రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 9, 2019

870 : సందేహాలు - సమాధానాలు


Q: మీ వ్యాసాలు చూస్తూంటే నేను సినిమాలు తీయగలనా అన్పిస్తోంది. మేము మా పద్ధతిలో రాసుకుంటూ తీస్తూ పోయాం. ఇప్పుడు మీరు చెప్పే స్ట్రక్చర్ విధానంలోకి మారాలంటే అది అర్ధం కావాలిగా. ఏం చేయమంటారు?  
సీనియర్ దర్శకుడు
A: ఇంతకాలం అలవాటైన మీ పద్ధతిలోనే వెళ్ళడం బెటర్ సార్. పది సినిమాలు తీసిన ఒక సీనియర్ దర్శకులున్నారు. అనుకోకుండా ఆయనతో కథ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఆయన స్ట్రక్చర్ గురించి కొత్తగా తెలుసుకున్నారు. అప్పటివరకూ తీసిన సినిమాలు రచయితలు ఎలా రాసిస్తే అలా తీస్తూ పోయానన్నారు. ఇప్పుడు అజ్ఞానం వీడిందన్నారు. ఆ తర్వాత ఇంకో రెండు సినిమాలు స్ట్రక్చర్ తోనే  చేశారు. అవెలా తీస్తే ఫలితాలెలా వచ్చాయన్నది వేరే చర్చ. స్ట్రక్చర్ కి ట్రెండ్ లో వున్న కథలతోబాటు, స్టయిల్ జత పడాలిగా. వీటితో అప్డేట్ అవకపోతే స్ట్రక్చర్ తో తీసీ లాభముండదు. స్ట్రక్చర్ లో వున్నంత విజ్ఞానం, సృజనాత్మకత మరే ప్రత్యామ్నాయ వ్యాపకంలో లేవు. ప్రపంచంలో స్క్రీన్ ప్లే వ్యాసాలు స్ట్రక్చర్ ఆధారంగానే వస్తాయి. అదీ ఒక్క హాలీవుడ్ నుంచే వస్తాయి. స్ట్రక్చర్ అర్ధంగాకపోవడ మంటూ వుండదు, కాకపోతే అర్ధంజేసుకోవడానికి  మనసొప్పాలి. ఇది గనుక మీకు సాధ్యమైతే స్ట్రక్చర్ మీకు స్వాగతం పలుకుతుంది. లేదంటే మీరుప్పుడున్న పద్ధతిలోనే కొనసాగడం బెటర్. మీరు సీనియర్లు, మీకు ఇంతకంటే చెప్పకూడదు.

 
Q: సాహో స్క్రీన్ ప్లే సంగతులు బావుంది. ఇక్కడ మీకొక మూవీ గురించి గుర్తు చేయాలి. అది హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’. దీంట్లో కూడా చివర్లో -  ఇది నా పర్సనల్ రివెంజ్, మా అన్నని నువ్వు చంపావ్ - అని చెప్పి విలన్ని చంపేస్తాడు. దీంట్లో కూడా దాదాపు మొదటి నుంచీ  హృతిక్ ని ఒక దొంగలా చూపిస్తూ, తర్వాత తను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అని చెప్పిస్తారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
రవి, AD

A: ‘బ్యాంగ్ బ్యాంగ్’ అప్పట్లో చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దృశ్యాలు చూస్తే నిజమే...రివెంజి డ్రామాని రివెంజి డ్రామాలా అన్పించకుండా అలా కవర్ చేశారు. ఐతే ఇది హాలీవుడ్ ‘డే అండ్ నైట్’ కి రీమేక్ అని గుర్తుంచుకోవాలి. కనుక ఇది హాలీవుడ్ వాళ్ళ టెక్నిక్. దీన్నే ‘సాహో’  స్క్రీన్ ప్లే సంగతులులో  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కౌబాయ్ మూవీ ఉదాహరణగా తీసుకుని చెప్పాం. ఇక ‘సాహో’ స్క్రీన్ ప్లే సంగతుల్లోనే,  ప్రభాస్ పాత్ర ముందు నుంచీ ఇతర పాత్రలకి కాక, ప్రేక్షకులకి దొంగలా తెలిసేలా వుండాలనీ; చివర్లో ప్రేక్షకులకీ, ఇతర పాత్రలకీ తను ఫలానా అని రివీలవ్వాలని  సూచించినట్టు గానే.... ‘బ్యాంగ్ బ్యాంగ్’ లో కూడా హృతిక్ ని మొదట్నుంచీ దొంగలా చూపించి,  చివర్లో ఏజెంట్ అని రివీల్ చేసే కథనం వుండడం కేవలం కాకతాళీయం. ఈ సినిమా చూసి వుంటే దీన్ని ఉదాహరణగా పేర్కోడానికి మనకేమీ అభ్యంతరమేమీ లేదు. పైగా వాదనకి బలం కూడా.

