రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 21, 2016

స్క్రీన్ ప్లే సంగతులు -4

బిగినింగ్ లేకపోతే ఎండింగ్ లేదు, ఏదైనా మొదలెడితే కదా ముగించడానికి...ఎండింగ్ డైనమిక్ గా, కమర్షియల్ గా వుండాలని ఆశిస్తాం. బిగినింగ్స్ డైనమిక్ గా, కమర్షియల్ గానే వుండొచ్చు. కానీ బిగినింగ్ లో విషయం లేకపోతే ఎండింగ్ ఎంత డైనమిక్ గానూ , కమర్షియల్ గానూ  వున్నా అందులోనూ  విషయముండక బలహీనంగా వుంటుంది. ఐతే  విషయమూ లేక, డైనమిక్సూ కమర్షియాలిటీ కూడా లేక  పేలవమైన ఎండింగ్ తో ఓ సినిమా ఎదురైతే  అదెలా వుంటుంది? సరీగ్గా ‘తని ఒరువన్’ లా వుంటుంది. యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ఎండింగ్ అని అన్నారిందుకే...
To hell with plot point-1
We have our own ‘paatlu’!

          చూసే వాళ్ళు  మూర్ఖులని తీసే వాళ్ళు నమ్మి, తీసేవాళ్ళు తెలివైన వాళ్ళని  చూసే వాళ్ళూ నమ్మి,  పరస్పరం వాళ్ళూ వాళ్ళూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సినిమాల్ని ఆడిస్తూంటే మధ్యలో మనమేం చేయగలం, ఇలా రాసుకోవడం తప్ప?  సినిమా హిట్టయ్యాకా ఇంకా ఈ రాతలు చూసి నల్గురూ నవ్విపోతారు. ఏదో సరదా రౌండేసి వద్దామని సర్ది చెప్పుకుని రాయడం మొదలెట్టామే గానీ, మొదలెట్టాకా గానీ తెలీలేదు ఇదో థర్డ్ డిగ్రీ  టార్చర్ అని.  ఇన్ని చిక్కు ముళ్ళున్న  వ్యవహారం ‘పోలీస్’  తర్వాత ఇదే.  ఏ పోటీ పరీక్షల్లోనో దీన్ని  ప్రశ్నాపత్రంగా  పెడితే,  మొత్తం అందరూ ఫెయిలైపోయి ఉద్యోగాలిచ్చే బాధ తప్పిపోతుంది!

        కథానాయకుడు మిత్రన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తప్పించుకుని బై పాస్ రోడ్లో ఎలాగో మిడిల్లో పడ్డాడు కదా, ఇక ఎండ్ కి చేరక పోతాడా, అక్కడ దొరక్క పోతాడా అని చూస్తూంటే,  ఓ  టోల్ గేట్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి నువ్వు చెప్పాలనుకుని చెప్పలేక తప్పించుకుని తిరుగుతున్నది- అని నిలేస్తే, నాకేమీ తెలీదు -నేను అమాయకుణ్ణి- నిర్దోషినీ -ఇంకేదో-  అని రాగాలు తీశాడు. మరెందుకలా మొత్తమంతా తిరిగేస్తున్నావంటే, డైరెక్టర్ వైపు వేలు చూపిస్తాడు. డైరెక్టరేమో తొమ్మిది నెలలు కష్ట పడ్డానంటాడు. కానీ జన్యు పరమైన లోపాలతో పుట్టింది స్క్రిప్టు. ఆ జనెరిక్ మందులూ, డయాబెటిస్ ఫార్ములా వగైరావగైరా ఏవో  ముందు దీనికే  వాడాలేమో చూడాలిగా! 

        ఈ  ప్లాట్ పాయింట్లూ మన్నూ మశానాలూ  మాకనవసరం బాస్, మా పాట్లు మాకుంటాయి- ఎంతో పాటుపడి సినిమాల్ని ఎలాగో గట్టెక్కించుకుంటాం, మందుమాకులూ  మాకివ్వొద్దు ప్లీజ్ –అని తిరగబడ్డా  ట్రీట్ మెంట్ ఇవ్వక తప్పదు, ధర్మ సంస్థాపన కోసం. 

        కథా సూత్రాలు  ఎవరో ఆకాశంలోకి  చూస్తూ ఆలోచించలేదు. విజయవంతమైన సినిమాలు చూసే,  అవి ఎలా వుండి విజయవంతమవుతున్నాయో వాటి ప్రకారం స్ట్రక్చర్ ని తీసే, స్కెచ్ వేశారు. పుస్తకాలూ రాస్తున్నారు, పాఠాలూ బోధిస్తున్నారు. న్యూటన్ ఆకాశంలోకి చూస్తూ గురుత్వాకర్షణ సిద్ధాంతం చేయలేదు. ఆపిల్ పండు నెత్తి మీద పడితేనే ఆ సిద్ధాంతం తట్టింది. దృగ్గోచరంగా వున్న  వాటిలోంచే శాస్త్రాలు పుట్టాయి, పుడుతున్నాయి.  దీన్ని కాదనుకునే  వాళ్ళే కథ ఎలా తయారు చేయాలా అని ఆకాశంలోకి చూస్తూ, ఊహాగానాలతో పేజీలు  నింపు కుంటున్నారు...స్వకపోల కల్పితాలతో  నూటికి 90 శాతం ఫ్లాపులు తీస్తున్నారు, తీస్తూనే వుంటారు. దీనికి ముగింపు లేదు.

                                                          ***
          ఎండ్ : మిడిల్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ టూ దగ్గర తన ఛాతీలోనే బగ్ అమర్చారని తెలుసుకున్న మిత్రన్ వెంటనే దాన్ని తీసేయించుకోడు. దాంతో అభిమన్యుతో కౌంటర్ గేమ్ మొదలెడతాడు. ఇది మంచి డైనమిక్స్. ఈ ఎండ్ విభాగంలో పక్కాగా అభిమన్యుని వలలో  బిగించే వివిధ ప్రయత్నాలే జరుగుతాయి. ఈ కథా పథకం బావుంది. ఇలా ఎండ్ విభాగం బిజినెస్ ముందు బ్రహ్మాండంగా కన్పిస్తుంది. కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాల్సి వుంది. మిడిల్ విభాగంలో తన కొలీగ్ ని చంపిన విక్కీ అనే అభిమన్యు అనుచరుడి సంగతి చూడాల్సి వుంది. అందుకు ఫలానా చోట వున్న విక్కీని అరెస్టు చేయాలనీ కొలీగ్స్ తో కావాలని మిత్రన్ మాట్లాడుతూ అభిమన్యుని ట్రాప్ చేస్తాడు. బగ్ ద్వారా ఇది విన్నఅభిమన్యు , విక్కీ అరెస్ట్ అయి తన గుట్టు విప్పకుండా వెంటనే వెళ్లి చంపేస్తూ కెమెరాకి చిక్కుతాడు. 

        ఏమిటిది? పోలీస్ అధికారిగా హీరో పాత్రకి నైతికపరంగా ఇది కరెక్టేనా? కొలీగ్ ని విక్కీ చంపినంత మాత్రానా అభిమన్యు ని ట్రాప్ చేసి,  అతడి  చేత విక్కీని చంపేలా రెచ్చగొట్టి ఇరికించడం న్యాయమేనా? ఇది తను చేయించిన మర్డర్ కాదా? తనూ మిగతా కొలీగ్స్ తమ కొలీగ్ ని విక్కీ ఎలా డ్రగ్స్ కుక్కి చంపాడో, అలాటి  శాడిజంతో  డ్రగ్స్ కుక్కి,  అభిమన్యుని ట్రాప్ చేసి, అతడి చేత చంపించారంటే,  ఆటవిక న్యాయాన్ని అమలు చేస్తున్నారా? ఓ పోలీసు అధికారిగా  కాకుండా హీరో బాధితుడైన సగటు పౌరుడిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడంటే అర్ధముంది. ఇలా పోలీసు అధికారిగా హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడం ఏ సినిమాల్లోనూ రాలేదు. 

        ఇక మిత్రన్ కి ఫార్మాసిస్ట్ హత్యా దృశ్యాలున్న ఎస్డీ కార్డు దొరకడం ఒక మలుపు. కానీ అభిమన్యు గర్ల్  ఫ్రెండ్ కి మహిమ వెళ్లి,  అభిమన్యు ఆమె తండ్రిని చంపి ఎలా ఆమెని తన మీద  ఆధార పడేలా చేసుకున్నాడో చెప్పడం బ్యాడ్ రైటింగ్. ప్రతీ చోటా మహిమ పాత్ర చిత్రణ అర్ధరహితంగానే వుంటోంది. ఈమె గర్ల్ ఫ్రెండ్ కి ఇలా చెపితే, ఇది క్లయిమాక్స్ లో ఆ గర్ల్ ఫ్రెండ్ అభుమన్యు ని చంపి షాకివ్వడానికి లీడ్ సీన్ గా ఉంటుందని భావించి నట్టుంది. కానీ క్లయిమాక్స్ లో అది పండకపోగా, ఇక్కడ మహిమ ఇలా చెప్పడం ప్రశ్నార్ధకంగా మారింది. ఎంతసేపూ మిత్రన్ తెర వెనుక వుండి ప్రాక్సీ హత్యలు చేయిస్తున్నాడు. దీని ఫలితం క్లయిమాక్స్ లో అనుభవించాడు కథ తను ముగించలేక. లేకపోతే పని గట్టుకుని మహిమని పంపించి గర్ల్  ఫ్రెండ్ కి అలా చెప్పించడంలో ఉద్దేశ మేమిటి? 

        ఇక మిత్రన్ చనిపోయిన ఫార్మాసిస్టు చేసిన డయాబెటిస్ మందు పరిశోధనా వివరాలతో
,  ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియా’  అనే కల్పిత సంస్థకి వెళ్ళే డైనమిక్స్ కూడా డీలా పడిపోతుంది. 

        ఇక్కడ పేటెంట్ హక్కుల సమస్య మింగుడు పడకుండా  వుంటుంది- ఆమె డయాబెటిస్ కి మందు కనిపెడితే, అది ఆమె పనిచేసిన అభిమన్యు  కంపెనీ ప్రాపర్టీ  అవుతుంది. దాని మీద హక్కులు తనకి దఖలు పడే విధంగా అగ్రిమెంటు లేనప్పుడు ఆమె వాదన చెల్లకుండా పోతుంది. ఎంత కనిపెట్టినా ఆమె ఆ కంపెనీలో ఉద్యోగినియే. ఆర్ అండ్ డీ కోసం కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి  మందులు కనిపెడతాయి. అలాంటప్పుడు ఉత్తపుణ్యానికి ఆదామె సొంతమెలా అవుతుంది?

        ఇక్కడ ఆమెతో అతడికి అసలు గొడవేమిటంటే, తను కనిపెట్టిన ఆ మందుని అతను యాంజలీనాని చంపి కొనుగోలు చేసిన కంపెనీ ద్వారా ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటాడని. ఆ డయాబెటిస్ మందు మన దేశం దాటి వెళ్ళిపోతే మనం కొనుక్కోలేనంత  ఖరీదైపోతుందని.  దీన్ని జనెరిక్ మందుగా దేశంలోనే చవగ్గా అమ్మాలని. ఇదంతా ఆమె సెంటిమెంటల్ వాదన. ఆ మందు మీద ఆమె మమకారం అర్ధవంతంగా ఉండాలంటే, దాని మీద ఆమె దగ్గర లిఖిత పూర్వక యాజమాన్య హక్కులుండాలి.  

        ఆ కల్పిత సంస్థ అధికారులు మేం ఓకే చేస్తాం  పొమ్మంటారు. వాళ్ళదేం పోయింది, తాంబూలా లిచ్చేశాం తన్నుకోమంటారు. అది ఓకే అవడానికి దశాబ్దాలు పడుతుంది. ఒక తరం మధుమేహ వ్యాధి పీడితులంతా స్వర్గస్థులై వుంటారు అక్కడ ఫార్మాసిస్టుని వెతుకుతూ.
        అసలు దీన్ని ఇంత  ఇష్యూ చేయడం అవసరమా- ఇప్పటికే ఈ కథలో రకరాల టాపిక్స్ పైన ఎన్ సైక్లోపీడియా లెక్చర్లిచ్చి తలబొప్పి కట్టించింది చాలదా? పొసగని పేటెంట్ హక్కుల గొడవ లేకుండా, ఆ మందు ఫార్ములా తను దుర్వినియోగం చేస్తాడని ఆమె లాబ్ దాటించేస్తుందని అనుమానించి, చంపేశాడని చెప్పేస్తే చాలదా సింపుల్ గా?

                                    ***
       ఈ డయాబెటిస్ మందు పేటెంట్ హక్కుల గొడవ  తర్వాత,  తర్వాతి సీను జనెరిక్ మందుల మీదికి మళ్ళుతుంది!!
        మళ్ళీ ఉపోద్ఘాతం: స్వర్గీయ యాంజలీనా తో జరిగిన అప్పటి ఒప్పందాన్ని గౌరవిస్తామనీ, త్వరలో ఆమె కంపెనీ నుంచి జనెరిక్ మందులు మనకి అందుతాయనీ గౌరవ ముఖ్యమత్రి పూల్మణి ఉద్ఘాటన !

