రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 4, 2018

643 : స్క్రీన్ ప్లే సంగతులు



          విదేశీ సంస్కృతా అనుకుంటాం గానీ, ఆ విదేశీ సంస్కృతుల్లోనూ మనం ఫీలయ్యే విలువలు కన్పిస్తాయి. ముఖ్యంగా విలువలతో కూడిన కళలు, సినిమా. జీవితంలోంచి పుట్టించే కళలు, సినిమాలు. జీవితంలో అనుభవమైన  ప్రవర్తనలు, ప్రేమలు, భావోద్వేగాలు, సంబంధాలు వగైరా. కొరియన్ దర్శకుడు క్వాక్ జే యంగ్ 1989 లోనే ‘వాటర్ కలర్ పెయింటింగ్ ఇన్ ఏ రేనీ డే’ తో దర్శకుడుగా రంగప్రవేశం చేసి విజయం సాధించినా, ఆ  తర్వాత తీసిన రెండు సినిమాలూ అపజయాల పాలవడంతో ఎనిమిదేళ్ళూ తెరమరుగైపోయాడు. 2001 లో అతడికి 42 ఏళ్ళు. అప్పుడు తీసిన ‘మై సాసీ గర్ల్’ అనే క్రేజీ రోమాంటిక్ కామెడీతో సంచలన దర్శకుడైపోయాడు. దక్షిణ కొరియాలో ఇది ఆ సంవత్సరం రెండో టాప్ మూవీగా రికార్డు సాధించింది.  దీంతో ఇతర దేశాల్లో దీని రేమేకుల, ఫ్రీ మేకుల పరంపర మొదలయింది. హాలీవుడ్ లో ఇదే పేరుతో 2008 లో రీమేక్ చేస్తే హిట్టయ్యింది. అదే సంవత్సరం బాలీవుడ్ లో  ‘అగ్లీ ఔర్ పగ్లీ’ అని రీమేక్ చేస్తే హిట్టయ్యింది. చైనా, జపాన్, రష్యా, హంగేరీల లోనూ రీమేకులు హిట్టయ్యాయి. నేపాల్ లోనూ ‘సానో సంసార్’ గా హిట్టయ్యింది. ఇక టాలీవుడ్ లో ఎంత ఫ్రీమేకులు చేసినా హిట్టయ్యే మాటే వుండదు కాబట్టి, 2006 లోనే  ‘మా ఇద్దరి మధ్య’  అని తీస్తే ఫ్లాపయి కూర్చుంది ఆనవాయితీ  ప్రకారం. ‘మై సాసీ గర్ల్’ ని 2016 లో ‘మై న్యూ సాసీ గర్ల్’ గా వేరే కొరియన్ దర్శకుడు రీమేక్ చేస్తే ఫ్లాపయ్యింది. 

         
2003 లో దర్శకుడు క్వాక్ ‘ది క్లాసిక్’ తీశాడు. క్రిందటిది రోమాంటిక్ కామెడీ అయితే, ఇది జానర్ మార్చి  పూర్తిగా రోమాంటిక్ డ్రామా. ఈ సంవత్సరం జనవరిలో అతనిచ్చిన తాజా  ఇంటర్వూలో ఇలా చెప్పాడు – మెలోడ్రామా అంతరిస్తున్న జానర్ గా  స్ట్రగుల్ చేస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ ప్రేమ సినిమాలు తెగ చూసే వాణ్ణి.  నా యూత్ లో అవి నన్నుకట్టి పడేసేవి. ఇప్పుడా మెలోడ్రామాలు లేవు.  మెలోడ్రామాల మీద పెట్టు బడులు పెట్టే నిర్మాతలు లేరు.  అందరూ సైన్స్ ఫిక్షన్ ఆర్భాటాలు, హత్యలు, కుట్రలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్లూ తీసే నిర్మాతలే వస్తున్నారు. కానీ అమెరికా ఇవతల చూస్తే ఇంకో దృశ్యం కన్పిస్తుంది. మా తూర్పు  ఆసియా వాసులం ఇంకా మెలోడ్రామాలూ, కంట తడిపెట్టించే ఎమోషన్లూ అంటే పడిచస్తాం. నన్ను ఓల్డ్ ఫ్యాషన్డ్ వ్యక్తి ననుకున్నా ఫర్వాలేదు. కానీ మెలో డ్రామాలు మన పాత సంస్కృతుల, సాంప్రదాయాల చిహ్నాలవల్ల , స్మరణల వల్ల చాలా లాభపడతాయి. అవి ఇంకో కాలపు జ్ఞాపకాలని తట్టి లేపుతాయి. ఆ జ్ఞాపకాల్ని ప్రేక్షకులు షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా, అవి మనందరిలో భాగమే కాబట్టి సామూహికానుభవానికి లోనవుతాం... 

