రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, November 19, 2024

1358 : సందేహాలు- సమాధానాలు

 

'క్కీ భాస్కర్' స్క్రీన్ ప్లే సంగతులుకి సంబంధించి 40 వరకూ స్పందనలు వచ్చాయి ఫోన్ కాల్స్ సహా. ఎక్కువ మందికి ఈ సినిమా ముగింపు నచ్చింది. కొందరు హీరో క్యారక్టరైజేషన్ ని తప్పు బట్టారు. క్లయిమాక్సులో హీరో పాత్రని పాజిటివ్ ముగింపుకి తెస్తూ, అంతలోనే నెగెటివ్ వైపుకి మళ్ళించడాన్ని ప్రశ్నించారు. అయితే ఈ ముగింపు నైతిక విలువల్ని ప్రశ్నిస్తోందన్న విషయం పట్ల ఎక్కువ మందికి ఆసక్తి లేదు. ముగింపులో హీరో తనని ఎలా జడ్జి చేస్తారని ప్రేక్షకులకి రెండు ఆప్షన్స్ ఇస్తాడు- లక్కీ బా...ర్డ్ గానా, లక్కీ భాస్కర్ గానా? అని. ఎక్కువ మందికి లక్కీ బా...ర్డ్ గానే నచ్చినట్టున్నాడు.  
        
క యాంటీ హీరో పాత్రకి శిక్ష పడాలి కదా అన్న కొందరి వాదం సరేగానీ- సోషల్ మీడియాలో చూస్తే నెగెటివిజాన్ని, విద్వేషాన్నీ, హింసావాదాన్నీ, చివరికి ఎవరైనా మరణిస్తే ఆనందాన్నీ, శాడిజాన్నీ గుప్పిస్తూ చేస్తున్న కామెంట్లు పొంగి ప్రవహిస్తున్నాయి. నైతిక విలువలు నాన్సెన్స్ అయిపోయాయి. కాబట్టి 'లక్కీ భాస్కర్' ముగింపుని ఏమనగలం. కాకపోతే హీరో మంచి వాడుగా మారినట్టు చూపిస్తూనే నెగెటివ్ వైపుకి మళ్ళించినప్పుడు- ఆ మంచి వాడుగా మారినట్టుగా చూపించిన సీన్లు నటన అనీ, ప్రేక్షకుల పట్ల చీటింగ్ అనీ గమనించాల్సి వుంటుంది. పాత్ర కథలో పాత్రల్ని చీట్ చేయొచ్చు, సినిమా చూసే ప్రేక్షకుల్ని కాదు.

Q'లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే సంగతులు ఇన్ఫర్మేటివ్ గా వున్నాయి. అయితే కథకు పోయెటిక్ జస్టిస్  కేనా?
—ఏపీ
A : పోయెటిక్ జస్టిస్ ఇస్తే మళ్ళీ పాజిటివ్ ముగింపు అయిపోతుంది. ఇది కోరుకోలేదు కాబట్టే నెగెటివ్ ముగింపు ఇచ్చారు. నేటి ట్రెండ్ కి ఇదే హీరోయిజం అనుకున్నారు కాబట్టి. అయితే ఇంకో హీరోయిజం కూడా వుంది. హీరో ఆ స్కామ్ లో కింది నుంచీ పైవరకూ తనతో సహా ఎవరెవరైతే వున్నారో వాళ్ళందర్నీ తనతో బాటే వేసుకుని  జైలుకి వెళ్ళి పోవడం కూడా హీరోయిజమే! కలెక్టివ్ జస్టిస్ తో చాలా పెద్ద హీరోయిజం ఇది! అయితే సినిమా అనేది వ్యవస్థకి హెచ్చరికగా వుండాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ముగింపు సాధ్యపడుతుంది.

