రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, మార్చి 2021, సోమవారం

రిపీట్ ఆర్టికల్


 


        
        
కొన్ని సినిమాల్లో వెంటాడే దృశ్యాలుంటాయి. వెంటాడ్డానికి జీవంతో తొణికిస లాడ్డం కారణం. దృశ్యాల్లో తీసే ప్రతీ షాటూ వాటికీ శాశ్వతత్వం కల్పించడం. రైటర్ పని పాత్రని సృష్టించి దాని మానాన వదిలెయ్యడం. పాత్రని పట్టకుని తను కథ నడపడం కాదు. పాత్ర దాని కథ అదే నడుపుకునే ఫస్ట్ హేండ్ డ్రైవ్ అవకాశం కల్పించడం. మేకర్ పని కూడా షాట్స్ ని బయట నుంచి పాత్రల మీద రుద్దడం కాదు, లోపలి నుంచి ఇన్నర్ ఇంజనీరింగ్ జరపడం. అందచందాలు ఫైపైన లేపనాల వల్ల రావు, లోపలికి తీసుకునే పానీయాల వల్ల వస్తాయి. షాట్స్ కూడా లేపనాలు కాకుండా పానీయాలు కావాలి. అప్పుడు జీవం వస్తుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర  వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయి. చాలా సినిమాల్లో ఈ వరస కన్పించదు. అందువల్ల ఆ సీన్లు థియేటర్ లోంచి బయటకి కొస్తే గుర్తుండవు. పాత్రల్లోపలి నుంచి దాని దృక్కోణాన్ని చూస్తూ షాట్స్ ఆలోచించకుండా, బయటి నుంచి మేకర్ తనదేదో దృక్కోణంతో పాత్రమీద షాట్స్ ని రుద్దితే ఏకత్వం చెడి దృశ్యం నిలబడదు. ఆర్ట్ సినిమాల్ని, లేదా మన ప్రాంతీయ సినిమాల్ని చూస్తూంటే ఇదే అర్ధమవుతుంది. ఇందుకే ఇవి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందుతూంటాయి. 

         
ర్ట్ సినిమా మేకింగ్ కమర్షియల్ సినిమాల కెందుకనుకోవచ్చు. ఆర్ట్ సినిమాలే కాలాన్ని బట్టి మారి కొంత కమర్షియాలిటీనీ కూడా కలుపుకుని, ఫ్యూజన్ తో క్రాసోవర్ సినిమాలుగా వస్తూంటే, కమర్షియల్ సినిమాలు ఆర్ట్ సినిమాల్లోంచి వీలైనవి తీసుకోవడం పరువు తక్కువేం కాదు. 

        1977 లో తన ఐదవ సినిమాగా శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’  ఇవాళ్టికీ ఇవాళ్టి సినిమాలాగే వుంటుంది కథతో, పాత్రలతో, మేకింగ్ తో. మరాఠీ ప్రేక్షకుల ‘సావిత్రి’ అనదగ్గ  నాటి పాపులర్ హీరోయిన్ హంసా వాడ్కర్ సంక్షుభిత ప్రేమల విషాద కథ ఇది. సంక్లిష్టమైన హంసా పాత్రని స్మితా పాటిల్ నటించింది కేవలం 22 ఏళ్ల వయసులోనే. కథలో సినిమా హీరోగా అనంత్ నాగ్, దర్శకుడుగా నసీరుద్దీన్ షా, ధనికుడుగా అమ్రిష్ పురీ కన్పిస్తారు. ప్రసిద్ధ ఆర్ట్ సినిమాల దర్శకుడు గోవింద్ నిహలానీ ఛాయాగ్రహణం సమాకూర్చాడు. 


        ఇందులో ప్రారంభంలో కుటుంబ దృశ్యం వుంటుంది. ప్రారంభంనుంచీ ఈ దృశ్యం షాట్స్ పరంగా కట్టి పడేస్తూ ముందుకు లాక్కెళ్తుంది. చాలా మతిపోగొట్టే షాట్ కంపోజింగ్, డ్రామా. ఈ దృశ్యం చూడమని ఇద్దరు ముగ్గురు దర్శకులకి క్లిప్పింగ్ పంపిస్తే, చూసి థ్రిల్లయి పోయారు. ఇక దీని గురించి రాయక తప్పని పరిస్థితి...


ఈ సీను నేపథ్యమేమిటంటే ...
       సినిమా హీరోయిన్ స్మితా పాటిల్ కి భర్త అమోల్ పలేకర్, ఓ కూతురూ తల్లీ వుంటారు. పలేకర్ స్మిత మీద ఆధారపడి బతికేస్తూ వుంటాడు. పైగా అనుమానాలు పెట్టుకుని వేధిస్తూ వుంటాడు. ఇతణ్ణి భరించలేక గతంలో ఒకటి రెండు సార్లు వెళ్ళిపోయినా, మళ్ళీ తీసుకొస్తే వచ్చింది. దీంతో మరీ చులకనై పోయింది. అతను తనికిలా బతికే హక్కుందని భావిస్తూంటాడు. ఆమె చిన్నప్పట్నుంచీ ఆర్ధికంగా కుటుంబాన్నితను ఆదుకున్నాడనీ, సినిమాల్లో నటించే అవకాశాలిప్పించి, ఆమె కెరీర్ ని తను మేనేజ్ చేశాడనీ, పైగా దిక్కులేని చిన్న వయసులో ఆమెని పెళ్ళి చేసుకుని, ఇంటిదాని హోదా కల్పించాననీ గుర్తు చేస్తూ వుంటాడు. తన సంపాదన మీద అతను బతకడం ఆమె కభ్యంతరం కాదు. అభ్యంతరమల్లా అనుమానాలు పెట్టుకుని వేధిస్తేనే. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ నుంచి ఆమె రాక కోసం ఇంటిదగ్గర అసహనంగా వెయిట్ చేస్తూంటాడు. ఇక్కడ్నించీ ఈ సీను ప్రారంభమవుతుంది...ఐతే ముందుగా ఇక్కడ పైన పోస్టు చేసిన ఈ సీను క్లిప్పింగ్ ఒకటికి రెండు సార్లు చూసి డైజెస్ట్ చేసుకోవాలి. 

సీను ఎలా వుందో చూద్దాం : 
         1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. 


            
2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి (కిరణ్ విరాలే) చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది. 

        
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి (సులభా దేశ్ పాండే) టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం  తిప్పుకుంటుంది.

     4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. 


        5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో  ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. 

        6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. 

       7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలోతగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. 

        8. కోపాన్ని అణుచుకుంటూ, ‘నువ్వు మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మం టాడు. 

        9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా.   

        10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళి టాక్సీనాపి ఎక్కేస్తుంది...

ఇక్కడ భూమిక ఆమె పేరు కాదు
డిక్షనరీ అర్ధంలో
 ‘పాత్ర’
       వివిధ క్లిష్ట దశల్లో తన జీవితమనే నాటకంలో తను - ఉష అలియాస్ ఊర్వశి (స్మిత పాత్ర పేరు) - పోషించాల్సి వచ్చిన విభిన్న పాత్రలు. ఈ కథకి స్క్రీన్ ప్లే సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనెగళ్ రాశారు (శ్యాం బెనెగళ్ తన పేరు వినమ్రంగా చివర వేసుకున్నారు). సంభాషణలు సత్యదేవ్ దుబే రాశారు. పాత్రల అంతరంగ ప్రగాఢ మథనం కథని, దృశ్యాల్ని కట్టిపడేసేట్టు తీర్చిదిద్దింది. 

