రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, డిసెంబర్ 2019, గురువారం

902 : రివ్యూ


            నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ లు కలిసి పాత రూలు ‘రూలర్’ తో  పురాతన రూలింగ్ ఇచ్చారు. పాత రూలుతో కొత్త రూలింగ్ ఇవ్వచ్చు, కానీ సవరణలు సంస్కరణలు ఇష్టపడలేదు. ఈ రివ్యూకర్తతో పది రోజులుగా జరుగుతున్న మేధోమధనాల్లో ఒక దర్శకుడి నిశ్చితాభిప్రాయం, సినిమాలకి రూల్స్ ఏమిటని. నిజమే, ‘గుండమ్మ కథ’ ని అప్పుడెలా తీశారో ఇప్పుడూ ఉన్నదున్నట్టూ అలాగే తీసి చూపించ వచ్చు. ‘పేదరాశి  పెద్దమ్మ కథ’ ని కూడా కార్బన్ కాపీలా తీసి విడుదల చేయవచ్చు. ‘పేదరాశి పెద్దమ్మ కథ’ లో మాంత్రికుడు నాగ కన్యని అపహరించి చిలుకగా మార్చేసే క్రియేటివిటీతో పన్నాగమైనా పన్నాడు, పాత సినిమాల్లోంచి కథల్ని అపహరించినప్పుడు ఈ మాత్రం  క్రియేటివిటీ కూడా ప్రదర్శించ నక్కర్లేదన్నట్టుగా వుంది  - ఉన్నదున్నట్టు తీసే యడమే. ‘బాషా’ ఆధారంగా ఎన్నెన్ని ఫ్యాక్షన్ సినిమాలొచ్చినా, ‘రూలర్’ ని ఇంకా అచ్చం ఆ ఫ్యాక్షన్ సినిమాల్లాగే అలాగే తీసే బలహీనత. ఏ క్రియేటివ్, మార్కెట్ యాస్పెక్ట్ రూల్సూ వర్తించవు కాలాన్నిబట్టి. సినిమా కళ గడ్డ కట్టిన పదార్ధమైంది కాబట్టి. 

       
‘రూలర్’ లో బాలకృష్ణ రెండు పాత్రలున్నాయి. దీంతో బాటు సోనాల్ చౌహాన్ సిటీ హీరోయిన్ పాత్ర, వేదిక సెకెండ్ హీరోయిన్ రూరల్ పాత్ర, ఒక రాజకీయ విలన్ పాత్రా వున్నాయి. ఇంకా సప్తగిరితో కమెడియన్ పాత్ర, ప్రకాష్ రాజ్ నీతిమంతుడైన రాజకీయ నాయకుడి పాత్రా వున్నాయి - టెంప్లెట్ లో వుండాల్సిన రెడీమేడ్ పాత్రలన్నీ సిద్ధంగా వున్నాయి. బాలకృష్ణ ఫస్టాఫ్ గెటప్ ఫర్వాలేదు, సెకండాఫ్ గిరిజాల జుట్టు గెటప్ గెటప్ లాలేదు. టెంప్లెట్ పాటలు, టెంప్లెట్ ఫైట్లూ అన్నీ వున్నాయి. దర్శకుడు కేఎస్ రవికుమార్ 30 ఏళ్ళుగా గ్లోబలైజేషన్ పూర్వపు అదే తన దర్శకత్వపు విలువల్ని, ఇంకా నేటి గ్లోబల్ మార్కెట్ లో అదే రూపంలో అలాగే అమ్మేద్దామనుకున్నాడు. 

        ఇందులో సరోజినీ నాయుడు (జయసుధ) సాఫ్ట్ వేర్ కంపెనీ చైర్ పర్సన్. ఆమెకి గాయపడ్డ వ్యక్తి (బాలకృష్ణ) ఒకడు దొరికితే తీసి కెళ్ళి చికిత్స చేయిస్తుంది. ఆ తర్వాత తనూ గాయపడి హాస్పిటల్లో వున్నప్పుడు ఆమె మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ వ్యక్తే ఆమెని కాపాడతాడు. ఆ వ్యక్తికి తానెవరో తెలీదు. జ్ఞాపక శక్తి కోల్పోయాడు. తనని కాపాడిన అతణ్ణి తన కొడుకుగా ప్రకటించి, అర్జున్ ప్రసాద్ అని పేరుపెట్టి - కంపెనీకి చైర్మన్ ని చేసేస్తుంది. 


