రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 19, 2019

873 : స్క్రీన్ ప్లే సంగతులు


           
      118’ నుంచీ ‘గ్యాంగ్ లీడర్’ వరకూ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆశాజనకంగా 10 సస్పెన్స్ థ్రిల్లర్లు విడుదలయ్యాయి. 118, గేమ్ ఓవర్, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, నిను వీడని నీడను నేనే, రాక్షసుడు, కథనం, ఎవరు, ఏదైనా జరగొచ్చు, గ్యాంగ్ లీడర్. వీటిలో 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు - తప్ప మిగిలినవి ఫ్లాపయ్యాయి. పదిలో 5 ఫ్లాప్స్. ఒక జానర్లో తీసినవన్నీ హిట్టవ్వాలని లేదు. ప్రేమ జానర్లు, దెయ్యం జ్వరాలూ మార్కెట్ కోల్పోయి సస్పెన్స్ థ్రిల్లర్లు మార్కెట్ ని భర్తీ చేయడం మంచిదే, ప్రేక్షకులు కూడా సంతోషంగా వున్నారు లేకి ప్రేమలు, పిచ్చి దెయ్యాలు వదిలాయని. సస్పెన్స్ థ్రిల్లర్లు చిన్న సినిమాలు. వీటిని స్టార్లు నటిస్తున్నప్పుడు రిస్కే అవుతుంది. వీటి కథల్లో స్టార్ మెటీరియల్ వుండదు. ఈ తొమ్మిది నెలల్లో విడుదలయిన పది సస్పెన్స్ థ్రిల్లర్స్ లో తొమ్మిదీ చిన్న, మధ్య తరగతి హీరోలవే. గ్యాంగ్ లీడర్ ఒక్కటే  స్టార్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో పాత్రకీ, కథకీ స్టార్ మెటీరియల్ లేకపోవడంతో ఫ్లాపయ్యింది. ఒక రేంజికి ఎదిగిన నేచురల్ స్టార్ నాని లాంటి మాస్ – కమర్షియల్ సినిమాలతో స్ట్రాంగ్ ఇమేజి వున్న స్టార్లు, హిట్టయిన 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు –లలో ఏది నటించినా స్టార్ మెటీరియల్ దోషంతో ఫ్లాపవుతుంది. యాక్షన్ కామెడీలు, యాక్షన్ థ్రిల్లర్లు వాళ్ళ జోన్. జర్నలిస్టు పాత్ర వాళ్ళ రేంజి, రచయిత పాత్ర కాకుండా. 

        గ్యాంగ్ లీడర్ కథకి  బలహీనంగా వున్న క్రియేటివ్ యాస్పెక్ట్ ని దిద్దుకుంటే మార్కెట్ యాస్పెక్ట్ బావుండేదే. ఆ క్రియేటివ్ యాస్పెక్ట్ లో స్టార్ ని వూహిస్తే మాత్రం మార్కెట్ యాస్పెక్ట్ వుండే అవకాశం లేదు. ఈ కథ కాన్సెప్టు, లేదా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ తో కళకళ లాడేదే స్టార్ ని వూహించకుంటే. శ్రీ విష్ణు, లేదా ‘ఆత్రేయ’ బ్రాండ్ నవీన్ పొలిశెట్టి లాంటి చిన్న రేంజర్లు వుంటే ఈ కాన్సెప్ట్ కి న్యాయం జరిగే మాట. ఇందులో తారాగణంలో ఒకటి గమనిస్తే, నానికి సూటయ్యే స్టార్ హీరోయిన్ ఇందులో లేదు. ఎందుకు లేదు? వుంటే లీడ్ క్యారక్టర్ లక్ష్మి ఫేడవుట్ అవుతుంది కాబట్టి. పైగా ఇందులో హీరోయిన్ కి పనికూడా లేదు కాబట్టి. కనుక ఈ కథ నాని అవసరాన్ని కూడా డిమాండ్ చేయని రేంజిలో నే వుందని అర్ధం జేసుకోవాలి. పెద్ద సినిమాలు తీసే దర్శకుడు విక్రం కుమార్ తన ప్రతీ కథా పెద్ద సినిమాకి తగును అనుకోవడం తగని పనైంది. పెద్ద సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కిది వరసగా క్రియేటివ్- మార్కెట్ యాస్పెక్ట్ లు పని చేయని ఐదో పరాజయమైంది.

స్ట్రాంగ్ గా వున్నది ట్రైలరే 
  ట్రైలర్ స్ట్రాంగ్ టీలావుంది. స్టార్ మెటీరియల్ అన్పిస్తూ కారు ఛేజింగులువిలన్స్ తో ఫైట్స్గన్ ఫైర్స్బ్లాస్టింగ్స్ వగైరాలతో వైరల్ అయింది.ఐదుగురు ఆడవాళ్ళతో నానీస్ గ్యాంగ్ ఓషన్స్ ఎలెవన్’ లెవెల్లో ఫోజిస్తూ నడుస్తూంటేయుద్ధానికి సిద్ధం కండిసమర శంఖం నేనూత్తాను అనినానిడైలాగేస్తేనేనింకా థ్రిల్లర్‌ జానర్లోనే వున్నానుసైకో థ్రిల్లర్ జానర్లోకి మారక ముందే మొదలెట్టేద్దాం’ అని విలన్ కార్తికేయని కార్నర్ చేస్తూంటే, ఒక ఫుల్ రేంజి సస్పెన్స్ / యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ అన్నట్టు ఆశలు కల్పించింది. తీరా సినిమాలో ఇవన్నీ ఓ రెండు మూడు సీన్లలో వున్న షాట్స్ ని ఏర్చికూర్చినవే తప్ప మరేమీ కాదని తేలింది. ఈ ట్రైలర్ లో కనబర్చిన కంటెంట్ ని సినిమాలో కూడా కనబర్చి వుంటే ఏంతో బావుండేది.


          ముఖ్యంగా ఈ కథకి జానర్ మర్యాద లోపించింది. రెండోది స్ట్రక్చర్ సమస్య. స్ట్రక్చర్ ఏం డిమాండ్ చేస్తుందో ఆ ప్రకారం కథనం లేదు. ప్రారంభంలో రాత్రి పూట ముసుగేసుకున్న ఆకారాలు హైటెక్కుగా బ్యాంకుని దోచుకునే దృశ్యాల దగ్గరే ఈ కథ చప్ప బడిపోయింది. ఎడ్గార్ వాలెస్ నవలల్లో ముసుగు ఆకారాలు బ్యాంకుని దోచుకున్నాయని రాయవచ్చు. నవల చదవడం మనసులో ఊహించుకోవడం కాబట్టి ఇబ్బంది వుండదు. సినిమా చూడ్డం కళ్ళతో చూడ్డమైనప్పుడు ఆ కళ్ళు టీవీ ఛానెల్ కవరేజిని డిమాండ్ చేస్తాయి. ముసుగేసుకోకుండా ఓపెన్ ఫేసులతో క్యారక్టర్లుంటే, రక్తితో, కిక్కుతో, ప్రేక్షకులకి బాగా రిజిస్టరై కథలో లీనం చేస్తాయి. ఏ సినిమాలో నైనా ఓపెనింగ్ బ్యాంగులు ఓపెన్ గానే వుంటాయి. ఎవరేం చేశారో చూపించేస్తారు. అప్పుడే ఆ బ్యాంగ్ కథకి హుక్ లా అర్ధవంతంగా పనిచేస్తుంది.

           ఈ సినిమాలో చీకట్లో ఎవరేమిటో తెలీని ముసుగు ఆకారాల దోపిడీ ఆపరేషన్ ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా, ఇంటరాక్టివ్ వ్యూయింగ్ కి వీల్లేకుండా, ఉత్త పాసివ్ వ్యూయింగ్ తో చప్పగా వుంది. ఎక్కడో నవలలో చదివింది చదివినట్టు దృశ్యాలంకరణ చేసినట్టుంది. లేదా ఇంకే సినిమాలోనో పరిచయమైన క్యారెక్టర్లు ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, మిడ్ పాయింట్ లోనో ముసుగులేసుకుని పాల్పడ్డ దోపిడీ దృశ్యాల్ని ఇక్కడ ఓపెనింగ్ కి వాడుకున్నట్టుంది. తెలిసిన క్యారక్టర్లు కథ మధ్యలో ముసుగులేసుకుని దోపిడీ చేస్తే ఇంటరాక్టివ్ వ్యూయింగ్  కి దెబ్బ రాదు, ఎందుకంటే వాళ్ళెవరో  మనకి తెలుసు కాబట్టి. ఇలా ఏదో సినిమాలో కథ మధ్యలో వున్న దోపిడీ దృశ్యాల్ని ఆలోచించకుండా ఓపెనింగ్ బ్యాంగ్ కి వాడుకున్నట్టుంది.  ‘నిను వీడని నీడను నేనే’ లో ‘సిక్త్ సెన్స్’ లో వున్న ముగింపు ట్విస్టుని  తెచ్చుకుని కథ నడపబోయి బోల్తా పడలేదా? 
 
          ఒకవేళ ఈ దోపిడీ ఐదుగురు లేడీస్ గల నానీస్ గ్యాంగే చేస్తున్నట్టు అన్పించాలని, అప్పుడది పవర్ఫుల్ ఓపెనింగ్ బ్యాంగులా వుంటుందని ముసుగులేసిన ఉద్దేశమేమో? దోపిడీలో ఈ ఐదుగురూ చచ్చిపోతే బలమైన సస్పెన్స్ క్రియేటవుతుందనేమో? ఆలాంట ప్పుడా ఐదుగుర్లో ఒక చిన్న పిల్ల ముసుగు ఆకారం కూడా వుండాలి.
పెన్సిలు చెక్కుట 
         నానిది పెన్సిలు పార్థసారథి అనే రివెంజి నవలలు రాసే రచయిత పాత్ర. ఈ రోజుల్లో నవలా  రచయితలూ, వాళ్ళ నవలలు చదివే పాఠకులూ ఎవరున్నారనే ప్రశ్నకి తగ్గట్టుగానే పెన్సిల్ రాసే నవలలు అమ్ముడుబోవు. పైగా ఇతను హాలీవుడ్ సినిమాలు కాపీ చేసి రాస్తాడు. లక్ష్మి ఒక ప్రతీకారేచ్ఛతో వున్న 80 ఏళ్ళావిడ. బ్యాంకు దోపిడీలో చనిపోయిన వాళ్ళ బంధువుల్ని కూడగట్టి, చంపిన వాడి మీద పగదీర్చుకోవాలని నానిని సంప్రదిస్తుంది. ఇది కాన్సెప్ట్ లేదా స్టోరీ ఐడియా ఏర్పాటయ్యే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.

          ఇక్కడ మనం ఏ నేపథ్యం తెలిసి వున్నామంటే, ఓపెనింగ్ బ్యాంగ్ చూసిన నేపథ్యం తెలిసి వున్నాం. ఆ ఓపెనింగ్ బ్యాంగ్  క్లోజ్డ్ విండోతో వుంది. అంటే ఆ దోపిడీలో పాల్గొని చనిపోయిన ముసుగేసిన ఆకారాలు ఎవరో మనకి తెలీదు. ఇప్పుడు లక్ష్మి వచ్చి వాళ్ళు తమ ఐదుగురి బంధువులంటోంది. అంటే డెకాయిటీలు తమ బంధువులంటోందన్న మాట. అప్పటికీ ఫోటోలు చూపించి మన క్యూరియాసిటీని తీర్చలేదు. మొహాలు కూడా మనకి తెలీని వాళ్ళ హత్యలకి ప్రతీకారమంటోంది. ఎలా మనం కనెక్ట్ అవుతాం. వీళ్ళని చంపి 300 కోట్లు డబ్బుతో పారిపోయిన పెద్ద డెకాయిటీని పట్టుకుని పగదీర్చుకోవాలంటోంది.

          లక్ష్మి బృందంలో నడివయసావిడ, వయసమ్మాయి, ఇంకో టీనేజీ అమ్మాయి, ఐదేళ్ళ చిన్న పిల్లా వున్నారు. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాంగ్ కొద్దిగా ఓపెనై, ఆ ముసుగు డెకాయిటీలు వీళ్ళ తాలూకు అని మనకి అర్ధమయింది. అంటే ఈ ఐదుగురు లేడీస్ మంచి ఫ్యామిలీస్ కాదనీ, డెకాయిటీ బ్యాచ్ అనీ అర్ధం వస్తోంది. ఇలా ఇప్పుడు వీళ్ళ పట్ల బ్యాడ్  ఫీలింగ్ మనకేర్పడి పోతోంది. ఇది కథకుడు ఫీల్ కాలేదా? పదుల కోట్ల బడ్జెట్ కథకి క్వాలిటీ ఇలా వుంటే సరిపోతుందా? బాక్సాఫీసు నో చెప్పే క్వాలిటీ?

          ఎందుకిలా జరిగింది? కథకుడు కాన్సెప్ట్ తో కూడా సస్పెన్స్ కి పాల్పడాలనుకోవడం వల్ల. సగం కాన్సెప్ట్ చెప్పి కథ మొదలెట్టాలనుకోవడం వల్ల. ఒక ఐడియా అనుకుంటే ముందుగా అందులో కథ వుందా లేదా, ఐడియా స్ట్రక్చర్ లో వుందా లేదా చూసుకోవడం అలవాటు. లక్ష్మి వచ్చి బ్యాంకు దోపిడీలో చనిపోయిన డెకాయిటీలు మా బంధువులు, వాళ్ళని చంపిన పెద్ద  డెకాయిటీ మీద పగ దీర్చుకోవాలన్నట్టు మాట్లాడుతున్నప్పుడు, ఏం కాన్సెప్ట్ ఏర్పాటయ్యింది? నెగెటివ్ క్యారెక్టర్స్ తో యాంటీ స్టోరీ ఏర్పాటయింది.

          ఇక్కడ కథ నానిది. ప్లాట్ పాయింట్ వన్ అతడిది. గోల్ అతడిది. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో అతనేం గోల్ తీసుకున్నాడు? నెగెటివ్ పాత్రల పగ దీర్చే గోల్ తీసుకున్నాడు. ఇది నెగెటివ్ గోల్. ఈ నెగెటివ్ గోల్ తీసుకోవడానికి - ఈ రియల్ రివెంజిని ప్రాక్టికల్ గా చూసి నవల రాస్తే తను సక్సెస్ అవచ్చని కారణం చెప్పారు. కారణం జస్టిఫై అవచ్చు, కానీ గోల్ నెగెటివ్ గోల్. అంటే తనూ నెగెటివ్ క్యారక్టరే. దీంతో ఈ మొత్తం నెగెటివ్ క్యారక్టర్లతో ఎలా సినిమా చూపించి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనుకున్నారు?

