రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 16, 2024

1357 : రివ్యూ!

 

 

రచన- దర్శకత్వం: శివ
తారాగణం : సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్, రేడిన్ కింగ్స్ లే, తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : వెట్రి పళనిస్వామి, యాక్షన్ : సుప్రీమ్ సుందర్
బ్యానర్స్ : స్టూడియో గ్రీన్, యూవీ క్రియెషన్స్
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
విడుదల : నవంబర్ 14, 2024
***

        2019 లో ప్రారంభించిన కంగువా 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ సూర్య కిది పానిండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలయింది. విశ్వాసం’, అన్నాతే వంటి మసాలా సినిమాలు తీసే శివ దీని దర్శకుడు. తెలుగులో శౌర్యం , దరువు వంటి సింమాలు తీశాడు. కంగువాని ఎపిక్ ఫాంటసీ యాక్షన్ మూవీ అన్నారు. కంగువా అంటే మాన్ విత్ ది పవర్ ఆఫ్ ఫైర్ అని అర్ధం చెప్పారు. దేశంలో 350 కోట్లతో నిర్మించిన అత్యంత ఖరీదైన చలన చిత్రంగా పేర్కొన్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియెషన్స్ వంటి పెద్ద బ్యానర్లు దీన్ని నిర్మించాయి. ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మెగా మూవీ ఏ మేరకు వీటికి న్యాయం చేసింది? పూర్తి న్యాయం చేసిందా లేక న్యాయ పరీక్షకి దూరంగా వుండిపోయిందా? తెలుసుకుందాం...

కథ

    2024 లో రష్యాలోని  బయో మెడికల్ లాబ్ లో పిల్లల మెదడు పనితీరుని పెంచి సూపర్ పవర్స్ ని ప్రేరేపించే ప్రయోగాలు జరుగుతూంటాయి. ఈ ప్రయోగాల నుంచి తప్పించుకుని జెటా అనే పిల్లాడు గోవాకి చేరుకుంటాడు. గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ 95 (యోగిబాబు) అనే ఇద్దరూ కలిసి నేరస్థుల్ని వెతికి పట్టుకుని పోలీసులకి అప్పగించి డబ్బు తీసుకునే బౌంటీ హంటర్స్ గా వుంటారు. వీళ్ళకి పోటీగా ఏంజెలా (దిశా పటానీ), యాక్సిలేటర్ (రేడిన్ కింగ్ స్లే) లు వుంటారు. వీళ్ళెప్పుడూ తగాదాలు పడుతూంటారు. ఇప్పుడు రష్యా నుంచి పారిపోయి వచ్చిన జెటా ఫ్రాన్సిస్ కంటబడతాడు. జెటాని చూస్తూంటే అతడితో తనకేదో పూర్వజన్మ బంధం వున్నట్టు అన్పిస్తుంది ఫ్రాన్సిస్ కి. మరో వైపు  రష్యన్ లాబ్ కమాండర్ రేయాన్ ఆదేశాలతో ఒక దళం జెటా కోసం వెతుక్కుంటూ వచ్చేసి దాడి చేస్తారు. ఎవరీ జెటా? ఫ్రాన్సిస్ తో ఏమిటి సంబంధం?
        
కథ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం 1070 కి వెళ్తుంది. ఇక్కడ దక్షిణ భారత ఉపఖండానికి సమీపంలో ప్రణవకోన, కపాల కోన, సాగరకోన, అరణ్యకోన, హిమకోన అనే ఐదు ద్వీపాలు వుంటాయి. ఈ ద్వీపాల్లో ఐదు తెగలకి చెందిన వంశాలు వుంటాయి. ఇక్కడ  రోమన్ సైనికులు ప్రవేశించి ప్రణవ ద్వీపాన్ని ముట్టడించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఈ ద్వీపానికి చెందిన ఒకడి తోడ్పాటు వుంటుంది. ఈ దాడిలో వంద మంది చనిపోతారు. ఈ విషయం తెలుసుకుని ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య) ద్రోహనికి పాల్పడిన  వాడ్ని తెగ ముందు ఉరి తీస్తాడు. ఇది తట్టుకోలేక వాడి భార్య కొడుకు పోరువా (2024 లో జెటా) బాధ్యత కంగువాకే అప్పజెప్పి ఆత్మాహుతి చేసుకుంటుంది.
       
