ఆ ఫ్లాష్ బ్యాక్ లో-
విజయ్ డిసిపిగా ఉంటాడు. ఒకరోజు బెగ్గర్ మాఫియాని కొట్టి
హాస్పిటల్లో పడేస్తే అక్కడ హౌస్ సర్జన్ గా వున్న
మిత్ర పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. దీన్ని ఓకే చేస్తుంది విజయ్ తల్లి.
ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రేప్ కేసులో మంత్రి కొడుకుని అనుమానించి అరెస్ట్
చేయబోతే మంత్రి కొడుకు కాల్పులు జరుపుతాడు. ఆత్మరక్షణ చేసుకుంటూ
విజయ్ జరిపే కాల్పుల్లో చనిపోతాడు మంత్రి కొడుకు. దీన్ని
నమ్మడు మంత్రి. విజయ్ కావాలనే కాల్చి చంపాడని ఎదురు తిరుగుతాడు. మంత్రితో వ్యవహారం కాబట్టి, అతను నమ్మడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు విజయ్.
ససేమిరా అంటాడు మంత్రి. విజయ్ స్వాధీనం
చేసుకున్న మంత్రి కొడుకు రివాల్వర్నీ, కాల్చిన బుల్లెట్స్ నీ
మంత్రి ఆదేశాలతో మాయం చేస్తాడు విజయ్ పై అధికారి. ‘నాకింత
కడుపు శోకం కల్గించిన నీకు ఏ శోకం మిగల్చాలి?’ అంటాడు.
మంత్రి మూర్ఖత్వంతో ఇక పిచ్చెక్కిన విజయ్- ‘నిన్ను కూడా చంపేస్తాను నా
కొడకా!’ అని
రివాల్వర్ కణతకి పెట్టేస్తాడు.
మంత్రి ఏదో కనుసైగ చేస్తున్నట్టన్పించి, గిరుక్కున
వెనక్కి తిరిగి కాల్చేస్తాడు విజయ్. వెనుక నుంచి విజయ్
పైకికాల్చబోతున్నమంత్రి తమ్ముడు కుప్ప
కూలుతాడు. షాక్ అవుతాడు విజయ్.
‘రెండు మర్డర్లా? ఓరినీ ఎన్ని ఆత్మరక్షణలురా
నీకు? ఇప్పుడు సీసీ కెమెరాకి దొరికిపోయావురా! అయిపోయవురా!’
అంటాడు మంత్రి.
పైన వున్న కెమెరా కేసే చూస్తూంటాడు విజయ్.
‘కెమెరాకి దొరికింది నేను కాదురా, నీ తమ్ముడికి కను
సైగ చేస్తూ నువ్వు దొరికిపోయావురా, నా ఆత్మరక్షణ ఎప్పుడూ
రైటే!’ అని ఆ
ఫుటేజీ ఎత్తుకుని పారిపోతాడు విజయ్.
***
తట్టుకోలేక ఫైలు మూసేసి పరిగెడుతుంది టీచర్ ఏన్.
అటు హైదరాబాద్ లో వున్నవిజయ్ పై అధికారి, కేరళలో వున్న విజయ్ కి కాల్
చేస్తాడు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు. యోగ క్షేమాలడుగుతాడు.
‘మీరు లీజు కిచ్చిన లైఫ్ తో బాగానే వున్నాను సార్’ అంటాడు విజయ్. ‘99 ఏళ్ళకి లీజుకిచ్చా, నిలబెట్టుకోవడం నీ పనే’ అంటాడు పై అధికారి. సమ్మర్ వెకేషన్స్ కి కేరళ ప్లాన్ చేసినట్టూ, అక్కడికి
రావచ్చా అనడుగుతాడు. ష్యూర్ అంటాడు విజయ్.
***
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో -
విజయ్ ని కలుసుకున్న మిత్ర, తన తండ్రితో మీటింగ్ కి
తొందర పెడుతుంది. ‘ఇప్పుడు నాకే ఠికానా లేదు. అప్పుడు వాడలా పోయాడు, ఇప్పుడు వీడిలా పోయాడు.
నన్ను సస్పెండ్ చేశారు, నా సర్వీస్ రివాల్వర్,
యూనీఫాం కూడా సరెండర్
చేశాను. సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఇచ్చేశాను, నా దగ్గర ఇప్పుడేమీ లేదు’ అంటాడు.
‘ఇదే కావాలి. నీ సర్వీస్ రివాల్వర్ పోవాలి, యూనీఫాం పోవాలి, అన్నీ పోవాలి. లేకపోతే పోలీసే వద్దని కూర్చున్నాడు నాన్న.. నువ్వు
సస్పెండ్ అయ్యావని తెలిశాక, రేపు వూస్టింగ్ కూడా అవుతావని
చెప్పి ఆయన్ని ఒప్పించడం చాలా సులభమైంది, పద’ అని తీసికెళ్తుంది.
రెస్టారెంట్ మీటింగ్ లో మిత్ర
తండ్రి, చెల్లెలు, మేనత్తా వుంటారు.
మిత్ర తండ్రి హేపీగా విజయ్ కి కంగ్రాట్స్ చెప్పబోతూండగానే తుపాకీ
పేలుతుంది. బుల్లెట్ మిత్ర పక్కనుంచి దూసుకెళ్తుంది. మళ్ళీ పేల్తుంది. ఆమెని పక్కకి తోసేసి బయటికి
వురుకుతాడు విజయ్. చేతిలో వెపన్ లేకుండానే
దుండగుల్నిఎదుర్కొంటాడు. అంతా అయ్యాక తిరిగి చూస్తే ఎవరూ
కన్పించరు.