          నాని ఏమని అని వుండాలి? – ‘ఏవమ్మా, బలపంలా కన్పిస్తున్నానా? 300 కోట్ల అత్యంత భారీ దోపిడీలో  మీ వాళ్ళు పార్టనర్సా? వాళ్ళని మెయిన్ డెకాయిటీ చంపి పారిపోయాడని పగదీర్చుకోవాలంటున్నారా? మీ వాళ్ళు చేసిన పనికి సిగ్గు వేయడం లేదా? మిమ్మల్ని చుట్టుపక్కలెవరూ వెలివేయలేదా? మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్ళి ఫోర్త్ ఎస్టేట్ కి తెలియకుండా థర్డ్ డిగ్రీతో చిమచిమ లాడించలేదా, మెయిన్ డెకాయిటీ ఎక్కడున్నాడో చెప్పమని? మీమీద ఇప్పుడూ పోలీసు నిఘా లేదంటావా? వెళ్ళెళ్లమ్మా, నన్నెందుకు ఇరికిస్తావు. ఈ చిన్న పిల్లకి, ఈ చదువుకునే పిల్లకీ నీ పగ ఎక్కించి పాడు చెయ్యాలా? అలాటి మీ వాళ్ళు చచ్చినందుకు సంతోషించక పగ కూడానా?’ నేను పెన్సిలునే కానీ బలపాన్ని కాను. ఈ బలపం రచయితెవరో సరీగ్గా ప్లాట్ పాయింటు రాయించుకురా, అప్పుడాలోచిద్దాం’ అనాలి గబగబా పెన్సిల్ చెక్కుతూ.

అంతా పైపైనే 


          ఇక నాని విలన్ (కార్తికేయ) ఆచూకీ కోసం ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటి మోరల్ ప్రెమీజ్ లేని, రసభంగమైన కథతో, నెగెటివ్ పాత్రల గోడుతో. దోపిడీ గ్యాంగ్ రిహార్సల్ చేసిన చోట చెప్పులు, టిఫిన్ బాక్సులు వగైరా చనిపోయిన దోపిడీ దార్ల వస్తువులు దొరికితే ఎవరికి మాత్రం సానుభూతి? లేడీస్ గ్యాంగ్ ఏడ్పులు ఎవరికవసరం. ఇంటర్వెల్ కల్లా విలన్ తెలిసిపోయాక వాణ్ణి చంపే ప్లాను వెయ్యక ఇంకా డొంక తిరుగుడు దేనికి. కారు రేసుల పిచ్చి గల ఆ విలన్ రేస్ ట్రాక్ కోసం, రేసు కార్ల కోసం బ్యాంకు దోచుకున్నాడు. మరి నూట యాభై కోట్లతో రేస్ ట్రాక్ నిర్మించుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మిగిలిన 150 కోట్లు నిర్మాణం ఆగిపోయిన అపార్ట్ మెంట్లో ఫాల్స్ పిల్లర్ నిర్మించి అందులో దాచుకుని – ఏటీఎంలా దాన్ని వాడుకుంటూ వుంటే ఈ రాకపోకల్ని ఎవరూ అనుమనించరా? నాని అనుమానించి, ఆ 150 కోట్లు దోచుకుని విలన్ ని ఏడ్పించే ఆట మొదలెడతాడు. దేనికి? పగ తీర్చుకోవాలన్న కాన్సెప్ట్ ప్రకారం విలన్ ని అప్పుడే చంపేసి ఆ డబ్బు ప్రభుత్వానికి అప్పజేప్తే, విలన్ని చంపిన కేసు కూడా వుండక పోవచ్చుగా? పెన్సిల్ రైటర్ గ్లోబల్ హీరోగా పాపులర్ అవుతా డుగా, కోటి రెండు కోట్ల రివార్డు మనీతో?

          ఆ 150 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు! దానికోసం విలన్ వచ్చేస్తే ఆ 150 కోట్లతో లక్ష్మి జంప్! ఆ డబ్బు ఏదో శరణాలయానికిచ్చేసి అక్కడ సెటిల్! పగాప్రతీకారాలేమయ్యాయో. ఇలా 150 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఎలా తిప్పుతూంటారంటే, వెచ్చాల సంచేసుకుని బజారుకెళ్ళి నట్టు. నాని సహా లక్ష్మీ, శరణాలయం బ్యాచీ ఈ డబ్బుతో క్రిమినల్స్ ఐపోయమని గుర్తించడమే లేదు. టాప్ దర్శకుడు ఎలా పడితే అలా పైపైన రాసేసి పైపైన తీసేశాడు.

అసలు విషయం 
     అసలు విషయాని కొద్దాం. ఇది ప్లాట్ పాయింట్ వన్ లో రావాల్సిన బేస్ పాయింట్. కథకుడి ‘సస్పెన్స్ పోషణ’ వల్ల ఎగిరి వచ్చి ఇక్కడ పడింది - సెకండాఫ్ అరగంట గడిచాక, నాని చెప్తాడు ఆ లేడీస్ కి తెలియని వాళ్ళ రహస్యమే. అసలేం జరిగిందంటే, లక్ష్మి మనవడు, నడివయసావిడ కొడుకు, వయసమ్మాయి ప్రేమికుడు, టీనేజి అమ్మాయి అన్న, చిన్నపిల్ల తండ్రి – ఈ ఐదుగురూ క్యాన్సర్ బాధితులు. ఇక చనిపోతామని తెలిసి, కుటుంబాలకి ఏదో చేయాలనుకున్నారు. విలన్ కలిసి బ్యాంక్ దోపిడీ గురించి చెప్పాడు. దాంతో అందులో తమ కొచ్చే సొమ్ముని కుటుంబాలకిచ్చేసి చనిపోవాలనుకున్నారు. కానీ విలన్ బ్యాంకుని దోచుకున్నాక వాళ్ళని చంపేశాడు. ఇదీ విషయం. ఇంత సస్పెన్స్ సెకండాఫ్ లో రివీల్ అయినందుకు మనం థ్రిల్లయి పోతాం కదా. రాంగ్. ఇది ఏడుపుగొట్టు సస్పెన్స్.

          ఇంత సేపూ నాని సహా లేడీస్ ని నెగెటివ్ అర్ధంలో చూపిస్తూ సినిమాకి హాని చేశాక, ఇప్పుడు జాలి కథ చెప్తే పాజిటివ్ సెన్స్ తో ఫీలైపోతామా? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. పైగా అసలు విషయం నాని రివీల్ చేశాకైనా లక్ష్మి సిన్సియర్ గా వుండదు. తమ ఐదుగురి కుటుంబాల కోసం క్యాన్సర్ దాచుకుని త్యాగం చేసిన వాళ్ళ పట్ల ఏ ఫీలింగ్ లేకుండా, ప్రతీకారం సంగతికి ఏవో సాకులు చెప్పి, డబ్బు కొట్టేసి శరణాలయంలో సెటిల్ అవడం. నాని నిలదీస్తే అప్పుడేమంటుంది? చనిపోయింది మనవడు కాదట, తన భర్తట! ఏమిటో తమాషాగా వున్నాయి ట్విస్టులు.

ప్లాట్ పాయింట్ ఫ్రాక్చర్ 
       ఇదంతా కాదు, ఇక్కడ రివీల్ చేసిన విషయం ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ లోనే రావాలి. అక్కడ లక్ష్మి నాని దగ్గరికి వచ్చినప్పుడు, తమ వాళ్ళ క్యాన్సర్ గురించీ, దోపిడీతో వాళ్ళు చేసిన త్యాగం గురించీ కూడా చెప్పేసి,  విజువల్స్ తో వాళ్ళని ఓపెన్ చేసి, సాయం అడగాలి. అప్పుడు సానుభూతితో వాళ్ళందరూ పాజిటివ్ క్యారక్టర్లయి కథతో బావుంటారు. ఇందుకే ఓపెనింగ్ బ్యాంగ్ లో ముసుగులు వుండకూడదనేది. చనిపోయిన వాళ్ళ నెగెటివ్ రూపాలు, ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో కనపడి, అయ్యోపాపం అనుకోవడానికి వీలుంటుంది.

          ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పాల్సిన ప్రాబ్లం పూర్తిగా చెప్పకుండా సగం సస్పెన్స్ కోసమన్నట్టు దాచి, సెకండాఫ్ లో చెప్పారు. ఇలా ప్లాట్ పాయింట్ వన్ ని విరిచి రెండు ముక్కలు చేసి నష్టం చేసుకోవడం ఎక్కడా చూడలేదు. క్రియేటివ్ స్కూలుతో ఇదే ప్రాబ్లం. స్ట్రక్చర్ స్కూలు మాత్రమే స్క్రిప్టులో సమస్య లేమిటో చెప్పగలదు.

          ఐతే ఈ పూర్తి ప్రాబ్లం ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పేస్తే నిర్దుష్టంగా వుంటుందా స్క్రిప్టు? మోరల్ గా వుండదు. అప్పుడూ అన్యాయంగానే వుంటాయి అన్ని పాత్రలూ చనిపోయిన వాళ్ళు సహా. ఎలా? ఎలాగేమిటి, చనిపోయిన వాళ్ళనుంచి త్యాగపు సొమ్ము రావాలే గానీ, అన్యాయపు సొమ్ము కాదు. వాళ్ళు బ్యాంకు దోపిడీ అనే నేరం చేసి కుటుంబాల కివ్వాలనుకున్నారు. అది అన్యాయపు సొమ్ము. పైగా కుటుంబాల్ని చట్టం కోరల్లో ఇరికించి నాశనం చేస్తుంది. కుటుంబాలు తిట్టిపోసుకుంటాయి.

          1974 ‘మజ్బూర్’ లో, అమితాబ్ బచ్చన్ తను బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతానని తెలిసి, కుటుంబం కోసం హంతకుడి డీల్ ఒప్పుకుంటాడు. ఐదు లక్షలు తీసుకుని, హంతకుడు చేసిన హత్యని తన మీదేసుకుని, ఉరికంబం ఎక్కబోతాడు. ఇది అన్యాయపు సొమ్ము కాదు, తను నేరాలు చేయలేదు. చెయ్యని నేరాన్ని మీదేసుకున్న త్యాగపు సొమ్ము.

          స్ట్రక్చర్ ఒక్కటే స్క్రీన్ ప్లే కష్టాల నుంచి విముక్తి కల్గిస్తుంది.


సికిందర్
telugurajyam.com



Tuesday, September 17, 2019

872 : రివ్యూ!


దర్శకత్వం : అజయ్ బహల్
తారాగణం : అక్షయ్ ఖన్నా, రిచా చడ్డా, మీరా చోప్రా, రాహుల్ భట్, కిషోర్ కదమ్, కృతికా ఖాన్ తదితరులు
రచన : మనీష్ గుప్తా, సంగీతం : క్లింటన్ సిరేజో, ఛాయాగ్రహణం : సుధీర్ చౌధురి
బ్యానర్ : పనోరమా స్టూడియోస్, టీ సిరీస్
         కోర్టు రూమ్ డ్రామాలకి లైంగిక వేధింపుల / మానభంగాల కథలు సెక్స్ అప్పీల్ ని సమకూర్చి పెడుతున్నాయి బాక్సాఫీసు విజయాల కోసం. ఇవి ఫార్ములాకి దూరంగా చుట్టూ జరుగుతున్న సంఘటనలకి వాస్తవిక సినిమాల రూపంలో అద్దం పడుతున్నాయి. లైంగిక వేధింపుల కథతో ‘పింక్’ ఒక కోర్టు రూమ్ డ్రామా కాగా, తాజాగా మానభంగ కథతో ‘సెక్షన్ 375’ ఇంకో అలాటి కోర్టు రూమ్ డ్రామా అయింది. ‘పింక్’  కొంత ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తే, ‘సెక్షన్ 375’ చట్టాన్ని, న్యాయాన్నీపల్టీ కొట్టించే అస్త్రంగా రేప్ ని చూపించింది.

          టు హాలీవుడ్ లోనూ, ఇటు ఇండియాలోనూ ఇంకా ‘మీ టూ’ ఉద్యమం ప్రారంభం కాక ముందే ఈ కథ తయారైందని చెబుతున్నా, ఇప్పుడా ఉద్యమ నేపథ్యంలో, నిత్యవార్తలైన మానభంగాల ఉధృతిలో, బాధితుల ఫిర్యాదుల పైనే అనుమానాలు కలిగేలా వుందీ చిత్రణ. వరకట్న వేధింపుల సెక్షన్ 498 దుర్వినియోగమైనట్టే, మానభంగాల సెక్షన్ 375 నీ వాడుకునే ప్రమాదం వున్నట్టు, స్త్రీలకోసం చట్టాలు చేస్తే వాళ్ళు పురుషుల్ని వేధించడానికి మానిప్యులేట్ చేస్తారన్న అర్ధంలో వుంది కథా రచన. పూర్తిగా పురుష పక్షం వహించి, అవి మగవాళ్ళ చేసే రేపులు కావు, ఆడవాళ్ళు తీర్చుకునే రివెంజిలు అని ముక్తాయించిన ముగింపూ  వుంది. ఎక్కడో అరుదుగా జరిగే అవకాశమున్న ఇలాటి కుయుక్తిని సినిమా కోసం జనరలైజ్ చేసినట్టుగా వుంది కాన్సెప్ట్.

