రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మే 2018, బుధవారం

644 : స్క్రీన్ ప్లే సంగతులు!



 సీన్ :
            కాలేజీలో డ్రామా హాలు. సీట్లో జీహై పక్కన కూర్చున్న ఫ్రెండ్ సూక్యుంగ్ బోకే తో లేచి స్టేజి మీదికి వెళ్ళిపోతుంది. స్టేజి మీద సాంగ్ మిన్ నాటకంలో హీరోయిన్ తో సీన్లో వుంటాడు. ఆమె బుక్ అందివ్వ బోతూంటే సూక్యుంగ్ వచ్చేసి బోకే అందిస్తుంది. నాటక భంగమై ఆమె కేసి అదోలా చూస్తాడు సాంగ్ మిన్. అవతల ఇది చూస్తున్న జీహై కలవర పడుతుంది – ‘సాంగ్ మిన్, ఏ రోజూ తప్పకుండా నీకు ఉత్తరాలు రాస్తున్నాను...’ అని వాయిసోవర్. 

          ఇటు బోకే అందించిన  సూక్యుంగ్ కూడా,  ‘సాంగ్ మిన్, ఏ రోజూ తప్పకుండా నీకు ఉత్తరాలు రాస్తున్నాను...’ అని చెప్పేసి పరుగెత్తుకుని వెళ్ళిపోతుంది. 

పాయింట్ :
            ఇది ప్రారంభ సీనుకి మాంటేజీ. ప్రారంభ సీను రెండో మాంటేజిలో జీహై లెటర్ టైప్ చేయడం చూస్తాం. దాని కొనసాగింపుగా సూక్యుంగ్ ఎఫైర్ ని విజువల్ గా ఈ మాంటేజీతో ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. సాంగ్ మిన్ తో సూ క్యుంగ్ చాలా చొరవ చేసి ప్రవర్తిస్తోంది అతన్నాకార్షించాలని. కానీ జీహై అలాకాదు. లోలోపల మధనపడుతోంది. నోరు విడిచి చెప్పుకుని,  సూక్యుంగ్ తో పోటీపడి సాంగ్ మిన్ ని తనవైపు తిప్పుకోవాలన్న  ఆలోచన ఆమెకి లేదు. లేకపోవడానికి ప్రధాన కారణం సూక్యుంగ్ తో వున్న స్నేహమే. స్నేహితురాలు కూడా హీరోనే కోరుకుంటున్నప్పుడు హీరోయిన్ సంయమనం పాటించడమనేది,  నేరుగా ప్రేక్షకుల్ని హీరోయిన్ ఉదాత్త విలువల పరంగా మానసిక లోకంతో కనెక్ట్ చేసే ఆలోచనాత్మక పాత్ర చిత్రణే. 

          సెకెండ్ హీరోయిన్ సూక్యుంగ్ ఎంత పట్టుదలతో వుందంటే, నాటకంలో సాంగ్ మిన్ ప్రేమ సన్నివేశంలో నటిస్తూంటే ఆగలేక, బోకే ఇస్తూ అడ్డుపడింది. అంటే మున్ముందు ఈమెతో జీహైకి చాలా తీవ్ర పోటీయే  వుంటుందన్నమాట. ఈమెని గెలవడం కష్టమేనేమో. కానీ ఫ్రెండ్ మీద గెలుపు గురించి ఆలోచించే చిన్న మనిషి కాదు  జీహై.

