Thursday, December 5, 2024
Thursday, November 28, 2024
1359 : స్క్రీన్ ప్లే సంగతులు
ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడో ఇంటర్వెల్లో గంటా 20 నిమిషాలకి గానీ తీరిగ్గా రాదు. షార్ట్స్ ని/ రీల్స్ ని స్క్రోలింగ్ చేసే నేటి మైక్రో కంటెంట్ ప్రపంచంలో ఇంత తీరిక ఎవరికుంది? మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాశారా? కథ కోసం ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టాలా? ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ వరకూ రాక పోవడంతో ఫస్టాఫ్ అంతా విషయం లేనట్టుగా తయారైంది. ఇలా ఫస్టాఫ్ లో చూపించిందంతా కథే అవుతుందా, లేక ప్లాట్ పాయింట్ 1 దగ్గర (ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర) ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమవుతుందా అన్నది ఆలోచించాలి. ఇలా కథ చెప్పడానికి ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతమే (బిగినింగ్) సాగదీస్తే ఎంత బడ్జెట్ దుబారా అవుతుంది? స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్ట్రక్చర్ కి లోబడి లేకపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. కథని ఎంత క్రియేటివ్ గా ఆలోచించినా అది స్ట్రక్చర్‌లో లేకపోతే 300 కోట్ల రూపాయల ‘కంగువా’ కూడా బాక్సాఫీసులో కంగు తినాల్సిందే!
ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కథ ప్రకారం అతను ఆర్ధికంగా స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్ అయివుండాలి. అప్పుడే ఆ గ్యారేజీ వున్న ల్యాండ్ ని కబ్జా చేస్తున్న శక్తులతో పోరాడలేక డబ్బు చెల్లించేందుకు సిద్ధపడగలడు. అప్పుడు దీన్ని మిలియనీర్ మెకానిక్ సెటప్ కి మార్చేస్తే, మార్కెట్ లో టాప్ పొజిషన్లో వున్న ఈ గ్యారేజీని టేకోవర్ చేయాలని చూస్తున్న ఇంకో కంపెనీ కుట్రగా వుండొచ్చు. ఐటీ, ఈడీ దాడుల ద్వారా అతడ్ని బెదిరించి టేకోవర్ చేసుకునే కుట్ర. దీంతో ల్యాండ్ కబ్జా అనే పాత వాసన, టెంప్లెట్ కథనం వదిలిపోతుంది. పాత వాసనతో, టెంప్లెట్ తో కథనంలో థ్రిల్లేమీ వుండదు!
3.
మాస్ ఉపోద్ఘాతం ఇలా!
ఇంత ట్రాజడీతో వున్న ప్రియా ఓ బిల్డర్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ తల్లిని, చెల్లెల్నీ పోషించుకుంటూ, డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ గ్యారేజీ రాకీదని తెలియక వస్తే, రాకీకి మళ్ళీ ఈమెతో లైను కలిసింది. అయితే రాకీ దీనికి ముందే మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఇన్సూరెన్స్ ఏజెంటుకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
ఇలావుంటే మరోవైపు, రంకిరెడ్డి (సునీల్) అనే గ్యాంగ్ స్టర్, రాకీ గ్యారేజీ వున్న స్థలం మీద కన్నేసి వేధిస్తున్నాడు. రాకీ తండ్రి రామకృష్ణకి తీర్ధయాత్రలకి వెళ్ళాలని కోరిక వుంది. ఈ కోరిక తీర్చేస్తూ తీర్ధయాత్ర ప్లాన్ చేశాడు రాకీ. అయితే రామకృష్ణ ఇక్కడే చనిపోయాడు. ఈ విషయం మాయాకి చెప్పాడు రాకీ. రంకి రెడ్డికి కట్టాల్సిన 50 లక్షల గురించి కూడా చెప్పా డు. మాయా ఇన్సూరెన్స్ పాలసీలు చెక్ చేసి, రాకీ తండ్రికి రెండు కోట్ల మేరకు పాలసీ వున్న సంగతి చెప్పింది. రాకీకి ఆశ్చర్యమేసింది. అయితే నామినీగా తన పేరుగాక రాజేష్ అనే వేరే పేరుందని ఆమె చెప్పేసరికి షాకయ్యాడు...
