రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, January 23, 2023
1291 : స్పెషల్ న్యూస్!
ఇదే సమయంలో
తమిళనాడులో కూడా అజిత్, విజయ్ సినిమాలకి బాక్సాఫీసులు బద్ధలవడం చూసి బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది.
ఇలా మన బాక్సాఫీసులు ఎప్పుడు బద్దలవుతాయని తలలు పట్టుకుంటున్నారు. చివరికి
తేల్చిందేమిటంటే, సౌత్ లో స్క్రీన్స్ (థియేటర్లు) ఎక్కువ
వుండడం వల్ల సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని. కానీ స్టార్స్ కి పోటెత్తే
ఫ్యాన్సే లేకపోతే ఎన్ని స్క్రీన్స్ వుండీ ఏం లాభం. దేశంలో అన్ని నగరాల్లో కంటే
ముంబాయిలోనే స్క్రీన్స్ ఎక్కువున్నాయి
మరి.
సౌత్ స్క్రీన్లే ఎక్కువ!
సందర్భం వచ్చింది కాబట్టి అసలు
దేశంలో స్క్రీన్స్ గణాంకాలేమిటని చూస్తే- బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా
దాదాపు 8,700 స్క్రీన్‌లలో 31.52 లక్షల సీట్లు వున్నాయి. ఇందులో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 18.16
లక్షల సీటింగ్ కెపాసిటీతో దాదాపు 4,150 స్క్రీన్లు వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు స్క్రీన్ల పరంగా దాదాపు 47.78 శాతం, సీటింగ్ కెపాసిటీ
పరంగా 57.61 శాతం వాటా కలిగి వున్నాయి.
తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో 1,700 కంటే ఎక్కువ స్క్రీన్లు వుంటే, తమిళనాడులో 1,000 కంటే ఎక్కువ వున్నాయి. కర్ణాటకలో 800కి పైగా స్క్రీన్‌లు
వుండగా, కేరళలో దాదాపు 600 స్క్రీన్లు వున్నాయి. దక్షిణ దేశం కాకుండా, మహారాష్ట్రలో 1,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. గుజరాత్‌లో 730 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. మిగిలిన దేశంలో దేశంలోని మొత్తం స్క్రీన్‌లలో దాదాపు 33 శాతం వున్నాయి. నగరాల్లో చూస్తే
చెన్నైలో 230 స్క్రీన్‌లు వుంటే,
హైదరాబాద్‌లో 200 స్క్రీన్ లు వున్నాయి. అత్యధిక స్క్రీన్లున్న నగరం ముంబాయి. ఇక్కడ 259
మల్టీపెక్స్ స్క్రీన్లు, 65 సింగిల్ స్క్రీన్ థియేటర్లు వున్నాయి.
ఐనాక్స్ లీజర్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌ల ప్రకారం, 2019లో దేశంలో మిలియన్ జనాభాకు తొమ్మిది
స్క్రీన్‌లున్నాయి.
అమెరికా, కెనడాల్లో ప్రతి మిలియన్ జనాభాకు 125 స్క్రీన్
లున్నాయి. అయితే ఈ రెండు దేశాలకంటే మన దేశంలోనే ఎక్కువ సినిమాలు నిర్మిస్తారు. కానీ
జనాభా పరంగా చూసినా, సినిమాల పరంగా చూసినా స్క్రీన్లు చాలా తక్కువ. థియేటర్ల పరంగా చూస్తే
దక్షిణ దేశంలోనే దాదాపు 50 శాతం థియేటర్లున్నాయి. ప్రేక్షకులు తగ్గిపోతేనే
ఉత్తరాదిలో థియేటర్ల సంఖ్య పడిపోయింది.
మాస్ ని మర్చిపోయారు
బాలీవుడ్ ఏం చేసిందంటే, మాస్ మీడియా అయిన సినిమాని క్లాస్ మీడియాగా మార్చేసింది. దీంతో మాస్
సినిమాలు లేక ఉత్తరాది రాష్ట్రాల్లో బి, సి సెంటర్ల
ప్రేక్షకులతో బాటు థియేటర్లు అదృశ్యమైపోయాయి. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ గా
వెలుగుతున్న కాలంలో ఆయన నటించిన క్లాస్ సినిమాలు తక్కువ,
మాస్ సినిమాలు ఎక్కువ. దీంతో వూరూరా సినిమాలు ఆడేవి. అమితాబ్ తో బాటు అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, గోవిందా
వీళ్ళంతా మాస్ స్టార్లు. వీళ్ళ సినిమాలు విరివిగా వచ్చేవి. తర్వాతి
తరం స్టార్లు రెండేళ్ళ కొకటి, మూడేళ్ళకొకటి సినిమాలు తీస్తే
ప్రేక్షకులెక్కడుంటారు, థియేటర్లెక్కడుంటాయి. ఆ రోజుల్లో
ప్రేక్షకులనుద్దేశించి ఆబాలగోపాలం అనేవాళ్ళు. అంటే పిల్లల నుంచి వృద్ధులవరకూ అందర్నీ
అలరించే సినిమాలు. ఇప్పుడు హిందీ సినిమాలకి ఆబాలం లేదు,
గోపాలం లేదు, ఏ సెంటర్స్ లో యువమేళం తప్ప.
దక్షిణ సినిమాలు వాటి డీఎన్ఏ ని
వదులుకోవు. మాస్ మసాలా వుండాల్సిందే. అందుకే దేశంలోనే ఎక్కువ థియేటర్లలో అవి
బతుకుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బి,సి సెంటర్లలలో
వ్యాపారాలు మూగబోయి పంపిణీ దారులు ఆందోళన చేసిన సన్నివేశం కూడా వుంది. సౌత్
సినిమాలు సౌత్ వరకే సరిపెట్టుకోవడం లేదు. పానిండియా అనే పదం సృష్టించుకుని జాతీయ
మార్కెట్ ని ఆక్రమిస్తున్నాయి. ప్రతీ సౌత్ సినిమాకి రూ. 1,000 కోట్ల బాక్సాఫీసు మార్కెట్ వుందని నమ్ముతున్నారు
సౌత్ నిర్మాతలు. బాహుబలి రెండు భాగాలు, పోన్నియన్
సెల్వన్, విక్రమ్, ట్రిపులార్, పుష్ప మొదటి భాగం, కేజీఎఫ్ రెండుభాగాలు, కాంతారా ...ఆఖరికి కార్తికేయ 2 ఈ విషయాన్ని రుజువు చేశాయి.
