రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జనవరి 2023, సోమవారం

1291 : స్పెషల్ న్యూస్!


 

  సంక్రాంతికి వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి రెండూ సృష్టించిన సంచలనం బాలీవుడ్ ని తాకి ఆశ్చర్యపరుస్తోంది. పోటా పోటీగా షోలమీద షోలు హౌస్ పుల్స్ తో ప్రేక్షకులు కిటకిటలాడిన దృశ్యం మనకు కొత్తేం కాదుగానీ బాలీవుడ్ లో కొత్తగా ఆలోచింపజేస్తోంది. హిందీ రాష్ట్రాల్లో ఏ పండుగకీ విడుదలయ్యే సినిమాలు ఇంత ధూంధాంగా ఆడవు. దసరా, దీపావళి, ఈద్ -ఈ మూడు పండుగలు బాలీవుడ్ కి ముఖ్యమైతే అప్పుడు విడుదల చేసే స్టార్ సినిమాలు మామూలుగానే ఆడతాయి. మనలాగా పళ్ళు తోముకోకుండా తెల్లవారగానే షోల మీద షోలు వేసి బాక్సాఫీసులు నింపుకోవడం వుండదు. దీనికి కారణం బాలీవుడ్ స్టార్స్ కి ఫ్యాన్స్ లేకపోవడం. వుంటే కొద్దిపాటి సైజులో వుంటారు. చిరంజీవికి, బాలకృష్ణకీ ఆ స్థాయిలో ఫ్యాన్స్ లేకపోతే ఆ రెండు సినిమాలకి నిర్విరామంగా బాక్సాఫీసులు బద్దలవుతూ వుండేవి కావు.

        దే సమయంలో తమిళనాడులో కూడా అజిత్, విజయ్ సినిమాలకి బాక్సాఫీసులు బద్ధలవడం చూసి బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఇలా మన బాక్సాఫీసులు ఎప్పుడు బద్దలవుతాయని తలలు పట్టుకుంటున్నారు. చివరికి తేల్చిందేమిటంటే, సౌత్ లో స్క్రీన్స్ (థియేటర్లు) ఎక్కువ వుండడం వల్ల సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని. కానీ స్టార్స్ కి పోటెత్తే ఫ్యాన్సే లేకపోతే ఎన్ని స్క్రీన్స్ వుండీ ఏం లాభం. దేశంలో అన్ని నగరాల్లో కంటే ముంబాయిలోనే  స్క్రీన్స్ ఎక్కువున్నాయి మరి.

సౌత్ స్క్రీన్లే ఎక్కువ!
        సందర్భం వచ్చింది కాబట్టి అసలు దేశంలో స్క్రీన్స్ గణాంకాలేమిటని చూస్తే- బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 8,700 స్క్రీన్‌లలో 31.52 లక్షల సీట్లు వున్నాయి. ఇందులో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 18.16 లక్షల సీటింగ్ కెపాసిటీతో దాదాపు 4,150 స్క్రీన్లు వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు స్క్రీన్ల పరంగా దాదాపు 47.78 శాతం, సీటింగ్ కెపాసిటీ పరంగా 57.61 శాతం వాటా కలిగి వున్నాయి.
        
తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో 1,700 కంటే ఎక్కువ స్క్రీన్లు వుంటే,  తమిళనాడులో 1,000 కంటే ఎక్కువ వున్నాయి. కర్ణాటకలో 800కి పైగా స్క్రీన్‌లు వుండగా, కేరళలో దాదాపు 600 స్క్రీన్‌లు వున్నాయి. దక్షిణ దేశం కాకుండా, మహారాష్ట్రలో 1,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. గుజరాత్‌లో 730 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. మిగిలిన దేశంలో దేశంలోని మొత్తం స్క్రీన్‌లలో దాదాపు 33 శాతం వున్నాయి. నగరాల్లో చూస్తే చెన్నైలో 230 స్క్రీన్‌లు వుంటే, హైదరాబాద్‌లో 200 స్క్రీన్ లు వున్నాయి. అత్యధిక స్క్రీన్లున్న నగరం ముంబాయి. ఇక్కడ 259 మల్టీపెక్స్ స్క్రీన్లు, 65 సింగిల్ స్క్రీన్ థియేటర్లు వున్నాయి.
        
