రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 15, 2021

1065 : రివ్యూ

 

 రచన = దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
తారాగణం : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అమిత్ తివారీ, పోసాని, జయప్రకాష్ తదితరులు
సంగీతం :  గోపీ సుందర్,  ఛాయాగ్రహణం : ప్రదీష్ వర్మ
బ్యానర్ : జిఎ 2 పిక్చర్స్
నిర్మాతలు : బన్నీ వాసు, వాసూ వర్మ

విడుదల : అక్టోబర్ 15, 2021
***
         మధ్య హలో’, మిస్టర్ మజ్నూ లాంటి రెండు రోమాంటిక్ కామెడీల తర్వాత మరో రోమాంటిక్ కామెడీ /డ్రామా తో వచ్చాడు అక్కినేని అఖిల్. నటించిన అయిదు సినిమాలతో యంగ్ స్టార్ గా నిలదొక్కుకునేందుకు విఫలయత్నం చేస్తూ వచ్చిన అఖిల్ కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్టవడం చాలా అవసరం. ప్రేమ సినిమాల సెగ్మెంట్ లో మడి గట్టుకున్న తెలుగు సినిమాలకి, ఇంకా హిట్టవడానికి విషయం ఏమీ మిగలని పరిస్థితుల్లో ఈ రిస్క్ తీసుకున్నాడు అఖిల్. ఓ ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, మళ్ళీ రోమాన్స్ తోనే అదృష్టాన్ని పరీక్షించుకుందా మనుకున్నట్టుంది. గీతా ఆర్ట్స్ వంటి అగ్ర బ్యానర్, అక్కినేని నాగార్జున వారసుడు, పూజా హెగ్డే లాంటి ట్రెండింగ్ స్టార్ కాంబినేషన్లు సమకూర్చుకుని హిట్టవ్వడానికి సన్నద్ధమయ్యాడు పండక్కి. మరి ఈ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడా లేదా ఓసారి చూద్దాం...

కథ

    ఎన్నారై హర్ష (అక్కినేని అఖిల్) న్యూయార్క్ లో మంచి జాబ్ లో సెటిలై, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని, డాలర్లు వెనకేసుకుని, ఇక పెళ్ళి  చేసుకోవడానికి అన్ని అర్హతలతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా హైదారాబాద్ వస్తాడు. అతను ఇక్కడ వుండే ఇరవై రోజుల్లో అమ్మాయిని చూసి, పెళ్ళి చేసేసి పంపాలన్న టైట్ షెడ్యూల్ వేసుకుని వుంటారు కుటుంబ పరివారం. రోజుకో అమ్మాయిని చూసేలా 20 మంది అమ్మాయిలతో పెళ్ళి చూపులేర్పాటు చేస్తారు. రకరకాల అమ్మాయిల్ని చూస్తూంటాడు. విభా (పూజా హెగ్డే) అనే అమ్మాయి జాతకం కలవలేదని రిజెక్ట్ చేస్తారు పరివారం. కానీ ఆ ఫోటోలో విభా హర్షకి నచ్చుతుంది. వాళ్ళింటికి వెళ్ళి చూద్దామనుకుంటే ఆమె తండ్రి సుబ్బు (మురళీ శర్మ) తో గొడవ వస్తుంది.

        విభా స్టాండప్ కమెడియన్ గా ప్రోగ్రాములు చేస్తూ, ఒక క్యారక్టర్ కి సుబ్బు అని తన తండ్రి పేరే పెట్టి పెళ్ళి - సంసారం జోకులతో నవ్విస్తూంటుంది. ఆమెని కలుసుకుంటాడు. కానీ తను అడిగే ప్రశ్నలకి ఆమె చెప్పే సమాధానాలు వింటే మతిపోయి, ఆమె ఏమిటో అర్ధం జేసుకోలేకపోతాడు. ఇతడికి పెళ్ళీ కాపురం ప్రేమ గురించి అవగాహన లేదని ఆమె తిరస్కరిస్తుంది. దీంతో డీలా పడ్డ హర్ష తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతాడు.

        ఇప్పుడీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలెలా తొలిగాయి? హర్షకి అవగాహన లేకపోతే ఆమెకున్న మానసిక సమస్యేమిటి? అదెలా తొలగింది? ఆమె ప్రేమని ఇంకెలా పొందాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

      మొదటే చెప్పుకున్నట్టు, వచ్చిన తెలుగు ప్రేమ సినిమాలనే తిప్పితిప్పి అదే తీస్తే వచ్చే సమస్యే ఈ కథతోనూ వచ్చింది. కాకపోతే దీన్ని రెండు తెలుగు సినిమాల్ని కలిపి తీసినట్టున్నారు. ఈ దర్శకుడిదే ఆరెంజ్’, ఇంకో దర్శకుడి షాదీ ముబారక్. ఆరెంజ్ లో రామ్ చరణ్ ది తనకేం కావాలో తెలియని కన్ఫ్యూజ్ పాత్ర అయినట్టు, ఇక్కడ అఖిల్ తోనూ కన్ఫ్యూజుడు పాత్రే. ఇక గత మార్చిలోనే వచ్చిన షాదీ ముబారక్ లో ఒక రోజు జరిగే వరస పెళ్ళి చూపుల ట్రాక్ వున్నట్టు, ఇక్కడ ఇరవై రోజులకి వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంది.

        హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర వేసిన ప్రశ్నలతో అఖిల్ సమస్యలో పడ్డం కాన్ఫ్లిక్ట్ నేర్పరిస్తే, దాంతో అతను పొరాడి తనని ప్రూవ్ చేసుకునే కథ ప్రారంభించకుండా, ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీని సెకండాఫ్ పెద్దల జోక్యంతో రోమాంటిక్ డ్రామాగా మార్చెయ్యడంతో, కథకి ఒక అర్ధం పర్ధం లేకుండా, సీరియస్ క్లాసులు పీకీ, పీకించుకునే ఉపన్యాసంలా మారింది ముగింపు సహా.

        అక్కినేని నాగార్జున ఈ సినిమా అయినా అఖిల్ ని సక్సెస్ బాటలో నడిపించాలన్న ఆతృతతో వున్నట్టు వార్తలొచ్చాయి. సినిమాలో కొన్ని మార్పు చేర్పులు చేయించినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇంత చేసినా ఫలితం మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఫ్రేమల్ని, పెళ్ళిల్ని నేటి ఆర్ధిక ప్రపంచం నిర్వచిస్తూంటే, ఇంకా ప్రేమ కథల్ని కాలం తీరిన టెంప్లెట్లు పెట్టుకుని తీస్తే చూసే కాలం పోయింది. థియేటర్ వెలుపల ఫ్రేమల్లో యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు వేరే వున్నాయి. వాటితో ఎంటర్ టైన్ చేయాలి. అంతేగానీ బయటి పరిస్థితికి థియేటర్లోపల చూపిస్తున్న పరిస్థితికీ ఏ సంబంధం లేకపోతే, పాత డ్రామాలే చూపిస్తే, చూసే ఓపిక వుండాలనుకోవడం అత్యాశే అవుతుంది. 
 
నటనలు -సాంకేతికాలు

     మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కమ్ లవర్ బాయ్ గా అఖిల్ ఆద్యంతం ఫ్రెష్ గా కనిపిస్తాడు. సెకండాఫ్ లో గడ్డంతో కన్పిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా అయినందుకేమో. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ సంబంధాలు హోమ్లీగా నటించాడు. పూజా హెగ్డేతో రోమాంటిక్ సీన్లు ఫస్టాఫ్ లో నిలబెట్టాడు. సెకండాఫ్ కథ  సీరియస్ కాబట్టి ఫస్టాఫ్ ఫన్ రోమాన్స్ వుండదు. రోమాన్సే వుండదు. ఆమె కంటబడకుండా సీక్రెట్ గా కథ నడిపిస్తూంటాడు. ఈ సీన్లన్నిట్లో నటనలో ఈజ్ వుంది. ఇంప్రూవయాడు. సాంగ్స్ లోనూ ఆకట్టుకుంటాడు. కథెలా వున్నా, పాత్రెలా వున్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

        పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఫస్టాఫ్ లో అఖిల్ ని కవ్విస్తూ ఎంటర్ టైన్ చేయడం కోసమే కాకుండా, అతడికి ఆమె విసిరే ప్రశ్నలతో, తర్వాత బయట పడే మానసిక సమస్యతో విషయమున్న పాత్రే పోషించింది. కానీ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాస్తా జానర్ మారిపోయి సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా కావడంతో, పూర్తిగా పాసివ్ - విషాద పాత్రగా మారిపోయి, యూత్ అప్పీల్ కి గండి కొట్టేసింది.

