రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 2, 2020

903 : కొత్త శీర్షిక!



రచన, దర్శకత్వం: రీతేష్ రానా
తారాగణం :  శ్రీ సింహ, త్య, రేష్ అగస్త్య, అతుల్యా చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖా రామన్, అజయ్ ఘోష్ దితరులు
సంగీతం: కాల భైర, ఛాయాగ్రహణం : సురేష్ సారంగం, కూర్పు : కార్తీక శ్రీనివాస్
బ్యానర్స్‌: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: చిరంజీవి,  హేమలత
***
      అందరికీ కొత్త దశాబ్ద కానుకగా ఈ కొత్త శీర్షిక - కొత్త డైరెక్టర్ కహానీ!...2019 లో చిన్న చిన్న సినిమాలు తీసిన కొత్త దర్శకులు 88 మంది పరిచయమయ్యారు. ఎప్పటిలానే ఇద్దరే సక్సెస్ అయ్యారు (ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా). 2018 లో మొదటి సినిమా సక్సెస్ అయి 2019 లో రెండో సినిమాతో కూడా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్కడే వున్నాడు (బ్రోచే వారెవరురా). మన్మథుడు 2, రాజుగారి గది 3, కొబ్బరి మట్ట తీసిన మలి ప్రయత్నం దర్శకులు షరామామూలుగానే ఫ్లాపయ్యారు. ఈ 88 లో 86 మంది అవకాశాల కోసం కొన్నేళ్ళ పాటు ఎంతో శ్రమపడి వుంటారు. హోం వర్క్ సరిగ్గా లేక దొరికిన ఆ వొక్క అవకాశాన్ని వృధా చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో. ఇదే తంతు  ప్రతీ సంవత్సరం జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళల్లో 95 శాతం రోమాంటిక్ కామెడీలు తీసే లోకంలోనే ఏదో సాధిద్దామని ఇంకా కొట్టు మిట్టాడుతున్నారు. చాలా సార్లు చెప్పుకున్నట్టు, సమస్య ఏమిటంటే, గత రెండు దశాబ్దాలుగా తెలుగు యూత్ సినిమా అంటే రోమాంటిక్ కామెడీలనే నమ్మకంతో వచ్చి పడుతున్న రోమాంటిక్ కామెడీలే చూసి చూసి, పెరిగిన తరం, మళ్ళీ ఆ రోమాంటిక్ కామెడీలే  తీయడం! ఇవి తప్ప ఇంకో జానర్ తెలియని పరిస్థితుల్లో వుండి పోవడం. వీళ్ళకి దొరికే నిర్మాతలకి సినిమాల గురించి ఏమీ తెలియక పోవడం. సరే, మొత్తం మీద 2019 సస్పెన్స్ - మిస్టరీ థ్రిల్లర్ల సంవత్సరంగా చిన్న సినిమాలకి కొంత దారి చూపించింది. ఓ ఐదారు తీశారు. మూడు సక్సెస్ అయ్యాయి -బ్రోచే వారెవరురా, ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా. 

         ‘మత్తు వదలరా’ న్యూయేజ్ సినిమా అనీ, కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా అనీ అంటున్నారు గానీ రెండూ కాదు. ఫలానా హాలీవుడ్ సినిమా శైలి ప్రభావమనడమూ కరెక్ట్  కాదు. ‘స్కాట్ పిల్గ్రిమ్స్ వర్సెస్ ది వరల్డ్’ ఓ కామిక్ బుక్ ఆధారంగా తీసిన సెమీ ఫాంటసీ. దాని మేకింగ్ శైలి పూర్తిగా వేరేగా వుంది. ‘మత్తు వదలరా’ దర్శకుడు రీతేష్ రానా సొంత శైలిని నిర్మించుకుని మేకింగ్ చేశాడు. ఐతే చాలావరకూ ఏమవుతుందంటే, ఒక సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చే కొత్త దర్శకులు ఈ కాలంలో లేరు. బాపు శైలి, వంశీ శైలి, భారతీరాజా శైలీ అనేవి గత చరిత్రలు. ఒకరిద్దరు సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చినా రెండో సినిమాకి ఆ శైలీ వుండదు, భావ సంపదా వుండదు, మూసలోకి ముస్తాబై విచ్చేస్తారు. డీఐ వచ్చేసి కెమెరా మాన్ సొంత శైలినెలా తినేసిందో, చిన్న చిన్న సినిమాల కొత్త దర్శకులు టెక్నాలజీ కాలుష్యమే స్టయిల్ అనుకుని గుర్తింపు లేకుండా పోతున్నారు. డిజిటల్ టెక్నాలజీ స్టయిల్ నివ్వదు, అది కళారూపానికి అస్థిపంజరాన్నేఇస్తుంది. మిగతా రక్తమాంసాల్ని కళాకారుడి అంశతో చేత్తో అద్దాల్సిందే. దీన్ని కథా కథనాల మీద, నటనల మీదా ప్రదర్శించాల్సిందే.      

కథ 
      ఇది ఒక కొరియర్ డెలివరీ బాయ్ కథ. బాబూ మోహన్ (సింహా), యేసు బాబు (సత్య), అభి (నరేష్ అగస్త్య) లు ఒక బస్తీలో రూమ్మేట్స్. బాబూ మోహన్ కొరియర్ డెలివరీ బాయ్ గా, యేసు బాబు డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూంటారు. అభి కంప్యూటర్లో సినిమాలు చూస్తూ వుంటాడు. ఏదో షెర్లాక్ హోమ్స్ టాలెంట్ వున్నట్టు కన్పిస్తాడు. బాబూ మోహన్ కి వచ్చే జీతం చాలదు. మేనేజర్ జీతంలో కోత  పెడుతూంటాడు. చాలీ చాలని జీతంతో అద్దెలు కట్టలేక విసిగి ఈ పని మానేద్దా మనుకుంటాడు. యేసు బాబు ఆపుతాడు. ఆపి, ఇదే వృత్తిలో అదనపు డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చిట్కా చూపిస్తాను పదమని డెలివరీకి తీసికెళ్తాడు. అక్కడ క్లయంట్ దగ్గర పేమెంట్ తీసుకుంటున్నప్పుడు, ఓ అయిదు వందల నోటు ఎలా నొక్కేసి అడగాలో చూపిస్తాడు. దీనికి బాబూమోహన్ ఒప్పుకోడు. ఎలాగో ఒప్పిస్తాడు యేసుబాబు. 

        మరో డెలివరీ కెళ్ళినప్పుడు ఆ చిట్కా ప్రయత్నిస్తాడు బాబూ మోహన్. ఆ రిచ్ అపార్ట్ మెంట్ లో ఓ బామ్మ (పావలా శ్యామల) కి డెలివరీ ఇచ్చి పేమెంట్ తీసుకున్నప్పుడు, అతను నోట్లు లెక్క బెట్టడాన్ని పట్టి పట్టి చూస్తుంది బామ్మ. అతడి చిట్కా పారదు. మంచి నీళ్ళు కావాలంటే తేవడానికి వెళ్తుంది. ఆమె నీళ్ళు తెచ్చేటప్పటికి చిట్కా అమలు చేసేసి ఒక నోటు తగ్గిందంటాడు. ఆమె తిరగబడుతుంది. ఆ పెనుగులాటలో ప్రమాదవశాత్తూ చనిపోతుంది. మత్తు ఆవరించి అతనూ పడిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే  పక్కన ఇంకో శవం వుంటుంది. డెలివరీ బ్యాగు తీసుకుని పారిపోయి వచ్చేస్తాడు. వచ్చేసి చూస్తే డెలివరీ బ్యాగులో 50 లక్షలుంటాయి.

        ఈ డబ్బెక్కడిది? బామ్మ తన వల్లే చనిపోయిందన్నభయంతో వుంటే, ఆ రెండో శవం ఎలా వచ్చింది? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇదీ కథ.   


ఎలా వుంది కథ
     క్రైం జానర్లో కాలం చెల్లిన మిస్టరీ సబ్ జానర్. మార్కెట్ యాస్పెక్ట్ వచ్చేసి ఎకనమిక్స్. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ మిస్టరీకి కామెడీని జత చేయడం. సినిమాల్లో నేటి యూత్ అప్పీల్ ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ కథలుగా వుంటోందని తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ డబ్బు గురించి ఎకనమిక్స్ యాస్పెక్ట్ తోనే యూత్ ని ఆకట్టుకునే బాక్సాఫీసు అప్పీల్ తో వుంది. ‘బ్రోచేవారెవరురా’ క్రైం జానర్ కూడా ఎకనమిక్స్ తోనే సక్సెస్ అయ్యింది. ‘హుషారు’ అనే రెగ్యులర్ యూత్ కూడా. ప్రస్తుత మర్డర్ మిస్టరీలో మాట వరసకైనా రోమాంటిక్స్ ని జత చేయ లేదు. అంటే హీరోయిన్ లేదు, అంతేగాకుండా పాటలూ లేవు. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయిన్ వున్నా రోమాన్స్ లేదు. ఆ రోమాన్స్ ని సబ్ టెక్స్ట్ లో ఫీలవుతారు ఆడియెన్స్. అరుదుగా కొత్త మేకర్స్ బాక్సాఫీసు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు.

         సాధారణంగా సీరియస్ గా వుండే మర్డర్ మిస్టరీకి కామెడీతో క్రియేటివ్ యాస్పెక్ట్ ని జత చేయడం ఒక ప్రయోగమే. హార్రర్ కి కామెడీని జత చేసే హార్రర్ కామెడీల్లాగా. ఇక్కడ ఆయా హత్యా స్థలాల్లో  హీరో తన పక్కన ఫ్రెండ్స్ ని వూహించుకునేలాటి  కల్పన - ఫాంటసీ -  హార్రర్ సినిమాల్లో వుంటుంది. హార్రర్ కాకుండా,  ‘చమత్కార్’ లాంటి కామెడీల్లో కూడా వుంటుంది. ఇందులో సర్వం పోగుట్టుకున్న షారుఖ్ ఖాన్ స్మశానంలో కూర్చుంటే, ఆత్మ రూపంలో నసీరుద్దీన్ షా వచ్చేసి తోడ్పడే ఫాంటసీ కామెడీ ఇది. ప్రస్తుత మర్డర్ మిస్టరీ లో, హీరో ఇమాజినేషన్లో ఫ్రెండ్స్ ని ప్రవేశ పెట్టి కామెడీ చేయకపోతే ఈ సినిమా నిలబడేది కాదు. 

        ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో ఇలాటి మర్డర్ మిస్టరీ కథలతో వుండే సమస్యే మిటంటే, ఇవి ఎండ్ సస్పెన్స్ తో వుంటాయి. ఈ నేరస్థుడెవరో పరిశోధిస్తూ / దర్యాప్తు చేస్తూ చిట్ట చివరి దాకా ప్రేక్షకులకి తెలియకుండా వుంచే సస్పన్స్ ఇది. ఇది ఏనాడో సినిమాలకి వర్కౌట్ కాదని, కాలం చెల్లిందని హాలీవుడ్ గుర్తించి, అవే మిస్టరీల్ని సీన్ టు సీన్ సస్పెన్స్ గా మార్చి తీయడం మొదలెట్టింది. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్రిటిష్ నమూనాని పెట్టుకుని హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఫ్రీమేక్స్ చేసేశారు. అది కృష్ణతో  ‘అవేకళ్ళు’, కాంతారావుతో ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు వస్తున్న కాలం. దీన్ని బ్రేక్ చేస్తూ పై భాషల్లో బ్రిటిష్ నమూనాతో వచ్చిన మర్డర్ మిస్టరీల్లో మర్డర్ వుంటుంది. కానీ మర్డర్ జరిగినట్టు చూపించరు, చెప్పరు, తెలియనివ్వరు. ఇంకో కథ నడిపిస్తూంటారు. అది ప్రేమ కథ కావచ్చు, కుటుంబ కథ కావచ్చు, ఇంకేదేనా కావచ్చు. ఈ కథ వెళ్లి వెళ్లి చివరికి, దాచి పెట్టిన మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, అంతవరకూ నడిపిన కథలో క్యారక్టర్ ని కిల్లర్ గా పట్టుకోవడంగా ట్విస్ట్ ఇస్తారు. అంటే ఈ జరిగిన కథంతా జరిగిన ఒక హత్యలో హంతకుణ్ణి పట్టుకోవడం గురించే జరిగిందని అప్పుడు బయట పడుతుంది. దీంతో మర్డర్ తో వుండే బాక్సాఫీసు వ్యతిరేక ఎండ్ సస్పెన్స్ కథనం కవరై పోతుంది. అసలు మనం చూస్తున్నది మర్డర్ మిస్టరీ అనే ఫీలే వుండదు.  

        ఇంకో టైపు కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ క్రియేట్ చేసేది. ఇందులో హత్యనీ, హంతకుణ్ణీ ముందే చూపించేసి, వాణ్ణి పట్టుకోవడం గురించి సీనుకి సీనుకీ సస్పెన్స్ ని  పోషిస్తూ, ఓపెన్ గేమ్ గా చూపిస్తారు.

        ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాల్లో పదేపదే చెప్పుకున్నట్టు, చివరి దాకా నేరస్థుడెవరో  ప్రేక్షకులకి తెలియకుండా వుంచడమనే ఎండ్ సస్పెన్స్ కథనాలనేవి నవలా ప్రక్రియలు. ప్రసిద్ధ నవలల నుంచే ఆ కాలంలో ఇలాటి సినిమాలు రావడం మొదలెట్టాయి. కానీ నవలా కథనం వేరు, సినిమా కథనం వేరు. నవల చదువుతున్నప్పుడు మనస్సొక్కటే కథనం మీద ధ్యాసతో వుంటుంది. మిస్టరీ గురించి రకరకాలుగా వూహించుకుంటూ, ప్రశ్నలు వేసుకుంటూ చిట్ట చివరి పేజీల్లో మిస్టరీ వీడిపోయేదాకా. కానీ సినిమా చూస్తున్నప్పుడు మనస్సుతో బాటు కళ్ళు కూడా పనిచేస్తూంటాయి. ఇక్కడ మనసూ కళ్ళూ మ్యాచ్ అయితేనే సినిమాని చూడగలం. అంటే ఆ కళ్ళకి నేరస్థడు లేదా విలన్ తెరమీద కనపడిపోవాలి. అప్పుడే ప్లే రక్తి కట్టి సినిమాలో ఇన్వాల్వ్ అవగల్గుతారు.       
             ఎందుకిలా? మన మనో ప్రపంచం అలా వైరింగ్ అయి వుంది కాబట్టి. నిండు వెండి తెరమీద సినిమా చూడ్డమంటేనే, మనలోని  కాన్షస్ మైండ్ - సబ్ కాన్షస్ మైండ్ లు లడాయి పెట్టుకోవడం. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అంటారు. మన కాన్షస్ మైండ్  తెర మీద తన ప్రతినిధిగా హీరోని చూస్తూంటే, సబ్ కాన్షస్ మైండ్ విలన్ కి ప్రతీకగా వుంటుంది. అలాటిది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ కథల్లో విలన్ని చివరి దాకా మరుగున పెట్టేస్తే, మన సబ్ కాన్షస్ మైండ్ ని పక్కన పెట్టేసి కథ నడపడమే నన్న మాట. అంటే సినిమా చూస్తున్నప్పుడు మానసికంగా మనం కోరుకునే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని తొలగించెయ్యడమన్న మాట. అంటే మన మనస్సుల్లో సగ భాగాన్ని కత్తిరించి అవతల పారెయ్యడమన్న మాట. అంటే పరిపూర్ణ వీక్షణానుభవాన్ని నిరాకరించడమన్నమాట. అంటే అన్నం పెట్టి కూర వేయక పోవడమన్న మాట. అంటే న్యూ ఇయర్ కి స్నాక్స్ పెట్టి డ్రింక్స్ దాచేయడమన్న మాట. సినిమా తీసి నాలుగు డబ్బులు కళ్ళ జూడాలనుకునే రీజనబుల్ మానవుడు చేసే పనేనా ఇది? ఇదో రకం ఆత్మహత్య!

        ఇలా చిట్టచివర్లో నేరస్థుడు తెలిసే మిస్టరీ సినిమాలకి రిపీట్ ఆడియెన్స్ కూడా వుండరు. నేరస్థుడెవరో తెలిసిపోయాక రెండోసారి చూడ్డానికి సస్పెన్స్ ఏముంటుంది. సినిమా ఒకసారి చూస్తే చాలనుకుంటారా నిర్మాతలు? ఒకసారి చూడ్డానికైనా మిగిలేదెంతమంది? విడుదలైతే మార్నింగ్ షోకే ఆ ఎండ్ సస్పెన్స్ కొంపముంచుతుంది. షో చూసి వచ్చిన ప్రేక్షకులు నేరస్థుడెవరో చెప్పేస్తే చూడాలనుకునే ప్రేక్షకులకి చూడ్డానీకేమీ వుండదు. అప్పట్లో ‘అవేకళ్ళు’ చూసిన పాతాయన వున్నాడు. ఆయన ఇదే చెప్పాడు - ‘అవే కళ్ళు’ లో చివరికి దొరికే హంతకుడు నాగభూషణమేరా, నాగభూషణమేరా’ అని సినిమా చూసిన ప్రేక్షకులు బయటి కొచ్చి టాంటాం చేసి పారేశారని. ఓస్, ఐతే ఇంకేం చూస్తామని జనాలు అనుకోవడం. కనుక ఎండ్ సస్పెన్స్ సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ప్రేక్షకుల వరకే. ఇలా చెప్తే నొచ్చుకోవచ్చు, కానీ వాస్తవమిది. 


        నాటి ప్రపంచ ప్రఖ్యాత క్రైం నవలా రాణి అగథా క్రిస్టీ ఈ రకమైన మూస మర్డర్ మిస్టరీలకొక ఉపాయం కనిపెట్టింది. ఆమె రాసిన నవలలన్నీ ఎండ్ సస్పెన్స్ మిస్టరీలే. డిటెక్టివ్ హె ర్క్యూల్ పైరట్, లేదా డిటెక్టివ్ మిస్ మార్పుల్ పాత్రలతో మర్డర్ మిస్టరీలు రాసింది. ఆమె షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ అర్ధర్ కానన్ డాయల్ సరసన నిల్చింది. ఒక హత్య జరుగుతుంది. కొంత మంది అనుమానితులుంటారు. వీళ్ళల్లో ఎవరు హంతకుడో / హంతకురాలో డిటెక్టివ్ దర్యాప్తు చేసి చివర్లో రట్టు చేయడం. హత్య - అనుమానితులు -ఎవరు హంతకుడు చెప్పుకోండి చూద్దాం? - బాపతు టెంప్లెట్ లో అనాదిగా వుంటున్న మర్డర్ మిస్టరీల మూస కుంపటిని బద్దలు కొట్టి క్రైం సాహిత్యాభిమానుల్నిసంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ లో పన్నెండు మంది అనుమానితుల్లో ఎవరు హంతకుడనే కథ నడుపుతూ నడుపుతూ చివరి కొచ్చేసరికి కథని రివర్స్ చేసేసింది. అనుమానితుల్లో ఒకడే హంతకుడయ్యే సాంప్రదాయాన్ని తీసి అవతల పెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ పన్నెండు మంది అనుమానితుల్నీ హంతకులుగా పట్టించేసింది! అనుమానితుల్లో ఒకరు హంతకుడు అనే టెంప్లెట్ ని, అనుమానితులందరూ హంతకులే అనే కొత్త కథగా మార్చేసింది. ఇది ఎండ్ సస్పెన్స్ కే బిగ్ బ్యాంగ్. దిమ్మ దిరిగిపోయింది పాఠకులకి. ఇది మరో రీమేక్ గా సినిమా రూపంలో ఇటీవలే వచ్చింది. 

        ఒక కథ చేస్తున్నప్పుడు దాని సరికొత్త లాభదాయక వైవిధ్యాల కోసం రీసెర్చి కూడా అవసరమే. కథ రాసేపని తొంభై శాతమనీ, దాన్ని సినిమాగా తీసే పని పది శాతమేనని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు. దీన్నిలా మార్చుకోవచ్చు : కథ రాసేపని పది శాతమే, దాని రీసెర్చి తొంభై శాతం శ్రమ. ఐడియాని 90 రోజులు రీసెర్చి చేయండి, 10 రోజుల్లో రాసి అవతల పడెయ్యండి!

        ‘మత్తువదలరా’ లో అనుమానితులుండరు కానీ అదృశ్యంగా హంతకుడున్నాడన్న అంచనా ఇస్తూ కథ నడిపారు. చివర్లో ఆ అదృశ్య హస్తం రివీలయ్యాక, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్యే వచ్చింది. అప్పటి వరకూ విలన్ కన్పించక కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే లోపించింది. అంటే పాసివ్ కథనం అనివార్యమైంది. విలనే లేకపోతే ఎంత సేపని హీరో తంటాలు పడతాడు. పైగా చివర్లో హంతకుడు రివీలయ్యాక రిపీట్ ఆడియెన్స్ సమస్యతో బాటు, ఫస్ట్ షో వరకే షెల్ఫ్ లైఫ్ ప్రాబ్లం ఏర్పడింది. ఫలానా వాడు హంతకుడని టాక్ బయటికి వచ్చేస్తే, సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి అది స్పాయిలర్ అవుతుంది.  గత రెండు దశాబ్దాలుగా నయా మేకర్లు పదేపదే ఎండ్ సస్పెన్స్ సినిమాలు, పదేపదే పా సివ్ హీరో సినిమాలు, పదేపదే మిడిల్ మటాష్ సినిమాలు తీస్తున్నారు. వీటి గురించి పదేపదే రాసిరాసి, ఈ బ్లాగు ఉప్పెనలా పొంగి పొరలుతోంది. జై హింద్. బ్లాగు దారి బ్లాగుదే, మేకర్ల దారి మేకర్లదే.
ఎవరెలా చేశారు 
         హీరోగా శ్రీ సింహ కొత్త వాడయినా వున్న పాత్రని, పాత్ర చిత్రణని చిత్రిక పట్టాడు. ఐతే ఫ్రెండ్ నేర్పిన చిట్కా ప్రాక్టికాలిటీని కూడా అతను చిత్రిక పట్టాల్సింది. ఒకవేళ చిట్కా ప్రయోగిస్తూ దొరికిపోతే ఏం చేయాలన్న దాని గురించి. ఆ ఏం చేయాలన్న విరుగుడు మంత్రం తను అడగలేదు, ఫ్రెండ్ చెప్పలేదు. ఈ లోపం వల్ల ఫ్రెండ్ మాటే వేదంలా తీసుకుని పాసివ్ గా వెళ్లి ఇరుక్కున్నాడు. ఇది హీరో కుండాల్సిన లక్షణం కాదు. ఏదో విరుగుడు మంత్రాన్ని కూడా బామ్మ దగ్గర దొరికి పోయినప్పుడు ప్రయోగించి వుంటే పాత్ర పాసివ్ స్థాయి నుంచి  ఆ సన్నివేశంలో ఎదిగేది. ఏ సన్నివేశమైనా త్రీ యాక్ట్స్ లో వుంటుంది. అతను చిట్కా ప్రయోగించడం ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ అయితే, సెకండ్ యాక్ట్ ఆ ప్రయోగ ఫలితంతో సంఘర్షణగా వుంటుంది. సంఘర్షణ ఫలితంగా బామ్మ పడిపోవడం సెకండ్ యాక్ట్ ప్లాట్ పాయింట్ టూ అవుతుంది. ఇక్కడ అతను ఆ విరుగుడు మంత్రాన్ని ప్రయోగించిన ఫలితంగా బామ్మ పడిపోతే, ప్లాట్ పాయింట్ టూ అర్ధవంతంగా వుంటుంది. సన్నివేశం స్ట్రక్చర్ లో వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ చిట్కా ప్రయోగిస్తే అది బెడిసి కొట్టడమైతే, ప్లాట్ పాయింట్ టూ దీనికి పరిష్కారంగా విరుగుడు మంత్రం ప్రయోగిస్తే ఇది కూడా బెడిసి కొట్టడం. ఇలా చూస్తూ పోతే ఈ సినిమాలో అనేక సన్నివేశాలు బలహీనంగా వున్నాయి. సింహా ఎంత బాగా నటించినప్పటికీ సన్నివేశాల బలం కూడా అవసరం. 

        సత్య ఈ మిస్టరీకి ఎంటర్ టైన్మెంట్ సారధిలా నిల్చాడు. సింహా ఇమాజినేషన్ లో వచ్చి అతను చేసే ‘దెప్పి పొడిచే’ రివర్స్ కామెడీ, వివిధ గెటప్స్ లో నటనా కొత్తగా వున్నాయి. ఇంకో ఫ్రెండ్ పాత్రలో నరేష్ అగస్త్య, ఇమాజినేషన్ సీన్స్ లో షెర్లాక్ పరిష్కారాలు చెప్పేప్పుడు, ప్రొఫెషనల్ బిహేవియర్ తో మెప్పిస్తాడు. ఇతర ఫన్నీ పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, విద్యుల్లేఖా రామన్ లు ఎంటర్ టైన్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక దర్శకుడు బ్రహ్మాజీ ఎక్స్ ప్రెషన్స్ ని సమున్నతంగా క్లోజప్స్ లో పట్టుకోవడం ఇదే. బ్రహ్మాజీ క్లోజప్స్ నటనకి ఫిలిం స్కూల్ పాఠాలు. ఇక డ్రగ్ ఎడిక్ట్ గా అతుల్యా
చంద్రది నెగెటివ్ పాత్ర నటన. 

        కాల భైరవ సంగీతం ట్రెండీగా, క్యాచీగా వుంది యూత్ ని దృష్టిలో పెట్టుకుని. అలాగే  కెమెరా వర్క్ తో సురేష్
సారంగం, ఆర్ట్ డైరెక్షన్ తో ఏఎస్ ప్రకాష్, యాక్షన్ తో యు. శంకర్ లో- బడ్జెట్ అన్న ఫీల్ రాకుండా క్వాలిటీ నిచ్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ స్ప్లిట్ ఎడిట్ తో ట్రెండీ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఐతే క్లయిమాక్స్ నిడివిని తగ్గించ లేకపోయింది. లొకేషన్స్ పరంగా ఇంటీరియర్సే తొంభై శాతం వున్నాయి. ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్, ఒక బస్తీలో పోర్షన్, లో- బడ్జెట్ కివే లొకేషన్స్. డ్రగ్ మత్తు హేల్యూసినేషన్స్ సీజీ వర్క్ అభౌతిక లోకాల్ని సృష్టిస్తూ నాణ్యతతో వుంది. 