బాలీవుడ్ దాని మార్కెట్
ని ఎలా విస్తరించుకోవాలో ఆలోచిస్తున్నట్టు లేదు. పరిశీలకులు ఒక మాట చెప్తున్నారు- హిందీ ‘దంగల్’ కి
అత్యధిక కలెక్షన్లు దాదాపు రూ. 375 కోట్లు రావడానికి, దేశంలో దాదాపు సగం ఎగ్జిబిషన్ స్క్రీన్‌లున్న దక్షిణ మార్కెట్టే
కారణమని. సౌత్ సినిమాలు సాఫీగా ఉత్తరాదికి మారినట్టు బాలీవుడ్
సినిమాలు సౌత్ మార్కెట్ లో చొచ్చుకెళ్ళే ప్రణాళికలు తయారు చేసుకోవాలి.
స్టార్లే తప్ప ఫ్యాన్స్ లేరు
అన్నిటికన్నా ముఖ్య సమస్య ఏమిటంటే
స్టార్ల కొరత. బాక్సాఫీసుని శాసించగల స్టార్లు, సూపర్ స్టార్లు ఇక లేరు.
ఉన్న ఖాన్ ల ప్రభ తగ్గింది అక్షయ్ కుమార్ తోబాటు. హృతిక్ రోషన్ ఎప్పుడు నటిస్తాడో
తెలీదు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్ లు సరిపోరు. సరికొత్త తరంలో
రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్
ధావన్, షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా
బాక్సాఫీసు బాద్షాలయ్యే పరిస్థితి లేదు.
అరవై దాటినా బాక్సాఫీసుని హైజాక్
చేసే చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ ల
వంటి ఆల్ రౌండర్లు హిందీలో లేకపోవడం బాలీవుడ్ భవిష్యత్తుకి ప్రమాద సంకేతం. ‘పుష్ప’ తో హిందీ ప్రేక్షకుల్ని టోకున తన ఖాతాలో
వేసుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సృష్టించుకున్న అల్లు అర్జున్ లాంటి యంగ్
మాస్ స్టార్స్ ని బాలీవుడ్ సృష్టించుకోక పోతే మనుగడ కష్టమే. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యశ్, ట్రిపులార్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హిందీలో మాస్ స్టార్స్ గా బలమైన ఫ్యాన్ బేస్ ని సృష్టించుకున్నారు.
విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల
కాకముందే ప్రమోషన్స్ కి క్రియేట్ చేసిన మాస్ మేనియా ఇంతా అంతా కాదు. ఒక మాల్ లో
పట్టనంతమంది అభిమానులు దూరతీరాలనుంచి తరలి వచ్చారు.
ఏ హిందీ స్టార్ కీ ఇంత ఫ్యాన్ బేస్
లేదు. బి, సి సెంటర్లు కలిస్తేనే ఇంత ఫ్యాన్ బేస్ వస్తుంది.
హిందీ సినిమాలకి దూరమైన బీసీ సెంటర్లని బాలీవుడ్ జోడో యాత్రతో ఏకం చేస్తున్నారు
సౌత్ స్టార్స్. ‘పుష్ప’ లో అల్లు
అర్జున్ వైరల్ డైలాగు వుంది- ‘తగ్గేదే లే’ అని. తెలుగు కంటే ఇది హిందీ వెర్షన్లో మంచి కిక్ ఇచ్చేలా వుంది- ‘నహీ ఝుకేగా సాలా’ అని! ఇది హిందీ రాష్ట్రాల్లో
పిల్లల నోటికి కూడా పట్టేసింది. అల్లు అర్జున్ ని అనుకరిస్తూ వీడియోలు వైరల్
చేశారు. ఇది కదా సినిమాలంటే, స్టార్లంటే అర్ధం!
బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి
తిరిగి ఒకనాటి స్టార్స్ నీ, వాళ్ళ మాస్ సినిమాల్నీ, ఫ్యాన్స్ నీ సృష్టించుకోవాలని గ్రహించకపోతే -‘వాల్తేరు
వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ ల వంటి సంచలనాల విజయ రహస్యాలు ఆశ్చర్యపరుస్తూనే వుంటాయి.
—సికిందర్
Sunday, January 22, 2023
1290 : సండే స్పెషల్ రివ్యూ!
95వ ఆస్కార్ అవార్డ్సు
పోటీల్లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన 15 సినిమాల్లో కొరియన్
మూవీ ‘డిసిషన్ టు లీవ్’ ఒకటి. 92 దేశాలు పంపిన చలన చిత్రాల్లో మన దేశపు ‘చెల్లో షో’ కూడా షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. షార్ట్ లిస్టయిన 15
సినిమాల్లోంచి ఫైనల్ నామినీలుగా 5 సినిమాల్ని ఎల్లుండి అంటే జనవరి 24 న
ప్రకటిస్తారు. గెలుపు గుర్రాన్ని మార్చి 12న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ప్రకటిస్తారు.
‘డెసిషన్ టు లీవ్’ ప్రసిద్ధ
కొరియన్ దర్శకుడు పార్క్ చాన్ వూక్ తీసిన మాస్టర్ పీస్ అంటున్నారు. 2022 కేన్స్
ఫిలిం ఫెస్టివల్లో అతను ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యాడు. మొత్తం 11 సినిమాలకి
దర్శకత్వం వహించిన పార్క్ చాన్ వూక్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో 43 అవార్డులు
పొందాడు. ప్రస్తుతం ‘డెసిషన్ టు బ్రేకప్’ అనే మూవీ మీద పనిచేస్తున్న పార్క్, ‘డెసిషన్ టు లీవ్’ ని మర్డర్ మిస్టరీ రోమాన్స్ గా
తీశాడు. దీని విశేషాలు తెలుసుకుందాం...
దక్షిణ కొరియాలోని బుసాన్ లో
రిటైర్డ్ ఇమ్మిగ్రేషన్ అధికారి అనుమానాస్పదంగా ఎత్తైన కొండ మీద నుంచి జారిపడి
చనిపోయిన కేసు నమోదవుతుంది. చైనీయురాలైన అతడి పడుచు భార్య సూరేని అనుమానిస్తాడు
డిటెక్టివ్ హేజున్. భర్త మరణించిన బాధ ఆమెలో కనిపించదు, పైగా
ఆమె చేతుల మీద, కాళ్ళ మీదా గాయాలుంటాయి. అడిగితే తన గురించి
చెప్తుంది. తను భర్త జారిపడి మరణించిన కొండని క్లెయిమ్ చేయడానికి చైనా నుంచి
వచ్చింది. ఆ కొండ తన తాతది. అతను మంచూరియా స్వాతంత్ర్య పోరాట వీరుడు. తల్లి
చనిపోతూ ఈ విషయం చెప్తే తను వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో వున్న తల్లి ఏదైనా మందు
ఇచ్చి తనని పరలోకాలకి పంపేయమని అడిగితే, ఆ మందు ఇచ్చి
ప్రశాంతంగా పరలోకాలకి పంపేసింది.