        ఇక అటు వైపు, ఇటు వైపు కుటుంబ సభ్యుల పాత్రల్లో అఖిల్ కి జయప్రకాష్, ఆమని, అజయ్, ఇంకా చాలా మంది వుండగా, పూజాకి మురళీ శర్మ, ప్రగతి వుంటారు.

        ఈ సినిమాకి హైలైట్ గోపీ సుందర్ సంగీతంలో పాటలు. ముఖ్యంగా లెహరాయీ అనే హిందీ పదంతో పాట, గుచ్చే గులాబీ అనే ఇంకో పాట చిత్రీకరణ సహా బావున్నాయి. రోమాంటిక్ కథకి ఆ వాతావరణపు ఆహ్లాదానిచ్చే ఛాయాగ్రహణాన్నిచ్చాడు ప్రదీష్ వర్మ. ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్. ఔట్ డోర్- ఇండోర్ లొకేషన్స్ రిచ్ గా వున్నాయి. ప్రొడక్షన్ విలువలు టాప్ క్లాస్.

చివరికేమిటి   

             తన పెళ్ళి కథ రాహుల్ రవీంద్రన్, చిన్మయి లకి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్తాడు అఖిల్. ఫస్టాఫ్ లో ముప్పావు గంట వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంటుంది. ఈ ట్రాక్ మధ్య లోంచే పూజా హెగ్డే తో ట్రాక్ మొదలై, ఇది వరస పెళ్ళి చూపుల ట్రాక్ తో కలగలిసిపోయిన మంచి ఎంటర్ టైనర్ ప్యాకేజీలా వుంటుంది క్రియేటివిటీ. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు పెడర్ధాలుగా, ద్వంద్వార్ధాలుగా తేలి, ఆ అమ్మాయిలతో కోర్టు కేసుకి దారితీయడం మాత్రం అసహజంగా వుంటుంది. కోర్టులో దీన్ని కామెడీ చేసి నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వరస పెళ్ళి చూపుల ట్రాకు అంతా కోర్టు కేసుగా ముగిసే మినీ కథగా తీర్చిదిద్దారు. ఇది కూడా బావుంది. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు, అప్పుడప్పుడు తను అడిగిన ప్రశ్నలకి పూజా చెప్పినవే కావడం అతడెంత ఇమ్మెచ్యూర్ క్యారెక్టరో కూడా ఎస్టాబ్లిష్ అవడానికి తోడ్పడ్డాయి. ఇది కూడా బావుంది.

        ఇక తర్వాత పూజా హెగ్డేతో ఫైనల్ సీనుగా, ఇంటర్వెల్లో ఆమె అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం కాన్ఫ్లిక్ట్ ని ఏర్పాటు చేస్తుంది. జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లూ ఏర్పాటు చేసుకుని పెళ్ళికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్పించు కోవడం కాదు, పెళ్ళి తర్వాత కలిసి జీవించడం ఎలా చెప్పు?- అన్న ఆమె ప్రశ్నకి ఇమ్మెచ్యూర్ సమాధానాలు చెప్పి దొరికిపోతాడు. దీంతో ముఖం చెల్లక న్యూయార్క్ తిరిగి వెళ్ళిపోతాడు.

        ఇక్కడే సెకండాఫ్ కి గండి పడింది. హీరో హీరోయిన్లు విడిపోవడం రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణం కాదు. రోమాంటిక్ కామెడీల్లో వాళ్ళిద్దరూ పరస్పరం ప్రత్యర్ధులే కాబట్టి విడిపోకుండా, నువ్వెంతంటే నువ్వెంతని ఇగోల పోరాటం ప్రారంభిస్తారు. ఈ పోరాటం మాని ఏ వొకరు వెనక్కి తగ్గి విడిపోయినా, అది ఏడ్పించే రోమాంటిక్ డ్రామాకి దారి తీస్తుంది. ఇక్కడ జరిగిందిదే.  

        ఈ కాన్ఫ్లిక్ట్ దగ్గర అఖిల్ నిలబడక పోవడంతో, గోల్ తీసుకుని తన ఇగోతో ఆమెతో తేల్చుకునే మొండితనానికి పోక పోవడంతో, సెకండాఫ్ కథ తన చేతుల్లో లేక, పెద్దవాళ్ళ  చేతుల్లో దారితప్పి ఎలా పడితే అలా సాగే రోమాంటిక్ డ్రామాగా- సీరియస్ గా మారిపోయి, కష్టపడి నిలబెట్టిన ఫస్టాఫ్ నంతా నిష్ప్రయోజనం చేసేసింది.

సికిందర్    
       

 

 

Thursday, October 14, 2021

1064 : రివ్యూ


 రచన- దర్శకత్వం : అజయ్ భూపతి

తారాగణం : శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్, జగపతి
బాబు
, రావురమేష్ తదితరులు
సంగీతం : చేతన్ భరద్వాజ్
, ఛాయాగ్రహణం : రాజ్ తోట
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
విడుదల : అక్టోబర్ 14
, 2021

***

        తొలి సినిమా ఆరెక్స్ 100 తో హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా కోసం మూడేళ్ళూ  స్టార్స్ చుట్టూ తిరిగి మొత్తానికి శర్వానంద్, సిద్ధార్థ్ లతో మహా సముద్రం తీశాడు. శర్వానంద్ కి గత నాలుగు వరస పరాజయాల తర్వాత  మహాసముద్రం తో ఒక హిట్ అవసరం. ఇక దాదాపు పదేళ్ళ తర్వాత తమిళ హీరో సిద్ధార్థ్ తెలుగులో నటించిన సినిమా ఇది. మరో పక్క ఇద్దరు గ్లామర్ హీరోయిన్లు అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్ లు. ఇన్ని ఆకర్షణలున్న మహా సముద్రం పండక్కి విడుదలవడం కలెక్షన్స్ కి సానుకూలాంశం. మరి ఇన్ని పాజిటివ్స్ వున్న ఈ మల్టీ స్టారర్ పండగ మూడ్ ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతుందో లేదో చూద్దాం...

కథ

  వైజాగ్ లో శర్వానంద్ (అర్జున్), విజయ్(సిద్ధార్థ్) లు ప్రాణ స్నేహితులు. అర్జున్ చిన్న వ్యాఫారం చేసుకోవాలనుకుంటాడు. సిద్ధార్థ్ ఎస్సై పరీక్ష రాస్తాడు. డాన్స్ స్కూలు నడిపే మహా(అదితీ రావ్ హైదరీ) తో ప్రేమలో వుంటాడు. అర్జున్ లా చదివే స్మిత (అనూ ఇమ్మాన్యుయెల్) తో ప్రేమలో పడతాడు. వైజాగ్ లో చుంచు మామ (జగపతి బాబు) సముద్రం మీద బతికే స్మగ్లర్. ఇతడి ప్రత్యర్ధులు ధనుంజయ్ (గరుడ రామ్) అతడి అన్న  గూని బాబ్జీ (రావు రమేష్). ఒక రోజు విజయ్ ధనుంజయ్ తో ఘర్షణ పడి చంపేస్తాడు. దీంతో చుంచు మామా వూరొదిలి పారిపొమ్మంటాడు. విజయ్ మహాని కూడా వదిలేసి పారిపోతాడు. కానీ బతికే వున్న ధనుంజయ్ చంపడానికి మహా మీదికొస్తే అర్జున్ అతడ్ని చంపేస్తాడు. దీంతో ఇక గూని బాబ్జీని ఎదుర్కోవాలంటే స్మగ్లర్ గా మారిపోవాలని అర్జున్ మీద ఒత్తిడి తెస్తాడు చుంచు మామ.