చివరికేమిటి
       రీతేష్ రానా, తేజాల రచన నూలు పోగంతటి కథని కథనంతో నిలబెట్టే ప్రయత్నం చేసింది. మొదటి ముప్ఫై ఐదు నిమిషాల్లో బామ్మ చావుతో మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) వచ్చేసింతర్వాత, చివరి ఇరవై నిమిషాలకి హంతకుడి గుర్తింపుతో రెండో మలుపు(ప్లాట్ పాయింట్ టూ) వస్తుంది. మధ్యలో గంటకి వచ్చే ఇంటర్వెల్ ఫాల్స్ ఇంటర్వెల్ బ్లాక్. ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు ఇంటర్వెల్లో ఆపి, ఓపెన్ చేస్తే - అది ఉట్టిదే నని తేల్చేయడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. కథనం ట్రాకు నుంచి తప్పిపోవడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చింది?- ఇదీ ప్రేక్షకులు వేసుకునే ప్రశ్న. కథమంటే ప్రశ్నలు వేసి జవాబులు చెప్పడమేగా? అలా ప్రేక్షకుల్ని బిజీగా వుంచడమేగా? లేకపోతే ఖాళీగా మరబొమ్మల్లా కూర్చోవడానికి ప్రేక్షకులు సినిమాల కొస్తారా?       

        తర్వాత ఆ తలుపు కొట్టిన బ్రహ్మాజీ పాత్ర కూడా హీరో ఇమాజినేషనే నని లాజికల్ గా వివరణ ఇవ్వొచ్చు. కథనం చెదిరి పోకుండా ట్రాకులో వుంటుంది. ఇంటర్వెల్ అంటే కథలోనే వెతుక్కుని సృష్టించే మలుపు, అంతేగానీ పక్క నుంచి ఇంకేదో తెచ్చుకుని కలిపేది కాదు.   ఫస్టాఫ్ ముప్ఫై ఐదవ నిమిషం నుంచీ ఇంటర్వెల్ ముందు సీను వరకూ బామ్మ సీనుతో ఒకే 25 నిమిషాల సుదీర్ఘ సీను. క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’ లో సీన్స్ లాగా. ఈ టెక్నిక్ వాడి వుంటే, ఇంత సుదీర్ఘ సీను ఉండుండి ఒక పెద్ద బ్యాంగుతో ముగిసివుంటే -‘కిల్ బిల్’ లో లాగా ఒక ‘వామ్మో’ (whammo) క్రియేట్ అయ్యేది. 

        ఫస్టాఫ్ తో పెద్దగా ఇబ్బంది లేదు, సెకండాఫ్ లోనే సమస్యలు. లాజికల్ సమస్యలతో బాటు, హంతకుడెవరన్న కాలం చెల్లిన మిస్టరీతో వచ్చే సమస్యలు. హంతకుణ్ణి రివీల్ చేశాక కథనంతో సర్వ సాధారాణంగా జరిగే తప్పే జరిగింది. ఇక ఆ హంతుకుడు ఏది ఎలా ఎప్పుడెందుకు చేశాడో సినిమా మొదట్నుంచీ వరసగా కార్యకారణ సంబంధాలు చెప్తూ వివరించే తతంగం. ఇది ప్రింట్ మీడియా నవలకి ఇప్పుడూ చెల్లుబాటవుతుంది, విజువల్ మీడియా సినిమాకి కాదు. అవన్నీ కలిపి ఆలోచించుకుంటూ అర్ధంజేసుకునే మానసిక శ్రమ ప్రేక్షకులు తీసుకోరు. పాసివ్ గా చూస్తూంటారు. అసలు దొరికిపోయిన హంతకుడు తన దుకాణ మంతా ఎందుకు విప్పుతూ కూర్చుంటాడు- అందునా ‘షెర్లాక్ హోమ్స్’ లాంటి వాడు? వాడు హీరో మెడకే బిళ్ళ వేసే ప్లానుతో వెంటనే ఉడాయిస్తాడు!

        అంటే ఈ సీను వెర్బల్ గా గాకుండా యాక్షన్ తో వుండాలి. వీడే హంతకుడని హీరో పట్టుకున్నాక, హంతకుడి చేత ఎలా హంతకుడో చెప్పిస్తూ కూర్చునే డైలాగుల దుకాణం పెట్టకుండా, ఆ హంతకుణ్ణి వెంటనే జంప్ అయ్యేలా చేస్తే - వాడి కోసం క్లయిమాక్స్ యాక్షన్ మొదలైపోతుంది. వీడే హంతకుడని హీరో పట్టుకోవడం ఆడియెన్స్ కి షాక్ వేల్యూయే అనుకుందాం- అప్పుడా షాక్ వేల్యూని సస్టెయిన్ చేయడం ఈ కీలక మలుపులో చాలా అవసరం. లేకపోతే ప్లాట్ పాయింట్ టూ కి అర్ధమే లేదు. ప్లాట్ పాయింట్ టూ అనేది స్క్రీన్ ప్లే కి మూడో మూల స్థంభం. వెంటనే హంతకుడు పారిపోయేలా చేస్తే ఇది సస్టెయిన్ అవుతుంది. అక్కడే వాడి చేత డైలాగుల దుకాణం పెట్టిస్తే, డైల్యూట్ అయిపోతుంది షాక్ వేల్యూ. పారిపోయిన వాణ్ణి హీరో పట్టుకుంటే, అప్పుడు హీరోయే వాడి అభియోగాల చిట్టా విప్పితే, యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు. హీరోకి అసలేమీ తెలీదన్నట్టు హంతకుడే  తన బాగోతం చెప్పుకుంటే హీరో పాసివ్ క్యారక్టర్ అయిపోతాడు. తను ఏదెలా చేశాడో తనే చెప్పుకుంటే  ఆడియన్స్ కి గగుర్పాటు కలగదు. ఎందుకంటే అది పాసివ్, సెకండ్ హేండ్ ఇన్ఫర్మేషన్, వాడి మాటలు నమ్మాలని కూడా లేదు.  వాడి నిజ స్వరూపం హీరోయే విప్పి చెప్పేస్తూంటే - ఆడియెన్స్ కి తాము కనిపెట్ట లేకపోయిన పాయింట్స్ ని ఇంతసేపూ (ఈ మిడిల్ విభాగంలో కథ జరిగినంత సేపూ) హీరో కనిపెడుతూనే  వున్నాడన్న స్పృహలో కొచ్చి, హీరో మీద అభిమానం మరింత పెరిగే అవకాశం వుంటుంది. హీరో అనేవాడు ఎప్పుడూ ప్రేక్షకులకంటే పై స్థాయిలో వుంటాడు.

        ఇలా చేసినా ఈ మిస్టరీ నిలబడుతుందా? పైనే చెప్పుకున్నట్టు, ఇలాటి ఎండ్ సస్పెన్స్ మిస్టరీలతో హంతకుణ్ణి దాచి పెట్టి చివరికి చెప్పడంలో వున్న మౌలిక సమస్య - మౌత్ టాక్ తో రివీలై పోయే, రిపీట్ ఆడియెన్స్ కి నెగెటివ్ గా పరిణమించే - బాక్సాఫీసు వ్యతిరేక ఫలితాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.

సికిందర్

Thursday, December 26, 2019

902 : రివ్యూ


            నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ లు కలిసి పాత రూలు ‘రూలర్’ తో  పురాతన రూలింగ్ ఇచ్చారు. పాత రూలుతో కొత్త రూలింగ్ ఇవ్వచ్చు, కానీ సవరణలు సంస్కరణలు ఇష్టపడలేదు. ఈ రివ్యూకర్తతో పది రోజులుగా జరుగుతున్న మేధోమధనాల్లో ఒక దర్శకుడి నిశ్చితాభిప్రాయం, సినిమాలకి రూల్స్ ఏమిటని. నిజమే, ‘గుండమ్మ కథ’ ని అప్పుడెలా తీశారో ఇప్పుడూ ఉన్నదున్నట్టూ అలాగే తీసి చూపించ వచ్చు. ‘పేదరాశి  పెద్దమ్మ కథ’ ని కూడా కార్బన్ కాపీలా తీసి విడుదల చేయవచ్చు. ‘పేదరాశి పెద్దమ్మ కథ’ లో మాంత్రికుడు నాగ కన్యని అపహరించి చిలుకగా మార్చేసే క్రియేటివిటీతో పన్నాగమైనా పన్నాడు, పాత సినిమాల్లోంచి కథల్ని అపహరించినప్పుడు ఈ మాత్రం  క్రియేటివిటీ కూడా ప్రదర్శించ నక్కర్లేదన్నట్టుగా వుంది  - ఉన్నదున్నట్టు తీసే యడమే. ‘బాషా’ ఆధారంగా ఎన్నెన్ని ఫ్యాక్షన్ సినిమాలొచ్చినా, ‘రూలర్’ ని ఇంకా అచ్చం ఆ ఫ్యాక్షన్ సినిమాల్లాగే అలాగే తీసే బలహీనత. ఏ క్రియేటివ్, మార్కెట్ యాస్పెక్ట్ రూల్సూ వర్తించవు కాలాన్నిబట్టి. సినిమా కళ గడ్డ కట్టిన పదార్ధమైంది కాబట్టి. 

       
‘రూలర్’ లో బాలకృష్ణ రెండు పాత్రలున్నాయి. దీంతో బాటు సోనాల్ చౌహాన్ సిటీ హీరోయిన్ పాత్ర, వేదిక సెకెండ్ హీరోయిన్ రూరల్ పాత్ర, ఒక రాజకీయ విలన్ పాత్రా వున్నాయి. ఇంకా సప్తగిరితో కమెడియన్ పాత్ర, ప్రకాష్ రాజ్ నీతిమంతుడైన రాజకీయ నాయకుడి పాత్రా వున్నాయి - టెంప్లెట్ లో వుండాల్సిన రెడీమేడ్ పాత్రలన్నీ సిద్ధంగా వున్నాయి. బాలకృష్ణ ఫస్టాఫ్ గెటప్ ఫర్వాలేదు, సెకండాఫ్ గిరిజాల జుట్టు గెటప్ గెటప్ లాలేదు. టెంప్లెట్ పాటలు, టెంప్లెట్ ఫైట్లూ అన్నీ వున్నాయి. దర్శకుడు కేఎస్ రవికుమార్ 30 ఏళ్ళుగా గ్లోబలైజేషన్ పూర్వపు అదే తన దర్శకత్వపు విలువల్ని, ఇంకా నేటి గ్లోబల్ మార్కెట్ లో అదే రూపంలో అలాగే అమ్మేద్దామనుకున్నాడు. 

        ఇందులో సరోజినీ నాయుడు (జయసుధ) సాఫ్ట్ వేర్ కంపెనీ చైర్ పర్సన్. ఆమెకి గాయపడ్డ వ్యక్తి (బాలకృష్ణ) ఒకడు దొరికితే తీసి కెళ్ళి చికిత్స చేయిస్తుంది. ఆ తర్వాత తనూ గాయపడి హాస్పిటల్లో వున్నప్పుడు ఆమె మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ వ్యక్తే ఆమెని కాపాడతాడు. ఆ వ్యక్తికి తానెవరో తెలీదు. జ్ఞాపక శక్తి కోల్పోయాడు. తనని కాపాడిన అతణ్ణి తన కొడుకుగా ప్రకటించి, అర్జున్ ప్రసాద్ అని పేరుపెట్టి - కంపెనీకి చైర్మన్ ని చేసేస్తుంది. 


      ఒక పోటీ కంపెనీ బాస్ కూతురు హారిక (సోనాల్ చౌహాన్) అర్జున్ ప్రసాద్ మీద కక్ష గట్టి అర్జున్ ప్రసాద్ బ్యాంకాక్ ప్రాజెక్టుని కొట్టేయాలని బయల్దేరుతుంది. వెంట తీసికెళ్ళిన ముగ్గురు హ్యకర్లతో (రఘుబాబు, ధన రాజ్, రఘు కారుమంచి) బ్యాంకాక్ లో అర్జున్ ప్రసాద్ డేటాని హ్యాక్ చేయబోయి దొరికిపోతుంది. గిల్టీ ఫీలవుతుంది. ప్రేమలో పడుతుంది. ఈ సంబంధం సరోజినీ నాయుడు ఖాయం చేసుకుంటుంది.  

        ఉత్తరప్రదేశ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. 1987 లో యూపీ కరువు కాటకాలతో వుందని మంత్రి వీరేంద్రనాథ్ టాగూర్ (ప్రకాష్ రాజ్) ఆంధ్రా రైతుల్ని రప్పించి వ్యవసాయంతో సస్యశ్యామలం చేయమంటాడు - అప్పట్లో నిజాం ప్రభుత్వం నిజాం సాగర్ డాం కట్టి, ఆంధ్రుల్నిరప్పించి వ్యవసాయం అప్పగించినట్టు. యూపీ వెళ్లి ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తారు ఆంధ్రా రైతులు. 

