రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, డిసెంబర్ 2015, గురువారం

టెక్నాలజీని కమ్మేసిన కళ!





రచన- దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ

తారాగణం : రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా, తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్, వైభవ్ తత్వావ్దీ తదితరులు 
సంభాషణలు :
 ప్రకాష్ కపాడియా, సంభాషణలు-తెలుగు  : మదన్ కర్కే, పాటలు : రామజోగయ్య శాస్త్రి, సంగీతం :సంజయ్ లీలా భన్సాలీ, శ్రేయాస్ పురాణిక్ ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, కూర్పు : రాజేష్ పాండే శబ్దగ్రహణం : బిశ్వదీప్ ఛటర్జీ, కళ : సలోనీ ధత్రక్, శ్రీరాం అయ్యంగార్, సుజీత్ సావంత్ఆహార్యం : మాక్సిమా బసు, అంజూ మోడీ,పోరాటాలు : శ్యాం కౌశల్, విజువల్ ఎఫెక్ట్స్ : ప్రైమ్ ఫోకస్

బ్యానర్ : సంజయ్ లీలా భన్సాలీ ఫిలిమ్స్
నిర్మాత :
 సంజయ్ లీలా భన్సాలీ
విడుదల :
 18 డిసెంబర్, 2015 
 ***

         వెండి తెర మీద సునాయాసంగా తైలవర్ణ చిత్ర లేఖనాలు చేసే విజువల్ మాంత్రికుడు మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు మరోసారి విచ్చేశాడు. మరాఠా చారిత్రకాన్ని మహా దృశ్య- కావ్య వైభవ విలాసంగా మల్చి, హృదయాల్ని మెలితిప్పే  కళాత్మకతతో భావోద్వేగాల సమాహారం చేశాడు. భాండాగారాల్లో  నిక్షిప్తమైపోయిన శతాబ్దాల నాటి ప్రేమచరిత్రకి చిత్రిక పట్టి అజరామరమయ్యే శిల్పంలా చెక్కాడు. బాజీరావు- మస్తానీల స్మృతిని వెనకటి- ఇప్పటి- ఇంకా ముందటి తరాలన్నిటికీ ఒక జ్ఞాపకంలా  దృశ్యమానం చేసిపెట్టాడు.   


        సంజయ్ లీలా భన్సాలీ- ఈ  పేరు వింటేనే  నాటి ఖామోషీదగ్గర్నుంచీ మొన్నటి  రామ్ లీలా’  వరకూ కళ్ళప్పగించి  చూసే అద్భుత, అనిర్వచనీయ  లోకాలే కన్పిస్తాయి. సంగీత సాహిత్య సౌరభాల గుచ్చాలే ఆహ్వానిస్తాయి. అతని విజన్ వేరు, ఆలోచనవేరు, దృశ్య మాధ్యమపు నిర్వచనం పూర్తిగా వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోనే అతణ్ణి  మించిన మహోజ్వల చిత్రరాజాల రారాజు లేడనొచ్చు

        బాలీవుడ్ సూపర్ స్టార్లతో గ్లామరస్ గా బాజీరావు మస్తానీతెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లామరస్ గా ఆనడమెందుకంటే, ఇది నిఖార్శయిన ప్రేమ కథ అయినందుకే. అదికూడా అతి సరళంగా చెప్పి పామరుల నుంచీ పండితుల దాకా అందర్నీ సంలీనం చేయగలనందుకే. కింది క్లాసు మాస్ మహాజనులు ఎంత తదాత్మ్యంతో దీన్ని అక్కున జేర్చుకోగలరంటేసౌండ్ మిక్సింగ్ లోపాల వల్ల మొనోలో స్పష్టత కోల్పోయి  సంభాషణలు విన్పిస్తే, పదేపదే అలజడి రేపే దాకా!  మాస్ ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయి చూసేందుకు క్లాస్ మాస్ సినిమాలంటూ తేడాల్లేవని తెలిపే దాకా!

       రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా ల నట నాట్య భావప్రకటనా  విన్యాస విలాసాలకి  నిజానికి ఇంకా విస్తృత కాన్వాస్ అవసరం. భన్సాలీ కూర్చిన కథాప్రపంచం కూడా కురచనైపోయి-  ఈ ప్రతిభాశాలులు  పాత్రల్లో పాత్రలకి మించి ఎదిగిపోయారు. రాజు కంటే ధర్మం గొప్పదని పలికించిన ఒక సంభాషణలాగాతమ ఇమేజులకంటే పాత్రలు గొప్పవైపోయాయి!

        చరిత్రని భావజాలాల కళ్ళద్దాలతో చూస్తే డాక్యుమెంటరీలు చూసుకోవాలి. చారిత్రక ఆధారాలన్నిటినీ ససాక్ష్యంగా ముందుపెట్టి నిజాయితీని చాటుకోవడం సినిమా లక్షణం కాదు. సినిమా అనేది కళ, డాక్యుమెంటరీ అనేది సమాచారం. చరిత్రని జనబాహుళ్యానికి నాటకీయంగా మల్చి చూపడమే సినిమాకళ కర్తవ్యం. ఆ నాటకీయత అవధులు దాటితే దానికదే ఆ సినిమా అభాసు అవుతుంది. నాటకీయత కోసం కొన్ని సృజనాత్మక స్వేచ్ఛలు తీసుకోవడం కూడా  అవసరం. ఈ సృజనాత్మక స్వేచ్ఛ ఉద్దేశించిన సారాన్ని ఎలా ఎత్తి పట్టిందని మాత్రమేచూడాలి. అలా చూస్తే, భన్సాలీ ఉద్దేశించిన సారం కేవలం ప్రేమకథకి సంబంధించిందైనప్పుడు, పాత్ర రాజకీయ జీవితానికి సంబంధించిన అసంగతాలు అప్రస్తుతమైపోతాయి.

కథ
      18 వ శతాబ్దపు మరాఠా వీరుడు బాజీరావు (రణవీర్ సింగ్) ఢిల్లీ లో మొఘల్ రాజుల్ని పదవీచ్యుతుల్ని చేసి, భారత దేశమంతటా హిందూ రాజ్యాన్ని స్థాపించాలని  యుద్ధాలు చేస్తూంటాడు. ( హిందూ రాజ్యం కంటే మరాఠా రాజ్యం లక్ష్యంగా కొనసాగాడనీ,  అందుకే ఇతర సంస్థానాల రాజులు వ్యతిరేకమయ్యారనీ ఇంకో వాదం వుంది).  ఇలావుండగా,  మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ( మహేష్ మంజ్రేకర్), తదుపరి  పీష్వా ( ప్రధాని) గా వారసుడి ఎంపిక కోసం అన్వేషిస్తున్నప్పుడు  బాజీరావు పరీక్షకి సిద్ధపడతాడు. ఆ పరీక్షలో నెగ్గి,  సేనాపతి అవుతాడు. ఈ సమయంలో బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్ తన రాజ్యాన్ని ముట్టడించ డానికి సిద్ధమైన ముస్లిం సైన్యాలనుంచి కాపాడాల్సిందిగా రహస్య సందేశం  పంపిస్తాడు. ఆ సందేశ హరిణి మరెవరో కాదు, యువరాణి మస్తానీ (దీపికా పడుకొనే). ఈమె  కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో, నాట్యంలో, గానంలో అసమాన ప్రతిభగల పడతి. ఆమె కోరడంతో బాజీరావు బుందేల్ ఖండ్ వెళ్లి శత్రువుల్ని సంహరిస్తాడు. ఈ సందర్భంగా మస్తానీ  అతడితో  ప్రేమలో పడుతుంది. బాజీరావు కూడా ప్రేమలో పడిపోతాడు.