          ఇలా ఎవరైనా చట్టాన్నిదుర్వినియోగం చేస్తే కోర్టు శిక్షించేట్టు కాకుండా, సమర్ధిస్తున్నట్టు తీర్పు చెప్పడం ఇంకో ‘ప్రధానాకర్షణ’. ఈ హైకోర్టు తీర్పు చెప్పడం కూడా బయట ప్రజాందోళనకి లొంగి చెప్పినట్టు వుండడం ‘ప్రధానాకర్షణే’. రేపిస్టుని శిక్షించాలని హైకోర్టు బయట జనం లాఠీ దెబ్బల్ని లెక్కచెయ్యకుండా తీవ్రస్థాయిలో గొడవ చేస్తూంటే, న్యాయమూర్తి మాటిమాటికీ కిటికీలోంచి తొంగి చూసి టెన్షన్ తో గడపడం, ఈ జనాలకి అనుకూలంగా తీర్పు చెప్పకపోయామో, ఇక తమ తలలు వేయి వ్రక్కలే అన్నట్టు హడవిడిగా - ఆ ఇద్దరు న్యాయమూర్తులూ బెంచి మీదికొచ్చేసి -  ‘ఔను వాడు రేపిస్టు ముష్టివాడే’ - అని తీర్పు చెప్పి పారెయ్యడం, అత్యంత ప్రధానాకర్షణ గల చర్యే విశ్వసనీయత పట్ల. 

       విడతలు విడతలుగా మనకి అందించిన కథనం ప్రకారం అతను రేప్ చేయలేదు, అలా ఆమె ట్రాప్ చేసింది. దీనికి రుజువు లేదు. మొదట అతనే ట్రాప్ చేశాడు. అతను పెళ్ళయిన విషయం దాచి పెట్టాడని ఎదురు తిరిగింది. మోసపోయానని మోసానికి ప్రతీకారంగా అతణ్ణి ట్రాప్ చేసి రేప్ కేసులో ఇరికించింది. ఆమె ట్రాప్ చేసిందనడానికి రుజువుల్లేవు, పైగా కోర్టు బయట జనం రెచ్చిపోతున్నారు. అందుకని న్యాయ మూర్తులు అతను రేపిస్టేనని, ఆమె రేప్ బాధితురాలనీ గట్టెక్కించేశారు.

          ఒక నిర్భయ ఘటనలోనో, ఇంకో ఖటువా ఉదంతంలోనో రేప్ బాధితుల్ని చంపి పడేస్తే, కళ్ళారా చూసిన ఆ ఘోరాలకి ప్రజాందోళనలు పెల్లుబకడంలో అర్ధముంది. పడగ్గది లో ఇద్దరి మధ్య అసలేం జరిగిందో తెలిసే వీలులేని కేసుల్లో, జనాలకేం తెలుసనీ రేపిస్టుని ఉరితీయాలని వీధికెక్కుతారు. సోషల్ మీడియాలో వీరంగాలేస్తారు. కోర్టుల మీదికి దండయాత్ర చేస్తారు. ఇలాటి మూకల్ని ఎంకరేజి చేస్తున్నట్టూ, దీన్ని తీర్పుకి వాడుకుంటున్నట్టూ కథ చేశారు. ఈ కేసు నువ్వెలా తీసుకున్నావని అల్లరి మూక నిందితుడి లాయర్ మీద దాడి చేసేలా, ఇంకు జల్లి అవమానపర్చేలా, న్యాయప్రక్రియని అల్లరి మూక చేతిలో పెట్టేసేలా కథాసంవిధానాన్ని తీర్చిదిద్దారు. ఈ కథామాలికలో అల్లరి మూకల పాత్రకి లాజిక్కే లేదు.

          ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులుంటే, వాళ్ళలో ఒకరు మేడమ్  వుంటే, ఆవిడకి ప్రాధాన్యం లేనట్టే చిత్రణ. ఛాంబర్ లోకి వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళినా అతడేం చెప్తాడని ఆమే అతడి వైపు చూస్తూంటుంది తప్ప, ఆమె అభిప్రాయం కోసం అతను చూడడు గాక చూడడు. అతనే ఏదో డిక్లేర్ చేస్తే, దానికామె తలూపుతుంది. తలలు పగులుతాయన్న భయం కూడా అతడిదే. అతడి ప్రకారమే తీర్పుకి ఆమె ఓకే. ఛాంబర్లో అంతా వాడిన మేల్ డామినేషన్ పూలతో కథాలంకరణ. వాడిన పూలే వికసించెనే - అని మనం పాడుకునేట్టు.

కేసు కథా ‘కామా’ మిషు
       నిందితుడి బెడ్ కింద వాడిన పూలుంటాయి రేప్ కి సాక్ష్యంగా. తర్వాత ఆమె వికసించిన పూలతో మళ్ళీ వచ్చిందని ఎదురు సాక్ష్యం తీస్తాడు నిందితుడి తరపు లాయర్. బెడ్ కింద వున్న వాడిన పూలు రేప్ కి నాల్గు రోజులు ముందటివి అంటాడు (ఇంట్లోపని మనిషి వుంది, బెడ్ రూమ్ ఊడ్వదా? కథ కోసం అవసరమని నలిగిన పూలు వదిలేసిందా?... సినిమా ఫీల్డులో మోడ్రన్ కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ జడలో వొత్తుగా, వెడల్పుగా కొట్టొచ్చినట్టూ, మల్లెపూల పట్టీ వేసుకు తిరగడం కూడా కథ కోసమేనేమో).

          అంజలీ డాంగ్లే (మీరా చోప్రా) ఒక సినిమా కాస్ట్యూమ్స్ అసిస్టెంట్. కాస్ట్యూమర్ మేడమ్ కింద పనిచేస్తూ, అదే సినిమా షూటింగులో దర్శకుడు రోహన్ ఖురానా (రాహుల్ భట్) కి లొంగిపోతుంది. పెళ్ళయిన విషయం చెప్పడు. కానీ ఆమె వల్ల ఇంట్లో భార్యకి తెలిసిపోయి ఆమెని వెళ్ళగొడతాడు. దీంతో తనని మోసం చేశాడని మనసులో పెట్టుకుని, పథకం ప్రకారం పని ఇప్పియ్యమని జాలి కథలు చెప్పుకుని మళ్ళీ వస్తుంది. షూటింగ్ కి అవసరమైన కాస్ట్యూమ్స్ ని పథకం ప్రకారం వంగి చూపిస్తూ, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేస్తుంది (అప్పుడు బ్రా వేసుకుని వుండదు. ఈ పాయింటు కేసులో ఎక్కడా ఉత్పన్నం కాదు. రోహన్ కూడా తన లాయర్ కి చెప్పడు. చెప్పి వుంటే తన మీద కేసు కింది కోర్టులోనే ఎగిరిపోయేది). ఆ ఎక్స్ పోజింగ్ కి అతను తన సహజ మగ తేనియలు తేరగా వూరగా ఆమె మీద పడతాడు. ఆమె పథకం ప్రకారం ప్రతిఘటించి గాయాలు చేసుకుని, వెళ్లి పోలీస్ స్టేషన్లో  రేప్ కేసు పెట్టేస్తుంది.


        అక్కడ పోలీసాఫీసర్ అడగరాని ప్రశ్నలు అడిగి కేసు రాసుకుంటాడు (ఈ కేసు రాయాల్సింది లేడీ ఆఫీసరైతే నువ్వెందుకు రాశావని తర్వాత హైకోర్టులో రోహన్ లాయర్ తరుణ్ సలూజా (అక్షయ్ ఖన్నా) అడుగుతాడు. సినిమాకి సెక్స్ అప్పీలు పీక్ కి వెళ్ళడానికి  తనుంటేనే బాగుంటుందని ఆ పోలీసాఫీసర్ చెప్పలేకపోతాడు).

          ఇలా రేప్ కేసులో దర్శకుడు రోహన్ అరెస్టయి, సాక్ష్యాలన్నీ ఆమె ఆరోపణలకి నిరూపణలుగా వుండడంతో సెషన్స్ కోర్టు పదేళ్ళ  శిక్ష వేస్తుంది. హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. లాయర్ తరుణ్ సలూజా రంగంలోకొస్తాడు. ప్రాసిక్యూషన్ వైపు ఒకప్పుడు తన అసిస్టెంటే అయిన హీరల్ గాంధీ (రిచా చడ్డా) వస్తుంది. ద్విసభ్య బెంచి (కిషోర్ కదమ్, కృతికా ఖాన్) అప్పీల్ విచారణ. ఈ విచారణలో పై చేయి అంతా మేల్ డామినేషన్ తో తరుణ్ దే. వైరి పక్షాల సమీకరణ కూడా ఎలా వుందంటే, ఆడ జట్టు ఒక వైపు – మగ జట్టు ఒకవైపు అన్నట్టు. మేల్ డామినేషన్ తో మగజట్టుదే పై చేయి. బాధితురాలు, ఆమె తరపు ప్రాసిక్యూటర్ ఆడజట్టు. నిందితుడూ అతడి లాయర్ మగజట్టు. వీళ్ళదే హల్చల్. తన అధికార స్థానాన్ని ఉపయోగించుకుని మగవాడు స్త్రీలని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాడని చెప్పే రేప్ కథలో కోర్టులోనే, కోర్టు ఛాంబర్లోనే ఈ దృశ్యాలు.

          పబ్లిక్ ప్రాసిక్యూటర్ హీరల్ గాంధీ (గాంధీ పేరు దేనికి? ‘అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ మిస్ గాంధీ’ అని మాటిమాటికీ న్యాయమూర్తులు ఆమె నోర్మూయిస్తూంటే, మహాత్మా గాంధీ పట్ల శాడిజంగా వుంటుందన్నఆనందంతోనా?) ఈ కేసుని తీసుకున్నప్పుడు ఎన్ని తప్పులున్నాయో చూసుకోనట్టు వుంటుంది ఆమె వాదించే తీరు. పైగా తను రాష్ట్రానికి మొదటి మేడమ్ అడ్వొకేట్ జనరల్ గా పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చారు.

          లాయర్ తరుణ్ రేప్ జరగలేదనే తేలుస్తాడు- బెడ్ షీట్ ఆధారంగా. బెడ్ షీట్ ని వెంటనే లాబ్ కి పంపకుండా ఇన్స్పెక్టర్ ఐదురోజులు తన దగ్గరుంచుకోవడం వల్ల, దాని మీద సాక్ష్యాధారాలు కలుషితమయ్యాయని, అందువల్ల ఈ ఎవిడెన్స్ చెల్లదని చెప్పేస్తాడు. ధర్మాసనం దీన్ని ఒప్పుకున్నా, ఇంతమాత్రాన కేసుని కొట్టివేయలేమని అంటుంది. దీంతో బాధితురాలు ఏ రకంగా ముద్దాయిని ట్రాప్ చేసిందో సుదీర్ఘ వాదోపవాదాల మధ్య విజువల్ ఎవిడెన్సుని ముందుంచుతాడు తరుణ్. దీన్ని కూడా ధర్మాసనం ఒప్పుకున్నా, బయట మూక అల్లరికి బెంబేలేత్తినట్టు కింది కోర్టు తీర్పునే సమర్ధిస్తూ తీర్పిచ్చేస్తుంది.

          నైతిక విజయం తరుణ్ దే, ముద్దాయిదే. బాధితురాలే సెక్షన్ 375 ని, పోలీసుల్నీ, ప్రాసిక్యూటర్స్ నీ, కోర్టుల్నీ, అందర్నీ తెలివిగా ఏమార్చి వ్యక్తిగత పగ తీర్చుకుంది. దీంతో ఇంతవరకూ వున్న సానుభూతి కరిగిపోయి క్రిమినల్ మాస్టర్ మైండ్ గా, నెగెటివ్ గా  ఆమె కనపడుతుంది. రేప్ బాధితులకి అండగా వున్న సెక్షన్ ని తను ఇలా దుర్వినియోగపర్చి  అప్రతిష్ట తెస్తే, రేపు వేలాది రేప్ బాధితురాళ్ళ పరిస్థితేమిటని ఆడదై వుండి కూడా, ఈ కథకి కథానాయకి అయికూడా ఆలోచించకుండా.

          మద్యనిషేధాన్ని అవకాశంగా తీసుకుని హీరో డబ్బులు సంపాదించుకునే మద్యం స్మగ్లింగ్ కింద మార్చుకునే ‘రణరంగం’ అనైతిక కథకీ, దీనికీ తేడా లేదు.


సికిందర్
telugurajyam.com

Wednesday, September 11, 2019

871 : స్పెషల్ రివ్యూ!


రచన - దర్శకత్వం : రామ్
తారాగణం : వసంత్ రవి, ఆండ్రియా, అంజలి తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : థేనీ ఈశ్వర్
బ్యానర్ :
డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్
నిర్మాతలు: ఉదయ్ హర్ష, డి.వి.వెంకటేష్
విడుదల : సెప్టెంబర్ 6, 2019
***
        మిళ సినిమాల్లో కొత్త కోణాలూ కొత్త ప్రయోగాలూ కొత్త కాదు. అందులోనూ ప్రేమ సినిమాల్లో ఏదోవొక కొత్తదనమో, ప్రయోజనకర విషయమో వుంటుంది. ఐటీ, కార్పొరేట్ రంగాల నేపధ్యంలోనూ చాలా ప్రేమ సినిమాలు వచ్చాయి. అయితే నేపథ్యాలు మారతాయే తప్ప ప్రేమలు అవే మూస ఫార్ములా ప్రేమలుగా వుంటాయి. నేపథ్యాల్లోంచి ఫార్ములా అనే పాతని తీసేస్తే మిగిలేది కాలానికి తగ్గట్టు రియలిస్టిక్కే. రియలిస్టిక్ లో క్రియేటివిటీతో చాలా పనుంటుంది, మూస ఫార్ములాల్లో రొడ్డకొట్టుడు వుంటుంది. రియలిస్టిక్ అసలు ప్రేమలెలా వున్నాయో చూపిస్తుంది. ఐతే తమిళ దర్శకుడు రామ్ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వుండే ప్రేమ లెలా వుంటాయో 2013 లోనే కనిపెట్టేశాడు. ఆ చేదు మాత్రలు ప్రేక్షకులకి తినిపించేందుకు సంసిద్ధుడయ్యాడు. ప్రేమల చేదు తెలిస్తేనే ప్రేమల మత్తు వదిలి చట్టబద్ధమైన హెచ్చరిక కన్పిస్తుంది. దర్శకుడు ఎలాటి హెచ్చరిక చేశాడు, చేదుతో ఎలా ఎంటర్ టైన్ చేశాడు ఈ కింద చూద్దాం...

