రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మే 2016, సోమవారం

జానర్ మర్యాద గురించి మరొక్కసారి - 2


  2015 లో తర్వాతి రేంజి హీరోలు 19 మంది - కల్యాణ్ రామ్, గోపీచంద్, రాజశేఖర్, రామ్,  నాగచైతన్య, నాని, అఖిల్, శర్వానంద్, సుధీర్, వరుణ్ తేజ్, అల్లరి నరేష్, విష్ణు, నిఖిల్, సుమంత్ అశ్విన్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నాగశౌర్య, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సత్యకార్తీక్ లూ  కలిసి, హీరోయిన్ అనూష్కా శెట్టి ని కలుపుకుని  36 సినిమాలిచ్చారు. ఇందులో తొమ్మిదింటిని మాత్రమే ఓకే చేశారు ప్రేక్షకులు. మిగతా ఇరవయ్యేడూ వాళ్లకి నచ్చలేదు. 
కంచె, పటాస్, భలే భలే మగాడివోయ్,  ఎవడే సుబ్రహ్మణ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే మంచి రోజు, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మామా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ..ఇవే ప్రేక్షకులకి నచ్చాయి. ఇవన్నీ ఏఏ జానర్ సినిమాలో ఆ జానర్లకి కట్టుబడ్డాయి. వీటిలో కొన్ని పాత్ర చిత్రణల  పరంగా, కథాకథనాల పరంగా లోపాలతో వున్నాయి. రామాయణం చెబుతూ అందులో కొన్ని  లోపాలతో చెప్పినా ఫర్వాలేదుగానీ, భారతం కూడా కలిపి  చెప్పేస్తే  మొత్తం తేడా ఎలా కొడుతుందో, అలా ఫీలవుతున్నారు ప్రేక్షకులు సినిమా జానర్ల నిర్వహణ విషయంలోనూ. అలాగని జానర్ మర్యాదలకి కట్టుబడితే చాలు, ఇక ఎన్ని లోపాలతో నైనా సినిమాలు తీసేయ్యొచ్చని సంబర పడితే కాదు. జానర్ మర్యాదలకి కట్టుబడ్డ మంటే ఎత్తుకున్న జానర్ కథని కలుషితం చెయ్యకుండా చివరంటా చూపించడం మాత్రమే కాదు, ఏ జానర్ కా జానర్ డిమాండ్  చేసే కొన్ని లక్షణాలుంటాయి- వాటిని కూడా ప్రదర్శిస్తేనే మొత్తం కలిపి జానర్ మర్యాద అనే ప్యాకేజీ.          ఉదాహరణకి,  ‘శివం’ అనే సినిమా మాస్ యాక్షన్ జానర్ కి చెందింది. దీన్ని వేరే విజాతి జానర్లతో కలుషితం చేయలేదు. అయినా ప్రేక్షకులు తిరస్కరించారు. కారణం, అది మాస్ యాక్షన్ జానర్ కుండే లక్షణాలని ప్రదర్శించకపోవడమే. స్క్రీన్ ప్లే పరంగా లోపాల మయంగా ఉండడమే. జానర్ మర్యాద అంటే ఆ జానర్ కుండే స్క్రీన్ ప్లే రచన కూడా నన్నమాట. 