ప్రణవ కోనని జయించడంలో
విఫలమవడంతో, రోమన్లు ​​పొరుగు ద్వీపానికి అధిపతి అయిన రుధిర (బాబీ డియోల్) తో పొత్తు పెట్టుకుంటారు. రుధిర ఇద్దరు కుమారులు ఇక కంగువా తెగ మీద దాడికి నాయకత్వం వహిస్తారు. ఆ కుమారులిద్దర్నీ కంగువా చంపేయడంతో రుధిర పగబడతాడు. మరో వైపు తండ్రిని చంపినందుకు పోరువా కూడా కంగువా మీద పగబడతాడు.  ఈ ఇద్దరి ప్రతీకారాల్ని కంగువా ఎలా ఎదుర్కొన్నాడు? ఇప్పుడు 2024 లో జెటాగా ఎదురైన పోరువాని రష్యన్ దళాల బారి నుంచి కంగువా కాపాడేడా? తండ్రిని చంపిన కంగువాని ఇప్పుడు జెటా క్షమించాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    నిజానికి పైన రాసినట్టు - ఆ కుమారులిద్దర్నీ కంగువా చంపేయడంతో రుధిర పగబడతాడు. మరో వైపు తండ్రిని చంపినందుకు పోరువా కూడా కంగువా మీద పగబడతాడు.  ఈ ఇద్దరి ప్రతీకారాల్ని కంగువా ఎలా ఎదుర్కొన్నాడు? ఇప్పుడు 2024 లో జెటాగా ఎదురైన పోరువాని రష్యన్ దళాల బారి నుంచి కంగువా కాపాడేడా? తండ్రిని చంపిన కంగువాని ఇప్పుడు జెటా క్షమించాడా? - అనే లైనులో వుండాలి ఈ కథ. లేదు కాబట్టి ఈ లైను మనం కల్పించి చెప్పుకున్నాం.
       
వందల కోట్లతో పానిండియా సినిమా తీస్తూ ఒక గజిబిజి గందరళపు కథ ఎలా తయారు చేస్తారో తెలీదు. గందరగోళం అన్పించే కాబోలు సూర్య సహా ఆర్టిస్టులందరూ సినిమా సాంతం గొంతు చించుకుని  గట్టిగా అరుస్తూనే వుంటారు. లేదా ఈ సినిమా హిట్టవ్వాలని అలా ఆర్తనాదాలు చేస్తున్నారేమో. ఈ పెడబొబ్బలు భరించలేక ... సుప్రసిద్ధ సౌండ్ ఇంజనీర్ రసూల్  పోకుట్టి ఈ
కంగువా శబ్ద కాలుష్యం గురించి ఇంస్టా గ్రామ్ లో ఇలా పోస్టు చేశాడు- నా స్నేహితుడొకరు ఈ రీ-రికార్డింగ్ మిక్సర్ క్లిప్ నాకు పంపారు ఇలాంటి పాపులర్ సినిమాల్లో ధ్వని ముద్రణ గురించి విమర్శలు రావడం నిరుత్సాహపరుస్తుంది. మా క్రాఫ్ట్, కళాత్మకత ఇలాటి లౌడ్‌నెస్ వార్‌లో చిక్కుకోవడం చూస్తే ఎవర్ని నిందించాలి? సౌండ్ ఇంజనీర్నా? లేదా అన్ని తప్పుల్నీ కప్పిపుచ్చడానికి చివరి క్షణంలో ఇలాటి ట్రిక్కులు ప్రయోగించిన వాళ్ళనా? ఇలాటివి జరక్కుండా మొహమాటం లేకుండా గట్టిగా, స్పష్టంగా చెప్పడానికి మా సోదరులకిదే సమయం. ప్రేక్షకులు తలపోటు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోతే ఏ సినిమాకూ రిపీట్ వాల్యూ వుండదు!
       