కథ
 ఆల్థియా జాన్సన్ (ఆండ్రియా) అనే ఆంగ్లో ఇండియన్ యువతి చెన్నైలో కార్పొరేట్ జాబ్ చేస్తూంటుంది. ఒక రోజు బస్టాప్ లో వర్షంలో చిక్కుకుంటుంది. అక్కడే బికారిలా ఒకడు నక్కి వుంటాడు. మాటా మాటా కలిసి ఫ్రెండ్స్ అవుతారు. అతను ప్రభురాజ్ (వసంత్ రవి) అనే వైజాగ్ నుంచి వచ్చి కాల్ సెంటర్లో పని చేస్తున్న ఉద్యోగి. ఎదురుగా ఇటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ సౌమ్య (అంజలి) ని ప్రేమించాడు. ఆమె యూఎస్ లో జాబ్ చూసుకుని వెళ్ళిపోతోంది. అందుకు మూడు లక్షలు కావాలి. ప్రభురాజ్ రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర ఆ డబ్బు కొట్టేసి ఆమె కిచ్చాడు. ఆ డబ్బుతో ఆమె యూఎస్ వెళ్ళిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో షాక్ తిన్నాడు. పైగా తను రైల్లో డబ్బు కొట్టేసిన వ్యక్తి గుండె పోటుతో చనిపోయాడని తెలిసి ఆత్మహత్య చేసుకోబోయాడు. రైల్వే గార్డు కాపాడి ఆశ్రయమిచ్చాడు.

          ఇలా దెబ్బతిన్న ప్రభురాజ్ జీవితం గురించి తెలుసుకున్న ఆల్థియా, తన ఫ్లాట్ లో ఆశ్రయమిస్తుంది. ఆమెకి విడాకులై ఐదేళ్ళ కొడుకుతో వుంటోంది. పనీ పాటా లేక ఆమె సొమ్ము తిని తిరుగుతూంటాడు ప్రభురాజ్. తిని తిరగడమే గాక, వాడెవడు - వీడెవడు అని ఆమె మీద అధికారం చెలాయిస్తూంటాడు అనుమానాలు పెట్టుకుని. ఫ్లాట్లోంచి నెట్టి పారేస్తుంది. రోడ్డున పడ్డ ప్రభురాజ్ ఇలా రెండోసారి అమ్మాయిలతో మోసపోయానని, ఆడవాళ్ళతో గేమ్ ఆడుకోవడం మొదలెడతాడు...

          ఏమిటా గేమ్? ఈ గేమ్ లో డబుల్ గేమ్ ఆడుతున్న ఒక పోలీసు అధికారి తన భార్యని చంపెయ్యడానికెలా కారకుడయ్యాడు? యూఎస్ లో భర్తని వదిలేసి వచ్చిన సౌమ్యని తన డబ్బుల కోసం ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు? గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి డబ్బు ఇచ్చేయడాని ఇంటికెళ్తే ఏం జరిగింది? అటు ఆల్థియా తనని లైంగికంగా వేధిస్తున్న బాస్ నెలా ఎదుర్కొంది? ప్రభురాజ్ రాకపోవడంతో ఆమె కొడుకు ఎలాటి సంఘర్షణ పడ్డాడు? ఈ మొత్తం అనుభవాల్లోంచి ప్రభురాజ్ ఏం నేర్చుకున్నాడు?... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 ఇది టీనేజి ప్రేక్షకుల కోసం లేకి అపార్ధాలతో విడిపోయి, మళ్ళీ కలుసుకునే టైపు అచ్చిబుచ్చి ప్రేమల, కృత్రిమ లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీ కాదు, మెచ్యూరిటీ గల 25 -35 ఏజి గ్రూపు ప్రేక్షకుల కోసం రియలిస్టిక్ ప్రేమకథ. ఐటీ, కార్పొరేట్ కల్చర్లు నియంత్రిస్తున్న ప్రేమలెలా వుంటాయో చెప్పే కరకు వాస్తవాల చిత్రణ. సహజ ప్రేమల్ని సహజ ప్రేమలు నియంత్రించకుండా, ఇంకేవో కల్చర్ల ఆజమాయిషీలోకి వెళ్ళిపోతే ఆ జీవితాలెలా తయారవుతాయో చెప్పే నియో రియాలిజం కథ. వర్కింగ్ క్లాస్ జీవితాల్ని వున్నన్నదున్నట్టు వలువలు వొలిచి చూపించే నియో రియాలిజం జానర్ లో ఇది తమిళం నుంచి వచ్చిన ఒక కొత్త ప్రయోగం అనొచ్చు.

          తారామణి అంటే చెన్నైలో ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ - కార్పొరేట్ జోన్. ఈ ప్రాంతంలో యువతీ యువకుల గ్లోబల్ కల్చర్ ని తొలిసారిగా వాస్తవికంగా తెరకెక్కించాడు దర్శకుడు. తారామణి రైల్వే స్టేషన్లో హీరో నివాసం సహా. కెరీర్ పరంగా ఈ కల్చర్ ఎంత రిచ్ అయ్యేందుకు తోడ్పడుతుందో, ప్రేమల విషయంలో అంతే రోడ్డున పడేలా చేస్తుందనీ, నువ్వు రిచ్ గా వుండాలంటే ఇక్కడి ప్రేమల్ని టచ్ చెయ్యకు అనీ చెప్పే ‘తారామణి’ ని టీనేజర్లు చూడడానికి మెచ్యూరిటీ, అభిరుచీ సరిపోవు.
 
ఎవరెలా చేశారు
 వసంత్ రవి పాత్ర, నటన ఈ రియలిస్టిక్ కి హైలైట్. పాత్ర మానసిక సంఘర్షణని, భావోద్వేగాల్నీ, ప్రవర్తననీ, చర్యల్నీ, బాగా స్టడీ చేసినట్టు లీనమై సమర్ధవంతంగా పాత్ర పోషణ చేశాడు. అతడికి రోమాంటిక్ గా గడిపే అవకాశమే ఎక్కడా లేదు. జీవితమే అలా తయారయ్యింది. క్యారెక్టర్ ఆర్క్, గ్రోత్ నెగెటివ్ గా వుండడం అనుభవాల్లోంచే వచ్చింది. అమాయకంగా వున్నపుడు మొదటి అమ్మాయి మోసం చేసిందని సోమరిగా మారిపోవడం, రెండో అమ్మాయి మీద అదుపు కోసం మగ దురహంకారాన్ని పెంచుకోవడం, ఈమె కూడా మోసం చేసిందనుకుని కన్నింగ్ గా మారిపోయి ఇతర అమ్మాయిల్ని మోసం చేయడం, క్రిమినల్ గా మారడం...ఈ దశలన్నీ కథ నడపడానికి పాత్రకి తోడ్పడ్డాయి. 


          ఒకమ్మాయిని మోసం చేయాలనుకుని ఆమె ఉంగరం లాగేసుకున్నప్పుడు, ఆ ఉంగరం ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ అధికారి గిఫ్ట్ గా ఇచ్చిందని తెలుసుకుని, అతడి భార్య దగ్గరి కెళ్ళి పోయి ఉంగరమిచ్చి విషయం చెప్తాడు. ఆమె ఆ ఉంగరంతో భర్తని నిలదీయకుండా, భర్త ద్రోహానికి తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడడం వసంత్ కి ఇంకో పాపభారంగా మారిపోతుంది. ఉంగరం కొట్టేసిన వాడు కొట్టేసినట్టు వుండక, ఇంకేదో ఉపకారం చేసి మంచి వాడు అన్పించుకోవాలన్న కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీతో పాపిగా మారిపోయాడు. మొదటి పాపభారం రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర డబ్బు కొట్టేసినప్పుడు చుట్టుకుంది. చివరికీ పాత్ర ఎక్కడికి చేరింది? ఐటీ కల్చర్ నుంచి దర్గాకి చేరింది...ఖవ్వాలీ పాటతో కొత్త జీవితం దొరికింది. ఇలా కథానుగతమైన మెటఫర్స్ తో సాగే పాత్రలో వసంత్ కిది ‘బిచ్చగాడు’ లాంటి మూవీ. 

 హీరోయిన్ ఆండ్రియాది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. కట్టుకున్న వాడు గే అని తెలిశాక, అతడి పరువు తీయకుండా, తనే బిచ్ అన్పించుకుని విడాకులతో బయటపడి, సింగిల్ మదర్ గా జీవించే, స్కర్ట్స్ లోకి మారిపోయి, స్మోక్ చేసే జీవన శైలిని తెచ్చి పెట్టుకుని, అర్ధంకాని అమ్మాయిగా - కన్న తల్లి చేత కూడా బిచ్ అన్పించుకుని - ఒక వైపు బికారీ హీరోతో, ఇంకోవైపు సెక్సాకలి బాస్ తో సతమతమవుతూ - అదే కల్చర్ తో వాళ్లిద్దరి తాట తీసే సంఘర్షణాత్మక పాత్రల్లో కదిలిస్తుంది. 

          ఇక అమెరికా వెళ్లి మోసపోయే అంజలిది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. డబ్బు సాయం చేసిన బాయ్ ఫ్రెండ్ కే  మొండిచెయ్యి చూపించి, అమెరికాలో ఇంకొకడ్ని చూసుకుంటే ఏం జరగాలో అదే జరిగి, ఎక్కడికి రావాలో అక్కడికే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చాక హీరోతో గమ్మత్తైన సన్నివేశంలో వుంటుంది. ఇలా రెండు మూడు సీన్స్ లో కన్పించే అంజలి ఆ సీన్స్ ని నిలబెట్టింది.  

          సీన్స్ తారామణి ఏరియాని దాటిపోవు. ఆ నేటివిటీని కథలో భాగం చేశాడు. ఎత్తైన అపార్ట్ మెంట్స్, ఫ్లై ఓవర్లు, రైల్వే ట్రాకులూ వీటిని ప్రధానంగా ఫోకస్ చేశాడు. థేనీ ఈశ్వర్ కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. యువన్ శంకర్ రాజా ఈ నియో రియలిజంకి తన స్వరాలతో సొబగులద్దాడు. ముఖ్యంగా ‘హేయ్ ఇక చాలు చాలు ఆటలే’ పాట కథకి బాగా కుదిరింది.

చివరికేమిటి
  ఐటీ - కార్పొరేట్ ప్రేమల్ని సూక్ష స్థాయిలో చూసి మైక్రో లెవెల్లో కథ చేయడం వల్లే ‘తారామణి’ లో ఇంత ఆకర్షణ కన్పిస్తుంది. చూడని, వున్నాకూడా సినిమాల్లో చూపెట్టని,  కొత్త ప్రేమ లోకాలని చూపించాడు. ఆలోచింపజేసే ప్రయత్నం చేశాడు. ప్రేమల్ని తీసికెళ్ళి కెరీర్ తో వుండే కల్చర్ కి తాకట్టు పెట్టొద్దని హెచ్చరికగా దీన్ని తీశాడు. ఐతే ఈ హెచ్చరిక ప్రేక్షకులు ఫీలయ్యేట్టుగా చేశాడు గానీ, చివరికి పాత్రలు ఫీలయ్యేట్టు చేయలేకపోయాడు. జడ వేసుకుంటే ఆఫీసు కల్చర్ ఒప్పుకోనప్పుడు భౌతిక రూపంలో ఆ కల్చర్లో వుండొచ్చు, మానసిక రూపంలో ఆ కల్చర్ వల్లే ప్రేమల్లో చిక్కులు వస్తున్నాయి. ఇది పాత్రలు గుర్తించినట్టు ముగింపు నిచ్చి వుండాల్సింది.

          ఎంత రియలిస్టిక్ అయినా, ఎంత సీరియస్ అయినా, దీంతో ఎక్కడా డార్క్ మూడ్ క్రియేట్ చేయడమో, డార్క్ మూవీగా తీయడమో చేయలేదు. ఒక తెలివైన పని చేశాడు. ఎంత సేపూ రెండు మూడు పాత్రల మధ్య సంఘర్షణతో బరువెక్కినప్పుడల్లా, వాయిసోవర్లు వేసి నవ్విస్తూ పోయాడు. వసంత్, ఆండ్రియాలు తిట్టుకుని, ఘర్షణ పడి, అతడ్ని ఆమె బయటికి తోసి పారేసి తలుపపేసుకున్నప్పుడు చాలా విషాదమావరిస్తుంది. దీన్ని తేలిక బరుస్తూ ఇలా ఫన్నీగా వాయిసోవర్ వేశాడు...

          ‘ఎత్తైన ఈ భవనాల్లోంచి విన్పించే అల్లర్లు, ఆర్తనాదాలూ కేవలం ఈ వొక్క సాఫ్ట్ వేర్ జీవితాల్లోనే కాదు, ఆయా బిల్డింగుల కోసం ఏంతో శ్రమించే సామాన్య కార్మిక కుటుంబాల్లోనూ, వీళ్ళందరికీ వినోదాన్నందించే సినిమా వాళ్ళ జీవితాల్లోనూ, ఏంతో  కష్టపడి తీసిన సినిమాని రెండు గంటల్లో రివ్యూలు రాసేసే రివ్యూ రైటర్ల జీవితాల్లోనూ, ఆ రివ్యూలతో ఏ సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల జీవితాల్లోనూ నిత్యం జరుగుతూంటాయి. అలాటి ఓ చిన్న సంఘర్షణ మన తారామణిలో జరిగింది...’

          ఇలాగే రిలీఫ్ అవసరమైనప్పుడల్లా మరికొన్ని వాయిసోవర్లతో నవ్వించాడు... పెద్ద నోట్ల రద్దు మీద, చెన్నైలో చెరువుల్ని కబ్జాలు చేసి కడుతున్న బిల్డింగుల మీద, తరిగిపోతున్న వ్యవసాయం మీద, ఎలాటి మగాడైనా ఆడదాన్ని ఒకేలా పురుగులా చూసే దుర్బుద్ధి పైనా...సెటైర్లు వేశాడు. ఇది నియో రియాలిజం టెక్నిక్కే.  

          2013 లో ప్రారంభించి 2017 లో విడుదల చేశాడు. ఇంకా ఆలస్యం చేస్తూ తెలుగులో డబ్బింగ్ అయింది. ఎప్పుడో హిందీలో రాజ్ కుమార్ సంతోషీ, తమిళంలో బాలూ మహేంద్రల దగ్గర పనిచేసిన దర్శకుడు రామ్, కాలం చెల్లిన ఓల్డ్ ఫ్యాషన్ దర్శ కత్వం చేయకుండా, కొత్త దర్శకుల్ని తలదన్నే కంటెంట్ తో, టెక్నిక్ తో రంగంలో వుండడం ప్రత్యేకత. తమిళంలో ప్రశంసలతో బాటు బాక్సాఫీసు విజయం కూడా సాధించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచుల రీత్యా దీని కమర్షియల్ విజయమెలా వున్నా, కథా ప్రయోజనం దృష్ట్యా దీనికి 3/5 రేటింగ్ ఇవ్వాల్సి వుంటుంది.

