రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 25, 2015

సౌఖ్యం ఎవరికి?





దర్శకత్వం : ఏఎస్. రవికుమార్ చౌదరి

తారాగణం :  గోపీచంద్ , రేజీనా కాసాండ్రా, బ్రహ్మానందం, షావుకారు జానకి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ భగవాన్, ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్, రాజన్   తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  ప్రసాద్ మురెళ్ళ, కథ- మాటలు : శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే : కోన వెంకట్- గోపీ మోహన్, కూర్పు : గౌతం రాజు, పోరాటాలు : వెంకట్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్, నిర్మాత : ఆనంద్ ప్రసాద్
విడుదల : 24 డిసెంబర్,   2015
       2004 లో గోపీచంద్ తో ‘యజ్ఞం’ తీసి సక్సెస్ అయిన దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ దశాబ్దం తర్వాత తిరిగి గోపీచంద్ తో ‘సౌఖ్యం’ తీస్తూ ప్రేక్షకులకి తగిన సుఖశాంతులు ఇద్దామనుకున్నాడు. గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ గా  ‘పిల్లా నువ్వు లేని జీవితం’  అనే హిట్ ఇచ్చిన తను, ఈ సక్సెస్ బాటలో ఈసారి ఏం చేశాడో తెలుసుకుంటే సుఖ శాంతులు  కష్ట సాధ్యంగానే వుంటాయి. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కాబట్టి – గోపీచంద్ కూడా లౌక్యం, శౌర్యం, శంఖం టైటిల్స్ బాటలో ‘సౌఖ్యం’ తో మోజు తీర్చుకోవడం కూడా అయింది. కానీ ‘సౌఖ్యం’ కంటే ముందు  ‘శాంతం’  అని ఒకటి తీసివుంటే వరస బావుండేది. జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పటికైనా శాంతం గా ఉండకపోతే ఇకముందు ఎలాటి సౌఖ్యమూ దక్కదని గ్యారంటీగా చెప్పొచ్చు. అంతా గజిబిజిగా వుంది కదూ టైటిల్స్ తో ? కాస్సేపు ఈ టైటిల్స్ గొడవ పక్కన పెట్టి అసలు సంగతేమిటో చూద్దాం...


