రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, డిసెంబర్ 2017, గురువారం

560 : రివ్యూ!


దర్శకత్వం : చరణ్ ఎల్. 
తారాగణం : సప్తగిరి, కశిష్ వోహ్రా, సాయికుమార్, శివప్రసాద్ తదితరులు 
కథ –స్క్రీన్ ప్లే : సుభాష్ కపూర్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం: బుల్గానిన్, ఛాయాగ్రహణం : సారంగం, నిర్మాత : డా రవికిరణ్
బ్యానర్ : సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రి లి.
విడుదల : డిసెంబర్ 7, 2017

***
          మాస్ హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్న కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే పాసింజర్ తో హీరోయిజాన్ని అందుకోలేక,  ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ తో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎక్కేయాలని  సిద్ధమయ్యాడు. ఆ బుల్లెట్ ట్రైన్ అందిందాలేదా తర్వాత చూద్దాం, కానీ ఈ ప్రయత్నంలో ఆధారంగా పట్టుకున్న ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిందీ ఒరిజినల్ ని ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’  ఎక్కించింది మాత్రం వాస్తవం. హైదరాబాద్ జనం మెట్రోనే ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. సప్తగిరి ‘జాలీ ఎల్ ఎల్ బి’ తో  ముందు మెట్రో ఎక్కగలిగితే భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సంగతి చూడొచ్చు. మాస్ హీరోయిజం అంత వీజీగా విజిలేసి రాదు మరి.

         
కొత్త దర్శకుడు ఎంత సీనియర్ కో - డైరెక్టర్ అయితే అంత నీరసంగా వుంటుంది వ్యవహారం. అదీ రీమేకే తొలి ప్రశ్నా పత్రమైనప్పుడు అగ్ని పరీక్షయి పోతుంది. ప్రశ్నా పత్రంలో అసలు ప్రశ్నేమిటో అర్ధంగాకపోతే, లేదా అర్ధమై అర్ధాన్ని మార్చేసుకుని తెలిసిన జవాబే  రాసుకుందామనుకుంటే,  రిజల్టు దానికి తగ్గట్టుగానే వస్తుంది. ప్రశ్నా పత్రానికి అటు తమిళంలో ఒక జవాబు కన్పిస్తున్నప్పుడు, అదైనా చూసి కాపీ చేయకపోతే మరీ కష్టంగా వుంటుంది వ్యవహారం.

          దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ఇంటలిజెంట్ సెటైర్ కాస్తా తెలుగులో తెలుగు ప్రేక్షకుల కోసమని, సప్తగిరి వీర మాసిజం కోసమనీ నిగ్రహం తప్పి ఎలా మూస ఫార్ములాగా తయారయిందో ఓసారి చూద్దాం... 

కథ 
       పల్లెటూళ్ళో వుండే సప్తగిరి (సప్తగిరి) ఎల్ఎల్ బి చేసి వూళ్ళో పంచాయితీలు గెలుస్తూ, టౌన్లో కేసులు ఓడిపోతూ వుంటాడు. వృత్తిలో ఎదిగి, మరదల్ని పెళ్లి చేసుకుని, జీవితంలో సుఖపడాలంటే ఇలా కాదని హైదరాబాద్ మకాం మారుస్తాడు. అక్కడ కోర్టులో ఒక హై ప్రొఫైల్ కేసు చూస్తాడు. ఆ కేసులో కారు ప్రమాదం చేసి పేవ్ మెంట్ మీద నిద్రపోతున్న ఆరుగురు యాచకుల్ని చంపిన కేసులో నిందితుడి  మీద కేసు సులభంగా వీగిపోయేట్టు చేస్తాడు రాజ్ పాల్ (సాయికుమార్) అనే బడా లాయర్. తనకి పేరూ డబ్బూ రావాలంటే ఇదే దెబ్బ అని సప్తగిరి దీని మీద పిల్ వేసి మళ్ళీ విచారణ జరిగేట్టు చూస్తాడు. దీంతో లాయర్ రాజ్ పాల్ ఆగ్రహానికి గురవుతాడు. అన్ని అవినీతులకీ పాల్పడి రాజ్ పాల్ ఈ కేసు గెలిస్తే ఇప్పుడు సప్తగిరి అడ్డుకోవడంతో ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీన్ని ఎదుర్కొంటూ సప్తగిరి విడుదలై పోయిన నిందితుణ్ణి దోషిగా ఎలా రుజువుచేశాడనేదే మిగతా కథ. 