        ఇప్పుడు విజయ్ ఏం చేశాడు? స్మగ్లర్ గా మారాడా? విజయ్ ఏమయ్యాడు? ఇంట్లోంచి తండ్రి వెళ్ళ గొడితే మహా ఏమైంది? అర్జున్ ప్రేమిస్తున్న స్మిత ఏమైంది? ఈ సమస్యలన్నీ అర్జున్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

      అనుకోని పరిస్థితుల్లో దుష్టుడ్ని చంపేసిన హీరో ఆత్మ రక్షణకి తానే దుష్టుడుగా మారడం, ప్రాణ మిత్రులైన ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం, ప్రేమించిన అమ్మాయి గురించి ఇద్దరు హీరోల మధ్య అపార్ధాలు రేగడం, ఘర్షణ, త్యాగం...ఈ టెంప్లెట్స్ అన్నీ పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. సముద్రం మీద స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ టెంప్లెట్ దీనికి జోడింపు. పాత్ర చిత్రణలు, లాజిక్, కామన్ సెన్సు వంటి వాటికి దూరంగా వున్న కథ. పాత్రల్ని బట్టి కథలో సముద్రమంత లోతైన డెప్త్ వున్నా, పైపై కథనంతో నడిపేసిన కథ. రెండు మూడు చోట్ల తప్ప మాస్ చేత కేరింతలు కొట్టించడంలో అంత కమర్షియల్ గా లేని కథ. పాత్రల్నిఎస్టాబ్లిష్ చేసిన తీరు మాస్ కి ఉత్కంఠ రేపుతూ కూర్చోబెట్ట గల్గింది. కానీ ఆ పాత్రల్ని నడిపిన తీరుతో రెండున్నర గంటల పాటు అదే ఉత్కంఠని రేపదు.

నటనలు- సాంకేతికాలు

   నాలుగు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కి మహాసముద్రం అనే కమర్షియల్ మాస్ యాక్షన్ టెర్రిఫిక్ నటనని ప్రదర్శించే అవకాశాన్నిచ్చిన పాత్ర ఇది. ఫస్టాఫ్ అతను కదలకుండా కూర్చో బెట్టేస్తాడు. తల్లితో ఒక కుటుంబం, కొన్ని విలువలు, స్నేహితుడి పట్ల విశ్వాసం, ప్రేమించిన అమ్మాయితో ఆమె నిర్ణయాల్ని గౌరవిస్తూ సత్సంబంధాలు...ఇవన్నీ వున్న పాత్రతో ప్రేక్షకులకి దగ్గరవుతాడు. ఇంటర్వెల్ కి ముందు గరుడ రామ్ గ్యాంగుతో యాక్షన్ సీను, సెకండాఫ్ లో రావు రమేష్ గ్యాంగుతో  యాక్షన్ సీన్లూ ఇవన్నీ విజృంభించి చేస్తాడు. అనూ ఇమ్మాన్యుయెల్ తో ఒక రోమాంటిక్ సాంగ్ తో అలరిస్తాడు. సిద్ధార్థ్ తో ఒక బ్రోమాన్స్ సాంగ్ కూడా ఓకే.

        కానీ సెకండాఫ్ లో పాత్ర బలహీన పడడంతో కథా పరంగా సెకండాఫ్ ని నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో పడిపోతాడు. కారణ మేమిటంటే, పాత్రకి గోల్ లోపించడం. దీంతో ఏ సమస్య వచ్చి పడితే దానికి అప్పటికప్పుడు రియాక్షనిచ్చి వూరుకునే పాసివ్ రియాక్టివ్ పాత్రగా వుండడం. సమస్యలకి మూలమేమిటో దాన్ని తానుగా పెకిలించి వేసే గోల్ తో యాక్టివ్ పాత్రగా లేకపోవడం. యాక్టివ్ పాత్ర లేని మూల్యం చాలా చెల్లించుకోవాల్సి వచ్చింది. స్టార్ సినిమాలకిది మామూలే.

        ఇక సాఫ్ట్ రోల్స్ వేసే సిద్ధార్థ్ ఈసారి నెగటివ్ గా రఫ్ పాత్ర వేశాడు. ఇందులో ఎక్కడా తేలిపోకుండా రాణించాడు. ఫస్టాఫ్ లో అసలు ఎస్సై కావాలని ఎందుకనుకున్నాడో రివీల్ చేస్తూ అసలు స్వరూపం బయట పెడుతూ మాంచి కిక్కిస్తాడు. కానీ ఇంటర్వెల్ ముందు పారిపోయి ఆ కిక్కుని నీరుగార్చేస్తాడు. ఐదేళ్ళ కాలం తర్వాత క్లైమాక్స్ ముందు తిరిగి వచ్చి శర్వానంద్ కి ప్రాణ శత్రువుగా మారే ఫార్ములా పోషించడం కూడా సరిపెట్టుకున్నా, చివరికి ఇచ్చుకునే అరిగిపోయిన ఫార్ములా ముగింపుని మాత్రం సరిపుచ్చుకోలేం. ఈ పని షోలే లో అమితాబ్ బచ్చన్ ఎప్పుడో చేశాడు. కానీ జయబాధురి జీవితం అప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. సిద్ధార్థ్ తన పాత్ర ద్వారా ప్రేమించిన ఆదితీ రావ్ హైదరీకి రాడికల్ ముగింపు నిద్దామనుకున్నాడు గానీ, నిజానికి తనకీ శర్వానంద్ కీ మధ్య ఆటబొమ్మలా వున్న అదితీకి వ్యక్తిత్వాన్నిస్తూ, ఆమె నిర్ణాయానికి వదిలేస్తే రాడికల్ ముగింపయ్యేది.

      అదితీ రావ్ హైదరీ పాత్రకి తగ్గ నటనతో ఒక సెక్షన్ని ఆకట్టుకోవచ్చుగానీ, అసలు పాత్రేమిటన్నదే ప్రశ్న. అంత వైభవంగా డాన్స్ స్కూలు నడుపుతూ సిద్ధార్థ్ కి డబ్బు సాయం కూడా చేస్తూ వుండిన తను, సిద్ధార్థ్ పారిపోగానే శర్వా పంచన చేరి, అతడింట్లో దీనంగా జీవించడమేమిటో అర్ధం గాదు. పైగా సెకండాఫ్ లో కథని మెలికలు తిప్పడం.

        పోతే లా చదివే అమ్మాయి పాత్రలో అనూ ఇమ్మాన్యుయెల్ కూడా కథలోంచి నాల్గేళ్ళ పాటు వెళ్ళిపోతుంది. హైదారాబాద్ లో లాయర్ గా మారి సెకండాఫ్ లో తిరిగొస్తుంది. ఈ నాల్గేళ్ళూ  కాంటాక్ట్ వుండదు. ఇవేం ప్రేమలో అర్ధంగాదు. కథకుడి సౌలభ్యం కోసం ఒకవైపు అదితిని వదిలేసి సిద్ధార్థ్ వెళ్ళి పోయాడు, మరోవైపు శర్వాని  వదిలేసి అనూ వెళ్ళిపోయింది.

        విలన్లుగా మాత్రం విచిత్ర పాత్రల్లో, తెలుగు నేటివిటీతో జగపతి బాబు, రావు రమేష్ లు తమ సీన్లని తాము బాగా దున్నేసుకున్నారు వేరే కమెడియన్లు అవసరం లేకుండా.

        చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నా, పాటల విషయంలో వెనుకబడ్డాడు. మొదటి బ్రోమాన్స్ సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ క్యాచీగా ఇవ్వలేకపోయాడు. హెవీగా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి, పాటల్ని లైట్ మ్యూజిక్ తో ఇస్తే కదా కాంట్రాస్ట్ వస్తుంది. అప్పట్లో ఇళయరాజా ఇదే పాటించే వాడు కదా.