మళ్ళీ మళ్ళీ  అదే కథ!
చాలా చాలా రిపీట్- రిపీట్- రిపీటెడ్ గా శీను ( గోపీచంద్) పెళ్లవుతున్న ఓ అమ్మాయిని ఎత్తుకెళ్ళి  ఆమె ఇష్ట పడ్డ వేరే పెళ్లి చేసేస్తాడు. వెంటనే రొటీన్ గా పాటేసుకుంటాడు. ఆ వెంటనే  రొటీన్ గా ఓ రౌడీని కొడతాడు. ఆ రౌడీ బావూజీ (ప్రదీప్ రావత్) అనే ముఠా కోరు కొడుకు. తన కొడుకుని కొట్టిన వాణ్ణి చంపుతానని రొటీన్ గా ప్రతిజ్ఞ చేస్తాడు. శీను కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఏ పెళ్ళీ వద్దంటాడు. ఆ అమ్మాయి శైలజ ( రేజీనా) ని కోలకత్తాలో పవర్ఫుల్  పీఆర్ (రాజన్) అనే అతడి కూతురు. అక్కడి సీఎం కొడుకుతో ఇష్టం లేని పెళ్లి చేస్తోంటే రొటీన్ గా పారిపోయి వచ్చి శీనుతో రొటీన్ గా ప్రేమలో పడింది. ఇప్పుడా తండ్రి గ్యాంగే రొటీన్  గా ఎత్తుకెళ్ళారు. ఈ నేపధ్యంలో బావూజీ కి ఇంకో గొడవ వుంటుంది. రొటీన్ గా శైలజని తన కొడుక్కు చేసుకోవాలని. ఇప్పుడా శైలజని కొలకత్తా లో పీఆర్ ఇంట్లోంచి తీ సుకురావాలంటే చాలా గట్టివాడు కావాలి. ఆ గట్టి వాడుగా రొటీన్ గా శీను ఆఫరిస్తాడు. కొలకత్తా వెళ్లి  శైలజని తీసుకుని రొటీన్ గా పారిపోయి వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ్నించీ ఇంకా  -రొటీన్- రొటీన్ – పరమ రొటీన్ గా ఏం జరిగిందనేది ఓపిక మిగిలుంటే వెండితెర మీద చూసుకోవచ్చు.
కథెలా వుంది
        ప్రేక్షకుల మీద చేసిన స్కామ్ లా వుంది. ఏవేవో గొప్ప అంచనాలు కల్పిస్తారు, తీరా చూస్తే సవాలక్ష సార్లు చూసిందే చూపించి, నేడు సినిమా కథల పేరుతో జరుగుతోంది రీసైక్లింగ్ స్కామే తప్ప ఇంకేమీ కాదని చెప్పకుండానే చెప్పేస్తారు. పైన సగం వరకూ చెప్పుకున్న కథని చూస్తే అర్ధమైపోతుంది.  కథెలా వుందో ఇంకా విడమర్చి చెప్పుకోనవసరం లేదు. కథ రాసిన శ్రీధర్ సీపాన అనే రచయిత తన సొంత మస్తిష్కంతో ఏమీ ఆలోచించలేదు. శివమ్, బాద్షా, ఢీ, రెఢీ, పండగ చేస్కో...లాంటి డజన్ల సినిమాల దగ్గర్నుంచీ నిన్నటి ‘లోఫర్’ వరకూ తిరగమోత తాలింపు సినిమాలెన్నో వుండగా- వాటిని దింపెయ్యడానికి పెద్దగా మస్తిష్కం అవసరం లేదు. టాలీవుడ్ లో రైటర్ అనే వాడికి బుర్రే అవసరం లేదు. వచ్చిన ఏ తెలుగు సినిమాలో ఏ సీన్లున్నాయో గుర్తుంటే చాలు. పరీక్షలో అందరూ కలిసి ఒకరి దాంట్లో ఇంకొకరు చూసి మాస్ కాపీయింగ్ కి పాల్పడితే ఆన్సర్ పేపర్లు ఎలావుంటాయో, తెలుగు సినిమాలు అలాటి జిరాక్స్ కాపీల్లా ఉంటున్నాయి, ఇంకా వుంటాయి కూడా.
ఎవరెలా చేశారు
వరైనా చేయడానికి ఏం కావాలి? ఓ కథ, ఓ పాత్ర. ఈ రెండూ లేనప్పుడు గోపీచంద్ పొందిన సౌఖ్య మేమిటో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. మాట్లాడితే ఫైటు, మాట్లాడితే పాట, మధ్యమధ్యలో నాలుగు మాటలు- సెకండాఫ్ ని ఇతర నటీ నటులు పూర్తిగా హైజాక్ చేయడంతో,  ఆ గ్రూపుల  వెనకాల ఎక్కడో- చేష్టలుడిగి చూడ్డంతోనే సరిపోయింది. సెకండాఫ్ లో గోపీచంద్ వున్నట్టే గుర్తుండదు.  క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ కోసం పొంచి వున్నట్టు సీన్లలోంచి  గైర్ హాజరు. ఇలా వుంది హీరోయిజం.
హీరోయిన్ రేజీనా డిటో. ఈ  ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ  తనని దాచిపెట్టే వాళ్ళ చేతుల్లో, అడపాదడపా ఎత్తుకెళ్ళే వాళ్ళ హస్తాల్లో పిప్పళ్ల బస్తాలా తయారయ్యింది తప్ప- నటనకి అవకాశం వున్న ఒక్క సీనూ లేదు.