Q: మీరు రాసిన ‘సాహో’ స్క్రీన్ ప్లే సంగతులు చాలా క్లిష్టంగా వుంది, ఇంతకంటే సింప్లిఫై చేసి చెప్పలేరా? అంటే దీన్నుంచి స్ఫూర్తి పొంది నేను కూడా ఇలానే తీయాలని కాదు, ఎలా తీయకూదదో తెలియడానికి.
విజయ్ (పేరు మార్పు), వర్ధమాన దర్శకుడు 

A: లెక్కలేనన్ని  చిక్కు ముళ్ళు వేసి వుంటే ఇంకెలా విడదీసి చెప్పగలం. మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్, కన్ఫ్యూజ్ చేసే ప్లాట్ పాయింట్స్, ఇంటర్వెల్ టర్నింగ్, ఇంటర్వెల్లోనే ట్విస్టు, దాంతో స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా ఫ్రాక్చర్ర్, దీంతో సెకండాఫ్ సిండ్రోం, కాసేపు క్యారెక్టర్ పోలీసు అని, కాసేపు దొంగ అని, కాసేపు మాఫియా వారసుడనీ...ఇక డజను మంది విలన్సు, వాళ్ళ కన్ఫ్యూజింగ్ గోల్స్ , అడుక్కో ట్విస్టు, అర్ధంగాని సంఘటనలు...ఇంత గజిబిజీగా వుంటే, ఎలా దీన్ని సాపు చేసి సరళంగా రాయగలం. ఈ గజిబిజినంతా కూడా వివరించాల్సి వుంటుంది. చివరికి దర్శకుడేమో - ఈ సినిమా ద్వారా ఇంటలిజెన్స్ తగ్గించుకుని, ప్రతీ విషయం ఒలిచి చెప్పాలని తెలుసు కున్నట్టు స్టేట్ మెంట్. మళ్ళీ ఇది కూడా తప్పే. ప్రతీ విషయం ఒలిచి చెప్పడమేమిటి, సినిమా అంటే స్పష్టంగా అర్ధమై పోయే క్లుప్తత.  ప్రేక్షకులకి స్పూన్  ఫీడింగ్ కాదు, వాళ్ళెప్పుడూ నాల్గడుగులు ముందే వుంటారు. విషయం సూటిగా, స్పష్టంగా వుంటే వొలిచి చెప్పాల్సిన అవసరమే వుండదు. ఒలిచి చెప్పాలనుకుంటున్నారంటే, కథతో కన్ఫ్యూజన్ వున్నట్టే. ఇక మీ చివరి వ్యాఖ్య - ఎలా తీయకూడతో కూడా రాశాం. మరోసారి చదవండి.

Q:  మీకో అభ్యర్ధన. ప్రతీ జానర్ నుంచీ ఒక క్లాసిక్ మూవీ విశ్లేషణ మొదలుపెట్టి, ఇంకా ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఆపెయ్యండి. ఇప్పటికే ప్రతీసారీ చదివీ చదివీ విసిగిపోయాం. ఇకపోతే, ఇంకో ఐదేళ్ళ తర్వాత తెలుగు సినిమా కథలు ఎలా మారవచ్చు, ప్రేక్షకులకి ఎలాటి కథలు చెప్పగలం, ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా మారుతుంది చెప్పగలరు.
వీఆర్, AD

 
A:  స్క్రీన్ ప్లే సంగతులు ఆపేస్తున్నట్టు గత సంవత్సరం మార్చిలోనే ప్రకటించాం. కానీ ఒక వెబ్సైట్ కి రాయాల్సి రావడంతో కంటిన్యూ చేయాల్సి వస్తోంది. విసుగేస్తే చదవకూడదు. విసుగన్పించకుండా రాయడం మనపని. ఎదురు చూసే కళ్ళు చాలా వున్నాయి ఫీల్డులోనే. అయితే ఇక్కడ కేవలం విసుగొచ్చి చదవడం మానెయ్యడం వేరు, విషయం మీద పూర్తి అవగాహనేర్పడి చదవడం మానెయ్యడం వేరు. రెండోదైతే బెటరే. కానీ ఎన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాస్తూ పోయినా, వాటిని బట్టి వచ్చే సినిమాలని స్వయంగా విశ్లేషించుకునే అవగాహనే చాలా మంది కేర్పడడం లేదు. ప్రతీ సినిమాకీ మళ్ళీ స్క్రీన్ ప్లే సంగతులు చదివే తెలుసుకో వాలనుకుంటారు. ఏం చేయగలం.

