రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, మే 2023, శనివారం

1324 : రివ్యూ!



దర్శకత్వం : శ్రీవాస్
తారాగణం : గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, కుష్బూ సుందర్, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు
కథ : భూపతిరాజా, మాటలు : అబ్బూరి రవి,  సంగీతం : మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : వెట్రి పళనిసామి
బ్యానర్ : పీపుల్ మీడియా
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
విడుదల : మే 5, 2023
***

            2021 లో సీటీ మార్ హిట్టయ్యాక ఆరడుగుల బుల్లెట్’, 2022 లో పక్కా కమర్షియల్ అనే రెండు పరాజయాలెదుర్కొన్న మాచో స్టార్ గోపీచంద్, తాజాగా సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని నమ్మి రామబాణం తో వచ్చాడు. దర్శకుడు శ్రీవాస్ తో గోపీచంద్ 2007 లో లక్ష్యం’, తిరిగి 2014 లో లౌక్యం అనే రెండు హిట్స్ అందించిన అనుభవంతో తిరిగి తొమ్మిదేళ్ళ తర్వాత  రామబాణం ప్రయత్నించాడు. మరి ఈ బాణం ఎవరికైనా తగిలిందా, ఎవరిలోనైనా స్పందన కలిగే అవకాశముందా ఈ క్రింద తెలుసుకుందాం...

కథ

ఒక టౌన్లో రాజారాం (జగపతి బాబు) సుఖీభవ అనే హోటల్ నడుపుతూ సేంద్రీయ పంటలతో వండిన భోజనాన్ని తక్కువ ధరకి అందిస్తూంటాడు. దీంతో ఎదుటి హోటల్ యజమాని జీకే (తరుణ్ రాజ్ అరోరా) కి నష్టం వచ్చి తన మామ (నాజర్) తో కలిసి రాజారాం మీదికి గొడవకి వస్తాడు. హోటల్ లైసెన్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. రాజారాం కి భార్య (ఖుష్బూ), తమ్ముడు విక్కీ (గోపీచంద్) వుంటారు. విక్కీ జీకే అడ్డా తగులబెట్టి లైసెన్స్ తీసుకుని వచ్చేసే సరికి అన్న రాజారాం మండిపడతాడు. తమ్ముడికి అహింసని బోధిస్తాడు. ఇది నచ్చని విక్కీ కోల్ కతా వెళ్ళిపోయి పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అక్కడ యూట్యూబర్ భైరవి (డింపుల్ హయతీ) ని ప్రేమిస్తాడు. భైరవి తల్లిదండ్రులు విక్కీని కుటుంబంతో మాట్లాడించమనే సరికి విక్కీ అన్న దగ్గరికి ప్రయాణం కడతాడు. అన్న రాజారాం ఇప్పుడు హైదరాబాద్ లో సేంద్రీయ ఆహార వ్యాపారంలో భారీగా ఎదిగివుంటాడు. అతడి వ్యాపారాన్ని దెబ్బ తీయాలని జీకే కుట్రలు పన్నుతూంటాడు. ఇప్పుడు విక్కీ జీకే బారినుంచి అన్న వ్యాపారాన్ని ఎలా కాపాడి, తన పెళ్ళి సంబంధం గురించి ఒప్పించుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

1980-90 లలో ఇలాటి కథలతో సినిమాలు చాలా వచ్చాయి. అన్నదమ్ముల అనుబంధం, వదినా మరదుల మురిపెం, అన్నని తమ్ముడు కాపాడడం, విలన్ కటకటాల్లో కూర్చోవడం, తమ్ముడు హీరోయిన్ని పెళ్ళాడి శుభం కార్డు వేయడమనే మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని, సీనియర్ రచయిత భూపతి రాజా సునాయసంగా దింపేసిన పాత కథే ఇది.
        
ఓటర్లని ఆకర్షించడానికి ఎన్నికల మేనిఫెస్టోలే కొత్త కొత్త హామీలతో మారిపోతున్నాక, కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధాని చేత జై భజరంగ బలీ అన్పిపిస్తూ హిట్టవుతున్నాక, భూపతిరాజా ఒక్కటంటే ఒక్క హిట్టయ్యే నినాదం ప్రేక్షకుల కోసం సృష్టించలేకపోయాడు. సేంద్రీయ ఉత్పత్తుల గురించి సాగించిన కథ హీరో- విలన్ల మధ్య ఫార్ములా కొట్లాటతో ఉత్త ప్రహసనంగా మిగిలిపోయింది. ఈ కథలో వుండాల్సింది ఇలాటి పాత్రల మధ్య కాలం చెల్లిన ఎమోషన్స్ కాదు, అసలు పాత్రలన్నీ కలిసి సేంద్రీయ ఉత్పత్తుల వైపుగా ప్రేక్షకుల ఎమోషన్లు కేంద్రీకృతమయ్యేలా చేయగల్గాలి. ఈ కథకి హీరో సేంద్రీయ వ్యవసాయమే.
        
అన్నదమ్ముల అనుబంధం ఇప్పుడెవరు చూస్తారని కొందరు అన్నారని,  కానీ అనుబంధాలు ఎప్పుడూ వుండేవే అనీ, మారిన కాలానికి ఎలా చూపించామన్నదే ముఖ్యమనీ భూపతి రాజా చెప్పాడు. అనుబంధాలు మారవు, కాలాన్ని బట్టి వాటి కారణాలు మారుతాయి. భూపతిరాజా చూపించింది పాత కాలం సినిమాల్లోని కారణాలూ వాటితో అనుబంధాలే. ఈ తరానికి వీటితో సంబంధమే లేదు. నిజంగా అన్నదమ్ముల అనుబంధమే చూపించాలనుకుంటే, ఎవరో విలన్ తో కాదు-  సేంద్రీయ ఉత్పత్తులతో అన్నదమ్ముల మధ్యే విభేదాలతో భగభగ మండే సంఘర్షణ సృష్టించ వచ్చు. అప్పుడు ఇది అర్ధవంతమైన కథ అయ్యే అవకాశముండేది.