ఇదేదో ఒక మహా ‘పండంటి కాపురం’ అయినట్టు, ఒక మహామహా  ‘దేవుడు చేసిన మనుషులు’ అయినట్టూ సినిమా నిండా తారాతోరణమే. ఎందరెందరో నటీ నటులు. అంతా కలిసి  దర్శకుడు- రచయితా చేసిన స్కామ్ లో తలా ఓ చెయ్యివేసి సాయం పట్టారు. పాపం ఇటీవలే శంకరాభరణం, బెంగాల్ టైగర్ లతో ఎక్కడికో....వెళ్ళిపోయిన మాస్టర్ కమెడియన్ పృథ్వీ కి సైతం జాపిగోల్పే స్థితి. బ్రహ్మానందం, సప్తగిరిలు చెప్పక్కర్లేదు. స్కామ్ అన్నాక బావుకోవడం ఎవరికైనా సాధ్య మవుతుందా?
రచన సైడు స్క్రీన్ ప్లేకి కోన – మోహన్ ద్వయం దోహదం చేశారు.  ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవసరమా? అది వున్నట్టు అన్పిస్తోందా? హీరో క్యారక్టర్ పాసివ్ గా మారి సోదిలోకి లేకుండా పోయాక, ఎక్కడా సస్పెన్స్, థ్రిల్ అనేవి లేక కథనం నీరసించి పోయాక - దీన్నో డబ్బులు వచ్చే కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే అందామా – రూపాయి రాని ఆర్ట్ సినిమా అవతారం అందామా? పదే పదే స్టార్స్ పోషించే పాత్రలు పాసివ్ పాత్రలు అవుతున్నాయనే స్పృహ కూడా లేకుండా- గొప్ప గొప్ప కాంబినేషన్స్ తో తీస్తున్న సినిమాలు – నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలంటే నమ్ముతారా?
ఇక మాటలు కూడా రాసిన శ్రీధర్ సీపాన ఇంకా  ప్రాస డైలాగులే – అవి కూడా వచ్చిన సినిమాల్లో పేలిన డైలాగులే రూపం మార్చి దిగుమతి చేసుకోవడం  కూడా స్కామే!
సాంకేతికాల విషయానికొస్తే, కెమేరాతో ప్రసాద్ మూరెళ్ళ కీ, ఎడిటింగ్ తో గౌతమ్ రాజుకీ, పోరాటాలతో వెంకట్ కీ, సంగీతం తో అనూప్ రూబెన్స్ కీ   స్కాము బాధితుల పరిస్థితే. రొటీన్ సినిమాలే కదా అని ఒప్పుకుంటే స్కాములే మిగులుతాయి. రొటీన్ల కాలం పోయింది. స్కామ్ సినిమాల సీజన్ నడుస్తోంది.
చివరికేమిటి?
        ది రవికుమార్ చౌదరి వేసుకోవాల్సిన ప్రశ్న. చాలాకాలం కనుమరుగై,  ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే హిట్ తో ఆశ్చర్య పరచిన తను- ఆ హిట్ కారణాలని బేరీజు వేసుకున్నట్టు లేదు.  పిల్లా నువ్వు లేని జీవితంలో కథనానికి వాడిన టెక్నిక్కే ఆ సినిమాకి టానిక్. సినిమాలకి ప్రమాదకరంగా పరిణమించే ఎండ్ సస్పెన్స్ ప్రక్రియతో కథనాన్ని - అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమే అని  తెలియకుండా ఇంటర్వెల్ వరకూ, ఆపైన మళ్ళీ క్లైమాక్స్ వరకూ రెండు సార్లు  ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు. సినిమాలకి సంబంధించి ఎండ్ సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ధువాఁ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. ఇదే యాదృచ్చికంగా, లేకపోతే  కాకతాళీయంగా పిల్లా నువ్వు లేని జీవితంలోనూ ప్రయోగించి విజయం సాధించారు. లేకపోతే ఎండ్ సస్పెన్స్ కథనాలతో  ‘జాదూగాడు’, ‘ఆ ఒక్కడు’ లాంటివి అనేక తెలుగు సినిమాలు వచ్చి ఫ్లాపయ్యాయి. ఎండ్ సస్పెన్స్ వల్లే ఇటీవల ‘బెంగాల్ టైగర్’ సెకండాఫ్ కూడా బలహీన పడింది.
ప్రస్తుత సినిమాలో రవికుమార్ చౌదరి క్రియేటివిటీ కనుమరుగైపోయింది. స్కామ్ కథే అయినా దాన్ని ఎక్సైటింగ్ గా చెప్పాలన్న ఆలోచనకోడా చేయకపోవడం విచారకరం. ఇంకెన్ని సార్లు సెకండాఫ్ లో కన్ఫ్యూజ్ కామెడీ పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించాలనుకుంటారు. మారు వేషాలు వేయించి కామెడీ చేస్తారు? మారువేషాల కామెడీ ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ ల రోజుల్లోనే నడించాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోయి- కలర్ ఫిల్మూ పోయి – డిజిటల్ వచ్చింది. డిజిటల్ లో కూడా పాత మూస డ్రామాలతో చేతనైనంత స్కాములు చేసుకోవడమేనా?

-సికిందర్ 

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు! )