         ‘ది క్లాసిక్’ ఈ అనుభవాన్నే ఇస్తుంది. కొరియన్ ప్రేక్షకులు తమ నిజమైన సాంస్కృతిక, సంప్రదాయ విలువల్ని ఉటంకించిన ‘క్లాసిక్’ కి  దాసోహులైపోయారు. దక్షిణ కొరియా ప్రజలు విద్యాధికులు. చిల్లర సినిమాలు తీస్తే తిప్పి కొడతారు. ఈ సినిమా తట్టిలేపిన పాత స్మృతుల మజా ఎంతంటే, తమ జీవితాల్లోని జ్ఞాపకాలే ప్రత్యక్షంగా కళ్ళముందు పురులు విప్పుకున్నంత.  

          మరొకటేమిటంటే, పేసింగ్ విషయంలో పన్నిన వ్యూహం. సీన్లు వేగంగా కదుల్తూనే, కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నప్పుడు మందకొడివైపోతాయి. మనల్ని ఆపి ఆలోచింపచేసేందుకు. సారాన్నంతా మొదలంటా జుర్రుకునేందుకు. ఒక్కోసారి ఈ సీన్లలో నేపధ్య సంగీతం కూడా వుండదు. విలువలు తెలియడమే కాదు, విలువల్ని ప్రెజెంట్ చేయడంలో కూడా దర్శకుడు ఒక అవగాహనతో కన్పిస్తాడు. 

          దీని ఘనవిజయం తర్వాత నుంచి 2018 వరకూ ఇంకో ఏడూ దర్శకత్వం వహించాడు, మరో నాల్గింటికి కథలందించాడు. వీటిలో రోమాంటిక్ డ్రామాలు, కామెడీలు, థ్రిల్లర్లు, సైన్స్ ఫిక్షన్లు వున్నాయి. తాజాగా ఈ సంవత్సరం  జనవరి 18 న ‘కలర్స్ ఆఫ్ ది విండ్’ రోమాంటిక్ డ్రామా విడుదలైంది. ఇందులో గర్ల్ ఫ్రెండ్ చనిపోతూ, తనలాగే వున్న అమ్మాయి ఫలానా వూళ్ళో వుందని, అన్వేషించమని బాయ్ ఫ్రెండ్ ని పురిగొల్పుతుంది. ఇది కూడా సున్నిత డ్రామా. ఈ డ్రామా ‘ది క్లాసిక్’ లో కూడా ఎలా వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం...