2015 లో 27 మీడియం రేంజి సినిమాలూ, ప్రధానంగా జానర్ల పాలన సరీగ్గా లేకే పరాజయాల పాలయ్యాయి.
1. షేర్ : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : సింగిల్ విండో స్కీము
        2. సౌఖ్యం : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : రీసైక్లింగ్ చేసిన అనేక కథలు
3. జిల్ :  జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
4. గడ్డం గ్యాంగ్ : జానర్ : రియలిస్టిక్ క్రైం, జరిగింది : రియలిస్టిక్ అప్రోచ్ లోపించడం
5. పండగ చేస్కో : జానర్ : ఫ్యామిలీ యాక్షన్, జరిగింది : సింగిల్ విండో స్కీము
6. శివం : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
7. దోచేయ్ : న్యూవేవ్ క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా
8. జండాపై కపిరాజు : జానర్ : రాజకీయం, జరిగింది : కాలం చెల్లిన అప్రోచ్  
9. అఖిల్ : జానర్ : సోషియో ఫాంటసీ, చూపించింది : మూస ప్రేమకథ
10. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ : జానర్ : లవ్, జరిగింది : కాలం చెల్లిన కథనం
11. మోసగాళ్ళకు మోసగాడు : జానర్ : క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా  
12. లోఫర్ : మాస్ యాక్షన్, కలిపింది : కాలం చెల్లిన గ్రామకక్షలు
13. బందిపోటు : జానర్ : క్రైం, కలిపింది : పల్లెటూరి రాజకీయాలు
14. జేమ్స్ బాండ్ : జానర్ : క్రైం కామెడీ, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
15. మా. మంచు- అ. కంచు : జానర్ : ఫ్యామిలీ, జరిగింది : ఔట్ డేటెడ్ కామెడీ
16. డైనమైట్ : జానర్: యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
17. సూర్య వర్సెస్ సూర్య : జానర్ : సైన్స్ ఫిక్షన్, చూపించింది : మూస  ప్రేమ
18. శంకరాభరణం : జానర్ : మల్టీ ప్లెక్స్, జరిగింది : సింగిల్ స్క్రీన్ కి విస్తరణ
19. కొలంబస్ : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
20. కేరింత : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
21. రేయ్ : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ తో ఔట్ డేటెడ్ అప్రోచ్
22. అసుర : జానర్ : క్రైం, జరిగింది : మూస ఫార్ములా అప్రోచ్
23. జాదూగాడు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
24. బీరువా : జానర్ : కామెడీ, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
25. టైగర్ : జానర్ : సామాజికం, జరిగింది : యాక్షన్ జానర్ కింద మార్చెయ్యడం
26. సైజ్ జీరో : జానర్ : హెల్త్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
27. టిప్పు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్

***


2015 ప్రత్యేకత ఏమిటంటే, అన్ని రకాల జానర్సూ హిట్ చేశారు ప్రేక్షకులు, అన్ని రకాల జానర్సూ ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. జానర్ నిర్వహణలో తేడా రాకపోతే కంచెలాంటి అపూర్వ ప్రయోగాన్నీ సక్సెస్ చేశారు ప్రేక్షకులు, తేడా వస్తే సైజ్ జీరోఅలాటి అపూర్వ ప్రయోగాన్నీ తిప్పి కొట్టారు.  జానర్  తేడా రాకపోతే  పటాస్ లాంటి పక్కా మాస్ యాక్షన్ జానర్స్ నీ ఇష్టపడ్డారు, తేడా వస్తే సౌఖ్యం’, ‘లోఫర్ల లాంటి జానర్ మర్యాద పాటించని మాస్ యాక్షన్స్ నీ వ్యతిరేకించారు. జానర్ల నిర్వహణలో తేడా రానంత వరకూ ప్రేక్షకులకి ఏ జానర్  సినిమా అయినా ఒకటేననీ, కేవలం మాస్ సినిమాలకే మడి గట్టుక్కూర్చోలేదనీ దీన్ని బట్టి తేలుతోంది. హిట్టయిన స్వామీ రారాలాంటి వ్యూవేవ్ క్రైం ని ఇచ్చిన సుధీర్ వర్మ లాంటి దర్శకుడి దోచేయ్కూడా జానర్  తేడా వచ్చినందుకే నచ్చలేదు ప్రేక్షకులకి. తేడా రాక పోవడం వల్లే  అతడి శైలిలోనే మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య తీసిన భలే మంచిరోజుని దాని జానర్ మర్యాదతో ఆదరించారు ప్రేక్షకులు.