        బాజీరావుని  సాగనంపాక, మస్తానీ మనసులో మాట తల్లిదండ్రులకి చెప్తుంది. రాజపుత్ర వంశీయుడైన  బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్,  రుహానీ బేగం అనే ముస్లిం ని చేసుకున్నాడు ( ఈమె అప్పటి నిజాం దర్బారులో నాట్యగత్తెగా వుండేది). మస్తానీ మాట కాదనలేక ఆమెని బాజీరావు దగ్గరికి పూనా పంపిస్తారు తల్లిదండ్రులు.

        అలా కోటలోకి ప్రవేశించిన మస్తానీకి తెలుసు, బాజీరావుకి కాశీ బాయి ( ప్రియాంకా చోప్రా)  అనే భార్య వుందని. అయినా తెగువతో ఇలా వచ్చేయడంతో బాజీరావు గొప్ప సంయమనం పాటించి ఆమెకి కోటలో స్థానం కల్పిస్తాడు. మొదట నాట్యగత్తె  అనుకున్న మస్తానీ తర్వాత భర్త  ప్రియురాలే  అని తెలియంతో  హతాశురాలవుతుంది కాశీబాయి. బాజీరావు తల్లి ( తన్వీ అజ్మీ), తమ్ముడు (వైభవ్ తత్వావ్దీ)  బాజీరావుకి వ్యతిరేకులవుతారు. రాజపుత్రులు - మొగలులు పెళ్లి సంబంధాలు చేసుకోవడమేమో గానీ, బ్రాహ్మణులైన మేము ఈ సంబంధాన్ని ఒప్పుకోబోమని చెప్పేస్తారు. దీంతో మొదలవుతుంది బాజీ -మస్తానీల ప్రేమలో సంక్షోభం. ఈ ప్రేమ ఇక్కడి నించీ ఏఏ మలుపులు తిరిగి ఏ దరికి చేరిందో ఇక వెండితెర మీద చూసి తరించాల్సిందే.


ఎవరెలా చేశారు.
      బాజీరావుగా రణవీర్ సింగ్ లో ఇంత నటనా పటిమ ఉంటుందని ఎవరూ ఊహించరు. బాజీరావంటే తను తప్ప ఇంకెవరూ వుండరనేంతగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. యుద్ధ నైపుణ్యం తెలిసిన వీరుడిగా, కానీ  పరస్త్రీని ప్రేమించకుండా ఉండలేని బలహీనుడిగా- అతివలిద్దరి మధ్యా  సంధి కుదిర్చే తెలివిమంతుడిగా, పోనుపోనూ భగ్నప్రేమికుడిగా, ఇంకాతర్వాత మతిస్థిమితం కోల్పోయిన వాడిగా....రణవీర్ అభినయ చాతుర్యం పాత్రని సజీవం చేసింది. తన భావోద్వేగాల్ని, భావ ప్రకటనల్నీ అమోఘంగా అదుపులో ఉంచుతూ అండర్ ప్లే చేసిన రణవీర్ నటుడిగా ఇంత ఎదిగి ధన్యుడ వుతాడని కూడా ఎవరూ ఊహించరు.

        దీపికా  పడుకొనే మస్తానీ పాత్రని అజరామరం చేసింది. తను వీరనారియే కావొచ్చు,  కానీ ప్రేమలో పడ్డాక సౌమురాలై పోతుంది. అనేక అవమానాల్ని సైతం ప్రేమకోసం ఎదుర్కొనే ధీరత్వం ఆ సహజ వీరత్వం లోంచే వచ్చినట్టు,  తన వీరనారీతనం బెర్పినట్టు లోపలా బయటా సంఘర్షణ తాలూకు ఇరు పార్శాలని సమున్నతంగా ప్రదర్శించింది.