        ఇంకెక్కడి  యాంజలీనా కంపెనీ! ఆమెని చంపేసి అభిమన్యు ఎప్పుడో ఆ కంపెనీని కొని పారేసి వేరే గ్రాండ్ ప్లాన్స్ తో వున్నాడు -ఇంకెక్కడి జెనరిక్ మందులు! ఇంకెక్కడి రాష్ట్ర ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు! 

        అయినా దీన్ని బేస్ చేసుకుని తర్వాతి డైనమిక్స్ బావున్నా, బేస్ కే అర్ధం లేకపోవడంతో అవి కూడా తేలిపోతాయి. జనెరిక్ మందుల ఆగమనం గురించి గొప్పగా సభ ఏర్పాటవుతుంది. ఇందులో మంత్రి సెంగల్వ రాయన్ ప్రసంగించాలి. ఏం ప్రసంగించాలో అభిమన్యు నోట్ రాసేస్తాడు. ఆ నోట్ ని తను రాసిన వేరే నోట్ తో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ చేత మార్పించేస్తాడు మిత్రన్. ఈ నోట్ చదివేస్తూంటాడు మంత్రి సెంగల్వ రాయన్. ఇందులో దొంగలందరూ దొరికిపోయే వివరాలే వుంటాయి. అలా చదివేస్తూ మంత్రి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవుతాడు. నా కొడుకు ఇలా రాశాడేమిటీ  అని మంత్రి గుండెపోటు నటించి హాస్పిటల్లో పడతాడు. ఇలా ఈ డైనమిక్స్ బావున్నా, అసలు యాంజలీనా కంపెనీయే లేనప్పుడు ప్రభుత్వం ఈ సభ ఏర్పాటు చేయడమనే బేస్ హాస్యాస్పదమవడంతో, ఈ ఉత్తుత్తి బేస్ ని ఆధారం చేసుకున్న  ఈ డైనమిక్స్ లో అన్ని చర్యలూ తేలిపోయాయి. 

        ఇంతకీ అభిమన్యు రాసిన అసలు నోట్ లో వున్న విషయమేమిటి? అది మిత్రన్ చేజిక్కించుకున్నాడు కదా, మరి అందులో ఏముందో చూడలేదా? ఇది చూపించాలిగా ప్రేక్షకులకి? అభిమన్యు పాజిటివ్ గా రాశాడా? జనెరిక్ మందులు రావడం ఇష్టంలేని తను పాజిటివ్ గా ఎందుకు రాస్తాడు? పోనీ నెగెటివ్ గా రాశాడా? మిత్రన్ కూడా నెగెటివ్ గానే రాసి మంత్రి చేత చదివించాడుగా, ఇద్దరూ నెగెటివ్ గానే రాసినప్పుడు ఈ సీన్ కి అర్ధమేం వుంది? అంటే అభిమన్యు ఏం రాయాలో దర్శకుడు తేల్చుకోలేక, ఆ నోట్ ని కప్పిపుచ్చుతూ-  మిత్రన్ నోట్ తో మ్యాజిక్ చేస్తే సరిపోతుందనుకున్నాడా! అభిమన్యు నోట్ ఉంటేనే మిత్రన్ నోట్ తో సీన్ వస్తుంది- అభిమన్యు నోట్ ఏంటో తెలీకపోతే మిత్రన్ నోట్ తో మంత్రి సీనే వుండదు! ఇటీజ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 

        ఈ మొత్తం ప్రహసనం – దీని పర్యవసానంగా చైన్ రియాక్షన్ గా వచ్చే అభిమన్యు తన తండ్రి సెంగల్వ రాయన్ ని చంపించే సీను, తండ్రి చావుని సీఎం మీదికి తోసి అరెస్ట్ వారెంట్ రాకుండా అభిమన్యు బ్లాక్ మెయిల్ చేసే సీనూ, ఆ తర్వాత తండ్రి చితాభస్మంతో ఇంకో సీనూ హాస్యాస్పదంగా మారాయి!

        ప్రభుత్వ ప్రకటన దగ్గర్నుంచి, చితాభస్మం వరకూ ఈ మొత్తం సీక్వెన్స్  ఇక్కడ అవసరమే లేదు. ఇది ఎండింగ్ విభాగం 50 నిమిషాలదాకా చాంతాడంత పెరిగేందుకే పనికొచ్చింది తప్ప కథకి మరే ఉపయోగమూ లేదు. 

        మిత్రన్ దగ్గర వున్న  రెండు సాక్ష్యాధారాలు - ఫార్మాసిస్టుని, విక్కీనీ అభిమన్యు చంపిన రికార్డింగ్స్- కూడా కోర్టులో పనికి రానివే. ఇదెలాగో తర్వాత చూద్దాం. 

        సభలో అలా నోట్ చదివినందుకు ఆగ్రహంతో అభిమన్యు తండ్రి కారుని యాక్సిడెంట్ చేయించి చంపించినట్టు చూపిస్తారు. కారు భస్మీపటలమవుతుంది. మంత్రి చితాభస్మం పెట్టి పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు చేస్తారు. ఆ చితాభస్మమున్న కలశాన్ని అభిమన్యు అందుకుంటాడు. సీఎం కనుసైగతో మిత్రన్ ఆ కలశాన్ని లాక్కుని, అభిమన్యు చేతిలో తన ఛాతీ లోంచి తీయించుకున్న బగ్ పెడతాడు. అభిమన్యు షాక్ అవుతాడు. అరెస్ట్ హిమ్  అంటాడు  సీఎం.  అభిమన్యుని  అరెస్ట్ చేస్తాడు మిత్రన్.

***
    వెంటనే కోర్టు సీను. ఇక్కడ అభిమన్యు చేశాడని చెప్తున్న ఆ రెండు (ఫార్మాసిస్టు, విక్కీ)  హత్యా దృశ్యాల వీడియోల  ప్రదర్శన. ఫార్మాసిస్టు వీడియోలో గాయపడివున్న ఆమె, తను కనిపెట్టిన డయాబెటిస్ మందుతో అభిమన్యు చేస్తున్న కుట్ర గురించి స్టేట్ మెంట్. అంతలో ఆమె వెనక దూరంగా కర్ర పట్టుకుని తిరుగుతున్న అభిమన్యు షాట్. దీంతో కట్. 
        విక్కీ హత్యా దృశ్య వీడియోలో, అభిమన్యు అతణ్ణి కాల్చి చంపడానికి ముందు అతను  ఇస్తున్న స్టేట్ మెంట్. ఆ స్టేట్ మెంట్ లో మిత్ర కొలీగ్ ని అభిమన్యు ఆదేశాలతో తనే చంపినట్టు ఒప్పుకోలు. 

         వీటితో పాటు ఇంకా ఇతరుల మౌఖిక సాక్ష్యాలూ విన్న జడ్జి- నోరు విప్పకుండా కూర్చున్న అభిమన్యు తో- రేపటికల్లా నువ్వు నోరు విప్పక పోతే నీ మీద ఈ అభియోగాల్ని నేను అంగీకరిస్తాను- అంటాడు. అతణ్ణి సబ్ జైలుకు పంపమని ఆదేశిస్తాడు. 

        ఇక్కడే వుంది ప్రేక్షకుల్ని మాయ చేయడమంతా! అసలుకైతే ఇక్కడ ఈ కోర్టు హాలు కాకలుతీరిన అభిమన్యు లాయర్ల బృందంతో నిండిపోవాలి. మిత్రన్ ని గడగడ లాడించాలి.  

        1. ఏదీ ఆ అమ్మాయి వీడియోలో అభిమన్యు ఆమెని చంపుతున్నట్టు ఎక్కడుంది? దూరంగా కర్ర పట్టుకు తిరుగుతున్నంత మాత్రానా అతను  చంపినట్టా?
        2. విక్కీ వీడియోలో అతనిచ్చిన స్టేట్ మెంట్ ఎవరికిచ్చాడు? ఆ సమయంలో అక్కడ ఇంకెవరున్నారు? ఆ స్టేట్ మెంట్ ని తనని చంపడాని కొచ్చిన అభిమన్యు కైతే ఇవ్వడుగా? అది సీసీ కెమెరా అయితే ముందు నుంచీ  వెనక నుంచీ షాట్లు ఎలా తీసింది? 

        ఈ ప్రశ్నలు చాలు,  మిత్రన్ తను క్లియర్ గా కిల్లర్ గా దొరికిపోయేట్టున్నానని  కోర్టు లోంచి లాంగ్ జంప్ చేసి, అటుపైన స్క్రీన్ ప్లేలో టోల్ గేట్లన్నీ తోసుకుంటూ దర్శకుడికి  ఇక దొరక్కుండా, వాటంగా 100 k రన్ మొదలెట్టడానికి! గాడ్డామిట్, ఏం చేస్తాడు- బైపాస్ రోడ్డు కూడా పనికి రావడం లేదాయె!      

        కానీ - కానీ- జడ్జి కూడా అభిమన్యు ని లాయర్ గురించే అడగడు. మిలార్డ్, దయచేసి మీరు మాత్రం అభిమన్యుని నీ లాయర్స్ ఏరీ? అని అడక్కండి, నా స్క్రీన్  ప్లేకి చాలా ఇబ్బంది- అని దర్శకుడు అనివుంటాడు. సినిమా బాగా ఆడాలని జడ్జి తలూపి ఉంటాడు. 

        అంత  షార్ప్ స్టయిలిష్ మాస్టర్ మైండ్ అభిమన్యు  కూడా ఆ వీడియోల భాగోతం  చూసి- పోనీలే హీరోగాడు బతుకుతాడు- అనుకుని నోర్మూసుకుని కూర్చుని ఉంటాడు. 

        అసలు ఆ వీడియోలు చూస్తూనే జడ్జికి ఇది అల్లాటప్పా కేసు అని అర్ధమైపోవాలి-మిత్రన్ పసి మనస్సుతో  ఏదో తప్పు చేశాడు, నీ మీద అభియోగాల్ని కొట్టి వేస్తున్నాను, నువ్వింటి కెళ్ళిపో! -అని అభిమన్యుని విడుదల చేసేయాలి. అప్పుడు అభిమన్యు సరదాగా వెళ్ళిపోయి, మిత్రన్ బ్యాంకులో స్థంభింప జేసిన  ఆ 7.5 బిలియన్ డాలర్లకి పరువునష్టం దావా వేసి మోత మోగించవచ్చు- ఇలాగే వుంటాయి పాత్రల సహజ రియాక్షన్స్.  

        మిత్రన్ ఎంత నిర్లక్ష్యంగా కేసు పెట్టాడో ఇంకా చెప్పుకుంటే- అభిమన్యు విదేశీ కంపెనీ యాజమనురాలు యాంజలీనాని  చంపించాడు. దీని ఊసే లేదు! అదే సమయంలో అభిమన్యు జరిపించిన దాడిలో మిత్రన్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు, దీని ప్రసక్తే లేదు!!

        కథలో ఈ రెండు ప్రధాన సంఘటనలని వదిలేసి ఇంకేవో కేసులు పెడితే దీన్ని కథ అనాలా, కాకమ్మ కబుర్లు  అనాలా? 

        ఇక జడ్జి అభిమన్యుని సబ్ జైల్లో పెట్టి రేపు హాజరుపర్చ మంటాడేగానీ, పోలీస్ కస్టడీకి ఇవ్వలేదు. అభిమన్యు జ్యూడీషియల్ కస్టడీలో వుంటే, మిత్రన్ సబ్ జైలుకెళ్ళి సబ్ జైల్లో డీల్ కుదుర్చుకుంటాడు!

        అసలు అభిమన్యుని జైల్లో పెట్టాక మిత్రన్  కొలీగ్స్ ఆవేశ పడిపోతారు వాణ్ణి చంపాలని. ఎందుకంటే వాడు ఎస్డీ కార్డు కోసం తమ కొలీగ్ ని విక్కీ తో చంపించాడు గనుక.  రేపు కోర్టుకు తీసుకు పోతున్నప్పుడు ఎన్ కౌంటర్ చేస్తామంటారు. రాజ్యాంగం తమ  కిచ్చిన అధికారాన్ని వాడుకుని- విక్కీని అభిమన్యు చేత పథకం ప్రకారం చంపించింది గాక,  మళ్ళీ  ఇప్పుడు అభిమన్యుని ఎన్ కౌంటర్ చేస్తారట.  ఆదర్శాలు వల్లించుకుని నిజాయితీగల పోలీసాఫిసర్లలా  నిన్నగాక మొన్న కొత్తగా జాయినై, అప్పుడే కరుడు గట్టిన పోలీసుల్లా న్యాయస్థానాన్ని  బుకాయించడానికి తెగిస్తున్నారు. ఇదీ చట్టాలంటే ఈ ఆదర్శ పాత్రల కున్న గౌరవం. అభిమన్యుని చంపాలనుంటే యూనీఫామ్స్ తీసేసి ఎపుడో చంపెయ్యాలి- వ్యక్తి గత కక్షలకి అధికారాన్ని వాడుకునే ఇవేం ఆదర్శపాత్రలు. చట్ట ప్రకారం శిక్షించడానికి స్ట్రగుల్ చేస్తూంటే సానుభూతి అయినా దక్కుతుంది,  గొప్పోళ్ళనిపించుకునే అవకాశముంది.
***
        క జైల్లో అభిమన్యుతో డీల్-  మిత్రన్ రూమ్ లోకి రాగానే అభిమన్యు టేబుల్ మీద కాళ్ళు బార జాపుకుని కూర్చుని ఉంటాడు. ఈ సెషన్ మొత్తం ఇలాగే కూర్చుని ఉంటాడు. తన ప్రత్యర్ధి, ఇప్పుడు నిందితుడూ  అయిన అభిమన్యు అలా కూర్చుని వుంటే, తానొక ఐపీఎస్ అధికారి నన్న ఫీలింగ్ కూడా లేకుండా, అతడి ముందు కూర్చుని మాట్లాడు తూంటాడు మిత్రన్. సమఉజ్జీ అయిన శత్రువుని కోరుకున్నమిత్రన్, తనే సమఉజ్జీగా వుండడు. ఇంకొకరైతే రాగానే రెండు పీకి, సరిగ్గా కూర్చోబెట్టే వాళ్ళు అభిమన్యుని. పాత్ర చిత్రణలు, సన్నివేశ కల్పనలు ఇలా వున్నాయి. 