         ఇప్పుడు పై దృశ్యపు షాట్ డివిజన్ సంగతుల కెళ్ళే ముందు, ఈ దృశ్యంలో ఏది ఎందుకుందో, ఏ చర్య కర్ధమేంటో చూద్దాం. పై దృశ్యాన్ని 10 భాగాలుగా విభజించాం (దృశ్యాలు రాయడం ఈజీ, విశ్లేషించాలంటే చాట భారతం. ఒక దృశ్యాన్ని విశ్లేషించడానికి పట్టే కాలంలో పది దృశ్యాలు రాయొచ్చు. కాబట్టి విశ్లేషకుల్ని చిన్న చూపు చూడరాదు). పై దృశ్య విభాగాల్లో పాత్రల చర్యలు, చర్యల వల్ల పుట్టే మాటలు, ఎక్కడ ఎలా పడాలో అక్కడ అలా పడడాన్ని గమనించ వచ్చు, అంతే కాదు, ఏ స్క్రీన్ టైముతో ఏ సిట్యుయేషన్లో ఎలా కెమెరాలో రివీలవ్వాలో - అక్కడ అప్పుడు అలా పాత్రలు ప్రత్యక్షమవడాన్ని కూడా సూక్ష్మ దర్శిని పెట్టి చూడొచ్చు. కొన్ని వస్తువుల సమయానుకూల ప్రయోగం కూడా చూడొచ్చు. ఇలా మైక్రో లెవెల్లో ఈ సీన్ని చూసినప్పుడే సీను చెరగని ముద్ర వేస్తుంది. 

        ఒకే షాట్ లో, లేదా కొన్ని షాట్స్ లో నటీనటులందర్నీ ఎలాపడితే అలా కూడేసి, నటింపజేయడం దృశ్య కథన మంటారా? పోనీ డ్రామా అంటారా? అనరు. దృశ్యానికీ దృశ్యం లోపల దాని స్ట్రక్చరుంటుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి ఏ స్ట్రక్చరుంటుందో అదే దృశ్యంలోపలా వుంటుంది. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలుంటాయి. ఆ విభాగాల్లో అవే వాటి బిజినెస్సులుంటాయి. ప్రారంభ ముగింపులుంటాయి. స్క్రీన్ ప్లే ఒక హీరో లేదా హీరోయిన్ తో వున్నట్టే, దృశ్యమూ ఆ దృశ్యాన్ని బట్టి హీరో లేదా హీరోయిన్ తో వుంటుంది. ఆ పాత్రకి దృశ్యంలో ఓ ప్రారంభం, ముగింపూ వుంటాయి. 

        పై దృశ్యం స్మితా పాటిల్ ది, అమోల్ పలేకర్ ది కాదు. అందుకని ఆమె కేంద్రంగానే దృశ్య కథనముంది. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటి నుంచి ఇంట్లోకి వచ్చింది. పలేకర్ తో సంఘర్షించి కన్నీళ్ళతో ఇంట్లోంచి బయటికెళ్ళి  పోయింది. ఇదీ సీనులోకి పాత్ర రాకపోకల - ప్రారంభ ముగింపుల డైనమిక్స్, లేదా ద్వంద్వాలు. ఆరు నిమిషాల్లో జీవితమే మారిపోయింది. 

వరసగా దృశ్య విభాగాలు పరిశీలిద్దాం
      1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు.

        వివరణ : పలేకర్ అలా అసహనంగా ఎదురు చూసే మాటేమోగానీ, చేతిలో ఆ సిగరెట్ పెద్ద సస్పన్స్ అయిపోయింది. అదెప్పుడు ముట్టిస్తాడో తెలీదు. లోపలికొచ్చి కూడా ముట్టించడు. దానికి తగ్గ మానసిక స్థితి రావాలి. అదెప్పుడోస్తుందో వస్తుంది. ముట్టించబోతూంటే ఆమె కార్లో డైరెక్టర్ తో రావడం కళ్ళబడ్డాక అదే పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది. ముందామె సంగతి చూసిగానీ...

        ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డప్పుడు - గడప లోపలే నిలబడ్డాడు. ఆ గడప అతడి ఇన్ఫీరియారిటీకి గుర్తు. అది దాటి ఆమె మానసిక ప్రాంగణంలోకొచ్చి మాట్లాడే ధైర్యంలేదు. పైకి ఎంత ధూంధాం చేసినా, లోలోపల ఆమె సొమ్ము తింటున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంది. 

        2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది.

        వివరణ : ఇక్కడ కూడా సిగరెట్ ముట్టించలేదు. స్మిత అతడికేసి చూస్తూ లోపలి కెళ్ళిపోయింది. ఇంతవరకూ ఇంట్లో పలేకర్ ని తప్ప ఇంకెవర్నీ చూపించలేదు. అతడికి కూతురున్న సంగతి మనకింకా తెలీదు. స్మిత వచ్చాకే ఆమెతో ఎటాచ్ చేసి కెమెరాలోకి తెచ్చారు. ఇప్పుడు హాల్లో చదువుకుంటున్న కూతురు రివీలయ్యింది. ప్రధాన పాత్ర ననుసరించి ఒకటొకటే రివీల్ చేస్తూ సీనుని వెల్లడించే విధానం. స్మిత కూతురి చెంప ప్రేమగా నిమిరి- నువ్వివాళ్ళ ఇంటిదగ్గరేనా -అనడం,  స్మిత తెల్లారే ఎప్పుడో షూటింగు కెళ్ళిపోయిందన్న సమాచారం మనకిస్తూ కథని వెల్లడిస్తోంది. 

        ఇక స్వింగ్ డోర్స్. స్వింగ్ డోర్స్ తోసుకుని వెళ్తుంది స్మిత. ఈ స్వింగ్ డోర్స్ ఏమిటి? ఆయారాం గయారాం. ఆమె జీవితం నిలకడగా లేదని అర్ధం. ఎప్పుడు ఈ ఇంట్లో కాపురముంటుందో, ఎప్పుడు ఎటెళ్ళిపోతుందో తెలీదనే పరిస్థితికి - లోపలికీ, బయటికీ తెర్చుకునే ఆ స్వింగ్ డోర్స్ సింబాలిజం.

        
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం  తిప్పుకుంటుంది.

        వివరణ : మొదట మనకి కూతురి పాత్ర తెలిసింతర్వాత, స్మిత అలా స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళగానే, రెండో పాత్రగా ఆమె తల్లి పాత్ర మనకి పరిచయమవుతూ కెమెరా లోకొచ్చింది. అంటే ఆమెకి తల్లి కూడా వున్నట్టు ఇప్పుడు మనకి తెలిసింది. స్మిత తన ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోకుండా, తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయే సరికి, అతను ఇంకింత మండిపోయి వచ్చేస్తూంటే -  అత్తగారు టీ కప్పుతో ఎదురయ్యింది. ఆగిపోయి, సిగరెట్ ని చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ముట్టించుకోలేదు. టీ అందుకునే మూడ్ లేక, ఛీ అనుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి ఈ ముఖాముఖీ వాళ్ళిద్దరి మధ్య కూడా సత్సంబంధాలు లేవని కథని తెలియజేస్తోంది. ఆమె మనవరాలి కేసి చూసే విధం, మనవరాలు మొహం తిప్పుకుని ఎటో చూసే విధం, వాళ్ళిద్దరూ ఇంట్లో జరిగే తతంగాలకి మౌన ప్రేక్షకులని కథని తెలియ జేస్తుంది. ఇలా రివీలవుతున్న పాత్రలకి పరస్పరం ఎటాచ్ మెంట్ ఇప్పిస్తూ, పూర్తి కుటుంబ వాతావరణాన్ని మన ముందుంచారు. 

        4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుందిఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. 