నటనలు- సాంకేతికాలు

గోపీ చంద్ కి అవే సినిమాలు, అవే పాత్రలు, అదే నటన, అదే గెటప్, సెటప్. ఆయన మారతాడని ప్రేక్షకులు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆయన మార్పు చూపించింది ఒక చోటే- బాణం బదులు గద పట్టుకుని ఫైట్ చేయడం. ఆ గదతోనే కథని చావగొట్టినట్టయ్యింది. కోల్ కతాలో లో డాన్ గా గానీ, తర్వాత అన్నదగ్గరికి తమ్ముడిగా వచ్చాక గానీ పాత్ర స్వభావంలో మార్పేమీ లేక నటించడానికి లేకపోయింది. డాన్ గా క్రూరంగా వుండుంటే అన్నదగ్గర మృదువుగా వుంటూ షేడ్స్ కనబర్చవచ్చు.  గోపీ చంద్ సినిమా సాంతం`ఒకే సెలెబ్రిటీ లుక్ తో యాడ్స్ చేస్తున్నట్టు వుంటాడు.
        
విలన్ పాత్రలు నటించే జగపతి బాబు సాత్విక పాత్ర వేసినప్పుడు, గోపీచంద్ విలన్ లా వుండుంటే ఇద్దరి మధ్య డైనమిక్స్ కమర్షియల్ గా పనికొచ్చేవి. జగపతి బాబు సేంద్రీయ ఉత్పత్తులతో గాంధేయవాదిగా అన్పిస్తూ చివరికి ప్లేటు ఫిరాయించేస్తాడు. గోపీ చంద్ తో ఖుష్బూ పాత సినిమాల వదిన పాత్రకి న్యాయం చేసింది. హీరోయిన్ గా డింపుల్ హయతీ కి అసలు ప్రాధాన్యమే లేదు పాటల కోసం తప్ప. యూట్యూబర్ గా ఖుష్బూ చేత వంటల వీడియో చేసిన దృశ్యం హాస్యాస్పదంగా వుంది. ఖుష్బూకి చేపల కూర వండడమే రాలేదు, కూర మాడిపోయిందని అంటుంది. డింపుల్ కి వీడియో తీయడం కూడా రాలేదు. యూట్యూబర్ గా సేంద్రీయ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కాయగూరలతో సేంద్రీయ ఉత్పత్తులకి ప్రాణమిచ్చే కుటుంబంలో ఖుష్బూ చేపల కూర వండడ మేమిటో అర్ధంగాదు.
        
విలన్లుగా నాజర్, తరుణ్ రాజ్ అరోరాలు సరే, ఫార్ములా విలనిజమే. కమెడియన్లు చాలా మంది వున్నారు గానీ ఒక్కరూ నవ్వించలేకపోయారు. అలీ, వెన్నెల కిషోర్, సత్యా, సప్తగిరి, గెటప్ శీను ఎవ్వరికీ సరైన కామెడీ నివ్వలేదు దర్శకుడు.
        
ఇక కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలూ బావున్నా మిక్కీ జె మేయర్ సంగీతం అతి సాధారణంగా వుంది. శ్రీవాస్ దర్శకత్వం అతి ఔట్ డేటెడ్ గా వుంది.

చివరికేమిటి

పాత మూస కథైనా కొత్త దర్శకులు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రామబాణం దర్శకుడు దృశ్యాలుగానీ, కథనం గానీ కొత్తగా ఏమీ మార్చకుండా రెండు దశాబ్దాల క్రిందటి తన తరహా మేకింగ్ తోనే కానిచ్చేశాడు. మొదటి సీను నుంచీ చివరిదాకా పాత సినిమా చూస్తున్నట్టే వుంటుంది. ప్రారంభంలో కోల్ కతా సీన్లు పదే పదే హౌరా బ్రిడ్జి మీదే జరుగుతూంటాయి. కోల్ కతా నగరం లోపలికి వెళ్ళి తీసినట్టు కూడా వుండదు.     
          
ఇక ఆసక్తి కల్గించే ఒక్క సీనూ, నటుల మధ్య డ్రామాతో హైలైట్ అన్పించే ఒక్క సీను కూడా సృష్టించ లేకపోయారు.  డబ్బు వుంటే ధనవంతులు- కుటుంబముంటే బలవంతులమని మంచి డైలాగు వేశారు. అలాటి డబ్బున్న డాన్ గా గోపీచంద్, కుటుంబ బంధం కోసం తాపత్రయపడే కథనం సృష్టించలేకపోయారు. మరి భావోద్వేగాలు ఎలా పుడతాయి.  ఈ చేతులతో నీ కిష్టమైన వంట వండేదాన్ని, ఒక్క రోజైనా తినడానికి వచ్చావా- అని వదిన అంత మాట అన్నప్పుడు, గోపీచంద్ రియాక్షన్ ఏది?
        
ఇలా పైపైన రాసేసి పైపైన తీసేస్తే సినిమా అవుతుందని యూత్ మాత్రం అనుకోవడం లేదు. యూట్యూబ్ లో పాత కుటుంబ సినిమాల్ని లక్షల మంది యూత్ చూస్తూ, నేటి సినిమాలపై పెడుతున్న కామెంట్లయినా మేకర్లు చూసి పునరాలోచించుకోవాలి.

—సికిందర్