Q : లక్కీ భాస్కర్ ఆర్టికల్ లో మెన్షన్ చేసిన 'శివ' తెలుగులో స్క్రీన్ ప్లే గ్రంధం, గుణ శేఖర్ 'ఒక్కడు' స్క్రీన్ ప్లే కూడా దాదాపు ఇదే ఫార్మాట్ అనుకుంటాను. ఈ మద్యే డిజిటల్లీ రీ మాస్టర్డ్ థియేట్రికల్ వెర్షన్ రీ రిలీజ్ మళ్ళీ చూసాను. హీరో గోల్ ఏంటనేది మొదటి సీన్లో చెప్పేసిన సినిమాలు, అలా చెప్పేసిన తరవాత ప్రోటోగనిస్ట్ అసలు అతని గోల్ కి సంబంధంలేని సమస్యలో పడి చివరికి తాను అనుకున్న లక్ష్యం చేరుకున్న సినిమాలు, అలాగే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు కూడా సజెస్ట్ చేస్తూ ఆర్టికల్ రాయగలరు. 
జేడీఎస్

       A :  మీరు చెప్పిన అంశాలపై బ్లాగులో చాలా ఆర్టికల్స్ వున్నాయి వివిధ సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రూపంలో. వీటిలో ఆశ్చర్యపర్చే క్రియేటివిటీ ఏం లేదు. కానీ తమిళ మండేలా లో హీరో యోగిబాబు గోల్ ఏర్పడే ప్లాట్ పాయింట్ 1 ఘట్టంలో వుండడు. ప్లాట్ పాయింట్ 1 దగ్గర శత్రువులైన ఇద్దరి విలన్లకి గోల్ ఏర్పడుతుంది. అదేమీ హీరోకి వ్యతిరేకంగా గోల్ కాదు. హీరోకి సంబంధమే లేదు. అతను తర్వాతెప్పుడో వీళ్ళతో ఇంటరాక్షన్ లోకొస్తాడు. ఇది కొత్తదనం, ప్రయోగం. ఈ లింక్ క్లిక్ చేసిచూడండి.
        
శివ లాగా ఒక్కడు కూడా పూర్తిగా త్రీయాక్ట్ స్ట్రక్చర్ అమలైన సినిమా. అయితే ఈ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి వుంటే ఈ రెండు సినిమాలూ ఏమై వుండేవో వూహించుకోవచ్చు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ సిడ్ ఫీల్డ్ కనిపెట్టింది కాదు. అసలు సినిమాలంటేనే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో వుండేవి. కాకపోతే సిడ్ ఫీల్డ్ తనకి పూర్వమున్న త్రీ యాక్ట్ స్ట్రక్చర్ హీరో జర్నీలో మజిలీల్ని కుదించి సరళీకరించాడు. ఇది కథా కథనాల వేగాన్ని పెంచింది. కాబట్టి ఈ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసేదేమీ వుండదు. అసలు స్ట్రక్చర్ అంటే ఏమిటో తెలియకుండా తీసిన చాలా చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలతో అట్టర్ ఫ్లాపయ్యాయి.  దీన్ని తెలిసి స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తూ చేసిన ప్రయోగాలందామా?
        
స్ట్రక్చర్ లేకుండా తీస్తే ఆర్ట్ సినిమా. లేదా యూరోపియన్ సినిమా. ఇంకా లేదా కొన్ని రియలిస్టిక్ సినిమాలు. స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి బాగుపడలేరు. స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి మాత్రమే పాల్పడగలరు- ప్లాట్ పాయింట్ వన్ లో వుండాల్సిన మండేలా లేకపోవడం స్ట్రక్చర్ తో పాల్పడిన క్రియేటివిటీ, ప్రయోగం. ప్లాట్ పాయింట్ వన్ కల్లా హీరో గోల్ ని పూర్తి చేసుకోవడం బేబీ డ్రైవర్ లో స్ట్రక్చర్ తో పాల్పడిన క్రియేటివిటీ, ప్రయోగం. ఇలా స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడితే హిట్టవుతాయే తప్ప, స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తే కాదు.

—సికిందర్