       ఇక్కడ మళ్ళీ డేటా ప్రదర్శన. తన సిండికేట్ లో వున్న ఘరానా వ్యక్తులు ఎవరో చెప్ప మంటాడు మిత్రన్. ఈ సీను చాలా సేపు సాగుతుంది. సారాంశ మేమిటంటే, రేపు కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు అభిమన్యుని పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు గనుక తను డేటా ఇచ్చేస్తే మిత్రన్ ఆ ఎన్ కౌంటర్ లోంచి కాపాడతాడు. 

        అభిమన్యు ఇంతవరకూ ఆర్గనైజ్డ్ క్రైమ్సే చేశాడు, అతడికి ఎమోషనల్ క్రైం రుచి తెలీదు. ప్రజల్లో కూడా అభిమన్యు మీద ఎంత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందో చూడమని,  ఆ క్లిప్పింగ్స్- బైట్స్ చూపిస్తాడు. అభిమన్యు కనిపిస్తే కొట్టి చంపేసేట్టున్నారు. కనుక ప్రజల బారి నుంచి కూడా అభిమన్యుని కాపాడి కోర్టుకి తీసికెళ్ళాలంటే, అతనిప్పుడు సిండికేట్ గురించి డేటా ఇచ్చేయాలి. అప్పుడు  తనొక  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాడు. అది తొడుక్కుని వెళ్తున్నప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా ప్రమాదముండదు కానీ, చచ్చిపోయి నట్టు నటించాలి. తను సురక్షితంగా కోర్టుకి చేరేస్తాడు.

        ఇలా చెప్పి ఆలోచించుకోమని, బుల్లెట్ ప్రూఫ్  జాకెట్ అభిమన్యు ముందు పెట్టి వెళ్ళిపోతాడు మిత్రన్.
***
       తే- ఐతే-
       ఈ సీను మధ్యలో ఇంకో  గమ్మత్తు వుంది!  అదేమిటంటే, ఫార్మాసిస్టు ప్రస్తావన తెస్తాడు మిత్రన్. పేటెంట్ రైట్స్ ఆమె పేర రిజిస్టర్ అవబోతోందని అంటాడు. అభిమన్యు కలవరపడి- దాని పేరు పెట్టేశావా? అదేదో వాగితే ఫార్ములా దానిది అయిపోతుందా? అది నేను కనుగొన్న ఫార్ములా, దానికేం సంబంధం లేదు- అంటాడు. 


        అప్పుడు మిత్రన్ - అది నువ్వు కనుగొన్న ఫార్ములాయే, ఆమె తనదని వాగలేదు, వాగినట్టు నేను ఎడిట్ చేశా - అని ఆ ఎస్డీ కారు వేసి చూపిస్తాడు. అందులో ఫార్మాసిస్టు- ఆ ఫార్ములా అభిమన్యు కనుగొన్నదేననీ, అయితే ఫారిన్ కి అమ్మేస్తూంటే వద్దని వారించాననీ, అతను  తన మందు తనిష్టమని చంపడానికి వచ్చాడనీ.. ఇలా చెబుతూంటుంది!

        ఇలా చెబుతున్న ఆమె మాటల్ని మిత్రన్ ఎడిట్ చేసి, అది ఆమె కనుగొన్న ఫార్ములాగా చెప్పినట్టు మాటల్ని మార్చాడట!!

        ఇదే మాట రేపు అభిమన్యు కోర్టులో చెప్పేసి కలకలం సృష్టిస్తే? ఇంత ఫూలిష్ గా ఎలా ప్రవర్తిస్తాడు మిత్రన్? అప్పడు మిత్రన్  కోర్టుకి చూపిన వీడియో ప్రశ్నార్ధకమవుతుంది- కోర్టుని తప్పుదోవ పట్టించడం కూడా అవుతుంది. ఆ వీడియోని పరీక్షకి పంపితే ఎడిట్ చేసిన తనే దొరికిపోతాడు!

         ఫార్మాసిస్టుని చంపిన కేసు కూడా అభిమన్యు మీద నిలబడదు- ఎందుకంటే, ఒరిజినల్ వీడియోలో,  అతడి ఫార్ములా అతను అమ్ముకుంటూంటే వద్దని ఆమె వారించానంది. అంత మాత్రాన ఆమెని చంపేస్తాడా? ఆమె అడ్డు పడితే అమ్మకం ఆగిపోతుందా?
        రెండోది- వెనకటి సీన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియాకి మిత్రన్ సబ్మిట్ చేసింది బోగస్ క్లెయిమ్ అని కూడా బయటపడి అక్కడా దొరికిపోతాడు! ఇవన్నీ పోలీస్ యూనిఫాం లో ఒక విలన్ చేయాల్సిన దుశ్చేష్టలు. హీరో చేస్తే నీచంగా ఉంటాడు.

***
     యిపోలేదు ...ఇంకొకటుంది!
     ఇదే జైలు సీన్లో- అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ, అభిమన్యు చేయించిన  కారు యాక్సిడెంట్ ని బూటకంగా మార్చింది తానేననీ  అంటాడు మిత్రన్. కాబట్టి ప్రభుత్వ లాంఛ నాలతో పోలీసులు గౌరవ వందనం చేసిన చితాభస్మం అభిమన్యు తండ్రిది కాదనీ, ఆ చితాభస్మం అభిమన్యు చంపించిన తన కొలీగ్ దనీ అంటాడు మిత్రన్!

        మిత్రన్ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడు. యాక్సిడెంట్ లో పోయిన వ్యక్తి చితాభస్మానికి పోలీసులు గౌరవ వందనం చేస్తున్నారంటే అతను కాలి బూడిదయ్యాడు కాబట్టని అర్ధం జేసుకోవచ్చు. మిత్రన్ కొలీగ్ చనిపోయి డెడ్ బాడీ దొరికితే దాని చితాభస్మానికి గౌరవ వందన మేమిటి? పోలీసులు మృత దేహానికి గౌరవ వందనం సమర్పించి కదా బంధువులకి అప్పగిస్తే అంత్య క్రియలు జరిపిస్తారు. అంత్య క్రియలు జరిపాక చితాభస్మానికి గౌరవ వందన మేమిటి ???!!!
        మిత్రన్ పిచ్చెక్కి ఇష్టమొచ్చిన ఆటలాడుతున్నాడు.
***
       ఇక కోర్టుకి తీసుకుపోయే ఎపిసోడ్!
       
బయటికి తీసుకువస్తున్నపుడు జైలు బిల్డింగ్ పైనుంచే (!!) ఒక కొలీగ్ రైఫిల్ గురి పెట్టి ఉంటాడు ఎన్ కౌంటర్ చేయడానికి. ఎంత సిల్లీ సీన్ ఇది! జైలు బుల్దింగ్ పైనుంచి ఎన్ కౌంటర్- సెక్యూరిటీ సిబ్బంది లేరా? బయట అభిమన్యు మీద దాడి చేయడానికి జనం ఎగబడుతూంటారు. ఒకడు కత్తితో దాడి చేయ బోతూంటే అభిమన్యు ని పక్కకి లాగేస్తాడు మిత్రన్. అప్పుడా స్పర్శకి అభిమన్యు జాకెట్ తొడుక్కోలేదని తెలుస్తుంది. ఎందుకిలా  చేశావని కేకలేస్తాడు మిత్రన్. కొలీగ్ ఫైర్ చేసేస్తాడు. దాన్నుంచి కూడా అభిమన్యుని కాపా డేస్తాడు మిత్రన్. ఇంతలో ఇంకో ఫైరింగ్ జరుగుతుంది- మిత్రన్ షాక్ అయిచూస్తే, అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వుంటుంది- తన తండ్రి  హత్యకి అభిమన్యు మీద పగ దీర్చుకుంటూ! 

        చచ్చిపోతూ చెప్తాడు అభిమన్యు- తన డేటా  ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్ లో పెట్టానని. ఇక ఆప్త మిత్రుడు చనిపోతున్నట్టే ఎమోషన్ తో ఎలాగెలాగో అయిపోతాడు మిత్రన్...

***
 1. డీల్ ప్రకారం డేటా  తీసుకోకుండానే మిత్రన్ ఎలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చేస్తాడు?
        2. కోర్టుకి తీసుకు పోతున్నప్పుడు ఆ జాకెట్ దగ్గరుండి తొడిగించడా? అభిమన్యు నిందితుడా, అభ్యాగతుడా?
        3. బయటికి తీసుకొస్తున్నప్పుడు తొడుక్కున్నావా అని నామ్ కే వాస్తే అడుగుతాడు మిత్రన్. తొడుక్కున్నా నంటే నమ్మేస్తాడా? దీంతో తొడుక్కోలేదని మనకే అన్పిస్తుంది.
        4. తీరా దాడి జరిగినప్పుడు తొడుక్కోలేదా అని మిత్రన్ కేకలేయడమేమిటి- ఖచ్చితంగా తొడుక్కోడు విలన్ అన్నాక!
        5. సడెన్ గా అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఎటాక్ చేసి చంపడం ఈ  కథకి పెద్ద మాస్టర్ స్ట్రోకేం గాదు, రాం గోపాల్ వర్మ ‘కంపెనీ’ ముగింపు ఇదే- చాలా అనూహ్యంగా, చాలా  షాకింగ్ గా- మర్చిపోలేనట్టుగా.
        6. డేటాని ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్లో పెట్టానన్న అభిమన్యుకి జైల్లో ఆ కార్డు ఎక్కడిది? ఎలా రికార్డు చేశాడు? ఇప్పటికైనా తను ముందు డేటా తీసుకోకుండా జాకెట్ ఇచ్చేశాడని మిత్రన్ కి గుర్తొచ్చిందా?
        7. ఈ ముగింపుతో ఏం సాధించాడు మిత్రన్? కథ తను ముగించాడా? అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ముగించిందా?
        8. అసలు కథ తను మొదలు పెట్టాడా?
***
    క ఇంటర్వ్యూలో దర్శకుడు- చాలా    యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారనీ,  ‘తని ఒరువన్’ లో దుష్ట శక్తుల్ని ఓడించడం హీరో బాధ్యతగా చూపించాననీ, దానధర్మాలు చేయడానికి ఎలా కారణాలు అవసరం లేదో, ఇది కూడా అంతేననీ  అన్నాడు. 

        కారణం లేకుండా కార్యం లేదు. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం- కార్యకారణ సంబంధం- అన్నారు. మన ఆలోచన, మాట, చేత అన్నీ దీని మూలంగానే పుడు తున్నాయి. మొత్తం సృష్టే దీని ఆధారంగా నడుస్తోంది. కాబట్టి హీరో కారణం లేకుండా పోరాడలేడు. దాన ధర్మాలు చేయడానికీ కారణం ఉంటుంది- దానం పుచ్చుకుంటున్న వాడు బావుండాలన్న కారణం. కదా? కుక్క కూడా యజమాని బావుండాలన్న కారణంతోనే బతుకుతుంది. అలాగే ఈ కథలో హీరో పోరాటానికి కారణం ఉండే వుంటుంది. జరుగుతున్న నేరాలు చూసి (కాజ్) తను పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నానని (ఎఫక్ట్) మిత్రనే  స్వయంగా చెప్పుకున్నాడు. అయితే కాజ్ ఎంత బలంగా వుంటుందో ఎఫెక్ట్  అంత బలంగానూ  వుంటుంది. కాజ్ ఎంత బలహీనంగా వుంటుందో ఎఫెక్ట్ అంత బలహీనంగానూ  వుంటుంది. ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతి చర్య ఉంటుందని న్యూటన్  మూడో చలన సూత్రం కదా? బంతిని ఎంత  బలంగా గోడకి కొడితే అంత బలంగా వెనక్కి వస్తుంది. 

        కథల్లో కాజ్ రెండు జోన్స్ లోంచి పుడుతుంది : వ్యవస్థ లోంచి, పౌరజీవితం లోంచి. వ్యవస్థ లోంచి కాజ్  పుట్టాలంటే వ్యక్తిగత అన్యాయమో నష్టమో జరిగి ఉండనవసరం లేదు. ఆ అధికారి, లేదా ఉద్యోగి ఉద్యోగ ధర్మమే కాజ్ అవుతుంది. దాంతో చర్య తీసుకుంటారు (ఎఫెక్ట్). అదే పౌర జీవితంలో అయితే వ్యక్తిగతంగా అన్యాయం జరక్కుండా (కాజ్) అన్యాయాల్ని ఎదుర్కోలేరు (ఎఫెక్ట్). ఒక ఆటో డ్రైవర్ అన్యాయాల్ని ఎదుర్కొవాలంటే (ఎఫెక్ట్) వ్యక్తిగతంగా అతడికి అన్యాయం జరిగి వుండాలి (కాజ్).