సీన్ : 
     సూక్యుంగ్ ఫోన్ చేసి రమ్మన్న ప్రకారం డ్రామా హాలుకొస్తుంది జీహై. హాలు ఖాళీగా వుంటుంది. స్టేజి మీద రిహార్సల్ జరుగుతూంటుంది. జీహై వచ్చి ఎక్కడో వెనుక కూర్చుంటుంది. ముందు వరసలో కూర్చున్న సాంగ్ మిన్ లేచి స్టేజి మీద సూచనలిస్తూంటాడు. స్టేజి మీదే వున్న సూక్యుంగ్ చెయ్యూపి జీహైని విష్ చేస్తుంది. సాంగ్ మిన్ వెనకాల అలాగే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న జీహై అనుకుంటుంది – ‘అతణ్ణి చూసినప్పుడల్లా నాకు వూపిరాడనట్టవుతుంది. నావైపు ఎప్పుడూ చూడలేదు....ఆగు, మంత్రం వేస్తా...చూడు!  వెనక్కి చూడు! వెనక్కి చూడు!! వెనక్కి చూడూ!!!...’  అని మంత్రం వేస్తున్నట్టు అంటూంటే, వెనక్కి తిరిగి చూస్తాడతను. వెంటనే తలతిప్పుకుని అమాయకంగా ఏటో చూస్తుంది. అతను మళ్ళీ స్క్రిప్టు చూడడంలో పడిపోతాడు. మెల్లిగా తలతిప్పి ఇటు చూస్తుంది. అతను చిటికే వేసి రిహార్సల్  మొదలెడతాడు. ఆశగా చూస్తుంది జీహై – ‘నిన్ను మొదటిసారి చూసినప్పటికే నా హృదయాన్ని దొంగిలించేశావు...ఇప్పుడు నా ఎదుట కొచ్చావు... ఇప్పుడు మనిద్దరం శాశ్వతంగా కలిసుంటామని నాకన్పిస్తోంది. నా హృదయం ఎప్పటికీ నీదే!’ అనుకుంటుంది. 

          సూక్యుంగ్ వచ్చేసి పక్కన కూర్చుని, ‘పని చేసుకునే అబ్బాయిలంటే నాకెంత ఇష్టమో, అతన్ని చూశావా?’ అని సాంగ్ మిన్ ని పిలుస్తుంది. అతనొచ్చి సూక్యుంగ్ పక్కన కూర్చుంటాడు. కబుర్లాడుతుంది. అతను జీహై వైపు చూసి, ‘ఓ... చాలా కాలమైంది నిన్ను చూసి’ అంటాడు. ‘ఎస్,  హలో...’  అని మాటలు మింగుతుంటుంది జీహై. అప్పుడు వాయిసోవర్ వస్తుంది ఆమె స్వగతంతో- సాంగ్ మిన్ అంటే చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతార్లే అని...

పాయింట్ :  
      ప్రారంభ సీనులోనే  మొదలెట్టిన బిగినింగ్ బిజినెస్ లో ‘సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన’ స్క్రిప్టింగ్ టూల్ ని కొనసాగించడం ఈ సీను ఉద్దేశం. బిగినింగ్ విభాగపు గమ్యం ప్లాట్ పాయింట్ వన్ కాబట్టి, అక్కడికొచ్చేసి ఈ విభాగం కథనం కొలిక్కొచ్చేస్తుంది. అంటే, ముగ్గురి మధ్య ఇప్పుడున్న ముసుగులో గుద్దులాట బాహాటమై,  ప్రేమ విషయంలో ప్రధాన పాత్రయిన హీరోయిన్ జీహైకి ఒక గోల్ ఏర్పడుతుందన్నమాట. దాని కోసమే సీన్లు వేస్తున్నాడు. 

          సూక్యుంగ్ ప్రేమని భౌతిక చర్యల ద్వారా చూపిస్తూంటే, జీహై ప్రేమని మానసిక సంఘర్షణగా చూపిస్తున్నాడు. స్వగతంలో జీహై భావాలు బలీయమైన ప్రేమని చాటుతూంటే, సూక్యుంగ్ ప్రేమ గాలివాటంగా వుంది. ఇక సాంగ్  మిన్ ఏమిటో మనకి తెలియడం లేదు. ఇద్దరు హీరోయిన్లకీ తెలియడం లేదు. తెలిసిపోతే కాన్షస్ – సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే ఎక్కడుంటుంది? అతను హీరోయిన్ మధించాల్సిన సబ్ కాషన్ వరల్డ్. కాబట్టి సస్పన్స్ తో గుంభనంగానే  వుంటాడు. 