సీన్ :
   తోటలో పాత పుస్తకాలు  సర్దుతూంటుంది టీనేజీ జీ హై. వాటిని ఎత్తుగా పేర్చుకుని ఇంట్లోకి వస్తుంది. రూంలోకి రాగానే కిటికీ మీద దృష్టి పడుతుంది. కిటికీ అద్దాలవతల మూడు పావురాలు కూర్చుని వుంటాయి. అలా చూస్తూంటే చేతిలో పట్టుకున్న పుస్తకాలు జారి పడి పోతాయి. వాటిని పట్టించుకోకుండా ఆసక్తిగా కిటికీ వైపే చూస్తూ కదుల్తుంది... ‘నా చిన్నప్పుడు  పేద్ద ఇంద్రధనుస్సు చూసింది గుర్తుంది నాకు నదీ తీరాన...’ అని వాయిసోవర్ వస్తూంటే, వచ్చి కిటికీ అద్దాలు పైకి లేపుతుంది. అక్కడున్న పావురాల్ని తరిమి కొడుతుంది. ఆకాశంలోకే అలా చూస్తుంది. పెద్ద ఇంద్రధనుస్సు కనబడుతుంది.... ‘అప్పుడు మా మదర్ చెప్పింది...ఇంద్రధనుస్సు స్వర్గానికి ద్వారమని...మరణించిన వారు ఆ ద్వారంలోంచి స్వర్గానికి పోతారనీ...’ అంటూ  మళ్ళీ వాయిసోవర్ వస్తుంది. 

         వచ్చి పుస్తకాలు  తీస్తూంటుంది. పావురాలు వచ్చి మళ్ళీ కిటికీ లో కూర్చుంటాయి... ‘నా చిన్నప్పుడే నాన్న పోయాడు. అమ్మ విదేశాల కెళ్ళింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా చెప్పాను, విన్పించుకోలేదు...’  వాయిసోవర్ మీద  పుస్తకాలన్నీ పేర్చుకుని లేస్తూంటే మళ్ళీ కింద పడిపోతాయి. చిరు కోపంతో చూస్తుంది.

         ‘నా పేరు జీహై, నా బ్లడ్ గ్రూపు ‘ఓ’... నా ఏడేళ్లప్పుడే టెక్వాండో నేర్చుకోవడం మొదలెట్టా...’ వాయిసోవర్ కి దృశ్యం పడుతుంది- టెక్వాండోలో ఒకణ్ణి కొడితే ముక్కులోంచి రక్తం కారుతుంది.

          దృశ్యం పూర్తికాగానే,  పుస్తకాలు సర్దడం మొదలెడుతుంది. వాటిని అలమారలో పెట్టి మూస్తుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అలమార తెరుస్తుంది. అక్కడొక పెట్టె వుంటుంది... ‘దీంట్లో నా పేరెంట్స్ ఉత్తరాలూ డైరీలూ వున్నాయి...ఇవి చదివినప్పుడల్లా అమ్మ ఏడ్చేది...’ వాయిసోవర్ కంటిన్యూ అవుతూంటే పెట్టెని అందుకుంటుంది. దాన్ని వొళ్ళో పెట్టుకుని కూర్చుని, వూదగానే గుప్పుమని  దుమ్ములేవడంతో దగ్గొచ్చి దగ్గుతుంది.

          పెట్టెని టీపాయ్ మీద పెట్టి తెరుస్తూంటే, ‘మా అమ్మ తొలి ప్రేమ ఇందులో వుంది...’ అని వాయిసోవర్. ఒక కవరు లోంచి ఉత్తరం తీసి చదువుతూంటే ఫోన్ మోగుతుంది. రిసీవ్ చేసుకోవడానికి అవతలి గదిలోకి వెళ్తే కిటికీ లోంచి గాలి వీచి, పెట్టెలోని ఉత్తరాలన్నీ ఎగిరిపోతాయి. వాటి కిందున్న ఒక డైరీ పేజీలు  రెప రెప లాడుతూంటాయి.

