దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య
టి.
తారాగణం : సుధీర్ బాబు, వమిఖా గబ్బి, ధన్యా బాలకృష్ణ, సాయి
కుమార్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాల కృష్ణ, చైతన్య కృష్ణ తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : శ్రీ రాం
ఆదిత్య టి., మాటలు : అర్జున్- కార్తీక్, సంగీతం : సన్నీ ఎం ఆర్, ఛాయాగ్రహణం : శ్యాందత్
సైనుద్దీన్, నృత్యాలు : చిన్ని ప్రకాష్,
సుచిత్రా చంద్రబోస్, విజయ్, కూర్పు : ఎం ఆర్ వర్మ, పోరాటాలు : అన్బరీవ్, రామ్ సుంకర
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్ టిన్ మెంట్స్, నిర్మాతలు : విజయ కుమార్ రెడ్డి, శశిధర్
రెడ్డి
విడుదల : 25 డిసెంబర్, 2015
****
‘ప్రేమకథా చిత్రం’
తో ఓ మంచి హిట్ సాధించిన సుధీర్ బాబు, మళ్ళీ అలాటి ఒక సక్సెస్ కోసం విఫలయత్నాలు
చేస్తున్నప్పటికీ, కొత్తదనాన్ని
ప్రయత్నించడం మానుకోక పోవడం అతడి ప్లస్ పాయింట్. దొంగాట, మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ
కలిపింది ఇద్దరినీ- అనే గత భిన్నమైన మూడు ప్రయత్నాలతో అపజయాల బాట పట్టినప్పటికీ, మళ్ళీ ఓ కొత్తదనాన్నే ఆశ్రయించి, కొత్త దర్శకుడ్నే
పూర్తిగా నమ్మి, ‘భలే మంచి రోజు’ తో తిరిగొచ్చాడు.
కొత్త దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య న్యూవేవ్
థ్రిల్లర్ గా అందించిన ఈ తొలి
ప్రయత్నానికి, ‘స్వామిరారా’ స్ఫూర్తి అన్నట్టు స్పష్టంగా అన్పించినా, ఆ
రేంజి సక్సెస్ కి ఇది చేరుకో గల్గిందా లేదా చూద్దాం...
కథ
రామ్ ( సుధీర్ బాబు) అనే నిరుద్యోగి
ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ( ధన్యా బాలకృష్ణ)
మోసం చేసి ఇదే రోజు పెళ్లి చేసుకుంటోందని, ఆమెని నాల్గు తన్ని వద్దామని ఫ్రెండ్ (ప్రవీణ్) తో
కలిసి బయల్దేరతాడు. దార్లో ఫ్రెండ్ తో వాగ్వాదం తో ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్
ఇవ్వడంతో-ఆ కార్లో కిడ్నాపైన ఇంకో పెళ్లి కూతురు సీత ( వమిఖా గబ్బి) కారు దిగి
పరారవుతుంది. దీంతో గ్యాంగ్ లీడర్ శక్తి ( సాయికుమార్) రామ్ ఫ్రెండ్ ని బంధించి, ఆ
సీతని వెతికి తీసుకొచ్చే బాధ్యత రామ్
మీదేస్తాడు. రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం)
లు తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది.
ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకోస్తూంటే ఇంకో గ్యాంగ్
కిడ్నాప్ చేస్తుంది.. ఏమిటీ కిడ్నాపులు? మొత్తం
ఎన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి? వాళ్ళెవరెవరు? ఒకర్నొకరు ఎందుకు డబుల్ క్రాస్
చేసుకుంటున్నారు? మధ్యలో సీత పెళ్లి కథేంటి? ఒక్క రోజులో ఈ చిక్కులన్నీ ఇందులో
ఇరుక్కున్న రామ్ ఎలా పరిష్కరించాడు- మొదలైన
ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
ఎలావుంది కథ
నిన్నటి ‘సౌఖ్యం’ దెబ్బకి ఇహ తెలుగు
సినిమా కథంటే భయపడి పారిపోయే పరిస్థితి పరాకాష్ఠ కి చేరుకున్నాక- ‘భలే మంచి రోజు’ కథ క్రిస్మస్
పండక్కి పండగ మూడ్ ని నాశనం చేయకుండా, ఈ మంచి రోజుని మంచిరోజులాగే ఉంచుతూ కొండంత
ధైర్యాన్నిస్తుంది చూసే ప్రేక్షకులకి. ఇదేరోజు మళ్ళీ అవతల ‘మామ మంచు- అల్లుడు కంచు’
చూసే వాళ్ళ పరిస్థితి వేరు, అదలా ఉంచుదాం.
ఒక సహజంగా జరిగే కథ చూడడం ఎవరికైనా మూస సినిమాల నుంచి చాలా రిలీఫ్ నిస్తుంది. సహజ సంఘటనలు, సహజ క్రిమినల్ పాత్రలు, సహజ
కామెడీ, వీటితో థ్రిల్, సస్పెన్స్, వినోదం కలగలిసి ఫ్రెష్ గా తయారైన కథ ఇది. ముందే చెప్పినట్టు, ‘స్వామిరారా’
పంథాలో వుంటుంది. అయితే ‘స్వామిరారా’ తో ప్రామిజింగ్ దర్శకుడిగా కన్పించిన సుధీర్ వర్మ అంతలోనే రెండో ప్రయత్నం పాత మూస ‘దోచేయ్’ తో ఎంత
షాకిచ్చాడో తెలిసిందే. ప్రస్తుత కొత్త
దర్శకుడు అలా కాకుండా ఆ ‘స్వామిరారా’ ప్రమాణాల కోసం- ఆ ఫీల్ కోసం తెగ ప్రయత్నం చేయడం
ఇక్కడ తెర నిండా కన్పిస్తుంది.