        వివరణ : ఇక స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోయిన స్మిత ఇప్పుడు అటు గదిలోంచి వేగంగా వెళ్లి పోవడాన్ని వూచల కిటికీ లోంచి చూస్తాం. ఎందుకిలా? నేరుగా ఆమెని బెడ్రూంలో చూపించ వచ్చు కదా? అలా చూపిస్తే రసోత్పత్తి జరగదు, కథోత్పత్తి కూడా జరగదు. గానుగాడించిన పిప్పి మిగుల్తుంది. ఈ కిటికీ వూచల్లోంచి ఆమెని చూపించడం పంజరంలో వున్నట్టు చూపించడం. ఇప్పుడుంటున్న ఇల్లొక పంజరం, ఇక్కడే కాదు, ఈ సీను తర్వాత కథలో ఇంకా మున్ముందు ఇంకో ముగ్గురితో సంబంధాలు కూడా పంజరాలేనని మనకి తెలుస్తాయి. అయితే ఇక్కడ అలా క్షణకాలంలో వేగంగా వెళ్ళిపోతున్నట్టు చూపించడంలో అర్ధం? ఏ పంజరాన్నీ ఆమె సహించదు. పంజరమని తెలీక సంబంధంలోకి వెళ్తుంది, తెలిసిన వెంటనే తెంచుకుని అవతల పడుతుంది. ఇప్పుడున్న పంజరంలో వుండలేక పోతోంది కాబట్టే మెరుపు వేగంతో ఆ నడక. ఆయారాం గయారాం స్వింగ్ డోర్స్ తర్వాత, దాని కొనసాగింపుగా ఈ పంజరం సింబాలిజం. స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోతే ఆమెకి పంజరాలే. 

        ఇక డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఆమె చెప్పులు విడవడం. అదామె దినచర్యలో భాగమే. రోజూలాగే ఇప్పుడూ ఇంటికొచ్చాక ఇంట్లోనే కదా వుంటుంది. అందుకని చెప్పులు విడుస్తోంది. ఇంకొన్ని క్షణాల్లో ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఎలా వూహించగలదు. చెప్పులు విడవడమే కాదు, చీర కూడా మార్చుకుంటోంది. అతను డిటోగా మళ్ళీ గడప అవతలే నిలబడ్డాడు. ఇప్పటికీ ఆమె మనో ప్రాంగణంలో కెళ్ళే దమ్ముల్లేవు. ఇక అద్దం ముందు స్మిత, అద్దంలో ఆమె ప్రతిబింబం- అతడి అనుమానపు బుర్రకొద్దీ ఆమెలో అతను చూస్తున్న రెండు రూపాలు. అతడి మానసిక స్థితికి కనెక్ట్ చేసే సింబాలిజం.  

        5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో  ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. 

        
వివరణ : అతనేం ఆరోపిస్తున్నాడో, దానికామె రియాక్షన్ ఎలా వుందో చూస్తున్నాం. కానీ అంత రియాక్షన్లో కూడా ఆమె వెళ్లి పోవాలన్న ఆవేశంతో సొరుగు లాగలేదు. వొంటిమీద చీర లేదు, చీర కట్టుకుందామనే సొరుగు లాగి చూస్తోంది. అతనే ఫూలిష్ గా రెచ్చగొట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటూ. ఈ డైలాగుతో కథ కూడా మనకి తెలియజేయడం. అంటే ఆమె ఇదివరకే వెళ్లి పోయిందనీ, వెళ్తే తీసుకొచ్చాడనీ. అదే సమయంలో, ఎందుకు తీసుకొస్తున్నాడనే ప్రశ్నకూడా తలెత్తి, ఇది కూడా తెలుసుకోవాలన్న ఉత్కంఠ మనకి కలిగిస్తోంది ఈ డైలాగు. ఆమె సొరుగు లాగడమనే చర్యని  ఇన్ని విషయాలు తెలియ జేయడం కోసం వాడారు రచయితలు. 


    6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. 

        
వివరణ : ఇక్కడ వెంటనే సమాధానం దొరికింది. అదీ సంగతి. ఆమె సంపాదన మీద ఆధారపడ్డాడు కాబట్టే ఒకసారి వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆమె వున్నదున్నట్టు విషయం మొహం మీద చెప్పేసే సరికి, ఇక లాభంలేదని గట్టి దెబ్బ కొట్టేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా పై చేయి ఆమెది కాకూడదు. తన దగ్గర ఆమె దొంగలా దొరికిపోయే పక్కా ఎవిడెన్స్ వుంది. అందుకని ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి సిగరెట్ వెల్గించాడు! దమ్ము లాగాడు. ఈ పూట ఇంత సేపూ ఈ ఇంట్లో తనేమిటీ అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు తీరిపోయింది. క్లియరై పోయింది. ఈ సీనుకి సీనంతా తనొకే ఎక్స్ ప్రెషన్ తో వున్నాడు. ఎక్కడా ఇంకో ఎక్స్ ప్రెషనివ్వలేదు. ఇప్పుడు తను చేతికి చిక్కందని కూడా విషపు నవ్వు నవ్వలేదు. ఇక ధైర్యంగా ఇప్పుడు గడపదాటి బెడ్ రూమ్ లోకొచ్చేశాడు... డామ్ ష్యూర్ గా ఆమె మైండ్ స్పేస్ లోకి ఎంటరై పోయాడు! ఆమె సపరేట్ బ్యాక్ ఎక్కౌంటు, కొత్త సినిమా సైనింగు క్వశ్చన్ చేసేశాడు! గూడుపుఠాణీకి పక్కా ఎవిడెన్స్.

         మధ్యలో పనివాడు టీ కప్పుతో వచ్చేశాడు. ఇంతసేపూ వీడెక్కడున్నాడు. కిచెన్లో వున్నాడేమో. బాత్రూంలో బట్టలుతుకుతున్నాడేమో లాజిక్కి ఇబ్బందిలేదు. అవతల స్మిత తల్లి టీ కప్పుతో అలాగే వున్నట్టుంది. పనివాడి కిచ్చి పంపింది. ఈ టీ ద్వారా పలేకర్ బలహీనతని బయట పెట్టడం దర్శకుడి ఉద్దేశం. ఇదెలాగో చూద్దాం....

        7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలో తగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. 

        
వివరణ : అతనలా క్వశ్చన్ చేసేసరికి ఒక్క మాటతో తను తిప్పి కొట్టేసింది. పేకాటకి డబ్బంతా తగలేస్తూంటే గూడుపుఠాణీ చెయ్యకేం చేస్తుంది? అతడి ఎత్తుగడ చిత్తయి పోయింది. దీంతో బుర్ర తిరిగి, పనివాణ్ణి టార్గెట్ చేసి, టీ ఎవరు తెమ్మన్నారని తిట్టి వెళ్ళ గొట్టేశాడు. ఇది అసలుకి స్మితని తానేమీ చేయలేని బలహీనతని  బయటపడేసుకోవడమే. వాతావరణం బాగా వేడెక్కింది. అవతల కూతురు లేచి గ్రాంఫోన్లో ఆలాపన పెట్టింది. వాళ్ళు ఇలా అరుచుకుంటున్నప్పుడు, తను ఇలా నిరసన తెలపడం ఆమె కలవాటయి పోయిందేమో. కూతురి నిరసన కూడా వాళ్లనాపడం లేదు. ఇప్పుడు ఇద్దర్లో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది కాకుండా, కూతురి ముందు ఇద్దరూ దోషులుగా నిలబడ్డారు. పిల్లల్ని కన్నాక తమ హక్కులు రద్దయి, పోరాటాలు బంద్ అయి, పిల్లల హక్కులూ ఆరాటాలూ తమ ముందుంటాయని తెలుసుకో లేని దివాలాకోరు సంసారం వెలగబెడుతున్నారు. 