          ఈ సీను ఆది మధ్యంతాల్ని జాగ్రత్తగా గమనిస్తే, ఇందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు కన్పిస్తాయి. మొదట డ్రామా హాల్లోకి జీహై రావడం, అక్కడ రిహార్సల్స్ వగైరా జరగడం ఈ సీనుకి బిగినింగ్ ఇంట్రడక్షన్. 

          తర్వాత సాంగ్ మిన్ తో ఆమె మనోభావాల స్వగతాలు మిడిల్ సంఘర్షణ, చివర్లో – సాంగ్ మిన్ ని చాలామంది అమ్మాయిలు ఇష్టపతార్లే అని ఆమె తనకి తనే సర్ది చెప్పుకోవడంతో సుఖాంతమైన సీను ఎండింగ్.  


       అంటే జీహైకి సాంగ్ మిన్ ని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతున్న విషయం ముందే తెలుసన్న మాట. విషయం తెలుసు గానీ ఎవేర్నెస్ ఇప్పుడే అయింది. సాంగ్ మిన్  ని ఎందరో అమ్మాయిలు ఇష్ట పడుతున్నప్పుడు,  ఒక్క సూక్యుంగ్ గురించి భయపడడం అవసరం లేదన్న ఎవేర్నెస్ అది. 

          ఇప్పుడు ఈ సీనులో ఈ మలుపు ఎందుకు పెట్టాడో చూద్దాం. ఏ సీను ఉద్దేశమైనా ఏదో ఒకటి జరగడంగా వుంటుంది. ఆ సీను కథని ముందుకు నడిపించే విషయాన్నైనా ప్రొజెక్టు చేయాలి, లేదా పాత్ర గురించి కొత్త విషయమేదైనా  తెలియజేయాలి. లేదా రెండూ చేయవచ్చు. ఏదీ లేకుండా లొట్టపీసు సీన్లు వేస్తే నిర్మాత డబ్బుతో పేకాడుకోవడమే. పై సీనులో రెండోదే జరిగింది. ఒక ఎవేర్నెస్ తో హీరోయిన్ గురించి కొత్త విషయం తెలిసింది. అది తానున్న డోలాయమాన స్థితి నుంచి – ఎందరో  అమ్మాయిలు ఇష్ట పడుతోంటే ఈ బోడి గుండు ఎంత - అనుకోవడంలో ఆమె ఎదుగుదల. క్యారక్టర్ గ్రోత్. 

          ప్రారంభ సీను చూస్తే, అందులో హీరోయిన్ గురించి తెలిపే సమాచారముంది, ముగింపులో సూక్యుంగ్ కాల్ చేసి రమ్మనడంతో కథ ముందుకు నడవడమూ వుంది.

 సీన్ : 
      కాలేజీలోని  స్టూడెంట్ హాల్లో ఒంటరిగా కూర్చుని ఫుడ్ తీసుకుంటున్న సాంగ్ మిన్ కేసే ఓర చూపులు చూస్తూంటుంది జీహై. వెనక సీను కట్ అవుతున్నప్పుడు వచ్చే  వాయిసోవర్ ఈ రెండు సీన్లకీ బ్రిడ్జి లా వుంటుంది. అదేమిటంటే, సాంగ్ మిన్ అంటే చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారని వెనుక సీను ముగింపులో జీహై అనుకునే మాటలు,  ఈ తర్వాతి సీన్లోకి కంటిన్యూ అవుతాయి...ఈ స్టూడెంట్ హాలు నిర్వాహకురాలు కూడా సాంగ్ మిన్ ని ఇష్టపడుతుందనీ...

          సాంగ్ మిన్ తినడం పూర్తి చేసి లేచి వెళ్ళిపోతాడు. వెళ్తూ గుమ్మం దగ్గరున్న గొడుగు వేసుకుని,  బయట తొలకరిలోకి అడుగెడతాడు. జీహై నిరాశగా చూస్తూంటుంది.