ఇక దీని తర్వాత వచ్చే రెండో సీను డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా రాకీ గ్యారేజీకి వచ్చే సీను. ఈ సీను కూడా ఓ మంచి క్రియేషనే. ఎందుకంటే ఈ సీనులో నాలుగు విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి- 1. మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం వెనుక ఆమె పన్నిన ఒక కుట్ర వుంది. ఇది సెకండాఫ్ లో రివీలవుతుంది, 2. అప్పుడే గ్యారేజీకి ఒకతను వచ్చి గ్యారేజీ మూసేస్తారటగా అంటాడు. శుభమా అని గ్యారేజీ సీనుతో ప్రారంభిస్తూ అప్పుడే గ్యారేజీ మూసేసే మాటేమిటి? ఆలోచింపజేసే సీను. ఈ మాట అప్పటికే రంకిరెడ్డితో నలుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని అన్నది. ఇది కూడా తర్వాత రివీలవుతుంది. అయితే ఈ మాట అనడంతో ఈ గ్యారేజీకి ఏదో ప్రాబ్లం వుందని ప్రేక్షకులకి ఆసక్తి పుడుతుంది,
అసలు మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం ఆమె పన్నిన కుట్రలో భాగంగానే జరిగినప్పటికీ, అసలామెని ఇక్కడికి తన స్కెచ్ ప్రకారమే వచ్చేటట్టు చేశాడు రాకీ. అంటే రాకీని ట్రాప్ చేసే పనిపెట్టుకుని వచ్చిన మాయాకి, రాకీ వేసిన స్కెచ్ ప్రకారమే వచ్చి తనే ఇరుక్కుందని తెలీదన్న మాట1
మరొకటేమిటంటే, మొదటి సీనులో చూపించిన ఆత్మహత్యకి కారకురాలు ఈ మాయే. ఇది కూడా సెకెండాఫ్ లో బయటపడుతుంది. అంటే మాయా ఆల్రెడీ ఒక బకరాని బలితీసుకుని, రెండో బకరాగా బలి చేద్దామని రాకీ దగ్గరికి వచ్చిందన్న మాట. ఒక దాని తర్వాత ఒకటి ఆమెకి కనెక్ట్ అవుతున్న ఈ రెండు సీన్లూ కథనానికి మంచి డైనమిక్స్ ని క్రియేట్ చేశాయి. ఇలా సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పనికొచ్చే ఈ ఇద్దరి గేములూ నిగూఢంగా ఇలా ఈ రెండు సీన్లలో ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఇందుకే ఇది మంచి క్రియేషన్ అన్నాం.
‘మాది రాయలసీమ, మా తాత కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు...’ అంటూ చెప్పుకొస్తాడు. ఆ తాత కామెడీగా ఫ్యాక్షన్ దాడిలో గాయపడి హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ గ్యారేజీ తెరిచి బ్రతికెయ్యడం, చనిపోతూ కొడుకు రామకృష్ణకి గ్యారేజీ అప్పగించడం పూర్తయ్యాక, రామకృష్ణకి రాకీ పుట్టడం దగ్గర్నుంచీ చిన్నప్పటి విశేషాలూ మొదలుకొని కాలేజీ చదువు వరకూ చెప్పుకుంటూ వస్తాడు. ఈ కాలేజీలోనే ప్రియాతో ప్రేమ, ఆమె అన్నతో బాండింగ్ వుంటాయి. ఈ అన్న శేఖర్ తో రాకీ స్నేహం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.
అంటే ఇక్కడ రాకీ ఆమెకి ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలో అది చెప్పకుండా తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడంటే, ఇవి అతను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్స్ కావు. తన స్కెచ్ లో భాగంగా ఆమెకి చెప్పేది వుంటే రంకిరెడ్డి ఎపిసోడ్ మాత్రమే చెప్పేవాడు రాకీ. కానీ తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే కథకుడు జోక్యం చేసుకుని, రాకీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ప్రేక్షకుల కవసరమని ఇలా రాకీ చేత ప్రేక్షకులకి చెప్పిస్తున్నాడు, మాయాకి కాదు. పాత్రల మధ్య కథకుడు జోక్యం చేసుకుంటే ఇంతే- కథ చెడిపోవడమే! ఇందుకే గంట పాటు ఆమెకి అవసరం లేని ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించాడు రాకీ చేత. ఇదెంత రాంగ్ కథనం! దీని వల్ల ఎంత బడ్జెట్ వృధా అయింది?
6.
ఇంకా పెద్ద డ్యామేజీ!
ఇంతవరకూ రాకీ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాక- ప్రియా ఏమైందని మాయా అడుగుతుంది. ఇక్కడే రాకీచేత మహా తప్పులో కాలేయిస్తాడు కథకుడు! ఈ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకి చెప్పాలన్న అత్యుత్సాహంతో మళ్ళీ పాత్రల మధ్య జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కథకుడు! ప్రియా గురించి కూడా ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించేశాడు కథకుడు!!
ప్రియా జీవితం, కుటుంబం, బిల్డర్ దగ్గర ఆమె జాబ్ చేయడం జరిగి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన గ్యారేజీకే రావడంతో తిరిగి కనెక్ట్ అయినట్టు, ప్రేమ కుదిరినట్టు, ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నట్టూ చెప్పించేశాడు!