          ఇక జానర్ స్పెసిఫిక్ సినిమాల విశ్లేషణ గురించి. ఇదో మహా సముద్రం. ఒక్కో జానర్ కి పదేసి సబ్ జానర్లుంటాయి. 24 జానర్లుంటే 127 సబ్ జానర్లున్నాయి. మళ్ళీ ఇందులో హైబ్రిడ్ వున్నాయి. అంటే రెండు మూడు జానర్ల, సబ్ జానర్ల సంకరం. ఐతే తెలుగులో తీసేది రెండు మూడు జానర్లే  అయినప్పుడు అన్ని జానర్లూ తెలుసుకుని ఉపయోగం లేదు. తీసే రెండు మూడు జానర్లు వాటి జానర్ మర్యాదలతో తీస్తే చాలు. 2016 లో హిట్టయిన తొమ్మిది  పది సినిమాలూ జానర్ మర్యాదలతోనే వుండడం గమనార్హం. ఇదేదో తెలిసి చేసింది కాదు, యాక్సిడెంటల్ గా అలా వచ్చేశాయి. మళ్ళీ తర్వాతి సంవత్సరాల్లో హిట్టయినవి జానర్ మర్యాదలతో లేవు. ఫ్లాపయిన వాటికి మానమర్యాదలే లేవు. తెలుగులో అప్పుడప్పుడు తీస్తున్న టెన్త్ క్లాస్, బోయ్ లాంటి కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ సినిమాలున్నాయి. వీటి జానర్ మాన మర్యాదలేమిటో తెలుసుకోవడం అవసరమన్పించి ఈ వారం ఒక ఆర్టికల్ ని ప్లాన్ చేశాం.

          ఇక వచ్చే ఐదేళ్ళ తర్వాత తెలుగు సినిమాల కథల సంగతి. గత ఇరవై ఏళ్లుగా ఏమైనా మారాయా?  అవే లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలు, వీటి చట్రంలోనే రూపొందించుకున్నఅవే మూస యాక్షన్ కామెడీలూ. ఏమైనా మారాయా? ప్రేక్షకులే మారారు. మేకర్లు మారే ప్రసక్తే లేదు. మారిన ప్రేక్షకులకి బలవంతంగా అవే సినిమాలు అంటగడుతున్నారు. ఎందుకని? మేకర్లకి ఇవే తెలుసు గనుక. తాము చూస్తూ పెరిగినవి లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలనే రంగుల రాట్నమే గనుక. ఏమైనా అంటే పనికిరాని వరల్డ్ మూవీస్ చూసి వుంటారు. చూదాల్సినవి చూసి స్టడీ చేయకుండా షార్ట్ కట్స్ లో సాగిపోదామనుకుంటున్నారు.

          ఐతే గత కొన్ని వారాలుగా గమనిస్తే ప్రేక్షకులు మారారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తున్నారు. గ్లోబల్ గానే  రోమాన్సుకి, యాక్షన్ కీ ఆదరణ 2017 లోనే తగ్గిందని తాజా రిపోర్టు వచ్చింది. 1998 - 2017 మధ్య ఈ రెండు జానర్లదే రాజ్యమని రిపోర్టు పేర్కొంది. ఈ విధంగా మన దగ్గర వారం వారం ప్రేమ సినిమాలకి వుండని మాస్ ప్రేక్షకులు కూడా, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎగబడి చూస్తున్నారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా ప్రశ్నే కాదు. ఇలా రోమాంటిక్ కామెడీల బెడద వదలవచ్చు. కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ కి మేకర్లు ఎక్కడ్నించి రావాలి? అదే లైటర్ వీన్ రంగుల రాట్నాలు చూస్తూ, అవే షార్ట్ ఫిలిమ్స్ గా తీస్తూ, తెలుగు సినిమాలంటే ఇవేనంటూ పెరిగిన వాళ్ళే. వీళ్లిప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ ని కూడా తాము చూసిన రంగుల రాట్నాల్లాగే తీసే యగలరు. ఇప్పుడు కొత్తగా ‘దర్పణం’ అనే మర్డర్ మిస్టరీ ఇలాగే వుంది. కాకపోతే హార్రర్ కామెడీలు కూడా చూస్తూ పెరగడం వల్లనేమో, మర్డర్ మిస్టరీలో దెయ్యం చప్పుళ్ళు మోగించాడు.  


          ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతూ వుంటుంది. దీనికి తగ్గట్టుగా హీరోలు, నిర్మాతలు డ్రైవింగ్ లైసెన్సు లిస్తేనే ఎవరైనా తెలుగు సినిమాలకి తాజాదనాన్ని తీసుకు రాగలిగేది. ప్రేక్షకులకీ, సమర్ధులైన మేకర్లకీ మధ్య  డ్రైవింగ్ లైసెన్సులే అడ్డంకిగా వుంటే ఎవరేం చేస్తారు. రాబోయే ఐదేళ్ళలో కాదు, ఎప్పుడైనా ఈ డ్రైవింగ్ లైసెన్సుల జారీని బట్టే  సినిమాలుంటాయి. ప్రేక్షకులు మైండ్ సెట్టులు మార్చుకుని కూర్చుంటే, మైక్ సెట్లు వినడమే తప్ప, వినసొంపుగా పులకించిపోయేదేమీ వుండదు. పై నుంచి డ్రైవింగ్ లైసెన్సులు రావాలి.
సికిందర్