ఇప్పుడు భర్త మరణానికి సంబంధించి
సాక్ష్యాధారాలు ఆమెకి వ్యతిరేకంగా వుంటాయి. డిటెక్టివ్ హేజున్, అసిస్టెంట్ సువాన్ తో కలిసి ఆమె మీద నిఘా పెడతాడు. ఆ నిఘాలో ఆమెని గమనిస్తూ
ప్రేమలో పడతాడు భార్య వున్న హేజున్. ఆమె ఒక హత్య కాదు,
తాజాగా ఇంకో రెండు హత్యలు చేసినా అతడి ప్రేమ చావదు. అతడికి దగ్గరై అతడి దగ్గరున్న
సాక్ష్యాధారాల్ని తొలగించడం ప్రారంభిస్తుంది. ఇక అసలే నిద్ర లేమి పేషంట్ అయిన అతడి
పిచ్చి ప్రేమతో హాత్యకేసు ప్రేమ కేసుగా మారిపోయి ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.
సింపుల్ కథ -సంక్లిష్ట కథనం
దర్శకుడు పార్క్ అమెరికన్ ఫిలిం
నోయర్ జానర్ సినిమాలతో స్ఫూర్తి పొంది ఈ కథ చేశాడనేది స్పష్టంగా వుంటుంది. ఒక
డిటెక్టివ్- ఒక మర్డర్- మధ్యలో వాంప్ క్యారక్టర్. కాకపోతే వాంప్ క్యారక్టర్ మీద
డిటెక్టివ్ ప్రేమని రగిలించాడు. అయితే డిటెక్టివ్ కి ఈ ప్రేమ రగలడానికీ, ప్రేమలో అంత పిచ్చి వాడవడానికీ తగిన బలమైన కారణం కనిపించదు (తెలుగు ’18
పేజెస్’ లో నిఖిల్ ప్రేమలా). ఆమెలో ఏం
ఆకర్షించిందో తెలియదు. ఈ లోపం వల్ల మొత్తం కథంతా, ఆర్భాటమంతా
సిల్లీగా అన్పిస్తుంది. పైగా ఈ కథని 2 గంటల 20 నిమిషాలు సాగదీయడం అసహనానికి గురి
చేస్తుంది.
కారణం లేని డిటెక్టివ్ ప్రేమతో ఉద్వేగభరిత
చిత్రణ చేశాడు. సూటిగా వున్న విషయాన్ని వీలయినంత సాగదీసి,
దాని స్థితి స్థాపకతని పరీక్షించి చూడాలనుకున్నట్టు అన్పిస్తాడు దర్శకుడు. దీనికి
స్థలకాలాల ఐక్యతతో ఆడుకుంటాడు. గతాన్ని వర్తమానంతో బ్లర్
చేస్తాడు. విషయాన్ని కొండని తవ్వుతున్నట్టు తవ్వి ఎన్నెన్నో అంశాలతో, కథా గమనానికి అంతరాయం కలిగిస్తాడు. మ్యాజిక్ చేస్తున్నట్టు ఫ్లాష్‌బ్యాకులతో, ఫాంటసీలతో తికమక పెట్టేస్తాడు.
ఆమె చేసే కొత్త హత్యలకి
ప్రేమోన్మాదియైన డిటెక్టివ్ తనే క్లూస్ ని మాయం చేసే లాంటి కథకవసరమైన మలుపులు
కొన్నే వుంటాయి. ప్రేమ గోలే ఎక్కువుంటుంది. ప్రేమలో అతడి అంతులేని ఊహల మత్తులో ప్రమాదకర
చర్యలకి పాల్పడేలాంటి థ్రిల్లింగ్ ఘట్టాలుండవు. ప్రేమకి కారణం లేకపోవడం వల్ల మొత్తం
కథ అర్ధరహితంగా కన్పిస్తుంది. సినిమా ఫస్టాఫ్ మర్డర్ మిస్టరీలా, సెకండాఫ్ లవ్
స్టోరీలా వుంటుంది. అయితే భాషా సమస్యల కారణంగా కూడా సినిమాని ఫాలో అవడం కష్టంగా
వుంటుంది. సబ్ టైటిల్స్ వేసినా, ప్రతీ సూక్ష్మ అంశాన్నీ
వివరించకపోతే అసలే సంక్లిష్టంగా వున్న కథ పూర్తిగా అర్ధంగాని పరిస్థితి.
వీకీపీడియాలో కథ చదువుకుని సినిమా చూస్తే ఓహో ఇదా విషయమని కొన్ని సూక్ష్మాంశాలు
అర్ధమ వుతాయి. సూక్ష్మం, సంక్లిష్టం,
సంకీర్ణం ఇవన్నీ అవసరం లేదు దీనికి.
అసలు స్వరూపం ఇదీ...
పొరవిప్పి చూస్తే ఈ కథ అసలు స్వరూపం
తెలుస్తుంది. ఈ అసలు స్వరూపంతోనే ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తుంది.
2019 లో దక్షిణ కొరియా ‘పారసైట్’
ఆస్కార్ అవార్డుకి ఈ స్వరూపమే కారణం. ‘డెసిషన్ టు లీవ్’ కి ‘పారసైట్’ తో ఈ
సారూప్యముంది. ‘పారసైట్’ లాగే ‘డెసిషన్ టు లీవ్’ శ్రామిక- పెట్టుబడిదారీ వర్గ
విభజనని చిత్రిస్తుంది. ఆమె చైనా నుంచి వచ్చి వుంటున్న అక్రమ వలసదారు. కొరియన్ విముక్తి
పోరాట వీరుడి వారసురాలిగా కొండని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన హత్య కేసు
నిందితురాలు, నిమ్నురాలు. అతను కొరియన్ సమాజపు కులీనుడు. వీళ్ళిద్దరి ప్రేమని
అంగీకరించదు వర్గ సోపానక్రమపు కొరియన్ సమాజం. అందుకని
‘అనార్కలి’ కథ ఎలా ముగిసిందో అలా ముగుస్తుంది ఈ కథ. ముగింపు గుండెని పిండేసినట్టు
వుంటుంది ఈ ‘సలీం’ తో. వర్గ తారతమ్యాలు
సరే గానీ పునాదిలేని ప్రేమ పురాణంతోనే వచ్చింది సమస్య.
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో అమెరికన్
ఫిలిం నోయర్ సినిమాలు కూడా ధనిక- పేద విభజనతో కూడిన క్రైమ్ సినిమాలే. వాటిలో
తప్పనిసరిగా కొన్ని నియమిత పాత్రలు, చిత్రీకరణ ఎలిమెంట్లు
వుంటాయి. వీటితో అతి కళాత్మకతకి పోయి సంక్లిష్టం చేయకుండా సూటిగా, తేటగా విషయం చెప్పేవాళ్ళు. ఇలా కాకుండా ‘డెసిషన్ టు
లీవ్’ నోయర్ ని అతి చేసిన కళాప్రదర్శన అయింది. ఆసక్తి వున్న వాళ్ళకి
సబ్ టైటిల్స్ తో ఇది ‘ముబి’ ఓటీటీలో
వుంది.