ఈ ఉపోద్ఘాతంలో ప్రియా గురించి రాకీ మాయాకి ఇలా చెప్పేస్తూంటే కథ వుండాలా, కర్సై పోవాలా? ప్రియా తండ్రి మరణించాక, ఆమె అన్న శేఖర్ తో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసి అతడి ఆత్మహత్యకి కారకురాలైన మాయకే ఇది చెప్పేస్తాడా?
కథకుడి అత్యుత్సాహం ఇక్కడితో ఆగలేదు- ఒక రోజు ప్రియా అన్న గురించి అడగాలని ఆమె ఇంటికెళ్ళాడు రాకీ. ఆమె లేదు. ఆమె చెల్లెల్ని అడిగితే ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళింది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అన్న శేఖర్ కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో, ప్రియా చిన్న ఉద్యోగంలో జాయినైంది. పని చేయకుండా తిరుగుతున్న శేఖర్ ఆమె డబ్బులు దొంగిలించాడు. తర్వాత నగలు దొంగిలించాడు. ఆమె నిలదీసి కొట్టేందుకు చెయ్యెత్తితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఈ సినిమాకి హుక్ గా వాడుకున్న ఓపెనింగ్ సీను.
ఇలా శేఖర్ చావుకి కారకురాలై, ఇంకో ఎజెండాతో రాకీని ట్రాప్ చేయడానికి వచ్చిన తన ప్రత్యర్ధి- కిల్లర్ మాయకే శేఖర్ ఆత్మహత్యగురించి చెప్పేశాడు రాకీ! ప్రేక్షకులకి కథ తెలియాలని మధ్యలో జోక్యం చేసుకుని కథని పూర్తిగా డ్యామేజీ చేసేసిన కథకుడి అత్యుత్సాహం ఈ నిర్వాకంతో గానీ తీరలేదు!
ఫ్లాష్ బ్యాక్ కొనసాగిస్తూ, తండ్రిని తీర్ధయాత్రలకి పంపినట్టు కూడా చెప్పిన రాకీ, ఫ్లాష్ బ్యాక్స్ ముగించి - ఆ తండ్రి చనిపోయాడని చెప్తాడు. ఇలా ఉపోద్ఘాతం పూర్తవుతుంది.
ఇప్పుడు ప్రెజెంట్ లో కొస్తే, ఇది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. ఇప్పుడు రాకీ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న మాయా ఎలర్ట్ అవుతుంది. ఆమెకి కావాల్సిందిదే. అతడితో ఇన్సూరెన్స్ గేమ్ ఆడుకోవడానికి. ఇలా ఆమెని తన ట్రాప్ లో బిగించాడు రాకీ.
ఇప్పుడు గ్యారేజీ గొడవలు పెరిగిపోయి రంకిరెడ్డికి 50 లక్షలిస్తానని రాకీ చెప్పడంతో, ఆ 50 లక్షలు ఎక్కడ్నించి తెస్తాడో తెలియని రాకీకి- తండ్రి చేసిన రెండు కోట్ల పాలసీ గురించి చెప్తుంది మాయ. కానీ నామినీగా రాకీ పేరు గాక ఎవరో రాజేష్ అని వుందని చెప్తుంది మాయా. దీంతో గంటా 20 నిమిషాల ఫస్టాఫ్ ముగిసి ఇంటర్వెల్ పడుతుంది.
ముందుగా బిగినింగ్ లో, ఓపెనింగ్ ఆత్మహత్య సీను అలాగే వుంటుంది. తర్వాత గ్యారేజీలో మాయా ఎంట్రీ సీను, కంటెంట్ అలాగే వుంటాయి. తర్వాత మారుతుంది- మాయాకి డ్రైవింగ్ నేర్పుతూ, బ్యాంకు పని గురించి ఆమె అడిగితే, రంకిరెడ్డితో గొడవ గురించి మాత్రమే చెప్తాడు. ఆ పూట ఆమెకి నేర్పడం ముగిస్తాడు. డైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రియా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో వుంటాడు. డ్రైవింగ్ నేర్పుతూ వుంటాడు. ఇక గ్యారేజీలో తండ్రి రామకృష్ణ పరిచయమవుతాడు. రాకీ ఎలా మెకానిక్ అయ్యాడో క్లుప్తంగా సంభాషణ. రంకిరెడ్డితో గొడవ గురించి సీన్లు. రాకీ డ్రైవింగ్ నేర్పుతూ మాయాతో కూడా రోమాన్స్ ప్రారంభిస్తాడు. దీంతో ప్రియాతో గొడవ. ఈ గొడవ, రంకిరెడ్డితో గొడవ ముదిరి పోతాయి- ఇంతలో రాకీ తండ్రి చనిపోతాడు. ఇప్పుడు గ్యారేజీని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో రంకిరెడ్డికి 50 లక్షలు కట్టాల్సి వచ్చేసరికి- ప్రేమలో పై చేయి కోసం - రాకీ కి హెల్ప్ చేస్తూ అతడి తండ్రి తీసుకున్న రెండు కోట్ల పాలసీ విషయం బయట పెడుతుంది మాయా. అయితే నామినీగా అతడి పేరు లేదంటుంది. దీంతో ఓ 30 నిమిషాల్లో బిగినింగ్ విభాగం (యాక్ట్ 1) ముగుస్తూ ప్లాట్ పాయింట్ 1 వస్తుందన్న మాట.