      ఒక పోటీ కంపెనీ బాస్ కూతురు హారిక (సోనాల్ చౌహాన్) అర్జున్ ప్రసాద్ మీద కక్ష గట్టి అర్జున్ ప్రసాద్ బ్యాంకాక్ ప్రాజెక్టుని కొట్టేయాలని బయల్దేరుతుంది. వెంట తీసికెళ్ళిన ముగ్గురు హ్యకర్లతో (రఘుబాబు, ధన రాజ్, రఘు కారుమంచి) బ్యాంకాక్ లో అర్జున్ ప్రసాద్ డేటాని హ్యాక్ చేయబోయి దొరికిపోతుంది. గిల్టీ ఫీలవుతుంది. ప్రేమలో పడుతుంది. ఈ సంబంధం సరోజినీ నాయుడు ఖాయం చేసుకుంటుంది.  

        ఉత్తరప్రదేశ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. 1987 లో యూపీ కరువు కాటకాలతో వుందని మంత్రి వీరేంద్రనాథ్ టాగూర్ (ప్రకాష్ రాజ్) ఆంధ్రా రైతుల్ని రప్పించి వ్యవసాయంతో సస్యశ్యామలం చేయమంటాడు - అప్పట్లో నిజాం ప్రభుత్వం నిజాం సాగర్ డాం కట్టి, ఆంధ్రుల్నిరప్పించి వ్యవసాయం అప్పగించినట్టు. యూపీ వెళ్లి ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తారు ఆంధ్రా రైతులు. 

        ఇప్పుడు అక్కడి ఒక తెలుగు కుటుంబంలో సంధ్య (వేదిక) వుంటుంది. ఆమె గాయపడి మానసికంగా పిచ్చిదానిలా వుంటుంది. అక్కడికి రెవిన్యూ మంత్రి భవానీనాథ్ ఠాగూర్ పాల్పడుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం న్యాయ విచారణ వేస్తే ఆ విచారణ బృందాన్ని బెదిరిస్తాడు భవానీ నాథ్. 

        ఇక సరోజినీ నాయుడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తను ఆ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు పెట్టాలనుకుని వెళ్తే భవానీ నాథ్ తన మీద దాడి చేశాడు. అలా గాయపడ్డ తను హాస్పిటల్లో చేరితే, అక్కడ హత్యా ప్రయత్నం నుంచి భవానీ ప్రసాద్ కాపాడేడన్న మాట .

        ఇది తెలుసుకుని అర్జున్ ప్రసాద్ ఇప్పుడా ప్రాంతానికి వెళ్లి సోలార్ ప్రాజెక్టు భూమి పూజ ప్రారంభిస్తాడు. భవానీనాథ్ గ్యాంగుతో వచ్చేసి దాడి చేస్తాడు. అర్జున్ ప్రసాద్ ఎదుర్కొంటాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్ ని అక్కడి జనం గుర్తుపట్టి ‘ధర్మా’ అంటారు. ఇంటర్వెల్ పడుతుంది. 

జ్ఞాపక శక్తి పోగొడితే కొత్త కథా?
      ఈ ఫస్టాఫ్ కథ ఫ్యాక్షన్ టెంప్లెట్ లో దర్శనమిస్తుంది. వూళ్ళో సమస్య వున్న హీరో ఎక్కడో వెళ్లి అజ్ఞాతంలో ఇంకేదో చేస్తూ బ్రతకడం, ఎవరో గుర్తుపట్టి ‘బాబూ నువ్విక్కడు
న్నావా?’ అని ఆశ్చర్యపోవడం, ఆ బాబు గారైన హీరో ఇక్కడెందుకున్నాడో వూళ్ళో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవడం, ఆ ఫ్లాష్ బ్యాక్ లో విలన్ తో సమస్య చూపించడం, ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక మళ్ళీ విలన్ తో సమస్య వచ్చి హీరో వెళ్లి చంపడం... ఇలా చూసి చూసి వున్న, తెలిసిపోయే కథనపు టెంప్లెట్ లోనే రూలర్ కొత్త రూల్స్ లేకుండా పాతగా దర్శనమిచ్చాడు. కాకపోతే ఇక్కడ హీరో జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఇంటర్వెల్లో అతణ్ణి ధర్మాగా  గుర్తుపట్టడంతో సెకండాఫ్ లో ధర్మా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్యాక్షన్ కథల్లో పాత్రకి జ్ఞాపక శక్తి పోగొట్టి ఇంకో చోట బతికేలా చేస్తే కొత్త కథై పోతుందనుకున్నారు. మిగతా కథనమంతా కాలం చెల్లిన ఫ్యాక్షన్ వ్యవహారమే.  