        ‘
శివ’లో పౌర జీవితంలో ఉండే నాగార్జున తన సన్నిహితురాలు అమలతో జేడీ మిస్ బిహేవ్ చేసినందుకే (కాజ్) జేడీని కొట్టి మాఫియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తాడు (ఎఫెక్ట్).  ఇక్కడ ‘కాజ్’ కి పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘డెత్ విష్’  అనే ప్రసిద్ధ సినిమాలో పౌర జీవితంలో వుండే బిజినెస్ మాన్ అయిన ఛార్లెస్ బ్రాన్సన్, దోపిడీ దొంగలు తన భార్యని చంపి, పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన అన్యాయంతో వ్యవస్థతో విసిగి( కాజ్),  ఇలా మరొకరికి జరక్కూడదని, రాత్రిపూట తనే నగరంలో దొంగల్ని ట్రాప్ చేసి చంపుతూంటాడు(ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’  పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘బొబ్బిలిపులి’ లో వ్యవస్థలో భాగంగా సైనికుడైన ఎన్టీఆర్ సొంతవూరికి వచ్చి పెళ్లి కుదుర్చుకుని పోతూ విలన్ల దురాగతాలు చూసి, తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, ఇక్కడే ననీ డిసైడ్ అయిపోయి, సంఘవిద్రోహుల  మీద సమరభేరి మోగిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే. వ్యక్తిగత నష్టం జరిగి ఉండాల్సిన అవసరం లేదు. 

        ‘సరైనోడు’ లో సైనికుడిగా తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, దేశం లోపలే దుష్టుల  పని పట్టడమేనని వచ్చేసి వివాదాలు సెటిల్ చేస్తూంటాడు అల్లు అర్జున్ (ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే గానీ వ్యక్తిగతం కాదు.  అయితే ఇది బలహీన కాజ్. ఇలా ఫీలవడానికి పేపర్స్ లో వార్తలేవో చదివి వుంటాడేమో తప్ప, ఇదమిత్థంగా ఓ ప్రత్యక్ష సంఘటన చూడలేదు. అందుకే ఇది బలహీన కాజ్. దీని ఎఫెక్టు కూడా అంతే  బలహీనంగా వుంటుంది- కథ వేరే పాయింటు మీదికి వెళ్ళిపోతూ. ‘బొబ్బిలిపులి’ లో  ఇలాకాకుండా, ఎన్టీఆర్ సంఘవిద్రోహుల కరాళనృత్యం కళ్ళారా చూస్తాడు గనుక, అది బలమైన కాజ్. దాని ఎఫెక్ట్ కూడా ఆద్యంతం అంతే  బలంగా వుంటుంది. 

        ఇక వ్యవస్థలో భాగమైన పాత్రలు వ్యక్తిగత నష్టా లెదుర్కొనే కథలు కూడా వున్నాయి. ఈ పాత్రలు ఉదాత్తంగా వ్యక్తిగత నష్టాన్ని ఓర్చుకుని పదవీ బాధ్యతలకే ప్రాణమిస్తాయి. ఉదాహరణకి ‘కొండవీటి సింహం’ లో పోలీస్ అధికారి అయిన ఎన్టీఆర్ కొడుకుని విలన్ కిడ్నాప్ చేసి బేరం పెడితే లొంగడు.  అలాగే ‘అంకుశం’ లో సీఎంని కాపాడే ఇన్స్పెక్టర్ పాత్రలో రాజశేఖర్ భార్యని విలన్లు చంపేస్తే, సీఎంని రక్షించడానికే పోరాడతాడు రాజశేఖర్! ఇలాటి పాత్ర లు చాలా సానుభూతిని పొంది బలంగా కనెక్ట్ అవుతాయి.
***
       మన మిత్రన్ విషయానికొస్తే, ఇతడికి బలమైన కాజ్ వుందా? వున్న ఆ బలహీన కాజ్ కూడా పోలీసు కాక ముందే వుంది. జరుగుతున్న ఘరానా వ్యక్తుల నేరాలు చూసే పోలీసు అవ్వాలనుకున్నానని అంటాడు. అంటే అప్పుడతను పౌర జీవితంలో ఉంటూ ఈ రకంగా  ఫీలయ్యాడు. ఆ నేరాల తాలూకు వివరాలు గోడల మీద అతికించుకున్నాడు. అయితే అవేవీ అతను ప్రత్యక్షంగా  చూసినవి కావు, బాధితుల్ని పరామర్శించినవీ కావు. నిజానికి నడుస్తున్న కథతో కనెక్ట్ అయ్యే హీరో తాలూకు పూర్వానుభావాల కథని సర్కిల్ ఆఫ్ బీయింగ్ అంటారు. దీన్ని విజువల్ గా ఆనాడు హీరోకేం అనుభవమైందో ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా  చూపిస్తారు (మాటలతో చెప్తే ఎఫెక్టివ్ వుండదు కాబట్టి). నడుస్తున్న కథకి ఇంధనం (ఎమోషనల్ శక్తి)  ఇక్కడ్నించే అందుతుంది. ఈ సినిమా దర్శకుడేమో-  చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారని తృణీకార భావంతో అంటాడు.   వేయకపోతే ఎమౌతుందంటే, ఇలాగే  కటౌట్ పాత్ర అవుతుంది, ఉత్సవ విగ్రహంలా వుంటుంది. వీణ్ణి చివరిదాకా మోయలేక చావాలి రైటర్. 

        ఇలా ‘కాజ్’ లో బలం లేనప్పుడు సహజంగానే ఎఫెక్ట్ కూడా బలహీనమైపోయింది ఈ కథలో. బ్యాక్ డ్రాప్ లో ‘కాజ్’  కి సరైన బలం లేకపోవడం వల్ల, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అసలు గోలే (ఎఫెక్ట్) ఏర్పడలేదని గమనించాం.

        ఎప్పుడైతే ప్లాట్ పాయింట్  వన్ బలహీనంగా వుంటుందో, లేక అసలే ఏర్పడదో,  అప్పుడు  ఎండ్ విభాగంలో బిజినెస్ కూడా గందరగోళమై పోతుంది, క్లయిమాక్స్ కుప్పకూలుతుంది. బిగినింగ్ కీ ఎండ్ కీ అవినాభావ సంబంధముంటుంది. కథకి ముగింపు కథా ప్రయోజనం లోనే వుంటుంది. కథా ప్రయోజనం లేకపోతే  కథకి ముగింపే  దొరకదు.

        సిడ్ ఫీల్డ్ ప్రకారం - ఈ కింది రుగ్మతలు పొడసూపుతాయి..
          
1. story  resolution may not be paid off
            2. the  ending will not work
            3. the ending will be too soft, too weak, confusing
            4. the ending will be contrived, too predictable, unsatisfying
            5. main character dies (easy solution)
            6. the main character will disappear at the end
            7. a surprise twist comes out of nowhere.
            8. ending  will not be big, or commercial enough
            9. ending will be too long, and there might be a budget problem
            10. there will be no emotional impact

            వీటిలో 7వ దైన main character dies ని విలన్ క్యారక్టర్ మరణంగా మార్చుకుంటే,  పైన సిడ్  ఫీల్డ్ చెప్పినవన్నీ ఈ సినిమా ఎండ్- క్లయిమాక్స్ లో కన్పించే రుగ్మతలేగా? అంత సరీగ్గా ఎలా చెప్పగల్గాడు సిడ్ ఫీల్డ్? దొంగ చాటుగా ఈ సినిమా చూసి, అప్పటికప్పుడు కన్పించిన విషయాల్ని తప్పులన్నట్టు ఎంచి చెప్పేశాడా? అమెరికానుంచీ అనకాపల్లి దాకా- ఇలా చేస్తే ఈ తప్పు జరుగుతుందని  అతను చెప్పినట్టే సినిమా లెందుకుంటున్నాయి? 

         ఈ కథలో అభిమన్యుని కోర్టుకి తీసుకుపోవడానికి జైల్లోంచి మిత్రన్ బయటికి తీసుకొచ్చే ముగింపు ఘట్టం,  పై  సిడ్ ఫీల్డ్ ఫీల్డ్ చెక్ లిస్టు ప్రకారం-
        1. కథా ప్రయోజనం నెరవేరిందా? అసలు కథా ప్రయోజనం ఏమిటని?
        2. ముగింపు తేలిపోలేదూ?
        3. ముగింపు సాఫ్ట్ గా,  బలహీనంగా, కన్ఫ్యూజింగ్ గా లేదూ?
        4. ముగింపు కల్పించినట్టు, తెలిసిపోయేట్టు, అసంతృప్తి కరంగా లేదూ?
        5. ఈజీ సొల్యూషన్ గా విలన్ చనిపోలేదూ?
        6. హీరోపాత్ర గల్లంతై పోలేదూ?
        7. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు విలన్ గర్ల్ ఫ్రెండ్ తో సర్ప్రైజ్ ట్విస్టు ఇవ్వలేదూ?
        8. ముగింపు భారీ యాక్షన్ తో కమర్షియల్ గా లేదు కదూ?
        9. ముగింపు తెగసాగి  బడ్జెట్ ని పెంచెయ్యలేదూ?
        10. ముగింపులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఏమీ లేదు కదూ?  
***
        కథకైనా ఒక ప్రయోజనముంటుంది. ఆ ప్రయోజనం లోంచే ముగింపు దానికదే పుడుతుందే తప్ప- ముగింపుని  ఇటు మార్చి,  అటు మార్చి కృత్రిమం చేయలేరు. ఆ కథాప్రయోజనం లోంచి పుట్టే ముగింపు నచ్చక పోతే, కథనే తీసి  అవతలపడెయ్యాలి తప్ప ఇంకేవో ముగింపులు తెచ్చి అతికించుకుంటూ కూర్చోకూడదు. కథలో కథా ప్రయోజనం ఎక్కడంటుంది? ప్లాట్ పాయింట్ వన్ లో వుంటుంది. అక్కడ హీరోకి ఏర్పడే గోల్ కథా ప్రయోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులోంచే ముగింపు పుడుతుంది. అందుకని యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ముగింపు  అన్నారు. గోలే లేకపోతే  కథా  ప్రయోజనమూ లేదు, ముగింపూ లేదు, కథే లేదు! 

        ముగింపుకి సంబంధించి లాజోస్ ఎగ్రీ  ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ (1946) అనే ప్రసిద్ధ గ్రంథంలో సింపుల్ గా ఇలా చెప్తాడు -  కథల్లో ప్రారంభం అనేది సంఘర్షణకి మూలం కాదు, అది మొత్తానికి ముగింపుకే  మొదలు. కథా ప్రారంభమే ముగింపుకి మొదలు. పాత్ర ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అంతర్గత క్లయిమాక్స్ ని అనుభవించి, ఆ నిర్ణయం ప్రకారం చర్యకి దిగుతుంది. దాంతో  సంఘర్షించి తాను కలగన్న  బహిర్గత క్లయిమాక్స్ ని సాధిస్తుంది...

       
దీన్నిలా చూడవచ్చు- మనమొక పని చేయాలనుకున్నప్పుడు దాని  ఫలితాన్ని వూహించుకుంటాం ( అంతర్గత క్లయిమాక్స్) ఆ వూహలకి తగ్గటు ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాం (బహిర్గత క్లయిమాక్స్).  అంతే,  ఇంత సింపుల్!

        అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ ప్రారంభమవుతుందనుకుంటే, ఆ ప్లాట్ పాయింట్ వన్ లోనే క్లయిమాక్స్ కూడా  వుందన్న మాట. పెళ్ళితో ఒక జంట ఏకమయ్యిందంటే, ఆ పెళ్ళిలోనే క్లయిమాక్స్ కూడా ఉందన్న మాట- రాబోయే కాలంలో పిల్ల పుట్టడం! పెళ్ళికి ఉద్దేశించే  క్లయిమాక్స్ ఇది. ఇది పెళ్లి ప్రయోజనం. ‘శివ’ లో నాగార్జున ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీని  తిప్పితిప్పి చితకబాదితే అందులోనే క్లయిమాక్స్, ముగింపూ, కథాప్రయోజనమూ అన్నీ వున్నాయి- అంతిమంగా రఘువరన్ మాఫియా ప్రపంచానికి ఎసరు పెట్టడం! వీణ్ణి కొడితే వాడు పోయే కాలం కూడా వస్తుందని, అంతిమ ఫలితాన్ని ఊహించుకునే జేడీని అలా కొట్టి ఉంటాడు నాగార్జున!

        మరి మన మిత్రన్ ఎలర్జీతో ప్లాట్ పాయింట్ వన్ ని తప్పించుకున్నా,  స్క్రీన్ ప్లేలో అడ్డ మార్గాల్లో ( పోలీసుగా కూడా అడ్డ మార్గాల్లోనే ) ఏం సాధించాలని కలగన్నాడు? ఈ ప్రపంచానికి అభిమన్యు పీడా  తొలగించాలనే కదా? మరి తొలగించాడా? ఆ ముగింపుకి కథని చేర్చడా? ఆ ముగింపుతో కథా ప్రయోజనాన్ని నెరవేర్చాడా? ఇంకెవరో వచ్చి కదా అతడి కలల్నీ, కథా ప్రయోజనాన్నీ, ముగింపునీ,  హీరోయిజాన్నీ చెడగొట్టింది! 