        ఇప్పుడు అక్కడి ఒక తెలుగు కుటుంబంలో సంధ్య (వేదిక) వుంటుంది. ఆమె గాయపడి మానసికంగా పిచ్చిదానిలా వుంటుంది. అక్కడికి రెవిన్యూ మంత్రి భవానీనాథ్ ఠాగూర్ పాల్పడుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం న్యాయ విచారణ వేస్తే ఆ విచారణ బృందాన్ని బెదిరిస్తాడు భవానీ నాథ్. 

        ఇక సరోజినీ నాయుడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తను ఆ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు పెట్టాలనుకుని వెళ్తే భవానీ నాథ్ తన మీద దాడి చేశాడు. అలా గాయపడ్డ తను హాస్పిటల్లో చేరితే, అక్కడ హత్యా ప్రయత్నం నుంచి భవానీ ప్రసాద్ కాపాడేడన్న మాట .

        ఇది తెలుసుకుని అర్జున్ ప్రసాద్ ఇప్పుడా ప్రాంతానికి వెళ్లి సోలార్ ప్రాజెక్టు భూమి పూజ ప్రారంభిస్తాడు. భవానీనాథ్ గ్యాంగుతో వచ్చేసి దాడి చేస్తాడు. అర్జున్ ప్రసాద్ ఎదుర్కొంటాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్ ని అక్కడి జనం గుర్తుపట్టి ‘ధర్మా’ అంటారు. ఇంటర్వెల్ పడుతుంది. 

జ్ఞాపక శక్తి పోగొడితే కొత్త కథా?
      ఈ ఫస్టాఫ్ కథ ఫ్యాక్షన్ టెంప్లెట్ లో దర్శనమిస్తుంది. వూళ్ళో సమస్య వున్న హీరో ఎక్కడో వెళ్లి అజ్ఞాతంలో ఇంకేదో చేస్తూ బ్రతకడం, ఎవరో గుర్తుపట్టి ‘బాబూ నువ్విక్కడు
న్నావా?’ అని ఆశ్చర్యపోవడం, ఆ బాబు గారైన హీరో ఇక్కడెందుకున్నాడో వూళ్ళో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవడం, ఆ ఫ్లాష్ బ్యాక్ లో విలన్ తో సమస్య చూపించడం, ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక మళ్ళీ విలన్ తో సమస్య వచ్చి హీరో వెళ్లి చంపడం... ఇలా చూసి చూసి వున్న, తెలిసిపోయే కథనపు టెంప్లెట్ లోనే రూలర్ కొత్త రూల్స్ లేకుండా పాతగా దర్శనమిచ్చాడు. కాకపోతే ఇక్కడ హీరో జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఇంటర్వెల్లో అతణ్ణి ధర్మాగా  గుర్తుపట్టడంతో సెకండాఫ్ లో ధర్మా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్యాక్షన్ కథల్లో పాత్రకి జ్ఞాపక శక్తి పోగొట్టి ఇంకో చోట బతికేలా చేస్తే కొత్త కథై పోతుందనుకున్నారు. మిగతా కథనమంతా కాలం చెల్లిన ఫ్యాక్షన్ వ్యవహారమే.  

        కానీ ఈ జ్ఞాపక శక్తి కోల్పోయిన ధర్మా ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్. ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ కన్పించకుండా పోతే ప్రభుత్వం పట్టించుకోలేదా? సరోజినమ్మ గారు గాయపడిన ధర్మాగారు దొరికితే ఆయన గారి జేబుల్లో ఏమీ లేదా? ఐడీ కార్డు కూడా? పోలీస్ ఇన్స్ పెక్టరైన హీరో మీద విలన్ దాడి చేయిస్తే ఆ ఇన్స్ పెక్టర్ పుట్ట గతుల్లేకుండా పోతాడా? పోతే పోయాడని డిపార్ట్ మెంట్ కూడా వూరుకుంటుందా? ఇలా క్యారక్టర్ ని మార్చి కొత్తగా ఏదో చేయబోయి దొరికిపోయారు. అంటే పై పైన కథా పాత్రలూ రాసేసి, పై పైన తీసేస్తే, బాలకృష్ణ ఇమేజియే గట్టెక్కించేస్తుందను కున్నట్టుంది. 

        ఫస్టాఫ్ కథనంలో ఆసక్తి కరమైనదేమీ వుండదు. చూసి చూసి వున్న అవే పాత టెంప్లెట్ సీన్లే, అదే క్రమంలో వచ్చి పోతూంటాయి. మోడరన్ గా హల్చల్ చేసే పాత్ర హారిక,  సరోజినమ్మ మంచికోడలిగా చేసుకుంటానగానే చీరకట్టుకుని కంపెనీ వదిలిపారేసి, సీన్లలో వూరికే వచ్చిపోతూ కరివేపాకు ఆఫర్ చేస్తుంది ప్రేక్షకులకి. రెండో హీరోయిన్ పాత్ర సంధ్య వేపాకు తిన్నట్టు వూగుతూ వుంటుంది పిచ్చితో. 

        వూరిమీద మంత్రి భవానీ ప్రసాద్ టాగూర్ దౌర్జన్యాలు, జనం హాహాకారాలూ చూసి చూసి వున్న పాత సీన్లే. నేటి కొత్త సినిమా సీన్లు కావివి. ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లుంటారు, బెంగాల్లో టాగూర్స్ వుంటారు. ఉత్తరప్రదేశ్ లో టాగూర్ పేరు పెట్టి పచ్చి విలన్లుగా ఎక్కడా చూపించలేదు, హిందీ సినిమాల్లో కూడా. విశ్వకవి, నోబెల్ గ్రహీత రవీంద్ర నాథ్ టాగూర్ ని గుర్తు చేసేలా విలన్ కి భవానీ నాథ్ టాగూర్ అని పేరు పెట్టడమేమిటో అర్ధం గాదు. ఇంకా నయం భారత కోకిల సరోజినీ నాయుడు పేరు జయసుధ పాత్రకి పెట్టి రక్షించారు.  

        ఇతర భాషల్లో స్టార్లు సూపర్ స్టార్లు కృత్రిమ ఫార్ములా పాత్రలు వదిలేసి సహజత్వంతో వాస్తవిక పాత్రలు అంగీకరిస్తున్నారు. 

అరకొర ధర్మా కథ
         సెకండాఫ్ లో గ్రామస్థులు (ధర్మా తల్లిదండ్రులు సహా) ధర్మాని చూసి, నువ్వు లేకపోతే  ఎంత అన్యాయమై పోయామోనని మొర పెట్టుకుంటారు. తర్వాత ధర్మా ఎందుకు వూళ్ళో లేకుండా పోయాడో గంటసేపు సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాకు ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాకు ఉత్తర ప్రదేశ్ లో తెలుగు రైతుల పంటలకి ధర రాకుండా చేసే విలన్ ముఠా ఆగడాలతో ప్రారంభమవుతుంది. అక్కడికి ఇన్స్ పెక్టర్ ధర్మా వచ్చేసి ఫైట్ చేస్తాడు. రైతుల గురించి ఒక ఉపన్యాసమిస్తాడు. ఒక విజయోత్సవపు పాట. 

        పాట తర్వాత మాజీ మంత్రి వీరేంద్రనాథ్ టాగూర్ కూతురి కులాంతర పెళ్లి రిసెప్షన్. పెళ్లి కూతురు నిరంజన (భూమిక). ఈ కులాంతర పెళ్ళికి కుతకుతలాడిన వీరేంద్ర నాథ్ టాగూర్ తమ్ముడు, రెవిన్యూ మంత్రి భవానీ నాథ్ టాగూర్ (పరాగ్ త్యాగి) అనే విలన్, పెళ్లి కొడుకు కుత్తుక కసిక్కున కోసి పారేస్తాడు. ఆనర్ కిల్లింగ్ అన్నమాట. కూతుర్ని తీసుకుని పారిపోతాడు వీరేంద్ర నాథ్ టాగూర్. ఇన్స్ పెక్టర్ ధర్మా వచ్చి ఇంకో ఫైట్ చేసి కాపాడతాడు. తండ్రీ కూతుళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 

        ఇంట్లో పెట్టుకుంటే ఒక కేబుల్ టీవీ వాడి వేషంలో విలన్ తొత్తు వచ్చి నిరంజనని చంపబోతాడు. వాడిని వూరి జనాలకి అప్పజెప్పి తన్నిస్తాడు ధర్మా. ఈ మొత్తం వ్యవహరంలో ధర్మా కన్పించక పోవడంతో పిచ్చితో వున్న సంధ్య, ఇప్పుడు పిచ్చి కుదిరి కామెడీలు చేస్తుంది. ఇక ఇంట్లో ఆచార వ్యవహరాలూ, పేరంటాళ్ళ రాక, సంధ్య స్వయం వరం, ధర్మా మెళ్ళో మాల, ప్రేమ పాట!

        పాట తర్వాత విలన్ సంధ్యని చంపే ప్లాను. ఇంకో వైపు రైతుల కిచ్చిన భూముల రద్దు కుట్ర.  ఆస్తి కోసం భవానీనాథ్ టాగూర్ అన్న ని చంపడం, ధర్మాతో తో ఫైట్. గాయపడిన ధర్మా జ్ఞాపక శక్తిని  కోల్పోయి సరోజినీ నాయుడికి బంగారు కొడుకులా దొరకడం. ఫ్లాష్ బ్యాక్ ఓవర్.

        ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇప్పుడు తానెవరో జ్ఞాపకం తెచ్చుకున్న ధర్మా అలియాస్ భవానీ ప్రసాద్, విలన్ భవానీ నాథ్ టాగూర్ ని చంపడం. ది ఎండ్.

నేనెవర్ని? 
        మళ్ళీ ‘పేదరాశి పెద్దమ్మ కథ’ చెప్పుకుందాం. ఇందులో పేదరాశి పెద్దమ్మ నిర్మలమ్మ కూతురు విజయలలిత శాపానికి గురై పగలు ముసలి దానిగా, రాత్రి నిజ రూపంలో గడుపుతుంది. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ టైపు అన్నమాట. బాలకృష్ణ అర్జున్ - ధర్మా పాత్రలకి ఈ సంక్లిష్ట జీవిత సంవిధానముండదు. కనెక్షన్ లేని, డెప్త్ లేని పైపైన రాసేసి తీసేసిన కార్డ్ బోర్డ్ క్యారక్టర్ లుగా వుండిపోతాయి. గతాన్ని మర్చిపోయిన పాత్రగా నేవర్ని? అని ప్రశ్నించుకునే సీనే వుండదు. పేరుకే మెమరీ లాస్ క్యారక్టర్, క్యారక్టరైజేషన్లో ఆ చిహ్నాలే వుండవు. పైగా తన కథ కంటే విలన్ కథే, సీన్లే ఎక్కువుంటాయి. సెకండాఫ్ లో క్యారక్టర్ కి సరైన విషయమే లేకుండా, గంటపాటు ఫ్లాష్ బ్యాక్ చూపడం ఒక వృధా ప్రయాస అనుకుంటే, ఉత్తరప్రదేశ్ తెలుగు రైతుల కథ అంతకంటే అతకని వ్యవహారంగా మిగిలింది. ఉత్తర ప్రదేశ్ ఎడారి రాష్ట్రం కాదు. దేశంలో ఇరవై శాతం ఆహార ధాన్యాలు అక్కడే పండుతాయి. 

        ఫస్టాఫ్ లో పావు గంట హీరో లేని ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ లో హీరోకి అంతగా పనిలేని విలన్ ఫ్లాష్ బ్యాక్, మొత్తం కలిపి గంటంపావు సమయం ఫ్లాష్ బ్యాకులే తినేస్తే కథ ప్రారంభ మయ్యేదెప్పుడు? ఫ్లాష్ బ్యాకులు ఎప్పుడూ కథ అన్పించుకోవు, ప్రారంభంకాని కథకి ఉపోద్ఘాతాలు మాత్రమే. అంటే సినిమాకి శరాఘాతాలు. సెకండాఫ్ సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మిగిలిన చివరి పది నిమిషాలే కథ! ఈ పది నిమిషాల్లోనే ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ, క్లయిమాక్స్! అంటే పాయింటు లేదు, పాయింటుతో గోల్ లేదు, గోల్ కోసం సంఘర్షణా లేదు. ఈ ఫ్యాక్షన్ 2.0 సంక్రాంతి విడుదల కాకపోవడం ఫ్యామిలీ ప్రేక్షకులని కాపాడింది.

సికిందర్


కొత్తతో కాసేపు!