కుటుంబాన్ని కారెక్కించుకు తీసి కెళ్లి పోతున్న మిత్ర తండ్రి- ‘వీడిది మామూలు ప్రాబ్లం కాదు, మంత్రితో
పెట్టుకున్నాడని వూరంతా కూస్తోంది. మంత్రి వీణ్ణి వదలడు,నువ్వు వదిలేయ్ వీణ్ణి!’ అని హెచ్చరిస్తాడు.
మంత్రి విజయ్ కి కాల్ చేసి- ‘చట్టపరంగా నీకు
జరిగేది జరుగుతూంటుంది, కడుపు శోకం కోసం, బోనస్ గా నా తమ్ముడి ఆత్మశాంతి కోసం
నేను చేసేది చేసుకోవాలిగా? నీకూ శోకం మిగల్చాలని నీ
లవర్ని టార్గెట్ చేశా, ఇవ్వాళ ఎస్కేప్ అయింది, రేవు అవదుగా? ముందు నిన్ను సస్పెండ్ చేయించడం నీకు సెక్యూరిటీ లేకుండా చేయడం కోసమే,
కాపాడుకో నీ లవర్ని’
అంటాడు.
విజయ్ ఎలర్ట్ అయి మిత్ర తండ్రికి కాల్ చేస్తాడు. జరిగిందానికి
సారీ చెప్పి, మిత్రని ఇక తను మర్చిపోదల్చుకున్నట్టూ, ఐతే ఈ పరిస్థితుల్లో మిత్ర తండ్రి పోలీస్ సెక్యూరిటీ కోరడం అత్యవసరమని
చెప్తూ, వెళ్లి కమీషనర్ ని కలిసి జరిగిందంతా చెప్పేయమంటాడు.
ఒక నాటు రివాల్వర్ సంపాదించుకుని విజయ్, మంత్రి వెళ్తున్నపుడు కారు మీద ఫైర్ చేసి పారిపోతాడు.
మంత్రి విజయ్ మీద కమీషనర్ కి కంప్లెయింట్ చేస్తాడు. మీ మీద ఎందుకు ఎటాక్ చేస్తాడని కమీషనర్ అడిగితే చెప్పలేకపోతాడు. చెప్తే తన రివెంజియే బయటపడుతుంది.
‘మొన్న సీసీ కెమెరా ఫుటెజీలో ఈ కణతకి రివాల్వర్ పెట్టాడు విజయ్, బాగానే వుంది. మీరెందుకు వెనుక వున్న మీ తమ్ముడికి కనుసైగ చేశారు?’ అంటాడు కమీషనర్. ఆత్మరక్షణ కోసమే కనుసైగ చేశానంటాడు మంత్రి. ‘అసలు మీకెందుకు
రివాల్వర్ పెట్టాడు విజయ్?’ అంటే చెప్పలేకపోతాడు.
‘మీరతన్ని హెరాస్ చేశారా?’ అన్న ప్రశ్నకీ సమాధాన ముండదు. ‘మొన్న రెస్టారెంట్లో విజయ్ పెళ్లి విషయం మటాడుతూంటే ఎటాక్ జరిగింది,
వాళ్ళు మీ వాళ్ళేనా?’ అంటే, ‘నన్నే అనుమానిస్తారా!’
అని చిందులేస్తాడు మంత్రి.
ఇలా రివెంజితో మంత్రి ముందుకెళ్ళ కుండా
లాక్ చేసిన విజయ్, మిత్ర తండ్రి కమీషనర్ ని
కలవకపోవడాన్ని ప్రశ్నిస్తాడు. అతను మిత్రని చూపిస్తాడు.
‘ ఒకవేళ నాన్న మీద ఏటాక్స్ చేస్తున్నారని నా సేఫ్టీ కోసం నాన్నని
వదిలేస్తానా? నిన్నెందుకు వదిలెయ్యాలి? మనం కలిసింది మనసులు కలవడం
దగ్గరే ఆగిపోతే దానికర్ధముందా?’’ అంటుంది మిత్ర. ఆమె కమిట్ మెంట్ కి చలిస్తాడు విజయ్. ఒక ఆలోచన చేసి- ‘మా పెళ్ళికి ఇప్పుడు మంత్రి
కూడా వస్తాడు’ అంటాడు మిత్ర తండ్రితో. ‘వాణ్ణి నమ్మకు. పిలిస్తే వాడు రావచ్చుగానీ, వాడి మనసు రావాలని లేదు’
అని హెచ్చరిస్తాడు మిత్ర తండ్రి.
***
మిత్ర కూడా తండ్రి మాటే పట్టుకుని
మంత్రిని పిలవ్వొద్దంటుంది. మైండ్ గేమ్స్ వద్దంటుంది. ‘అప్పుడేదో లాక్ వేశావ్ గా, వాణ్ణలా వుండనీయ్’ అంటుంది. పెళ్ళికి
చాలా మంది పోలీసులు వస్తారు. విజయ్ పై అధికారి కూడా వస్తాడు మంత్రిని
వెంటబెట్టుకుని. మిత్ర షాక్ అయి ఎందుకిలా చేశావని విజయ్ ని
చూస్తుంది. మిత్ర తండ్రి కూడా విజయ్ తన మాట వినలేదన్న కోపం
ప్రదర్శిస్తాడు. విజయ్ మంత్రిని వెంట బెట్టుకొచ్చిన తన పై అధికారినే క్యాలిక్యులేట్ చేస్తూంటాడు. మంత్రి ఆశీర్వదిస్తూ అన్నీ మర్చిపోదామంటాడు. పై
అధికారి బలవంతం చేస్తేనే వచ్చానంటాడు. డ్యూటీలో భాగంగా విజయ్
కి కొన్ని తప్పవనీ, ఇది తెలిసి కూడా తను తొందరపడి ఏదేదో చేశాననీ బాధ పడతాడు. మిత్రకీ, ఆమె తండ్రికీ విజయ్ మీద అపార్ధం
తొలగిపోతుంది. అయితే మంత్రి మాటల్ని నమ్మరు.
