ్ చెప్పాడు.


అవార్డుల సంరంభం!        
         క 1993 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పెద్ద రికార్డుల్నే సృష్టించింది షిండ్లర్స్ లిస్ట్.  ఆస్కార్ ఉత్తమ చలన చిత్రం ఆవార్డు మాత్రమే గాక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఛాయాగ్రణం, ఉత్తమ కళా దర్శకత్వంలకీ  పురస్కారాలు అందుకుంది.  ఉత్తమ నటుడుగా లియాం నీసన్ కి నామినేషన్ మాత్రం దక్కింది.   

-సికిందర్