         ఇక ప్రియాంకా చోప్రా ఎలాటి పాత్రనైనా సునాయాసం గా అభినయించేయ గలదని బర్ఫీలోనే నిరూపించింది. ఇప్పుడు కాశీబాయి పాత్ర ఎంత సంక్లిష్ట పాత్రయినా సమర్ధవంతంగా నిర్వహించుకుపోయింది. ఇటు భర్తతో- అటు మస్తానీతో లవ్ –హేట్ రిలేషన్ షిప్ ఆమెది. అయినా మాటల్లో గానీ, చూపుల్లో గానీ పాత్ర  స్థాయినీ, హూందాతనాన్నీ నిలబెడుతూ హృద్యమైన నటనని పోషించింది.
ఈ ముగ్గురూ తమ తమ పాత్రభినయాలతో చిరకాలం మనల్ని వెంటాడుతారు. బాలీవుడ్ కి, ఆ మాటకొస్తే భారతీయ సినిమా తెరకి ఒక పరిపక్వ ప్రేమకథకి శాశ్వత తత్త్వం కల్పించిన స్టార్లు గా గుర్తుండిపోతారు.


భన్సాలీయే సారథి

           న్సాలీ సారధ్యం లేకుండా ఇంత  క్లాసిక్ చారిత్రక  ప్రేమ కథని ఊహించలేం. సంగీతం తనే నిర్వహించాడు,  అది చాలా తోడ్పడింది. చారిత్రక సినిమాలని కూడా టెక్నాలజీ మోజుతో డిజైనర్ చరిత్ర  సినిమాలుగా రుచీ పచీ వుండని కళావిహీన సరుకుగా అమ్మేస్తున్న ఈ రోజుల్లో, ఇలాటి సినిమాల నిర్మాణాలకి భన్సాలీ ఒక పాఠ్య పుస్తకాన్నే  ఇచ్చాడు, చరిత్రతో, చరిత్ర నాటి కాలంతో అతనెక్కడా రాజీ పడలేదు. 18 వ శతాబ్దపు కాలాన్నీ, వాతావరణ పరిస్థితుల్నీ, నిర్మాణాల్నీ, మనుష్యుల్నీ, కళల్నీ, సంగీతాన్నీ అచ్చుగుద్దినట్టు ఆ కాలంలోకి దిగుమతి చేశాడు. మరాఠా  సంస్కృతీ సాంప్రదాయలు ఉట్టిపడే శాస్త్రీయ సంగీత (దేశవాళీ వాద్య  పరికరాలతో) సాహిత్య గుబాళింపు లతో నింపేశాడు.  కాలంలో వెనక్కి  ప్రయాణిం జేయడమంటే ఇదే. ఎక్కడా గ్రాఫిక్స్ చేసినట్టూ అన్పించని అద్భుత కళాఖండాన్ని కళ్ళ ముందు నిలబెట్టాడు. రంగుల్ని కూడా రూపకా లంకారాలుగా  వాడుకున్నాడు. రెండు మతాలకి చెందిన కాషాయ, ఆకుపచ్చ రంగులతోనూ కథ చెప్పాడు, భావాల్నీ చెప్పాడు.  యుద్ధ దృశ్యాల చిత్రీకరణ అయితే ఒక ఆర్టు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూనే కథా కథనాలనీ, పాత్ర చిత్రణల్నీ అపూర్వంగా, సమర్ధవంతంగా  నిర్వహించుకొచ్చాడు. భారతీయ కమర్షియల్ సిన్మాకి భన్సాలీ ఒక ఆన్సర్.

        ఈ తెలుగు డబ్బింగ్ తో ఇంకో విషయం తేటతెల్ల మవుతోంది. చాలా  సరళమైన  ప్రేమకథని  అంతే సున్నితంగా, ఏ దృశ్య శబ్ద కాలుష్యాలకీ చోటులేకుండా, అదుపు చేసిన భావోద్వేగాలతో ఇంత బలంగానూ  చెప్ప వచ్చనేది. అలాగే  ఇలా బాజీరావు మస్తానీ’,  ‘కంచె’  లాంటి అర్ధవంతమైన క్వాలిటీ కథల సినిమాలు ఇంకో పది వరసగా వచ్చి మీద పడితే- మంచి సినిమాల్ని కుదురుగా కూర్చుని చూడలేని, అభిరుచి పట్టని, రసాస్వాదన తెలీని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు పధ్ధతి మార్చుకునే  వీలుంటుంది.


-సికిందర్