      అవతల ఫోన్లో ఫ్రెండ్ మాటలు వింటుంది జీహై – ‘సాంగ్ మిన్ తో ఆర్ట్ మ్యూజియంకి వస్తావా?’ అని. జీహై ముఖకవళికలు మారిపోతాయి, ‘నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నావ్?’ అంటుంది సీరియస్ గా.  సాంగ్ మిన్నే రమ్మన్నాడని చెప్తుంది ఫ్రెండ్. విచారంగా చూస్తుంది జీహై.... ‘సాంగ్ మిన్  కి ఈమెయిల్ లెటర్స్ రాయమని ఒక రోజు నన్నడిగింది  సూ క్యుంగ్....’ అనే వాయిసోవార్ తో  దృశ్యం పడుతుంది – కంప్యూటర్ లో జీహై  లెటర్ టైపు చేస్తూంటే వాయిసోవర్ – ‘రెండు నెలలు సూ క్యుంగ్ కోసం లెటర్లు రాశా...’  అని.

          అక్కడే సూక్యుంగ్ వుంటుంది సూచనలిస్తూ...
          (సమాప్తం)

పాయింట్ :         మొత్తం ఐదున్నర నిమిషాల ఒకే సీను ఇది. ఇందులోనే రెండు మాంటేజీలు. ఇది ప్రధాన కథ. ఇందులో జీహై ప్రధాన పాత్ర, ఈ ప్రధాన కథలో ఈ సీను బిగినింగ్ విభాగంలో భాగం. బిగినింగ్ విభాగపు  బిజినెస్ ప్రకారం, ఈ ఒక్క సీనులోనే ప్రధాన పాత్ర  జీహై పరిచయమైపోయింది. ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి విదేశాల కెళ్ళింది ప్రస్తుతం. తను ఏడేళ్ళప్పుడే  టెక్వాండో నేర్చుకుంది. తన బ్లడ్ గ్రూప్ ‘ఓ’ – అంటే తనది మంచి ఆత్మ విశ్వాసంగల పర్సనాలిటీ. స్వయం నిర్ణయాధికారం గలది. సిక్స్త్ సెన్స్ కూడా ఎక్కువ. ఇదంతా టెక్వాండో లో ఆమె ఇచ్చుకునే మాంటేజ్ షాట్ లో బయటపడుతుంది. అంటే, ఆమె ఫలానా ఇలాటిదని చెప్పి వదిలెయ్యకుండా, సీను వేసి చూపించాడు దర్శకుడు. ‘రంగస్థలం’ లో ఒక పాటలో, ‘వినపడేట్లు కాదురా, కనబడేట్టు కొట్టండెహె’ అని అరుస్తాడు. అలాగే  సినిమా అంటే వినపడేట్లు చేయడం కాదు, కనబడేట్టు సీనెయ్యడం!  

          హీరోయిన్ కి  సూక్యుంగ్ అనే ఫ్రెండ్ వుంది. ఆమెకి సాంగ్ మిన్ అనే బాయ్ ఫ్రెండ్ వున్నాడు. ఇలా హీరోయిన్ జీహైతో  బాటు ముక్కోణ ప్రేమలో సాంగ్ మిన్ అనే హీరో, సూక్యుంగ్ అనే సెకండ్ హీరోయినూ పరోక్షంగా పరిచయమై పోయారు. 

     ఇక బిగినింగ్ విభాగపు బిజినెస్ లో భాగంగా వచ్చే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కూడా ఈ మొదటి సీనులోనే ప్రారంభమైపోవడం గొప్ప క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే బ్రెవిటీయే. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేయకుండా సంక్షిప్తతని సాధించే వాడే ప్రేక్షకుల పాలిట పుణ్యాత్ముడు. ఫ్రెండ్ సూక్యుంగ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు, జీహై ముఖభావలు గమనించినప్పుడు తను సాంగ్ మిన్ ని ప్రేమిస్తున్నట్టు అర్ధమైపోతుంది. కానీ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాక డైలమాలో పడింది. ఇక్కడ మాంటేజీ కూడా వేసి ఫ్రెండ్ కోసం ఉత్తరాలు రాస్తున్న పరీక్షని కూడా ఎదుర్కొంటున్నట్టు చూపించాడు దర్శకుడు. 