        కథా  ప్రయోజనం గురించి లాజోస్ ఎగ్రి ఇలా చెప్తాడు- ఓ మనిషి దొంగతనం చేస్తాడు. అది సమస్య. అతణ్ణి వెంటాడతారు. ఇది సంఘర్షణ. అతను పట్టుబడతాడు. ఇది సంక్షోభం. న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. ఇది ముగింపు.  అతణ్ణి జైల్లో పెడతారు. ఇది కథా ప్రయోజనం. 

       
అన్యాయాలు చేసిన వాడిపై న్యాయమే గెలిచినట్టు, చట్టాల్ని అతిక్రమించిన వాడిపై చట్టమే గెలిచినట్టూ పూర్తిగా చూపించి ముగించడమే  ఉత్తమ కథా లక్షణం .

        కానీ ఒక పోలీసు అధికారిగా మిత్రన్  చట్టాల్ని ఏమార్చడమే హీరోయిజమనుకుంటే ఏ కథాప్రయోజనం నెరవేరుతుందని? 

        ఇటీవల ఒక పేరున్న మీడియం హీరోతో సినిమా తీసిన దర్శకుడు పోలీసు కథ చెప్పారు. అది చాలా కన్ స్ట్రక్టివ్ గా, ప్రొఫెషనల్ గా, కమర్షియల్ గా వుంది- ముగింపు పక్క పాత్ర చేతికి వెళ్ళడం తప్ప. దాన్ని హీరో కి మార్చి, ఇందులో ఇంకెవరూ ఎక్కడా వేలు పెట్టనివ్వకుండా ఎలా రాశారో అలా తీయమని చెప్పాడు ఈ వ్యాసకర్త. ఇదీ స్క్రీన్ ప్లే యాక్టర్లకీ, స్క్రీన్ ప్లే క్రియేటర్లకీ వున్న తేడా!  


-సికిందర్        
       


               






Friday, May 20, 2016

షార్ట్ రివ్యూ


రచన – దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల

తారాగణం : మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, రేవతి, జయసుధ, తులసి, శరణ్య, అర్చన, సత్య రాజ్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నాజర్, సాయాజీ షిండే, నరేష్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మిక్కే జే మేయర్,  ఛాయాగ్రహణం : రత్న వేలు
బ్యానర్ : పివిపి సిని మా- మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్  ప్రై. లి.
నిర్మాతలు : పొట్లూరు వి. ప్రసాద్, మహేష్ బాబు 
విడుదల : 20 మే, 2016
***
       శ్రీకాంత్ అడ్డాల ఫిలసాఫికల్ ఫ్యామిలీ డ్రామాల  పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇందులోకి మరోసారి మహేష్ బాబు జాయినయ్యాడు. ఒక పెద్ద నిర్మాత దీనికి తోడయ్యాడు, భారీ తారా గణమంతా  వరసకట్టారు, అగ్రస్థాయి సాంకేతిక నిపుణులూ కలిశారు. ఇంతమంది హేమీ హేమీలని కలిపి చూస్తేనే ఇదొక బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ కృష్ణ నటించి నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా ఇలా హేమా హేమీలతో ఓ పెద్ద బ్రహ్మోత్సవమే ఆనాడు- థియేటర్ల లోపలా బయటా! ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’  టైటిల్ తోనే వచ్చిన ఈ హేమా హేమీల ‘బ్రహ్మోత్సవం’  థియేటర్ లోపల వెండి తెర మీద కూడా బ్రహ్మోత్సవాన్నే వెలిగించిందా? ప్రేక్షక భక్తులు ఈ బ్రహ్మోత్సవపు భక్తి ప్రవాహ రసంలో కొట్టుకుపోయేలా చేసిందా?  ఓసారి చూద్దాం...

కథ
        విజయవాడలో సత్య రాజ్ -రేవతి లకి మహేష్ బాబు ఏకైక కొడుకు. సత్య రాజ్ మామ దగ్గర నుంచి నాలుగు వందలు తీసుకుని ఇప్పుడు నాల్గు వందల కోట్లు చేసే పెయింట్స్ కంపెనీ  అధిపతి అయ్యాడు. తన చుట్టూ ఎప్పుడూ పదిమంది వుండి జీవితం పండగలా, బ్రహ్మోత్సవంలా గడపాలని అతడికుంటుంది. బావమరుదులైన రావురమేష్, నరేష్, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ నల్గురికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. అలా అందరూ ఆటాపాటా పండగలూ పబ్బాలతో నవ్వుతూ హాయిగా జీవించేస్తూంటారు- ఒక్క రావు రమేష్ తప్ప. రావు రమేష్ కి ఇలా బావ పంచన పడి బతకడం అస్సలు ఇష్టముండదు. అలాగని బయటికి పోతానని చెప్పలేడు. భార్య జయసుధ, కూతురు ప్రణీత వుంటారు. కూతుర్ని మహష్ బాబుకిచ్చి చేసుకుంటే అలాగైనా ఈ ఇంట్లో తన ప్రాధాన్యం పెరుగుతుందన్న ఆశతో ఉంటాడు. అలాటిది సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ రావడంతో రావు రమేష్ ఆశలు కరిగిపోతాయి. కాజల్ మహేష్ ఇద్దరూ ప్రేమలో పడతారు. 

        మహేష్ బాబు అందరికీ ప్రియమైన వాడు.  ఏ కష్టం తెలీకుండా అలా అలా జీవితం గడిపేస్తూంటాడు.  మాట అనే ముందు, ఏదైనా చేసే ముందు ఎక్కువ ఆలోచించడు. రావు రమేష్ తన కూతుర్ని మహేష్ కి చేసుకోమని చెప్ప లేకపోతున్నాడని సత్యరాజ్ కి తెలుస్తుంది. అయినా మౌనంగా ఉంటాడు. అంతా కలిసి టూర్ కి వెళ్తారు. అక్కడ కాజల్ మనసు విప్పుతుంది. తనది స్వేచ్చా ప్రపంచమని, ఇంటినిండా మనుషుల మధ్య వుండలేననీ అంటుంది. మహేష్ బాబు అర్ధం జేసుకుని బై చెప్పేస్తూ కిస్ ఇస్తాడు. ఇది చూసి రావు రమేష్ ఇక రెచ్చిపోతాడు. కూతురు పెళ్లి ఇక మహేష్ తో జరగదన్న ఆక్రోశంతో సత్య రాజ్ ని నానా మాటలంటాడు. ఈ  బానిస బతుకు బతకలేనని వెళ్ళిపోతాడు. సత్యరాజ్ గుండె పోటుతో చనిపోతాడు. చనిపోయే ముందు  మహేష్ తో తన కోరిక చెప్తాడు. ఆ కోరిక ప్రకారం ఏడుతరాల బంధువుల్ని వెతకడానికి మహేష్ బాబు బయల్దేరతాడు. ఇదీ కథ. 

ఎలా వుంది కథ
       
ది పాత రోజులనాటి ఉమ్మడి కుటుంబపు కథైనా,  దీన్ని ఇప్పటి కాలానికి అన్వయించి చెప్పలేకపోయారు. సమస్య ఏమిటంటే, తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటూ వస్తే నరుక్కునే రాక్షసులైన ఫ్యాక్షన్ - మాఫియా కుటుంబాల కథలొస్తాయి, లేదంటే 1960-70 లనాటి కాలం చెల్లిన సెంటిమెంట్ల కథలొస్తాయి. ఈ రెండూ తప్ప ప్రేక్షకులకి వెరైటీ అనేదే లేదు.  ఈ కథ కూడా అదే పాత మూసలో, అవే కాలం చెల్లిన విలువలకోసం ప్రాకులాడే చాదస్తపు పాత్రలతో చెప్పారు. కాలం మారింది, జీవనోపాధి మార్గాలూ పెరిగిపోయాయి. వ్యవసాయానికో వ్యాపారానికో ఉమ్మడి కుటుంబంగా గడపాల్సిన అగత్యం ఇప్పుడు లేదు.  కుటుంబ సభ్యులు ఎవరి  అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా బాగా అభివృద్ధిలో కొస్తున్నారు. మనుషులు భౌతికంగా దూరమైనా మానసికంగా దగ్గరగా వుండే టెక్నాలజీ వుంది. పాత తరం కొత్త కాలంలోకి రావాలే గానీ,  కొత్త తరాన్ని  పాత కాలంలోకి లాగాలనుకోవడం మూర్ఖత్వం. నిజమే, కలిసి వుండాలని అనడం శాశ్వత విలువే – కానీ ఇలాగే కలిసుండా లనడం పాత విలువ. శాశ్వత విలువలూ సత్యాలూ మారవు గానీ, పాత విలువలూ అభిప్రాయాలూ మరిపోతూంటాయి. దీన్నర్ధం జేసుకోలేక బాధలు పడుతున్న వాళ్లెందరో వున్నారు. ఈ సంధి కాలంలో ఇలా చిక్కుకు పోయిన కుటుంబాలకి విముక్తి కల్గించే సమకాలీన పరిష్కార మార్గాలు  చెప్పాలే గానీ- ఇష్టమున్నా లేకపోయినా అంతా ఒక చోటే కలిసి వుండాలి, ఒకడి మాటే వినాలీ అని సందేశాలిచ్చి ముగిస్తే- మిగిలేది ఈ కథలో లాగే గుండె పోటు మరణాలే.

ఎవరెలా చేశారు
       
హేష్ బాబు ఈ సినిమాలో ఏమీ చేయకపోయినా అలా కన్పిస్తూంటే చాలు,  అదే మహాభాగ్యం అన్నట్టు వుంటుంది అభిమానులకి. అలాటి వాళ్ళకి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అందమైన రాకుమారుడు. ఈ  రాకుమారుడు ఏం చేశాడూ అని మాత్రం చూడకూడదు. రాకుమారుడికి ఏం పనుంటుంది? ఇతరులు చేస్తూంటారు. ఈ రాకుమారుడి తరహా చూసి విసిగి పోయి మొత్తమంతా రావు రమేష్ భుజానే సుకుని చేసుకొచ్చాడు. రాకుమారుడుగా మహేష్ బాబు మాత్రం జస్ట్ అలా మెరిసిపోయే అందచందాలతో, కాస్ట్యూమ్స్ తో, ఓ చిరునవ్వుతో, అలా అలా పాత్రల మధ్య కన్పిస్తూ, ఒక్కో డైలాగు అలా అలా విసురుతూ సరదాగా తిరిగేస్తూంటే, హీరోయిన్లతో కలిసి పాటలు పాడేస్తూంటే చాలు- ఇంతకంటే ఇంకేమీ  చేయనవసరం లేదు. 

        హీరోయిన్లు సమంతా, కాజల్, ప్రణీత లు పాపం తమ పాత్రలతో బాగానే కష్ట పడ్డారు. కాజల్ అగర్వాల్ చివరి సీనులో బెస్ట్ గా నటించి, ఆలోచనాత్మకంగా తన హృదయాన్ని విప్పుతుంది. ఇది ఈ సినిమాకి ల్యాండ్  మార్క్ సీన్. ఇంకో ల్యాండ్ మార్క్ సీన్ దీని తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే రావు రమేష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సీను. ఈ రెండూ తప్ప ఇంకో ఎమోషనల్ సీను వుంటే ఒట్టు. 

        సమంత కి కూడా ఒక చక్కటి పాత్ర చిత్రణ వుంది-యాసలో చెప్తే తప్ప వర్కౌట్ కాదన్న ఊత పదంతో. ప్రణీతదే నిర్లక్ష్యం చేసిన పాత్ర.  ఇంట్లో మరదలు ప్రణీతని ఉంచుకుని తడవకో పరాయి అమ్మాయి వెంట పడతాడు మహేష్. ప్రణీతని బాధ పెట్టడం ఆ ఉమ్మడి కుటుంబపు ఆనందాల్లో భాగమా? 

        సహాయ పాత్రలు లెక్కకి మించి వున్నాయి. విచిత్ర మేమిటంటే ఏ సంబరంలో చూసినా బృందాలుగా ఆడవాళ్లే. మహేష్ బాబు తప్ప ఇంకో మగాపిల్లాడే పుట్టలేదా ఆ కుటుంబాల్లో? కనీసం అతడికి ఫ్రెండ్స్ కూడా లేరా? ప్రతీ గ్రూప్ డాన్సుల్లో కూడా మొత్తం ఆడవాళ్ళేనా? విజయవాడలో మగకుర్రాళ్ళే లేరా?

        ఒక్క రావురమేష్ తో పాటు సత్య రాజ్  మాత్రమే - వాళ్ళు పడే సంఘర్షణతో గుర్తుండిపోయే పాత్రధారులుగా మిగిలిపోతారు. 

        మిక్కీ జే మేయర్ పాటలు టైటిల్ ని ఎలివేట్ చేసేట్టు లేవు. రత్నవేలు ఛాయాగ్రహణం, ఇతర అన్ని సాంకేతిక విలువలూ ఉన్నతంగా వున్నాయి. డబ్బు వ్యయం చేస్తే ఎంత గొప్ప సాంకేతిక విలువలైనా దక్కొచ్చు- కానీ ఎంత డబ్బు వ్యయం చేసినా ఆ సాంకేతిక విలువలతో సరితూగే స్క్రిప్టు దక్కడం లేదే? 

చివరి కేమిటి?
       