కొత్త శీర్షిక : కొత్త డైరెక్టర్ కహానీ!
కొత్త దర్శకుల చిన్న చిన్న సినిమాల విశ్లేషణలతో పనికొచ్చే, పనికిరాని సూచనలు
నేర్చుకోవాలనుకుంటే నేర్చుకున్నంత
కాదనుకుంటే మూసంత!
*

Thursday, December 19, 2019

901 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


      మిడిల్ కథ : స్కూల్లో విశాలి ముభావంగా వుండడంతో ఆమె బెస్ట్ ఫ్రెండ్ అర్పితకి ఆమె మీద అనుమానమేసింది. మాల్ లో ఆమె ఎవరో కొత్త వ్యక్తిని కలుసుకోగా చూసింది అర్పిత. ఆందోళనచెంది ప్రిన్సిపాల్ కి విషయం చెప్పేసింది. ప్రిన్సిపాల్ పోలీసులకి కంప్లెయింట్ చేశాడు. పోలీసులు వచ్చి విశాలిని తీసికెళ్లారు. ఆమె చేత విద్యుత్ కి కాల్ చేయించారు. లైన్లో కొస్తే ట్రేస్ చేయడానికి. కానీ విద్యుత్ నెంబర్ మార్చేసి అజ్ఞాతంలో కెళ్ళి పోయాడు. విశాలి తండ్రి ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించుకున్నాడు. ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసుల దగ్గరున్న విశాలి చాటింగ్ డేటా తస్కరించి విద్యుత్ ఐపీ అడ్రెస్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. అదెక్కడో విదేశాల్లో వున్నట్టు మాస్క్ చేశాడు విద్యుత్. విశాలి తండ్రికి దిక్కు తోచలేదు. కూతురితో, భార్యతో సంబంధాలు చెడాయి. జరిగింది మర్చిపోదామని అంటున్నారు వాళ్ళు. యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్న విశాలి తండ్రి, తన మీద పడేస్తున్న టీనేజర్లని చెడగొట్టే వల్గర్ యాడ్స్ ఇక చెయ్యనని భీష్మించుకున్నాడు.

       
క విద్యుత్ ని వదిలి పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు విశాలి తండ్రి. విశాలిని తన మిత్రుడైన డాక్టర్ని వెళ్లి కలవమని బలవంతంగా పంపించాడు. డాక్టర్ తో ఏదీ చెప్పడానికి ససేమిరా అంది విశాలి. విద్యుత్ పట్ల ప్రేమ చెప్పనీయడం లేదు. ఇది మర్చి పోతాననీ, అతనే వచ్చి పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నాననీ చెప్పేసింది. 

        కొన్ని రోజుల తర్వాత స్కూలు కెళ్ళడం మొదలెట్టింది. బెస్ట్ ఫ్రెండ్ అర్పిత సారీ చెప్పడానికి ప్రయత్నించింది. అవకాశ మీయలేదు విశాలి. తనతో మాట్లాడవద్దని కరాఖండీగా చెప్పేసింది. తల్లిదండ్రులూ అర్పితా అందరూ కలిసి విద్యుత్ ని బద్నాం చేస్తున్నారని మండి పడసాగింది. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. విద్యుత్ దొరకలేదు. అయితే మరి కొంత మంది అమ్మాయిల్ని అతను వంచించినట్టు డీఎన్ఎ సాక్ష్యాలు రుజువు చేశాయి. విద్యుత్ మోసం చేసిన అమ్మాయిల ఫోటోల్నివిశాలి చూసింది. ఇప్పుడు నిజం తెలిసొచ్చింది. తనని విద్యుత్ మోసం చేశాడని డాక్టర్ కి చెప్పేసింది (ప్లాట్ పాయింట్ టూ)

      ఈ మిడిల్ వర్క్ షీట్ చూద్దాం :  పై కథనం గత వ్యాసంలో చూసిన బిగినింగ్ కథనానికి మిడిల్లో కొనసాగింపు. మిడిల్ విభాగమంటే ప్రధాన పాత్ర అనుకున్న గోల్ ని సాధించడానికి ప్రత్యర్ధితో చేసే పోరాటం. దీనికుండే టూల్స్ : 1. గోల్ కోసం ప్రత్యర్ధితో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 2. క్యారక్టర్ ఆర్క్, 3. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 4. సొల్యూషన్ (ప్లాట్ పాయింట్ -2). వీటన్నిటితో గోల్ ఎలిమెంట్స్ నాల్గింటినీ కలుపుకు వెళ్ళాలి. ఆ గోల్ ఎలిమెంట్స్ వచ్చేసి కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. ఇదంతా రెగ్యులర్ సినిమాల స్ట్రక్చరే. 

         
ముందుగా యాక్షన్ రియాక్షన్ల  ఇంటర్ ప్లే చూద్దాం : ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రధాన పాత్ర సమస్యలో పడ్డాక, దాంతో ఒక గోల్ ఏర్పడ్డాక, ఏ జానర్ కథకైనా ఈ మిడిల్లో గోల్ కి మొదట ప్రతికూల పరిస్థితులెదురవడం మొదలెడతాయి. అంటే ప్రతికూల పరిస్థితులతో గోల్ తలపడ్డమన్న మాట. దీన్ని - ఈ ఎలిమెంట్ ని, మిడిల్ విభాగపు బిజినెస్ లో ముందుగా ఎస్టాబ్లిష్ చేయాల్సి వుంటుంది. విశాలి పాత్రకి ఎస్టాబ్లిష్ అయింది. ఈ మిడిల్ విభాగంలోకి విద్యుత్ తో ఇంకా ప్రేమే అన్న మొండి నమ్మకంతో (గోల్ తో) వుంటూ ఎంటరయ్యింది విశాలి. ఈమె ఈ గోల్ కి వరసగా బెస్ట్ ఫ్రెండ్ అర్పిత, ప్రిన్సిపాల్, పోలీసులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ డిటెక్టివ్, డాక్టర్ అడ్డు పడుతున్నారు. ప్రేమ కోసం వీళ్ళందర్నీ ఎదుర్కొంటూ విద్యుత్ ని కాపాడుకుంటోంది విశాలి. ఈ స్ట్రగులే వీళ్ళందరి యాక్షన్స్ కి తన రియాక్షన్స్ తో ఇంటర్ ప్లే.

        ఈ ఇంటర్ ప్లేలో విశాలి యాక్టివ్ గా వుందా లేక పాసివ్ గా వుందా? అందర్నీ తిప్పి కొడుతూ యాక్టివ్ గానే వుంది. మరైతే కనిపించని విద్యుత్ ని కలుసుకోవడం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ పాత్రలు కృత్రిమ ఎమోషన్స్ తో కాకుండా, వాస్తవిక చిత్రణలతో వుంటాయి. ఈ జానరే ఒక టీనేజీ క్యారక్టర్ స్టడీ. ఈ కథలు క్యారక్టర్ నే ఫోకస్ చేస్తూ, క్యారక్టర్ చుట్టే కథని చేర్చి, క్యారక్టర్ పట్ల ఆలోచనలు రేకెత్తించేవిగా వుంటాయి. ఒక నీతి చెప్తాయి. విశాలిలాంటి టీనేజర్లు ఎందరో వుంటారు. బయటి ప్రపంచమే తెలీని విశాలికి లాప్ టాప్ తో అయిన లోకజ్ఞానం ఎంతటిది? మనుషులతో ప్రత్యక్ష అనుభవమే లేని వర్చువల్ కాంటాక్ట్. మొదటిది లేకుండా రెండోది నమ్మి విద్యుత్ తో మోసపోయింది. క్యారక్టర్ నీతి : కాస్త చుట్టూ ప్రపంచంతో ప్రత్యక్ష అనుభవంలోకి వెళ్ళండి, వర్చువల్ వరల్డ్ కి ఎడిక్ట్ కాకండి - అసమర్ధులై పోతారు.  

        బయటి ప్రపంచమే తెలీని విశాలి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పుడు విద్యుత్ కోసం బయటి ప్రపంచం లోకి వెళ్ళలేని అసమర్ధురాలు. అందుకే చుట్టూ ప్రత్యర్ధులతో అక్కడక్కడే కొట్టుమిట్టాడుతోంది. మరి ఇది పాసివ్ పాత్రే కదా? కాదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకు ఈ జానర్ లో వుండే టీనేజీ పాత్ర ప్రయాణమని ముందే చెప్పుకున్నాం. అజ్ఞానం లోంచి జ్ఞానంలోకి. ఇమ్మెచ్యూరిటీ లోంచి మెచ్యూరిటీ లోకి. ఇది అంచలంచెలుగా జరుగుతుంది, తొందరపడి పాసివ్ పాత్రనుకోవద్దు. మన అజ్ఞానం బయట పడుతుంది. 

        ఆమెకి సమయమిద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. ప్రస్తుతనికామె విద్యుత్ వస్తాడు, ప్రేమిస్తాడు, తీసికెళ్ళి పోతాడని నమ్ముతోంది. ఆడపిల్ల ఇలా అనుకుంటూ ఎదురు చూస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ‘రాజువారు రాణిగారు’ లోలాగా ‘మగహీరో’ హీరోయిన్ వస్తుంది, నన్ను ప్రేమిస్తుందని మూడున్నరేళ్ళు వూళ్ళో ఎదురు చూస్తూ మూల కూర్చుంటే వెగటుగా వుంటుంది. ఎదురు చూసేది ఆడది, ఎదురెళ్ళేది మగాడు. 

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మొదలైన ఈ మిడిల్ ప్లాట్ పాయింట్ టూ దగ్గర కొలిక్కి వచ్చేదాకా ఈ విభాగంలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగుతూనే వుండాలి. ప్లాట్ పాయింట్ టూ దగ్గర మిడిల్ క్లోజవుతుంది. ప్లాట్ పాయింట్ టూకి దారితీసే ఇంటర్ ప్లే కూడా చూద్దాం : మిడిల్ కథాక్రమంలో విద్యుత్ ఇంకెంత మంది అమ్మాయిల్ని మోసం చేశాడో డీఎన్ఏ సాక్ష్యాలు దొరకడంతో, ఆ అమ్మాయిల ఫోటోలు కూడా విశాలి చూడ్డంతో కొలిక్కొచ్చింది. ఇకామె డాక్టర్ దగ్గరికెళ్ళి నిజం ఒప్పేసుకుంది. 

        ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఎప్పుడూ వ్యతిరేక క ప్రతిబింబాల్ని చూపించే ఎదురెదురు అద్దాలే. వన్ దగ్గర సమస్య ఏర్పాటు, టూ సమస్యకి ముగింపు. వన్ దగ్గర విశాలి విద్యుత్ ది ప్రేమేనని నమ్మింది, టూ దగ్గర మోసమని గ్రహించింది. సమస్యని పుట్టించే ప్లాట్ పాయింట్ -1, సమస్యకి పరిష్కారాన్నిచ్చే ప్లాట్ పాయింట్ - 2 ఎప్పుడూ కాంట్రాస్ట్ గా వుంటాయి. అది నెగెటివ్ గా వుంటే, ఇది పాజిటివ్ గా; అది పాజిటివ్ గా వుంటే, ఇది నెగెటివ్ గా. మధ్యలో జరిగిందంతా అంతరంగ మథనమే. మిడిల్ అంటేనే అంతరంగ మథనం. అందులోంచి నేర్చుకోవడం, మారడం, తనని తాను తెలుసుకోవడం, ఎదగడం. ఇవే  జరిగాయి విశాలి పాత్రకి. ఇది ఏ జానర్ స్క్రీన్ ప్లే కైనా స్ట్రక్చర్ లో అంతర్భాగమే. 

       
యాక్షన్ - రియక్షన్ల టూల్ ఇలా పనిచేశాకా, ఇక క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) చూద్దాం : కథ నడిపే క్యారక్టర్ ఆర్క్ అన్నాక ఆ గ్రాఫ్ పడుతూ లేస్తూ వుండాలి. ప్లాట్ పాయింట్ టూ దగ్గర మిడిల్ కొలిక్కి వచ్చినప్పుడు, కథని బట్టి పూర్తిగా పరాజయంతో పతనమవడమో, విజయంతో పూర్తిగా పైకి లేవడమో జరగాలి. విశాలి పాత్ర ఈ ఫ్రేమ్ వర్క్ లోనే వుంది : ఈ కథని బట్టి ప్లాట్ పాయింట్ టూ దగ్గర అపజయంతో అధో ముఖంగా వుంది ఆమె క్యారక్టర్ ఆర్క్. ప్రేమ కాదు మోసమని తెలుసుకున్న ఓటమి ఇది. ఈ రెండు పాయింట్ల మధ్య ఆమె ఆర్క్ ప్రత్యర్ధులతో ఒడిడుకుల పాలవుతూనే వుందని మిడిల్ కథనంలో భావించవచ్చు. ఆమె పట్టు విడవకుండా ప్రేమ కోసమే వుంది. 

      టైం అండ్ టెన్షన్ (టీటీ) గ్రాఫ్ : అంటే సినిమా ప్రదర్శిస్తున్న తెరమీద కాలం గడిచే కొద్దీ కథనంలో టెన్షన్ పెరుగుతూ పోవడం. పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన స్ట్రగులే ఈ టెన్షన్ ని పుట్టిస్తుంది. ఈ టెన్షన్ ఆయా  చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రశ్నల వల్ల ఏర్పాటవుతుంది. ఏం ప్రశ్నలు? ఎక్కడ్నించీ ప్రశ్నలు? గోల్ ఎలిమెంట్స్ లోంచి వచ్చే ప్రశ్నలు. ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటయినట్టుగా మనం చూసిన గోల్ ఎలిమెంట్స్ - కోరిక, పణం, పరిణామాల హెచ్చరికా, ఎమోషన్స్ అన్నవి  ఈ టీటీ గ్రాఫ్ లో పాలు పంచుకుంటాయి - ప్రశ్నల్ని రేకెత్తిస్తూ. అలా ఈ గ్రాఫ్ ప్రేక్షకులతో ఇంటరాక్టింగ్ వ్యూయింగ్ కి వీలు కల్పిస్తుంది. పాసివ్ గా చూడకుండా, కథలో లీనమై ఆయా భావోద్వేగాల్ని అనుభవిస్తూ, యాక్టివ్ గా చూసేట్టు చేస్తుంది. 