ఎలా వుంది కథ 
       1999 లో సంజీవ్ నందా హిట్ అండ్ రన్ కేసుని ఆధారంగా చేసుకుని  2013 లో హిందీలో అర్షద్ వార్సీ – అమృతారావ్ – బొమన్ ఇరానీ – సౌరభ్ శుక్లా లతో న్యాయవ్యవస్థ మీద సుభాష్ కపూర్ తీసిన ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిట్టయిన సున్నిత హాస్య వ్యంగ్యాస్త్రం ప్రస్తుత కథకి మాతృక. దీన్ని  2016 లో ఉదయనిధి స్టాలిన్ – హంసిక – ప్రకాష్ రాజ్ – రాధారవి లతో  ఐ. అహ్మద్ దర్శకత్వంలో తమిళంలో 'మనిథన్' గా రీమేక్  చేశారు. తెలుగులో కథ- మాటలు- స్క్రీన్ ప్లే అని తన పేరే వేసుకున్నాడు దర్శకుడు చరణ్! నిజానికి ఈ కథ, మాటలు, స్క్రీన్ ప్లే సుభాష్ కపూర్ వి. తెలుగులో అనువాదమయ్యాయి అంతే. ఇక హిందీ వున్నంత వాస్తవికంగా, సున్నితంగా, సెన్సిబుల్ గా తమిళ రీమేక్ వుంటే – తెలుగులో కొచ్చేసరికి సప్తగిరి మసాలా అలా వుంచి, అసలు కాన్సెప్టునే మార్చేశారు. న్యాయవ్యవస్థతో సామాన్యుడి బాధలుగా వున్న ఒరిజినల్ ని కాస్తా, రైతు జీవితాల ఘోషగా మార్చేశారు. న్యాయవ్యవస్థ మీది కంటే,  రైతు జీవితాల ఏకరువే తెలుగు ప్రేక్షకులకి బాగా అర్ధమవుతుందని అనుకున్నారో, లేక ఒరిజినల్ లోని పాయింటు అసలు అర్ధం గాలేదో – మొత్తానికి తెలుగుకి ఒక అర్ధవంతమైన ఫ్రెష్ కథ లేకుండా చేశారు. హిందీలో తీసిన వాళ్ళు, దాన్ని తమిళంలో తీసిన వాళ్ళూ అంత వివేకం గల వాళ్ళు కారనేమో. 

          ఒరిజినల్  కాన్సెప్ట్ ఏమిటి-  నేరన్యాయవ్యవస్థలో బిచ్చగాళ్ళు మనుషులే కారన్న భావం ప్రబలడాన్ని ప్రశ్నించడం. రోడ్డు ప్రమాదం చేసి బిచ్చగాళ్ళని చంపేస్తే అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా, వాళ్ళు పురుగులతో సమానమన్నట్టుగా వ్యవస్థలు పనిచేయడాన్నే చూపిం
చిందీ ఒరిజినల్. అట్టడుగు బిచ్చగాళ్ళ ప్రాణాలకి  కాంట్రాస్ట్ గా అత్యున్నత ధనికుడి మదం చూపించారు. ప్రాణం విలువని నిర్ణయిస్తున్న ఈ  ఆర్ధికపరమైన అంతరంతోనే  కాన్సెప్ట్ కి అర్ధం వుంటుంది. ఇలాకాకుండా దీన్ని రైతుల జీవితాలు వర్సెస్ ధనికుల ఆగడాలుగా మార్చేయడంతో సామాజిక గొడవై పోయింది!  సున్నితమైన ఒరిజినల్ కాన్సెప్టు బలై పోయింది. ఏమో, ఇలా వుంటేనే తెలుగు ప్రేక్షకులు బాగా అర్ధం జేసుకోగలుగుతారేమోనని మనం అర్ధంజేసుకోవాలేమో! 