        సినిమాల జయాప జయాల్ని నిర్ణయిస్తున్నవి  క్లాస్- మాస్- ఇంకేదో కొత్త ప్రయోగం కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, హార్రర్, యూత్, బూతు అనే ఎలిమెంట్స్ ఎంతమాత్రం కావనీ,  ఎలిమెంట్ ఏదైనా, జానర్ నిర్వహణలో తేడా రాని  పనితనం  చూపిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనీ, అదే  జానర్ నిర్వహణలో తేడా వస్తే ఎంత పెద్ద స్టార్ నటించిన  సినిమానైనా తిప్పి కొడతారనీ  గత సంవత్సరపు విశ్లేషణ ద్వారా అర్ధం జేసుకోవచ్చు. తేడా కి సంబంధించి  బ్యాలెన్సింగ్ యాక్ట్ ని గనుక సరీగ్గా నిర్వహించుకుంటే తప్ప, సక్సెస్సయ్యే మాటే లేదు.

        సినిమా సక్సెస్ అవడానికి ఒకే  మూసలో పడి  ఒకటే మూస  సినిమాలు ఇంకా తీయడం గాకుండా- ప్రేక్షకులు అంగీకరిస్తున్న వివిధ జానర్ల సినిమాల్లో ఉంటున్న జానర్ లక్షణాలని గుర్తించి, ఆ ప్రకారం పధ్ధతి మార్చుకుంటే తప్ప,  ప్రేక్షకులు సక్సెస్ చేసే మాట పగటి కలే అవుతుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

 ఉదాహరణకి హాలీవుడ్ లో సక్సెస్ కోసం ఒక్కో జానర్  సినిమాకి ఒక్కో పధ్ధతిని  అవలంబిస్తారు.  సైన్స్ ఫిక్షన్  సినిమా అయితే సంబంధిత జానర్  ఎలిమెంట్స్ ని దానికి కలుపుతారు. యాక్షన్ సినిమా అయితే దాని పేస్ (నడక వేగం) ని  దృష్టిలో పెట్టుకుంటారు. ఫ్యామిలీ కథా చిత్రమైతే హృదయాలకి హత్తుకునే డైలాగులమీద మనసు పెడతారు. ఇలా ఏ జానర్ కా జానర్ కుండే ప్రత్యేక లక్షణాలని కలిపి అలరించేందుకు కృషిచేస్తారు. ఇదంతా ఒక శాస్త్రమే వుంది. కానీ శాస్త్రాలు అంతగా అక్కర్లేదుగా మనకి? 

తెలుగు సినిమాల్లో ఎలా మారిపోయిందంటే, సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్తే అన్నట్టు, అన్నిజానర్ల సినిమాలకీ కలిపి ఒకటే రొడ్డకొట్టుడు హీరోల పాత్రలు, ఒకటే రొడ్డకొట్టుడు కథనాలు, ఒకటే రొడ్డ కొట్టుడు కామెడీలు, ఒకటే రొడ్డ కొట్టుడు డైలాగులు, ఒకటే రొడ్డ కొట్టుడు నటనలు, ఒకటే రొడ్డ కొట్టుడు డాన్సులూ ... ఏ జానర్ సినిమా అయినా సరే, ఒకే తేల్ మాలీష్ - బూట్ పాలీష్ అన్నట్టు ఫుట్ పాత్ బిజినెస్. ఇలా ఇంత భావదారిద్ర్యాన్నీ, సృజనాత్మక దివాలాకోరు తనాన్నీ, నైపుణ్య లేమినీ కూడా ఒక ఫ్యాషన్ గానే  బిళ్ళ తగిలించుకుని ఇష్టారాజ్యంగా  సినిమాల్ని చంపేస్తున్నారు. సినిమాల్ని ఏ వెబ్సైటూ చంపడం లేదు. 25-34 ఏజి గ్రూపులో జనాభాలో 34 శాతంగా వుంటున్ననెటిజనులు, వెబ్సైట్ల రాతలు చూడ్డం వల్ల సినిమాలు ఫ్లాప్ అవవు. సినిమాల్ని తీస్తున్న వాళ్ళే  అరకొర జ్ఞానంతో తీసేసి చంపుకుంటున్నారు. కేవలం పది శాతమే హిట్టవుతున్నాయంటే టాలీవుడ్ లో వున్న టాలెంట్ పది శాతమే నని అర్ధం జేసుకోవాలి. మరి మిగతా 90 శాతం..??