అన్నట్టు ఆ సౌండ్ ఇంజనీర్ మాలీవుడ్ (కేరళ) కి చెందిన అబ్రహాం లిజోజేమ్స్. ఆర్టిస్టులు ఎందుకు అరుస్తున్నారో తెలీదు. కథలో విషయం లేదు
, పాత్రల్లో విషయం లేదు. అయినా సన్నివేశ బలం, భావోద్వేగ బలం  లేకుండా అరుపులు ఆరవడానికి అంతంత సత్తువ ఎలా వచ్చిందో తెలీదు. డబ్బింగ్ థియేటర్లో ఎన్ని మైకులు పగిలిపోయాయో తెలీదు.
        
ఫస్టాఫ్ 40 నిమిషాల పాటు గోవాలో ప్రెజెంట్ స్టోరీ మరీ ఎబ్బెట్టుగా వుంది- సూర్య, దిశా పటానీ, యోగిబాబు, రేడిన్ కింగ్ స్లేల కామెడీలతో. వరసబెట్టి కీచులాడుకునే కామెడీ ఇది. పోటీ బౌంటీ హంటర్లుగా సూర్య, దిశా పటానీల ఔట్ డేటెడ్ కీచులాటల కామెడీ 40 నిమిషాలూ సినిమాని డొల్లగా మార్చేసింది.  జెటా తప్పించుకొచ్చాక యాక్షన్ లో కొచ్చి పీరియెడ్ స్టోరీ ప్రారంభమయ్యేవరకూ కామెడీ పేరుతో తమాషాని భరించాల్సిందే.
       
తర్వాత 1070  పీరియెడ్ స్టోరీ ఐదు తెగలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అయితే ఈ తెగల
ఆచార వ్యవహారాల్ని, జీవన విధానాన్నీ అర్థం చేసుకునే సూక్ష్మ సన్నివేశాలు లేవు. ఎవరు ఏ తెగకి చెందిన వారో గుర్తు పట్టడం కష్టమైపోతుంది. కనీసం ప్రత్యర్ధులైన కంగువా, రుధిర తెగల కుటుంబాల పరిచయాలు కూడా వుండవు. ఒక దశలో ఏ తెగ ఎవరితో ఎందుకు పోరాడుతోందో అర్ధంగాదు. అర్ధమయ్యేదేంటంటే, సొంత తెగలో కంగువా ద్రోహిని ఊరి తీశాక, అతడి కొడుకు బాధ్యత తీసుకోవడం, ఆ కొడుకు పోరువా (ప్రెజెంట్ స్టోరీలో జెటా) కంగువామీద పగబట్టడం. మరోవైపు రుధిర కుమారులిద్దరూ రోమన్ల కొమ్ముకాసి కంగువా తెగ మీద  దాడి చేయడం. అయితే ఈ భారీ యాక్షన్ దృశ్యాల తర్వాత ఇంటర్వెల్ లో ఏదైనా మలుపు వస్తుందనుకుంటే అలాటిదేమీ రాదు.  ఇంటర్వెల్‌కి ముందే కథ పట్టాలు తప్పడం మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మరింత క్లిష్టంగా మారుతుంది. కనీసం ఇంటర్వెల్లో కేంద్రీకృత డ్రామా ఏర్పాటు చేసి వుంటే సెకండాఫ్ ఒక దారిలో పడేది.
       
సెకండాఫ్ లో పగబట్టిన కంగువా మీద పోరువా దాడులు చేయడం
, వాడ్ని మార్చడం కోసం కంగువా ప్రయత్నించడం, మరో వైపు పగబట్టిన రుధిర దాడులు చేయడం... ఈ రెండు ట్రాకులు ఒక దగ్గర కలిసి కంగువా కోసం పోరువా చేసే త్యాగంతో ఈ పీరియెడ్ స్టోరీ ముగుస్తుంది.
       