పైన బిగినింగ్ విభాగం బిజినెస్ నియమాల ప్రకారం చూస్తే -1. కథా నేపథ్యం ఏర్పాటు - ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యపు కథ అని తెలుస్తూనే వుంది, 2. పాత్రల పరిచయం- ముఖ్య పాత్రలు రాకీ, అతడి తండ్రి, ప్రియా, మాయా, రంకిరెడ్డి పాత్రలు పరిచయమయ్యాయి, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన- గ్యారేజీ స్థలం కోసం రంకిరెడ్డితో గొడవలు, రాకీ తండ్రి మరణం, 4. సమస్య ఏర్పాటు - గొడవలు పరాకాష్టకి కి చేరి 50 లక్షలు కట్టాల్సి వస్తే, రెండు కోట్ల పాలసీ బయటపెట్టి మాయా హెల్ప్ చేయడం. కానీ అందులో నామినీ రాకీ కాకపోవడం.
ప్లాట్
పాయింట్ 1 దగ్గర పై సమస్యా ఏర్పాటులో ఆటోమేటిగ్గా రాకీకి గోల్ ఏర్పాటయ్యింది.
ఎలాగైనా ఈ రెండు కోట్ల పాలసీ మొత్తాన్ని సాధించి, రంకిరెడ్డి పీడా
విరగడ చేసుకునే గోల్. ఇలా ఇక్కడే ఫస్టాఫ్ అరగంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, ప్రేక్షకులు ఎదురు చూసే కథ ప్రారంభమై పోయిందన్న మాట.
అతను వెళ్ళిపోయాక, మాయా- హర్షవర్ధన్-రోడీస్ రఘూ ముగ్గురూ ఇన్సూరెన్స్ స్కామ్ ముఠా అని రివీలవుతుంది. ఇదీ ఇంటర్వెల్. అంటే సినిమాలో సెకండాఫ్ లో 20 నిమిషాలకి వచ్చే ఈ ట్విస్టు వెనక్కి జరిపి ఇంటర్వెల్లో ఇచ్చామన్న మాట.
ఇప్పుడు
రాకీ ప్రేమిస్తున్న మాయా ఒక మాయలాడి అని ప్రేక్షకులకి తెలిసింది,
రాకీకి తెలీదు. రాకీ ఎప్పుడు తెలుసుకుంటాడా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఇంకా పై
కథనంలో ప్రియా, మాయాలతో రోమాంటిక్ టెన్షన్ కూడా రాకీకి
పెంచితే అతడికి రోమాన్స్ తో ఎమోషనల్ స్ట్రగుల్, పాలసీ
డబ్బులతో ఫిజికల్ స్ట్రగుల్ కూడా ఏర్పడి పాత్రకి ఒక సమగ్రత వస్తుంది.
ఈ మాంటేజెస్ తర్వాత కథలోకి వస్తే, సినిమాలో వున్నట్టుగానే రోడీస్ రఘు డబ్బు కోసం వొత్తిడి పెంచడం, ఈ నకిలీ ఇన్స్ పెక్టర్ని ఇంకో ఇన్స్ పెక్టర్ అనుమానించడం జరిగి, ఎందుకైనా మంచిది మ్యాటర్ క్లోజ్ చేద్దామని దుష్టత్రయం అనుకోవడం జరుగుతాయి. దీనికి రాకీ ప్రియాని పూర్తిగా మర్చిపోయి, మాయాకి కమిటై పోవడమనే రోమాంటిక్ స్టోరీ ని కలపవచ్చు.
ఇప్పుడు సినిమాలో ఉన్నట్టుగానే తీర్ధ యాత్రలకెళ్ళి చచ్చిపోయాడనుకున్న రాకీ తండ్రి బ్రతికి రావడమనే ట్విస్టు వుంటుంది. పాలసీ డబ్బుల కోసం తనని చంపేసిన రాకీ మీద అతను ఫైర్ అవడం, ఒక స్కెచ్ కోసమే ఇదంతా చేశానని రాకీ చెప్పడం వగైరా డ్రామా అంతా సినిమాలో ఉన్నట్టుగానే వుంటుంది. ఏమిటా స్కెచ్ అంటే, సినిమాలో వున్నట్టుగానే రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం-
ఇందులో తన ప్రాణమిత్రుడు శేఖర్ ని మాయా ఎలా ట్రాప్ చేసిందీ వుంది. శేఖర్ తండ్రి చనిపోయాక కుటుంబాన్ని పట్టించుకోకుండా శేఖర్ తిరుగుతూంటే, ప్రియా ఉద్యోగం చేయడం, తండ్రి చనిపోయిన శేఖర్ ని ఇన్సూరెన్స్ పేరుతో మాయా ట్రాప్ చేయడం, తండ్రి తీసుకున్న పాలసీలో నామినీగా అతడి తల్లి బదులు వేరొక ఆవిడ పేరుందని చెప్పడం, పేరు మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, శేఖర్ ప్రియా దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఇన్స్ పెక్టర్ గా రోడీస్ రఘు ఎంట్రీ ఇచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తున్నందుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం,శేఖర్ ప్రియా నగలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం, నగల గురించి ప్రియా మందలించేసరికి శేఖర్ ఆత్మ హత్య చేసుకోవడం వగైరా వున్నాయి.