భోజనాల దగ్గర మంత్రి అంటాడు పై అధికారితో- ‘పెళ్ళికి
ఇంత మంది పోలీసులు వచ్చారంటే వీడికి చాలా మద్దతుంది
సస్పెండైనా. వీడి మీద కేసులకి ఇంకేం న్యాయం చేస్తారు!’
అంటాడు. ‘మీరు తాగి పడుకోకుండా ఈ సీన్
చూపించి మీలోని కడుపు శోకాన్ని నిద్ర లేపుదామనే ఇక్కడికి తీసుకొచ్చా. చట్టం ఏమీ పీకదు, మీరే పీక్కోవాలి’ అంటాడు పై అధికారి.
తర్వాత విజయ్ తో
మాట్లాడతాడు పై అధికారి- ‘నువ్వు మంత్రిని- మంత్రి నిన్నూ యేసేసే ఎదురెదురు మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్
కల్పిస్తాను- వాణ్ణి యేసేసి ఇంకో ఆత్మరక్షణ స్టేట్ మెంట్
ఇచ్చుకుంటావా? ముచ్చటగా మూడుసార్లవుతుంది, మూడు పువ్వులూ ఆరు కాయలుగా వుంటుంది, మనం పోలీసులం
ఇంతే!’ అంటాడు.
‘మీరు నాకు మేలు చేస్తున్నారా, మీకేదో మేలుకి
నన్నుపయోగించుకుంటు న్నారా?’ అంటాడు విజయ్. నీ ఇష్టమని వెళ్ళిపోతాడు పై అధికారి.
మంత్రికీ, పై అధికారికీ మిత్ర తండ్రి సెండాఫ్
ఇస్తున్నప్పుడు, మిత్ర తండ్రితో పై అధికారి- ‘సస్పెండైనా మీరు పెద్ద మనసు చేసుకుని మా వాణ్ణి అల్లుడుగా చేసుకున్నారు. సస్పెండైనప్పుడే
అల్లుళ్ళని పట్టాలి, చీపుగా దొరుకుతారు’ అంటాడు.
వీళ్ళని చూసి అసలే అయిష్టంగా వున్న మిత్ర తండ్రి, ఈ మాటలకి బాగా మండిపోతాడు - ‘అసలు
పోలీసే వద్దన్నా!’ అంటాడు. ‘పోలీసే వద్దన్నారా? ఏఁ? ఎందుకనీ?’ అనడుగుతాడు
పై అధికారి. ‘పిలవకుండా వచ్చి -అడ్డంగా
కూరలన్నీ మెక్కి- ఇలా పిచ్చి వాగుడు వాగి పోతారనీ!’ అని గట్టిగా అంటాడు మిత్ర తండ్రి.
‘పెళ్ళికి వచ్చిన పోలీసాఫీసర్నే అంత మాటంటావా? ఏయ్,
ఈణ్ణి లోపలెయ్యండి, లోపలెయ్యండి!’ అని పై అధికారి అనగానే, మిత్ర
తండ్రి అతడి కాలర్ పట్టుకుంటాడు. ఈడ్చి కొడతాడు పై అధికారి. పోలీసులు మిత్ర తండ్రిని లాగి, జీపెక్కించి తీసి కెళ్లి పోతూంటారు. పరుగెత్తుకొచ్చిన
విజయ్ ని ఆపేసి- ‘ఇందాకా నేనేం అడిగానో గుర్తుందిగా?
రేపు కలువ్’ అనేసి వెళ్లి పోతాడు పై అధికారి మంత్రితో.
***
లాకప్ లో వున్న మామని
బాధగా చూసి, వెళ్లి పై అధికారిని కలుస్తాడు విజయ్.
ఒక డేట్ ఫిక్స్ చేసి, రిసార్ట్స్ లో మంత్రికీ విజయ్ కీ సిటింగ్ ఏర్పాటు చేస్తానంటాడు
పై అధికారి. మంత్రి పెళ్ళికి వచ్చి విజయ్ ని కలుపు కున్నాడు గాబట్టి, మంత్రి పిలిస్తే నమ్మి
రిసార్ట్స్ కి వెళ్లినట్టు వుంటుంది పిక్చర్. డ్రింక్
తీసుకునేప్పుడు పూర్వ సంఘటనల రీత్యా మంత్రిని రెచ్చ గొట్టాలి విజయ్. మంత్రి వాడి ఇగో కొద్దీ రివాల్వర్ తీస్తాడు. అంతకంటే
స్పీడుగా విజయ్ తన నాటు రివాల్వర్ తీయాలి. ఇద్దరూ పరస్పరం
గురి పెట్టుకుంటారు. ఎవరు ముందు షూట్ చేస్తే వాళ్ళే
బతుకుతారు. విజయ్
ఎలాగు షార్ప్ షూటర్ కాబట్టి ముందు తనే షూట్
చేసేస్తాడు. చేతిలో రివాల్వర్ తో మంత్రి దేహం పడిపోతుంది.
విజయ్ వచ్చి తనదగ్గర లొంగి పోవాలి. మిగతా
విషయాలు తను చూసుకుంటాడు.
మీకేమిటి లాభమని విజయ్ అడుగుతాడు. ఎందుకంటే, ఇది తన కోసమే అయితే తన మామని బందీగా లాకప్ లో పెట్టుకోరని అంటాడు. తన
లాభమేమిటో చెప్తాడు పై అధికారి- మంత్రి ఒక స్కాం
చేస్తున్నాడని తను తెలుసుకున్నాడు. మంత్రి తమ్ముడ్ని లాగి ఆ
వివరాలన్నీ తెలుసుకుని బ్లాక్ మెయిల్ కి తెర తీశాడు. మంత్రి
తమ్ముడే బ్లాక్ మెయిలర్ అని తెలుసుకోలేని మంత్రి కోట్ల రూపాయలు అందిస్తూ పోయాడు.