          ఇలా మొదటి సీనుతోనే ప్రధాన కథ పాయింటులోకి తీసి కెళ్ళిపోయాడు దర్శకుడు. ఇక ఈ విభాగం మరో బిజినెస్ అయిన కథా  నేపధ్యంకూడా చూపించేశాడు. ఇది తల్లి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో కూతురి ప్రేమ కథ అని. దీంతో ఈ ప్రేమ కథ జానర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఇది రోమాంటిక్ డ్రామా అనే విధంగా. ఈ జానర్ మర్యాదని పాటిస్తూ, ఈ సీనంతా ఒక పవిత్ర భావం ద్యోతకమయ్యేలా చిత్రీకరణ చేశాడు. పింక్ కలర్ టింట్ లో ఇంటీరియర్ సెట్టింగ్,  కిటికీ బయట ఆహ్లాదకర వాతావరణం. మంద్రంగా మీటుతూ సంగీతం. హీరోయిన్ ప్రతి కదలికా, చేతా, ముఖభావాలూ సున్నితత్వం, సౌకుమార్యం, అమాయకత్వమూ ఉట్టిపడేలా మంద్రంగా.  మందాకినిలా అనుకుందాం. మాంటేజీలు వేసినప్పుడు కూడా స్మూత్ ట్రాన్సిషన్ కి వాయిసోవర్ నే వేసుకున్నాడు. దీంతో నడుస్తున్న సీనులో వున్న పవిత్రభావం  డిస్టర్బ్ అయినట్టే కన్పించదు. ఇదే రోమాంటిక్ కామెడీ జానర్ అయితే చిత్రీకరణ ఇలా వుండదు. స్పీడుగా అల్లరల్లరిగా వుంటుంది. ఈ అల్లరిలో ఒక్క సీనులో పొందికగా, ఒద్దికగా ఇన్ని సంగతులు చెప్పడం కుదరదు. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేసుకుంటూ వుండడమే.  

      ఇప్పుడు ఈ మొదటి సీనులో చెప్పుకొస్తున్న ప్రధాన కథలోనే దాచి పెట్టి,  ఫ్లాష్ బ్యాక్ కథకి హింట్స్ కూడా ఇస్తున్నాడు దర్శకుడు. ఈ లేయర్, ఈ డెప్త్ కూడా గమనించాలి.
ఇంట్లోపాత పుస్తకాలు  గడచిన కాలానికి గుర్తులు. అంటే హీరోయిన్ తల్లి తాలూకు గతం అన్న మాట. ఆ గతాన్ని భారమైన పుస్తకాలుగా లేత చేతుల మీద మోసుకుంటూ ఇంట్లోకొచ్చింది. చిందర వందరైన తల్లి గతాన్ని పేర్చి,  ఇంట్లోకి తెచ్చి  స్థానం కల్పిస్తున్న అర్ధంలో. ఇంట్లోకొచ్చి ఆ పుస్తకాలన్నీ జారవిడిచేసింది. కిటికీలో మూడు పావురాల్ని చూసింది. ఆ పావురాలు సింబాలిజమ్స్. దేనికి సింబలిజమ్స్? గతంలో తన అమ్మకీ, ఆమెతో ఇద్దరబ్బాయిలకీ సింబాలిజమ్స్. అదే సమయంలో ఆమె కిటికీ లోంచి కన్పిస్తున్న ఇంద్రధనుస్సుని చూసింది. అటు వైపు కదిలింది. కిటికీ అద్దాలు ఎత్తింది. అక్కడున్న పావురాల్ని తరిమేసింది. పావురాల్ని చీదరగా తరిమేయడమేమిటి? అంటే ఆ పావురాలు  డిస్టర్బ్ అయిన పాత ప్రేమలకి గుర్తులని హింట్ ఇస్తున్నాడు దర్శకుడు. ఆమె ఇంద్రధనుస్సుని చూడడం, చనిపోయిన వారు ఇంద్రధనుస్సు గుండా స్వర్గానికి వెళతారని తల్లి చెప్పింది గుర్తు చేసుకోవడం...వూరికే కాదు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో మనం చూడబోయే  ముగింపే.  హీరోయిన్ తండ్రి మరణించినట్టు ఎలాగూ మనకిప్పుడు  తెలిసింది, ఇక ఆ రెండో అబ్బాయి కూడా చనిపోయాడా? వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్లిపోయరా? లేకపోతే, చనిపోయిన వాళ్ళు ఇంద్రధనుస్సు గుండా ... అని అంత ప్రత్యేకంగా తల్లి చెప్పడమెందుకు? 