 ఇక 2015 లో చిన్నా చితకా రొడ్డ కొట్టుడు సినిమాలు కూడా 42 దాకా తీస్తే,  వాటిలో దొంగాట, రాజుగారి గది – రెండు మాత్రమే మాన మర్యాదలతో వున్నాయని సర్టిఫికేట్ ఇచ్చారు ప్రేక్షకులు.

జానర్ మర్యాదని గనుక మర్యాదగా పాటిస్తే, మాస్ సినిమాలో ఒకలా వున్న హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇంకోలా రూపు దిద్దుకుంటుంది. మాస్ పాత్రకి మించిన కుశాగ్రబుద్ధితో, హేతుబద్ధ ఆలోచనలతో హేండ్ సమ్ గా వుండి, మాస్ పాత్ర కంటే ఎక్కువ ఆకట్టుకునే అవకాశముంటుంది. ఆవారా బంజారా మాస్ పాత్రని  ‘సరైనోడు’ కి వచ్చేసరికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకుగా తయారు చేసే స్థితికి చేరుకున్నారు. రాష్ట్రపతి కొడుకుని కూడా ఆవారా తిరగుబోతుగా చూపించుకునే పూర్తి స్వేచ్చ తెలుగు సినిమా దర్శకులకి ఎంతైనా వుంది, కాదనం.  కానీ జానర్ల పరంగా ఆలోచించినా, అన్ని జానర్లకీ కలిపి అవే రొడ్డ కొట్టుడు ఆవారా మాస్ పాత్రలే ఎలా వుంటాయి? 'రాజా చెయ్యేస్తే' లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సినిమా పాత్ర కూడా రొడ్డ కొట్టుడుగా ఎలావుంటుంది?

         తెలుగు ప్రజలు పౌరులుగా మంచి నాగరికంగానూ, సినిమా ప్రేక్షకులుగా చంఢాలపు అనాగారికంగానూ ఉంటారని నమ్మడం వల్ల ఇలా పుడుతున్నాయా పాత్రలు? ? సత్యజిత్ రే జీవిత కథ రాసిన మేరీ సెటన్, భారతీయ సినిమాలు వీధి భాగోతాల స్థాయి దాటి రాలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల వరస చూస్తే, గుంటూరులో బాషా నాటకాలని ఆడేవి. ఆ నాటకాల్లో హీరోల పాత్రలూ ఆ కథల స్థాయీ దాటి రావడం లేదు తెలుగు సినిమాలు!

        
         రొడ్డ కొట్టుడుకి అతీతంగా ఆలోచించాల్సింది ముందు జానర్ మర్యాద గురించి. ఇక్కడే సమస్య  వస్తోంది. ఈ సమస్యని తొలగించుకుని సినిమాలు తీస్తే ఏ జానర్ సినిమా నైనా ఆదరించడానికి సిద్ధంగా వున్నారు ప్రేక్షకులు.  పాత్ర దగ్గర్నుంచీ కథా కథనాల వరకూ; చిత్రీకరణ, మేకింగ్ అప్రోచ్ వరకూ ఏజానర్ మర్యాద ఆ జానర్ కిచ్చి కాపాడితే అది సినిమాల్నే  కాపాడుతుంది- 2016 లోనైనా ఇది అమలయ్యే అదృష్టానికి నోచుకుంటోందా? ఒకసారి చూద్దాం...

***

2016 ఏప్రెల్  ఆఖరు వరకూ ఈ నాలుగు నెలల కాలంలో 40 స్ట్రెయిట్ చిత్రాలు విడుదలయ్యాయి. డబ్బింగులని వదిలేద్దాం. స్ట్రెయిట్ చిత్రాల్లో  6 పెద్దవి, 15 మధ్య తరహా, 19 చిన్నవీ. పెద్ద వాటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు వున్నాయి. వీటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు నాలుగూ వెంటనే హిట్ టాక్ వచ్చినవి కావు. తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేస్తే అతి కష్టంగా నిలబడ్డవి నాన్నకు ప్రేమతో, సరైనోడు మాత్రమే. కానీ రియల్ హిట్స్ రెండూ నాగార్జున నటించినవే. ఇంకో మాటే లేకుండా మొదటి ఆటకే సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి రెండూ తక్షణం ప్రేక్షకుల ఆమోదం పొందాయి. కారణం? జానర్లని కాపాడ్డం.  