హేష్ బాబు అందచందాల కోసం చూడొచ్చు. అదే బ్రహ్మోత్సవం. అంతకంటే ఆశిస్తే ఆశాభంగం తప్పదు. ఫస్టాఫ్ మొదటి అరగంట లోనే నాల్గు పాటలు  వస్తాయి. సెకండాఫ్ లో ఒకే ఒక్క చిన్న ఫైట్ వుంటుంది. కమెడియన్లు లేరు, సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ తప్ప. ఇంటర్వెల్లో  తండ్రి చనిపోయాక, తండ్రి కోరిక ప్రకారం  ఏడుతరాల బంధువులని ఒక దగ్గర చేర్చేందుకు మహేష్ బాబు వివిధ నగరాలు తిరిగే దృశ్యాలతో వేరే దోవ పడుతుంది కథ. అసలు రావురమేష్ గొడవ పడి  విడిపోవడానికి కారకులే సత్య రాజ్, మహేష్ బాబులు. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అడగలేక పోతున్నాడనీ తెలిసీ సత్యరాజ్ మౌనం దాల్చడం ఒక తప్పు, కాజల్ అగర్వాల్ ని ముద్దు పెట్టుకున్న దృశ్యాన్ని అపార్ధం జేసుకున్నావనీ, ఆమెతో తను  విడిపోయాడనీ రావురమేష్ కి మహేష్ బాబు చెప్పక పోవడం రెండో తప్పు. తండ్రీ కొడుకులే రావురమేష్ గొడవ పడి విడిపోవడానికి కారకులయ్యారు తప్ప మరోటి కాదు. అలాంటప్పుడు తప్పు తెలుసుకుని రావు రమేష్ ని కలుపుకోవాల్సింది పోయి,  ఎక్కడో ఏడుతరాల బంధువుల్ని కలపడం కోసం తిరగడం ఏం కథో! ఈ బంధువులకోసం తిరిగే నలభై నిమిషాలూ నిద్రపోయినా నష్టం లేదు. 

        ఫిలాసఫీతో కూడిన డైలాగులు చాలా  చోట్ల అర్ధం గావు. ఏం చెప్పాడా అని ఆలోచించుకునే లోగా మరో  డైలాగు వచ్చేస్తుంది. దర్శకుడు ఈ కథని సీరియస్ గా తీసుకుని వేదాంత ధోరణిలో చాలా స్లోగా, బరువుగా చెప్పుకొస్తాడు- తన సొంత డైరీ రాసుకుంటున్నట్టు. ముగింపు మీద కూడా ఆశ పెట్టుకో నక్కరలేదు. కేవలం మహేష్ బాబు గ్లామర్ ప్రదర్శన కోసమైతే వెంటనే చూడొచ్చు - ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు తెరపైకి ఎప్పుడొస్తాడో!


       ఇంకోసారి ‘దేవుడు చేసిన మనుషులు’ చూసేందుకు ప్రేరేపించే బ్రహ్మోత్సవం ఇది.



-సికిందర్


Monday, May 16, 2016

స్క్రీన్ ప్లే సంగతులు -3








క్స్ పొజిషన్ –వివరణ అనేది స్క్రీన్ ప్లేకి బద్ధ శత్రువు లాంటిది. ఒక పాత్ర గురించో, జరిగిపోయిన సంఘటనల గురించో తెలియ జేయడానికి క్లాస్ రూమ్ పాఠం లాగా ఇంకో పాత్ర వచ్చి చెబుతూ పోతూంటే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఇందుకే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ తొమ్మిది నిమిషాలూ సినిమా చూస్తున్నట్టు గాక, న్యూస్ రీల్ చూస్తున్నట్టు వుంటుంది. అయితే వివరణ ఇవ్వాల్సి వస్తే,  ఇలా పాఠంలా చెప్పకుండా, సినిమా కళలో కలిసిపోయే నాటకీయ ప్రక్రియతో చెప్తే స్క్రీన్ ప్లే శిల్పం దెబ్బ తినదు. ఐతే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ లో,  కథతో సంబంధం లేని అంశాలతో ఆ సుదీర్ఘ ఉపన్యాసం అవసరమే లేదన్నది వేరే విషయం. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎక్స్ పొజిషన్ తో ఈ బిగినింగ్ విభాగం ముగిశాకా, మిడిల్ విభాగం మొదలవగానే  మళ్ళీ  విలన్ గురించి ఇంకో  చాంతాడంత డాక్యుమెంటరీ మొదలవుతుంది. ఈ ఎక్స్ పొజిషన్  అక్షరాలా ఆరు నిమిషాలు వుంటుంది!
No rules please,
Rules are for fools!

       ఒకవేళ విలన్ అభిమన్యు చరిత్రని  ఎక్స్ పొజిషన్ తో చెప్పాల్సే వస్తే, 1972 లో ‘గాడ్ ఫాదర్’ లో అనుసరించిన పద్ధతిని పాటించాల్సింది. సినిమా ప్రారంభంలోనే గాడ్ ఫాదర్ కూతురి  పెళ్లి  వేడుకల్లో  గాడ్ ఫాదర్ కుటుంబానికి ఎంత భయానక మాఫియా చరిత్ర వుందో ఒకటిన్నర నిమిషాల్లో నాటకీయంగా ఒక సన్నివేశం కల్పించడం ద్వారా విజువల్ గా చూపించేస్తారు -  అదీ నిలిచిపోయే సినిమాటిక్ కళ అంటే!

      మిడిల్ : మిడిల్ అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర  గుర్తించిన సమస్యతో/ శత్రువుతో హీరో ఎదుర్కొనే  సంఘర్షణ. పడుతూ లేస్తూ సాగించే ప్రయాణం. చివర్లో పరిష్కార మార్గం కనుగొనడం.
 
        ప్లాట్ పాయింట్ వన్ తో ఏం చేసుకోవాలో ఎటూ తెల్చుకోలేకపోయిన మిత్రన్,  దాన్నలా అసంపూర్ణంగా వదిలేసి, బైపాస్ రోడ్లో మిడిల్లోకి ఎంటరవాలని ట్రై చేస్తాడు, కానీ ఒక టోల్ గేట్ దగ్గర దొరికిపోతాడు. స్క్రీన్ ప్లే కి ఈ ప్లాట్ పాయింట్ వన్ ని కనిపెట్టిందెవరా అన్నదే అతడి బాధ. దీంతో లేనిపోని చావొచ్చింది. ఈ మిడిల్లో అసలు తన సమస్య ఏమిటో, ఎవరితో పోరాడాలో ఇంకా స్పష్టత లేదు. ఇలాటి కథనం ఇంకే సినిమాలోనూ చూసి వుండం బహుశా. చీకట్లో రాయి విసిరి చూద్దా మన్నట్టు- ఎవరో మైన్స్ మాఫియా చెల్లదురైని కనిపెట్టాలనుకుంటాడు. పట్ట పగలు వెంబడిస్తాడు. రాత్రి పూటే పోలీస్ అకాడెమీ క్యాంపస్ నుంచి ఎలా జారుకుంటున్నాడనే ప్రశ్న ఉండగానే, ఇప్పుడు పట్ట పగలు  ట్రైనింగ్ కి హాజరవకుండా ఎలా  నగరంలో కొలీగ్స్ ని వెంటేసుకుని యధేచ్చగా సంచరిస్తున్నాడన్న ఇంకో ప్రశ్న లేవనెత్తుతాడు.

                                                ***
        మూస ఫార్ములా కథ సహేతుకంగా, హేతుబద్దంగా వుండాలని లేదు. కానీ పోలీస్ ప్రొసీజురల్- ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ లాజికల్ గా ఉండి తీరాల్సిందే. ఒక వాస్తవం చెప్పుకుంటే, మిగతా అన్ని రకాల కథల కన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కథలు రాసుకోవడం అందరి వల్లా కాదు. మూస ఫార్ములా మైండ్ సెట్ వదులుకుని, దర్శకుడు మరింత ప్రొఫెషనల్ గా మారి, తనలోంచి పక్కా క్రైం ఫిక్షన్  రైటర్ తొంగి చూసేలా చూసుకోవాల్సిందే. లేకపోతే హాస్యాస్పదంగా తయారవుతుంది. ఇలాటి సినిమాలకన్నా సోనీ టీవీలో గత 19 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ సిరీస్  సీఐడీచూసుకోవడం ఉత్తమం. శివాజీ  సతమ్ నేతృత్వంలో సీఐడీ టీమ్ చేసే నేరపరిశోధనలు చాలా రియలిస్టిక్ గా, విజ్ఞాన దాయకంగా వుంటాయి. 
                                                ***


        మిత్రన్ అలా చెల్లదురైని వెంబడించి వెళ్తే, చల్లదురై మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్ ని కలుసుకుని ఇద్దరూ కలిసి  సైంటిస్టు అభిమన్యు దగ్గరికి వెళ్తారు. అక్కడ అశోక్ పాండియన్, పెరుమాళ్ స్వామి కలుస్తారు. నల్గురూ కలిసి అభిమన్యు దగ్గరికి వెళ్తారు. ఇలా ఇప్పుడు మాత్రమే విలన్ గా వున్న అభిమన్యు ని చూడగల్గుతాడు మిత్రన్!

        ఈ ఏర్పాటు  ఎంత మభ్య పెట్టే  విధంగా వుందో చూద్దాం- 

        చెల్లదురై  మైన్స్ మాఫియా. రేపు మైన్స్ తనిఖీ జరక్కుండా ఆపాలని తన సిండికేట్ లో భాగస్థుడైన మంత్రి సెంగల్వ రాయన్ ని కలిశాడు. అప్పుడు సింపుల్ గా మైన్స్ మంత్రి సెంగల్వ రాయనే ఆదేశాలిస్తే తనిఖీలు ఆగిపోతాయి కదా? ఇద్దరూ కలిసి  అభిమన్యు దగ్గరి కొచ్చి చెప్పుకోవడమెందుకూ!!

        అంటే మిత్రన్ కి విలన్ అభిమన్యు గురించి తెలియాలంటే ఎట్లా అని దర్శకుడు ఆ లోచించి, ఈ అర్ధం లేని కథనం చేశాడన్నమాట.  
    
        ఇలా అర్ధరహితంగా  సెంగల్వ రాయన్, చెల్లదురైలు విలన్ అభిమన్యు దగ్గరికి పోతే- అర్జెంటుగా ఒక విలన్ అవసరమున్న మిత్రన్ చీకట్లో రాయి వేస్తూ వీళ్ళ వెంటపడి పోతాడు. అప్పుడే చూడగల్గుతాడు విలన్ని! అంతకాలం తను అంత రీసెర్చ్ చేస్తూంటే నగరంలోనే ఉంటున్న అభిమన్యు గురించి ఇప్పుడే తెలియడ మేమిటి
? మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ మీద నైట్ క్లబ్ నాడే కన్నేసి వుంటే,  అభిమన్యు ఎప్పుడో తెలిసిపోయేవాడు కదా!  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా తన కథకి విలన్ ఎవరో తెలియని దౌర్భాగ్యం ఏర్పడేది కాదు కదా? ఒక ఐపీఎస్ కి ఉండాల్సిన  లోచనా సరళి ఇది కాదు కదా? ఈ పాత్ర దర్శకుణ్ణి/కథకుణ్ణి మించిపోయి వుండాలికదా? 

        మిత్రన్ సైంటిస్టు అభిమన్యు ని చూశాక  స్క్రీన్ ప్లేలో ఇంకో తప్పు జరిగిపోతుంది. మళ్ళీ ఆరు నిమిషాలపాటు అభిమన్యు పరిచయ డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది. మిత్రన్ ఇంకో వ్యక్తిని కలుస్తాడు. ఆవ్యక్తి చిన్నప్పటి పళని గురించి చెప్తాడు. పళనీయే ఈ అభిమన్యు అని చెప్పి, ఇప్పుడు మంత్రిగా వున్న సెం గల్వ రాయన్ కొడుకే అని చెప్పి, ఆనాడు ఇతను జైలు నించి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి సైంటిస్టు  అయ్యాడనీ చెప్పి,  పద్మశ్రీ అవార్డు  కూడా పుచ్చుకున్నాడనీ కూడా చెప్పి- ఎలా క్లిప్పింగ్స్ తో వివరణ ఇస్తారు. 
       
        ఇలా ఈ ఆరు నిమిషాలతో పాటు, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తొమ్మిది నిమిషాలూ  కలుపుకుని  ఎకబిగిన మొత్తం 15 నిమిషాలూ అసలు కథలోకి వెళ్ళకుండా, స్క్రీన్ టైముని తినేస్తూ, కార్యకారణ సంబంధాల వివరణ లిచ్చుకోవడంతోనే సరిపోతుంది. 

       
 ఐనప్పటికీ ఇతనే నా విలన్ అని ఇప్పుడు కూడా   నిర్ణయించుకోడు మిత్రన్! విలన్ ఎవరో ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిపోయి వాళ్ళు చాలా ముందుంటే, మిత్రన్ ఇంకా నసుగుతూ వెనకబడి ఉంటాడు. ఈ ఫటాఫట్ కాలంలో యాక్షన్ మూవీకి డైనమిక్స్ కూడా అక్కర్లేదేమో!

        ఇక్కడ మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ యాంజలీనా గురించి చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చే డిసెంబర్ పది తనకి ఇంపార్టెంట్ తేదీ అని చెప్తాడు విలన్ అభిమన్యు. ఆ రోజు  ఫారిన్ నుంచి ఒప్పందం కోసం వస్తున్న  స్విస్ ఫార్మా కంపెనీ యజమానురాలు యాంజలీనాని చంపేస్తానని నర్మగర్భంగా అంటాడు. కళ్ళెదుటే ఇంత ఎవిడెన్స్ ని మిత్రన్ వెంటనే సెల్ ఫోన్లో  చిత్రీకరించాలనుకోడు!  చిత్రీకరించి అప్పుడే టెలికాస్ట్ చేయించి వుంటే అభిమన్యు ఖేల్ ఖతం - దుకాన్ బంద్ అయిపోయేది కదా? యాంజలీనా జీవించి వుండేది కదా!