ఎవరెలా చేశారు 
      అసలుకి ఇదొక కమెడియన్ నటించాల్సిన కథేనా అని ఎలిమెంటరీ ప్రశ్న వచ్చేస్తుంది. హిందీలో, తమిళంలో కమెడియన్లు దీని కథానాయకులుగా లేరు. అలాగని వాళ్ళు కమర్షియల్ హీరోలూ కారు. అందుకని వాళ్ళు పోషించిన పాత్రలు అంత సహజత్వంతో వున్నాయి. సప్తగిరి వచ్చేసి ఈ పాత్ర పోషించే సరికి మొత్తం వాతావరణమే మారిపోయింది. ఫీల్, టోన్, సున్నితత్వం, సహజత్వం అన్నీ గూడ్సు బండెక్కేశాయి. సప్తగిరికి అర్జెంటుగా మాస్ హీరో ప్రతాపం చూపించుకోవాలని ఉబలాటం. ఇక ఉబలాటం కొద్దీ ఊగులాట. వంకర్లు తిరిగిపోవడం, పిల్లి మొగ్గ లేయడం, కితకితలు పెట్టుకోవడం, దొంగోడి మారు వేషాలెయ్యడం, వీర ఫైట్లు చేయడం, ఫారిన్ కెగిరిపోయి హీరోయిన్ తో  డ్యూయెట్ వేసుకోవడం, ఇది చాలనట్టు పాత ఎన్టీఆర్, ఏఎన్నార్ ల స్టయిల్లో బెల్ బాటమ్స్ వేసుకుని స్టెప్పు లేయడం – అన్నిట్లో తను ఫస్ట్ అని తనని తాను  ప్రమోట్ చేసుకుంటున్నట్టు రెచ్చిపోవడం - ఇదంతా చేయడానికి ఎక్కడో బతుకుతున్న హిందీ ఒరిజినల్ ని తెచ్చుకుని బలి చేయనవసరం లేదు. ఈ పాటి కథ ఇక్కడే తనే రాసుకోవచ్చు. ఇలా తీసిన దీన్ని సుభాష్ కపూర్ కి కూడా చూపించి ఇన్స్ పైర్ చేయాల్సిన అవసరం  తప్పకుండా వుంది.  

        చివరి కోర్టు దృశ్యాల్లో తను రక్తి కట్టించి వుండొచ్చు. అంతవరకే తన గురించి ఇక్కడ చెప్పుకోవాల్సింది. కానీ ఈ రక్తి కట్టించిన దృశ్యాలు కూడా రైతుల గురించి - కాన్సెప్టుని ఇంకో దారి పట్టిస్తూ. 

       ఇక్కడ కాన్సెప్టు గురించి తప్ప ఒరిజినల్ తో వేరే పోలికలు తేకూడదు. హిందీకి ఆ నటులు (అర్షద్, బొమన్, సౌరభ్) కరెక్టు. వాళ్లతో తెలుగులో పోల్చనవసరం లేదు. ఈ దృష్ట్యా తెలుగుకి బడా లాయర్ పాత్రలో సాయికుమార్, జడ్జి పాత్రలో శివ ప్రసాద్ లు తమ పాత్రలకి చాలా చాలా న్యాయం చేశారు. ఒక్క న్యాయం చేయలేకపోయింది - మాస్ హీరోయిజపు యావకొద్దీ – సప్తగిరి మహాశయుడే. నటనంటే గూడ్సు బండి సరుకనుకుంటే ఇలాగే వుంటుంది. బుల్లెట్ ట్రైను ఇలా తప్పిపోతుంది. 

          హీరోయినమ్మ కశీషమ్మ కషాయపు బొమ్మ.  బుల్గానిన్ సంగీతం పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టుంది. ఒక చిన్నపాటి సరళమైన కథని చెవులు చిట్లే రణగొణ ధ్వనులతో చూడాలా? ఇక పాటలకి కట్టిన ట్యూ న్లేమిటో అస్సలు మాస్ హీరోయిజానికి పనికిరావు. సారంగం కెమెరా వర్క్ సగటుగానే వుంది. 

చివరికేమిటి 
       తెలుగుకి కలిపిన దృశ్యాలు, ముఖ్యంగా పల్లెటూళ్ళో ఓపెనింగ్,  సప్తగిరి ఎంట్రీ లాంటివి చాలా  పురాతన సినిమా చూస్తున్నట్టు వుంటాయి. ఒరిజినల్ హిందీ – వాస్తవిక ధోరణిలో ఫ్రెష్ గా, కళ్ళకి కొత్తగా అన్పిస్తే, ఈ రీమేక్ జానర్ మర్యాదని కూడా కాపాడు కోకుండా రొటీన్ కమర్షియల్ మాస్ లాగా,  మూస ధోరణిలో చిత్రీకరించేశారు. కొత్త దర్శకుడు పాత వాసనతోనే తీశాడు. మాస్ హీరోగా సప్తగిరి కోరిక ప్రకారం సప్తగిరిని  ఎంత ఓవర్ యాక్షన్ తో, ఎంత ఒన్ మాన్ షోగా చూపించాలా అన్న ధ్యాసే సరిపోయింది మొత్తమంతా. సినిమాలో విషయంతో కాదు, సప్తగిరికి వేషాలతో కనెక్ట్ అవ్వాలన్న స్కీముతో చేసిన ఈ  ఓవరాక్షన్ హంగామా అన్నిటినీ తొక్కేస్కుంటూ వెళ్ళిపోయింది. ఇక అనుకున్నట్టు మాస్ ప్రేక్షకుల్ని  ఎంత తొక్కుతుందో, బాక్సా ఫీసుని ఇంకెంత  తొక్కుతుందో  ఎవరికి  వాళ్ళే చూసుకోవాలి.


సికిందర్