పాయింట్ :
          టీనేజీ అమ్మాయిలు ఇష్టపడుతున్నారని మాత్రమే  చెప్పేసి వూరుకోలేదు దర్శకుడు. పెద్దావిడని  కూడా జోడించి ఈ ఇష్టాలకి అంత ప్రత్యేకత ఏమీ లేదని హామీ పడేట్టు హీరోయిన్ అంతరంగాన్ని చిత్రించాడు. కేవలం రెండు సీన్లలో చెప్పీ చెప్పకుండా ఇంత ప్రేమ కథ చెప్పాడు. ఇదే తెలుగాలోచనకి,  తామరతంపరలా సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లేసుకుంటూ గునపాలతో నిర్మాత డబ్బు తనివిదీరా కొల్లగొట్టడమే!

          ఈ సీన్లో ఆ గొడుగు ఎందుకుండాలి, బయట తొలకరి ఎందుకు పడాలీ  అన్నవి చాలా ప్రశ్నార్ధకంగా వుంటాయి మనకి. ఏ మాటా, ఏ చేతా ఏదో అర్ధం లేకుండా వేయడంలేదు దర్శకుడు. ఆ గొడుగుకీ, బయట జల్లుకీ జరగబోయే కథతో ఏదో సంబంధముంది. గొడుగు, జల్లు జరగబోయేదానికి ఫోర్ షాడోయింగ్ టూల్స్ గా ఉపయోగపడ్డాయి. 

          వీటికి అర్ధమేమిటో ఇక్కడే  చెప్పుకుందామా స్పాయిలర్ అయినా సరే?  ఈ కథని ప్రేక్షకులకోసం విశ్లేషించడం లేదని ఈ పాటికి అర్ధమయ్యే వుంటుంది. మనబోటి కథకుల కోసం తీరుబడిగా విశ్లేషించుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ముందే  చెప్పేస్తే సస్పెన్స్ పోతుందని కథకులు అనుకోరు. కథకులు సస్పన్స్ కోసం విశ్లేషణలు చదవరు – సస్పెన్స్ బీజాల కోసం, వాటి అంచెలంచెల కథాక్రమం ఎలా కుదిరిందో తెలుసుకోవడం కోసం చదువుతారు. 

          ఆ గొడుగు, ఆ వర్షం హీరోయిన్ కథకి సుఖంతాన్ని సూచించే సంకేతాలు. జరగబోయే యదార్ధం. ముందు ముందు సీన్లలో మనం చూడబోతాం - హీరోయిన్ జీహై ప్రేమ కథ,  వర్షంలోనే సాంగ్ మిన్ తో సుఖాంతమవుతుంది - ఆ వర్షంలో కావాలనే అతను గొడుగు తీసుకురాకుండా, ఆమెకి తన కోటు కప్పి తిప్పడం ద్వారా.  రోడ్ల మీద ఆగుతూ సాగుతూ వుండే ఆ వర్షం ఎపిసోడ్ ఒక అద్భుతమైన అనుభవం మనకి. 

          ప్రారంభ సీనులో ప్రేమ గురించి హీరోయిన్ నిరాశ, తర్వాతి సీన్లో ఒక భరోసా, ఆ తర్వాత ఈ సీన్లో ఆమె ప్రేమ కన్ఫం. సైకలాజికల్ గా ఈ మజిలీలు చాలా కన్విన్సింగ్ గా కన్పిస్తాయి.