   రాజ్ తోట కెమెరా వర్క్ వైజాగ్ సముద్రానికి, లొకేషన్స్ కి, సముద్రపు వివిధ మూడ్స్ కి విజువల్ గా హైస్కోరు చేసింది. దర్శకుడి కథా కథనాలు మాత్రం ఈ విజువల్స్ తో పోటీపడలేక పోయాయి.
    ఈ రెండో సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి హెవీ మల్టీ స్టారర్ కి సాహసించడం బావుంది గానీ, మహా సముద్రం లాంటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుకి ఇంకా ఇన్ పుట్స్ అవసరం. సముద్రం మీద స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ లో చెడిన స్నేహాల మధ్య ప్రేమ కథ చెప్తున్నప్పుడు ఆ ప్రేమ కథ ఒక్కటే హైలైట్ అవ్వాల్సింది కాలేదు. దీంతో ప్రేమ కథ కాలేక, స్మగ్లింగ్- మాఫియా కథ కాలేక వూగిసలాడింది.

        రమేష్ సిప్పీ రిషీ కపూర్, డింపుల్ కపాడియా, కమల హాసన్ లతో సాగర్ అనే చాలా లైటర్ వీన్ సూపర్ హిట్ ప్రేమ కథ తీసినప్పుడు, సాగరమంత లోతైన మెచ్యూరిటీతో తీసి సక్సెస్ అయ్యాడు.  

సికిందర్ 

Wednesday, October 13, 2021

1063 : రివ్యూ

రచన - దర్శకత్వం : సురేష్ ఉత్తరాది
తారాగణం : నవీన్ చంద్ర
, గాయత్రీ సురేష్, అదితి, క్రిష్ సిద్దిపల్లి, రాజారవీంద్ర
సంగీతం : జువెన్ సింగ్
, ఛాయాగ్రహణం : ఎస్ కె భూపతి  
నిర్మాతలు : కె కళ్యాణ్
, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ భాస్కర్ రావు
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        ప్రేమ కథల్ని కొత్తగా చెప్పాలనుకుని కొత్త దర్శకులు ప్రయత్నించడం మంచిదే. రెండే రకాల ప్రేమ కథలతో గత రెండు దశాబ్దాలుగా అదేపనిగా తీసిందే తీసి ప్రేమంటేనే విరక్తి పుట్టించాక, ఈ మధ్య అలాటి కొత్త బైరాగి దర్శకుల తాకిడి దాదాపు తగ్గిపోయి ప్రాణాలు హాయిగా వున్నాయి. ఇతర పనులు చేసుకోగల్గుతున్నాం. ఈ సినిమాలతో ప్రేక్షకులకి ఉపయోగం లేదు గానీ నిర్మాణంలో ఎందరికో ఉపాధి కల్పిస్తూంటాయి. ఈ కార్మిక  సేవకే వీటిని అలా వుండనివ్వాలి తప్ప కళా సేవకి కాదు. కళా సేవ కూడా చేస్తూ నేను లేని నా ప్రేమ కథ లాంటివి అప్పుడప్పుడు వస్తూంటే చిన్న సినిమా బతికే వుందని ఒక సంకేతం వెళ్తుంది.

        యితే ఆ సంకేతం ఎంత బలంగా వెళ్ళి ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటుందనేదే సమస్య. ఇందుకే చిన్న సినిమా బేషరతుగా అన్ని విభాగాల్లో బలంగా వుండాలంటారు. మరి అంత బలంగా ప్రస్తుత కొత్త దర్శకుడి ప్రేమ కథేమైనా  వుందా లేదా చూద్దాం...

కథ

   ఆ వూళ్ళో నాట్యమంటే ఇష్టమున్న రాధ (గాయత్రీ సురేష్) సామాజిక కార్యకర్త రామ్ (నవీన్ చంద్ర) తో ఏకపక్ష ప్రేమలో వుంటుంది. రామ్ కి వసుధ అని ఒక ఫ్రెండ్ వుంటుంది. ఇంకో వూళ్ళో కృష్ణ (క్రిష్ సిద్ధిపల్లి) అనే అతను వుంటాడు. ఇతడికో గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఇతను శబ్ద తరంగాల మీద పరిశోధన చేస్తూంటాడు. ఐన్ స్టీన్ పదార్ధానికి వినాశం లేదని చెప్పాడు కాబట్టి, విశ్వం లో శబ్ద తరంగాల రూపంలో నిక్షిప్తమైన ఒక పదార్ధాన్ని అన్వేషిస్తూంటాడు. ఆ పదార్ధం కాశ్మీరు సమస్యకి పరిష్కారం. కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలంటే దాని సమస్యా మూలాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిసిన వాళ్ళు నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు అనీ, వాళ్ళ సంభాషణలు శబ్ద తరంగాల రూపంలో విశ్వంలో ఎక్కడో వుంటాయనీ పరిశోధన చేస్తూంటాడు.

        ఇటు రాధ చదువుతున్న కాలేజీ లెక్చరర్ (రాజా రవీంద్ర) ఒక ఫంక్షన్ లో హామ్ రేడియోని పరిచయం చేసి దాన్ని రాధకి బహుమతిగా ఇస్తాడు. ఆమె దాన్ని ట్యూన్ చేస్తూంటే ఒక రోజు కృష్ణ విశ్వంలోకి పంపుతున్న ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలెడతారు. అప్పుడు కృష్ణకి ఏమర్ధమవుతుందంటే, తను 1983 కాలంలో  వున్న అమ్మాయితో కనెక్ట్ అయ్యాడని. ఈ విషయమే ఆమెకి చెప్పి, తను 2020 లో వున్నానంటాడు. ఆమె నమ్మలేకపోతుంది. రామ్ కి చెప్తుంది.

        తను 1983 లో, కృష్ణ 2020 లో వున్నారు. మరి రామ్ ఏ కాలంలో వున్నాడు? ఈ ముగ్గురి మధ్య వున్న సంబంధమేమిటి? వీళ్లతో వసుధ పాత్రేమిటి? ఆమె ఎవరికి ఏమవుతుంది? చివరికి నల్గురూ ఏమయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

       టైమ్ ట్రావెల్ జానర్ కథ ఇది. కృష్ణ అనే అతను కాలంలో 1947 లోకి ప్రయాణించి కాశ్మీర్ సమస్యని పరిశీద్దామనుకుని చేసే ప్రయత్నం, మధ్యలో 1983 దగ్గర రాధ అనే అమ్మాయితో కనెక్టయితే ఏం జరిగిందన్నది ప్రేమ కథగా చేసి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సురేష్. ఆలోచన కొత్తదే.

        గత మార్చి లోనే ప్లేబ్యాక్ అని ఇలాగే భిన్న కాలాల్లో పాత్రల్ని కనెక్ట్ చేస్తూ తెలుగులోనే వచ్చింది గానీ కథ వేరు. ప్రస్తుత ప్రేమ కథ ప్రేమ కథగానే వుండక కుటుంబ కథగానూ బయటపడే విషయంతో వుంటుంది. టైమ్ ట్రావెల్ తో కుటుంబ కథ అనగానే రాబర్ట్ జిమెకిస్ 1985 క్లాసిక్ బ్యాక్ టు ది ఫ్యూచర్ గుర్తుకొస్తుంది. ఇందులో కీచులాడుకునే తల్లిదండ్రుల్ని భరించలేని కుర్రాడు టైమ్ మెషీన్ లో తల్లిదండ్రుల టీనేజీ కాలంలో కెళ్లి, వాళ్ళ కీచులాటలకి కారణాన్ని అక్కడ, ఆ టీనేజీ వయసులో తొలగించి తిరిగొస్తాడు. సైకలాజికల్ గా చెప్పాలంటే ఇది సైకో థెరఫీకి కథా రూపం. హిప్నాటిస్టులు కూడా హిప్నాటిజంతో గతంలోకి  తీసికెళ్ళి మానసిక సమస్యల్ని మరమ్మత్తు చేయడం తెలిసిందే.