—సికిందర్
Saturday, January 21, 2023
1289 : స్పెషల్ న్యూస్!
2022లో తెలుగులో తీసిన 250
చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ అయితే, తమిళంలో 179 ఫ్లాపయ్యాయి, ఒకటే హిట్టయ్యింది. కేవలం ‘లవ్ టుడే’ కే ప్రేక్షకులు పట్టంగట్టారు. అది కూడా సంచలనం సృష్టిస్తూ 5 కోట్ల
బడ్జెట్ కి 100 కోట్ల భారీ బాక్సాఫీసు ఇచ్చి ప్రోత్సహించారు. తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. 11వ రోజుకల్లా
50 కోట్లు వసూలు చేసింది. మూడో వారం కల్లా 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తే, అందులో తమిళనాడులో 50 కోట్లు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 10 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 5 కోట్లు, సీడెడ్ లో కోటి, ఆంధ్రాలో 4 కోట్లు. ఇలా గ్లోబల్
హిట్టయ్యింది.
180 చిన్న సినిమాల్లో ఒకటే
ఇంత భారీ విజయం సాధిస్తే మిగిలినవి భారీ నష్టాలే తప్ప రూపాయి కూడా లాభం
తెచ్చిపెట్టలేదు. తమిళ సినిమా 2022 లో మరో
రెండు భారీ విజయాల్ని సాధించింది. పిఎస్-1, విక్రమ్ సినిమాలతో
బాక్సాఫీసు దద్దరిల్లింది. మొత్తం 230 సినిమాలు విడుదలైతే వాటిలో 180 చిన్న
సినిమాలు, మిగిలిన 50 పెద్ద, మధ్యస్థ
బడ్జెట్ సినిమాల్లో 9 పెద్ద సినిమాలు తప్ప మిగిలినవి ఫ్లాపయ్యాయి.
అయితే రూ. 25 కోట్లు అంతకంటే
ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ప్రతి పెద్ద సినిమా 2022 లో హిట్టేనని
చెప్పుకుంటున్నారు. ఇవన్నీ బాక్సాఫీసు హిట్స్ కావు. థియేటర్లలో డబ్బు సంపాదించలేదు.
థియేటరేతర
మొత్తం వ్యాపారంతో నిర్మాతలకి లాభాలు
తెచ్చిపెట్టాయి. చాలా మంది స్టార్ సినిమాల నిర్మాతలు శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కుల ప్రీ-రిలీజ్ అమ్మకాలతో తమ పెట్టుబడిని రికవరీ
చేసేసుకుంటున్నారు.
ఆపైన తమిళనాడు నుంచి వచ్చే థియేట్రికల్స్ వసూళ్ళు దైవాధీనం. సినిమాలనేవి థియేటర్లలో ప్రదర్శించడానికి
పుట్టాయి. కానీ అవి సొంతిల్లు వదిలేసి ఓటీటీ, శాటిలైట్, డబ్బింగుల వంటి అనాధాశ్రమాల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రేక్షకులు వారి సొంతిళ్ళలో వుండిపోవడం వల్ల.
థియేటటర్లో
ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునేటప్పుడు ప్రేక్షకులు
తమ సమయానికీ, డబ్బుకూ చాలా విలువ ఇవ్వడం ప్రారంభించారని తెలుగువాడైన తమిళ కో
డైరెక్టరొకరు చెప్పారు. ఇంతకి ముందు అధిక నాణ్యతగల
కంటెంట్ కీ,
ప్రేక్షకులకీ మధ్య చాలా గ్యాప్ వుండేదనీ, ఆన్ లైన్లో
వీక్షించే వెసులుబాటుతో గత ఐదేళ్ళలో ఈ
గ్యాప్ పూడిపోయిందనీ, దీంతో థియేటర్‌కి రావడానికి ఎంతో
ఆలోచిస్తున్నారనీ ఆయన చెప్పారు. ఇది అంతటా వున్న పరిస్థితే.
గతంలో
తమిళ
చిన్న సినిమాలు రూ. 2-3 కోట్ల బిజినెస్
చేసేవి.
ఇప్పుడు రూ. 25
లక్షలు కలెక్ట్ చేయడం కనాకష్టంగా మారింది.
పెద్ద సినిమాలు కూడా అయితే హిట్ లేకపోతే ఫట్ గా మారాయి. మిశ్రమ స్పందన పొందిన కొన్ని తమిళ స్టార్ సినిమాలు ఈ సంవత్సరం రూ. 5 కోట్ల లోపు వసూలు చేశాయి. ఇంతకుముందు
కనీసం రూ. 7-10 కోట్లు
వసూలు చేసేవి. ఈ సినిమాలు థియేటరేతర వ్యాపారాలు చేసుకున్నాయి. ఏవరేజ్, ఎబో
ఏవరేజ్ కంటెంట్ తమిళ ప్రేక్షకులకి నచ్చడం లేదు.
చిన్న సినిమాలు బాగా ఆడకపోవడం ఆరోగ్యకరమైన
ట్రెండ్ కాదనీ, చిన్న సినిమాలు విజయం సాధించడం చాలా ముఖ్యమనీ, ఎందుకంటే అక్కడ స్టార్లు పుడతారనీ, చిన్న సినిమాలు కొత్త స్టార్స్ ని సృష్టించినప్పుడు అది పరిశ్రమకి
మరింత డబ్బు తెచ్చిపెడుతుందనీ, కోలీవుడ్ లో దూరదృష్టితో
ఆలోచిస్తున్నారు.
తమిళనాడులో సినిమాల సక్సెస్ రేటు
దాదాపు 3 లేదా 4% వుంటుంది. దీనికి
కారణం నటీనటులకి అధిక పారితోషికం, తమిళ రాకర్స్ పైరసీ, అధిక టిక్కెట్ ధరలని పైకి చెప్పుకున్నా,
అసలు స్థానిక సినిమాల పట్ల ప్రేక్షకుల వైఖరిలో వచ్చిన మార్పు కారణం. చిన్న సినిమాల
పట్ల వైముఖ్యం కూడా ఒకటి. దీన్ని గుర్తించకుండా, అవసరానికి
మించి వందల సంఖ్యలో చిన్న సినిమాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇన్ని సినిమాలు
ప్రదర్శించడానికి థియేటర్లు కూడా లేవు. తెలుగు రాష్ట్రాల థియేటర్ల సంఖ్యలో (1700) సగానికి
కొంచెం ఎక్కువ (1000) వున్నాయి. కాబట్టి చాలా సినిమాలు విడుదలకాక మురుగుతూంటాయి.