ఎందుకో మంత్రి తమ్ముడ్ని అనుమానించాడు, వాణ్ణి
ఫినిష్ చేయాలనుకున్నాడు. ఆరోజు విజయ్ రెచ్చిపోయి మంత్రి కణతకి రివాల్వర్ పెట్టినప్పుడు- కావాలనే, విజయ్ కి తెలిసేట్టే, వెనుక వున్న తమ్ముడుకి కనుసైగ చేశాడు. ఇది కనిపెట్టి విజయ్ తమ్ముడ్ని కాల్చేస్తాడని ఊహించాడు. విజయ్ షార్ప్ షూటర్ కాబట్టి తన తమ్ముడి కంటే మెరుపు వేగంతో ఎటాక్
చేస్తాడని లేక్కేశాడు. అతడి లెక్క తప్పలేదు. విజయ్ ఆ తమ్ముడ్ని లేపేశాడు. ఇదంతా బ్లాక్ మెయిలర్ గా మారిన తమ్ముడ్ని అడ్డు తొలగించుకోవాలన్న
మంత్రి కుట్రే తప్ప, యాదృచ్చికంగా జరిగిందేమీ కాదు.
ఈ
కొత్త నిజం తెలుసుకున్న విజయ్- ‘నన్నడ్డం పెట్టుకుని ఎవరి గేములు వాళ్ళు బాగానే
ఆడుతున్నారు’ అంటాడు కసిగా. ‘అందువల్ల
నా ఇన్ కం కి గండి కొట్టి మంత్రి స్కాం చేసుకుంటే భరించలేను, హీ మస్ట్ గో!’ అంటాడు పై అధికారి. వాడు పోతే
తన కెంత లాభమో విజయ్ కీ అంతే లాభమంటాడు.
పైగా వాడి కొడుకూ, తమ్ముడూ చచ్చిపోయిన కేసులు ఆత్మరక్షణ కారణాన్నే బలంగా
సూచిస్తున్నాయని చెప్పి, విజయ్ మీద
సస్పెన్షన్ ని ఎత్తివేయిస్తానని చెప్తాడు పై అధికారి.
‘మీరు
ఈ డేట్ ఫిక్స్ చేసే లోగా మంత్రి ఎటాక్ చేయకుండా మీరే చూడాలి’ అంటాడు విజయ్.
మామని తీసుకుని వెళ్ళిపోతాడు.
***
విజయ్ ఇంటికి తిరిగొస్తాడు. కొత్త కోడలిగా మిత్ర వస్తుంది.
మామని ఇంకెప్పుడూ పోలీసుల్ని మాటలనొద్దని మందలిస్తాడు విజయ్. రోజులు గడుస్తూంటాయి.
హౌస్ సర్జన్ గా మిత్ర ఒంటరిగా హాస్పిటల్ కి వెళ్లి వస్తూంటుంది. అత్తగారు (విజయ్
తల్లి) తో కలిసి షా పింగ్స్ కి కూడా వెళ్లి వస్తూంటుంది. విజయ్ పై అధికారి నుంచి
కబురు కోసం ఎదురు చూస్తూంటాడు.
పై
అధికారి మంత్రిని కలుస్తాడు. ‘మీ కొత్త ఫ్రెండ్ విజయ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మీకు సారీలు చెప్పి మీ ద్వారా సస్పెన్షన్ రద్దు చేయించు కోవాలనీ
...అది జరిగితే మీకు అరకోటి ఇచ్చుకోవాలనీ...డిసిపి కదా...కానీ మీరు కడుపుశోకంతో
కాంప్రమైజ్ కారనుకోండీ...’ అని అంటూంటే- తను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే
లేదంటాడు మంత్రి. ఐతే వాణ్ణి
లేపెయ్యమంటాడు పై అధికారి. ‘వాణ్ణి లేపి ఏంలాభం? వాడి పెళ్ళాన్ని లేపితే వాడు కుళ్ళి
కుళ్ళి ఏడుస్తాడు, అది కదా నాక్కావాలీ!’ అంటాడు మంత్రి. ‘రెండూ ఒకటే- వాణ్ణి లేపినా వాడి పెళ్ళాం
కుళ్ళు కుళ్ళి ఏడుస్తుంది’ అంటాడు పై అధికారి. మంత్రి అపాయింట్
మెంట్స్ చూసుకుని మీటింగ్ కి తేదీ చెప్తాడు. ఆ తేదీ విజయ్ కి పాస్ చేస్తాడు
పైఅధికారి.
ఆ
తేదీ నాడు విజయ్ రిసార్ట్స్ కి చేరుకుంటాడు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవంటాడు మంత్రి.
తను కూడా రివాల్వర్ తెచ్చుకోలేదని, బయట
సెక్యూరిటీ చెక్ చేశారని, ఈ సంగతి మీకు
పాస్ చేసే ఉంటారనీ అంటాడు విజయ్. ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ పిచ్చాపాటీ
మాట్లాడుకుంటూండగా- ‘నువ్వు వెపన్ తో వస్తావనుకున్నా’ అంటాడు మంత్రి. ‘నువ్వు
మాజీ డిసిపితో డీల్ చేస్తున్నావని తెలుసుకో. నీకు గన్ లైసెన్సే లేదు, ఎప్పుడూ తుపాకీ
పట్టుకోనే లేదు, అదెలా పనిచేస్తుందో తెలీదు,
ఇప్పటికిప్పుడు నువ్వు ఇల్లీగల్
గన్ సంపాదించుకు వచ్చినా దాన్ని పేల్చగలవా? ఏదో మర్డర్ చేసేయాలన్న ముసలి యావే
తప్ప, చేవ ఎక్కడుంది? నేనే నేర్పాలి, నేర్పనా?’ అన్న విజయ్ రెచ్చగొట్టే మాటలకి- ‘అంత
మాటంటావా!’ అని నాటు పిస్తోలు
తీస్తాడు మంత్రి తాగిన మత్తులో. రకరకాల టార్గెట్స్ ని చూపిస్తూ షూట్ చేయిస్తూంటాడు
విజయ్. ఒక్కటీ గురి కుదరదు. గది బీభత్సంగా
తయారవుతుంది కాల్పులతో. సెక్యూరిటీ పరుగెత్తు కొస్తారు. విజయ్ నేల మీద పడిపోతాడు. అతడికి పిస్తోలు
గురిపెట్టి కాల్చాలని ప్రయత్నిస్తూంటాడు మంత్రి. ఇప్పుడా పిస్తోల్లో గుళ్ళు లేవన్న
సంగతి తెలుసు విజయ్ కి. ఈ దృశ్యం చూసిన సెక్యూరిటీ, మంత్రిని పెడ రెక్కలు విరిచి పట్టుకుంటారు.