        కానీ ఈ జ్ఞాపక శక్తి కోల్పోయిన ధర్మా ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్. ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ కన్పించకుండా పోతే ప్రభుత్వం పట్టించుకోలేదా? సరోజినమ్మ గారు గాయపడిన ధర్మాగారు దొరికితే ఆయన గారి జేబుల్లో ఏమీ లేదా? ఐడీ కార్డు కూడా? పోలీస్ ఇన్స్ పెక్టరైన హీరో మీద విలన్ దాడి చేయిస్తే ఆ ఇన్స్ పెక్టర్ పుట్ట గతుల్లేకుండా పోతాడా? పోతే పోయాడని డిపార్ట్ మెంట్ కూడా వూరుకుంటుందా? ఇలా క్యారక్టర్ ని మార్చి కొత్తగా ఏదో చేయబోయి దొరికిపోయారు. అంటే పై పైన కథా పాత్రలూ రాసేసి, పై పైన తీసేస్తే, బాలకృష్ణ ఇమేజియే గట్టెక్కించేస్తుందను కున్నట్టుంది. 

        ఫస్టాఫ్ కథనంలో ఆసక్తి కరమైనదేమీ వుండదు. చూసి చూసి వున్న అవే పాత టెంప్లెట్ సీన్లే, అదే క్రమంలో వచ్చి పోతూంటాయి. మోడరన్ గా హల్చల్ చేసే పాత్ర హారిక,  సరోజినమ్మ మంచికోడలిగా చేసుకుంటానగానే చీరకట్టుకుని కంపెనీ వదిలిపారేసి, సీన్లలో వూరికే వచ్చిపోతూ కరివేపాకు ఆఫర్ చేస్తుంది ప్రేక్షకులకి. రెండో హీరోయిన్ పాత్ర సంధ్య వేపాకు తిన్నట్టు వూగుతూ వుంటుంది పిచ్చితో. 

        వూరిమీద మంత్రి భవానీ ప్రసాద్ టాగూర్ దౌర్జన్యాలు, జనం హాహాకారాలూ చూసి చూసి వున్న పాత సీన్లే. నేటి కొత్త సినిమా సీన్లు కావివి. ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లుంటారు, బెంగాల్లో టాగూర్స్ వుంటారు. ఉత్తరప్రదేశ్ లో టాగూర్ పేరు పెట్టి పచ్చి విలన్లుగా ఎక్కడా చూపించలేదు, హిందీ సినిమాల్లో కూడా. విశ్వకవి, నోబెల్ గ్రహీత రవీంద్ర నాథ్ టాగూర్ ని గుర్తు చేసేలా విలన్ కి భవానీ నాథ్ టాగూర్ అని పేరు పెట్టడమేమిటో అర్ధం గాదు. ఇంకా నయం భారత కోకిల సరోజినీ నాయుడు పేరు జయసుధ పాత్రకి పెట్టి రక్షించారు.  

        ఇతర భాషల్లో స్టార్లు సూపర్ స్టార్లు కృత్రిమ ఫార్ములా పాత్రలు వదిలేసి సహజత్వంతో వాస్తవిక పాత్రలు అంగీకరిస్తున్నారు. 

అరకొర ధర్మా కథ
         సెకండాఫ్ లో గ్రామస్థులు (ధర్మా తల్లిదండ్రులు సహా) ధర్మాని చూసి, నువ్వు లేకపోతే  ఎంత అన్యాయమై పోయామోనని మొర పెట్టుకుంటారు. తర్వాత ధర్మా ఎందుకు వూళ్ళో లేకుండా పోయాడో గంటసేపు సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాకు ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాకు ఉత్తర ప్రదేశ్ లో తెలుగు రైతుల పంటలకి ధర రాకుండా చేసే విలన్ ముఠా ఆగడాలతో ప్రారంభమవుతుంది. అక్కడికి ఇన్స్ పెక్టర్ ధర్మా వచ్చేసి ఫైట్ చేస్తాడు. రైతుల గురించి ఒక ఉపన్యాసమిస్తాడు. ఒక విజయోత్సవపు పాట. 

        పాట తర్వాత మాజీ మంత్రి వీరేంద్రనాథ్ టాగూర్ కూతురి కులాంతర పెళ్లి రిసెప్షన్. పెళ్లి కూతురు నిరంజన (భూమిక). ఈ కులాంతర పెళ్ళికి కుతకుతలాడిన వీరేంద్ర నాథ్ టాగూర్ తమ్ముడు, రెవిన్యూ మంత్రి భవానీ నాథ్ టాగూర్ (పరాగ్ త్యాగి) అనే విలన్, పెళ్లి కొడుకు కుత్తుక కసిక్కున కోసి పారేస్తాడు. ఆనర్ కిల్లింగ్ అన్నమాట. కూతుర్ని తీసుకుని పారిపోతాడు వీరేంద్ర నాథ్ టాగూర్. ఇన్స్ పెక్టర్ ధర్మా వచ్చి ఇంకో ఫైట్ చేసి కాపాడతాడు. తండ్రీ కూతుళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 