సికిందర్

Monday, September 9, 2019

870 : సందేహాలు - సమాధానాలు


Q: మీ వ్యాసాలు చూస్తూంటే నేను సినిమాలు తీయగలనా అన్పిస్తోంది. మేము మా పద్ధతిలో రాసుకుంటూ తీస్తూ పోయాం. ఇప్పుడు మీరు చెప్పే స్ట్రక్చర్ విధానంలోకి మారాలంటే అది అర్ధం కావాలిగా. ఏం చేయమంటారు?  
సీనియర్ దర్శకుడు
A: ఇంతకాలం అలవాటైన మీ పద్ధతిలోనే వెళ్ళడం బెటర్ సార్. పది సినిమాలు తీసిన ఒక సీనియర్ దర్శకులున్నారు. అనుకోకుండా ఆయనతో కథ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఆయన స్ట్రక్చర్ గురించి కొత్తగా తెలుసుకున్నారు. అప్పటివరకూ తీసిన సినిమాలు రచయితలు ఎలా రాసిస్తే అలా తీస్తూ పోయానన్నారు. ఇప్పుడు అజ్ఞానం వీడిందన్నారు. ఆ తర్వాత ఇంకో రెండు సినిమాలు స్ట్రక్చర్ తోనే  చేశారు. అవెలా తీస్తే ఫలితాలెలా వచ్చాయన్నది వేరే చర్చ. స్ట్రక్చర్ కి ట్రెండ్ లో వున్న కథలతోబాటు, స్టయిల్ జత పడాలిగా. వీటితో అప్డేట్ అవకపోతే స్ట్రక్చర్ తో తీసీ లాభముండదు. స్ట్రక్చర్ లో వున్నంత విజ్ఞానం, సృజనాత్మకత మరే ప్రత్యామ్నాయ వ్యాపకంలో లేవు. ప్రపంచంలో స్క్రీన్ ప్లే వ్యాసాలు స్ట్రక్చర్ ఆధారంగానే వస్తాయి. అదీ ఒక్క హాలీవుడ్ నుంచే వస్తాయి. స్ట్రక్చర్ అర్ధంగాకపోవడ మంటూ వుండదు, కాకపోతే అర్ధంజేసుకోవడానికి  మనసొప్పాలి. ఇది గనుక మీకు సాధ్యమైతే స్ట్రక్చర్ మీకు స్వాగతం పలుకుతుంది. లేదంటే మీరుప్పుడున్న పద్ధతిలోనే కొనసాగడం బెటర్. మీరు సీనియర్లు, మీకు ఇంతకంటే చెప్పకూడదు.

 
Q: సాహో స్క్రీన్ ప్లే సంగతులు బావుంది. ఇక్కడ మీకొక మూవీ గురించి గుర్తు చేయాలి. అది హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’. దీంట్లో కూడా చివర్లో -  ఇది నా పర్సనల్ రివెంజ్, మా అన్నని నువ్వు చంపావ్ - అని చెప్పి విలన్ని చంపేస్తాడు. దీంట్లో కూడా దాదాపు మొదటి నుంచీ  హృతిక్ ని ఒక దొంగలా చూపిస్తూ, తర్వాత తను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అని చెప్పిస్తారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
రవి, AD

A: ‘బ్యాంగ్ బ్యాంగ్’ అప్పట్లో చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దృశ్యాలు చూస్తే నిజమే...రివెంజి డ్రామాని రివెంజి డ్రామాలా అన్పించకుండా అలా కవర్ చేశారు. ఐతే ఇది హాలీవుడ్ ‘డే అండ్ నైట్’ కి రీమేక్ అని గుర్తుంచుకోవాలి. కనుక ఇది హాలీవుడ్ వాళ్ళ టెక్నిక్. దీన్నే ‘సాహో’  స్క్రీన్ ప్లే సంగతులులో  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కౌబాయ్ మూవీ ఉదాహరణగా తీసుకుని చెప్పాం. ఇక ‘సాహో’ స్క్రీన్ ప్లే సంగతుల్లోనే,  ప్రభాస్ పాత్ర ముందు నుంచీ ఇతర పాత్రలకి కాక, ప్రేక్షకులకి దొంగలా తెలిసేలా వుండాలనీ; చివర్లో ప్రేక్షకులకీ, ఇతర పాత్రలకీ తను ఫలానా అని రివీలవ్వాలని  సూచించినట్టు గానే.... ‘బ్యాంగ్ బ్యాంగ్’ లో కూడా హృతిక్ ని మొదట్నుంచీ దొంగలా చూపించి,  చివర్లో ఏజెంట్ అని రివీల్ చేసే కథనం వుండడం కేవలం కాకతాళీయం. ఈ సినిమా చూసి వుంటే దీన్ని ఉదాహరణగా పేర్కోడానికి మనకేమీ అభ్యంతరమేమీ లేదు. పైగా వాదనకి బలం కూడా.

Q: మీరు రాసిన ‘సాహో’ స్క్రీన్ ప్లే సంగతులు చాలా క్లిష్టంగా వుంది, ఇంతకంటే సింప్లిఫై చేసి చెప్పలేరా? అంటే దీన్నుంచి స్ఫూర్తి పొంది నేను కూడా ఇలానే తీయాలని కాదు, ఎలా తీయకూదదో తెలియడానికి.
విజయ్ (పేరు మార్పు), వర్ధమాన దర్శకుడు 

A: లెక్కలేనన్ని  చిక్కు ముళ్ళు వేసి వుంటే ఇంకెలా విడదీసి చెప్పగలం. మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్, కన్ఫ్యూజ్ చేసే ప్లాట్ పాయింట్స్, ఇంటర్వెల్ టర్నింగ్, ఇంటర్వెల్లోనే ట్విస్టు, దాంతో స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా ఫ్రాక్చర్ర్, దీంతో సెకండాఫ్ సిండ్రోం, కాసేపు క్యారెక్టర్ పోలీసు అని, కాసేపు దొంగ అని, కాసేపు మాఫియా వారసుడనీ...ఇక డజను మంది విలన్సు, వాళ్ళ కన్ఫ్యూజింగ్ గోల్స్ , అడుక్కో ట్విస్టు, అర్ధంగాని సంఘటనలు...ఇంత గజిబిజీగా వుంటే, ఎలా దీన్ని సాపు చేసి సరళంగా రాయగలం. ఈ గజిబిజినంతా కూడా వివరించాల్సి వుంటుంది. చివరికి దర్శకుడేమో - ఈ సినిమా ద్వారా ఇంటలిజెన్స్ తగ్గించుకుని, ప్రతీ విషయం ఒలిచి చెప్పాలని తెలుసు కున్నట్టు స్టేట్ మెంట్. మళ్ళీ ఇది కూడా తప్పే. ప్రతీ విషయం ఒలిచి చెప్పడమేమిటి, సినిమా అంటే స్పష్టంగా అర్ధమై పోయే క్లుప్తత.  ప్రేక్షకులకి స్పూన్  ఫీడింగ్ కాదు, వాళ్ళెప్పుడూ నాల్గడుగులు ముందే వుంటారు. విషయం సూటిగా, స్పష్టంగా వుంటే వొలిచి చెప్పాల్సిన అవసరమే వుండదు. ఒలిచి చెప్పాలనుకుంటున్నారంటే, కథతో కన్ఫ్యూజన్ వున్నట్టే. ఇక మీ చివరి వ్యాఖ్య - ఎలా తీయకూడతో కూడా రాశాం. మరోసారి చదవండి.

Q:  మీకో అభ్యర్ధన. ప్రతీ జానర్ నుంచీ ఒక క్లాసిక్ మూవీ విశ్లేషణ మొదలుపెట్టి, ఇంకా ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఆపెయ్యండి. ఇప్పటికే ప్రతీసారీ చదివీ చదివీ విసిగిపోయాం. ఇకపోతే, ఇంకో ఐదేళ్ళ తర్వాత తెలుగు సినిమా కథలు ఎలా మారవచ్చు, ప్రేక్షకులకి ఎలాటి కథలు చెప్పగలం, ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా మారుతుంది చెప్పగలరు.
వీఆర్, AD

 
A:  స్క్రీన్ ప్లే సంగతులు ఆపేస్తున్నట్టు గత సంవత్సరం మార్చిలోనే ప్రకటించాం. కానీ ఒక వెబ్సైట్ కి రాయాల్సి రావడంతో కంటిన్యూ చేయాల్సి వస్తోంది. విసుగేస్తే చదవకూడదు. విసుగన్పించకుండా రాయడం మనపని. ఎదురు చూసే కళ్ళు చాలా వున్నాయి ఫీల్డులోనే. అయితే ఇక్కడ కేవలం విసుగొచ్చి చదవడం మానెయ్యడం వేరు, విషయం మీద పూర్తి అవగాహనేర్పడి చదవడం మానెయ్యడం వేరు. రెండోదైతే బెటరే. కానీ ఎన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాస్తూ పోయినా, వాటిని బట్టి వచ్చే సినిమాలని స్వయంగా విశ్లేషించుకునే అవగాహనే చాలా మంది కేర్పడడం లేదు. ప్రతీ సినిమాకీ మళ్ళీ స్క్రీన్ ప్లే సంగతులు చదివే తెలుసుకో వాలనుకుంటారు. ఏం చేయగలం.

          ఇక జానర్ స్పెసిఫిక్ సినిమాల విశ్లేషణ గురించి. ఇదో మహా సముద్రం. ఒక్కో జానర్ కి పదేసి సబ్ జానర్లుంటాయి. 24 జానర్లుంటే 127 సబ్ జానర్లున్నాయి. మళ్ళీ ఇందులో హైబ్రిడ్ వున్నాయి. అంటే రెండు మూడు జానర్ల, సబ్ జానర్ల సంకరం. ఐతే తెలుగులో తీసేది రెండు మూడు జానర్లే  అయినప్పుడు అన్ని జానర్లూ తెలుసుకుని ఉపయోగం లేదు. తీసే రెండు మూడు జానర్లు వాటి జానర్ మర్యాదలతో తీస్తే చాలు. 2016 లో హిట్టయిన తొమ్మిది  పది సినిమాలూ జానర్ మర్యాదలతోనే వుండడం గమనార్హం. ఇదేదో తెలిసి చేసింది కాదు, యాక్సిడెంటల్ గా అలా వచ్చేశాయి. మళ్ళీ తర్వాతి సంవత్సరాల్లో హిట్టయినవి జానర్ మర్యాదలతో లేవు. ఫ్లాపయిన వాటికి మానమర్యాదలే లేవు. తెలుగులో అప్పుడప్పుడు తీస్తున్న టెన్త్ క్లాస్, బోయ్ లాంటి కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ సినిమాలున్నాయి. వీటి జానర్ మాన మర్యాదలేమిటో తెలుసుకోవడం అవసరమన్పించి ఈ వారం ఒక ఆర్టికల్ ని ప్లాన్ చేశాం.

          ఇక వచ్చే ఐదేళ్ళ తర్వాత తెలుగు సినిమాల కథల సంగతి. గత ఇరవై ఏళ్లుగా ఏమైనా మారాయా?  అవే లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలు, వీటి చట్రంలోనే రూపొందించుకున్నఅవే మూస యాక్షన్ కామెడీలూ. ఏమైనా మారాయా? ప్రేక్షకులే మారారు. మేకర్లు మారే ప్రసక్తే లేదు. మారిన ప్రేక్షకులకి బలవంతంగా అవే సినిమాలు అంటగడుతున్నారు. ఎందుకని? మేకర్లకి ఇవే తెలుసు గనుక. తాము చూస్తూ పెరిగినవి లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలనే రంగుల రాట్నమే గనుక. ఏమైనా అంటే పనికిరాని వరల్డ్ మూవీస్ చూసి వుంటారు. చూదాల్సినవి చూసి స్టడీ చేయకుండా షార్ట్ కట్స్ లో సాగిపోదామనుకుంటున్నారు.

          ఐతే గత కొన్ని వారాలుగా గమనిస్తే ప్రేక్షకులు మారారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తున్నారు. గ్లోబల్ గానే  రోమాన్సుకి, యాక్షన్ కీ ఆదరణ 2017 లోనే తగ్గిందని తాజా రిపోర్టు వచ్చింది. 1998 - 2017 మధ్య ఈ రెండు జానర్లదే రాజ్యమని రిపోర్టు పేర్కొంది. ఈ విధంగా మన దగ్గర వారం వారం ప్రేమ సినిమాలకి వుండని మాస్ ప్రేక్షకులు కూడా, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎగబడి చూస్తున్నారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా ప్రశ్నే కాదు. ఇలా రోమాంటిక్ కామెడీల బెడద వదలవచ్చు. కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ కి మేకర్లు ఎక్కడ్నించి రావాలి? అదే లైటర్ వీన్ రంగుల రాట్నాలు చూస్తూ, అవే షార్ట్ ఫిలిమ్స్ గా తీస్తూ, తెలుగు సినిమాలంటే ఇవేనంటూ పెరిగిన వాళ్ళే. వీళ్లిప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ ని కూడా తాము చూసిన రంగుల రాట్నాల్లాగే తీసే యగలరు. ఇప్పుడు కొత్తగా ‘దర్పణం’ అనే మర్డర్ మిస్టరీ ఇలాగే వుంది. కాకపోతే హార్రర్ కామెడీలు కూడా చూస్తూ పెరగడం వల్లనేమో, మర్డర్ మిస్టరీలో దెయ్యం చప్పుళ్ళు మోగించాడు.  


          ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతూ వుంటుంది. దీనికి తగ్గట్టుగా హీరోలు, నిర్మాతలు డ్రైవింగ్ లైసెన్సు లిస్తేనే ఎవరైనా తెలుగు సినిమాలకి తాజాదనాన్ని తీసుకు రాగలిగేది. ప్రేక్షకులకీ, సమర్ధులైన మేకర్లకీ మధ్య  డ్రైవింగ్ లైసెన్సులే అడ్డంకిగా వుంటే ఎవరేం చేస్తారు. రాబోయే ఐదేళ్ళలో కాదు, ఎప్పుడైనా ఈ డ్రైవింగ్ లైసెన్సుల జారీని బట్టే  సినిమాలుంటాయి. ప్రేక్షకులు మైండ్ సెట్టులు మార్చుకుని కూర్చుంటే, మైక్ సెట్లు వినడమే తప్ప, వినసొంపుగా పులకించిపోయేదేమీ వుండదు. పై నుంచి డ్రైవింగ్ లైసెన్సులు రావాలి.
సికిందర్

Thursday, September 5, 2019

869 : స్క్రీన్ ప్లే సంగతులు



       
        ఖరికి 350 కోట్ల అతి ఖరీదైన నాలుగు భాషల పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ని కూడా, అదే లోకల్ తెలుగు లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా (ఎల్పీ ఎఫ్) చట్రంలో పెట్టేశారు!  పాన్ ఇండియా అన్నాక గ్లోబల్ స్క్రిప్టు వుండాలని ఆలోచించలేదు. గత ఇరవై ఏళ్లుగా ఈ ఎల్పీఎఫ్ చట్రమే తెలుగు సినిమాలకి  ఎన్నోసార్లు చుక్కలు చూపించింది...ఏ తెలుగు సినిమా తలపెట్టినా దాని జానర్ ని పట్టించుకోకుండా ఏనాటిదో లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా చట్రంలో చుట్టేయడమే. అప్పట్లో ఏ కథ చేస్తున్నారంటే, ‘లైటర్ వీన్’ అనడం ఫ్యాషన్ గా మారింది. ఈ ఎల్పీ ఎఫ్ సినిమాలే  చూస్తూ పెరిగిన తరం కూడా అవే తీస్తూ, ఏ కథ చేస్తున్నారంటే, ‘రోమ్ కాం’ అని మరింత ఫ్యాషనబుల్ గా అనడం మొదలెట్టారు. ఏవి చూస్తూ పెరిగితే అవే తీస్తారు. ఇంకాస్తా పోయాక వరల్డ్ మూవీస్ మీద మోజు కూడా పెంచుకున్నారు కాబట్టి, వాటినీ ఎల్పీఎఫ్ తో కలిపి తీసేస్తారు. ఇవి తప్ప ఇంకో ప్రపంచం, సొంత ప్రతిభ లేనట్టే వుంటుంది. 2000 - 2005 మధ్యకాలంలో వేలం వెర్రిగా వచ్చిపడ్డ  ఎల్పీ ఎఫ్ సినిమాల ప్రభావంతో  ఇంకా అదే చట్రంలో స్టార్ సినిమాలు కూడా తీస్తూ, ఇంకా చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలూ తీస్తూ, ఇప్పటికీ 90 శాతం అట్టర్ ఫ్లాపుల జాబితాని విజయవంతంగా నిలబెట్టుకుంటున్నారు. 

         
‘సాహో’ – ‘లార్గో వించ్’ కాపీ అంటూ హల్చల్ చేయడం అనవసరం. గాడ్ ఫాదర్ ని బైబిల్ లా పెట్టుకుని 100 సినిమాలు తీశారు. హమ్ ఆప్కే హై కౌన్ ని రాజ్యాంగంలా పెట్టుకుని 200 సినిమాలు తీశారు. సమరసింహా రెడ్డిని భగవద్గీతలా కళ్ళకద్దుకుని 300 సినిమాలు తీశారు. అంతర్జాతీయ మీడియా 1.5 రేటింగులిచ్చిన లార్గో వించ్ అనే వరల్డ్ మూవీని తీసుకుని, తెలుగులో ఓ రెండు తీస్తే కొంపలేం మునిగిపోవు.
    

         
కొంపలు మునిగింది తీసిన విధానంతో. ఇది లేజర్ స్కానింగ్ లో బయటపడే విషయం. ఆఖరికి ఈ ఎల్పీ ఎఫ్ చట్రంలో ప్రసిద్ధ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ దర్శకుడు కూడా ‘విజయం’ (2003) అనే  రోమాంటిక్ కామెడీ తీసి దెబ్బతిన్నారు. ఎల్పీ ఎఫ్ చట్రంలో కథనేది వుండదు, కాలక్షేపమే వుంటుంది. కాలక్షేపం సాగి సాగి, సినిమా చివర ఎక్కడో పిసరంత కథ వుండి చప్పున ముగిసిపోతుంది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటాం. స్ట్రక్చర్ అంటే గిట్టని వాళ్లకి ఈ సాంకేతికం తెలిసే అవకాశం లేదు. దీంతో పరాకాష్టకి పోయి షాకింగ్ గా ఇప్పుడు చేసిందేమిటంటే, ‘సాహో’ లాంటి భారీ మాఫియా పోరాటాల కథకి కూడా దీంతోనే పాల్పడ్డం! పిట్ట ప్రాణాన్ని గరుత్మంతుడులో పోయాలనుకోవడం!

          ఈ పిట్ట ప్రాణం ఎక్కడిది? 2014 లో దర్శకుడి తొలిప్రయత్నం ‘రన్ రాజా రన్’ లోనిదే. ఇందులో వాడిన ఎల్పీ ఎఫ్ చట్రంలోనే ‘లార్గో వించ్’ ని దింపితే,  అదికాస్తా ‘సాహో’ అనే శాండ్ విచ్ గా తయారయ్యింది - స్టఫ్ లేని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో.

          ‘సాహో’ కేవలం భారీ యాక్షన్ థ్రిల్లరేనా? కాదు, ఇంత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ తలపెడితే  హై కాన్సెప్ట్ మూవీస్ వర్గంలో చేరుతుంది. హై కాన్సెప్ట్ జానర్ మర్యాదలు ఒనగూడుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మురగదాస్ సాధారణ సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’ కథకి, క్లయిమాక్స్ లో హై కాన్సెప్ట్ జానర్ దృశ్యాలు అతికించినట్టు, సుజీత్ హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి లో
- కాన్సెప్ట్ కథనం చేశాడు, అదీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో. ‘రన్ రాజా రన్’ మిడిల్ మటాష్ తో ఆడిందంటే తెలిసో తెలీకో సీన్ రివర్సల్ టెక్నిక్ తో కథనం చేయడం వల్ల. ‘సాహో’ లో మిడిల్ మటాష్ కి ఈ టెక్నిక్ బదులు, ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం చేశాడు. ఇది బెడిసి కొట్టింది. 

బిగినింగ్ కథనం ?
      వాజీ ఆనే కాల్పనిక నగరంలో పృథ్వీ రాజ్ అనే అతను అండర్ వరల్డ్ సామ్రాజ్యాధిపతి. ఇతను కొడుకు దేవరాజ్ ని వారసుడుగా చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్ కి పోటీగా పృథ్వీ రాజ్ చేరదీసిన నరాంతక్ రాయ్, ఇంకో క్రైం సిండికేట్ నడుపుతూంటాడు. దీంతో పృథ్వీరాజ్ కొడుకు దేవరాజ్, రాయ్ మీద పగ పెంచుకుంటాడు. రాయ్ ముంబాయి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఇంకోచోట రెండు లక్షల కోట్లతో వస్తున్న నౌక సముద్రంలో పేలిపోతుంది. ఇప్పుడు రాయ్ కొడుకు విశ్వాంక్ క్రైం సిండికేట్ ని చేపట్టి, పోయిన రెండు లక్షల కోట్లని రెండు వారాల్లో తెస్తానని, అలాగే తండ్రిని చంపిన వాళ్ళని పట్టుకుని శిక్షిస్తాననీ శపథం చేస్తాడు

         
ఇంతలో ముంబాయిలో వేరే రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. కేసుని ఛేదించడానికి అండర్ కవర్ పోలీసుగా అశోక్ చక్రవర్తి (హీరో) వస్తాడు. ఇతడికి సాయంగా క్రైం బ్రాంచ్ పోలీసు అమృత (హీరోయిన్) వస్తుంది. చక్రవర్తి ఈమెతో  ప్రేమలో పడి ఈమె ప్రేమ పొందేందుకు వెంటబడుతూంటాడు. వీళ్ళ దర్యాప్తులో ఒక వ్యక్తి అనుమానితుడిగా దృష్టికొస్తాడు. అతడి దగ్గర కూపీ లాగితే, ఒక బ్లాక్ బాక్స్ వుందనీ, అది చిక్కితే రెండు లక్షల కోట్లు సొంతమవుతాయనీ తెలుస్తుంది.

         
బ్లాక్ బాక్స్ కోసం విశ్వాంక్ దగ్గర పని చేసే లీగల్ అడ్వైజర్ కల్కి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడి జరుగుతుంది. ఇంతలో అశోక్ చక్రవర్తి పోలీస్ అండర్ కవర్ కాదనీ, అతను దొంగ అనీ, రెండు వేల కోట్లు అతనే కొట్టేశాడనీ, అసలు అశోక్ చక్రవర్తి అనుమానిత వ్యక్తే ననీ, అతను పోలీసు అనీ, పోలీసులకి తెలుస్తుంది.
         
ఇప్పుడు అశోక్ చక్రవర్తిగా నటిస్తున్న హీరో, బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకుని తన పేరు సాహో అని చెప్పి పారిపోతాడు. విశ్రాంతి.

బిగినింగ్ కథనం కంటిన్యూ
         పైన చెప్పుకున్న ఫస్టాఫ్ 50 నిమిషంలో, బ్లాక్ బాక్స్ అనే క్లూతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, బిగినింగ్ ముగిశాక, సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ ఏమిటి? ఇక బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకునే సంఘర్షణతో కథపుట్టి, ప్రారంభమయ్యాక, మిడిల్లో పడ్డాక, మిడిల్ మలుపుగా విశ్రాంతిలో హీరో తను సాహో అంటూ రివీల్ చేశాక, ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ అనడమేమిటి

         
సాధారణంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయితే ఆ సంగతి ఇంటర్వెల్ కల్లా తెలిసిపోతుంది, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక పోతే. ఇక ప్లాట్ పాయింట్ వన్ సెకండాఫ్ లో ఎక్కడో ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఏర్పడి, అక్కడి ప్లాట్ పాయింట్ టూని ఎండ్ లోకి జరిపేస్తుందని, అక్కడే కథ ప్రారంభమవుతుందని తెలిసిపోతుంది. అంటే ఇంత సేపూ బిగినింగే కథలేకుండా, ఉపోద్ఘాతం రూపంలో హద్దులు దాటి సాగుతుందన్న మాట ముప్పావు వంతు సినిమా వరకూ.

         
అప్పుడు చివరి పావు వంతులో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ తో కథ ప్రారంభమైతే, అంటే మిడిల్ ప్రారంభమైతే, మిగిలిన పావు వంతు సినిమాని అది ఎండ్ విభాగంతో, అంటే క్లయిమాక్స్ తో కలిసి పంచుకోవాలన్న మాట. ఇది పదో, పదిహేనో  నిమిషాలు మాత్రమే వుంటుంది. అంటే రెండు గంటల సినిమాలో దాదాపు సగం, అంటే  గంట పాటు వుండాల్సిన మిడిల్ -  అంటే కథ అనే పదార్ధం - ఇలా కొన్నినిమిషాలకి కుదించుకుపోవడంతో, మిడిల్  అనగా కథ అనే అమృతకలశం మటాష్ అయినట్టు అర్ధం.  

         
పావుగంట అత్తెసరు కథ కోసం గంటన్నర పిప్పి చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇదే ఎల్పీ ఎఫ్ తడాఖా అంటే. లీనియర్ కథలతో పాల్పడే అనౌచిత్యం. అప్పట్లో తేజ ఒక్కరే ప్రేమకథల్ని త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో చేసే వారు. అంటే ఫస్టాఫ్ సగంలో కథ ప్రారంభమై పోయేది. ఆ సినిమాలు బలంగా వుండేవి. ఇతరులంతా మిడిల్ మటాషులే. కథంటే భయపడిపోయే వాళ్ళు. అమ్మో అంత కథా...సరదా సరదాగా అలా అలా నడిపి, క్లయిమాక్స్ లో లవర్స్ కి లైట్ ప్రాబ్లం పెట్టి తీర్చేస్తే చాలనే వాళ్ళే.  ఇదే తర్వాత వివిధ రూపాల్లో స్టార్ సినిమాలకీ  అంటించారు. ఒక సీనియర్ వ్యక్తి  స్టార్ కథ చేస్తూ, అందులో స్టార్ అసలేమీ చేయని అలా అలా సరదాగా సాగిపోయే లైటర్ వీను కథే చేసుకుని, వద్దన్నా ‘సాహో’ తీసిన ఇదే యూవీ క్రియేషన్స్ కెళ్ళి, గోడకి కొట్టిన బంతిలా వెనక్కొచ్చాడు. ఇదే యూవీ క్రియేషన్స్  అదే ఎల్పీ ఎఫ్ బాపతు ‘సాహో’ ని ఎలా ఓకే చేసిందో మరి.

రెగ్యులర్ నాన్ లీనియర్ 
       లీనియర్ కథల మిడిల్ మటాష్ అనౌచిత్యం ఇలావుంటే, ఇక నాన్ లీనియర్ తో కూడా మిడిల్ మటాష్ కి పాల్పడతారని సాహో’ చూశాకే తెలుస్తోందిమామూలుగా రెగ్యులర్ గా వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎలావుంటుందంటేఖైదీ’ నే ఉదాహరణగా తీసుకుంటేప్రారంభంలోనే పోలీసులు అనుమానితుడిగా చిరంజీవిని పట్టుకుంటారుదీంతో మనకి క్లియర్ గా అర్ధమైపోతుంది -  స్క్రీన్ ప్లే బిగింనింగ్ విభాగంతో ప్రారంభం కావడం లేదనీ, చిరంజీవి ఏదో స్ట్రగుల్ తో వున్నాడంటేఆ స్ట్రగుల్ బిజినెస్ తో వుండే మిడిల్ - 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభమైందనీ.