తగినన్ని థియేటర్లు లేక, వాటిలో ప్రేక్షకులూ లేక దేశ సేవ చేయడానికి చిన్న సినిమాలు తీస్తే అది
మంచిదే. సినీకార్మికులకి రెగ్యులర్ ఉపాధి లభిస్తుంది. థియేటర్లలో క్యాంటీన్ వాలాలు, పార్కింగ్ వాలాలు ఈ సినిమాలకి జనాల్లేక శాపాలు పెట్టే దృశ్యాలుం
టాయి- వాళ్ళ సంక్షేమ పథకం కూడా ఆలోచిస్తే సరిపోతుంది.
—సికిందర్
Friday, January 20, 2023
1288 : స్పెషల్ న్యూస్!
టాలీవుడ్ లో
లాగే బాలీవుడ్ లోనూ చిన్న-బడ్జెట్ సినిమాలు సంక్షోభ స్థితిలో వున్నాయి. థియేట్రికల్ విడుదలలు ఖరీదైన వ్యవహారంగా మారడం, పెద్ద
స్టార్స్ నటించని సినిమాలకి ప్రేక్షకులు
కనిపించక పోవడంతో, బాక్సాఫీసు
అంకెలు చూసి తప్ప ఓటీటీలు ముందుకు రాకపోవడంతో చిన్న, మధ్యస్థ-బడ్జెట్ హిందీ సినిమాలు సంక్షోభంలో వున్నాయి.
కోవిడ్
మహమ్మారికి పూర్వం ఈ పరిస్థితి లేదు. కోవిడ్ మహమ్మారికి పూర్వం సూపర్ హిట్ల
పర్వంతో శిఖరం మీదున్న ఆయుష్మాన్ ఖురానా, తాప్సీ పన్ను, రాజ్ కుమార్ రావ్ లు మహమ్మారి అప్పటి నుంచి ఇప్పటికీ ఫ్లాప్స్ తో
కోలుకోలేక పోతున్నారు.
2019 లో
ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు- ‘ఆర్టికల్ 15’ : బడ్జెట్ 30 కోట్లు, బాక్సాఫీసు 90 కోట్లు; ‘డ్రీమ్ గర్ల్’ : బడ్జెట్ 28
కోట్లు, బాక్సాఫీసు 200 కోట్లు; ‘బాలా’ బడ్జెట్ 32 కోట్లు,
బాక్సాఫీసు 172 కోట్లుతో తన రేంజిలో ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్న ఆయుష్మాన్
ఖురానా, 2020 నుంచీ గ్రాఫ్ పతనమవుతూ 2022 చివరిలో ‘ఏన్ యాక్షన్ హీరో’ తో నిర్మాతలు అయోమయంలో పడిపోయారు.
‘ఏన్ యాక్షన్ హీరో’ బడ్జెట్ 30 కోట్లు అయితే, బాక్సాఫీసు 41 కోట్లు; దీనికి ముందు ‘డాక్టర్ జీ’ 40
కోట్ల బడ్జెట్ కి 28 కోట్ల బాక్సాఫీసు, ‘చండీఘర్ కీ ఆషికీ’ 30 కోట్ల బడ్జెట్ కి 41 కోట్లు
బాక్సాఫీసుతో అతడి బుల్లి స్టార్ డమ్ పడిపోయింది. ఇదే పరిస్థితి తాప్సీ, రాజ్ కుమార్ రావ్ లది. 2022 లో రాజ్ కుమార్ రావ్ ‘హిట్
-ది ఫస్ట్ కేస్’ బడ్జెట్ 30 కోట్లకి,
12 కోట్లు మాత్రమే బాక్సాఫీసు. తాప్సీ పన్ను ‘దొబారా’ 30 కోట్ల బడ్జెట్ కి, కేవలం 7 కోట్లు బాక్సాఫీసు
వచ్చింది. తాజాగా 2023 జనవరి 13 న విడుదలైన టబు- అర్జున్ కపూర్ లు నటించిన విశాల్ భరద్వాజ్ ‘కుత్తే’
సైతం 35 కోట్ల బడ్జెట్ కి 5.25 కోట్లు వసూలు చేసింది!!
ఇక ఇంకా చిన్న హీరోల
సినిమాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇప్పుడు చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు థియేటర్లలో 70-80 కోట్ల రూపాయల వ్యాపారం చేసే ప్రసక్తే లేదని స్పష్టమై పోతోంది.
దీంతో బాలీవుడ్ టాప్ నిర్మాతలు వీటికి డబ్బులు పెట్టడం లేదు. వీటిని
చూడడానికి ప్రేక్షకులూ థియేటర్లకి
రావడంలేదు.
చిన్న సినిమాల వ్యాపారం ఓటీటీల
వైపుకు వెళ్ళిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలు ఎగబడి వీటిని చేపట్టినా, ఆ
తర్వాత ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ముందుగా థియేటర్లో విడుదల చేస్తేనే ఓటీటీకి
ఛాన్స్ అంటున్నారు. ఈ పరిస్థితి తెలుగులోనూ తలెత్తింది. హిందీలో చిన్నా పెద్దా తేడా లేకుండా సినిమాలు బాక్సాఫీసు విజయాలు చవిచూసిన పరిస్థితుల్లో, 60-70 కోట్లు వసూలు చేసే చిన్న
సినిమాలు 10 శాతం వసూళ్ళకి పడిపోయాయి.
పెద్ద సినిమాల కంటే
చిన్న సినిమాల
రాబడిని అంచనా వేయడం కష్టం. పెద్ద
సినిమాలకి థియేట్రికల్ విడుదలకి ముందే శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ) హక్కుల విక్రయం
పూర్తవుతుంది. అదికూడా భారీ స్థాయిలో వుంటుంది. ఉదాహరణకి షారూఖ్ ‘పఠాన్’ శాటిలైట్ -ఓటీటీ హక్కులు 150 కోట్లకి విక్రయించారు. ఇంకా రానున్న ‘జవాన్’ కి 250 కోట్లు. చిన్న సినిమాలకి ఈ
సౌకర్యముండదు.
వివిధ భాషల్లో చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు 1000 వరకూ విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలు ఓ డజను మాత్రమే విడుదలవుతాయి. పెద్ద సినిమాలంటే
ఇదివరకులా మాస్ మసాలా- సాంగ్ అండ్ డాన్సులు కాకుండా, ట్రిపులార్, కేజీఎఫ్ సినిమాలు, లేదా బ్రహ్మాస్త్ర
వంటి
సినిమాలు ఆకాశాన్ని తాకి ప్రేక్షకులకి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయి. చిన్న
సినిమాలేం చూపిస్తాయి. ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించాలంటే చిన్న సినిమాలకి
కంటెంటే ప్రధానమనుకునే రోజులు కూడా గతిస్తున్నట్టు వుంది పరిస్థితి. ప్రేక్షకులు
దృశ్య, శబ్ద, తారాగణ వైభవాలకి ఆకర్షితులవుతున్నారు. ఇవి
పెద్ద సినిమాలే అందిస్తాయి. ప్రేక్షకులే చిన్న సినిమాలని ఓటీటీ సినిమాలుగా భావించే
పరిస్థితి వచ్చింది.