ఇలా ఇప్పుడు ఓపెనింగ్ హుక్ సీనుకి అర్ధం తెలిసింది. అంటే మాయా గురించి రాకీకి ఎప్పుడో తెలుసనీ, వాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం కోసమే స్కెచ్ వేసి మాయాని తన మీదికి తనే ప్రయోగించుకున్నాడనీ, ఇంటర్వెల్లో చెప్పిన అర్ధానికి వ్యతిరేకంగా రాకీ ఇలా అన్నీ ముందే తెలిసిన వాడిలా రివీలై ఇంకో ట్విస్ట్ ఇస్తే క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
అంటే బిగినింగ్ ప్లాట్ పాయింట్ -1 లో అతడికేర్పడిన గోల్ నిజమైన గోల్ కాదన్న మాట. అదసలు నిజమైన కథ కూడా కాదన్న మాట. అదంతా - ఇంకా ఇంటర్వెల్ వరకూ కూడా- మాయాని ట్రాప్ చేయడం కోసం అతను అల్లిన కల్పిత కథే అన్న మాట. గ్రేట్ క్యారక్టర్! అసలు నిజ కథ శేఖర్ గురించిన ఈ ఫ్లాష్ బ్యాక్ తోనే. ప్రాణమిత్రుడు శేఖర్ ఆత్మహత్యకి కారణమైన మాయాని పట్టుకోవడమే అసలు గోల్! మాయాతో ప్రేమ కూడా నిజం కాదు. ఆమెని నమ్మించే ఎత్తుగడలో భాగమే అది.
సినిమా కథ రాయడం చాలా సులభం. ఎందుకింత గందరగోళం చేసుకుంటారో గానీ, సినిమా కథ స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్. అందుకనే ఈజీ. ఇది గుర్తిస్తే ‘మెకానిక్ రాకీ’ లాంటి ఆశాభంగాలు కలగవు. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎవరికైనా సందేహాలుంటే, లేదా సూచనలు చేయదలిస్తే, ఈ క్రింద కామెంట్ బాక్స్ వుంది, వినియోగించుకోగలరు.
—సికిందర్
Tuesday, November 19, 2024
1358 : సందేహాలు- సమాధానాలు
—జేడీఎస్
—సికిందర్
Saturday, November 16, 2024
1357 : రివ్యూ!
కథ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం 1070 కి వెళ్తుంది. ఇక్కడ దక్షిణ భారత ఉపఖండానికి సమీపంలో ప్రణవకోన, కపాల కోన, సాగరకోన, అరణ్యకోన, హిమకోన అనే ఐదు ద్వీపాలు వుంటాయి. ఈ ద్వీపాల్లో ఐదు తెగలకి చెందిన వంశాలు వుంటాయి. ఇక్కడ రోమన్ సైనికులు ప్రవేశించి ప్రణవ ద్వీపాన్ని ముట్టడించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఈ ద్వీపానికి చెందిన ఒకడి తోడ్పాటు వుంటుంది. ఈ దాడిలో వంద మంది చనిపోతారు. ఈ విషయం తెలుసుకుని ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య) ద్రోహనికి పాల్పడిన వాడ్ని తెగ ముందు ఉరి తీస్తాడు. ఇది తట్టుకోలేక వాడి భార్య కొడుకు పోరువా (2024 లో జెటా) బాధ్యత కంగువాకే అప్పజెప్పి ఆత్మాహుతి చేసుకుంటుంది.
ప్రణవ కోనని జయించడంలో విఫలమవడంతో, రోమన్లు పొరుగు ద్వీపానికి అధిపతి అయిన రుధిర (బాబీ డియోల్) తో పొత్తు పెట్టుకుంటారు. రుధిర ఇద్దరు కుమారులు ఇక కంగువా తెగ మీద దాడికి నాయకత్వం వహిస్తారు. ఆ కుమారులిద్దర్నీ కంగువా చంపేయడంతో రుధిర పగబడతాడు. మరో వైపు తండ్రిని చంపినందుకు పోరువా కూడా కంగువా మీద పగబడతాడు. ఈ ఇద్దరి ప్రతీకారాల్ని కంగువా ఎలా ఎదుర్కొన్నాడు? ఇప్పుడు 2024 లో జెటాగా ఎదురైన పోరువాని రష్యన్ దళాల బారి నుంచి కంగువా కాపాడేడా? తండ్రిని చంపిన కంగువాని ఇప్పుడు జెటా క్షమించాడా? ఇదీ మిగతా కథ.