కానీ నాన్నకు ప్రేమతో లో నాన్న లేకుండా అర్ధంకాని సైన్స్ ఫిక్షన్ జానరే స్వారీ చేస్తే, డిక్టేటర్ లో ఫ్యామిలీ యాక్షన్ జానర్  కాస్తా మళ్ళీ ఔట్ డేటెడ్ బాషా ఫార్మాట్ తో తేలిపోతే, సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ కిక్-2 కి లాగా ఫారిన్ ఇష్యూ జానర్ పాలబడింది. ‘కంచె’ అనే ఇదే ఫారిన్ ఇష్యూ జానర్ మరెందుకు హిట్టయ్యిందంటే, ఆ ఫారిన్ ఇష్యూ జానర్ లో వున్నది పసిపాప ప్రాణం. పసివాళ్ళు నేటివిటీకి అతీతులు. హిట్టయిన భజరంగీ భాయిజాన్ లోని పసిది పరాయి పాకిస్తానీ. ‘పోలీస్’ లో బాక్సాఫీసు అప్పీలున్న, కీలక కూతురి పాత్ర విలువ తెలీక,  బార్బీ బొమ్మలా చూపించి సరిపెట్టేశాడు దర్శకుడు.
ఇక సరైనోడు మాస్ యాక్షన్ నే గానీ  ఫ్యాక్షన్ సబ్ జానర్ కింది కొచ్చింది. పాత్రల పేర్లూ ప్రదేశాలూ మారాయంతే. ఫ్యాక్షన్ సబ్ జానర్ వాసన ఇంకెన్నాళ్ళు భరిస్తారు ప్రేక్షకులు. 

        ఇలాకాక, సోగ్గాడే చిన్నినాయనా ఫాంటసీ జానర్  నుంచి పక్కకి తొలగకుండా, ఊపిరి వరల్డ్ మూవీ జానర్ కి అన్యాయం చేయకుండా, విచ్చేస్తే అక్కున జేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే పనిగా వస్తున్న హార్రర్ కామెడీ జానర్ తో విసుగెత్తిన ప్రేక్షకులకి, సోగ్గాడే చిన్నినాయనా లోని ఆత్మఫాంటసీ పెద్ద ఉపశమనం. ఊపిరిలో కార్తీ పాత్ర ఇంటి కథతో కాలుష్యమున్నా, కొత్తగా వరల్డ్ మూవీ జానర్ ని చూస్తున్న అనుభూతి ముందు అది దిగదుడుపే అయింది ప్రేక్షకులకి.


        ఇక ఈ జనవరి - ఏప్రెల్ మధ్య,  మధ్య తరహా  సినిమాలు 18 విడుదలైతే,  14 ఫ్లాప్ అయ్యాయి. ఈ రేంజి హీరోలైన రామ్, నాని, శర్వానంద్, అడివి శేష్, సందీప్ కిషన్, శ్రీకాంత్,  విష్ణు, మంచు మనోజ్, సునీల్, నారా రోహిత్, ఆది, రాజ్ తరుణ్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్, సత్య కార్తీక్ మొత్తం 15 మందీ కలిసి 18 సినిమాలిస్తే ఒక్కటే నచ్చింది ప్రేక్షకులకి. ఇంకో ఓ మూడింటిని మాత్రం  ఏవరేజిగా సరిపెట్టేశారు.
        క్షణం, నేనూ శైలజ, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణగాడి వీర ప్రేమ గాథ...వీటిలో ‘క్షణం’ క్రైం జానర్ ని కాపాడుతూ ఇంటెలిజెంట్ రైటింగ్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి హిట్టయితే, నేనూ శైలజ జానర్ వచ్చేసి ఓల్డ్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్. వీటిని అప్ డేట్ చేసివుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఎక్స్ ప్రెస్ రాజా  ఇంటర్వెల్ కి అయిపోయిన మల్టీ ప్లెక్స్ జానర్ కథని, అతికించిన వేరే కథతో సింగిల్  స్క్రీన్ కి పెంచారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఏ జానర్ కీ చెందని అన్ని జానర్ల సినిమా. అందుకే ఏం చూశామో  అర్ధం గాలేదని కామెంట్లు వచ్చాయి. 


