రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, మే 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ


రచన – దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల

తారాగణం : మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, రేవతి, జయసుధ, తులసి, శరణ్య, అర్చన, సత్య రాజ్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నాజర్, సాయాజీ షిండే, నరేష్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మిక్కే జే మేయర్,  ఛాయాగ్రహణం : రత్న వేలు
బ్యానర్ : పివిపి సిని మా- మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్  ప్రై. లి.
నిర్మాతలు : పొట్లూరు వి. ప్రసాద్, మహేష్ బాబు 
విడుదల : 20 మే, 2016
***
       శ్రీకాంత్ అడ్డాల ఫిలసాఫికల్ ఫ్యామిలీ డ్రామాల  పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇందులోకి మరోసారి మహేష్ బాబు జాయినయ్యాడు. ఒక పెద్ద నిర్మాత దీనికి తోడయ్యాడు, భారీ తారా గణమంతా  వరసకట్టారు, అగ్రస్థాయి సాంకేతిక నిపుణులూ కలిశారు. ఇంతమంది హేమీ హేమీలని కలిపి చూస్తేనే ఇదొక బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ కృష్ణ నటించి నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా ఇలా హేమా హేమీలతో ఓ పెద్ద బ్రహ్మోత్సవమే ఆనాడు- థియేటర్ల లోపలా బయటా! ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’  టైటిల్ తోనే వచ్చిన ఈ హేమా హేమీల ‘బ్రహ్మోత్సవం’  థియేటర్ లోపల వెండి తెర మీద కూడా బ్రహ్మోత్సవాన్నే వెలిగించిందా? ప్రేక్షక భక్తులు ఈ బ్రహ్మోత్సవపు భక్తి ప్రవాహ రసంలో కొట్టుకుపోయేలా చేసిందా?  ఓసారి చూద్దాం...

కథ
        విజయవాడలో సత్య రాజ్ -రేవతి లకి మహేష్ బాబు ఏకైక కొడుకు. సత్య రాజ్ మామ దగ్గర నుంచి నాలుగు వందలు తీసుకుని ఇప్పుడు నాల్గు వందల కోట్లు చేసే పెయింట్స్ కంపెనీ  అధిపతి అయ్యాడు. తన చుట్టూ ఎప్పుడూ పదిమంది వుండి జీవితం పండగలా, బ్రహ్మోత్సవంలా గడపాలని అతడికుంటుంది. బావమరుదులైన రావురమేష్, నరేష్, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ నల్గురికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. అలా అందరూ ఆటాపాటా పండగలూ పబ్బాలతో నవ్వుతూ హాయిగా జీవించేస్తూంటారు- ఒక్క రావు రమేష్ తప్ప. రావు రమేష్ కి ఇలా బావ పంచన పడి బతకడం అస్సలు ఇష్టముండదు. అలాగని బయటికి పోతానని చెప్పలేడు. భార్య జయసుధ, కూతురు ప్రణీత వుంటారు. కూతుర్ని మహష్ బాబుకిచ్చి చేసుకుంటే అలాగైనా ఈ ఇంట్లో తన ప్రాధాన్యం పెరుగుతుందన్న ఆశతో ఉంటాడు. అలాటిది సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ రావడంతో రావు రమేష్ ఆశలు కరిగిపోతాయి. కాజల్ మహేష్ ఇద్దరూ ప్రేమలో పడతారు. 

        మహేష్ బాబు అందరికీ ప్రియమైన వాడు.  ఏ కష్టం తెలీకుండా అలా అలా జీవితం గడిపేస్తూంటాడు.  మాట అనే ముందు, ఏదైనా చేసే ముందు ఎక్కువ ఆలోచించడు. రావు రమేష్ తన కూతుర్ని మహేష్ కి చేసుకోమని చెప్ప లేకపోతున్నాడని సత్యరాజ్ కి తెలుస్తుంది. అయినా మౌనంగా ఉంటాడు. అంతా కలిసి టూర్ కి వెళ్తారు. అక్కడ కాజల్ మనసు విప్పుతుంది. తనది స్వేచ్చా ప్రపంచమని, ఇంటినిండా మనుషుల మధ్య వుండలేననీ అంటుంది. మహేష్ బాబు అర్ధం జేసుకుని బై చెప్పేస్తూ కిస్ ఇస్తాడు. ఇది చూసి రావు రమేష్ ఇక రెచ్చిపోతాడు. కూతురు పెళ్లి ఇక మహేష్ తో జరగదన్న ఆక్రోశంతో సత్య రాజ్ ని నానా మాటలంటాడు. ఈ  బానిస బతుకు బతకలేనని వెళ్ళిపోతాడు. సత్యరాజ్ గుండె పోటుతో చనిపోతాడు. చనిపోయే ముందు  మహేష్ తో తన కోరిక చెప్తాడు. ఆ కోరిక ప్రకారం ఏడుతరాల బంధువుల్ని వెతకడానికి మహేష్ బాబు బయల్దేరతాడు. ఇదీ కథ. 