ఐనాక్స్ లీజర్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌ల ప్రకారం, 2019లో దేశంలో  మిలియన్ జనాభాకు తొమ్మిది స్క్రీన్‌లున్నాయి. అమెరికా, కెనడాల్లో ప్రతి మిలియన్ జనాభాకు 125 స్క్రీన్ లున్నాయి. అయితే ఈ రెండు దేశాలకంటే మన దేశంలోనే ఎక్కువ సినిమాలు నిర్మిస్తారు. కానీ జనాభా పరంగా చూసినా, సినిమాల పరంగా చూసినా స్క్రీన్లు చాలా తక్కువ. థియేటర్ల పరంగా చూస్తే దక్షిణ దేశంలోనే దాదాపు 50 శాతం థియేటర్లున్నాయి. ప్రేక్షకులు తగ్గిపోతేనే ఉత్తరాదిలో థియేటర్ల సంఖ్య పడిపోయింది.

మాస్ ని మర్చిపోయారు
        బాలీవుడ్ ఏం చేసిందంటే, మాస్ మీడియా అయిన సినిమాని క్లాస్ మీడియాగా మార్చేసింది. దీంతో మాస్ సినిమాలు లేక ఉత్తరాది రాష్ట్రాల్లో బి, సి సెంటర్ల ప్రేక్షకులతో బాటు థియేటర్లు అదృశ్యమైపోయాయి. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న కాలంలో ఆయన నటించిన క్లాస్ సినిమాలు తక్కువ, మాస్ సినిమాలు ఎక్కువ. దీంతో వూరూరా సినిమాలు ఆడేవి. అమితాబ్ తో బాటు అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, గోవిందా వీళ్ళంతా మాస్ స్టార్లు. వీళ్ళ సినిమాలు విరివిగా వచ్చేవి. తర్వాతి తరం స్టార్లు రెండేళ్ళ కొకటి, మూడేళ్ళకొకటి సినిమాలు తీస్తే ప్రేక్షకులెక్కడుంటారు, థియేటర్లెక్కడుంటాయి. ఆ రోజుల్లో ప్రేక్షకులనుద్దేశించి ఆబాలగోపాలం అనేవాళ్ళు. అంటే పిల్లల నుంచి వృద్ధులవరకూ అందర్నీ అలరించే సినిమాలు. ఇప్పుడు హిందీ సినిమాలకి ఆబాలం లేదు, గోపాలం లేదు, ఏ సెంటర్స్ లో యువమేళం తప్ప.
        
దక్షిణ సినిమాలు వాటి డీఎన్ఏ ని వదులుకోవు. మాస్ మసాలా వుండాల్సిందే. అందుకే దేశంలోనే ఎక్కువ థియేటర్లలో అవి బతుకుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బి,సి సెంటర్లలలో వ్యాపారాలు మూగబోయి పంపిణీ దారులు ఆందోళన చేసిన సన్నివేశం కూడా వుంది. సౌత్ సినిమాలు సౌత్ వరకే సరిపెట్టుకోవడం లేదు. పానిండియా అనే పదం సృష్టించుకుని జాతీయ మార్కెట్ ని ఆక్రమిస్తున్నాయి. ప్రతీ సౌత్ సినిమాకి రూ. 1,000 కోట్ల బాక్సాఫీసు మార్కెట్ వుందని నమ్ముతున్నారు సౌత్ నిర్మాతలు. బాహుబలి రెండు భాగాలు, పోన్నియన్ సెల్వన్, విక్రమ్, ట్రిపులార్, పుష్ప మొదటి భాగం, కేజీఎఫ్ రెండుభాగాలు, కాంతారా ...ఆఖరికి కార్తికేయ 2 ఈ విషయాన్ని రుజువు చేశాయి.
        
