రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఆగస్టు 2024, సోమవారం

1447 : స్క్రీన్ ప్లే సంగతులు



        మెరికన్ రచయిత్రి డోన్నా టార్ట్ పదేళ్ళకో నవల రాస్తుంది. ఒక్కో నవల పదేళ్ళ పాటూ రాస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంత టైం తీసుకుని రాస్తుంది. సాహిత్యాన్ని రూపొందించాలంటే చాలా ఓపిక, పరిపూర్ణత అవసరమని భావిస్తుంది.  స్పైరల్-బౌండ్ నోట్‌బుక్స్ లో సాదా బాల్‌పాయింట్ పెన్నులతో చేతితో రాయడానికే ఇష్టపడుతుంది. ఇది ప్రతీ వాక్యం గురించీ నెమ్మదిగా, లోతుగా ఆలోచించడానికి  అవకాశం కల్పిస్తుంది. ఎరుపు, నీలం, ఆపై ఆకుపచ్చ బాల్ పాయింట్ పెన్నుల్ని ఉపయోగించి సులభంగా చదవడానికి, ఏ మార్పు చేర్పులు ఎక్కడ జరిగాయో ట్రాక్ చేయడానికీ  వీలుగా రాస్తుంది. అవసరమైనప్పుడు నోట్‌బుక్స్ పేజీల్లో ఇండెక్స్ కార్డుల్ని కూడా చేరుస్తుంది.  క్వాలిటీ కంటే క్వాంటీటీ ప్రధానమైన నెట్ యుగంలో, అదీ వేగవంతమైన పని విధానాన్ని డిమాండ్ చేస్తున్న కాలంలో, ఆమె ఈ మూడు దశాబ్దాల్లో మూడు నవలలు మాత్రమే రాసింది. ఒక్కో నవల చరిత్రలో నిలిచిపోయేలా.

            ది సీక్రెట్ హిస్టరీ (1992), ది లిటిల్ ఫ్రెండ్ (2002), గోల్డ్ ఫించ్ (2013) ఆమె రాసిన మూడు నవలలు. ది సీక్రెట్ హిస్టరీ లో ఒక హత్య కేసులో చిక్కుకున్న కాలేజీ స్టూడెంట్స్ గురించి కథ. దీన్లోని క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ సృష్టించడానికీ, పాత్రల్ని అభివృద్ధి చేయడానికీ రీసెర్చితో సంవత్సరాల తరబడి గడిపింది. ఒక నమ్మదగ్గ, పాఠకులు లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టించడానికి శాస్త్రీయ అధ్యయనాలూ, చారిత్రక గ్రంథాల  పరిశీలనలూ భారీ యెత్తున చేసింది. నవల ఉన్నత ప్రమాణాలకి చేరుకోవడానికి చాప్టర్లు పదేపదే తిరగ రాసింది. రాసిన ప్రతీ పదం ఒక ప్రయోజనాన్ని, మొత్తం కథనానికి వొక అర్ధాన్నీ కల్పించేలా రాసుకొచ్చింది...
       
సాహిత్యకారులు సినిమాలు చూడనవసరం లేదేమోగానీ
, సినిమా రచయితలు సాహిత్యాన్ని చదవాల్సిందే. ఇది చవకబారు సినిమాలు తీయకుండా కాపాడుతుంది. కథ కోసం సినిమాలు చూసి సినిమాలు తీస్తే డెప్త్ రాదు. దాంతో తమ కథ లోతుపాతులు తమకే తెలియక పైపైన రాసేసి పైపైన తీసేయడమే జరుగుతుంది. నవలల్ని గానీ, కథానికల్ని గానీ చదవడం వృత్తిలో భాగంగా చేసుకుంటే, కథల  లోతుపాతులు తెలుస్తాయి. ఆ కథ రాయడంలోని సృజనాత్మకత తెలుస్తుంది. విజువలైజ్ చేసుకోవడం అబ్బుతుంది.
       
ఎలాగంటే నవల్లో/కథానికలో చదివే సన్నివేశాలు
, వర్ణనలు, పాత్ర చిత్రణలు తీసుకుని మన మెదడు విజువలైజ్ చేసుకుంటూ పోతుంది. సినిమాలు చూస్తే ఈ అభ్యాసం అబ్బదు. చదివి వూహించిన దాన్నే మెదడు విజువలైజ్ చేస్తుంది (నిత్యజీవితంలో వూహించుకునేవి కూడా విజువలైజ్ చేసుకుంటుంది)- ఈ విజువల్స్ మెదడులో భాగమైన రెటీక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) లో రికార్డయి పోతాయి.
       
ఈ ప్రక్రియ సమగ్ర
, పరిపక్వ కల్పనా శక్తిని పెంచుతుంది. రచయితలు కథ కోసం సినిమాలు చూస్తే ఉన్న వూహా శక్తి కూడా పోతుంది మెదడుకి అభ్యాసం లేక. సాంకేతికాల కోసమో, అర్ధమైతే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కోసమో సినిమాలు చూడొచ్చు,
సినిమాలో చూసే ఏ దృశ్యమూ మెదడులోని ఆర్ ఏ ఎస్ తీసుకోదు. నిత్య జీవితంలో చూసే ఏ దృశ్యమూ తీసుకోదు. అవి జ్ఞాపకాలుగా వుండిపోతాయి. వూహించుకున్న దృశ్యాల్ని మాత్రమే  ఆర్ ఏ ఎస్ తీసుకుని సబ్ కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. దీంతో సబ్ కాన్షస్ మైండ్ బలమైన కల్పనా శక్తిని డెవలప్ చేసి కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. అప్పుడు కాస్త బాగా రాయగల్గుతాం.
       