        ఇంట్లో పెట్టుకుంటే ఒక కేబుల్ టీవీ వాడి వేషంలో విలన్ తొత్తు వచ్చి నిరంజనని చంపబోతాడు. వాడిని వూరి జనాలకి అప్పజెప్పి తన్నిస్తాడు ధర్మా. ఈ మొత్తం వ్యవహరంలో ధర్మా కన్పించక పోవడంతో పిచ్చితో వున్న సంధ్య, ఇప్పుడు పిచ్చి కుదిరి కామెడీలు చేస్తుంది. ఇక ఇంట్లో ఆచార వ్యవహరాలూ, పేరంటాళ్ళ రాక, సంధ్య స్వయం వరం, ధర్మా మెళ్ళో మాల, ప్రేమ పాట!

        పాట తర్వాత విలన్ సంధ్యని చంపే ప్లాను. ఇంకో వైపు రైతుల కిచ్చిన భూముల రద్దు కుట్ర.  ఆస్తి కోసం భవానీనాథ్ టాగూర్ అన్న ని చంపడం, ధర్మాతో తో ఫైట్. గాయపడిన ధర్మా జ్ఞాపక శక్తిని  కోల్పోయి సరోజినీ నాయుడికి బంగారు కొడుకులా దొరకడం. ఫ్లాష్ బ్యాక్ ఓవర్.

        ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇప్పుడు తానెవరో జ్ఞాపకం తెచ్చుకున్న ధర్మా అలియాస్ భవానీ ప్రసాద్, విలన్ భవానీ నాథ్ టాగూర్ ని చంపడం. ది ఎండ్.

నేనెవర్ని? 
        మళ్ళీ ‘పేదరాశి పెద్దమ్మ కథ’ చెప్పుకుందాం. ఇందులో పేదరాశి పెద్దమ్మ నిర్మలమ్మ కూతురు విజయలలిత శాపానికి గురై పగలు ముసలి దానిగా, రాత్రి నిజ రూపంలో గడుపుతుంది. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ టైపు అన్నమాట. బాలకృష్ణ అర్జున్ - ధర్మా పాత్రలకి ఈ సంక్లిష్ట జీవిత సంవిధానముండదు. కనెక్షన్ లేని, డెప్త్ లేని పైపైన రాసేసి తీసేసిన కార్డ్ బోర్డ్ క్యారక్టర్ లుగా వుండిపోతాయి. గతాన్ని మర్చిపోయిన పాత్రగా నేవర్ని? అని ప్రశ్నించుకునే సీనే వుండదు. పేరుకే మెమరీ లాస్ క్యారక్టర్, క్యారక్టరైజేషన్లో ఆ చిహ్నాలే వుండవు. పైగా తన కథ కంటే విలన్ కథే, సీన్లే ఎక్కువుంటాయి. సెకండాఫ్ లో క్యారక్టర్ కి సరైన విషయమే లేకుండా, గంటపాటు ఫ్లాష్ బ్యాక్ చూపడం ఒక వృధా ప్రయాస అనుకుంటే, ఉత్తరప్రదేశ్ తెలుగు రైతుల కథ అంతకంటే అతకని వ్యవహారంగా మిగిలింది. ఉత్తర ప్రదేశ్ ఎడారి రాష్ట్రం కాదు. దేశంలో ఇరవై శాతం ఆహార ధాన్యాలు అక్కడే పండుతాయి. 

        ఫస్టాఫ్ లో పావు గంట హీరో లేని ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ లో హీరోకి అంతగా పనిలేని విలన్ ఫ్లాష్ బ్యాక్, మొత్తం కలిపి గంటంపావు సమయం ఫ్లాష్ బ్యాకులే తినేస్తే కథ ప్రారంభ మయ్యేదెప్పుడు? ఫ్లాష్ బ్యాకులు ఎప్పుడూ కథ అన్పించుకోవు, ప్రారంభంకాని కథకి ఉపోద్ఘాతాలు మాత్రమే. అంటే సినిమాకి శరాఘాతాలు. సెకండాఫ్ సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మిగిలిన చివరి పది నిమిషాలే కథ! ఈ పది నిమిషాల్లోనే ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ, క్లయిమాక్స్! అంటే పాయింటు లేదు, పాయింటుతో గోల్ లేదు, గోల్ కోసం సంఘర్షణా లేదు. ఈ ఫ్యాక్షన్ 2.0 సంక్రాంతి విడుదల కాకపోవడం ఫ్యామిలీ ప్రేక్షకులని కాపాడింది.

సికిందర్