***
విజయ్ పై అధికారి స్టేట్ మెంట్ ఇస్తూంటాడు : సస్పెండైన డిసిపి
విజయ్, మంత్రికి సారీ చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలని పోతే, మొదట్నించీ అనుమానం పెనుభూతంగా ప్రవర్తిస్తున్న
మంత్రి, విజయ్ ని చంపెయ్యాలని కాల్పులు జరిపాడనీ, సెక్యూరిటీ వాళ్ళు ఆపారనీ,
దరిమిలా మంత్రిని అరెస్ట్ చేయక తప్పలేదనీ అంటాడు.
విజయ్
కి కాల్ చేసి ఎందుకిలా చేశావని నిలదీస్తే, ‘మీ స్వలాభం కోసం నేనెందుకు మర్డర్
చేయాలి సార్? వాడి మూర్ఖపు రివెంజి ప్రపంచానికి తెలిసేలా చేస్తే నాకు
చాలనుకున్నాను. మీరలాగే ప్రపంచానికి
తెలియజేశారు. ఇప్పుడేమైంది? వాడి మంత్రి పదవి పోతుంది, స్కాం ఆగిపోతుంది, ఈ
కేసులోంచి బయట పడకుండా మీరు చూస్తారు, ఇదీ మీకు లాభమేగా?’ అంటాడు విజయ్.
‘వాణ్ణి
చంపే దాకా నీ మీద సస్పెన్షన్ వుంటుంది’ అంటాడు పై అధికారి.
విజయ్ తిరిగి మామూలు జీవితంలో పడిపోతాడు. మిత్రని తీసుకుని గోవా హనీ మూన్
వెళ్తాడు. ఎంజాయ్ చేసి తిరిగొస్తాడు.
మంత్రి బెయిల్ కోసం సుప్రీం కోర్టు దాకా పోతాడు. అప్పటికి ఏడాది తిరిగి
విజయ్ కి కూతురు పుడుతుంది. కూతురే లోకంగా ఉంటాడు. మిత్ర హౌస్ సర్జెన్సీ కూడా
పూర్తయి డాక్టర్ గా డ్యూటీలో చేరుతుంది. విజయ్ కి పని లేకపోవడం పెద్ద సమస్య
అయిపోతుంది.
పై
అధికారిని కలుస్తూంటాడు. మంత్రి బెయిలు మీద వచ్చేవరకూ ఆగమంటూంటాడు పై అధికారి. ‘వాడు
బయటికొస్తే మీ పట్టుదల కోసం నేను చంపాలి అంతేనా? కానీ ఇప్పుడు నా కోసం నేనే
చంపాలి. వాడు బెయిల్ మీద బయటికి వస్తే నన్ను చంపడానికే వస్తాడని నాకు తెలుసు. వాడు
నాకు పట్టిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ కి ఇక చికిత్స తప్పదు. వాడు నన్ను చంపడానికి వచ్చే ముందే వాడి కిల్లింగ్ ని నేను ప్లాన్ చేసుకోవాలి.
అందుకునేను డ్యూటీలో చేరాలి. నేను డ్యూటీలో వుండి ఎన్ కౌంటర్ చేయడం పూర్తిగా వేరు.
అప్పుడు మీరన్నట్టు నా మూడో ఆత్మ క్షణ స్టేట్ మెంట్ నా గుండెల్లోంచి ఇంకా బాగా
ఒరిజినల్ గా ఉబికి ఉబికి వస్తుంది’ అంటాడు విజయ్.
తన
సస్పెన్షన్ మీద నిర్ణయం తీసుకోకపోతే ట్రిబ్యునల్ కి పోతానంటాడు విజయ్. తను చెప్పినట్టు
వినకపోతే, విజయ్ ని ప్రాసిక్యూషన్ కి రికమెండ్ చేసి జైల్లో కూర్చో బెడతానంటాడు పై
అధికారి. ఆ రెండు కేసుల్లో ఇదే తన తుది నిర్ణయమవుతుందని స్పష్టం చేస్తాడు. మంత్రి
బెయిల్ మీద విడుదలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. విజయ్ ఎలర్ట్ అవుతాడు. విజయ్
కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వడానికి పై అధికారి ఒకటే షరతు పెడతాడు- తను మంత్రి
ఎక్కడ దాక్కున్నాడో ఇన్ఫర్మేషన్ తీసి ఇస్తాడు, విజయ్ వెళ్లి చంపెయ్యాలి.
మిత్రకి పోలీస్ సెక్యూరిటీతో హాస్పిటల్ కి వెళ్ళాల్సి
రావడంతో ఆమె కూడా ఎలర్ట్ అవుతుంది. ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పరిష్కార
ముంటుందని అంటుంది.