        ప్రస్తుత కథ ముక్కోణ ప్రేమ కథ. ఇందులో 1983లో రాధ ఆ ప్రేమ దక్కించుకోలేని బాధతో వున్నప్పుడు, 2020 లో వుంటూ ఆమెతో కనెక్ట్ అయిన కృష్ణ చేయాల్సింది ఆమెకి సైకో థెరఫీనే. ఇది చేయకుండా ఆమె పుణ్యాన ఆ కాలంలో తన తల్లిదండ్రులతో మాట్లాడగల్గిన తను, దానికే జన్మ ధన్యమైనట్టు ఫీలై, ఆమెని గాలి కొదిలేసి ముగించడం పాత్రోచితంగా లేదు.

        పదార్ధానికి వినాశం లేదన్నారు గానీ రూపం మారవచ్చు. పదార్ధమంటే శక్తి. శక్తి ఏ రూపం ధరిస్తే ఆ పదార్ధం. కాబట్టి శక్తికి వినాశం లేదు గనుక పదార్ధమూ నశించదు. అందుకని కాశ్మీరు గురించి నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు ఏం మాట్లాడుకున్నారో ఆ శబ్ద తరంగాలు విశ్వంలో వుండే వుంటాయని ఈ కథ ప్రతిపాదన. శబ్దం కూడా శక్తియే. పదార్ధం నుంచి శక్తి రూపంలో వెలువడే వైబ్రేషనే శబ్దం. పదార్ధం ఏ రూపం మార్చుకుంటే ఆ రకమయిన అణువులతో వైబ్రేషన్ ప్రసారమవుతుంది.

        మనం మాట్లాడుకునే మాటల వైబ్రేషన్స్ గాలిలోని అణువుల ద్వారా ప్రయాణించి అన్ని  వైపులా ప్రసరిస్తాయి. దారిలో ఏ అవరోధముంటే దాన్ని తాకి ఆ శక్తి రూపంలోకి మారిపోతాయి. గోడలుంటే గోడల్ని తాకి గోడల శబ్దంగా ప్రతిధ్వనిస్తాయి. గదిలో తివాచీ, సోఫాలు లాంటి మెత్తని ఉపరితలాలుంటే వాటిలోకి మిళితమై పోతాయి. కాబట్టి నెహ్రూ, జిన్నా, కాశ్మీర్ రాజు మాట్లాడుకున్న మాటల తరంగాలు మాట్లాడుకున్న చోటే ఫినిష్ అయిపోతాయి. అవే తరంగాల రూపంలో అలాగే విశ్వంలో పడి వుండవు. పైగా శూన్యంలో శబ్దం ప్రయాణించదు, వాయు మండలంలోనే ప్రయాణిస్తుంది.

        ఇక కాశ్మీరు సమస్యకి మూల కారకులు జిన్నా, కాశ్మీరు రాజులతో బాటు, మౌంట్ బాటెన్ కూడా. వీళ్ళు కంపు చేసిన చరిత్ర లోంచి 55 శాతం కాశ్మీరు భూభాగమైనా లాక్కొచ్చారు నెహ్రూ, పటేల్ లు.

నటనలు- సాంకేతికాలు

    ఇది రాధ పాత్ర చెప్పుకునే ఆమె కథ. ఈ పాత్ర నటించిన గాయత్రి కాలానికి తగ్గట్టు పాత్రకి సరిగ్గా సరిపోయింది- రూప స్వరూప లావణ్యాలతో, ముఖభావాలతో, మాటతీరుతో, డ్రెస్ సెన్స్ తో, నాట్య కళతో. అమాయక పాత్ర. కథ వుంటేనే పాత్రలు నిలబడతాయి.

        ఉద్యమ కార్యకర్తగా, ప్రేమలో పడని పాత్రగా నవీన్ చంద్ర కథతో పాటు వుంటాడు, కథగా కాదు. ఆ మేరకే నటన వుంటుంది. కాశ్మీరు పరిశోధన చేసే పాత్రలో క్రిష్ కథ నడపే పాత్రగా వుంటాడు. నటన కాస్త అతిగా కూడా వుంటుంది. గర్ల్ ఫ్రెండ్ గా అదితి ఎక్స్ ట్రోవర్ట్ పాత్ర. రెండు మూడు సీన్లలో లెక్చరర్ గా రాజారవీంద్ర.

        పాత్రల పేర్లు రామ్, రాధ, కృష్ణ, వసుధ అని వాటి మధ్య సంబంధాల్ని తెలపడానికన్నట్టుఅమెచ్యూరిష్ రైటింగ్ గా వున్నాయి. రామ్ పక్కన రాధని చూసిన లెక్చరర్, ఆమెని సీతా అని పిలవడం మరీ చాదస్తపు స్క్రిప్టు రచనగా వుంది. యూత్ సినిమా అన్నప్పుడు యూత్ అప్పీల్ లేకపోతే కష్టం. పాటలు మెలోడీ ప్రధానంగా వున్నాయి. సాంకేతికంగా బడ్జెట్ కి తగ్గట్టు వుంది.

చివరికేమిటి

     టైమ్ ట్రావెల్ జానర్ ప్రేమ కథని  సైన్స్ ఫిక్షన్ చేయకుండా ప్రేమ కథే ప్రధానంగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేట్టు తీశారు. ఫస్టాఫ్ లో హీరోయిన్ హామ్ రేడియోతో సెకండ్ హీరోతో కనెక్ట్ అయినప్పుడు గానీ హీరోయిన్ 1983 లో వున్నట్టు తెలీదు. ఇలా ఫస్టాఫ్ లో కథనం రీఫ్రెష్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ ప్రశ్నల్ని రేకెత్తించేలా సాగుతూ, ఫస్ట్ హీరోని ముందుకు తెస్తూ, ఇంటర్వెల్ కి కథనం మరో ప్రశ్నతో రీఫ్రెష్ అవుతుంది.

        ఇలా సెకండాఫ్ లో కూడా మరో మూడు సార్లు కథనం రీఫ్రెష్ అవుతూ ప్రశ్నల్ని రేకెత్తించే మలుపులతో బలంగా మారుతుంది. కథనమంటే ప్రశ్నలు రేకెత్తించి జవాబులివ్వడమనే చైతన్యం కాబట్టి, ఇక్కడ ఇది భిన్నకాలాల్లో సాగే సమాంతర కథకి కుదిరింది. ఇలా కథనం రీఫ్రెష్ అవుతూ కూర్చోబెట్టే సినిమాలు ఎక్కడొస్తున్నాయి గనుక. ప్రేమ కథ కాస్తా కుటుంబ కథగా మలుపు తిరిగి చిక్కుముడి వేయడం, ఆ ముడి విప్పి మళ్ళీ ప్రేమ కథగా మారడం ఇవన్నీ సస్పెన్సుని కూడగట్టుకుని సాగుతూంటాయి సెకండాఫ్ లో.  

        అయితే రచన, దర్శకత్వం, మేకింగ్ మరింత యూత్ ఓరియెంటెడ్ గా, మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని వుంటే, సినిమా ఇలా అనామకంగా వచ్చి వెళ్లిపోయేది కాదు. పబ్లిసిటీ పరంగా కూడా సినిమాకి డిజిటల్ ప్రెజెన్స్ లేదు. రివ్యూలు సరే, ఎక్కడా కన్పించవు. సినిమా వివరాల గురించి ఒక వీకీపీడియా పేజీని కూడా క్రియేట్ చేసుకోలేకపోతే, సినిమాఎందుకు రిలీజ్ చేయడమనేది ప్రశ్న. కథలో ప్రశ్నలున్నట్టు పబ్లిసిటీలో కూడా ప్రశ్నలుండా లనుకున్నారేమో?