        మిత్రన్ రూమ్  నిండా పెట్టుకున్నది పాసివ్ గా సేకరించిన క్లిప్పింగ్సే, ఫోటోలే, డేటానే. ఎక్కడా తను స్వయంగా కనిపెట్టి లైవ్ గా సేకరించిన సమాచారం లేదు. స్టింగ్ ఆపరేషన్ లేదు. జీవితంలో ఫస్ట్ టైమ్ లైవ్ గా చూస్తున్న ఇప్పటి విషయాన్నికూడా  వెంటనే రికార్డు చేయాలనీ అనుకోడు! కళ్ళప్పగించి చూస్తూంటాడు. 

        ఇక్కడే ఇప్పుడే పట్టుకుంటే, ఇంకో గంట సేపున్న సినిమా అప్పుడే ముగించెయ్యలా అని నిలదీయవచ్చు-  అలాంటప్పుడు ఈ సీన్లో మిత్రన్ వుండనే కూడదు
, వుంటే ఆటోమేటిగ్గా నెక్స్ట్ కథ ముగిసిపోయే సీనే వస్తుంది, దేవుడు కూడా ఆపలేడు!

        ఎప్పుడైతే కథకుడు కథ నడిపిస్తాడో ఇలాటి గోతులే ఎదురవుతాయి. ఎప్పుడైతే కథానాయకుడు కథ నడిపిస్తాడో గోతులుండవు- గంగోత్రిలా పారిస్తూంటాడు కథని గలగలా...  

        అడుగడుగునా విఫలమయ్యే ఈ కథానాయక పాత్ర, కథకుడు కథ నడపడం వల్ల అన్యాయమైపోయిన కనిపించని పాసివ్ పాత్ర. 

                                                         ***
       ఇదే సీన్లో విలన్ అభిమన్యు ఒక ఘోరానికి పాల్పడతాడు. చెల్లదురై సమస్య తెలుసుకుని,  మెషిన్  తీసుకుని ఒక అనుచరుడి గొంతు మీద ఏదో చెక్కేస్తూంటాడు. ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వెంటనే ముందుకు దూకి ఈ దుష్కృత్యాన్ని ఆపాలి మిత్రన్ నిజానికి!  అక్కడికక్కడే హత్యాయత్నం నేరం మీద  అభిమాన్యుని అరెస్ట్ చేయించాలి, బాధితుణ్ణి హాస్పిటల్ కి తరలించాలి. 

        ఇది కూడా చెయ్యకుండా చూస్తూంటాడు నక్కి. అది చేతకాకపోతే కనీసం సెల్ ఫోన్లోనైనా చిత్రీ కరించాలి. ఈ పని ఇప్పుడు కూడా చేయాలనుకోడు! ఇవన్నీ చేస్తే సినిమా ఇప్పుడే ముగిసిపోతుంది కదయ్యా అని ఈసారి అడ్డుతగుల్తున్న ఈ వ్యాసకర్తని కొట్టొచ్చుకూడా  మిత్రన్. 

        ఇలాటి తను సమఉజ్జీ అయిన శత్రువుని ఎలా కోరుకుంటాడు?

        దీంతో అయిపోలేదు- ఇదే సీన్లో ఇంకోటి కూడా వుంది. అభిమన్యు ప్రయోగ శాల ఓపెన్  అవుతుంది. ఇక్కడ ఒక పసిపిల్లాడికి డయాబెటిస్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రయోగాలు చేస్తూంటాడు. ఇది కూడా బొమ్మలా నిలబడి చూస్తాడు ఐపీఎస్ ట్రైనీ మిత్రన్!

        నాజీవితంలో ఏం జరుగుతోంది? అశోక్ పాండియన్, ఛార్లెస్ చెల్లదురై, పెరుమాళ్ స్వామి –ఈ ముగ్గుర్లో నాకు సరైన శత్రువు ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుందామంటే, అభిమన్యు తెరపైకి వచ్చాడే- అని కోలీగ్ దగ్గర వాపోతాడు మిత్రన్. 

         అసలు ఈ ముగుర్లో ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుంటాననే గొడవేంటి? సంఘ శ్రేయస్సు కోసం ముగ్గురి అంతూ చూడాలి. ఇలాకాక తన బలప్రదర్శన కోసమే అన్నట్టు  సమఉజ్జీ ఒక్కడు కావాలంటాడేమిటి? 

        ఇంతకీ విలన్ అభిమన్యు అనుచరుడి గొంతు మీద ఏం చెక్కాడు, ఎందుకు చె క్కాడూ అంటే- అదో గొప్ప మేధావి తనంతో కూడిన మాస్టర్ ప్లాన్!

        ఇది  కూడా ఎంత అర్ధరహితంగా వుంటుందో చూద్దాం. దీని తర్వాత ఒక సభలో ప్రసంగిస్తూంటాడు అభిమన్యూ. షరా మామూలుగా అక్కడి కెళ్ళి అతన్ని చూస్తూంటాడు మిత్రన్. అంటే ఇంకా ఇతనే తన విలన్ అని డిసైడ్  చేసుకోలేదన్న మాట. ఈ సభలో అభిమన్యు నిన్న మధురై  లో జరిగిన కులఘర్షణలని ప్రస్తావించి హిత బోధ చేస్తూంటాడు. మిత్రన్ తన కొలీగ్ తో చెప్తాడు ఆ కులఘర్షణలకి వీడే కారకుడని. వెంటనే నిన్నటి న్యూస్ కటింగ్స్ పడతాయి. అంటే ఇంకో ఎక్స్ పొజిషన్ అన్నమాట! అభిమన్యు అనుచరుడి గొంతు మీద కులం పేరు చెక్కడం వల్ల – మధురైలో కులఘర్షణలు చెలరేగాయనీ, పథకం ప్రకారమే ఇది చేశాడనీ, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ఘర్షణలు  ఆపడంలో నికి బిజీ  అయిపోయి, చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళ లేకపోయారనీ, అలా తనిఖీని అడ్డుకున్నాడనీ ఇంకో బారెడు ఎక్స్ పొజిషన్!

        1. కులఘర్షణలు మైన్స్ వున్న మధురైలోనే జరుగుతాయని అభిమన్యు ఎలా ఊహించాడు?
        2. అది శాంతి భద్రతల సమస్య. దాంతో గనుల శాఖాధి కార్లకేం పని -వాళ్ళు కూడా ఘర్షణలని  ఆపడానికి బిజీ అయిపోవడానికి?
        3. గొంతు చెక్కుతూంటే కళ్ళారా  చూసిన మిత్రన్ అప్పుడే అడ్డుకుని వుంటే కుల ఘర్షణనలే జరిగేవి కాదు కదా?
        4. ఇప్పుడేదో ఘనకార్యం చేసినట్టు క్లిప్పింగ్స్ చూపిస్తూ ఇంకో లెక్చర్ ఇస్తాడేమిటి?
        5. ఒకవేళ వుంటే అసలిది బిగినింగ్ విభాగంలో ఉండాల్సిన కథనమా, మిడిల్ లో వుండే కథనమా?
        6. స్ట్రక్చర్ కూడా అవసరం లేదనుకోవడం నేటి ఫటాఫట్ సినిమాల కొత్త రూలా?

                                                ***
         ఇన్ని ఘోరాలు చూశాక హమ్మయ్యా అని ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో ఆ రానున్న డిసెంబర్ పదిని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  ప్రతిన బూనుతాడు మిత్రన్!

        ఇక్కడ ఒక సందేహం రావచ్చు.  మిత్రన్ కి తన శత్రువెవరో నిర్ణయమై, గోల్ ఏర్పడింది ఇక్కడే గనుక, ఇదే ప్లాట్ పాయింట్ వన్ ఎందుకు కాకూడదూ అని.

        1. ఎప్పుడైనా బిగినింగ్ లో ఒక సెటప్ ఏర్పాటు చేశాక  దాన్ని పే ఆఫ్ చేస్తున్నప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది.
        2. ‘శివ’ లో నాగార్జున జేడీ అగడాల్ని చూసీ చూసీ (సెటప్),  ఇక తిరగబడి అతణ్ణి కొట్టేశాక (పే- ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, గోల్ ఏర్పడుతుంది.
        3. ‘24’ లో గడియారమున్న తెరచుకోని పెట్టెని రకరకాల పనిముట్టుగా అటు విసిరి ఇటు విసరీ వాడుకున్నాక (సెటప్), దాని తాళం చెవి దొరికి తెరవడంతో (పే-ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి,  చిన్న సూర్యకి గోల్ ఏర్పడుతుంది.
        4. ఇలాగే ‘తని ఒరువన్’ లో కూడా రాత్రి పూట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడప్పుడు కొలీగ్స్ అడగడం  (సెటప్),  ఒక తప్పనిసరి పరిస్థితిలో మిత్రన్ వాళ్ళని తన గదికి తీసికెళ్ళి తన రీసెర్చి ప్రపంచాన్ని చూపడం ( పే- ఆఫ్ ) తో అక్కడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది. ఇది తెలుసుకోక పోవడంవల్ల గోల్ ఏర్పడక స్ట్రక్చర్ చెదిరిపోయింది.
       
5. సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుందో గుర్తించాలంటే సెటప్ ని ఫాలో అవుతూంటే చాలు, అది పే- ఆఫ్ అయ్యే సీనే ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది.

        స్ట్రక్చర్ చెదిరి పోవడం వల్ల, విషయంకన్నా వివరణలు ఇచ్చుకోవడం ఎక్కువై పోవడంవల్లా, ఈ  సినిమా నిడివి రెండు గంటలా 40 నిమిషాలకి చేరింది. ఇంకా మున్ముందు కూడా వివరణలున్నాయి. మొత్తం కలుపుకుని 20 నిమిషాలకి పైగా ఇలా  అసందర్భ, అనవసర  ప్రేలాపనే  వుంది. ఇది తీసేస్తే రెండు గంటలా 20 నిమిషాలకి నిడివి తగ్గుతుంది.

                                                ***
        ఇప్పుడు మిత్రన్ కి అభిమన్యు ముఖాముఖీ అవుతాడు- మిత్రన్ ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. అతన్నుంచి మెడల్ అందుకుంటాడు. అభిమన్యు అందించే  ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని అందుకుంటాడు మిత్రన్. అది సర్వీస్ వెపన్. ఇక్కడే  కథా సౌలభ్యం కోసం ఒక గిమ్మిక్కు చేస్తాడు దర్శకుడు. మిత్రన్ ఈ సీనులో చేతులకి గ్లవ్స్ తొడుక్కుని ఉంటాడు. ఇంకే ట్రైనీ కూడా అలా వుండడు. ఇలా ఎందుకు జరిగిందో ముందు ముందు  రాబోయే సీన్లో మనం తెలుసుకుని తెల్లమొహం వేద్దాం...

        మిత్రన్ ఇక ఏఎస్పీగా జాయినవుతాడు (జిల్లాల్లోలాగా నగరాల్లో ఎస్పీ వ్యవస్థ వుండదు, పోలీస్ కమీషనరేట్ వ్యవస్థ వుంటుంది. ఈ వ్యవస్థలో ఏఎస్పీ పోస్టు వుండదు, ఏసిపి పోస్టు వుంటుంది). ఏఎస్పీగా జాయినవుతూనే పెద్ద చర్య తీసుకుంటాడు( కొత్తగా ఏఎస్పీ అనేది ప్రొబేషనరీ పోస్టు, స్వయంగా చర్యలు తీసుకోలేడు). అదేమిటంటే, అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్థంభింపజేయడం. వీళ్ళు తమ
ఖాతాల్లోంచి
  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడుదీనిగురించిన సమాచార సేకరణతో మరి కొన్ని క్లిప్పింగ్స్ హడావిడి చేస్తాయి. మలేషియా బ్యాంకు  అధికారిణి  కూడా మిత్రన్ కి సమాచారం ఇచ్చేసి, మీరు వొత్తిడి చేశారు గనుక చెప్పేశానంటుంది, ఓహ్ గాడ్!!

        ఇక్కడ అస్సలు అర్ధం కానిదేమిటంటే, 7.5 బిలియన్ డాలర్లంటే మామూలు మొత్తం కాదు. అంత భారీ కంటే భారీ మొత్తం వైట్ లో అశోక్ పాండియన్, చెల్లదురై, పేరుమాళ్ స్వామీల ఖాతాల్లో వుండడం అసంభవం. వుంటే వాళ్ళ దగ్గర అంత మొత్తంలో నల్ల ధనమే వుండి, ఏ స్విస్ బ్యాంకు ఖాతల్లోనో వుండాలి!  దర్శకుడు ఎలా తోస్తే అలా కథ రాసేశాడు ఏం చేస్తాం!

        రోహిత్ శెట్టి తీసే భారీ కమర్షియల్ యాక్షన్ సినిమాలు అర్ధంపర్ధం లేకపోయినా, మనం కాసేపు మెదడు ఇంటి దగ్గర వదిలేసి ఎంజాయ్ చేసి రాగలం. అవి ఫుల్ మజా నిస్తాయి. కానీ ఒక ‘తని ఒరువన్’ లాంటి మెథడాలాజికల్ కథ ఇంత తప్పులతడకలా వుంటే ఎలా ఎంజాయ్ చేయగలం.