          ఈ మేరకు విశాలి  పడడం, మళ్ళీ లేవడం అన్న స్ట్రగులే ప్రశ్నల్ని సంధిస్తూ టీటీ గ్రాఫ్ ని గీస్తోంది. మొదట బెస్ట్ ఫ్రెండ్ అనుమానించినపుడు కథనంలో టెన్షన్ పెరిగింది, ప్రిన్సిపాల్ కి చెప్పినప్పుడు ఇంకింత పెరిగింది, పోలీసులు వచ్చినప్పుడు మరింత పెరిగింది, పోలీసులకి విద్యుత్ దొరకనప్పుడు టెన్షన్ డ్రాప్ అయిపోయింది.
విశాలి తండ్రి ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించుకున్నప్పుడు మళ్ళీ పెరిగింది, ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసుల దగ్గరున్న విశాలి చాటింగ్ డేటా తస్కరిస్తున్నప్పుడు ఇంకింత పెరిగింది, విద్యుత్ ఐపీ అడ్రెస్ ట్రేస్ చేయడానికి ప్రయతినిస్తున్నప్పుడు మరింత పెరిగింది, ఐపీ అడ్రెస్ విదేశాల్లో ట్రేస్ అయ్యేట్టు విద్యుత్ మాస్క్ చేయడమతో పూర్తిగా పడిపోయింది. విశాలి తండ్రికి కూతురితో, భార్యతో సంబంధాలు చెడినప్పుడు మళ్ళీ పెరిగింది, విద్యుత్ ని వదిలి పెట్టకూడదని విశాలి తండ్రి నిశ్చయించుకున్నప్పుడు ఇంకింత పెరిగింది, విశాలి తండ్రి విశాలిని డాక్టర్ దగ్గరికి పంపించినప్పుడు మరింత పెరిగింది, విశాలి తన ప్రేమ మీద నమ్మకంతో డాక్టర్ ని గట్టిగాఎదుర్కోవడంతో పూర్తిగా పడిపోయింది టెన్షన్ గ్రాఫ్. 

        కొన్ని రోజుల తర్వాత స్కూలు కెళ్ళడం మొదలెట్టినప్పుడు పడిపోయిన గ్రాఫ్ ప్రశాంతతని సూచిస్తోంది. ఈ ప్రశాంతత ఇప్పుడింకేం జరుగుతుందన్న సస్పెన్స్ కోసం. బెస్ట్ ఫ్రెండ్ అర్పిత సారీ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు టెన్షన్ అందుకుంది, విశాలి తనతో మాట్లాడవద్దని కరాఖండీగా చెప్పేసినప్పుడు తగ్గింది, తల్లిదండ్రులూ అర్పితా అందరూ కలిసి విద్యుత్ ని బద్నాం చేస్తున్నారని మండి పడుతున్నప్పుడు పెరిగింది, మరిన్ని రోజులు గడిచిపోయిన  టైం లాప్స్ తో ప్రశాంతత, సస్పెన్స్; విద్యుత్ ఇంకా దొరక్క పోవడంతో అదే న్యూట్రల్ స్థితి, అతను ఇంకింత మంది అమ్మాయిలని వంచించినట్టు డీఎన్ఎ సాక్ష్యాలు రావడంతో టెన్షన్ పెరిగింది, అమ్మాయిల ఫోటోలూ విశాలి చూడ్డంతో ఇంకింత పెరిగింది, ఆమె నిజం తెలుసుకోవడంతో ఇంకింత పెరిగిపోయింది. 

       
ఇక మిడిల్ విభాగాన్ని నడిపే టూల్స్ లో చివరిదైన  సొల్యూషన్ :  ఇది ప్లాట్ పాయింట్ టూ దగ్గర వస్తుంది మిడిల్ ని ముగిస్తూ. సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తూ. ఇక నిజం ఒప్పుకోవడమే తన సమస్యకి పరిష్కారమని నిర్ణయించుకుంది విశాలి. విద్యుత్ మోసమే చేశాడని డాక్టర్ దగ్గర ఒప్పుకుంది. ఇదే సొల్యూషన్. 

         
ఈ మిడిల్ కి మరింత బలాన్ని చేకూర్చే బయటపడని ఒక బ్యాక్ గ్రౌండ్ కథ, ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే ఒక హుక్ లా ఆద్యంతం పనిచేస్తోంది. సస్పెన్స్ ని పోషిస్తోంది. అది విద్యుత్ ఎవరన్న ప్రశ్న. అతను నిజంగానే విశాలి కోసం వస్తాడా? ప్రస్తుతం పోలీసుల భయంతో పారిపోయాడా? లేక మోసగాడేనా? ఇప్పుడెక్కడున్నాడు? ఈ సందేహాలు వెళ్లి వెళ్లి అతను సీరియల్ సెక్సువల్ నేరగాడని తేలడంతో తీరాయి. మరి అతనెప్పుడు దొరుకుతాడు? దొరికితే అతడితో విశాలి  కథెలా వుంటుందన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో. ఇలా ఈ మిడిల్ వర్క్ షీట్ పూర్తయింది.
 


         ఇక ఎండ్ విభాగం చూద్దాం : మర్నాడు విశాలి కొత్త జీవితం ప్రారంభించింది. బెస్ట్ ఫ్రెండ్ అర్పితని క్షమించింది. స్కూలు నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీల్లో పాల్గొనసాగింది. అప్పుడు అక్కడే వున్న ఆమె తండ్రి ప్రేక్షకుల్లో ఒకతన్ని గమనించాడు. అతను ఫోటోలు తీస్తున్నాడు. పరీక్షగా చూస్తే, ఆల్రెడీ కేసులున్న లైంగిక నేరగాడతను. వెళ్లి నిలదీశాడు. అతను బతిమాలుకున్నాడు. అల్లరి చేయవద్దని, భార్యా పిల్లలకి తెలిస్తే అన్యాయమైపోతానని. తిట్టి వెళ్ళగొట్టాడు విశాలి తండ్రి. ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేయడంతో అందరి ముందూ సిగ్గుతో చచ్చిపోయింది విశాలి-  ‘నేను మర్చిపోయి నా బతుకు నేను బతుకుదామనుకుంటే ఎందుకు పుండును కెలుకుతావ్?’ అని తండ్రిని నిలదీసింది. 

        తర్వాతొకరోజు బెస్ట్ ఫ్రెండ్ అర్పిత రహస్యంగా చెప్పింది - మార్ఫింగ్ చేసిన విశాలి ఫోటోల్ని ఎవరో పోర్న్ సైట్ లో పెట్టి, ఆమె ఫోన్ నెంబరూ అడ్రసూ ఇచ్చారని. విశాలి అది చూసి, నిద్ర మాత్రలు మింగి బాత్రూంలో పడిపోయింది. 

        కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో వుంది. తల్లిదండ్రులున్నారు. వాళ్ళని పట్టుకుని ఏడ్వసాగింది. కోలుకుని తల్లిదండ్రుల సహకారంతో నెమ్మదిగా సాధారణ జీవితంలోకి రాసాగింది...

        ఎండ్ విభాగం వర్క్ షీట్ : ప్లాట్ పాయింట్ టూలో విద్యుత్ మోసగాడని తెలిశాక విశాలి ఏ అఘాయిత్యం చేసుకోలేదు. అప్పుడే నిద్రమాత్రలు మింగి వుంటే పాసివ్ క్యారక్టర్ అయ్యేది. మిడిల్ విభాగమంతా ఆమె విద్యుత్ కోసం ప్రయత్నించకుండా వుండి పోవడం పాసివ్ క్యారక్టరైజేషన్ కాదు. ఆమె విద్యుత్ కోసం ప్రయత్నించకపోవడానికి ఆమె పరిమితుల గురించి చెప్పుకున్నాం : రియల్ వరల్డ్ అనుభవాన్ని నిర్వీర్యం చేసిన వర్చువల్ వరల్డ్ ఎడిక్షన్. విద్యుత్ కోసం భౌతికంగా ప్రయత్నించకపోయినా, విద్యుత్ మీద నమ్మకంతోనే అందర్నీ ప్రతిఘటిస్తూ వచ్చింది. ప్రతిఘటించే పాత్ర పాసివ్ పాత్రవదు. ఇక చివరికొచ్చేసరికి నిజం తెలిశాక, తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంటూ డాక్టర్ కి చెప్పేసి భౌతికంగానూ యాక్టివ్ క్యారక్టరైంది. ఇప్పుడామెకి కనువిప్పు అయింది. ఇక మానసికంగా ఎదిగే వ్యక్తురాలైంది. ఆమె టీనేజీని ఆమె ఇమ్మెచ్యురిటీ కాజేశాక, దాన్ని దాటి పెద్దరికంతో స్త్రీత్వాన్ని మీదేసుకుని బ్రతకవచ్చు ఇకపైన.

        ఈ పూర్వరంగం నుంచి - ప్లాట్ పాయింట్ టూ నుంచి - ఎండ్ విభాగంలోకి ప్రవేశించింది తను. ఇక్కడా చేదు అనుభవాలెదురయ్యాయి. తనని మోసం చేసిన లాటి ఎవరో నేరగాడితో ఫాదర్ సీన్ క్రియేట్ చేసి పుండుని కెలకడాన్ని సహించలేకపోయింది. తను మర్చిపోదామనుకుంటే గుర్తు చేసే ప్రవర్తనలు బాధిస్తూ వుండక తప్పని పరిస్థితి. తన లాటి బాధితురాలిని ఇలా ప్రొఫైలింగ్ చేసేస్తారు ఇంటా బయటా. అతి జాగ్రత్తతో ఇంట, వెటకారంతో బయట. పోర్న్ వెబ్సైట్లో తన ఫోటోలు పెట్టి పరువుతీయడం పరాకాష్టయింది. ఇప్పుడు నిద్రమాత్రలు మింగేసింది. అంటే, ఒకసారి తప్పటడుగేస్తే దాని విషపరిణామాలు చాలా వుంటాయన్న హెచ్చరిక. ఈ పరీక్ష కూడా తట్టుకుని సాధారణ జీవితంలోకి రాసాగింది...

విద్యుత్ ఎక్కడ?
        ఒక వీడియో కెమెరా ఫుటేజీలో ఒకతను ఒకబ్బాయిని వీడియో తీస్తూ కనపడుతున్నాడు. ఆ అబ్బాయి ఆ కెమరా తీసుకుని అతణ్ణి వీడియో తీయసాగాడు. ఇప్పుడతను విద్యుత్ గా రివీలయ్యాడు. ఇంకో అబ్బాయి తన పేరెంట్స్ తో వచ్చి, విద్యుత్  ని తన ఫిజిక్స్ టీచర్ గా పరిచయం చేశాడు. ఇంతలో విద్యుత్ భార్య కూడా వచ్చి వాళ్ళతో కలిసింది...

        ఈ ఆధునిక కథ డేవిడ్ ష్విమ్మర్ దర్శకత్వంలో, లియానా లిబరాటో నటించిన, కమింగ్ ఆఫ్ ఏజ్ ‘ట్రస్ట్’ (2010) మూవీ లోనిది.

సికిందర్ 

Wednesday, December 18, 2019

900 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు


        మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులకి సంబంధించి స్ట్రక్చర్ వ్యాసం సాంప్రదాయ దృశ్యం’ తర్వాత ఇప్పుడు ‘ఆధునిక దృశ్యం’ ఎలా వుంటుందో చూద్దాం. సాంప్రదాయ కథలు, ఆధునిక కథలు ... సాంప్రదాయ కథలు ఓల్డ్ స్కూల్ డ్రామాలుగా వుండొచ్చు గానీ, ఆధునిక కథలు రియలిస్టిక్ కథలుగా వుంటేనే యూత్ కి కనెక్ట్ అయ్యేది. సినిమా మార్కెట్ ప్రధానంగా యూత్ దే. ఈ యూత్ కాలేజీ, ఆ పైన జాబ్ మార్కెట్లోకి ప్రవేశించిన ఏజి గ్రూప్ యూతే తప్ప; హైస్కూల్, అంతకి తక్కువ టీన్ - ప్రీటీన్ పిల్లకాయలు కాదు. మేమిలాటి పిల్లకాయలుగా వున్నప్పుడే పైసలెత్తుకు పోయి శుభ్రంగా సినిమాలు చూసేసే వాళ్ళం - తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అప్పుడప్పుడు అరవ సినిమాలూ వదిలిపెట్టకుండా. వారానికో రోజు స్కూలు పిల్లలకోసం కన్సెషన్ షోలు వేస్తే థియేటర్ నిండా పిల్లలే. అవి పిల్లల సినిమాలు కూడా కావు, ప్రదర్శించే రెగ్యులర్ సినిమాలే వారానికో రోజు స్కూలు పిల్లలకి. అలా అన్ని జానర్ల సినిమాలూ పిల్లకాయలప్పుడే అలవాటయ్యాయి. ఏ జానరూ కాని అజానరీయ అమర్యాదకర లపాకీ సినిమా లొచ్చినా అవీ అడ్డంగా ఆరగించడమే. అంత విశేష ‘జ్ఞాన సంపద’ సొంతమన్నమాట. సినిమాలు చూసి అట్ట ముక్కల కిరీటాలు పెట్టుకుని, కర్రల్ని కత్తులుగా చేసుకుని, గడ్డి మేటుల్లో ఫైటింగు దృశ్యాలు కూడా రక్తి కట్టించే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే బజార్లలో ఫిలిం ముక్కలు అమ్మేవాళ్ళు. అట్ట పెట్టెలకి రంధ్రం చేసి, అందులో బల్బు పెట్టి, ఎదురుగా భూతద్దం పెట్టి, ఫిలిం ముక్కల్ని గోడల మీద ‘సినిమాలు’ గా బ్రైట్ గా ఫోకస్ చేసే టెక్నాలజీని కూడా వాడేశాం. ఎనిమిదో తరగతప్పుడే యాక్షన్ తో కూడిన ఏవో పిచ్చి పిచ్చి నాటకాలు రాయడం, బొమ్మల కథలు వేయడం వగైరా కార్యకలాపాలు అదనంగా నిర్వహించాం. ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో, అంత సాహిత్యమూ చదివే వాళ్ళం. ఈ పరిస్థితి మారింది. థియేటర్ల బుకింగ్స్ దగ్గర పిల్లలు కన్పించడం లేదు. పట్టణాల్లో, పల్లెటూళ్ళల్లో కూడా. వాళ్ళు వస్తే గిస్తే ఎప్పుడో పేరెంట్స్ తో తప్ప రావడం లేదు.  