సికిందర్

Monday, October 11, 2021

1062 : రివ్యూ


రచన- దర్శకత్వం :  నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : శివ కార్తికేయన్
, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, యోగిబాబు, మిలింద్ సోమన్, రెడిన్ కింగ్ స్లే, జారా వినీత్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
నిర్మాతలు : శివ కార్తికేయన్
, కోటపడి రాజేష్
బ్యానర్ : శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్
, కేజేఆర్ స్టూడియోస్
విడుదల అక్టోబర్ 9
, 2021

***

        మిళంలో డాక్టర్ అనే టైటిల్ తో ఈవారం విడుదలైన శివ కార్తికేయన్ మూవీ తెలుగులో వరుణ్ డాక్టర్ గా అనువాదమైంది. ఓ స్టార్ తో కమర్షియల్ సినిమాని డార్క్ కామెడీ క్రైమ్ గా తీయడం సాహసమే. నయన తారతో కూడా కొలమావు కోకి (కోకో కోకిల) అనే డార్క్ కామెడీ క్రైమ్ తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, శివ కార్తికేయన్ ని ఫ్యాన్స్ వూహలకి పూర్తి వ్యతిరేకంగా- నాన్ కమర్షియల్ గా ప్రెజెంట్ చేస్తూ, తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్నాడు పదిన్నర కోట్ల బంపర్ బాక్సాఫీసుతో.

        ముందున్న నిర్మాత తప్పుకోవడంతో శివ కార్తికేయనే భుజాన వేసుకుని నిర్మాతగా మారాడు. ఇదొక సాహసం. ఈ సాహసాలకి సోలో రిలీజ్ కూడా తోడై, సెక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ వారమంతా. దీని కథాకమామిషేమిటో చూద్దాం...

కథ

     వరుణ్ (శివ కార్తికేయన్) మిలిటరీ డాక్టర్. రూల్స్ తో కచ్చితంగా వుంటాడు. నవ్వడు. మాట్లాడడు. మొహం సీరియస్ గా పెట్టుకుని, దేనికీ చలించక, బెల్లం కొట్టిన రాయిలా వుంటాడు. పెళ్ళి చేసుకోడానికి వూరెళ్ళి పద్మిని (ప్రియాంకా అరుళ్  మోహన్) తో నిశ్చితార్ధం చేసుకుని తిరిగి వస్తాడు. వచ్చాక పెళ్ళి క్యాన్సిల్ చేస్తుందామె. మళ్ళీ ఆమె ఇంటికెళ్ళి కారణం అడుగుతాడు. నీలాటి ఎమోషన్లు లేని రోబో మొహంతో పెళ్ళి కుదరదని చెప్పేస్తుంది. ఇక ఏం చెయ్యాలా అని బయటి కెళ్ళి టీస్టాల్ దగ్గర కూర్చుంటే, ఆమె కుటుంబ సభ్యులు బయటికి వచ్చి గోల చేస్తూంటారు. స్కూలు కెళ్ళే పద్మిని చెల్లెలు చిన్నూ (జారా వినీత్) కిడ్నాపైందని గోల. పద్మిని సహా వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు వరుణ్ డాక్టర్. పోలీసులు కిడ్నాప్ ని లైట్ గా తీసుకునేసరికి, ఆ కుటుంబ సభ్యుల్నే టీముగా ఏర్పాటు చేసి, తానే ఒక ప్లానేస్తాడు చిన్నూని వెతకడానికి. ఇంతకీ చిన్నూ ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? టీముతో కలిసి ఆమెని కిడ్నాపర్ల చెర నుంచి ఎలా విడిపించాడు వరుణ్ డాక్టర్? ఇదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

    డార్క్ కామెడీ జానర్లో క్రైమ్ థ్రిల్లర్ ఇది. అవతలి వాడు బాధలో వుంటే, ఆ బాధ మీద జోకులేసి ఆనందించే శాడిజం డార్క్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ. చావింటికెళ్ళి కూడా ఆ చావు మీద జోకులేయవచ్చు - చచ్చాడా? నేనొచ్చే వరకూ ఆగమన్నానే - అనడం లాంటిది. ఈ జానర్లో చేసిన సీరియస్ కిడ్నాపుల కథ ఇది. ఒక కిడ్నాప్ కామెడీ కావచ్చు, కానీ వందల మంది పిల్లల కిడ్నాపులతో హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడితే అది సీరియస్ వ్యవహారం. ఈ సీరియస్ వ్యవహారాన్ని బ్లాక్ కామెడీగా తీశాడు. నాని గ్యాంగ్ లీడర్ లో నాని ఫ్యామిలీని వెంట బెట్టుకుని అడ్వెంచర్ చేసినట్టు, ఇందులో శివ కార్తికేయన్ కూడా ఫ్యామిలీని టీముగా చేసుకుని అడ్వెంచర్ చేస్తాడు. ఈ రెండిటిలోనూ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహనే. ఈ పోలికలు కన్పిస్తాయి.

        కిడ్నాప్ తో వచ్చిన కథలు, హ్యూమన్ ట్రాఫికింగ్ తో వచ్చిన కథలు కొత్త కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్ ని డార్క్ హ్యూమర్ జానర్లో చూపించడం కొత్త. అయితే ఈ కథ సగానికి వచ్చేసరికి ఆ కామెడీ కాస్తా కనుమరుగై పోతుంది. కన్నడ ఫ్రెంచి బిర్యానీ లోలాగా, పాత రొటీన్ మాఫియా కథనే కామెడీ చేసి, ఆద్యంతం ఇన్నోవేట్ చేసిన ఫన్ తో నిలబెట్టినట్టు, ఇక్కడ డార్క్ కామెడీని కొనసాగించి నిలబెట్టడం జరగలేదు. మొదటి సగానికే సరుకు అయిపోయింది. రెండో సగం కథ సీరియస్ గా మారిపోయి, కథ కూడా తేలిపోయి రొటీన్ గా ముగియడం, అయినా వేరే సినిమాల్లేక తమిళంలో హిట్టవడం దీని ప్రత్యేకతల్లో కెల్లా ప్రత్యేకతగా భాసిస్తోంది.

నటనలు -సాంకేతికాలు

    శివ కార్తికేయన్ ఈసారి ఫ్యాన్స్ కోసం తన బ్రాండ్ మాస్ నటన జోలికి పోకుండా, ఏ భావాలూ పలకని బండ రాయి లాటి మొహంతో, మరమనిషి బాడీ లాంగ్వేజీతో, లోలోన మాత్రం అన్ని విలువలూ దాచుకున్న డాక్టర్ సుగుణాలతో, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయన్నట్టు, నవ్వితే నవరత్నాలు జారి పోతాయన్నట్టు- ఒక అర్ధం కాని  మానవాకారంలా వుంటాడు. ఇతణ్ణి చూసి మనం నవ్వడం తప్ప ఇతను నవ్వడు. ఇలా వుండడమే కామెడీ. ఇతడి వాలకం చూసి చూసి పెళ్ళి చూపుల్లో అడిగేస్తుంది పద్మిని, మీరెన్ని గంటలకి లేస్తారు?’ అని. ఫోర్ థర్టీ అంటాడు. ఏఁ? ఇంటింటికీ వెళ్ళి పాల పాకెట్లు వేస్తారా?’ అని డార్క్ కామెడీ వేసుకుంటుంది.  

        అస్సలు ఎంటర్ టైన్మెంటు జోలికి పోకుండా, గంటు మొహం పెట్టుకుని, యాక్షన్ చేసుకుంటూ పోయే ఇలాటి సింగిల్ ఎక్స్ ప్రెషన్ క్యారక్టరైజేషన్ని షూటింగ్ జరిగినన్నాళ్ళూ నిలుపుకోవడం కష్టమైన పనే. ఈ రిస్కుకి శివ కార్తికేయన్ని ఒప్పుకోవాలి. సెకండాఫ్ లో కథ కుంగినా, ఈ క్యారక్టరైజేషన్ కోసమే చూసేలా చేస్తాడు. కథ లేకపోయినా క్యారక్టరైనా కొత్తగా వుంటే బతికి బయట పడొచ్చు. ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా తమిళ అభిమానులు కిక్కురుమనక పోవడాన్ని బట్టి - ఇదొక కట్టి పడేసే క్యారక్టర్స్ మూవీగా ఎస్టాబ్లిష్ అవుతోంది. శివ కార్తికేయన్ ఈ క్యారక్టర్ ని నమ్మే నిర్మాతగా మారి వుంటాడు.