బాలీవుడ్ దాని మార్కెట్ ని ఎలా విస్తరించుకోవాలో ఆలోచిస్తున్నట్టు లేదు. పరిశీలకులు ఒక మాట చెప్తున్నారు- హిందీ దంగల్‌ కి అత్యధిక కలెక్షన్లు దాదాపు రూ. 375 కోట్లు రాడానికి, దేశంలో దాదాపు సగం ఎగ్జిబిషన్ స్క్రీన్‌లున్న దక్షిణ మార్కెట్టే కారణమని. సౌత్ సినిమాలు సాఫీగా ఉత్తరాదికి మారినట్టు బాలీవుడ్ సినిమాలు సౌత్ మార్కెట్ లో చొచ్చుకెళ్ళే ప్రణాళికలు తయారు చేసుకోవాలి.

స్టార్లే తప్ప ఫ్యాన్స్ లేరు
        అన్నిటికన్నా ముఖ్య సమస్య ఏమిటంటే స్టార్ల కొరత. బాక్సాఫీసుని శాసించగల స్టార్లు, సూపర్ స్టార్లు ఇక లేరు. ఉన్న ఖాన్ ల ప్రభ తగ్గింది అక్షయ్ కుమార్ తోబాటు. హృతిక్ రోషన్ ఎప్పుడు నటిస్తాడో తెలీదు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్ లు సరిపోరు. సరికొత్త తరంలో రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా బాక్సాఫీసు బాద్షాలయ్యే పరిస్థితి లేదు.
        
అరవై దాటినా బాక్సాఫీసుని హైజాక్ చేసే చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ ల వంటి ఆల్ రౌండర్లు హిందీలో లేకపోవడం బాలీవుడ్ భవిష్యత్తుకి ప్రమాద సంకేతం. పుష్ప తో హిందీ ప్రేక్షకుల్ని టోకున తన ఖాతాలో వేసుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సృష్టించుకున్న అల్లు అర్జున్ లాంటి యంగ్ మాస్ స్టార్స్ ని బాలీవుడ్ సృష్టించుకోక పోతే మనుగడ కష్టమే. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యశ్, ట్రిపులార్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హిందీలో మాస్ స్టార్స్ గా బలమైన ఫ్యాన్ బేస్ ని సృష్టించుకున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ విడుదల కాకముందే ప్రమోషన్స్ కి క్రియేట్ చేసిన మాస్ మేనియా ఇంతా అంతా కాదు. ఒక మాల్ లో పట్టనంతమంది అభిమానులు దూరతీరాలనుంచి తరలి వచ్చారు.
        
ఏ హిందీ స్టార్ కీ ఇంత ఫ్యాన్ బేస్ లేదు. బి, సి సెంటర్లు కలిస్తేనే ఇంత ఫ్యాన్ బేస్ వస్తుంది. హిందీ సినిమాలకి దూరమైన బీసీ సెంటర్లని బాలీవుడ్ జోడో యాత్రతో ఏకం చేస్తున్నారు సౌత్ స్టార్స్. పుష్ప లో అల్లు అర్జున్ వైరల్ డైలాగు వుంది- తగ్గేదే లే అని. తెలుగు కంటే ఇది హిందీ వెర్షన్లో మంచి కిక్ ఇచ్చేలా వుంది- నహీ ఝుకేగా సాలా అని! ఇది హిందీ రాష్ట్రాల్లో పిల్లల నోటికి కూడా పట్టేసింది. అల్లు అర్జున్ ని అనుకరిస్తూ వీడియోలు వైరల్ చేశారు. ఇది కదా సినిమాలంటే, స్టార్లంటే అర్ధం!
        
బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి తిరిగి ఒకనాటి స్టార్స్ నీ, వాళ్ళ మాస్ సినిమాల్నీ, ఫ్యాన్స్ నీ సృష్టించుకోవాలని గ్రహించకపోతే -వాల్తేరు వీరయ్య’, వీరసింహా రెడ్డి ల వంటి సంచలనాల విజయ రహస్యాలు ఆశ్చర్యపరుస్తూనే వుంటాయి.
—సికిందర్