ఇద్దరూ కాసేపు ఏకాంతంగా గడుపుతారు. ఆమె ఏదేదో మాట్లాడేస్తూంటుంది. అవేవీ తలకెక్కవు
విజయ్ కి... ఎక్కడ మొదలయ్యిందో అక్కడే
పరిష్కార ముంటుంది- అన్న ఆమె మాట ఒక్కతే చెవుల్లో మొగుతూంటుంది. దానర్ధ మేంటోఅంతు చిక్కదు. ఆమె
మాత్రం ఏదో లోకంలో విహరిస్తున్నట్టు... ‘ఈ యాంత్రిక ప్రపంచానికి
దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో
పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి
ప్రపంచంతో సంబంధాలూ కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలని..’ అని చెప్పుకు పోతూంటుంది. విజయ్ కి ఏదో తట్టి
అక్కడ్నించీ పరుగు దీస్తాడు.
మంత్రి కొడుకు రేప్ చేసిన ఫాం హౌస్ కెళ్లి చూస్తాడు.
అక్కడ రేప్ చేసింది మంత్రి కొడుకు కాదనీ, మంత్రేననీ స్పష్టమైన ఆధారాలు
దొరుకుతాయి..షాక్ అవుతాడు.
కింది
అధికారుల ఇన్వెస్టిగేషన్ నిర్వాకానికి తిట్టుకుంటాడు. అప్పుడు మంత్రి ఎక్కడున్నాడో
ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పై అధికారి- మంత్రి విజయ్ ఇంటికే వెళ్ళాడని !
***
మంత్రి బీభత్సం చేస్తూంటాడు- మిత్రనీ, విజయ్ తల్లినీ టార్చర్
చేస్తూంటాడు. ఒంటరిగా బాగా దొరికారని వాళ్ళని చిందర వందర చేస్తూంటాడు. ‘మీరు చచ్చే
ముందు ఒక నిజం చెప్పనా?’ అని అప్పుడు
రేప్ చేసింది తన కొడుకు కాదనీ, తానేననీ,
తనకా సత్తా ఇప్పుడూ ఉందనీ అంటూ , మిమ్మల్ని కాస్సేపు వాడుకుంటానని శాడిజం ప్రదర్శిస్తాడు. వాళ్ళు లొంగక పోయేసరికి
కాల్చి చంపేస్తాడు- అప్పుడే విజయ్ వచ్చేస్తాడు- అతడి మీదికీ కాల్పులు జరిపి
పరారవుతాడు. గాయపడిన విజయ్ తో ఏదో అనాలనుకుని అనలేక ప్రాణంవిడుస్తుంది మిత్ర. అటు
తల్లి మృత దేహం పడుంటుంది. విజయ్ కూతురి కోసం పరిగెడతాడు. ఇల్లంతా వెతికినా
కన్పించదు కూతురు.
విజయ్
చితి మంటల్ని చూస్తూంటాడు.
‘నువ్వెంత
పోలీసువైనా రాజకీయనాయకులు నిన్నునమ్ముతారను కోవద్దు ..నువ్వెంత నిజంగా ఆత్మ రక్షణ కోసమే
మంత్రి కొడుకుని చంపినా నమ్మలేదు మంత్రి. మాయ ..కన్పించేదంతా మాయ.. కన్పిస్తున్న మంత్రిని
నమ్మించాలని నానా యాతన పడ్డావ్, వాడే కనిపించని నేరస్థుడని తెలుసుకోలేక పోయావ్!’ ఘోషిస్తోంది అంతరాత్మ.
విజయ్
పై అధికారి దగ్గరికి వెళ్లి, తన ఇంటిదగ్గర సెక్యూరిటీని ఎందుకు విత్ డ్రా చేశారని అడుగుతాడు. పై అధికారి బాధగా- ‘రాజకీయం క్రిమినల్ స్వభావాన్ని పులుముకుంటే
చాలా దారుణంగా వుంటుంది. మన చేతిలో ఏమీ వుండదు.
అంతా పైస్థాయిలోనే జరిగిపోయిందని నేననుమానిస్తున్నాను. వాడు ఇన్ ఫ్లూయెన్స్
చేసి ఉంటాడు..నాకు తెలీకుండా సెక్యూరిటీని విత్ డ్రా చేసేశారు..’ అంటాడు. నమ్మనంటాడు
విజయ్. ముందు వాణ్ణి చంపిరా, తర్వాత మనం తేల్చుకుందామంటాడు పై అధికారి. ‘నువ్వు
చంపితే అది సూసైడ్ అని నేనే రాస్తాను’
అంటాడు. ‘చంపే ముందు అడిగితే వాడే చెప్తాడు సెక్యూరిటీ ఎవరు విత్ డ్రా
చేసారో’ అంటాడు. ‘అది నేనే అయితే వచ్చి నన్ను చంపు’ అంటాడు. తన
స్వాధీనంలో వున్న విజయ్ సర్వీస్ రివాల్వర్ ని తీసి ముందు పెడతాడు. దీంతో చంపి
తిరిగి ఇచ్చేయాలంటాడు. ‘మీరింకా గేములాడుతున్నారా నాతో?’ అంటాడు విజయ్.
‘ఇది మనిద్దరి జాయింట్ డెత్ వారెంట్. రేపు నీతో తేడా వచ్చి మంత్రిని నువ్వే చంపావని
నేనడానికి వుండదు.. నా స్వాధీనంలో వున్న రివాల్వర్ నీకెలా వచ్చిందన్న క్వశ్చన్
వస్తుంది. అప్పుడు నేనే ఇరుక్కుంటాను. నీ రివాల్వర్ తో నేనే మర్డర్ చేశానని
నువ్వుకూడా అనలేవు, ఎందుకంటే నువ్వు మర్డర్ చేసి రాగానే నీ వేలిముద్రలతో దాన్ని
సీల్ చేస్తాను కాబట్టి’ అంటాడు.
‘మీరేమంటున్నారు సార్?’ అని అరుస్తాడు విజయ్.