        ఇక అతను దండకం ఎత్తుకున్నాడు ఫాల్స్ ఇగో బాగా ప్లాట్ అయిపోయి - పూర్వం ఆమె కుటుంబాన్ని తను ఆదుకోవడం గురించి ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడాడు. దానికీ ఆమె కొట్టినట్టు జవాబియ్యడంతో మళ్ళీ బుర్ర తిరిగి, ఆమెనేమీ చెయ్యలేక ఈసారి కూతుర్ని టార్గెట్ చేస్తూ బలహీనత బయటపెట్టుకున్నాడు - రికార్డు ఆపమని అరుస్తూ. ఇంతకంటే అతనేం పీకలేడని టీ ద్వారా, గ్రాంఫోన్ రికార్డు ద్వారా చెప్పడం. అదే సమయంలో, స్మిత పూర్వ జీవితం మీద ఆసక్తి కల్గించడం. నిజంగా అతడన్నంత దారుణంగా వుందా పూర్వం ఆమె కుటుంబ పరిస్థితి? రెండోది, గతంలో ఆమె ఎవరితో వెళ్ళిపోయి వుంటుంది? ఈ రెండిటి గురించీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తామేమోనని మనం ఎదురు చూసేలా చెయ్యడానికి ఈ డైలాగుల ప్లాంటింగ్. ఇక అతను కూతురి మీద అరిచేసరికి, ఆమె అతడి మీద అరిచింది. ఇక టాపిక్ కూతురి మీదికి మళ్ళిపోయింది. కూతురి మీద ఫోకస్ అవుతూ సీను మలుపు తిరిగింది... 

        8. కోపాన్ని అణుచుకుంటూ, ‘మళ్ళీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మంటాడు. 

        వివరణ :  ఆ సిగరెట్ నలిపెయ్యడం ఆమెని నలిపేస్తున్నట్టు ఫీలై పోవడమే. సిగరెట్ తో ఇదింకో బలహీన వ్యక్తిత్వ ప్రదర్శన. చివరికి సిగరెట్ కథ ఇలా ముగిసింది. సిగరెట్ ఈ సీనులో సందర్భానుసార డైనమిక్స్ లో మన దృష్టి నాకర్షిస్తూ లైవ్ గా పాలుపంచుకుంది. ఈ సీనులో టీ, గ్రాంఫోన్, సిగరెట్, ఏ వస్తువు వాడినా, అది కథనో, పాత్రల్నోబయట పెట్టడానికే  వ్యూహాత్మకంగా ప్లే చేశారు తప్ప- కథనీ, పాత్రల్నీవదిలేసి అలంకార ప్రాయంగా ప్రయోగించలేదు.

        9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి, కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా. 


      వివరణ :  అతడంత మాటన్నాక ఆమె ఎందుకాగుతుంది. సాధారణంగా చిత్రణ లెలా వుంటాయంటే, ఆమె సూట్ కేసు సర్దుకుని కూతుర్ని బరబరా లాక్కుని వెళ్ళిపోతూ వుంటుంది ... ఇది బయటి నుంచి రచయిత తన డామినేషన్ తో పాత్ర మీద రుద్దే దుశ్చర్య.  ఇందులో పాత్ర ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ ఎక్కడుంది. మానవ సహజ డ్రామా ఎక్కడుంది? ఇంత సేపూ స్మిత తన గురించి, తన జీవితం గురించీ దూకుడుగా ఆలోచిస్తోందని మనకి తెలుస్తూనే వుంది. ఆమెకి కూతురి ధ్యాసే లేదు. కూతురు, ‘అమ్మా, నిజంగా వెళ్తున్నావా?’ అనేసరికి ఈ లోకంలో కొచ్చింది. ఉక్రోషమంతా దిగిపోయి కూతుర్ని గుర్తించింది. ఇప్పుడు తనే కాదు, తనతో కూతురూ అని తెలుసుకుంది. ఆగిపోయి ఆమెని రమ్మంది. ఇప్పుడామె ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ కరక్టుగా వచ్చాయి. అతనామె నాపుతూ, సుష్మ తన కూతురన్నాడు. దీనికామె, ‘నిజంగా?’ అంది వ్యంగ్యంగా. ఈ డైలాగు అన్పించడంలో ఉద్దేశం, అతడి పాత్ర చిత్రణలో మిగిలున్న అంశం కూడా పూర్తి చెయ్యడం. అతను భార్యనీ, అత్తనీ మాత్రమే కాదు, కూతుర్ని కూడా కూతుర్లా చూడలేదని. భార్య డబ్బూ, తన సుఖం - ఇంతే అతడి జీవితమని. ఈ డైలాగు పాత్రలోంచి సహజంగా వచ్చింది కాబట్టి రచయిత రాశాడు. 

        కూతురా మాట అనగానే నిలబడి పోయిన స్మిత కి -ఇటు చూస్తే కిచెన్ దగ్గర్నుంచి తననే చూస్తున్న తల్లి కన్పిస్తుంది, అటు చూస్తే తననే చూస్తున్న పలేకర్ కన్పిస్తాడు హాల్లోంచి. వాళ్ళు కూడా ఆమె సమాధానం కోసం చూస్తున్న అర్ధంలో ఫ్రేములోకి రావడం. ఎప్పుడెలా ఎవరు మాత్రమే ఫ్రేములోకి రావాలో, లయ బద్దంగా ఆ ప్రక్రియే కొనసాగుతోంది మొదట్నించీ సీనంతా.

        10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళిపోయి  టాక్సీనాపి ఎక్కేస్తుంది...

        వివరణ : అతడలా సవాలు విసిరేసరికి సమాధానం లేదు ఓటమి తప్ప. ఈ సీనులో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇక్కడ సీను కూతురి మీద ఫోకస్ అయినప్పుడు తప్ప. అప్పుడంతా రౌద్ర రసంతో వుంది, ఇప్పుడు కరుణ రసానికొచ్చింది. ఆమెకి కన్నీళ్లు రావడం రావడం ముందు ఇంకెప్పుడో గాకుండా, ఇప్పుడు కూతురితో కనెక్ట్ అయి వస్తేనే, హ్యూమన్ ఎలిమెంట్ జతపడి సీను క్లయిమాక్స్ సమగ్రమవుతుంది.

        సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్ లిద్దరూ ప్రసిద్ధ నాటక రచయితలూ కూడా. నాటక రచన ఆర్గానిక్ గా వుంటుంది. పైగా సినిమాల్లో పది సీన్లు వేసి చెప్పే విషయాన్నీ ఒక్క సీన్లో స్థలకాలాల ఐక్యతతో చెప్పేస్తారు. ఇందుకే ఈ సీను ఇలా వచ్చింది - బోలెడు - బోలెడు సమాచారమందిస్తూ, గత వర్తమాన భవిష్యత్ కాలాలకి సంబంధించి.

ఆరు నిమిషాలు - 41 షాట్లు

         ఇప్పుడు ఈ సీనుకి షాట్లు తీసిన విధానం చూద్దాం. షాట్స్ పొందిక వాక్యంలో పదాల పొందికంత అందంగా వుంటేనే అదొక వెండితెర పాఠ్యమవుతుంది. స్మూత్ గా సాగిపోయే విజువల్ లాంగ్వేజి అవుతుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర  వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయని ఈ వ్యాసం ప్రారంభం
లో ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పుకున్నాం. ఈ ప్రకారం కొన్ని కీలక షాట్స్ కి అర్ధాలు చూద్దాం.