       
కాబట్టి ఒకప్పటి లాగా ఏది పడితే అది, ఎలా బడితే అలా తీసి చూపించేందుకు ప్రేక్షక లోకంలో మాలాగా అమాయక - వెర్రి మాలోకం బాలలోకం లేదిప్పుడు. కాలేజీ ఈడు నుంచే ప్రేక్షక వర్గం ప్రారంభమవుతోంది. ఈ వయసుకి కాలీన స్పృహ వుంటుంది. గ్లోబల్ గా చూస్తున్న ఆధునికత, వాస్తవికత, వర్తమాన స్పృహలతో ఒక యూత్ అప్పీల్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ వయసు నుంచీ ఇలా ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన కాలేజీ - జాబ్ మార్కెట్ యూత్ వరకే రెగ్యులర్ ప్రేక్షక లోకంగా లెక్కేసుకోవాలి. మళ్ళీ ఈ యువ ప్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులు సినిమాలకి రాని పరిస్థితి కూడా వుంది. ఎప్పుడో ఎంతో టాక్ వస్తే తప్ప చిన్న హీరోల సినిమాలకి యువతులు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలూ కట్, యువతులూ కట్. మిగిలింది కొత్త మీసాల మస్తీ యూతే. పెద్ద స్టార్ సినిమాలకి ఎలాగూ కుటుంబాలు సహా అందరూ తరలి వస్తారు. ఒకవేళ యువ ప్రేక్షకుల్లో యువతుల్నీ లెక్కేసుకున్నా ‘వెంకీ మామ’ లాంటి దాన్లో వెంకటేష్, నాగ చైత్యనలని యూత్ అప్పీల్ లేని ఓల్డ్ స్కూల్ డ్రామాతో చూపించలేరు. రియలిస్టిక్ గా రావాల్సిందే. పెద్ద హీరోల మూస సినిమాలకి టీఆర్పీరాక, యాడ్స్ కూడా తగ్గిపోతున్నాయని, అందుకని ఇకపైన భారీ మొత్తాలు వెచ్చించి వీటి శాటిలైట్ హక్కులు కొనేది లేదని చెప్పే స్థితికి ఛానెల్స్ కూడా వచ్చేశాయి. ఇక ప్రేమ సినిమాలే తీసినప్పుడు అవెంత యూత్ అప్పీల్ తో రియలిస్టిక్ గా వుండాలి? వర్తమాన కాలం ప్రతిబింబిస్తేనే యూత్ అప్పీల్. ఇక ఆధునిక ‘కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ తీస్తే ఇంకెంత రియలిస్టిక్ గా, వర్తమాన యూత్ జీవితం ప్రతిబింబిస్తూ వుండాలి?

విశాలి కథ
        కనుక కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఆధునిక దృశ్యం చూసినప్పుడు, ఇది కూడా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే వుంటుంది. కాకపోతే విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించి వుంటుంది. రిపీట్ - విషయం విధిగా ఈ కాలపు పోకడలకి సంబంధించే  వుంటుంది. మూస లవ్వు స్టోరీ తీసి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే నవ్విపోతారు. ఆధునిక కమింగ్ ఆఫ్ ఏజ్ కి ఉదాహరణ -  విశాలి అనే టీనేజర్ వుందనుకుందాం, ఆమెకి పద్నాల్గేళ్ళు. స్కూల్లో పదో తరగతి చదువుకుంటోంది. చదువు తప్ప ఆమెకేమీ తెలీదు. ఆమె పుట్టిన రోజుకి పేరెంట్స్ ఒక లాప్ టాప్ కొనిచ్చారు. అప్పుడామె చాలా తెలుసుకోవడం మొదలెట్టింది. ఇక ఏదో స్వతంత్రం, ఏదో వ్యక్తిత్వం తనకొచ్చేసినట్టూ, తను ఎదిగిపోయినట్టూ ఫీలింగ్ వచ్చేసింది. అలా ఆన్ లైన్లో ఆమెకి విద్యుత్ పరిచయమయ్యాడు. వెంటనే కనెక్ట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యమేసింది. తానింతవరకూ అబ్బాయిలవైపు చూడాలంటేనే, వాళ్లతో మాట్లాడాలంటేనే బిడియపడి దూరంగా వుండేది. అబ్బాయిలెవరూ తనకి స్నేహితులుగా లేరు. అలాటిది ఆన్ లైన్లో ఇంత చొరవ వచ్చేసింది. 


        విద్యుత్ తనకి పదహారేళ్ళని చాటింగ్ లో చెప్పాడు. విశాలికి ఉత్సాహమొచ్చింది. తోచిన కబుర్లాడింది. క్రమంగా చాటింగ్ నుంచి నేరుగా మొబైల్ మెసేజిలకి కమ్యూనికేషన్ మారింది. అప్పుడతను తనకి ఇరవై ఏళ్లని చెప్పాడు. ఏం ఫర్వాలేదనుకుంది. మళ్ళీ పాతికేళ్ళని మెసేజి కొట్టాడు. నో ప్రాబ్లమనుకుంది. ఒకబ్బాయితో ఇలా కమ్యూనికేట్ అవడమే గొప్పనుకుంది. అంతేకాదు, తనలో ఇంకేదో ఫీలింగ్స్ మొదలవడం గమనించింది. ఆ ఫీలింగ్స్ ప్రేమనుకుంది. 

        అలా రెండు నెలలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తో గడిపాక, కలుద్దామన్నాడు. మాల్ లో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. విశాలి మాల్ కెళ్ళి అతడితో ముఖాముఖీ భేటీ కోసం వెయిట్ చేస్తోంది. అతనొచ్చాడు. చూసి షాకైంది. ముప్పై ఏళ్ళు పైనే వుంటాడు. అఫెండ్ అయింది. అతను అద్భుతంగా మాటాడి ఆమెని ఆకట్టుకుని హోటల్ గదికి తీసికెళ్ళాడు. ఆమె కోసం కొనితెచ్చిన డ్రెస్సూ, లోదుస్తులూ ఆమెకి తొడిగిస్తూ ఫోటోలు తీశాడు. ఆమెని కిస్ చేయబోతూంటే ఆగమంది. ఆగకుండా ఆమెని బెడ్ మీదికి లాగి  మీద పడ్డాడు...(ప్లాట్ పాయింట్ వన్)


       ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ విశాలికి ఆ వయసులో అపరిచితుడితో రిలేషన్ షిప్ అనే తొందరపాటు నిర్ణయం తీసుకున్న అప్రియ వాతావరణం, 2. పాత్రల పరిచయం : స్కూల్లో చదువుతున్న విశాలితో బాటు, మధ్య తరగతికి చెందిన ఆమె తల్లిదండ్రులు, విద్యుత్ అనే ఇంకా వివరాలు తెలీని ఆగంతకుడులతో, ఈ బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అవసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : అంతవరకూ అబ్బాయిలంటే బెరుకు వున్న విశాలికి, పేరెంట్స్ లాప్ టాప్ కొనివ్వడంతో అపరిచితుడితో ఉత్సాహపడి ప్రేమలో పడ్డం, అతను తడవకో వయసు చెబుతూ మభ్యపెడుతున్నా ఆంతర్యం గ్రహించక పోవడం, ఆన్ లైన్ వల్ల తానెంతో స్వతంత్రంగా ఎదిగిపోయినట్టు భావించుకుని, తల్లిదండ్రులనుంచి ప్రైవసీని మెయింటెయిన్ చేయడం, అతను కలుద్దామంటే గుడ్డిగా వెళ్లి కలుసుకోవడం, తన కంటే చాలా పెద్దవాడైన అతణ్ణి చూసి షాకవడం, అతడి తియ్యటి మాటలకి పడిపోయి హోటల్ కెళ్ళి పోవడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : అతడి మీద ప్రేమ పెరిగిపోయి హోటల్ గది కెళ్ళి పోయిన ఆమె, తన దుస్తులు మారుస్తున్నా, తనని ఫోటోలు తీస్తున్నా, అప్రమత్తం కాక అతడి కుట్రకి బలై పోవడం. 

         
కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ లక్షణాల ప్రకారం, ఇందులో విశాలి పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల ఆమె అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ఈ బిగినింగ్ విభాగంలో జరగాలి. జానర్ మర్యాదలననుసారం పాత్ర మానసికంగా అస్తిరత్వం లోంచి స్థిరత్వం లోకి చేసే టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి అవసరాలు పెరిగిపోయాయని భావించుకోవడం వల్ల. ఇదంతా విశాలి పాత్ర పరిచయంలో జరిగాయి. 

        ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. ఇంటర్వూలో వంకర సమాధానాలు చెప్తే లేచెళ్లి పొమ్మంటాడు ఆఫీసర్. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ గా ఏదైనా ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. 

        కనుక విశాలితో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన పై చట్రంలో జరగాలి. జరిగింది కూడా. తను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. లోపల ప్రేమ అనుకుంటోంది, బయట కుట్ర జరుగుతోంది. ఒక్కో అడుగూ కుట్ర కేసే వేస్తోంది. మొదటి సారిగా అతణ్ణి చూసినప్పుడు, అతడి అసలు వయసు ముప్పై అని తెలిసినప్పుడు, భౌతిక ప్రపంచం అర్ధమై, ఆ భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది వయోభేదం రూపంలో. అస్థిర మనస్తత్వ పరిణామం. ఉత్తుత్తి జీవిత లక్ష్యపు  ప్రమాదం. ఆ వయసులో ఆమెది ప్రేమే అయితే ఇలా చెయ్యదు. ఆ వయసులో వుండేది ఆకర్షణే కాబట్టి ఇలా చేసేసుకుంటూ వెళ్లి పోయింది. ఆకర్షణని ప్రేమనుకుంది. భౌతిక ప్రపంచం తిరస్కరించినా ఆ ఆకర్షణ వికర్షణగా మారకుండా అపరిపక్వ ప్రేమే అడ్డుపడింది. అందుకని అతడి వల్లో పూర్తిగా పడిపోయింది. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కిచ్చి,  కన్యాత్వాన్ని పోగొట్టుకోవడంతో సమస్య ఏర్పాటయింది ప్లాట్ పాయింట్ వన్ లో. 

           ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక, తర్వాత వచ్చే టూల్ ‘గోల్’ ఏర్పాటు గురించి. ఇప్పుడు విశాలి గోల్ ఏమిటి? ఇది మానభంగం అనుకునే వయసు కాదు, అతడి ప్రేమే అనుకునే వయసు. అందుకని ఈ ‘ప్రేమ’ ని కొనసాగించడమే ఆమె గోల్. 

        ఎప్పుడైనా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో పాత్ర గోల్ మూర్ఖంగానే వుంటుంది. ఆ వయసులో జీవితమంటే ఏమిటో తెలీదు కాబట్టి. ఇలాటి సాంప్రదాయ కథలో కూడా హీరో గోల్ మూర్ఖంగానే వున్నట్టు గత వ్యాసంలో గమనించాం. పొరపాటున కూడా పాజిటివ్ గోల్ ఇవ్వకూడదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకి అపరిపక్వ పాత్ర ప్రయాణం కాబట్టి.

        మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : విశాలి కోరిక ఇక పెళ్లి చేసుకుంటాడనే కావొచ్చు. 2. పణం : కన్యాత్వాన్ని పణంగా పెట్టేసింది, అది రమ్మన్నా తిరిగిరాదు, ఎట్టి పరిస్థితిలో అతడితో పెళ్లి జరగాల్సిందే. 3. పరిణామాల హెచ్చరిక : ప్రెగ్నెన్సీ ప్రమాదం పొంచి వుంది. 4. ఎమోషన్ : ఒకవైపు కన్యాత్వాన్ని పోగొట్టుకుని, ఇంకోవైపు పెళ్లవుతుందో లేదోనన్న సందిగ్ధావస్థ. దీన్నెలా హేండిల్ చేస్తుందో తెలీదు. పైగా పద్నాల్గేళ్ళకే పెళ్ళేమిటి? రెండింతల పైగా వయసున్న వాడితో? 

        ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ నీ  సెట్ చేసుకున్నాక ముందు మిడిల్ కథేమిటో చూద్దాం...

సికిందర్

Monday, December 16, 2019


                                                            వివరణ
        ఈ బ్లాగు సినిమా విశ్లేషణల కోసమేనా, లేక స్క్రిప్టుల బాగోగులకి సంబంధించి సలహా సంప్రదింపులకి ఏమైనా అవకాశాలున్నాయా అని వస్తున్న సందేహాల నివృత్తికి ఈ వివరణ. బ్లాగులో సినిమా సంబంధమైన విశ్లేషణలు, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రావడంతో బాటు, స్క్రిప్టు కన్సల్టెన్సీ కూడా ఎప్పట్నుంచో నడుస్తోంది. కాకపోతే బ్లాగులో బహిరంగంగా ప్రకటించలేదు. తమ స్క్రిప్టులకి సంబంధించి ఎలాటి సందేహాలకైనా, పరిష్కారాలకైనా కింద ఇచ్చిన నెంబరు, లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
సికిందర్
9247347511
msikander35@gmail.com  

Saturday, December 14, 2019

899 :రివ్యూ పాయింట్



        తెలుగు సినిమాలు ఇంకా అవే బిగినింగ్ ఆర్భాటాలుగానే నిర్మాణ మవుతున్నాయి. ఆర్భాటంగా బిగినింగ్ తప్ప ఆ తర్వాత ఏమీ వుండని అదే పాత పరిస్థితి / తప్పు ఇంకా  కొనసాగుతోంది. స్క్రీన్ ప్లే పరిభాషలో తెలుగు సినిమాలంటే కేవలం బిగినింగే అన్నట్టు తయారయ్యింది. బిగినింగ్ తర్వాత వుండాల్సిన మిడిల్ మాయమైపోయింది. ఆ బిగినింగ్ కూడా ఇంటర్వెల్ దాకా సాగదీసి వుంటుంది- ఆ తర్వాత మిడిల్ తో నడవాల్సిన సెకండాఫ్ డొల్లేనని ఇక సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమైపోతోంది. ఇదిప్పుడు రాంగోపాల్ వర్మ, వెంకటేష్ ల సినిమాలకి కూడా ఎగబ్రాకింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, వెంకీ మామా ఈవారం తాజాగా ఈ లిస్టులో చేరికలు. ఈ లిస్టు గత పదిహేనేళ్ళుగా వుంది. పదిహేనేళ్ళ క్రితమే ‘ఇంటర్వెల్ అనే చౌరాస్తా నుంచి ఎటు వైపు?’ అని ‘ఆంధ్రభూమి’ లో రాశాం. ఇలా రాసేవాళ్ళకీ, సినిమాలు తీసే వాళ్ళకీ ఒక గ్యాప్ ఎందుకనో వుంటుంది. తీసే వాళ్ళకి పత్రికల విశ్లేషణలు పట్టవు. పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. సినిమాలు ఫ్లాపయ్యాక కూడా అవే తప్పులతో మరిన్ని ఫ్లాపులు అలాగే తీస్తూ పోతారు. లిస్టు పెంచేస్తూంటారు. దీంతో నిర్మాతలు బలి. అటు చెన్నైలో తమిళ నిర్మాతలకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. స్క్రీన్ ప్లే నాలెడ్జి తమకి కూడా అవసరమన్న అవగాహనకొస్తున్నారు. దర్శకుడెవరైనా, రైటరెవరైనా లెక్కలోకి తీసుకోకుండా, స్వయంగా నిర్మాతలు స్టోరీ డిపార్ట్ మెంట్స్ పెట్టుకుని వాళ్ళ స్క్రిప్టుల్ని కఠిన పరీక్షలకి గురిచేస్తున్నారు (దీనిపై వ్యాసం ఈ వారం చూద్దాం). 

       
లా ఎంత కాలం? పది కోట్లు పెట్టినా సెకండాఫ్ లేని సగం సినిమాయే చేతికొస్తున్నాక ఇక సెకండాఫ్ తీయడం దేనికి? ఇలాగే గంటన్నర ఇంటర్వెల్ దాకానే పెట్టేసుకుని, ఆ గంటన్నర పాటు టెంప్లెట్ ప్రేమలు, కామెడీలు, ఓ మూడు టెంప్లెట్ పాటలూ, ఫైట్లూ పెట్టుకుని, ఇంటర్వెల్ రాగానే కథ ప్రారంభించడానికి ఓ టెంప్లెట్ విలన్ని ఎంటర్ చేసి - ప్రేక్షకులారా ఇంతవరకే మాకు చాతనయింది, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కథ మీరే వూహించుకోండి, వెళ్ళిపోండి - అని శుభం వేసేస్తే సరిపోతుందిగా?  

        రెండూ సెకండాఫ్ సిండ్రోములే. అమ్మరాజ్యం ఫస్టాఫ్ లో ఎన్నికల్లో వెలుగు దేశం బాబు ఓడిపోయి, ఆర్సీపీ జగన్నాథ రెడ్డి అధికారంలోకి వస్తాడు. బాబు ఓర్వలేకపోతాడు. ఎలాగైనా జగన్నాథ రెడ్డికి అప్రతిష్ట తేచ్చి గద్దెదింపాలని బాబు, అతడి కుమారుడు చినబాబూ అనుకుంటారు. ఇంతలో తన పార్టీలో ముఖ్యుడైన దయనేని రమ హత్య జరిగిపోతుంది. దీంతో సీఎం జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది. దయనేని రమని ఎవరు చంపారు ఏమిటనేది సెకండాఫ్ కథ.

        షరా మామూలుగా ఇంటర్వెల్లోనే కథ ప్రారంభం కావాలి కాబట్టి, ఆ హత్యవరకూ ఫస్టాఫ్ స్పేస్ ఫిల్లర్ క్యారక్టర్స్ ఏవేవో వచ్చేస్తాయి. ప్రణయ్ కళ్యాణ్, పిపి జాన్ ల కామెడీలు, చినబాబు మీద సెటైర్లు నిండిపోతాయి. హత్య తర్వాత సెకండాఫ్ లో ఇవే అర్ధంలేని సెటైర్లు, కామెడీలు. అసలు కథ హత్య జరిగిన నేపథ్యంలో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకి వెళ్ళడం, ఎన్నికల్లో గెలవడం, ఇంతే. సెకండాఫ్ లో ఏదేదో కామెడీలతో కథ జోలికే పోలేదు. 

        విడుదలకి ముందు ఈ కథలో పాయింటు విన్నప్పుడు వైరల్ అయ్యే మార్కెట్ యాస్పెక్ట్ తో వుందన్పించింది. తీరా చూస్తే వీగిపోయింది. జగన్నాథ రెడ్డిని దించడానికి దయనేని రమని చంపే ప్లానుతో రమకి కంగారు పుట్టించడం పాయింటు అని తెలిసినప్పుడు - ఇదేదో బాగానే వుందనిపించింది. మనుగడలో వుండే పాయింటు. రమని చంపేస్తే అక్కడితో ఈ పాయింటు అంతమైపోతుంది, ఇక కథేమీ వుండదు, ఎవరు చంపారన్న పనికిరాని సస్పెన్సు తప్ప. కానీ సినిమాలో ఇదే జరిగింది. రమని చంపేశారు, కథనీ చంపేశారు, సెకండాఫ్ నీ  చంపేశారు, మొత్తం సినిమానే చంపేశారు.


        ఈ కథ ప్రకారం బాబు, చినబాబులు విలన్లు అనుకుంటే, జగన్నాథరెడ్డి హీరో. ఈ హీరోని రమని చంపడం ద్వారా ఇరికించాలని విలన్ల ప్లాను లేదా కథకి పాయింటు. అప్పుడు ఆత్మ రక్షణలో పడ్డ హీరో రమని చంపకుండా చూడడం, ఆ తాలూకు స్ట్రగుల్ చేయడం మనుగడలో వుండే పాయింటు. చంపాలని విలన్లు, ఆపాలని హీరో. ఇప్పుడేం జరుగుతుందన్నది మిగతా పొలిటికల్ థ్రిల్లర్.
There is no terror in the bang, only in the anticipation of it ―Alfred Hitchcock కొటేషన్ కి మించిన దిక్సూచి లేనే లేదు. ఇంటర్వెల్ అనే చౌరాస్తాలో కన్పించే గైడ్ పోస్ట్. కానీ ఇంటర్వెల్లోనే రమని హరీ మన్పిస్తే సినిమా హరిలో రంగ హరీ, వర్మగారి పని సరి!

        ఈ మధ్య విఫలమవుతున్న రాజకీయ సినిమాలు చూస్తూంటే ఒక్కటే గుర్తుకొస్తూంటుంది - కోడి రామకృష్ణ ‘భారత్ బంద్’.దీన్ని గైడ్ లా పెట్టుకుని ఎన్ని రాజకీయ సినిమా లైనా విజయవంతంగా తీయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.

        ఇక వెంకీమామ కూడా ఇంటర్వెల్లో ప్లేటు ఫిరాయింపే. ఆ ప్లేటు కాశ్మీర్ లో సర్జికల్ స్ట్ర యిక్ అంటూ ఎగిరే పళ్ళంలా వెళ్లి ఎక్కడో పడింది. వూళ్ళో వెంకీ, కార్తీక్ మేనమామ. కార్తీక్ జాతక రీత్యా వెంకీకి ప్రాణగండం. ఇద్దరూ కలిసి వుండే కామెడీలు చేసుకుంటారు ఫస్టాఫ్ లో. వెన్నెలని వెంకీతో కలపాలని కార్తీక్ కామెడీ, హారికని కార్తీక్ తో కలపాలని వెంకీ కామెడీ. ఇంతలో కార్తీక్ కన్పించకుండా పోతాడు. ఎందుకు పోయాడు? తనవల్ల మేనమామ వెంకీకి ప్రాణ గండం వుంది గనుక. ఎక్కడికి పోయాడు? సైన్యంలో కలిసిపోయాడు. వెంకీ ఏం చేశాడు? వెతుక్కుంటూ పోయాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఏం చేశారు? సర్జికల్ స్ట్రయిక్ ని వీలైనంత అపహాస్యం చేసి సెకండాఫ్ ని అర్ధంలేని మిడిల్ గా చేశారు. 


        పాయింటేమిటి? కార్తీక్ కి తనవల్ల మేనమామకి జాతకరీత్యా ప్రాణగండం. ఇక్కడ మెయిన్ క్యారక్టర్ ఎవరు? కార్తీకే. ఒక పాత్రకి దానివల్ల ఇతరులకి ప్రాణగండముంటే ఆ కథ ఎవరిదవుతుంది? ఆ పాత్రదే అవుతుంది. ఎలా? ఇక్కడ తన వల్ల మేనమామకి ప్రాణ గండాన్ని నివారించే, వీలయితే తన ప్రాణాల్నే ఇచ్చే పాత్ర తనే గనుక. ఈ గోల్ తో, దీని తాలూకు సంఘర్షణతో, పరిష్కారాన్ని తనే కనుక్కోవాలి గనుక. కనుక్కున్నా కనుక్కోలేకపోయినా స్ట్రగుల్ తనదే, కథ తనదే. తన జాతకం వల్ల పుట్టిన తన కథ. కనుక్కుంటే డూయర్ పాత్ర, కనుక్కోలేకపోతే, మేనమామే కనుక్కుంటే బీయర్ పాత్ర. ఈ ఓటమి ఫర్వాలేదు, మేనమామ ముందు ఓటమి ఫర్వాలేదు. ఎదుటి పాత్రయిన మేనమామ విలన్ పాత్ర కాదు, తను పాసివ్ క్యారక్టర్ అవడానికి.   
       
       కానీ వెంకీ, కార్తీక్ పాత్రలు సినిమాలో రివర్స్ అయ్యాయి. వెంకీ ప్రధాన పాత్ర అయిపోయాడు, జాతక సమస్య వున్న కార్తీక్ ప్రాధాన్యంలేని సహాయ పాత్రయి పోయాడు! కథతో ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా వుంటుందా? ఈ కథకి చాలా మందే రచయితలున్నట్టు వినికిడి. 

         ఈ కథకి మోరల్ ప్రేమీజ్ ని నిర్ధారించుకుని దాని ప్రకారం కథ చేసుకోలేకపోయారు. మామా అల్లుళ్ళ మధ్య జాతక రీత్యా ఏర్పడ్డ సమస్యకి కొనసాగింపు కథ స్వాభావికంగా ‘త్యాగం’ అనే మోరల్ ప్రేమీజ్ (నైతిక ఆవరణ) లోకి దానికదే వచ్చేస్తుంది. సన్నిహితంగా వుండే వివిధ పాత్రల మధ్య త్యాగాల కథలతో సినిమాలెన్నో వచ్చాయిగా? వాటి లోంచే ఈ కథ తీసుకుని పాయింటుని విరిచి విన్యాసాలు చేస్తే కొత్త కథయి పోతుందా? త్యాగమనే విలువ యూనివర్సల్ నీతి. దీన్ని విరిస్తే, లేదా దీన్నుంచి పలాయనం చిత్తగిస్తే ఇంతే సంగతులు చిత్తగించవలెను.

సికిందర్