వందల కోట్లతో పానిండియా సినిమా తీస్తూ ఒక గజిబిజి గందరళపు కథ ఎలా తయారు చేస్తారో తెలీదు. గందరగోళం అన్పించే కాబోలు సూర్య సహా ఆర్టిస్టులందరూ సినిమా సాంతం గొంతు చించుకుని గట్టిగా అరుస్తూనే వుంటారు. లేదా ఈ సినిమా హిట్టవ్వాలని అలా ఆర్తనాదాలు చేస్తున్నారేమో. ఈ పెడబొబ్బలు భరించలేక ... సుప్రసిద్ధ సౌండ్ ఇంజనీర్ రసూల్ పోకుట్టి ఈ ‘కంగువా’ శబ్ద కాలుష్యం గురించి ఇంస్టా గ్రామ్ లో ఇలా పోస్టు చేశాడు- ‘నా స్నేహితుడొకరు ఈ రీ-రికార్డింగ్ మిక్సర్ క్లిప్ నాకు పంపారు… ఇలాంటి పాపులర్ సినిమాల్లో ధ్వని ముద్రణ గురించి విమర్శలు రావడం నిరుత్సాహపరుస్తుంది. మా క్రాఫ్ట్, కళాత్మకత ఇలాటి లౌడ్నెస్ వార్‌లో చిక్కుకోవడం చూస్తే ఎవర్ని నిందించాలి? సౌండ్ ఇంజనీర్‌నా? లేదా అన్ని తప్పుల్నీ కప్పిపుచ్చడానికి చివరి క్షణంలో ఇలాటి ట్రిక్కులు ప్రయోగించిన వాళ్ళనా? ఇలాటివి జరక్కుండా మొహమాటం లేకుండా గట్టిగా, స్పష్టంగా చెప్పడానికి మా సోదరులకిదే సమయం. ప్రేక్షకులు తలపోటు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోతే ఏ సినిమాకూ రిపీట్ వాల్యూ వుండదు!’
అన్నట్టు ఆ సౌండ్ ఇంజనీర్ మాలీవుడ్ (కేరళ) కి చెందిన అబ్రహాం లిజోజేమ్స్. ఆర్టిస్టులు ఎందుకు అరుస్తున్నారో తెలీదు. కథలో విషయం లేదు, పాత్రల్లో విషయం లేదు. అయినా సన్నివేశ బలం, భావోద్వేగ బలం లేకుండా అరుపులు ఆరవడానికి అంతంత సత్తువ ఎలా వచ్చిందో తెలీదు. డబ్బింగ్ థియేటర్లో ఎన్ని మైకులు పగిలిపోయాయో తెలీదు.
ఫస్టాఫ్ 40 నిమిషాల పాటు గోవాలో ప్రెజెంట్ స్టోరీ మరీ ఎబ్బెట్టుగా వుంది- సూర్య, దిశా పటానీ, యోగిబాబు, రేడిన్ కింగ్ స్లేల కామెడీలతో. వరసబెట్టి కీచులాడుకునే కామెడీ ఇది. పోటీ బౌంటీ హంటర్లుగా సూర్య, దిశా పటానీల ఔట్ డేటెడ్ కీచులాటల కామెడీ 40 నిమిషాలూ సినిమాని డొల్లగా మార్చేసింది. జెటా తప్పించుకొచ్చాక యాక్షన్ లో కొచ్చి పీరియెడ్ స్టోరీ ప్రారంభమయ్యేవరకూ కామెడీ పేరుతో తమాషాని భరించాల్సిందే.
తర్వాత 1070 పీరియెడ్ స్టోరీ ఐదు తెగలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అయితే ఈ తెగల ఆచార వ్యవహారాల్ని, జీవన విధానాన్నీ అర్థం చేసుకునే సూక్ష్మ సన్నివేశాలు లేవు. ఎవరు ఏ తెగకి చెందిన వారో గుర్తు పట్టడం కష్టమైపోతుంది. కనీసం ప్రత్యర్ధులైన కంగువా, రుధిర తెగల కుటుంబాల పరిచయాలు కూడా వుండవు. ఒక దశలో ఏ తెగ ఎవరితో ఎందుకు పోరాడుతోందో అర్ధంగాదు. అర్ధమయ్యేదేంటంటే, సొంత తెగలో కంగువా ద్రోహిని ఊరి తీశాక, అతడి కొడుకు బాధ్యత తీసుకోవడం, ఆ కొడుకు పోరువా (ప్రెజెంట్ స్టోరీలో జెటా) కంగువామీద పగబట్టడం. మరోవైపు రుధిర కుమారులిద్దరూ రోమన్ల కొమ్ముకాసి కంగువా తెగ మీద దాడి చేయడం. అయితే ఈ భారీ యాక్షన్ దృశ్యాల తర్వాత ఇంటర్వెల్ లో ఏదైనా మలుపు వస్తుందనుకుంటే అలాటిదేమీ రాదు. ఇంటర్వెల్‌కి ముందే కథ పట్టాలు తప్పడం మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మరింత క్లిష్టంగా మారుతుంది. కనీసం ఇంటర్వెల్లో కేంద్రీకృత డ్రామా ఏర్పాటు చేసి వుంటే సెకండాఫ్ ఒక దారిలో పడేది.