ఎవరెలా
చేశారు
సుధీర్ బాబు కచ్చితంగా
ఇంప్రూవ్ అయ్యాడు. పైగా ప్రారంభం నుంచీ ముగింపు వరకూ సినిమాని తన భుజాన మోస్తూ ఒక పక్కా
యాక్టివ్ క్యారెక్టర్ కి నిదర్శనంగా నిలచాడు. ఫ్రెండ్ కోసం హీరోయిన్ని కిడ్నాప్
చేస్తే, మళ్ళీ తల్లిదండ్రుల కోసం తప్పి పోయిన హీరోయిన్ ని మళ్ళీ పట్టుకునే బాధ్యత కూడా
మీద పడే, నిత్యం కర్తవ్యానికీ- హీరోయిన్
తో నైతిక బాధ్యతకీ నడుమ నలిగే పాత్రని
సమర్ధవంతంగా పోషించాడు. గత ఫ్లాపుల బాధ దీంతో తీరిపోవచ్చు.
పంజాబీ హీరోయిన్ వమిఖా
గబ్బీ కి ఇదే తొలి తెలుగు అయినా, హిందీలో
2007 లో ‘జబ్ వి మెట్’ లో కరీనా కపూర్ చెల్లెలిగా వేసి నప్పట్నించీ
వుంది. అంత గ్లామరస్ కాకపోయినా, గోదావరి జిల్లా అమ్మాయి పాత్రకి సరిపోయింది.
రెండో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కెక్కువ కథలేదు. హీరో తండ్రిగా కార్ల షెడ్డు నడిపే
పరుచూరి గోపాల కృష్ణ పాత్ర గమ్మత్తయినది. అలాగే చర్చి ఫాదర్ గా పోసానీ పాత్రకూడా
బిన్నమైన కామిక్ పాత్రే. క్లయిమాక్స్ లో
వచ్చి గందరగోళం సృష్టించే పృథ్వీ తో క్లయిమాక్స్ కే బలం పెరిగింది. అయితే
ఎంత సేపూ సినిమాల్ని పేరడీ చేసే పాత్రలే
ఆయనకి దక్కుతున్నాయి. తన కామెడీకి ఇక రూటు మార్చుకుంటే మంచిదేమో. హీరో చెల్లెలి
పాత్రలో విద్యుల్లేఖా రామన్ కూడా ఫన్నీ
పాత్రే. ఓల్డ్ సిటీలో మూతబడ్డ థియేటర్ లో పాత సినిమాలేసుకు ఎంజాయ్ చేసే, మెయిన్ విలన్ గా సాయికుమార్ దో భిన్నమైన పాత్రా, నటనా. వీళ్ళందరితో బాటు, జంట
క్రిమినల్స్ గా కమెడియన్ వేణు- శ్రీరాంలు
సైతం కథని మలుపులు తిప్పుతూ ఎక్కడికో తీసికెళ్ళి పోయే పాత్రలే. ప్రతీ పాత్రా కథలో
ఎక్కడో కలిసి కథ పరిధిని పెంచేదే. ఈ
సహజత్వం వల్ల ఇవి గుర్తుండి పోతాయి.
టెక్నికల్ గా ఈ కథ డిమాండ్ చేస్తున్న మేకింగ్ తో
వుంది. ‘ఉత్తమ విలన్’, ‘ విశ్వరూపం’ సినిమాల ఫేం కెమెరా మాన్ శ్యాందత్ సైనుద్దీన్ కలర్స్ తో, లైటింగ్ తో, షేడ్స్ తో
ఉత్తమ పనితనం కనబరచాడు. అలాగే ‘స్వామిరారా’ లో లాగా జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసిన
బాణీలతో సన్నీ ఎం ఆర్ కథ ఫ్లేవర్ తగ్గ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన
ఎడిటింగ్, యాక్షన్, కోరియోగ్రఫీ విభాగాలూ కూడా కథ ఏర్పరచిన చట్రంలోనే పని చేశాయి. పోతే
మాటలు రాసిన అర్జున్- కార్తీక్ లు ఈ కామిక్ థ్రిల్లర్ కి చాలా స్పూర్తిదాయకమైన
క్రియేటివిటీ ని కనబర్చా రు.
చివరి కేమిటి
కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యలో మంచి టాలెంట్ వుంది. సినిమాలు చూసే
జనంగా యువ ప్రేక్షకులే మిగిలినప్పుడు, వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని టార్గెట్
చేసిన న్యూవ్ వేవ్ థ్రిల్లర్ ఇది. ఇదయినా ‘స్వామి రారా’ అయినా ‘పల్ప్ ఫిక్షన్’ తో
క్వెంటిన్ టరాంటినో పాపులర్ చేసిన తరహా సినిమాలే.
అవలా ఉంచితే, మొత్తం థ్రిల్లర్
కుండాల్సిన స్పీడు, పెప్, టెంపో లోపించాయి. షాట్స్ లో కెమెరా స్పీడు కూడా లేదు. అలాగే ఈ
కథంతా ఒక్క రోజులో జరుగుతోందన్న ఫీల్ కూడా
తీసుకు రాలేకపోయారు. ఇవన్నీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. ఏమైనా కొత్త
దర్శకుడు అప్పుడే పర్ఫెక్టుగా వుండాలని ఆశించలేం. ఈ కొత్త దర్శకుడి మీద విశ్వాసంతో
అవకాశమిచ్చిన సుధీర్ బాబు, నిర్మాత లిద్దరూ అభినందనీయులే.
-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)