ఎలా వుంది కథ
       
ది పాత రోజులనాటి ఉమ్మడి కుటుంబపు కథైనా,  దీన్ని ఇప్పటి కాలానికి అన్వయించి చెప్పలేకపోయారు. సమస్య ఏమిటంటే, తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటూ వస్తే నరుక్కునే రాక్షసులైన ఫ్యాక్షన్ - మాఫియా కుటుంబాల కథలొస్తాయి, లేదంటే 1960-70 లనాటి కాలం చెల్లిన సెంటిమెంట్ల కథలొస్తాయి. ఈ రెండూ తప్ప ప్రేక్షకులకి వెరైటీ అనేదే లేదు.  ఈ కథ కూడా అదే పాత మూసలో, అవే కాలం చెల్లిన విలువలకోసం ప్రాకులాడే చాదస్తపు పాత్రలతో చెప్పారు. కాలం మారింది, జీవనోపాధి మార్గాలూ పెరిగిపోయాయి. వ్యవసాయానికో వ్యాపారానికో ఉమ్మడి కుటుంబంగా గడపాల్సిన అగత్యం ఇప్పుడు లేదు.  కుటుంబ సభ్యులు ఎవరి  అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా బాగా అభివృద్ధిలో కొస్తున్నారు. మనుషులు భౌతికంగా దూరమైనా మానసికంగా దగ్గరగా వుండే టెక్నాలజీ వుంది. పాత తరం కొత్త కాలంలోకి రావాలే గానీ,  కొత్త తరాన్ని  పాత కాలంలోకి లాగాలనుకోవడం మూర్ఖత్వం. నిజమే, కలిసి వుండాలని అనడం శాశ్వత విలువే – కానీ ఇలాగే కలిసుండా లనడం పాత విలువ. శాశ్వత విలువలూ సత్యాలూ మారవు గానీ, పాత విలువలూ అభిప్రాయాలూ మరిపోతూంటాయి. దీన్నర్ధం జేసుకోలేక బాధలు పడుతున్న వాళ్లెందరో వున్నారు. ఈ సంధి కాలంలో ఇలా చిక్కుకు పోయిన కుటుంబాలకి విముక్తి కల్గించే సమకాలీన పరిష్కార మార్గాలు  చెప్పాలే గానీ- ఇష్టమున్నా లేకపోయినా అంతా ఒక చోటే కలిసి వుండాలి, ఒకడి మాటే వినాలీ అని సందేశాలిచ్చి ముగిస్తే- మిగిలేది ఈ కథలో లాగే గుండె పోటు మరణాలే.

ఎవరెలా చేశారు
       
హేష్ బాబు ఈ సినిమాలో ఏమీ చేయకపోయినా అలా కన్పిస్తూంటే చాలు,  అదే మహాభాగ్యం అన్నట్టు వుంటుంది అభిమానులకి. అలాటి వాళ్ళకి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అందమైన రాకుమారుడు. ఈ  రాకుమారుడు ఏం చేశాడూ అని మాత్రం చూడకూడదు. రాకుమారుడికి ఏం పనుంటుంది? ఇతరులు చేస్తూంటారు. ఈ రాకుమారుడి తరహా చూసి విసిగి పోయి మొత్తమంతా రావు రమేష్ భుజానే సుకుని చేసుకొచ్చాడు. రాకుమారుడుగా మహేష్ బాబు మాత్రం జస్ట్ అలా మెరిసిపోయే అందచందాలతో, కాస్ట్యూమ్స్ తో, ఓ చిరునవ్వుతో, అలా అలా పాత్రల మధ్య కన్పిస్తూ, ఒక్కో డైలాగు అలా అలా విసురుతూ సరదాగా తిరిగేస్తూంటే, హీరోయిన్లతో కలిసి పాటలు పాడేస్తూంటే చాలు- ఇంతకంటే ఇంకేమీ  చేయనవసరం లేదు. 

        హీరోయిన్లు సమంతా, కాజల్, ప్రణీత లు పాపం తమ పాత్రలతో బాగానే కష్ట పడ్డారు. కాజల్ అగర్వాల్ చివరి సీనులో బెస్ట్ గా నటించి, ఆలోచనాత్మకంగా తన హృదయాన్ని విప్పుతుంది. ఇది ఈ సినిమాకి ల్యాండ్  మార్క్ సీన్. ఇంకో ల్యాండ్ మార్క్ సీన్ దీని తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే రావు రమేష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సీను. ఈ రెండూ తప్ప ఇంకో ఎమోషనల్ సీను వుంటే ఒట్టు. 