ఇక ప్రెజెంట్ స్టోరీ అంతా రష్యన్ దళం నుంచి జెటాని ఫ్రాన్సిస్ కాపాడే క్లయిమాక్స్. అయితే పీరియెడ్ స్టోరీలో కథ ఇంకా మిగిలే వుంది. రుధిర కొడుకు ప్రతీకారంతో (కార్తీ) తిరిగి రావడంతో ఫ్రాన్సిస్ తో సీక్వెల్ వుంటుందని ఒక ట్విస్ట్. అసలు ఈ సినిమా మొత్తం కన్నా ఈ సీక్వెల్ ట్విస్టే బావుంది. ఈ ట్విస్టులో రష్యన్ కమాండర్ రేయాన్ ఎవరో కాదు- పీరియెడ్ స్టోరీలో రుధిర కొడుకే (కార్తీ). ఇలా ఫ్రాన్సిస్ గా సూర్య
, రుధిర కొడుకు ఇప్పుడు రష్యన్ కమాండర్ రేయాన్ గా కార్తీల మధ్య కొత్త పోరాటానికి రంగం సిద్ధమన్నమాట. బాబీ డియోల్ తో సూర్య పోరాటం కలిగించని థ్రిల్ సూర్య-కార్తీల మధ్య సీక్వెల్ కిచ్చిన హింట్  అత్యంత థ్రిల్ పుట్టించేదిగా వుంది. ఈ మధ్య ఏ సినిమాలోనూ సీక్వెల్ కిచ్చిన హింట్ ఇంత థ్రిల్లింగ్ గా లేదు.  ఈ ట్విస్టు తప్ప సినిమా అంతా దారిలో పెట్టని కథతో గజిబిజి గందరగోళం -అదనంగా పెడబొబ్బలు!

నటనలు- సాంకేతికాలు

    సూర్య నటించిన బౌంటీ హంటర్ పాత్రలో, నటనలో దమ్ము లేదుగానీ, కంగువా నటనలో దమ్ముంది, పాత్రలో కాదు. అతను ఎన్ని నవరసాలు పలికించి తన టాలెంట్ ని ఎంత ప్రకటించినా అతడితో కథ సహకరించలేదు. యాక్షన్ దృశ్యాల్లో ఎంత విజృంభించినా అంత యాక్షన్ కీ, దాంతో దిక్కులు పిక్కటిల్లే గాండ్రింపులకీ పూనుకోవడానికి ఎక్కడికక్కడ సన్నివేశ బలం లేదు. మిగిలిన ఆర్టిస్టులకి చోటు లేకుండా ఎంత ఒన్ మాన్ షోగా నటించినా సినిమాని నిలబెట్టడం కష్టమై పోయింది.
       
విలన్ గా బాబీ డియోల్ కూడా సూర్య ఒన్ మాన్ షో బాధితుడు. ఉన్నవే కొద్ది సీన్లు
, వాటిలో సరైన పాత్ర చిత్రణ లేని క్రూరత్వంతో కూడిన నటన. హీరోయిన్ దిశా పటానీ వున్నా లేనట్టే. యోగిబాబు, రెడిన్ కింగ్ స్లేల  కామెడీ సరేసరి. జెటాగా /పోరువాగా నటించిన కుర్రాడికే తగిన కారణంతో కూడిన భావోద్వేగాలు, నటన వున్నాయి. అయితే కథలో ఈ కీలక పాత్రని ఉపయోగించుకున్న తీరు కథకి దాదాపు కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసింది.  
        
సాంకేతికంగా దర్శకుడు శివ తీవ్ర కృషి చేశాడు. సౌండ్ విషయంలో తప్ప. సౌండ్ రెండు పాయింట్లు తగ్గించమని ఆదేశించినట్టు ఈ రోజు నిర్మాత చెప్పాడు. ఈ సినిమాకి సౌండ్ ఒక హాట్ టాపిక్ అయింది. రెండు పాయింట్లు తగ్గిస్తే అరుపులు ఎక్కడికి పోతాయి. ఆర్టిస్టులు అరవడానికి నోరు తెరిచినప్పుడల్లా ఎడిట్ చేస్తే సరిపోతుంది.
       