సంక్రాంతికి పెద్ద సినిమాలు కాకుండా
రెండు చిన్న సినిమాలు విడుదల చేస్తే ఇంట్లోనే టీవీలు చూస్తూ పండగ చేసుకుంటారే తప్ప
చిన్న సినిమాల పోస్టర్ల వైపు కూడా చూడరు. లాక్ డౌన్లు ఎత్తేశాక పూర్తిగా థియేటర్లు తిరిగి తెరిచిన
తొమ్మిది నెలల తర్వాత, మహమ్మారికి ముందు స్థాయులతో పోలిస్తే, 70-80 శాతం ప్రేక్షకుల రికవరీని చూశామని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ
రికవరీ పెద్ద సినిమాలతోనే సాధ్యమైంది. ప్రేక్షకులు ఇంట్లో ఏ సినిమాలు చూడాలి, థియేటర్‌లో ఏ సినిమాలు చూడాలనే అంశం పట్ల చాలా స్పష్టతతో వున్నారు.
హాలీవుడ్ ఈ సమస్యని ఐదారు సంవత్సరాల క్రితమే ఎదుర్కోవడం
ప్రారంభించిందని
అంటున్నారు. మనదేశంలో ఇప్పుడు మొదలైంది. చిన్న సినిమాలు బి, సి
సెంటర్లలో పెద్దగా విడుదల కావు. పెద్ద సినిమాలే చొచ్చుకు వెళతాయి. దేశంలో మొత్తం
కుటుంబాలు 25 కోట్లు అయితే, టీవీలున్న కుటుంబాలు 15 కోట్లు. అంటే టీవీలకి 60 కోట్లమంది
వీక్షకులున్నట్టు. ఓటీటీలకి 40 కోట్ల మంది వున్నారు. అంటే ఓటీటీ
ఇంకా బి, సి సెంటర్స్ కి చొచ్చుకెళ్ళాల్సి వుంది. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ని
అందించడానికి ఇందుకే వెర్నాకులర్ ఓటీటీలు వెలుస్తున్నాయి. ఇది జరిగితే చిన్న
సినిమాలకి ఇక ఎప్పటికీ బి, సి సెంటర్లు కూడా వుండవు.
చిన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడాన్ని నిపుణులు
బహుముఖాలుగా చూస్తున్నారు-ఇప్పుడు అంతర్జాతీయ
కంటెంట్ కి
అలవాటు పడిన మహమ్మారి అనంతర వివేకం గల ప్రేక్షకులు ఒక కారణం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేని హిందీ సినిమాల కంటెంట్ ఇంకో కారణం, థియేట్రికల్ ఓటీటీలో ప్రీమియర్ చేయడానికి ఓ నాలుగు
వారాల సమయం మరో
కారణం, 40కి పైగా గల ఓటీటీ యాప్‌లు, లీనియర్ టీవీ, స్పొర్ట్స్, ఇతర
ఈవెంట్‌లు మరింకో కారణం- ఇన్ని
కారణాలతో చిన్న సినిమాల వైపు చూడడం లేదని నిపుణుల వివరణ.
ఇక బాలీవుడ్ లో చిన్న సినిమాల
విడుదల వొక ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రచారం కోసమే 5-10 కోట్లు వెచ్చించాలి.
దీనికి మార్కెటింగ్ ఖర్చులు, నిర్మాణేతర ఖర్చులూ కలిపి రూ. 25-30 కోట్ల వరకూ అవుతుంది. అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు 25 శాతం. ఈ 25 శాతాన్ని ఓటీటీ బాసులు పరిగణించరు. పైగా థియేటర్ లో
విడుదలై, ప్రచారం జరిగిన సినిమాలతోనే రమ్మంటున్నారు. ఈరోజుల్లో
ఒక చిన్న లేదా మధ్యస్థ-బడ్జెట్ సినిమా థియేట్రికల్‌గా బాగా పోవడం చాలా ముఖ్యం.
లేకపోతే అరకొర రేట్లకి ఓటీటీలకి అమ్ముకోవడమే. ఇది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకి ప్రతిధ్వని అని అంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, బిగ్ ఫైవ్ స్టూడియోలైన -యూనివర్సల్ పిక్చర్స్, పారామౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ వంటి అన్ని ప్రధాన మీడియా కంపెనీలు లాభదాయకతపై
దృష్టి సారిస్తున్నాయి. గత ఏడాది అమెరికా క్యాపిటల్ మార్కెట్స్ లో సంక్షోభం తర్వాత ఓటీటీ కంటెంట్‌పై డబ్బుని తగలేయరాదని నిశ్చయించుకున్నారు. తత్సంబంధ ఉద్యోగుల్నితొలగించే ప్రణాళికలు కూడా
చేపట్టారు. వార్నర్ బ్రదర్స్ ‘హెచ్ బీఓ
మ్యాక్స్ ఇండియా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించే ఆలోచనని కూడా విరమించుకుంది.
ఓటీటీ వీక్షణకు సరిపోయే దానికి విభిన్నమైన
కంటెంట్‌ని
సృష్టించడం, మార్కెటింగ్ ఖర్చులు తగ్గించుకుని పరిమిత థియేటర్ విడుదల వంటి వ్యూహాలతో ప్రయోగాలు చేయడమే ముందున్న మార్గమని నిపుణులు
అంటున్నారు. ఇది కూడా ఎంతవరకు
కరెక్టో చెప్పలేం. అయితే ఒకటే ప్రశ్న. చిన్న సినిమాలకి ఈ ప్రపంచ వ్యాప్త
సంక్షోభాన్ని తెలుగు నిర్మాతలు గుర్తించే వందల కొద్దీ సినిమాలు తీస్తున్నారా
అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. చాలా మందికి ఈ సంక్షోభం గురించే తెలీదు.
—సికిందర్
Thursday, January 19, 2023
స్క్రీన్ ప్లే టిప్స్ (839)
91. ‘భైరవ గీత’ ని ఆర్ట్ సినిమాగా తీయాలనుకుని వుండరు. తెలుగులో ఎవ్వరూ ఆర్ట్ సినిమాలు తీయాలనుకోరు. కానీ తీస్తున్న ఎన్నో స్టార్ సినిమాలు కూడా కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇది బుద్ధిపూర్వకంగా చేయడం లేదు. కమర్షియల్ సినిమా తీస్తున్నామనుకుని ఆర్ట్ సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఈ సమస్యకి మూలం క్రియేటివ్ స్కూల్లో వుంది. స్ట్రక్చర్ స్కూల్లో ఇలా కమర్షియల్ సినిమాలు ఆర్టు సినిమాలుగా తయారు కావు. ఎందుకంటే ఐడియా దగ్గరే పట్టేస్తుంది స్ట్రక్చర్. క్రియేటివ్ స్కూలు చలి మంటేసుకుని తలా ఓ కట్టె పుల్ల వేయడం లాంటిది. మిగిలేది బూడిదే.
92. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్) - ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్) - ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం” – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్ వ్యవహారమవుతుంది. అంటే అప్పుడు పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు- అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.
93. సినిమా కథంటే డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వచ్చేది. గాథకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు. ఉపోద్ఘాతానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఫ్లాష్ బ్యాక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డాక్యుమెంటరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఎపిసోడ్లకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆంథాలజీ (కథల సంపుటి) కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆర్టు సినిమాకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, వరల్డ్ మూవీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఇండీ ఫిలిం కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, క్రౌడ్ ఫండింగ్ కళాత్మకానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, న్యూస్ బులెటిన్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డైరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డబ్బులు పెట్టి తీయకపోయినా వీటన్నిటికీ డబ్బులు రానేరావు!
94. స్క్రీన్ ప్లే నిర్మాణానికి నేను రూపొందించిన పారడైంలో పరిణామం ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ లని ప్రతిపాదించిన తర్వాతే జరిగింది. వీటికి పించ్ - 1, పించ్ - 2 లని కలపడం ద్వారా జరిగింది. ఇది జరిగి చాలా చాలా సంవత్సరాలైంది. కానీ నిజానికి నేను తెలుసుకున్న దేమిటంటే, పారడైంని నవీకరించాలనుకున్నప్పుడల్లా దాని రూపం మాత్రం చెక్కుచెదరని శాశ్వతత్వంతో కూడి వుంటుందనేది. పారడైం అనేది ఒక రూపమే అయినా, అది ఫార్ములా మాత్రం కాదు మార్పు చెందుతూ వుండడానికి. ఆ రూపంలో బిగినింగ్, మిడిల్, ఎండ్ కథన విభాగాలు వుండకుండానూ పోవు. కొంతకాలం క్రితం నా స్ట్రక్చర్ (పారడైం) మోడల్ కి నేనిస్తున్న ప్రాముఖ్యాన్ని కాస్త తగ్గించుకోవాలని నిర్ణయించాను. ఒక టీచింగ్ క్లాసులో పారడైం గురించి బోధిస్తున్నప్పుడు, ఒక స్టూడెంట్ లేచి, ‘ఇదంతా నాకు తెల్సు, చాలా పాతబడ్డ విషయం’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు గ్రహించాను. పారడైం అనేది మూవీ కల్చర్ నరనరాన జీర్ణించుకు పోయాక, నేనింకా దీని గురించి కొత్తగా బోధించాల్సిందేమీ లేదని. దీనికంత ప్రాముఖ్యాన్నివ్వ కూడదనీ. ఇక క్యారెక్టర్ ఎలిమెంట్స్ వైపు దృష్టి సారించాలనీ...
―సిడ్ ఫీల్డ్
95. కథంటే స్ట్రక్చర్. నిబిడీకృతమై వున్న స్ట్రక్చరే కథ. కథంటేనే స్ట్రక్చర్, స్ట్రక్చర్ అంటేనే కథ. ఇండియా అంటేనే భారత్, భారత్ అంటేనే ఇండియా. ఎందుకు స్ట్రక్చరనే కథలే కావాలంటే, మాటలు నేర్చినప్పట్నుంచీ మానవుల మెదడు కథల్ని రిసీవ్ చేసుకోవడానికి అలా వైరింగ్ అయివుంది కాబట్టి. సినిమాల్ని ఎన్ని అష్టవంకర్లు తిప్పినా ఈ మెదడులోని వైరింగ్ ని - సాఫ్ట్ వేర్ ని - మార్చి ప్రేక్షకుల్ని మెప్పించలేరు. ప్రకృతి ప్రకృతే, వికృతి అవదు. ఇది కూడా ఒకటో తరగతి పాఠమే! దీన్ని అర్ధం జేసుకుంటే వెండితెరకి సినిమా కథలు తప్ప మరోటి రాయడానికి మనస్కరించదు. సినిమాల్ని ఆడించే ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని వెండితెర కేసి కథ కోసమే గంపెడాశతో చూస్తారు.
96. రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ ‘రోబో- 2’ తో మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగింది? ఇందులో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని- ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. కాబట్టి ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు. నిత్యజీవితంలో వాళ్ళు చూసే రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.
97. ఆ మధ్య ఇంకో పాపులర్ హీరోకి జీవితమంతా ధారబోసి ఓ కథ చేశాడు ఇంకో నయా మేకర్. చూస్తే అదే పాసివ్ క్యారెక్టర్ తో అదే బలహీన కథ. ఏం చేయాలి? దీన్ని యాక్టివ్ పాత్రగా మారిస్తే కథ మారుతుంది. మార్చకుండా ఇలాగే చెప్పేస్తే హీరోని మోసం చేసినట్టవుతుంది. హీరోని మోసం చేయలేక, కథని మార్చలేకా ఆగిపోయాడు. ఇది నయం. హీరోలు కథలు వింటున్నప్పుడు యాక్టివ్ - పాసివ్ క్యారెక్టర్ తేడాలు తెలీక మోసపోతున్నారనేది పచ్చి వాస్తవం. మోసం చేస్తున్నామని నయా మేకర్లకీ తెలీదు. ఎందుకంటే, అది పాసివ్ క్యారెక్టర్ అని వాళ్ళకే తెలీనంతగా ‘లైవీరోకా’ ల (లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల) కాలం కాని కాలపు జోష్ తో పెరిగారు. ఇంకెన్ని ఫ్లాప్స్ తీస్తున్నా ఈ జోష్ వదలదు.
98. రాయడం మొదలెట్టిన తర్వాత యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీలలో ఆ సీన్లని కూర్చాల్సి వచ్చినప్పుడు కొన్ని సీన్లు పడవు. వాటి స్థానంలో కొత్త సీన్లు వాటికవే పుట్టుకొస్తాయి. కాబట్టి స్ట్రక్చర్ నేపధ్యం లేకుండా క్రియేటివిటీ కుదరడం సాధ్యం కాదు. రచయితలకి స్ట్రక్చరే విముక్తి కల్గిస్తుంది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ అనేది బందికానా. ఎటు వెళ్ళాలో తెలిసినప్పుడు అటు వెళ్ళే ప్రయాణాన్ని రూపొందించుకోవచ్చు. లారా ఎస్క్వైవల్ రాసిన ‘లైక్ వాటర్ ఫర్ చాకొలేట్’ నే తీసుకుందాం. తను ఆ నవలైతే రాసింది గానీ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ తెలియలేదు. స్ట్రక్చర్ అంటే ఆమెకి మహా భయం. మేము దాన్ని స్ట్రక్చర్ చేశాక, స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే ఎంత సులభమై పోతుందో ఆవిడ సడెన్ గా గుర్తించింది.