        హీరోయిన్ ప్రియాంకాకి పెద్దగా పాత్రేమీ లేదు. టీములో హీరోతోనే వున్నా, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది కాబట్టి రోమాన్స్ కూడా లేదు. మళ్ళీ అతడికి దగ్గరయ్యే సూచనలతో కథనం కూడా ఆమెకివ్వలేదు. సినిమాలో హీరో హీరోయిన్ల రోమాన్స్ లేని లోటు కూడా కన్పించదు. సెకండాఫ్ లో కిడ్నాప్స్ కథ తేలిపోయినా, రోమాన్స్ తో, సాంగ్స్ తో భర్తీ చేయాలనుకోలేదు.

        కమెడియన్ యోగిబాబు మరోసారి కామెడీని నిలబెట్టాడు. ఛోటా కిడ్నాపర్ పాత్ర వేశాడు. వరుణ్ డాక్టర్ తన కిడ్నీ తీసి దాచిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నమ్మి అతడి వెంటే వుండే అమాయక పాత్ర. అలాగే కానిస్టేబుల్ గా, గొంతు చించుకుని మాట్లాడే కామెడీ పాత్రలో రెడిన్ కింగ్ స్లే బాగా నవ్విస్తాడు. పై అధికారితో కూడా అలాగే అరిచి మాట్లాడతాడు. ఎందుకలా అరుస్తావ్? భోం చేశావా?’ అంటాడు అధికారి. కిడ్నాప్ కంప్లెయింట్ ని లైట్ గా తీసుకుంటే, విసిగి వెళ్ళి పోతున్న హీరోయిన్ తండ్రిని చూసి, అమ్మాయి ఇక రాదని తెలుసుకుని ఇంకో బిడ్డని కంటానికి వెళ్తున్నాడు చూడు!’ అని డార్క్ కామెడీ చేస్తాడు కింగ్ స్లే. ఇతను, యోగిబాబు కథ చెదిరిన సెకండాఫ్ లో అక్కడక్కడా సైడ్ కామెడీతో నవ్విస్తూంటారు.  

        విలన్ గా వినయ్ రాయ్ బలహీన క్యారక్టర్. ఈ మధ్య సినిమాల్లో విలన్లు ఇలాగే వుంటున్నారు. ఇక ముందు రోజుల్లో విలన్లు కనపడరేమో. కల్నల్ గా మిలింద్ సోమన్ కన్పిస్తాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో మాంటేజీ సాంగ్స్ వచ్చి పోతూంటాయి. ఏ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజికల్ అని టైటిల్స్ ప్రారంభంలో ప్రత్యేకంగా వేశారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ కెమెరా వర్క్ రిచ్ గా వుంది. ప్రొడక్షన్ విలువల కోసం బాగా ఖర్చు పెట్టారు. పాతిక కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే మెట్రో ట్రైన్లో ఫైట్ ఎక్సైటింగ్ గా వుంది.

చివరికేమిటి

    ఫస్టాఫ్ వరకూ డార్క్ హ్యూమర్ తో కథ నడిపించగల్గిన దర్శకుడు సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. డార్క్ హ్యూమర్ తో ఫస్టాఫ్ లో సీన్లు వినోదాన్నందిస్తాయి. సెకండాఫ్ లో కిడ్నాపైన కూతురు కోసం సీరియస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా, బరువుగా  మార్చేయడంతో డార్క్ హ్యూమరంతా అదృశ్యమైపోయింది. సెకండాఫ్ కి శివ కార్తీకేయన్ క్యారక్టరొక్కటే దిక్కుగా తయారైంది. కానీ వొట్టి క్యారక్టర్ కోసం సినిమా చూడాలా, కథతో కూడిన క్యారక్టర్ కోసం సినిమా చూడాలా? తమిళంలో మొదటిదే పట్టుకుని తెగ చూసేస్తున్నారు. శివ కార్తికేయన్ అక్కడ పాపులర్ కాబట్టేమో.

        ఇంటర్వెల్లో అసలు పెద్ద సంఖ్యలో గోవా గ్యాంగ్ పిల్లల కిడ్నాప్ కి పాల్పడుతోందని తెలుసుకున్నాక, సెకండాఫ్ లో గోవాకి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యాక ఇంటర్వెల్ దగ్గర ఆపిన కథ వదిలేసి ఫ్యామిలీ డ్రామా మొదలెడతారు. ఫస్టాఫ్ ఫన్ అంతా మాయమై పోతుంది. అలాగని ఒక థ్రిల్లర్ గా ఫస్టాఫ్ తో బాటు, సెకండాఫ్ లో కూడా థ్రిల్ చేసే సన్నివేశాలేం వుండవు. కథలో మలుపులుండవు. టెన్షన్ వుండదు, సస్పెన్స్ వుండదు. ఎక్కడా లాజిక్ అనే మాటే వుండదు. ఇన్ని లేకుండా ఈ డార్క్ క్రైమ్ కామెడీని ఒక్క హీరో విభిన్న క్యారక్టర్నే చూసి ఆనందించాలంటే తెలుగు ప్రేక్షకులు సాహసించాల్సిందే. అప్పుడు ఈ ప్రాజెక్టుతో సాహసాలు చేసిన హీరో సరసన, దర్శకుడి సరసన, తెలుగు ప్రేక్షకులు కూడా సరేలెమ్మని టికెట్లు కొనుక్కుని చేరతారు. సాహసవంతులుగా నిరూపించుకుంటారు.

సికిందర్

Saturday, October 9, 2021

1061 : రివ్యూ

దర్శకత్వం : బి గోపాల్
తారాగణం: గోపీచంద్
, నయన తార, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యూ సింగ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు  తదితరులు
కథ : వక్కంతం వంశీ
, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా
నిర్మాత : తాండ్ర రమేష్
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        త నెల తాజా సీటీ మార్ తో వచ్చిన గోపీచంద్ ఈవారం పాత  ఆరడుగుల బుల్లెట్ తో వచ్చాడు. 2017 నుంచీ విడుదల కష్టాల్లో వున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఇందులో నయన తార హీరోయిన్ గా నటించింది. మరో మూడు  పాత్రల్లో దివంగతులైన ఇద్దరు నటులు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు నటించారు. బ్రహ్మానందం కూడా తన బ్రాండ్ కామెడీతో నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించారు.

         సినిమాని ఇప్పటి ప్రమాణాలతో కాక, టైమ్ ట్రావెల్ చేసి, 2012 లో చూస్తున్నట్టు చూడాలి. ఎందుకంటే ఇది 2012 లోనే ఓ తమిళ దర్శకుడితో ప్రారంభమై, అతను తప్పుకోవడంతో చాలాకాలం వాయిదా పడి, చివరికి బి. గోపాల్ దర్శకత్వంలో 2017 లో నిర్మాణం పూర్తయింది. కనుక 2017 లో పూర్తయినా 2012 ప్రమాణాలతోనే చూడాలి. మరి అప్పుడైనా ఇది పేలే బుల్లెట్టేనా అన్న ప్రశ్న వస్తుంది. మొత్తం కలిపి తొమ్మిదేళ్ళు ఈ బుల్లెట్ ప్రయాణించి బాక్సాఫీసు చేరింది. బాక్సాఫీసు వుందా, బద్దలైందా ఓసారి చూద్దాం...