సెకండాఫ్ లో పగబట్టిన కంగువా మీద పోరువా దాడులు చేయడం, వాడ్ని మార్చడం కోసం కంగువా ప్రయత్నించడం, మరో వైపు పగబట్టిన రుధిర దాడులు చేయడం... ఈ రెండు ట్రాకులు ఒక దగ్గర కలిసి కంగువా కోసం పోరువా చేసే త్యాగంతో ఈ పీరియెడ్ స్టోరీ ముగుస్తుంది.
ఇక ప్రెజెంట్ స్టోరీ అంతా రష్యన్ దళం నుంచి జెటాని ఫ్రాన్సిస్ కాపాడే క్లయిమాక్స్. అయితే పీరియెడ్ స్టోరీలో కథ ఇంకా మిగిలే వుంది. రుధిర కొడుకు ప్రతీకారంతో (కార్తీ) తిరిగి రావడంతో ఫ్రాన్సిస్ తో సీక్వెల్ వుంటుందని ఒక ట్విస్ట్. అసలు ఈ సినిమా మొత్తం కన్నా ఈ సీక్వెల్ ట్విస్టే బావుంది. ఈ ట్విస్టులో రష్యన్ కమాండర్ రేయాన్ ఎవరో కాదు- పీరియెడ్ స్టోరీలో రుధిర కొడుకే (కార్తీ). ఇలా ఫ్రాన్సిస్ గా సూర్య, రుధిర కొడుకు ఇప్పుడు రష్యన్ కమాండర్ రేయాన్ గా కార్తీల మధ్య కొత్త పోరాటానికి రంగం సిద్ధమన్నమాట. బాబీ డియోల్ తో సూర్య పోరాటం కలిగించని థ్రిల్ సూర్య-కార్తీల మధ్య సీక్వెల్ కిచ్చిన హింట్ అత్యంత థ్రిల్ పుట్టించేదిగా వుంది. ఈ మధ్య ఏ సినిమాలోనూ సీక్వెల్ కిచ్చిన హింట్ ఇంత థ్రిల్లింగ్ గా లేదు. ఈ ట్విస్టు తప్ప సినిమా అంతా దారిలో పెట్టని కథతో గజిబిజి గందరగోళం -అదనంగా పెడబొబ్బలు!
విలన్ గా బాబీ డియోల్ కూడా సూర్య ఒన్ మాన్ షో బాధితుడు. ఉన్నవే కొద్ది సీన్లు, వాటిలో సరైన పాత్ర చిత్రణ లేని క్రూరత్వంతో కూడిన నటన. హీరోయిన్ దిశా పటానీ వున్నా లేనట్టే. యోగిబాబు, రెడిన్ కింగ్ స్లేల కామెడీ సరేసరి. జెటాగా /పోరువాగా నటించిన కుర్రాడికే తగిన కారణంతో కూడిన భావోద్వేగాలు, నటన వున్నాయి. అయితే కథలో ఈ కీలక పాత్రని ఉపయోగించుకున్న తీరు కథకి దాదాపు కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసింది.
సాంకేతికంగా దర్శకుడు శివ తీవ్ర కృషి చేశాడు. సౌండ్ విషయంలో తప్ప. సౌండ్ రెండు పాయింట్లు తగ్గించమని ఆదేశించినట్టు ఈ రోజు నిర్మాత చెప్పాడు. ఈ సినిమాకి సౌండ్ ఒక హాట్ టాపిక్ అయింది. రెండు పాయింట్లు తగ్గిస్తే అరుపులు ఎక్కడికి పోతాయి. ఆర్టిస్టులు అరవడానికి నోరు తెరిచినప్పుడల్లా ఎడిట్ చేస్తే సరిపోతుంది.