సీన్ :
    తిరిగి ఇంట్లో బెడ్ రూమ్ లో కొస్తుంది జీహై. అక్కడి దృశ్యం చూసి స్థాణువవుతుంది.  ఉత్తరాలన్నీ చెల్లా చెదురుగా కింద పడుంటాయి. పావురం ఎగిరి మీది కొస్తుంది. మూడు పావురాలూ లోపలే వుంటాయి. డస్టర్ తీసుకుని వాటిని తరిమి తరిమి కొడుతుంది. రెండు పావురాలు కిటికీ లోంచి బయటికి వెళ్ళిపోతాయి. మూడో పావురం గదిలోనే వుంటుంది. దాన్ని ఎడాపెడా కొట్టి తరిమేస్తుంది. అది కిటికీ లో కూర్చుంటుంది. చెత్తో నెట్టేస్తుంది. అది మళ్ళీ లోపలి రాబోతుంది. మళ్ళీ కొట్టి తరిమేసి కిటికీ అద్దం దించేస్తుంది.  

        ఉత్తరాలన్నీ ఏరి పెట్టెలో పెట్టి కూర్చుంటుంది. ఒక ఉత్తరమున్న కవర్ తీస్తుంది. దాని మీద పేరు చూస్తుంది. సుంగ్ హూ జీ అని వుంటుంది. తిప్పి చూస్తుంది. టీసూ అని పేరుంటుంది. ఆలోచనలోపడి, ‘జూన్ హా?’ అనుకుంటుంది మనసులో. లోపల ఉత్తరానికీ కవర్ మీద రెండు పేర్లకీ  పొంతన కన్పించదు. చదువుతుంది... ‘ఈ ఉదయం కిటికీ తెరచి నప్పుడు వీచిన రోమాంటిక్ గాలితో  శరదృతువు వస్తోందని అర్ధమవుతోంది...ఆ గాలిని ఈ ఉత్తరంలో పోగేసి నీకు పంపిస్తున్నా...’ 

       ‘రోమాంటిక్ గాలా?’  అనుకుని ముఖం చిట్లిస్తుంది – ‘పాత సుత్తిలా వుందే ...’ అనుకుంటుంది – ‘దీన్ని క్లాసిక్ గా తీసుకుందాంలే’ అని మళ్ళీ అనుకుని నవ్వుకుంటుంది. దాన్ని పక్కన పెట్టి డైరీ తీస్తుంది. పేజీలు  తిప్పుతూంటే ఓ చోట ఫోటో కనపడుతుంది. తీసి చూస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఒక యూత్ కిటికీలో కూర్చుని బుక్ చదువుతూంటాడు. ఆ ఫోటోని  టీపాయ్ మీద పెడుతుంది. ఆ ఫోటో క్లోజప్ లో జీవం పోసుకుని,  అదే స్థితిలో కూర్చుని బుక్ చదువుతున్న జూన్ హా తో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది...

పాయింట్ :
          ప్రారంభ సీనుకే తిరిగొచ్చిన కథనమిది. ప్రారంభ  సీన్లో  ఉత్తరాలు తీసి చదవబోతూంటే సూక్యుంగ్ నుంచి ఫోన్ రావడం, జీహై డ్రామా హాలుకి వెళ్ళిపోవడం చూశాం. ఇది సీనస్ ఇంటరప్టస్. మొదలెట్టిన సీను పూర్తి కాకుండానే ఆపి ఇంకో సీను ఎత్తుకోవడం. ఆపడం ద్వారా సాధించిన ప్రయోజనం : అక్కడ్నించీ ప్రారంభంలోనే తల్లి ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే ఒక అవకరాన్ని తప్పించుకుంటూ, ముందు కూతురి ప్రేమ కథనే కొంతమేర కంటిన్యూ చేయడం. ప్రారంభ సీన్లో హీరోయిన్ జీహై తల్లి ఉత్తరాలు చదవడం ఆపి, డ్రామా హాలు కెళ్ళింది, అక్కడ్నించీ స్టూడెంట్ హాలు కెళ్ళింది. ఈ రెండు చోట్లా  ఆమె ప్రేమ కథ ఎలా విస్తరించిందో చూశాం. వర్షం, గొడుగు ప్లాట్ డివైసులతో ఆమె ప్రేమ సార్ధకమవుతుందని కూడా తెలుసుకున్నాం. సార్ధకమవుతుందని ముందే సూచించడంలో పోయేదేమీ లేదు. సస్పెన్స్ దీనికి అవసరం లేదు. చివరికి హీరోయిన్ ప్రేమే సార్ధకమవుతుందని బెంచి క్లాసువాడికి కూడా తెలుసు. తెలిసిందాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తేనే వాడు కేకలేస్తాడు. 