          ఈ ఇంద్రధనుస్సే ఫ్లాష్ బ్యాక్  ముగింపులోనూ వస్తుంది! ప్రధాన కథ ప్రారంభంలో ఈ ఇంద్ర ధనుస్సు, ఫ్లాష్ బ్యాక్ ముగింపులో ఇంద్ర ధనుస్సు-  తల్లికథ, కూతురు కథలకి ఇంద్రధనుస్సులతో ఒక ముడి. 

          అలాగే రెండవ మాంటేజిలో,  సెకెండ్ హీరోయిన్ కోసం హీరోయిన్ లవ్ లెటర్ టైపు చేస్తున్నప్పుడు, సెకెండ్ హీరోయిన్ చికెన్ పీస్ ని కసాపిసా నమిలి తింటుంది. అంటే న్యాయంగా హీరోయిన్ కి దక్కాల్సిన ప్రేమని అలా నమిలేస్తోందన్న మాట! 

      ఆమె పెట్టె లోంచి ఉత్తరం తీసి చదవబోయింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాకపోతే ఆ ఉత్తరాలన్నీ చదువుకుంటూ కూర్చునేదేమో... ఫోన్ రావడంతో వెళ్ళడంతో, ఇక్కడ గాలికి ఉత్తరాలన్నీ కొట్టుకుని పోయాయి. అడుగున డైరీ బయట పడింది...ఆమె చదవాల్సింది ఇదీ అని గాలికి పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి... 

          ఇలా ఏకకాలంలో రెండు కాలాల ప్రేమ కథలకి అంకురార్పణ చేసిన సీన్ క్రియేషన్ ని ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించేస్తాడు. ఆ మత్తు వీడి పోలేరు ఇక ప్రేక్షకులు.

(ఇంకా వుంది)

సికిందర్

          (నోట్ : నియోనోయర్ థ్రిల్లర్ ‘బ్రిక్’, సర్క్యులర్ థ్రిల్లర్ ‘ట్రయాంగిల్’ ల గురించి రాయడం తలపెట్టి ఆపేయాల్సి వచ్చింది. కారణం, థ్రిల్లర్స్ పట్ల తెలుగులో ఆదరణ కన్పించకపోవడమే. ప్రేక్షకుల్లో కాదు, మేకర్స్ లో. ప్రేక్షకులకి కాస్త వెరైటీ నివ్వాలని మర్చిపోయినట్టున్నారు. దగ్గర దగ్గర రెండు దశాబ్దాలుగా స్టార్ మూవీస్ కైతే యాక్షన్ కామెడీలు, స్మాల్ మూవీస్ కైతే రోమాంటిక్ కామెడీల కాలాన్ని ఇంకా సాగదీస్తున్నారు.  కాబట్టి థ్రిల్లర్స్ గురించి రాయడాన్ని పక్కన పెట్టేశాం. అప్పుడప్పుడు ఒకరిద్దరు గుర్తు చేస్తూంటారు. గత సంవంత్సరం నియోనోయర్ ‘బ్లడ్ సింపుల్’ గురించి రాస్తే కూడా ఒకరిద్దరే ఆసక్తి చూపారు. కనీసం ఆ ఒకటి పక్కన సున్నా పడ్డా రాయవచ్చు. ఆ సున్నా కోసం ఎదురుచూద్దాం. ఒకటి పక్కన సున్నా = 10 మంది).