ఇంకా బాగా రాయాలంటే పాషన్ ని కల్పించుకోవాలి. ఈ పాషన్ అనేది మెదడులో పుట్టదు. హృదయంలో పుడుతుంది. హృదయంలో పుట్టిన పాషన్ పాగస్ నెర్వ్ ద్వారా మెదడుకి చేరి జీవమున్న కథల్ని సృష్టిస్తుంది. హృదయంలో పాషన్ ఎలా పుడుతుంది
? చేతిలో వున్న విషయం పట్ల హృదయంలో అపారమైన ప్రేమ పుట్టించుకునప్పుడు మాత్రమే పుడుతుంది. హృదయం ప్రేమించని, హృదయం అనుమతించని  ఏ పనీ మెదడులో జీవమున్న కార్యాన్ని సృష్టించదు. లోతు పాతుల్లేకుండా పైపైన రాసేసి పైపైన తీసేసే సినిమాలన్నీ కేవలం కాన్షస్ మైండ్ తో ఆలోచించి తీసేవే- సబ్ కాన్షస్ మైండ్ తో పని పెట్టుకోకుండా. ఈ మధ్య మూడు నాలుగు కథలు విన్నప్పుడు జరిగిందిదే - కేవలం కాన్షస్ మైండ్ లోంచి వచ్చిన డెప్త్ లేని కథలవి!
        
హాలీవుడ్ లో స్క్రీన్‌ప్లేల్ని (అన్నీకాదు) సాహిత్య రూపంగా పరిగణిస్తారు. ఆ స్క్రీన్ ప్లేలు సీన్ నెంబర్లు కూడా వేయకుండా నవలా రూపంలా వుంటాయి. అందుకని చదివేటప్పుడు ఆ నిర్మాతని లేదా, స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని సినిమా చూస్తున్న అనుభవానికి లోనుజేస్తాయి. ఎందుకంటే చదువుతున్నది నవలా పాఠంలా విజువలైజ్ అవుతూ వుంటుంది కాబట్టి. జేమ్స్ మొనాకో హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ అనే ప్రసిద్ధ పుస్తకం రాశాడు. అంటే సినిమాని చదవడమెలా అని. సినిమాలో కళ వున్నప్పుడే ఆ సినిమాని చూడడం గాక చదవడం చేస్తాం. ఇలాటి సినిమాలు కొన్నే వుంటాయి. ఇది విజువల్ నేరేషన్ కి సంబంధించిన ప్రక్రియ, లేదా టెక్నిక్. ప్రతి ప్రేములో, సన్నివేశంలో, సీక్వెన్స్ లో దాగి వున్న లోతైన భావార్ధాల్ని  గ్రహిస్తూ, ఆ క్లిష్టమైన సినిమా భాషని డీకోడ్ చేసుకుంటూ పోవడం సినిమాని చూడడం గాక, సినిమాని చదవడమనే కొత్త అనుభవానికి లోనుజేస్తుంది.
         
ఈ పనే
మహారాజా చేసింది. ఈ పనితో బాటు పైన చెప్పుకొచ్చిందంతా పూర్తి చే సింది. దాని డెప్త్,
క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ, ఒక నమ్మదగ్గ, ప్రేక్షకుల్ని లీనంజేసే కథా ప్రపంచపు సృష్టీ, పాగస్ నెర్వ్ ద్వారా హృదయమందించిన ఫాషన్ తో సబ్ కాన్షస్ మైండ్ కల్పన చేసిన సమగ్ర, పరిపక్వ కల్పనా, డస్ట్ బిన్, నాగు పాము, నకిలీ బంగారం వంటి ప్లాట్ డివైసులతో కల్పించిన సినిమా భాషా వగైరా.
       
పొరపాట్లు లేకపోలేదు
, పాత్రచిత్రణని దెబ్బతీసే పొరపాట్లు కూడా వున్నాయి. ఇంకా ఈ నాన్ లీనియర్ కథకి ఒకే గత కాలానికి సంబంధించినవి గాకుండా, వివిధ కాలాలకి సంబంధించిన మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఏర్పడిన తికమక. ఉదాహరణకి సెకండాఫ్ లో వచ్చే ఒక కీలక దృశ్యం కొనసాగింపు సీను, ఫస్టాఫ్ లో ప్రారంభ సీనుగా వుండడం!
       
దీనివల్ల ఈ స్క్రీన్ ప్లే సంగతులు రాయడం దాదాపు డోన్నా టార్ట్ నవలలు రాసేంత పనిగా మారింది! కాకపోతే పదేళ్ళు పట్టలేదు. ముందుగా ఈ ఆర్టికల్ రెండో భాగంలో లీనియర్ కథగా మార్చి చెప్పుకున్న కథనానికి
, నాన్ లీనియర్ కథనమెలా వుందో చూద్దాం. ఇందులో రెడ్ మార్క్ చేసిన నెంబర్లు సింబాలిజమ్స్, ప్లాట్ డివైసులు. లేదా ట్రాన్సిషన్ టూల్స్ గా వుంటాయి. వీటి గురించి చివర్లో చెప్పుకుందాం...

(రేపు మూడవ భాగం)
-సికిందర్