          ఈ
మిడిల్ - 1  కొంత నడిచాక, చిరంజీవి ఇలా స్ట్రగుల్ తో వుండడంలోని పూర్వాపరాల కథనంతో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి స్ట్రగుల్ చేయడానికి తలెత్తిన పరిస్థితులేమిటో తెలుసుకుంటాం. ఇప్పుడు బిగినింగ్ విభాగం బిజినెస్, లేదా ఫ్లాష్ బ్యాక్ ముగిసే చోట, ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడి, చిరంజీవికి గోల్ ఏర్పాటు కావడాన్ని చూస్తాం. ఇక్కడ్నించీ తిరిగి ముందాపిన మిడిల్ -1 బిజినెస్ కొచ్చి, అక్కడ్నించీ మిడిల్ -2 బిజినెస్ ని లేదా తీవ్రతరమైన స్ట్రగుల్ ని చూస్తాం. దీని చివర కొచ్చి ప్లాట్ పాయింట్ -2 చూసి, ఇక ఎండ్ విభాగంలో కెళ్ళిపోతాం.

         
ఇదీ సర్వ సాధారణంగా వుండే రెగ్యులర్ నాన్ లీనియర్ కథనపు ఏర్పాటు.  మిడిల్ -1, బిగినింగ్, మిడిల్ -2, ఎండ్, ఇంతే. రెగ్యులర్ నాన్ లీనియర్ కథనంలో, స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమయిందని పైన చెప్పుకున్న విధంగా వెంటనే తెలిసిపోతుంది. ఇందులో మిడిల్ మటాష్ అవదు. అది స్క్రీన్ ప్లేలో వుండాల్సిన సగభాగమూ వుంటుంది

నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ 
      ఇక రెండోది, నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ కథనం వుంటుంది : దీన్ని ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తాం. వీటిలో మిడిల్ -1 తోనే స్క్రీన్ ప్లే ప్రారంభమైనా, విషయం మనకి తెలీకుండా వుంటుంది. బిగినింగ్ బిజినెస్ లాగే వుంటుంది. దీని ప్లాట్ పాయింట్ -1  కోసం చూస్తూంటే, ఇంటర్వెల్లో బాలకృష్ణ ఇంకో స్వరూపం బయట పడుతుంది. బాలకృష్ణ బాలకృష్ణ కాదనీ, వేరే బాలకృష్ణ వున్నాడనీ, వేరే ఫ్యాక్షన్ నేపథ్యముందనీ తెలుసుకుంటాం. దీంతో ఫస్టాఫ్ లో చూసిందంతా అసలు బిగినింగ్ కాదనీ, మిడిల్ -1 అనీ ఇప్పుడు తెలుసుకుంటాం. ఎందుకంటే ప్లాట్ పాయింట్ -1 రావాల్సిన చోట ఇంటర్వెల్లో బిగినింగ్ ప్రారంభమైంది కాబట్టి.

         
అంటే బాలకృష్ణ అసలెవరో తెలుసుకునే పూర్వపరాల బిజినెస్ తో ఇప్పుడు బిగినింగ్ వచ్చింది. దీంతో  సెకండాఫ్ ప్రారంభంకాగానే బాలకృష్ణ  రాయలసీమ జీవితం, గొడవలు, వూరు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులతో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ ముగియగానే తిరిగి ఇంటర్వెల్లో ఆపిన చోటికొస్తాం. ఇప్పుడు బాలకృష్ణకి వూళ్ళో తలెత్తిన పరిస్థతుల దృష్ట్యా వెంటనే పరిష్కరించాల్సిన గోల్ ఏర్పడి బయల్దేరడంతో, ప్లాట్ పాయింట్ -1 ని చూస్తాం. ఇక్కడ్నించీ మిడిల్ -2 ని చూస్తూ, దాని చివర ప్లాట్ పాయింట్ -2 మీదుగా ఎండ్ వగైరా చూసుకుంటూ వెళ్లి పోతాం.

         
నాన్ రెగ్యులర్  నాన్ లీనియర్ ఏర్పాటులో మిడిల్ -1 , బిగినింగ్, ప్లాట్ పాయింట్ -1, మిడిల్, ఎండ్ - విధంగా కథనం సాగుతుంది. ప్లాట్ పాయింట్ -1 ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక చూస్తాం. ఇలా సాగినప్పటికీ  స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమైనట్టు దృశ్యాలుండవు, బిగినింగ్ దృశ్యాల్లాగే వుండి బిగినింగే చూస్తున్నామ
నుకుంటాం. ఇందులో మిడిల్ మటాష్ అవదు.

సాహోఆవిష్కరణ  
          ఇప్పుడు సాహోవిషయానికొద్దాం. ఎంతో అయోమయంగా వున్నసాహోస్క్రిప్టు లో అసలు కవి (దర్శకుడి) హృదయమేమిటో పట్టుకోవడానికి పైన చెప్పుకున్న నమూనాలు ముందుపెట్టుకుని, నాల్గైదు రోజులాలోచిస్తే గానీ సాధ్యం కాలేదు. ఇలాకూడా స్క్రిప్టులు రాసేస్తారా అని నెత్తిన పిడుగు పడినంత పనైంది. పైన చెప్పుకున్న నమూనా కాని నిరర్ధక నమూనాని ఓం ప్రథమంగా ఆవిష్కరించినందుకు ఏమనాలో తెలియని పరిస్థితి. 

         
సాహోకి పెట్టిన బడ్జెట్ వచ్చేసింది కాబట్టి బంపర్ హిట్టే నంటున్నారు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లే సంగతులు ఇంకోలా రాయాలి బ్రహ్మ రథం పడుతూ. అప్పుడిదీ  కరెక్టు స్క్రీన్ ప్లేనే అనుకుని మరికొన్ని సినిమాలు ఇలాగే తీసేసే ధైర్యం చేస్తారేమో? చేయక పోతే ఇంత హిట్టయి ఎందుకు? ‘బాషా’ ని పట్టుకుని కొన్ని డజన్లు తీశారు, ‘సాహో’ ని ఎందుకు వదలాలి? అయితే ‘సాహో’ దర్శకుడి అపనమ్మకమే దీనికి అడ్డు. ఒక పక్క బంపర్ హిట్టే నంటూ, ఇంకో పక్క దర్శకుడు ఏమంటున్నాడో చూద్దాం... 

          ... తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ,  విమర్శ ఎప్పుడూ తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని, అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో,  వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.
                                   
సాహో’ చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే,అలాగే  తాము పడ్డ కష్టం తెలియాలంటే మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే సాహో’  చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.

         
అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని, సాహో’ సినిమాలో మీరు మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ వివరణ ఇచ్చాడు.                                                                                               తెలుగు రాజ్యం డాట్ కాం

         
ఇదీ విషయం! అంచనాలకు మించి చేరలేదని భావించడం వల్ల... భారీ అంచనాలతో సినిమా చూడడం వల్ల ... నచ్చడం లేదనీ,  మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడాలనీ - ఇలా అన్నికోణాల్లో సినిమా ఎలా వుందో తేల్చేశాడు. దీన్ని ఇంకేం ఫాలో అయి ఇలాగే తీస్తారు.

         
350 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తూంటే, ప్రేక్షకులు కనీసం రెండు టన్నులు భారీగానే  అంచనాలు పెట్టుకోకుండా ఎలా వుంటారు. కంటెంట్ పరంగా తప్పకుండా భారీగానే  అంచనాలు పెట్టుకుంటారు. ఇది గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే అదెలా అయింది చెప్పాలి - గొప్ప స్క్రీన్ ప్లేనే  అయితే, మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే, మరోసారి చూడమనడ మేమిటి. గొప్ప స్క్రీన్ ప్లే అర్ధమవాలంటే రెండు సార్లు చూడాలా? తన బొమ్మ మంచిదైతే, పదేపదే మరొక్క మారు చూసి అర్ధం జేసుకోండని నచ్చ జెప్పుకోవాల్సిన పని లేదు. 

         
మరి ‘సాహో’ లో  ఏ నమూనా వుంది? ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 రావడంతో,  ఇది నాన్ లీనియర్ కథనమన్పించదు. బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరసలో లీనియర్ కథనమే అన్పిస్తుంది. ఈ లీనియర్ కథనంలో ప్లాట్ పాయింట్ -1 వచ్చేసిందంటే, ఇక మిడిల్ మటాష్ వుంటుందని వూహించలేం. ప్లాట్ పాయింట్ -1 వచ్చిందంటే, హీరోకి గోల్ తో, మిడిల్ -1 అంటే, కథ ప్రారంభమైనట్టే. ఇలా హీరో బ్లాక్ బాక్స్ జాడ కనుక్కునే గోల్ తో, ఫస్టాఫ్ లో 50 వ నిమిషంలో కథ ప్రారంభమయ్యాక, దీని కొనసాగింపుగా ఇంటర్వెల్లో ఏం జరగాలి? ఆ గోల్ దెబ్బతినడమో, లేదా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమో జరగాలి. ఇంటర్వెల్లో హీరో బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకోవడంతో రెండోదే జరిగింది. ఇలా ఇంటర్వెల్లో గోల్ నెక్స్ట్ లెవెల్ కెళ్లాక సెకండాఫ్ లో,  అంటే మిడిల్ -2 లో ఏం జరగాలి? ఆ బ్లాక్ బాక్స్ కోసం విలన్లు వెంటపడాలి. ఇదే జరిగింది సినిమాలో.

          అయితే ... అయితే ...ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడమనే టర్నింగ్ మాత్రమే కాదు, హీరో తను అశోక్ చక్రవర్తి కాదనీ, సాహో ననీ ట్విస్టు నివ్వడం కూడా వుంది. దీంతో టర్నింగ్ కంటే మాంచి రేంజిలో వున్న ఈ ట్విస్టు టర్నింగ్ కి చెక్ పెట్టేసింది. హీరో సాహో అనే మాట బిగ్ డిక్లరేషన్. దీని ముందు టర్నింగ్ పాయింటు (బ్లాక్ బాక్స్ చిక్కడం) వెలవెలబోతూ వుంది. ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు టర్నింగ్ పాయింటు మీంచి ఈ ట్విస్టు మీద కేంద్రీకృతమైపోతుంది. బ్లాక్ బాక్స్ సంగత్తర్వాత, ముందు ఈ సాహో అంటున్న హీరో కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠకి లోనవుతారు. ఇది కామన్ సెన్సు. 


           ఈ కామన్ సెన్స్ కాదనుకుని న్యూసెన్స్ చేశారు. బిగ్ డిక్లరేషన్ తో వున్న ట్విస్టుని వదిలేసి, సెకండాఫ్ కథగా బ్లాక్ బాక్స్ చిక్కిన విలువ తగ్గిన - మార్కెట్ వేల్యూ లేని  టర్నింగ్ ని ఎత్తుకున్నారు. దీంతో సెకండాఫ్ సమస్యల్లో పడింది. అంటే ఇంకా కథ ప్రారంభం కాలేదు... మిడిల్ మటాష్ వైపుగా సాగుతోంది. బిగ్ డిక్లరేషన్ అయిన సాహో ఎవరనే దాని మీదికెళ్తే  కదా కథంటూ  ప్రారంభమయ్యేది? ఇందుకే సెకండాఫ్ లో బిగినింగ్ కథనం కంటిన్యూ అనాల్సి వచ్చింది...

          అదేమిటి, ఫస్టాఫ్ లో బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 వచ్చి  మిడిల్ - 1 ప్రారంభమయిందిగా అంటే -ఇలాగే మిస్ లీడ్ చేస్తాయి మిడిల్ మటాషులు. సెకండాఫ్ వస్తే గానీ మిడిల్ మటాష్ అని అర్ధంగాదు. అర్ధమయ్యాక వెనక్కెళ్ళి  మొదట్నించీ  ఏర్పరచుకున్న అవగాహనని సవరించుకోవాలి. ఇప్పుడు అది ప్లాట్ పాయింట్ -1 కాదు. ఇంకా ప్రారంభంకాని కథకి సంబంధించిన పర్యవసానం. ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడం కూడా ఇంకా ప్రారంభం కాని కథకి మిడ్ పాయింట్ కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కాదు, అదింకో పర్యవసానం. అసలు ఫస్టాఫ్ అంతా బిగినింగ్ విభాగం కాదు. పైన చెప్పుకున్న ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా పైకి తెలియని మిడిల్ -1. ఇంటర్వెల్లో బాలకృష్ణ బాలకృష్ణ కాదన్న బిగ్ డిక్లరేషన్ తో బయటపడేలాంటి  మిడిల్ -1. అంతవరకూ బిగినింగ్ లాగే అన్పిస్తుంది.

          ఇంటర్వెల్లో ఏదో ఒక్కటే  పెట్టకుండా టర్నింగ్ పెట్టారు, ట్విస్టు కూడా పెట్టారు. పెట్టినప్పుడు ట్విస్టుతో కథ చెప్పకుండా, టర్నింగ్ కి కథనం చేశారు. ట్విస్టు సుప్రీమ్. టర్నింగ్ కేవలం సిట్యుయేషన్. సిట్యుయేషన్ లోంచి ట్విస్టు పుట్టిందంటే, ఆ ట్విస్టే డామినేట్ చేస్తుంది. బ్లాక్ బాక్సుతో టర్నింగ్ కాదు, అతను సాహో అనే ట్విస్టు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది.

          ఈ ఫస్టాఫ్ కథనంలో చూపించిందంతా నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ (ఫ్యాక్షన్) తో మిడిల్ -1 విభాగం. అయితే ఇంటర్వెల్ నుంచి హీరో సాహో అన్న ట్విస్టుని పక్కనబెట్టి, హీరోకి బ్లాక్ బాక్స్ చిక్కిన టర్నింగ్ లో కథనాన్ని కొనసాగించారు. అంటే సెకండాఫ్ నుంచీ మిడిల్ -2 ఎత్తుకున్నారు. మిడిల్ -1, మిడిల్ -2 పక్కపక్కన ఎలా వుంటుంది? మధ్యలో బిగినింగ్ వుండాలిగా, ఖైదీలో - ఫ్యాక్షన్ లో వున్నట్టు. లేనప్పుడు ఏం కథ చూస్తున్నామో ఏమర్ధమవుతుంది? అందుకే  సాహో ఎవరు, అతడి సమస్య, గోల్ ఏమిటనే బిగినింగ్, దాని ప్లాట్ పాయింట్ -1 లేకపోయేసరికి, (బిగినింగ్ లేని) ఈ మిడిల్ -1.మిడిల్ -2 రెండూ వుండీ కూడా మటాష్ అయిపోయాయి.

          ఎల్పీ ఎఫ్ లో మిడిల్ ఎక్కడో చివర పిసరంత వుండి మటాషై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్పించుకోవడాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు  సాహోలో మిడిల్ వుండీ బిగినింగ్ లేక మిడిల్ మటాష్ అయ్యే అనర్ధాన్ని కొత్తగా చూస్తున్నాం.