        1. మిడ్ షాట్ లో బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పలేకర్, సిగరెట్ ముట్టుంచుకోవడానికి అగ్గిపెట్టె తీసి ఆగిపోతూ కిందికి చూశాడు. లో- యాంగిల్లో కారు దిగుతున్న స్మిత కన్పించింది. తనని తాను ఆమెకంటే ఉన్నతంగా భావించుకునే రకం కాబట్టి, పైనుంచి కిందికి ఆమెని  చూస్తున్నట్టు ఒకే లో - యాంగిల్ షాట్. కింద సపరేట్ గా వాళ్ళిద్దరి షాట్స్ వేయలేదు. వేస్తే రసభంగం. 

        2. ఆమె మెట్లెక్కి ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా అదే లో- యాంగిల్ షాటే అతను తలుపు దగ్గర్నుంచి చూస్తూంటే. ఆమె సజెషన్ లో అతణ్ణి చూస్తున్నట్టు కింది నుంచి హై యాంగిల్ షాట్ వేయలేదు. తన కంటే ఉన్నతంగా ఆమె అతణ్ణి చూసే ప్రశ్నేలేదు కాబట్టి. 

        3. ఆమె తలుపు దగ్గర అతణ్ణి చూసుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడు, అతడితో సమంగా మీడియం క్లోజప్ లోకి వచ్చింది. ఇప్పుడింకా ఘర్షణ మొదలవని మామూలు స్థితి కాబట్టి, సమంగా మీడియం క్లోజప్ లోకొచ్చింది. తర్వాత ఘర్షణ మొదలయ్యాక ఆమె మామూలు మీడియం క్లోజప్ లో వుండదు. ఫైర్ బ్రాండ్ గా బిగ్ క్లోజప్స్ లో వుంటుంది. 

        4. ఆమె బెడ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు పక్క గది కిటికీ వూచల్లోంచి ఆమెని చూపిస్తూ పానింగ్ షాట్. ఈ సినిమాలో ఆమె ప్రతీ రిలేషన్ షిప్ లోనూ పురుషుడితో పంజరంలో వున్నట్టే ఫీలవుతుంది. అందుకని కిటికీ వూచల్లోంచి ఈ షాట్. 

        5. అతను బెడ్ రూమ్ తలుపు దగ్గరికొచ్చి ఆగినప్పుడు, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు వున్న ఆమెకి, అతడికీ మీడియం క్లోజప్సే ఇచ్చారు. వాగ్యుద్ధం ఇప్పుడిప్పుడే తారా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి. 

          6. అతను దర్శకుడితో సంబంధాన్ని అంటగట్టి మాటాడినప్పుడు తారా స్థాయికి వెళ్ళింది. ఆమె కోపం పెట్రేగిన ఈ ఉద్రిక్త క్షణాల్లో మామూలు క్లోజప్ కాదు, బిగ్ క్లోజప్ లో కొచ్చేసింది. అతను అదే మీడియం క్లోజప్ లో వుండి పోయాడు. ఇప్పుడిక ఆమె రివోల్ట్ అవుతున్న పతాక దశ ఇదన్నమాట. ఇంతవరకూ ఎక్కడా బిగ్ క్లోజప్ ఆమె మీద వేయకుండా జాగ్రత్త పడ్డారు. 

        7. ఇప్పుడతను కదిలి ఆమెతో బిగ్ క్లోజప్ లోకి వచ్చేశాడు. ఇలా రావడానికి కారణం ఆమెతో సమంగా ఫైర్ అవుతూ, కొత్తగా తీవ్రారోపణ చేస్తున్నాడు. తనకి చెప్పకుండా ఆమె కొత్త బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచినట్టూ, ఇంకో కొత్త సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసినట్టూ. ఈ నిజంతో ఆమె ఆలోచించుకోవాలన్నట్టు బిగ్ క్లోజప్ లోంచి తప్పుకుంది.  

        8. దానికామె సమాధానం చెప్తున్నప్పుడు తిరిగి ఇద్దరూ మీడియం క్లోజప్ లో. అప్ అండ్ డౌన్స్ ని షాట్స్ ఫాలో అవుతున్నాయి.      
        
9. ఇప్పుడామె గతంతో ఆమె మీద ప్రతాపం చూపిస్తూ అతను బిగ్ క్లోజప్ లోకొస్తే, కెమెరా అతణ్ణి ఫాలో అయి పక్కనున్న ఆమెనీ ఫ్రేములోకి తీసుకుంది. అతడి ప్రతాపం పూర్తయ్యాక, ఆమె ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చి తప్పుకోవడంతో, షాట్ కట్ అయింది.
        10. దీంతో అతను సపరేట్ గా బిగ్ క్లోజప్ వేసుకుని, రికార్డు పెట్టిన కూతురి మీద అరుపులు అరవడం.
        11. వెంటనే ఆమె కూడా బిగ్ క్లోజప్ లోకొచ్చేసి, రికార్డు ఎందుకాపాలని అంతకంటే అరుపులు అరవడం.
        12. దీంతో తలుపు దగ్గరున్న అతను ఠక్కున మీడియం క్లోజప్ లోకొచ్చేశాడు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయే బహానాలు వెతుకుతున్నావా - అంటూ.     

        13. పుల్ బ్యాక్ చేస్తే ఆమే అదే ఫ్రేములో అతడి సమీపంలో వుంది. ఆమె ఇలా ముందు కొస్తున్నట్టు చూపించలేదు. ఆమెని తలుపు దగ్గరే  అతడి ముందుంచి, పుల్ బ్యాక్ చేస్తే, ఆమె ముందుకు కదిలిన అర్ధమే వచ్చింది. అంటే వెళ్ళిపోవడానికి ఇక సిద్ధమని. 

        14. స్మిత సూట్ కేసు పట్టుకుని వెళ్లి పోతున్నప్పుడు, కూతురు అన్న మాటకి ఆగిపోయి,  అటు చూసినప్పుడు, కన్పించిన తల్లి బ్లర్ అవుతుంది. ఆమెకి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని స్మిత ఫీలవక పోవడం వల్ల. 

        15. స్మిత ఇటు తిరిగి చూసినప్పుడు, పలేకర్ ని కూడా బ్లర్ గానే చూసింది. కేర్ చేయనట్టు. అతను ముందుకొచ్చి కూతురి గురించి సవాలు విసిరినప్పుడు. మీడియం క్లోజప్ లోనే వుంది...ఇక ఆమెకి బిగ్ క్లోజప్స్ లేవు. పరాజితురాలు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించిన తల్లికే కూతుర్ని అప్పగించింది.


     ఈ విధమైన షాట్స్ కలబోతతో సీను తెరకెక్కింది. దర్శకుడు శ్యాం బెనెగళ్ విజన్తో  సీను క్లాసిక్ హోదాకి చేరింది. ఈ సీను స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ సీనే. స్మిత షూటింగ్ ముగించుకుని డైరెక్టర్ తో ఇంటికొచ్చే రెండు సీన్ల తర్వాత, మూడే సీనే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ ఒక్క సీనులోనే సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ వరకూ వుండే ఓ ఇరవై సీన్ల విషయమంతా వుంది. గ్రేట్ కదూ? నాటక టెక్నిక్ వల్ల ఇలా కుదిరింది. ఈ వొక్క సీన్లోనే బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో వుండే పాత్రల పరిచయం, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్సూ ప్లే అయ్యాయి. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇప్పుడామె గోల్ ఏమిటో దేవుడెరుగు. ఈ సీను తర్వాత చిన్నప్పట్నుంచీ ఆమె ఫ్లాష్ బ్యాక్.   
  