          ఇలా బయట కూతురి కథని ఒక పాయింటుకి తెచ్చి ఆపి, తిరిగి ఆమెని ఇంటికి రప్పించి, ఆపిన తల్లి కథని ఎత్తుకున్నాడు దర్శకుడు. సీన్ల ఈ నేపధ్యం తెలుసుకున్న తర్వాత, ప్రస్తుత సీను బిజినెస్ చూద్దాం. 

     ముందుగా ఆమె బెడ్ రూమ్ లోకి ఎంటరవుతూ కన్పించే తీరు. ఫ్రీబర్డ్ లా టకటకా కెమెరాలో రైట్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడెందుకు ఫ్రీబర్డ్ లా వుందంటే, బయటి సీన్లలో స్వాంతన చిక్కింది. ఇప్పుడు క్యారక్టర్ గ్రోత్ తో వుంది. ఇంట్లోంచి వెళ్లినప్పటి  హృదయభారంతో ఇప్పుడు లేదు. అలా వెళ్ళిన తను ఇలా హాయిగా తిరిగి వచ్చింది. కాంట్రాస్ట్ తో ఈ డైనమిక్స్ ఆలోచించకపోతే సీన్లు తెగబోరు కొడతాయి. ఒక సీను ఇంజనీ రింగ్ కి చాలా అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. లొ.పీ. సీన్లు తీయడానికి కాదు కోట్ల రూపాయల బడ్జెట్లు. కాకి రెట్ట లేసినట్టు వుంటాయవి. 

          అసలు తెలుగు చిల్లరాలోచనకి ఆ ప్రారంభ సీనే  ఎలా వుంటుందంటే, తల్లి ఉత్తరాల పెట్టె ముందు కూర్చున్న హీరోయిను,  అలా అలా తల్లి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుందప్పుడే. తెలుగు చిల్లరాలోచనకి మార్కెట్ యాస్పెక్ట్ తెలీదు, ఆడియెన్స్ సెన్సూ  తెలీదు, యూత్ అప్పీల్ అంటే ఏంటో తెలీదు. ప్రారంభమే ముసలివాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ప్రేమ వేసి పారేస్తాడు. అలా ఒకాయన వేసి రాశాడు కూడా. తీసి సెకండాఫ్ లో పారేశాం. ఇదే ఇక్కడా జరిగింది :  ప్రారంభంలోనే తల్లి ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభించే ఒక అవకరాన్ని తప్పించుకుంటూ, ముందు కూతురి ప్రేమ కథనే కొంతమేర కంటిన్యూ చేశాడు దర్శకుడు. దిసీజ్ యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. 

          గదిలో కింద పడున్న ఉత్తరాలు, పావురాల విహారం ఇదంతా చూసి ఆమె పా వురాల్ని తరమడంలో కాంట్రాస్ట్ అర్ధమయ్యే వుంటుంది. జీహై పాత్రలో ద్వంద్వాల పోషణ ఎలా వుందంటే, మనకి తెలుస్తూ ఆమెకి తెలీని చర్యలకి ఆమె పాల్పడుతోంది. ఆమెకి తన తల్లి ప్రేమ కథని  తెలుసుకోవాలన్నకుతూహలం నిండా నూరు శాతమూ వుంది. కానీ అదే సమయంలో ఆ ప్రేమ కథకి ప్రతీకలైన మూడు పావురాల్ని తరిమి తరిమి కొడుతోంది. జీవితంలో అన్ కాన్షస్ గా మనం కొన్ని చేసేస్తూంటాం. అదే ఇది. ముందుగా  అవతలకి తరిమి కొట్టిన రెండు పావురాలులూ ఆమె తల్లి లవర్స్ కాబోలు. మూడో పావురం గదిలోనే తచ్చాడుతోంది. ఆదామె తల్లే  కాబోలు. దాన్నీ కొట్టి తరిమి పారేసింది. అది బయటికెళ్ళి మళ్ళీ రాబోయింది. దానికి ఇంట్లో స్థానం లేదంతే. కానీ ఆమె తల్లి ఫ్లాష్ బ్యాక్ చూస్తే, చివరికామె  పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుని ఇంటికే  రావాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే  కూతురేమో ఇంట్లోకి రానివ్వట్లేదు తల్లి రూపంలో వున్నపావురాన్ని. క్వయిట్ కాంట్రాస్ట్. కథ వెనకాల ఈ నిశ్శబ్ద కథ అర్ధమైతే ఈ మూవీ వీక్షణానందం ఇంతా అంతా కాదు.