‘సెక్యూరిటీ
నేనే విత్ డ్రా చేశానని మంత్రి అంటే,
వాణ్ణి చంపేశాక వెంటనే నన్ను చంపకు, మంత్రి చావు సూసైడ్ అని నేను కవిత్వం రాశాకే
నన్ను చంపు, చచ్చే ముందు నీకీ హెల్ప్ చేస్తాను’ అంటాడు మళ్ళీ పై అధికారి. పిచ్చెత్తి నట్టయి
జుట్టు పీక్కుంటాడు విజయ్.
***
మంత్రిని వెతికి వెతికి వేటాడి వేటాడి, రేప్ చేసిన అదే ఫాం
హౌస్ లో చంపుతాడు విజయ్. చంపే ముందు- ఆఫీసర్ పేరడిగి తెలుసుకుంటాడు. ‘నీ కొడుకు
కిడ్నాప్ చేసిన అమ్మాయిని నువ్వు లాక్కుని రేప్ చేశావంటే, నీకు వావీ వరసలు కూడా
లేవు. నా భార్య మీద, మా అమ్మ మీద కూడా చేతులేస్తావురా?’ అని కాల్చి కాల్చి కసికసిగా చంపేస్తాడు.
పై
అధికారి వచ్చి చూసి, రేప్ చేసింది తానేనని తెలిసిపోయిన అవమాన భారంతో, మాజీ మంత్రి
కసికసిగా కాల్చుకునీ కాల్చుకునీ
చచ్చిపోయాడనీ కవిత్వం రాస్తాడు. రివాల్వర్ ఇమ్మని అడిగితే, ఇంకో పోయెట్రీ
రాశాక ఇస్తానని, విజయ్ వెళ్లి- సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ఆఫీసర్ ని షూట్
చేస్తాడు.
విజయ్ కి ఘనంగా పార్టీ ఇస్తాడు పై అధికారి. ఇక కూతుర్ని తీసుకుని వెళ్లి
పొమ్మంటాడు. ‘అంతకి ముందే నీ మామ నీ
కూతుర్ని తనింటికి తీసుకెళ్లడం వల్ల బతికిపోయింది. లేకపోతే దాన్ని కూడా కోల్పోయే
వాడివి. అంత మాత్రాన మామ మీద తెగ సెంటి మెంటల్ అయిపోకు. వాడు నాకు నచ్చలేదు. చాలా
చెడ్డ మాటలన్నాడు. నేనడ్డంగా కూరలు దొబ్బి తిన్నానట. నాకాలర్ కూడా
పట్టుకున్నాడు. నేనసలే మెంటల్ ని, ఇది మర్చిపోను. వాడిని పనిష్ చేయాల్సిందే. కూతురు
పోయిన బాధతో ఉన్నాడుగా- ఇప్పుడు మనవరాలు కూడా లేకుండా పోయి కుళ్ళి కుళ్ళి ఏడవాలి,
అది నేను చూడాలి. కాబట్టి దాన్ని తీసుకుని కన్పించకుండా పో! లేకపోతే నీ మర్డర్
వెపన్ బయటి కొ చ్చేస్తుంది. ఎన్నాళ్ళు నీ మామకి మనవరాల్ని దూరం పెడితే
అన్నాళ్ళు రివాల్వర్ బయటికి రాకుండా నీకు
లైఫ్ వుంటుంది. గాటిట్? దెన్ ఫకాఫ్!!’ అంటాడు భీకరంగా పై అధికారి.
***
టీచర్ ఏన్ చదువుతున్న ఫైల్లో చివరి పేజీని చూసి తేరుకుని
కంగారు కంగారుగా వెనక పేజీలన్నీ తిరగేస్తుంది. ఇవన్నీ తను ఫైల్ చేసిన
పేజీలు కావు. అసలు నెట్ లోంచి తీసినవి కావు. తను తీసింది- నెట్ లో ఉన్నదీ - పెళ్లి వరకే. అదనంగా ఈ పేజీలన్నీ ఎక్కడ్నించీ
వచ్చాయి?
‘పెళ్లి
తర్వాత అసలేం జరిగిందో మీడియాకి తెలిసే
అవకాశం లేదు. కాబట్టి అంత వరకే నెట్ లో
వుంటుంది. అక్కడ్నించీ అంతా నాకూ నా పై అధికారికీ మాత్రమే తెలిసిన గేమ్
కనుక, అక్కడ్నించీ చివరివరకూ నేనే టైప్
చేసి మీ ఫైల్లో పెట్టాను. మీరు ఏకబిగిన
సస్పెన్స్ థ్రిల్లర్ లా చదువుకుంటూ పోయారు చూసుకోకుండా’ అంటాడు ఆమె వెనకే
వున్న విజయ్.
కంగారు పడి చూస్తుంది ఏన్. తనిలా
ఇన్ఫర్మేషన్ తీయడం వేరే ఉద్దేశంతో కాదనీ, కూతురికి ఎలా తోడ్పడగలనా అని
తెలుసుకోవడానికేననీ, అంతేగానీ విజయ్ ని ఎలా ప్రేమించగలనా అని కానే కాదనీ ఏడ్చేస్తుంది.
విజయ్ షాక్ అయి చూస్తాడు.
‘వద్దు, తెలిసీ మిత్ర నాతో రిస్క్ చేసింది,
నువ్వు కూడా చదువుకునీ రిస్క్ చేయవద్దు. నాకెవరూ అవసరం లేదు, ప్లీజ్...ఇది మిత్రకే
సొంతమైన ఇల్లు’ అంటూ ఫైల్ ని
తగలబెట్టేస్తాడు.
అప్పట్నించీ
ఇద్దరూ ముభావంగా వుంటారు. కూతురితో ఆడుకుంటూ పైపైన ఎంత అల్లరి చేసినా, ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్యా వెన్నాడుతూనే వుంటుంది. ఇది కనిపెట్టేస్తుంది కూతురు. తన స్థాయిలో
ఏమిటీ సమస్యని ప్రశ్న లడిగేస్తూంటుంది. బావుండదని, ఇద్దరూ పరిచయమైనప్పుడు ఎలా
వుండే వాళ్ళో అలా బిహేవ్ చేయడం మొదలెడతారు.