       ప్రాంతీయ సినిమాల్లో ఇలాటి టెక్నిక్స్ వుంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో అవే టెంప్లెట్స్ తప్ప రాయడానికేమీ వుండడం లేదు...

సికిందర్
       

14, మార్చి 2021, ఆదివారం

1024 : సందేహాలు -సమాధానాలు



Q : మీరు నాంది’, శ్రీకారం సినిమాలకి ఇచ్చిన విశ్లేషణలు చూశాను. రివ్యూల కంటే ఇదే బావుంది. మీరు రివ్యూలు మానేసి మంచి పనే చేశారు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ చేస్తే చాలు. అంతా అర్ధమైపోతుంది. ఇదే ముఖ్యం. ఇలాగే కంటిన్యూ చేయండి.
ఎస్. ఎం, దర్శకుడు

A : అద్భుతమైన సినిమా ఏదైనా వస్తే పూర్తిస్థాయి రివ్యూ రాయక తప్పదు. మామూలుగా మీడియాలో వస్తున్న రివ్యూలు చాలు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ కూడా అన్నిటికీ అవసరం లేదు. ఒక స్క్రిప్టు రాయడానికి పూనుకునే ముందు తీసుకున్న ఐడియా (కాన్సెప్ట్) ని నిర్మించుకోవాలని ప్రపంచంలో ఎక్కడా చెప్పలేదు. సినాప్సిస్ నుంచే మొదలు పెట్టి చెప్పారు. కానీ సినాప్సిస్ రాయడానికైనా ముందుగా ఐడియా సెట్ అవ్వాలి. నిర్దుష్టమైన ఐడియా లేకుండా సినాప్సిస్ రాస్తే అదేమంత బలంగా కూడా వుండదు. బలం సంగతి తర్వాత ఆర్డర్ వేసేప్పుడు చూసుకోవచ్చను కుంటారు. అది జరగదు. అలా ఏ దశలోనూ జరగదు. ఐడియా అనేది మొత్తం స్క్రీన్ ప్లేకి బలానికి బేస్ వంటిది. ఇది అర్ధమయ్యాక, ఈ బ్లాగులో  తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  అంటూ వ్యాసాలు రాస్తున్నప్పుడు, ముందుగా ఐడియా నుంచే ప్రారంభించాం. తెలుగుకి వ్యాసాలు డిఫరెంట్ గా వుండాలిగా.  
       
     ఐడియాని విశ్లేషించుకున్నప్పుడు
, అందులో మార్కెట్ యాస్పెక్ట్ వుందా లేదా తెలుస్తుంది. ఐడియాని విశ్లేషించు కున్నప్పుడు అందులో కథ వుందా, గాథ వుందా, కొంపదీసి డాక్యుమెంటరీ వుందా తెలుస్తుంది. ఐడియాలో స్ట్రక్చర్ని విశ్లేషించుకున్నప్పుడు,  అందులో త్రీయాక్ట్ స్ట్రక్చర్ వుందా, కొంపలు ముంచే మిడిల్ మాటాష్, సెకండాఫ్ సిండ్రోములు తిష్ట వేసి వున్నాయా తెలుస్తుంది. ఇలా చాలా తెలుస్తాయి. అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక్క మెతుకు చాలన్నట్టు, ఐడియాని ఉతికి ఆరేస్తే స్క్రీన్ ప్లే బతికిందా లేదా తెలిసిపోతుంది. అందువల్ల సినిమాకి ముఖ్యంగా ఏది బేస్ గా వుంటుందో దాన్ని విశ్లేషిస్తే చాలన్నట్టు సమీక్షలు ఇస్తున్నాం, మీ సూచనలకి థాంక్స్.

Q : నాదొక ప్రశ్న. సరదా సరదాగా సాగిపోతున్న కథ, ఒక అనుకోని సంఘటనతో సీరియస్ క్రైమ్ లోకి టర్న్ అవ్వొచ్చా? ఇది జానర్ మర్యాదను ధిక్కరించినట్టు అవుతుందా? ఇలాంటి కథలు రాసేటప్పుడు (ఉదా : నా పేరు శివ) స్క్రీన్ ప్లే లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? కథలోకి సడన్ గా క్రైమ్ ఎలిమెంట్ రావొచ్చా? లేక ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావిస్తుండాలా? దీనికి రిఫరెన్స్ సినిమాలు ఏమైనా ఉన్నాయా?
అశోక్, అసోసియేట్

A : ఎంత సరదా సరదాగా సాగిపోతున్నా పీపీ వన్ వచ్చేసరికి అనుకున్న క్రైమ్ తో కథ ప్రారంభమవాల్సిందే. దీనికి జానర్ మర్యాదతో సంబంధం లేదు. స్ట్రక్చర్ తో సంబంధం. క్రైమ్ ముందు నుంచీ రేఖామాత్రంగా రావాలంటే బిగినింగ్ విభాగంలో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా దీన్ని సెట్ చేసుకుంటూ రావాలి. కథని బట్టి వుంటుంది. కొన్ని కథలకి ఇది అవసరం లేదు. సరదా సరదాగా వెళ్ళి ఒక కారాపి ఎక్కితే, అందులో కిల్లర్ వుంటే, అదే పీపీ వన్ అవచ్చు. ఇలాటి సందర్భంలో ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావించ నవసరం లేదు. కథలోకి సడన్ గా పీపీ 1 లో క్రైమ్ ఎలిమెంట్ లాగా రావచ్చు. రిఫరెన్సులు ఎన్ హెచ్ 10’, హాలాహల్ లాంటివి చాలా వుంటాయి. ఇవి కామన్.

Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. ఒక స్మాల్ డౌట్ రావడంతో ఈ మెసేజ్ చేస్తున్నా. సీనిక్ ఆర్డర్ అనేది లొకేషన్ ఛేంజ్, క్యారక్టర్స్ ఛేంజ్ బట్టి మనకి సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో క్లారిటీ ఇస్తూనే, షూటింగులో కూడా సీన్స్ తీస్తున్నప్పుడు ఈ సీనిక్ ఆర్డర్ కన్ఫ్యూజ్ పడనివ్వకుండా ఉపయోగపడుతుంది కదా. మరి ఒకే లొకేషన్ లో జరిగే మూవీస్ వస్తున్నాయి, డోంట్ బ్రీత్ లాంటివి. ఇలాటి మూవీస్ కి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అని సీనిక్ ఆర్డర్ ఎలా వేసుకోవాలి? ఈ డౌట్ ని కాస్త క్లారిఫై చేయండి.
రాజేష్ అసిస్టెంట్

A : ఏముంది సింపుల్. సింగిల్ లొకేషన్లో ఎన్ని స్పాట్స్ లో సీన్లుంటే ఆ స్పాట్స్ ని సబ్ సీన్లుగా పరిగణించి, సీన్ నంబర్ పక్కన స్పాట్స్ కి ఎబిసీడీలు ఇచ్చుకోవడమే. ఈ మధ్య ఇలాటి ఒక పూర్తి స్థాయి సింగిల్ లొకేషన్ స్క్రిప్టుకి, ఎబిసీడీలు కన్ఫ్యూజన్ గా తయారై, అన్నిటికీ సీన్ నంబర్లు ఇచ్చేశాం. బెడ్రూంకి సీన్ 1, హాలుకి సీన్ 2, కిచెన్ కి సీన్ 3 ఇలా... గోడవ వదిలిపోయింది. మీరు కూడా ఇలా చేయవచ్చు.