కథ

    హైదరాబాద్ లో శివ (గోపీచంద్) చదువులేని, గొడవలు పెట్టుకునే  ఆవారా బ్యాఛీ. ఇతడికో ప్రభుత్వోగి అయిన మూర్తి (ప్రకాష్ రాజ్) తండ్రి. ఆవారాగా తిరిగినా కుటుంబ మంటే పంచ ప్రాణాలు శివకి. తండ్రికి సెంటిమెంట్లు లేవు. తిడుతూంటాడు. ఇలా కాదని ముంబాయిలో ఉద్యోగం వేయిస్తాడు. అక్కడ గొడవ పెట్టుకుని వచ్చేస్తాడు శివ. ఇప్పుడు తండ్రి విజయవాడలో వుంటాడు. మళ్ళీ ఇక్కడా ఆవారా బ్యాచీయే శివ. ఈసారి ఓ అమ్మాయి (నయన తార) తో ప్రేమలో కూడా పడతాడు. ఇక్కడ కాశీ (అభిమన్యూ సింగ్) అనే బడా రౌడీ బెజవాడ కింగ్ గా వుంటాడు. వీడు మూర్తి ఆస్తిని కబ్జా చేస్తాడు. శివకి ఒళ్ళు మండుతుంది. ఇక వీడి కబ్జా నుంచి ఆస్తిని విడిపించుకుని, తండ్రి చేత ఎలా శెభాష్ అన్పించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

  మూడు వారాల క్రితమే సందీప్ కిషన్ నటించిన ఫ్రెష్ గల్లీ రౌడీ' యే ఔట్ డెటెడ్ కథతో వచ్చినప్పుడు, పురాతన కాలపు ఆరడుగుల బుల్లెట్ కథని ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. రెండూ బాక్సాఫీసుకి రొమ్ము విరిచే నిల్చున్నాయి. బాక్సాఫీసు ఫిరంగి ఎదురు మోతకి రివర్స్ లో వచ్చిన చోటుకి 1980 లోకి వెళ్ళిపోయాయి. మనిద్దరి ఆస్తిని విడిపించుకునే కథలు మరింకోసారి దండయాత్రలో ప్రయోగిద్దాంలే అని బుల్లెట్ ని ఓదారుస్తూ రౌడీ.   

      ఆరడుగుల బుల్లెట్ 2017 లో కాదు 2012 లో వచ్చినా ఇంతే. ఇలాటి ఆవారా హీరో కథలు 2008-10 నాటికే తనువు చాలించాయి. అయినా 1980-90 ల నాటి కథని 2012లో రుద్దే ధైర్యానికి మెచ్చుకోవాలి. అదీ ఇప్పుడు 2021 లో ఓటీటీలో విడుదల చెయ్యక థియేటర్ల మీద దండయాత్రకి వదలడం ఇంకా విచిత్రం - సరికొత్త మాస్ సినిమా సీటీమార్ నే మాస్ ప్రేక్షకులు కాదన్నాక!

      2012 లో గబ్బర్ సింగ్, దమ్ము, దరువు, జులాయి, రచ్చ, రెబల్ వంటి మాస్ సినిమాల మధ్య వచ్చినా ఫ్లాపయ్యేదే ఈ పాత కాలం కథతో. ఒక్కడున్నాడు, లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్, వాంటెడ్ వంటి యాక్షన్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న గోపీచంద్ కి, ఈ మందుగుండు లేని బుల్లెట్ యెక్కడ దొరికిందో అర్ధం గాదు. టైటిల్ కి మాత్రం పేల్చి చూసుకుంటే బావుందన్పించి నట్టుంది- కథ పేలుతుందా లేదా అనవసరం. ఈ కథ పేలనందుకు బాధ కాదు, ఇంత మంచి కమర్షియల్ టైటిల్ ఇంకొకరు వాడుకోకుండా వృధా పోయిందే అన్నదే  చింతించాల్సిన విషయం.

నటనలు - సాంకేతికాలు 
  శివగా మాస్ పాత్రలో గోపీచంద్ ఇంత అంకితభావంతో లీనమైపోయి నటించడం చాలా గ్రేట్. అతను టాలెంటెడ్ నటుడే. బుల్లెట్ పేలడానికి తన వంతు కృషినంతా చేశాడు. దర్శకుడు, రచయిత నకిలీ బుల్లెట్ ఇచ్చారని తెలుసుకోలేక పోయాడు. డాన్సులూ ఫైట్లతో తను డైనమైట్లే పేల్చి వుండొచ్చు గాక, పక్కన కథని పేల్చడం దర్శకుడు, రచయిత మర్చిపోతే ఏం చేయగలడు.

నయన తారలాంటి స్టార్ హీరోయిన్ తో రోమాన్స్ కూడా పేలకుండా చేశారు. నయనతారని అదిరిపోయే గ్లామర్ తో మాత్రమే చూపిస్తే సరిపోతుందా? అసలు మాస్ సినిమా అంటేనే అన్ని హద్దులూ దాటేసి ఇష్టానుసారం కథని పేల్చడమే కదా? లాజిక్ ఎవడు అడుగుతాడు. లేనప్పుడు మాస్ సినిమా తీయడమెందుకు? విలన్ అభిమన్యూ సింగ్ ని కూడా పేలవంగా, పరమ వీక్ గా తయారు చేశారు. అతను వీకైతే అతడి తమ్ముడ్ని దించారు. తమ్ముడు కూడా వీక్ కి వీకున్నర.

        ఇక బ్రహ్మానందం బారెడు కామెడీ ట్రాక్. సెకండాఫ్ లో స్పేస్ ఫిల్లర్ గా అప్పట్లో బ్రహ్మానందం బకరా కామెడీ ట్రెండ్ నడిచింది. 2012 లో తయారు చేసుకున్న కథకి ఇదొక్కటే అప్పటి ట్రెండ్ ప్రకారం వుందని సంతోషించాలి.

        మణిశర్మ సంగీతంలో పాటలు ఇప్పుడు గుర్తుండి వుండవు. పాటలు అప్పటివి. మిగతా ప్రొడక్షన్ విలువలు తన జమానాలో అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి. గోపాల్ స్థాయిలోనే వున్నాయి. వీటి విషయంలో ఆయన తన ఇమేజికి లోటు రానివ్వలేదు. 2009 లో మస్కా తో తన శకం ముగిశాక, 2017 లో అప్డేట్ అవకుండా పాత స్టయిల్లోనే  దర్శకత్వం వహించడం మాత్రం బాగాలేదు.

చివరికేమిటి

   పరుచూరి బ్రదర్స్ రచనలతో అనేక విజయవంతమైన మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు తీస్తూ వుండిన బి. గోపాల్ కి సినిమా కథ అవసరాలేమిటో తెలియకుండా వుండదు. అయినా కొత్త తరం రచయిత రాసిన ఈ మిడిల్ మటాష్ కథని అంగీకరించడం ఆశ్చర్య పర్చే విషయం. కథతో సమస్య వల్లే మొదట్లో వున్న తమిళ దర్శకుడు వెళ్లిపోయాడు. గోపాల్ పరుచూరి బ్రదర్స్ ని ఎంటర్ చేయాల్సింది.

    ఈ కథ 2012 నాటికే కాలం చెల్లిన కథ అవచ్చు. కథనమైనా బావుండాలిగా? మిడిల్ మటాష్ కి బలి చేస్తే ఏ కథ బతుకుతుంది? పరుచూరి బ్రదర్స్ ఈ మిడిల్ మటాష్ ని త్రీయాక్ట్ స్ట్రక్చర్లో బతికించే వాళ్ళు. కోట్లు వ్యయం చేసే సినిమాకి మిడిల్ మటాష్ తో కథా? లక్షతో తీసినా క్షమించరాని నేరమే. ఇలా తీసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. అయినా రచయితలు తెలుసుకుని మారకపోతే నేరస్థులే.  

        ఫస్టాఫ్ లో హీరో జీవం లేని కుటుంబ సీన్లు, ఆవారాతనం, హీరోయిన్ తో జీవం లేని లవ్ ట్రాక్, కామెడీ, ఇవన్నీ ఇంటర్వెల్ దగ్గర్లో విలన్ వచ్చేదాకా స్పేస్ ఫిల్లర్లుగా వుంటాయి. విలన్ వచ్చాక అందుకున్న కథ వాడికీ, హీరోకీ మధ్య సంఘర్షణగా నడవదు. వాణ్ణి మూల కూర్చో బెట్టేసి సెకండాఫ్ టెంప్లెట్ ప్రకారం బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ. విలన్ కాసేపు కనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరోకి వాడు లాక్కున్న ఆస్తి గురించి బాధే వుండదు. హీరోయిన్ తో సాంగ్స్, ఫారిన్ లొకేషన్స్ లో డాన్సులు. క్లయిమాక్స్ లో గానీ ఇంటర్వెల్లో ఆగిపోయిన విలన్ తో కథ ప్రారంభం కాదు! దీన్ని సినిమాగా ఎవరైనా ఒప్పుకుంటే హిట్ చేయమని చెప్పాలి.

సికిందర్
(Published in telugurajyam.com,
 a US based website)