ఒక
రోజు కూతురు ఇంట్లో వొంటరిగా వున్నప్పుడు డోర్ బెల్ మోగుతుంది. కూతురు తలుపు తీసి చూస్తే
ముగ్గురుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవాడు. వీళ్ళెవరో గుర్తుపట్టదు. కూతుర్ని
చూడగానే మగవాడు ఉద్వేగంతో ఎత్తుకుని ముద్దా డేస్తూంటాడు, ఆడవాళ్లు లోపలికొచ్చేసి
ఇల్లంతా చూసేస్తూంటారు. ‘బాగానే కట్టాడు, డబ్బెక్కడిదో?’ అనుకుంటారు.
‘కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బుకి కొదవా?’ అని మళ్ళీ అనుకుంటారు. గోడకున్న
మిత్ర ఫోటో కేసే చూస్తూ నిలబడతారు-
‘నయం, దేన్నో పట్టి వుంటాడనుకో లేదూ మనమూ?’ అనుకుంటారు.
కూతురు
దగ్గర ఫోన్ నంబర్ అడిగి తీసుకుని కాల్ చేస్తాడు
మగ అతను. విజయ్ ఆఘమేఘాల మీద వచ్చేసి వీళ్ళందర్నీ చూసి- ‘మీరెందుకొచ్చారిక్కడికీ?’
అని తీవ్రంగా అంటాడు. ‘ఎలా వచ్చామని అడగవయ్యా మగడా’ అని వెటకారంగా అంటాడు విజయ్
మామ. ‘పోలీసు కాలాంతకుడైతే లేడీసు
దేవాంతకులు!’ అనేస్తారు మిత్ర చెల్లెలు, ఆమె మేనత్తా.
‘ఐదేళ్లూ
కన్పిచకుండా పోయావ్. ఒక్క పోలీసూ సహకరించలేదు. ఆ రోజువద్దన్నా నా ఏడాది నిండని మనవరాల్ని
లాక్కుపోయావు. నా కూతుర్ని పోగొట్టావ్, మనవరాల్నయినా ఇమ్మంటే విన్లేదు నువ్వు.
నీకు నీ కూతురు ఎక్కడ్నించి వచ్చేది- ఆ రోజు నీ ఇంట్లోంచి నేను తీసికెళ్ళి పోకపోయి
వుంటే? ఇవ్వమని ఎంత ఏడ్చినా ఆ కనికరం కూడా లేదు నీకు.. నా కూతుర్ని పోగొట్టిన నీకు,
నా మనవరాలితో వుండే హక్కులేదు- ఇచ్చేయ్!’
‘ఇవ్వను!’
‘ఇచ్చేయ్!’
సమ్మర్ వెకేషన్స్ కి కేరళ వస్తానన్న పై
అధికారి అప్పుడే వచ్చేస్తాడు, టీచర్ ఏన్ ని వెంటబెట్టుకుని. ఇక్కడ సీనంతా చూసి- చటుక్కున
రివాల్వర్ తీసి విజయ్ మామకి పెడతాడు, తీసి విజయ్ కి పెడతాడు, తీసి ఫైనల్ గా
కూతురికి పెడతాడు. ఆమె తలకి గట్టిగా పెట్టి నొక్కుతూ శాడిస్టిక్ గా చూస్తూంటాడు...
***
ఇదంతా కథలో వున్న స్పార్కే. దర్శకుడి చేతిలో ప్రయోగించని తురుపు ముక్క.
స్క్రీన్ ప్లే రచనలో ‘హిడెన్ ట్రూత్’ అనే టూల్
ని ఉపయోగించుకుని కథని తిరగ రాస్తే ఇలా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ
కాదు. అది రన్నింగ్ స్టోరీకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. రన్నింగ్
స్టోరీయే ఎప్పుడూ కథ- ప్రధాన కథ. దీని మీద కూడా ఫ్లాష్ బ్యాక్ ‘కథ’ నే సాగదీసి
స్వారీ చేయిస్తూ ముగిస్తే రొటీన్ బాషా ఫార్మాటే వస్తుంది.
ఇలాకాక,
ఫ్లాష్ బ్యాక్ లో ‘కథ’ ని ఫ్లాష్ బ్యాక్ లోనే ముగించేసి, ప్రధాన కథయిన రన్నింగ్
స్టోరీలో- ఇంకేదైనా ఫ్లాష్ బ్యాక్ లో గుప్త
సమాచారముంటే దాన్ని ప్రయోగించి, కథని పూర్తిగా వైట్ వాషింగ్ చేస్తూ మాస్టర్ స్ట్రోక్ ఇస్తే, బాషా ఫార్మాట్ ని బ్రేక్ చేసుకుని కథ ఇంకో
లెవెల్ పై కెళ్లి పోతుంది! ఈ రన్నింగ్
స్టోరీకి ఓ పాత్రో లేక ఏదైనా అంశంమో
కేంద్ర బిందువుగా వుండాలి. ప్రస్తుత తిరగ రాతలో తేలిన కూతురి పాత్రలా.
ఫ్లాష్ బ్యాక్ హింసాత్మకంగా వుంటే, రన్నింగ్ స్టోరీ సాత్వికంగా వుండాలి. రన్నింగ్
స్టోరీ హింసాత్మకంగా వుంటే, ఫ్లాష్ బ్యాక్ సాత్వికంగా వుండాలి. రెండిటినీ
వేర్వేరుగా ప్లాన్ చేసుకోవాలి- అయితే, రన్నింగ్ స్టోరీ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ని
మరిపించేదిగా వుండాలి. ఎందుకంటే రన్నింగ్ స్టోరీకే తెర మీద The End పడుతుంది
గనుక.
-సికిందర్