        ఇక ఎప్పుడెప్పుడా అని అరగంట నుంచీ ఎదురు చూస్తున్న యాక్షన్ రానే వస్తుంది. ఇది కూడా ఎలా వుందో చూద్దాం- 

        ఫారిన్ నుంచి
యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు మిత్రన్. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. స్టోరీ పాయింటు జనెరిక్ మందుల ప్రస్తావనే వుండదు. మిత్రన్ ఇక్కడి పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని తనకి డబుల్ గా తన గర్ల్ ఫ్రెండ్ మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు. ఐపీఎస్ తెలివితేటలు ఇంత హీనంగా ఉంటాయా? 

        కారులో  యాంజలీనా బదులు మహిమని ఎక్కించి శత్రువుల్ని ఏమార్చడం మామూలు పరిస్థితుల్లోనైతే ఓకే.  కానీ ఈ కారే  యాంజలీనా వున్న కారనుకుని శత్రువులు ఫాలో మాత్రమే కారు, ఆమె ప్రభుత్వంతో సమావేశ స్థలానికి చేరేలోపే లేపేసే పక్కా ప్లాన్ తో వున్నారు. ఈ సంగతి మిత్రన్ కి తెలుసు. మరి తెలిసికూడా ఆ ఎటాక్ జరిగే పరిస్థితిలోకి మహిమని ఎలా నెడుతున్నాడు? మహిమ చచ్చిపోయినా తన క్కావాల్సింది వేరే కార్లో వేరే రూట్లో యాంజలీనా క్షేమంగా చేరడమా?
 

        అనుకున్నట్టే ఎటాక్ జరుగుతుంది. కారద్దం పగిలి వెంట్రుక వాసిలో మహిమ తల పక్కనుంచి దూసుకుపోతుంది బుల్లెట్. ఆమె పడిపోతుంది. ఫాలో అవుతున్న మిత్రన్ అప్పుడు  ఎలర్ట్ అయి, దుండగుల మీద కాల్పులు జరిపి మహిమని కాపాడుకుంటాడు. ఆమె బుల్లెట్ తగిలి చచ్చిపోయి వుంటే? దీన్నెలా నివారించగలననుకున్నాడు? ఇదేం పోలీస్ సీక్రెట్ ఆపరేషన్? 

                                               
***

         మొత్తం మీద కథ ఇప్పుడు గాడిలో పడినట్టు వుంటుంది. మిడిల్ బిజినెస్ ప్రకారం హీరో విలన్ల మధ్య యాక్షన్ రియాక్షన్ ల సంకులసమరం మొదలై – ఈ గంటా ఐదవ నిమిషం దగ్గర నుంచీ మొదలై, గంటా 50 వ నిమిషం వరకూ ముప్పావు గంట సేపూ ఈ యాక్షన్ ట్రాక్ ఒక్కటే ఈ స్క్రీన్ ప్లేకి బలంగా వుంటుంది. ఫస్టాఫ్ లో 49 వ నిమిషంలో మొదలయ్యే మిడిల్ విభాగం, సెకండాఫ్ లో గంటా 50 వ నిమిషం దగ్గర ముగుస్తుంది. అంటే సుమారు గంట సేపన్న మాట. ఈ గంట సేపట్లో పైన చెప్పుకున్న ముప్పావు గంటే  బలం. మొత్తం రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో ముప్పావు గంట సేపే ఈ  స్క్రీన్ ప్లే బలంగా ఉంటుందన్న మాట. లెక్కకైతే  రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో 50 శాతం, అంటే గంటా 20 నిమిషాలూ మిడిల్ విభాగం కొనసాగి బలంగా వుండాలి. 49 నిమిషాలు బిగినింగ్ కి పోగా, 60 నిమిషాలూ మిడిల్ కి పోయి, మిగిలిన 51 నిమిషాలూ ఎండ్ విభాగం సాగుతుందన్న మాట! ఇంత బారెడు ఎండ్ విభాగం ఎక్కడా వుండదు. అయితే ఇది కూడా బలహీనమే. ఒక్క మిడిల్లో 45 నిమిషాలే ఈ స్క్రీన్ ప్లే బలంగా వుంటుంది.  ఎందుకని? సౌజన్యం : కొరియన్ మూవీ ‘ఐ సా ది డెవిల్’!

        ‘ఐ సా ది డెవిల్’ ట్రాక్ ఒక్కటే ఆ 45 నిమిషాల బలం. ఇదికూడా లేకుండా ఈ 45  నిమిషాల కథనూ దర్శకుడే స్వయంగా తాయారు చేసుకుని వుంటే ఎలా ఉండేదో, ఇంతవరకూ చేసుకొచ్చిన ఈ పోస్ట్ మార్టమే చెప్తుంది. ఈ కొరియన్ ట్రాక్ తో మిడిల్ ముగియగానే, మళ్ళీ సొంత సృష్టితో దర్శకుడి ఎండ్ విభాగం ఇంకా గందరగోళం! 
                                                  ***
        అభిమన్యు తాను చేయించింది మహిమ మీద ఎటాక్ అని తెలుసుకోవడంతో ఈ సారి మిత్రన్ ని బాగా ఏమార్చి, హోటల్ గదిలోనే అతడి కళ్ళెదుటే యాంజలీనాని చంపిం చేస్తాడు. గాయపడ్డ మిత్రన్ ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరతాడు. ఇప్పుడే మిత్రన్ ఇన్వాల్వ్ మెంటు గురుంచి తెలుసుకున్న అభిమాన్యు మిత్రన్ గది కెళ్ళి వ్యవహారమంతా చూస్తాడు. అక్కడే గోడకున్న 2011 నాటి మిస్ ఇండియా ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ మొహం మీద కసితో పిన్ గుచ్చుతాడు. ఈ మిస్ ఇండియా ఫోటో మిత్రన్ ఎందుకు పెట్టుకున్నాడు? అభిమన్యు వస్తాడనీ, వస్తే పిన్ను గుచ్చి పోవాలనా!
         అబిమన్యుకి వొళ్ళు మండిపోయి, ఒక బగ్ ని ఆపరేషన్ చేస్తున్న మిత్రన్ ఛాతీలో అమర్చమని ఇచ్చి వెళ్ళిపోతాడు.. అప్పట్నుంచీ ఆ బగ్ ద్వారా మిత్రన్ ఏమేం చేస్తున్నాడో, చేయబోతున్నాడో అన్నీ తెలుసుకుంటూ ఆ ప్లాన్స్ ని తిప్పి కొడుతూంటాడు.  ఇద్దరి మధ్య ఈ ట్రాక్ ఆసక్తి రేపుతూ సాగుతూంటుంది.
        ఇందులోంచి మళ్ళీ ఇంకో ట్రాక్ మొదలవుతుంది.
అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 
       
ఈ సంఘటనలతో మిత్రన్ డిస్టర్బ్ అయి తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్లినట్టు అనుమానం వేస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడి సొంత క్రియేషన్ మళ్ళీ జొరబడి అభాసు అవుతుంది. అదేమిటంటే, ఫోటో మీద గుచ్చిన పిన్ను మీద వేలి ముద్రలు తీయాలంటుంది మహిమ. సడెన్ గా ఆమె చేతిలో ఫోరెన్సిక్ కిట్ అంతా వుంటుంది- కంప్యూటర్, సాఫ్ట్ వేర్స్ తో సహా. అసలు ఐపీఎస్సే మానుకున్న ఆమె ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్ అవతార మెత్తుతుంది.  ఐపీఎస్ లకి కూడా ఈ శిక్షణ వుండదు. ఫోరెన్సిక్ సైన్సు సపరేట్ కోర్సు, సపరేట్ కాలేజీలూ, సపరేట్ డిగ్రీలూ. ఐపీఎస్ కూడా మానేసి బలాదూరు తిరుగుతున్న మహిమ,  జమాయించి పిన్ను మీద ఇంత పౌడరు కొట్టిపారేసి, సేల్లోఫేన్ టేప్స్ మీద వేలిముద్రలు ట్రేస్ చేసేస్తుంది. 
        మరి ఇవి అభిమన్యు వేలిముద్రలేనని తెలిసేదెట్లా? అప్పుడు మిత్రన్ కి తన సర్వీస్ వెపన్ వున్న బాక్సు గుర్తు కొస్తుంది. ఈ బాక్సు ఆనాడు అభిమన్యు తనకి బహూకరించిందే. అది తెచ్చి, దీని మీద అభిమన్యు వేలిముద్రలుంటాయనీ, ఇది అందుకున్నప్పుడు తాను చేతులకి గ్లవ్స్ తొడుక్కుని వుండడం వల్ల  తన వేలిముద్రలు పడలేదనీ అంటాడు.  

        1. మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని వున్నాడు కాబట్టి బాక్సు మీద తన వేలి ముద్రలు పడవు సరే, ఆ బాక్సుని మిత్రన్ కి అందించమని అభిమాన్యుకి  ఉన్నతాధికారి అందించాడుగా. అప్పుడా ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా బాక్సు మీద పడతాయిగా. 
ఈ రెండు రకాల వేలిముద్రల్లో ఏదో ఒక టైపు వేలిముద్రలు పిన్ను మీద పడిన వేలిముద్రలతో సరిపోవాలి. అవే అభిమన్యు వేలిముద్రలని ఎలా చెప్పగలరు? ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా అయి ఉండొచ్చుగా? ఉన్నతాధికారి ఇక్కడకొచ్చి పిన్ను ఎందుకు గుచ్చుతాడనా? ఏమో!  సాక్ష్య  నిర్ధారణ డౌట్స్ లేకుండా జరగాలిగా?
        2. ఆ బాక్సు అందుకుంటున్నప్పుడు అసలు మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని ఎందుకున్నాడు? ఫలానా రాబోయే సీన్లో మహిమ వేలిముద్రలు తీస్తున్నప్పుడు ప్రాబ్లం ఉండకుండా అవసరం కాబట్టి, ఇప్పుడు గ్లవ్స్ తొడుక్కోమని దర్శకుడు చెప్పాడా?
        3. ఇంతకాలం ఇంట్లో పెట్టుకున్న ఆ బాక్సుని గ్లవ్స్ తొడుక్కునే హేండిల్ చేస్తున్నాడా?
        4. నడుముకి పెట్టుకుని తిరగాల్సిన అధికారిక సర్వీస్ వెపన్ ని,  పెట్టెలోనే పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడా ఈ అవసరం కోసం?
        దర్శకుణ్ణి నమ్మి బాగానే దెబ్బ తింటున్నాడు మిత్రన్ విచిత్రంగా.

                                                ***

        క ఉన్న ఉపోద్ఘాతాలు చాలనట్టు, మళ్ళీ అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అతడికి ఎప్పుడు ఎలా పడిందని ఇంకో పాఠం మన తలకెక్కించుకోక తప్పదు. ఇక అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేసుకోవడం, అభిమన్యు ఏకకాలంలో మహిమనీ, గర్ల్ ఫ్రెండ్ ని చంపే పథకం వేయడం వగైరా ఇంటరెస్టింగ్ బీట్స్ తో సాగి, చివరికి తన ఛాతీ లోనే బగ్ వుందని మిత్రన్ తెలుసుకోవడంతో ఈ మిడిల్ విభాగం ముగుస్తుంది. బగ్ ఎక్కడుందో తెలిసిందంటే, సమస్యకి పరిష్కార మార్గం దొరికినట్టే. సంఘర్షణల పరంపరలో పరిష్కార మార్గం దొరికిందంటే, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి మిడిల్ ముగిసినట్టే. 

        ఈ మిడిల్లో బగ్ ట్రాకు తప్ప మిగిలినదంతా కథకాదు, కథకి కార్యకారణ వివరణే. ఇంతా చేస్తే మిడిల్ జనెరిక్ మందులనే స్టోరీ పాయింటు మీద కూడా సరీగ్గా నడవదు. మధ్యలో డయాబెటిస్ మందు ప్రయోగాలూ, కనుగొన్న ఆ మందుకోసం హత్యా, దానికి సంబంధించి ఎస్డీ కార్డులో సాక్ష్యమూ... ఇలా పక్కదోవ పట్టడం. అసలు విలన్ గోల్ ఏమిటి? జనెరిక్ మందులు రాకుండా చూడ్డమా, లేక డయాబెటిస్ మందు ఫార్ములా కొట్టేయడమా? హీరో గోల్ ఏమిటి? మెడికల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మైన్స్ మాఫియా, జనేరిక్ మందులు, డయాబెటిస్ మందు ఇవన్నీనా? వీటన్నిటితో  స్టోరీ పాయింటు ఒక కలగూర గంపా? ప్రేక్షకులు ఎవరికేది కావాలో అది ఎంపిక చేసుకుని దాని కథ చూడాలా? ఒక కథ ఒక పాయింటు మీద నడిచే కాలం పోయిందా? రేపు హీరోయిన్ ని ప్రేమించిన హీరో, ఎలా పెళ్లి చేసుకుంటాడనే పాయింటు లేవనెత్తి ,దాన్ని వదిలేసి –ఇప్పుడు సెకండ్ హీరోయిన్ని ఎలాప్రేమిస్తాడో చూడమని ఇంకో పాయింటు ఎత్తుకునే సినిమలొస్తాయా?


  (Next : ఎండ్ కి టెండర్ )

 -సికిందర్