ఇక దేవిశ్రీ ప్రసాద్ సృష్టించిన సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువేమీ కాదు. పాటలు బలహీనంగా
, బీజీఎం బాంబుల మోతగా వున్నాయి. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం మాత్రం మహాద్భుతంగా వుంది. దీనికి కళాదర్శకత్వం, స్పెషల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీలు అత్యున్నతంగా తోడ్పడ్డాయి. అయితే ఇంత దృశ్య వైభవాన్ని అందుకోలేని స్థాయిలో వుండిపోయాయి దర్శకుడు శివ సమకూర్చిన కథా కథనాలు.

మినీ స్క్రీన్ ప్లే సంగతులు

    ఈ కథా కథనాల్లో సస్పెన్స్, టెంపో, డైనమిక్స్, థ్రిల్స్ అంటూ ఏవీ లేకపోవడానికి కారణం ప్రెజెంట్ స్టోరీ- పీరియెడ్ స్టోరీలలో ఏది ప్రధాన కథ, ఏది ప్రధాన కథకి సమాచార వనరు మాత్రమే అనేది తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే రాసెయ్యడమే.
       
ఫ్లాష్ బ్యాక్స్ వున్న కథలో ప్రెజెంట్ స్టోరీ ఎప్పుడూ ప్రధాన కథ అవుతుంది. కాబట్టి బిగినింగ్
, మిడిల్, ఎండ్ విభాగాలు, ప్లాట్ పాయింట్స్ ప్రధాన కథ అయిన ప్రెజెంట్ స్టోరీతోనే  వుంటాయి. ఫ్లాష్ బ్యాకుల్లో వచ్చే విషయమంతా ప్రెజెంట్ స్టోరీ నడవడానికి పనికొచ్చే పూర్వ సమాచారమే. ఇది కథ కాదు, దీనికి బిగినింగ్- మిడిల్, ఎండ్ లు, ప్లాట్ పాయింట్లు వుండనవసరం లేదు. వుండాలని ప్రయత్నిస్తే కుదరవు కూడా, పైగా ప్రెజెంట్ స్టోరీలో ఈ టూల్స్ వుండకుండా పోతాయి. దీంతో ప్రెజెంట్, పీరియెడ్ స్టోరీలు రెండూ చెడిపోతాయి. ఇదే జరిగిందిక్కడ.

            
మరొకటేమిటంటే, ప్రజెంట్ స్టోరీలో ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి పాత్రకూడా లేకుండా పోయింది. ప్రత్యర్ధి పాత్ర ఎవరై వుంటారంటే, ఫ్రాన్సిస్ కి ప్రశ్నార్ధకంగా వున్న పిల్లవాడు జెటానే. ఇతడ్ని చూస్తే ఏదో పూర్వ అనుబంధం వున్నట్టుందని అనేస్తాడు ఫ్రాన్సిస్. ఇలా అనడం రాంగ్. స్ట్రక్చర్ మీద అవగాహన లేక ఫ్రాన్సిస్ తో ఇలా అన్పించడమే. ఇలా అనిపించినప్పుడు ఇది పునర్జన్మ కథ అని అప్పుడే లీకై పోతోంది. కథనంలో ఇంకేం సస్పెన్సు వుంటుంది? ఇలా కాక, ఒకవైపు రష్యన్ దళం జెటా కోసం దాడులు చేస్తూంటే, కౌంటర్ గా ఆ దాడుల మధ్య ఫ్రాన్సిస్ కి జెటా తన మీద దాడులు చేస్తున్నట్టు ఏవో మాంటేజెస్ మెదల వచ్చు. ఇలా మాంటేజెస్ మెదిలితే జెటా ఆటోమేటిగ్గా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధి గా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అప్పుడు గుర్తు లేని మాంటేజెస్ లో ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడు, ఎవరితను వంటి ప్రశ్నలతో ప్లాట్ పాయింట్ ఫన్ వస్తే, ఒక సస్పెన్స్ తో కూడిన తెలుసుకోవాలనే  గోల్ ఏర్పడుతుంది హీరో అయిన ఫ్రాన్సిస్ కి.
       