        సమంత కి కూడా ఒక చక్కటి పాత్ర చిత్రణ వుంది-యాసలో చెప్తే తప్ప వర్కౌట్ కాదన్న ఊత పదంతో. ప్రణీతదే నిర్లక్ష్యం చేసిన పాత్ర.  ఇంట్లో మరదలు ప్రణీతని ఉంచుకుని తడవకో పరాయి అమ్మాయి వెంట పడతాడు మహేష్. ప్రణీతని బాధ పెట్టడం ఆ ఉమ్మడి కుటుంబపు ఆనందాల్లో భాగమా? 

        సహాయ పాత్రలు లెక్కకి మించి వున్నాయి. విచిత్ర మేమిటంటే ఏ సంబరంలో చూసినా బృందాలుగా ఆడవాళ్లే. మహేష్ బాబు తప్ప ఇంకో మగాపిల్లాడే పుట్టలేదా ఆ కుటుంబాల్లో? కనీసం అతడికి ఫ్రెండ్స్ కూడా లేరా? ప్రతీ గ్రూప్ డాన్సుల్లో కూడా మొత్తం ఆడవాళ్ళేనా? విజయవాడలో మగకుర్రాళ్ళే లేరా?

        ఒక్క రావురమేష్ తో పాటు సత్య రాజ్  మాత్రమే - వాళ్ళు పడే సంఘర్షణతో గుర్తుండిపోయే పాత్రధారులుగా మిగిలిపోతారు. 

        మిక్కీ జే మేయర్ పాటలు టైటిల్ ని ఎలివేట్ చేసేట్టు లేవు. రత్నవేలు ఛాయాగ్రహణం, ఇతర అన్ని సాంకేతిక విలువలూ ఉన్నతంగా వున్నాయి. డబ్బు వ్యయం చేస్తే ఎంత గొప్ప సాంకేతిక విలువలైనా దక్కొచ్చు- కానీ ఎంత డబ్బు వ్యయం చేసినా ఆ సాంకేతిక విలువలతో సరితూగే స్క్రిప్టు దక్కడం లేదే? 

చివరి కేమిటి?
       
హేష్ బాబు అందచందాల కోసం చూడొచ్చు. అదే బ్రహ్మోత్సవం. అంతకంటే ఆశిస్తే ఆశాభంగం తప్పదు. ఫస్టాఫ్ మొదటి అరగంట లోనే నాల్గు పాటలు  వస్తాయి. సెకండాఫ్ లో ఒకే ఒక్క చిన్న ఫైట్ వుంటుంది. కమెడియన్లు లేరు, సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ తప్ప. ఇంటర్వెల్లో  తండ్రి చనిపోయాక, తండ్రి కోరిక ప్రకారం  ఏడుతరాల బంధువులని ఒక దగ్గర చేర్చేందుకు మహేష్ బాబు వివిధ నగరాలు తిరిగే దృశ్యాలతో వేరే దోవ పడుతుంది కథ. అసలు రావురమేష్ గొడవ పడి  విడిపోవడానికి కారకులే సత్య రాజ్, మహేష్ బాబులు. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అడగలేక పోతున్నాడనీ తెలిసీ సత్యరాజ్ మౌనం దాల్చడం ఒక తప్పు, కాజల్ అగర్వాల్ ని ముద్దు పెట్టుకున్న దృశ్యాన్ని అపార్ధం జేసుకున్నావనీ, ఆమెతో తను  విడిపోయాడనీ రావురమేష్ కి మహేష్ బాబు చెప్పక పోవడం రెండో తప్పు. తండ్రీ కొడుకులే రావురమేష్ గొడవ పడి విడిపోవడానికి కారకులయ్యారు తప్ప మరోటి కాదు. అలాంటప్పుడు తప్పు తెలుసుకుని రావు రమేష్ ని కలుపుకోవాల్సింది పోయి,  ఎక్కడో ఏడుతరాల బంధువుల్ని కలపడం కోసం తిరగడం ఏం కథో! ఈ బంధువులకోసం తిరిగే నలభై నిమిషాలూ నిద్రపోయినా నష్టం లేదు. 

        ఫిలాసఫీతో కూడిన డైలాగులు చాలా  చోట్ల అర్ధం గావు. ఏం చెప్పాడా అని ఆలోచించుకునే లోగా మరో  డైలాగు వచ్చేస్తుంది. దర్శకుడు ఈ కథని సీరియస్ గా తీసుకుని వేదాంత ధోరణిలో చాలా స్లోగా, బరువుగా చెప్పుకొస్తాడు- తన సొంత డైరీ రాసుకుంటున్నట్టు. ముగింపు మీద కూడా ఆశ పెట్టుకో నక్కరలేదు. కేవలం మహేష్ బాబు గ్లామర్ ప్రదర్శన కోసమైతే వెంటనే చూడొచ్చు - ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు తెరపైకి ఎప్పుడొస్తాడో!


       ఇంకోసారి ‘దేవుడు చేసిన మనుషులు’ చూసేందుకు ప్రేరేపించే బ్రహ్మోత్సవం ఇది.



-సికిందర్