        ‘డోంట్ బ్రీత్  స్క్రీన్ ప్లేలో సీన్ నంబర్లు వుండవు. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల్లో సీన్ నంబర్లు వేస్తే ఆ రైటర్ ఫ్రొఫెషనల్ కాదని తెలిసి పోతాడు. సీన్ నంబర్లు వేయకుండా ఒక నవలలాగా నిర్మాతలు చదవడానికి స్క్రీన్ ప్లే ఈజీగా వుండాలి. సీన్ నంబర్లు తర్వాత ప్రొడక్షన్ విభాగం వేస్తుంది- షెడ్యూలింగ్, క్యాస్టింగ్, ఎడిటింగ్ అవసరాల కోసం. దీన్ని షూటింగ్ స్క్రిప్టు అంటారు. అయితే దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే లో సీన్ నంబర్లే గాక, సబ్ సీన్స్ కి ఎబిసీడీలు కూడా వేశారు.

Q : దేర్ విల్ బి బ్లడ్ విశ్లేషణలో నాకు ఒకటి అర్ధం గాలేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మకి బ్యాడ్ జరుగుతున్నట్టే వుంది తప్ప, గుడ్ కర్మకి గుడ్ జరుగుతున్నట్టు ఎక్కడాలేదు. అంటే గుడ్ కర్మ అనేది లేదనా? కర్మ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయమేంటి?
ఎస్. ఎల్. వి. ప్రకాష్, పాఠకుడు

A : నిజమే, ఇది మనకి తట్టనే లేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మ గురించే గాథ వుంది. అయితే శత్రువులైన డానీ, ఇలై ఇద్దరూ మంచి కర్మలు చేసే రకాలు కారు. ఒక్క మేరీతో గుడ్ కర్మగా వుంటున్న డానీ, చివరికి బ్యాడ్ కర్మే చేశాడు. అతను మతంలోకి మారినప్పుడు, మేరీ కూడా మతంలోకి మారి ఫ్యామిలీ అన్పించుకుంటే, కొడుకుని బాస్టర్డ్ అని చెప్పి వెళ్ళగొట్టి, కోడలైన మేరీని అవమానకర పొజిషన్లోకి నెట్టేశాడు.

చిన్నప్పుడు మేరీ తండ్రి ప్రార్ధన చేయట్లేదని కొట్టే వాడు. తర్వాత అదే తండ్రి వేరే కారణం చేత పెద్ద కొడుకు ఇలై చేతిలో ఘోరంగా తన్నులు తిన్నాడు. ఇంత దారుణంగా వుంటుంది బ్యాడ్ కర్మ ఫలితం. ఇలా ఎవర్నీ వదిలిపెట్టకుండా బ్యాడ్ కి బ్యాడ్ లాగే వుంది గాథ. దీంట్లో మళ్ళీ గుడ్ చూపిస్తే ఫీల్ చెడుతుందని (రస భంగమవుతుందని) కావచ్చు, గుడ్ కి గుడ్ చూపించలేదు.

కర్మ సిద్ధాంతం సైంటిఫిక్. యూనివర్సల్ ట్రూత్. ప్రకృతి నియమం. దీన్ని సింపుల్ గా వివరించే సంఘటన జరిగింది. చాలా ఏళ్ళ  క్రితం ప్రశాంతంగా వుండే మా కాలనీ ఆలయంలో విజయవాడ నుంచి ఒకావిడ ప్రవచనా లివ్వడానికొచ్చింది. తెల్లారి అయిదుగంటలకి ప్రవచనాలు విన్పిస్తూండేవి. ఒక రోజు వాకింగ్ చేస్తూ వింటూంటే ఆవిడ చెప్పుకొచ్చింది...మాకు మంచి రోజులు రావడం లేదు రావడం లేదని, గుళ్ళూ గోపురాలూ యాత్రలూ తిరుగుతూంటారు. మంచి రోజులెలా వస్తాయి? చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్ అనేసింది. సింపుల్ గా సింగిల్ లైనులో పంచ్ డైలాగ్- చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్  షీ ఈజ్ జెమ్. మాయచేసి భక్తుల్ని దండుకోవాలనుకోలేదు.
        
కనుక కష్టాలొచ్చాయని, రామా అల్లా ప్రభూ అంటూ సాగిలపడితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. దేవుళ్ళు మనల్ని పుట్టించడమే ఎక్కువ, మోయడం కూడానా? మంచి రోజులు రావాలంటే మంచి పనులు చేయడమే. మొత్తానికి  దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే సంగతుల పుణ్యమాని చాలా ఫిలాసఫీ మాట్లాడుకున్నాం ఈ సినిమా బ్లాగులో. ఇక ఆపుదాం.

సికిందర్ 


13, మార్చి 2021, శనివారం

1023 : మూవీ నోట్స్


         రైతులు బాగు పడాలన్నా, సినిమాలు బాగు పడాలన్నా మార్కెట్ దృష్టే ప్రధానం. మార్కెట్ ని ఏ దృష్టితో చూస్తున్నారన్నది ముఖ్యం. ఇందులోంచి ఆవిర్భవించిందే సినిమాలకి సంబంధించి మార్కెట్ యాస్పెక్ట్ అన్నఆలోచన. మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ అన్న కార్యాచరణ. శ్రీకారం సినిమా కాన్సెప్ట్ అయిన వ్యవసాయానికి ఏది మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది? స్టాలిన్ తెచ్చిన సమిష్టి వ్యవసాయం విఫలమైంది. లెనిన్ తెచ్చిన పంటల మీద ప్రభుత్వానికి అధిక బాగం విధానం కూడా విఫలమైంది. ఈ రెండు సార్లూ రైతులు తిరగబడ్డారు.        తెలంగాణా రైతాంగ పోరాటంలో దొరల చేతుల్లోంచి లాక్కున్న భూములు దొరల చేతుల్లోకే వెళ్ళాయి. ఇప్పుడు ప్రభుత్వం నయాదొరల (కార్పొరేట్) చేతుల్లో వ్యవసాయ రంగాన్నిపెట్టే కొత్త చట్టాలు తెచ్చింది. దీని మీద తిరగబడుతున్నారు రైతులు. ఇలాంటప్పుడు  శ్రీకారం  హీరో ఇంకా రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయిస్తానంటాడు దొరలాగా. రైతులతో ఉమ్మడి వ్యవసాయం చేయించడం, ఇది చూపించి వ్యవసాయం లోకి రావాలని యువతకి సందేశమివ్వడం, ఎలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అవుతుంది?   

        మ్మడి కుటుంబ వ్యవస్థే అసాధ్యమైనప్పుడు అందరూ కలిసి వుండే ఉమ్మడి కుటుంబాలు ఇంకా కావాలనే సినిమాలు వస్తున్నాయి అవగాహన లేకుండా. ఇప్పుడు ఉమ్మడి వ్యవసాయం సినిమా వచ్చింది. దెబ్బతిన్న రైతుల్నీ వాళ్ళ భూముల్నీ ఒక చోట చేర్చి, హీరో రైతులకి నెలజీతాలివ్వడం, హీరో సహా అందరూ కలిసి పంటలు పండించుకోవడం, ఆ పంటల్ని అమ్మి హీరో ఆదాయాన్ని పంచడం. ఇదీ కథ. హీరో యాజమాన్యంలో ఉమ్మడి వ్యవసాయం.