కథ కథలా నడవడానికి తగిన సమయం
, అవకాశం దానికివ్వాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది ప్రేక్షకులకి. ఇలా ఫ్రాన్సిస్ కి ప్రత్యర్ధిగా జెటా బోలెడు సందేహాలతో, సస్పెన్సుతో ఎస్టాబ్లిష్ అయ్యాక, జెటాని కాపాడ్డం గాక అతడ్ని శత్రువులా చూడ్డం మొలెడితే కథనంలో డైనమిక్స్ ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో రష్యన్ దళం ఫ్రాన్సిస్ తల బద్దలు కొట్టి జెటాని ఎత్తుకెళ్ళి పోతే, తలగిర్రున తిరిగి కిందపడ్డ ఫ్రాన్సిస్ సర్రున పూర్వజన్మ (పీరియెడ్ స్టోరీ) లోకెళ్ళి పడొచ్చు- యమగోల లో ఎన్టీఆర్ యమలోకంలో పడ్డట్టు.
       
అక్కడ జెటా పోరువాగా సర్ప్రైజింగ్ గా వుంటాడు. ఇది కూడా కథనం ఫ్లాట్ గా సాగకుండా డైనమిక్సే. ఇక్కడే ఫ్రాన్సిస్ కంగువాగా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ పోరువా  కంగువామీద పగబట్టిన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేశాక ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చెయ్యాలి. ఎందుకంటే జెటా ఎవరు
, ఎందుకు నా మీద దాడులు చేస్తున్నాడనే ప్లాట్ పాయింట్ 1 లో ఫ్రాన్సిస్ ప్రశ్నలకి జవాబు దిరికింది కాబట్టి, ఇంకా పీరియెడ్ స్టోరీని పొడిగించే అనుమతి లేదు.

ఫ్రాన్సిస్ కళ్ళు తెరిచి ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చాక, జెటా కోసం వెతకవచ్చు. అప్పుడు జెటాతో రష్యన్ కమాండర్ రేయాన్ గా కార్తీ ఎదురైతే అది మోస్టు థ్రిల్లింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వుంటుంది. ఇప్పుడు కథ సూర్య వర్సెస్ కార్తీ అనే ఎదురు చూడని ఇంటర్వెల్ అనే ప్లాట్ పాయింట్ తో వుంటే ప్రెజెంట్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ కెళ్తుంది. సినిమాలో చూపించినట్టు పీరియెడ్ స్టోరీ మీద ఇంటర్వెల్ పేలవంగా కాదు.

ఇప్పుడు సెకండాఫ్ స్ట్రక్చర్ జోలికి వెళ్ళడం లేదు- ఇది మినీ స్క్రీన్ ప్లే సంగతులు కాబట్టి. అయితే ఈ సెకండాఫ్ పీరియెడ్ స్టోరీలో కార్తీ రుధిర కుమారుడిగా రివీలవుతాడు. ముగింపు ట్విస్టులో సీక్వెల్ కోసం రుధిర కుమారుడే అయిన కార్తీని ఈ జన్మలో (ప్రెజెంట్ స్టోరీలో) రష్యన్ కమాండర్ రేయాన్ గా ఓపెన్ చేశారు కాబట్టి- ఈ ప్రెజెంట్ స్టోరీలో ఇంకో ప్రత్యర్ధి అయిన కమాండర్ రేయాన్ గా కార్తీని ఇంటర్వెల్ దగ్గర లాక్కొచ్చి ట్విస్టు ఇవ్వడం న్యాయం.

తీస్తున్న భారీ బడ్జెట్ కి నోట్లు తీసి లెక్కపెడుతున్నప్పుడు రాస్తున్న కథ లెక్కలు కూడా తెలియడం అవినాభావ సంబంధ న్యాయమే.

—సికిందర్