        ఫ్లాపయిన 14 సినిమాల జానర్ల తీరుని పరిశీలిస్తే...

        1. రన్ : జానర్ : ఇండీ ఫిలిం, జరిగింది : ఇండీ ఫిలిం ని రీమేక్ చేసే చోద్యం
        2. టెర్రర్ : జానర్ : క్రైం లో టెర్రర్ సబ్ జానర్, జరిగింది : అప్డేట్ కాని అప్రోచ్
        3. ఈడో రకం- ఆడో రకం : జానర్ : కామెడీ, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్
        4. శౌర్య : జానర్ : క్రైంలో థ్రిల్లర్ సబ్ జానర్, జరిగింది : సబ్ జానర్ ఖూనీ
        5. ఎటాక్ : జానర్ : గ్యాంగ్ స్టర్ సబ్ జానర్, జరిగింది : నిర్వహణలో ఒక లోపం
        6. కృష్ణాష్టమి : జానర్ : ఫ్యామిలీ, యాక్షన్, జరిగింది : జానర్ల ఔట్ డేటెడ్ నిర్వహణ
        7. తుంటరి : జానర్ : స్పోర్ట్స్, జరిగింది :  రాంగ్ కాస్టింగ్
        8. సావిత్రి : జానర్ : లవ్, జరిగింది : అప్డేట్ చేసుకోని కథ
        9. రాజా చెయ్యేస్తే : జానర్ : క్రైం, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
        10. గరం : జానర్ :  మాస్, జరిగింది : ఔట్ డేటెడ్ అప్రోచ్
        11. సీ. అందాలు-రా. సిత్రాలు : జానర్ ; లవ్, జరిగింది :  ఔట్ డేటెడ్ అప్రోచ్
        12. క. వైభోగమే : జానర్ : ట్రెండీ లవ్, జరిగింది : సెకండాఫ్ లో ఔట్ డేటెడ్ అప్రోచ్
        13. స్పీడున్నోడు : జానర్ : రియలిస్టిక్ లవ్, జరిగింది : మాస్ యాక్షన్
        14. పడేసావే : జానర్ : లవ్, జరిగింది :  కాలం చెల్లిన ముక్కోణ ప్రేమ
***

     క విడుదలైన  19 చిన్న సినిమాల్లో ఒకటే హిట్టయ్యింది : గుంటూరు టాకీస్. క్రైం లో ఇది అడల్ట్ క్రైం జానర్ కి చెందినా, మరే పక్క చూపులు చూళ్ళేదు. దీని అప్రోచ్ కూడా noir జానర్ (crime fiction featuring hard-boiled cynical characters and bleak sleazy settings) లో అతికినట్టు వుంది. మిగిలిన 18 చిన్న సినిమాల విశ్లేషణ కూడా అనవసరం. 


        అంటే ఈ నాలుగు నెలల్లో కూడా రికార్డు స్థాయిలో జానర్లని పట్టించుకోనే లేదన్న మాట. మొత్తం  విడుదలైన 40  లో నాలుగే జానర్ మర్యాద కాపాడుకుని సొమ్ములు చేసుకున్నాయి. పెద్దవి రెండు, మధ్యస్థం ఒకటి, చిన్నది ఒకటి. ఇక రాబోయే నెలల్లో ఇంతకి మించి జరిగేదేమీ వుండదని వాతావరణ సూచన లిచ్చెయ్యొచ్చు. అసలేం చేస్తున్నారో తెలిస్తే కదా పరిస్థితిలో మార్పు రావడానికి!


(ఇంకా వుంది)

–సికిందర్