          ఇక ఉత్తరాల సంగతి. ఆమె కింద పడ్డ ఉత్తరాలు ఏరుతున్నప్పుడు, ఎందుకు టాప్ యాంగిల్ వైడ్ షాట్  వేశాడా  అని పాజ్ చేసి ఆలోచిస్తూంటే, సరీగ్గా ఈ షాట్ లో ఆమె ఉత్తరాలనే కొలనులో ఈత కొడుతున్నట్టు వుంటుంది. అంటే తన తల్లి ప్రేమ కథలో నిండా మునిగి ఈద బోతోందన్న మాట. 

      ఉత్తరమున్న ఒక కవర్ తీసి ఆమె చూస్తున్నప్పుడు,  అటూ ఇటూ రెండు పేర్ల కథ ఏమిటంటే, ఆ ఉత్తరం రాసిన లవర్ ఒరిజినల్ రైటర్ కాదు, వాడు రాయించుకున్నాడు. వాడి పేరు టీసూ. ఒరిజినల్ రైటర్ ఎందుకో వెనక తన పేరు రాశాడు. సుంగ్ హూ జీ అనే ఈ పేరే ఆమెకి మింగుడు పడలేదు. అందుకే ‘జూన్ హా?’ అనుకుంది. ఇతనే  తన మదర్ లవర్, టీసూ రెండో లవర్. సుంగ్ హూ జీ అనే వాడెవడూ లేడు . మరి ఈ పేరెందుకుంది? 

          ఫ్లాష్ బ్యాక్ లోకి లాక్కెళ్ళడానికి ప్రేక్షకులకి ఒక హుక్ లాంటిదన్న మాట ఈ పేరు మిస్టరీ. ఇక్కడ మళ్ళీ ఒక కీలక ఉద్ఘాటన వుంది. ఉత్తరంలో ‘ఈ ఉదయం కిటికీ తెరచి నప్పుడు వీచిన రోమాంటిక్ గాలితో  శరదృతువు వస్తోందని అర్ధమవుతోంది...ఆ గాలిని ఈ ఉత్తరంలో పోగేసి నీకు పంపిస్తున్నా...’ ఆన్న మాటలు. 

          ఇవి హీరోయిన్ జీహై కే వర్తిస్తున్నాయి. ఉదయం ఆమె కిటికీ అద్దం ఎత్తినప్పుడు ఇంద్రధనుస్సు చూసిందే గానీ, అక్కడున్న పావురాల్ని తరిమేసిందే గానీ, అదే సమయంలో కిటికీ లోంచి ధారాళంగా వీస్తున్న రోమాంటిక్ గాలిని తెలుసుకోలేదు. ఆ గాలిని ఇప్పుడామె చేతిలో వున్న ఉత్తరంలో పోగేసి వుందని కూడా ఆమె లేత మనసుకి అర్ధం గావడం లేదు. 


         ఇక డైరీలో దొరికిన ఫోటోలో వున్నది జూన్ హా – ఆమె తల్లిని ప్రేమిస్తున్న వాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ అనే చాప్టర్ ప్రారంభమవుతుంది...

(ఇంకా వుంది)

సికిందర్