సెకండాఫ్ సంగతులు

      సరే, ఫస్టాఫ్ బిగినింగ్ కథనమంటూ పైన చాలా ముందే చెప్పుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ మటాష్ బయటపడ్డాక, అది మిడిల్ -1 అని గుర్తిస్తూ, వెంటనే ఇప్పుడు సెకండాఫ్ లో మిడిల్ -2 కథనమెలా వుందని చూస్తే...  మనకి ఒక్కముక్కా అర్ధంగాలేదన్న కఠోర సత్యాన్ని ఒప్పుకు తీరాలి. నిజంగా సెకండాఫ్ సినిమా మనకేమీ అర్ధం గాలేదు. అర్ధంగావాలంటే దర్శకుడు రెండో సారి చూడమన్నాడు. రెండో సారి చూసి అర్ధంజేసుకోవడానికి  ‘టైటానిక్’  స్క్రీన్ ప్లే పాఠమైతేగా?  

          రావణాసురుడికి ఎన్ని తలకాయలుంటాయో అంతమంది విలన్లు. ఎవరికి ఎవరేమవుతారో, ఎప్పుడే ట్విస్టు పెడతారో అంతుచిక్కదు. ట్విస్టు మీద ట్విస్టులు. ఎవరితో ఎవరు ఎందుకు కలబడుతున్నారో, ఏమి కోరుకుంటున్నారో బుర్రకెక్కదు. బ్లాక్ బాక్సుతో హీరో ఏం చేయాలనుకుంటున్నాడో, అది చెయ్యకుండా ఎందుకు తనమీద దాడులు జరిపించుకుంటూ బిగ్ యాక్షన్ సీన్సు లో పాల్గొంటున్నాడో తెలియదు. ఒక విలన్ బ్లాక్ బాక్సుకి ట్రాకర్ వుందని, అదెక్కడున్నా తెల్సిపోతుందనీ కంప్యూటర్ మీద ఏదో చేస్తాడు. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోతాడు. బ్లాక్ బాక్స్ అనే మాట విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వింటూంటాం. ప్రమాద కారణాలు ఆ బ్లాక్ బాక్సులో డేటా వల్ల తెలుస్తాయి. ఇక్కడ ఏ విమాన ప్రమాదంలోంచి దాన్నెత్తు కొచ్చారో, దాంట్లో రెండు లక్షల కోట్ల రూపాయల రహస్యముందని ఒకటే ఆడుకుంటున్నారు. రెండు లక్షల కోట్ల నగదు ఎవరైనా నిల్వ చేయడం సాధ్యమా, అలా చేస్తే 15 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో వుండే ఇండియాలో ఆ కొరతకి అల్లకల్లోలం మొదలవదా...అన్న ప్రశ్నలు వద్దు. ఉన్న విలన్లు చాలనట్టు, లీగల్ అడ్వైజర్ గా వున్నావిడ ఉన్నట్టుండి ఒక విలన్ని లేప్పారేసి ఇంకో విలనై పోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే పొంతనలేని ట్విస్టు లెన్నో. ఈ ట్విస్టుల వల్ల ఇంటర్వెల్లో ఫ్లాగ్ షిప్ ట్విస్టు  - సాహో ఎవరు? - అన్నది కూడా మార్కెట్ వేల్యూ కోల్పోతోందని స్క్రీన్ ప్లే రచయిత గుర్తించలేదు.

          ఈ పాటికే మనకి సాహో కథ తెలుసుకోవాలన్న ఆసక్తి నశిస్తుంది.  ఎవడైతే ఏంటి, సినిమానే ఐపోతూ వస్తున్నాక. చిట్ట చివరి నిమిషాల్లో సాహో ఫలానా కారు ప్రమాదంలో  చనిపోయిన నరాంతక్ రాయ్ కొడుకని ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు బిగినింగ్ వచ్చిందన్నమాట - మిడిల్ అయిపోయాక!  ఇక ఆ తండ్రి చావుకి పగదీర్చుకోవడానికి హీరో ఏమేం చేశాడో ఆ దృశ్యాలు రీప్లే చేస్తూ మనకి గుర్తు చేయడం. అప్పటికి రెండున్నర గంటలు డస్సి పోయివున్న మనకి, ఈ రీప్లే అదనపు భారం బుర్రకెక్కదు. ఇందుకే ఎండ్ సస్పెన్స్ కథలు వద్దురాబాబూ అని హాలీవుడ్ ఏనాడో మానుకుంది. దీని గురించి ఈ బ్లాగులో వందల సార్లు చెప్పినా ఎండ్ సస్పెన్సు తో సినిమాలు తీస్తూనే వుంటారు. ఇప్పుడు మిడిల్ మటాష్ తో బాటు, ఎండ్ సస్పెన్స్ గండంలో కూడా పడిందన్న మాట. మిడిల్ – 1, మిడిల్ -2 ల తర్వాత బిగినింగ్ వస్తే మిడిల్స్ మటాషవడంతో బాటు, ఎండ్ సస్పెన్స్ అవుతుందని ‘సాహో’ తో తెలుసుకోవచ్చు.

మరేం చేసి వుండాలి?

       ఏం చేయాలో చెప్తే చీకాకు పుట్టొచ్చు. ఎవరి కథలు వాళ్ళే చేసుకోవాలి. ఐతే మిడిల్ -1 కీ, మిడిల్ - 2 కీ మధ్య ఫ్లాష్ బ్యాక్ రూపంలో బిగినింగ్ రావాలని శాస్త్రం చెప్తుంది. ఖైదీ చెప్పింది, ఫ్యాక్షన్ సినిమాలు చెప్పాయి. అందువల్ల - ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ తో వచ్చిన టర్నింగ్ ని సస్పెన్స్ లోపెట్టి, సాహో ట్విస్టుతో సెకండాఫ్ ప్రారంభించాలి. అంటే సాహో ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, దాని తలూకు బిగినింగ్ విభాగం పూర్తి చేయాలి. మాఫియాలతో అతడి రివెంజి గోల్ ఏమిటో రివీల్ చేయాలి. అప్పుడు ఇంటర్వెల్లో సస్పెన్స్ లో పెట్టిన బ్లాక్ బాక్స్ టర్నింగ్ తో మిడిల్ - 2 ని మొదలెట్టుకుని, క్లయిమాక్స్ లో రివెంజి తీర్చుకుని ముగించాలి.

          ఇలా చేస్తే హీరోది తండ్రిని చంపిన రివెంజి కథేనని మధ్యలోనే తెలిసిపోయి ప్రేక్షకులు చప్పరించేస్తారని,  స్క్రీన్ ప్లే రచయిత ఈ బిగినింగ్ ని తీసికెళ్ళి చివర్లో పెట్టుకున్నట్టుంది. దీంతో వరసగా రెండు మిడిళ్ళు ఎందుకోసం జరుగుతున్నాయో రెండున్నర గంటలపాటు అర్ధంగాకుండా పోయింది. మరి రొటీన్ రివెంజి కథని రివెంజి కథ అని తెలియకుండా చేయడమెట్లా?  


          డిస్ క్లెయిమర్ : ఇది కూడా చెప్తే చీకాకు పుట్టొచ్చు. అకిరా కురసావా ‘సెవెన్ సమురాయ్’ తీశాడు. దాని రీమేకుగా హాలీవుడ్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  తీసింది. దీని రీమేకుగా హాలీవుడ్లోనే తాజాగా ఆంటన్ ఫుక్వా, డెంజిల్ వాషింగ్టన్ తో,  రీబూట్ చేసిన  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీశాడు. ఇది బందిపోట్ల బారి నుంచి ఊరుని కాపాడే ఏడుగురు కిరాయి సైనికుల కథ. దీన్నే తీసుకుని హిందీలో ఖోటే సిక్కే, షోలే లాంటివి వచ్చాయి. అయితే కురసావా వొరిజినల్లో, మొదటి హాలీవుడ్ రీమేక్ లో, హీరో పాత్రతో పర్సనల్ టచ్ లేదు. ఊరుని కాపాడే సామాజిక ఎమోషనే వుంటుంది. ఫుక్వా  రీబూట్ చేసి, పర్సనల్ టచ్ ఇచ్చాడు బిగ్ స్టార్ డెంజిల్ వాషింగ్టన్ పాత్రకి. ఎంత యాక్షన్ హీరో అయినా కంట్లో తడి అవసరం.

          కిరాయి సైనికులకి ఓ పని చేపట్టడానికి డబ్బే మోటివ్. ఇంతకంటే కారణం వుండనవసరం లేదు. అలా ఊరుని కాపాడ్డానికొచ్చిన డెంజిల్ వాషింగ్టన్, కథ ముగిసి చివర్లో విలన్ని పట్టుకున్నాక, ‘ఆ నాడు మా అమ్మనీ, చెల్లినీ చంపింది నువ్వే కదరా’ అని ఒక్క  డైలాగుతో ఎమోషనలై లేప్పారేస్తాడు.

          రెప్పపాటులో ఒక ఫ్లాష్ లా వెళ్లి పోతుందీ చివరి బిట్. తనవాళ్ళని విలన్ ఎలా చంపాడూ, ఏం జరిగిందీ అంటూ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చబండ పెట్టుకోలేదు. రొచ్చు అవుతుంది. కేవలం ఒక్క డైలాగే మెరుపులా.

          ఇది మనకి సూటిగా గుచ్చుకుని ఉలిక్కిపడతాం. ఇంత పర్సనల్ బాధని గుండెల్లో దాచుకుని పరోపకారం చేస్తున్నాడా  - అని హీరో పాత్ర ఉన్నతంగా కన్పిస్తుంది. ఇదే వాషింగ్టన్ ని  ఫుక్వా తర్వాత ‘ఈక్వలైజర్ -2’ లో, చివర్లో పర్సనల్ టచ్ తో ఉన్నతమైన వ్యక్తిగా బలంగా రిజిస్టర్ చేస్తాడు. హై కాన్సెప్ట్ కథల్లో హీరో లేదా హీరోయిన్, చిన్న మనసుతో తమ కోసమే బతుకుతూ వుండవు, పెద్ద మనసుతో పరులకోసం కూడా బతుకుతాయి. సాహోసారు ఇలా బతకాల్సింది.  


          అప్పుడు రివెంజి పాయింటు బయటపడకుండా ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఎలా వుండొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇదీ చెప్తే చిర్రెత్త వచ్చు, సినిమా ఎలా తీయాలో చెప్తాడేమిటని.   అప్పుడు  స్ట్రెయిట్ నేరేషన్ అంటే లీనియర్ కథనంతో ఫస్టాఫ్ తో అదే ప్లాట్ పాయింట్ -1 తోనే, తర్వాత ఇంటర్వెల్లో బ్లాక్ బాక్సు తో ఆ టర్నింగ్ తోనే, దాని కథ చేస్తూ  సెకండాఫ్ కెళ్ళాలి. ఇంటర్వెల్లో అతను సాహో అని రివీల్ చేయకూడదు. సాహో అన్న సంగతి, రివెంజి సంగతీ, ఇప్పుడు తనే మాఫియా వారసుడనే సంగతీ, అనూహ్యంగా చిట్టచివర్లో పైన చెప్పుకున్న పుఖ్వా రీబూటింగ్ ప్రకారం – పర్సనల్ టచ్ గా, పనిలో పనిగా మాస్టర్ స్ట్రోక్ గా  డైలాగ్ తో ఇచ్చి వదిలెయ్యాలి.

          మరి కేవలం బ్లాక్ బాక్స్ తో స్ట్రెయిట్ నేరేషన్ కథెలా చెప్పొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్ ని చించి పారెయ్యొచ్చు ఎవడ్రా వీడని... ఫస్టాఫ్ లో హీరో అండర్ కవర్ పోలీసుగా కథనం ఏమైనా బాగుందా? అతను దొంగ అన్న విషయం దాచి పెట్టారు, తర్వాత సాహో అన్న విషయమూ దాచి పెట్టారు. ఇన్ని దాచిపెట్టడాలు బావున్నాయా ఎండ్ సస్పెన్స్ తో? ఇది మర్డర్ మిస్టరీ కాదుగా? యాక్షన్ జానర్ కదా? యాక్షన్ జానర్ కి సీన్ టు సీన్ సస్పెన్స్ వుండాలిగా? దొంగ అన్న సంగతి మూసి పెట్టి, నడపడం వల్ల డ్రామా లేకుండా పోయిందిగా? రెండు వేల కోట్ల దోపిడీ ఇన్వెస్టిగేషన్ అతడితో ఏ డైమెన్షన్ లేకుండా ఫ్లాట్ గా, డల్ గా, యమబోరుగా సాగిందిగా?

          అందుకని, దొంగోడని ప్రేక్షకులకి చెప్పేసి, పాత్రలకి దాచి పెట్టి, తను చేసిన దోపిడీని తనే ఇన్వెస్టిగేట్ చేసే గమ్మత్తైన డైమెన్షన్, డ్రామా, డైనమిక్స్ వగైరాలాతో హుషారెక్కించేలా ఫన్ రైడ్ చేయొచ్చుగా? ఆఫ్టరాల్, హై కాన్సెప్ట్ మూవీ అంటే ఏమిటి? పిల్లల కాడ్నించీ పెద్దల వరకూ అలరించేదేగా? అన్నీ డార్క్ పాత్రలతో వికర్షించేలా ఇంత డార్క్ మూవీయే తీయాలా? హాలీవుడ్ వాడైతే ఆ బ్లాక్ బాక్స్ కి మిథికల్ మహిమ అంటగట్టేసి ఫాంటసీ చేస్తాడు. టెక్నికల్ గా హాలీవుడ్ రేంజిలో తీశామనడం గొప్పా? విషయపరంగా భారతీయత ఏది? హై కాన్సెప్ట్  ‘భారతీయుడు’ లాంటి భారతీయత? అంతర్జాతీయ సమాజం ఇదే చూస్తుంది : టెక్నికల్ గా హాలీ వుడ్ తో సరితూగారు సరే, హాలీవుడ్ కథలే మళ్ళీ మామీద ఎందుకు మోపుతారు, మీ భారతీయ కథేదీ? ఆస్కార్ కూడా ఇదే ప్రశ్న వేస్తుంది...

          హేవ్ ఏ నైస్ టైం, బై!



సికిందర్