―సిడ్ ఫీల్డ్
99. ప్రధాన కథ పాత రొటీన్ గా, విషయం తక్కువగా అన్పిస్తే ఉపకథలతో కవర్ చేయవచ్చని ఇటీవల ‘ఈక్వలైజర్ 2’ లో తెలిసింది. అంతేగానీ ఫస్టాఫ్ ఓ కథ ప్రధానంగా చెప్పుకొస్తూ, దాన్ని వదిలేసి సెకండాఫ్ లో ఇంకేదో కథని అతికించే ప్రయత్నం చేస్తే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండం ఏర్పడుతుంది. చెబుతున్న విషయాన్ని పక్కకి నెట్టి ఇంకో విషయం ఎత్తుకోవడమే సెకండాఫ్ సిండ్రోం. సాధారణంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇలా జరుగుతుంది. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ ఇంకో కథ. సైజ్ జీరో, జ్యోతి లక్ష్మి వంటి ఫ్లాప్స్ ఇందుకుదాహరణగా వున్నాయి. ఇంకా ముందు దొంగోడు, దమ్ లు కూడా ఇలాటివే. హవా, తేరే నామ్ లు కూడా ఇలాటివే. ఇవన్నీ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఈ వరసలో భైరవ గీత చేరింది. ఫస్టాఫ్ మధ్యలో ఆపేసిన ప్రేమ కథ, సెకండాఫ్ లో అందుకున్న బానిసల ఉపకథ!
100. ‘భైరవ గీత’ ఇంటర్వెల్ సీన్లో ఎవరు ఎవరి ముందు ఎందుకు కిస్ పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు? డైనమిక్స్ కి ఇంటరెస్టింగ్ టాపిక్. ఇంటర్వెల్ కంటే ముందు ఫస్టాఫ్ లో చాలా లిప్ లాక్ సీన్లు వస్తాయి. ఇవి హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్లు. మరి ఇంటర్వెల్ లో ఇంకో లిప్ లాక్ సీను వస్తోందంటే అదింకో సాధారణ ఇంటిమేట్ సీనుగా వుండదు. వుంటే ఇంటర్వెల్ మలుపుకి అర్ధం వుండదు. సినిమాలో ఇలా లేదు కూడా. ఇంతవరకూ బాగానే వుంది. సాధారణంగా వుంటున్న లిప్ లాక్ సీన్లే ఇంటర్వెల్ లో అసాధారణ సీనుకి దారితీస్తేనే ఇంటర్వెల్ అనే మలుపుకి బలం. ఈ సినిమాలో ఇంటర్వెల్ అసాధారణ సీనుకి దారి తీసింది నిజమే. కానీ అదెలాటి అసాధారణ సీను? ఈ అసాధారణ సీను వల్ల కథ గానీ, హీరోహీరోయిన్ల ఎదుటి పాత్ర గానీ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? ఇదీ ఈ సీనుని డ్రైవ్ చేసే పాయింటు.
ఒక కీలకమైన మలుపు దగ్గర కథ గానీ, ఆ కథ నడవకుండా అడ్డు పడే ఎదుటి పాత్ర గానీ, ఎఫెక్ట్ అవక పోతే ఆ మలుపు మలుపే కాదు. దాని వల్ల ఉపయోగం కూడా లేదు. ఇదే జరిగింది ఈ సినిమా ఇంటర్వెల్లో. ఈ అసాధారణ సీను కాస్తా ఎదుటి పాత్రతో కాక, ఆ ఎదుటి పాత్ర అనుచరులతో వుంది!
డైనమిక్స్ తెలిసిన సరైన స్క్రీన్ ప్లేలలో ప్లాట్ పాయింట్ వన్, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్ టూ సీన్లు బిగ్ ఈవెంట్ సీన్లలా వుంటాయి. మిగతా సీన్లతో కలిసిపోకుండా ప్రత్యేక ముద్ర వేస్తూ వుంటాయి. ‘భైరవ గీత’ కథ హీరోయిన్ గీత, హీరో భైరవ, గీత తండ్రి సుబ్బారెడ్డి లు స్టేక్ హోల్డర్లు గా వేడి పుట్టిస్తూ సాగుతూంటుంది. అలాంటప్పుడు ఇంటర్వెల్ అనే కథని ఇంకో మలుపుతిప్పే ఘట్టం, ఈ స్టేక్ హోల్డర్ల మధ్య కాక, ఎవరో అనుచరులతో అనామకంగా వుంటుందా? తరుము కొస్తున్న తండ్రి సుబ్బారెడ్డి అనుచరుల ముందు గీత, భైరవ కి కిస్ పెట్టి వాళ్లకి షాక్ ఇచ్చేస్తుంది. వాళ్ళు షాక్ తింటే ఎంత, తినకపోతే ఎంత ఇంటర్వెల్ కి, ప్రేక్షకులకి? గీత కిస్ పెడితే ఎంత, పెట్టక పోతే ఎంత కథకి, డైనమిక్స్ కి? షాకిస్తే ఈ కథలో స్టేక్ హోల్డర్ అయిన, ఎదుటి పాత్ర సుబ్బారెడ్డి కివ్వాలి – అది కూడా గీత భైరవకి కిస్ పెట్టి కాదు - భైరవ గీతకి కిస్ పెట్టి!
గీత తానేమిటో అప్పటికే తన మీద కన్నేసిన కట్టారెడ్డిని వాయించి డిక్లేర్ చేసే వచ్చింది. ఇంత కంటే పెద్ద షాక్ కట్టా రెడ్డికి కట్ట బెట్టాలనుకుంటున్న గీత తండ్రి సుబ్బారెడ్డికి లేదు. కాబట్టి ఇంటర్వెల్ సీన్లో, స్టేక్ హోల్డర్ గా సుబ్బారెడ్డి వున్నా, అతడి ముందు గీత ఎన్నేసి ముద్దులు వూగిపోతూ పెట్టుకున్నా ఇంకా ఒరిగేదేమీ లేదు. కానీ భైరవ ఏమిటో సుబ్బారెడ్డి ఇంకా రుచి చూడలేదు. కాబట్టి అతను గీతని లాక్కుని సుబ్బారెడ్డి కళ్ళెదుట ఎడాపెడా కిస్సులు పెట్టేస్తూంటే సుబ్బారెడ్డి లుంగీతో బాటు వెండితెరా చిరిగి పేలికలై పోతుంది - థోడాసా డైనమిక్స్ చాహియే భయ్యా!
―సికిందర్
Subscribe to:
Posts (Atom)



.jpg)
.jpg)