ఇక దేవిశ్రీ ప్రసాద్ సృష్టించిన సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువేమీ కాదు. పాటలు బలహీనంగా, బీజీఎం బాంబుల మోతగా వున్నాయి. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం మాత్రం మహాద్భుతంగా వుంది. దీనికి కళాదర్శకత్వం, స్పెషల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీలు అత్యున్నతంగా తోడ్పడ్డాయి. అయితే ఇంత దృశ్య వైభవాన్ని అందుకోలేని స్థాయిలో వుండిపోయాయి దర్శకుడు శివ సమకూర్చిన కథా కథనాలు.
ఫ్లాష్ బ్యాక్స్ వున్న కథలో ప్రెజెంట్ స్టోరీ ఎప్పుడూ ప్రధాన కథ అవుతుంది. కాబట్టి బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు, ప్లాట్ పాయింట్స్ ప్రధాన కథ అయిన ప్రెజెంట్ స్టోరీతోనే వుంటాయి. ఫ్లాష్ బ్యాకుల్లో వచ్చే విషయమంతా ప్రెజెంట్ స్టోరీ నడవడానికి పనికొచ్చే పూర్వ సమాచారమే. ఇది కథ కాదు, దీనికి బిగినింగ్- మిడిల్, ఎండ్ లు, ప్లాట్ పాయింట్లు వుండనవసరం లేదు. వుండాలని ప్రయత్నిస్తే కుదరవు కూడా, పైగా ప్రెజెంట్ స్టోరీలో ఈ టూల్స్ వుండకుండా పోతాయి. దీంతో ప్రెజెంట్, పీరియెడ్ స్టోరీలు రెండూ చెడిపోతాయి. ఇదే జరిగిందిక్కడ.
మరొకటేమిటంటే, ప్రజెంట్ స్టోరీలో ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి పాత్రకూడా లేకుండా పోయింది. ప్రత్యర్ధి పాత్ర ఎవరై వుంటారంటే, ఫ్రాన్సిస్ కి ప్రశ్నార్ధకంగా వున్న పిల్లవాడు జెటానే. ఇతడ్ని చూస్తే ఏదో పూర్వ అనుబంధం వున్నట్టుందని అనేస్తాడు ఫ్రాన్సిస్. ఇలా అనడం రాంగ్. స్ట్రక్చర్ మీద అవగాహన లేక ఫ్రాన్సిస్ తో ఇలా అన్పించడమే. ఇలా అనిపించినప్పుడు ఇది పునర్జన్మ కథ అని అప్పుడే లీకై పోతోంది. కథనంలో ఇంకేం సస్పెన్సు వుంటుంది? ఇలా కాక, ఒకవైపు రష్యన్ దళం జెటా కోసం దాడులు చేస్తూంటే, కౌంటర్ గా ఆ దాడుల మధ్య ఫ్రాన్సిస్ కి జెటా తన మీద దాడులు చేస్తున్నట్టు ఏవో మాంటేజెస్ మెదల వచ్చు. ఇలా మాంటేజెస్ మెదిలితే జెటా ఆటోమేటిగ్గా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి గా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అప్పుడు గుర్తు లేని మాంటేజెస్ లో ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడు, ఎవరితను వంటి ప్రశ్నలతో ప్లాట్ పాయింట్ ఫన్ వస్తే, ఒక సస్పెన్స్ తో కూడిన తెలుసుకోవాలనే గోల్ ఏర్పడుతుంది హీరో అయిన ఫ్రాన్సిస్ కి.
కథ కథలా నడవడానికి తగిన సమయం, అవకాశం దానికివ్వాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది ప్రేక్షకులకి. ఇలా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధిగా జెటా బోలెడు సందేహాలతో, సస్పెన్సుతో ఎస్టాబ్లిష్ అయ్యాక, జెటాని కాపాడ్డం గాక అతడ్ని శత్రువులా చూడ్డం మొలెడితే కథనంలో డైనమిక్స్ ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో రష్యన్ దళం ఫ్రాన్సిస్ తల బద్దలు కొట్టి జెటాని ఎత్తుకెళ్ళి పోతే, తలగిర్రున తిరిగి కిందపడ్డ ఫ్రాన్సిస్ సర్రున పూర్వజన్మ (పీరియెడ్ స్టోరీ) లోకెళ్ళి పడొచ్చు- ‘యమగోల’ లో ఎన్టీఆర్ యమలోకంలో పడ్డట్టు.
అక్కడ జెటా పోరువాగా సర్ప్రైజింగ్ గా వుంటాడు. ఇది కూడా కథనం ఫ్లాట్ గా సాగకుండా డైనమిక్సే. ఇక్కడే ఫ్రాన్సిస్ కంగువాగా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ పోరువా కంగువామీద పగబట్టిన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేశాక ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చెయ్యాలి. ఎందుకంటే జెటా ఎవరు, ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడనే ప్లాట్ పాయింట్ 1 లో ఫ్రాన్సిస్ ప్రశ్నలకి జవాబు దిరికింది కాబట్టి, ఇంకా పీరియెడ్ స్టోరీని పొడిగించే అనుమతి లేదు.
—సికిందర్