        ఈ కథలో అసలు రైతులెందుకు వ్యవసాయం వదిలేశారు. విత్తనాలు, ఎరువులు, ఇంకేవో బరువులు వంటి టెంప్లెట్ సినిమా కారణాలు చెప్పారు. హీరో ఇది నమ్మి టెంప్లెట్ గా కొత్త వ్యవసాయ పద్ధతులు, కొత్త పంటలు ప్రవేశపెట్టాడు. దీంతో టెంప్లెట్ గా విజయం సాధించాడు. పంటలు ఎలా పండించాలో రైతులకి తెలియకనా. వాళ్ళ చేత చెప్పించిన టెంప్లెట్ కారణాలకంటే పెద్ద సమస్య మార్కెట్ సమస్య. హీరో ఎంత గొప్పగా ఆధునిక పద్ధతులనే టెంప్లెట్ తో పరిశోధనలు చేసి ఉమ్మడి వ్యవసాయం చేయించినా, మార్కెట్లో సగానికి సగం ధరలకే అమ్మాలి. అప్పుడు మిగిలేది గుండు సున్నా.

        కనీస మద్దతు ధరల కంటే హీనంగా ధరలు నిర్ణయిస్తున్నాయి మార్కెట్ శక్తులు. ఇక్కడే రైతు దివాలా తీస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఏడు రూపాయలకి, పది రూపాయలకి కిలో యాపిల్ పళ్ళు కొని, 150 రూయాయకి వినియోగదార్లయిన మనకి అమ్ముతున్నాయి కంపెనీలు. రైతులే కాదు, వినియోగ దార్లయిన మనమూ దోపిడీకి గురవుతున్నాం. మనం నిశ్శబ్దంగా వుంటున్నాం, రైతులు ఆందోళన బాట పట్టారు. వరి ధాన్యం కూడా ఇలాగే కొనుగోలు చేసి, కేజీ ఇరవై రూపాయలకి తయారైన బియ్యాన్ని, విదేశాల్లో 150 కి అమ్ముతున్నారు.

        ఫేస్ బుక్ లో ఒక వీడియో పెట్టారు అమెరికాలో ఒక తెలుగు వ్యక్తి. అందులో వ్యవ సాయ క్షేత్రంలోనే రైతు వినియోగదారులకి కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలు వివరించారు. అలాటి వ్యవసాయ క్షేత్రాలున్నాయి. రైతులు అన్ని కూరగాయలూ, ఆకు కూరలూ, అల్లం వెల్లుల్లి సహా పళ్ళూ ఒకే చోట పండిస్తారు. రైతులు తమకి కావాల్సినవి నేరుగా చెట్ల నుంచి కోసుకుని డబ్బు చెల్లిస్తారు. ఇలా వినియోగదారులకి తక్కువ ధరలకి లభించడమే గాక, రైతులకి ఎన్నో మార్కెటింగ్ ఖర్చులూ తప్పుతున్నాయి. ఇంకో తలుగు వ్యక్తి అమెరికాలో సంతల గురించి వీడియో పెట్టారు. మనకి హైదరాబాద్ లో వివిధ చోట్ల వారం వారం తోపుడు బళ్ళ మీద సంతల్లాగా అక్కడా వున్నాయి.

        మన దేశంలో మొత్తం వ్యవసాయరంగం మీద ఆధార్పడ్డ మూడువేల వివిధ పరిశ్రమలు ఏటా ఇరవై లక్షల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ 85 శాతం మంది రైతులు వాళ్ళకి వ్యవసాయోత్పత్తు లందించి, నెలసరి ఆదాయం బొటాబొటీగా ఆరువేల రూపాయలు చేతిలో మిగిలి దీనంగా బ్రతుకులీ డుస్తున్నారు. ఇవి ప్రభుత్వం దగ్గరున్న గణాంకాలే. రైతు అన్నదాత అనే భుజకీర్తులు అవసరం లేదు, రైతు కంపేనీలకి లక్షల కోట్ల ఆదాయ ప్రదాతగా కరిగిపోతున్న కొవ్వొత్తి. ఇది గుర్తించాలి. ప్రభుత్వాలు కంపెనీల్ని నియంత్రించవు. వాటికి కంపెనీల నుంచి వచ్చే వివిధ పన్నులు, పార్టీ ఫండ్స్ కావాలి. ఇలా ప్రభుత్వాలూ కంపెనీలూ రైతుల మీద స్వారీ చేస్తూ తమ పంట పండించుకుంటున్నాయి.

        ఈ వాస్తవాలు తెలుసుకోకుండా, హీరో ఉమ్మడి వ్యవసాయంతో ఉద్ధరిస్తాననడం అపరిపక్వతే అవుతుంది. ఒక స్టార్ సినిమాకి ఇంత అల్లి బిల్లి కథ వుండకూడదు. అసలు వ్యవసాయం వదిలేసిన రైతులతోనే ఉమ్మడి వ్యవసాయం చేయించి, వ్యవసాయంలోకి యువత రావాలని ఎలా సందేశ మిస్తారు. ఈ సినిమా టార్గెట్ ఆడియెన్స్ రైతులే అన్నట్టుంది. వాళ్ళ టెంప్లెట్ కష్టాలూ కన్నీళ్ళూ ఉమ్మడి వ్యవసాయాలూ ఇవే చూపించారు. ఇంతా చేసి ఎవరూ ఉమ్మడి వ్యవసాయంతో బాగుపడినట్టు చూపించలేదు. మొదట్లో వున్న గెటప్స్ తోనే చివర్లో వున్నారు. ఆర్ధిక ఉన్నతి  లేదు. హీరో దొరతనం అలాగే వుంది. అసలు కరోనా కాలంలో రైతుల కడగండ్లు అంటూ చూపించడమేమిటి. కరోనా కాలంలోనే ఇతర పరిశ్రమలూ వ్యాపారాలూ కుప్ప కూలిపోగా, వ్యవసాయరంగ
మొక్కటే జీడీపీ తో దేశాన్ని ఆదుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లాగా సినిమాలో కూడా ఫేక్ న్యూస్ వుంటే ఎలా?

        సినిమాలో ఇచ్చిన సందేశంతో ఈ స్టార్ మూవీ టార్గెట్ ఆడియెన్స్ యూత్ అవ్వాలి. అప్పుడు యూత్ ని ఆకర్షించే కథా కథనాలే యూత్ అప్పీల్ తో వుండాలి. ఇదీ ఈ సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్. ఇప్పుడు చూపించాల్సింది రైతులతో ఉమ్మడి వ్యవసాయం కాదు. ఎక్కడెక్కడున్న ఆ రైతుల కొడుకుల్నీ, కూతుళ్లనీ రప్పించి, వాళ్ళ వాళ్ళ వ్యవసాయాల్ని ఇప్పుడంటే ఇప్పుడే వాళ్ళ చేతే చేయించడం. కష్టాలూ కన్నీళ్ళతో కాదు.  డైనమిక్ గా, వైబ్రెంట్ గా. జాయ్ రైడ్ గా. వాళ్ళ అమాయకత్వం, పిచ్చి పనులూ సహా ఎంటర్ టైనర్ గా. హీరో కేవలం మోటివేటర్ గా. దొర కాదు, ఖజానా గుప్పెట్లో పెట్టుకున్న యజమాని కాదు. ఇక మార్కెట్ శక్తులతో యూత్ డీల్ చేసే రూటేవేరు. మెడలు వంచి ముకుతాడేస్తారు. మార్కెట్ యార్డుని ఫార్మర్ ఖిల్లా చేస్తారు.      

        పోతే, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమాకి స్ట్రక్చర్ అనేది ఏమాత్రం లేదు. కాన్ఫ్లిక్టే లేదు. కాన్ఫ్లిక్ట్ లేకుండా కథెలా అవుతుంది. డాక్యుమెంటరీ అవుతుంది. అయింది.

సికిందర్

 

11, మార్చి 2021, గురువారం

1022 : దర్శకుడి స్టోరీ


   ‘ర్జున్ రెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి టాలీవుడ్ లో రెండో సినిమా దొరకడం లేదు. విజయ్ దేవరకొండ స్టార్ డమ్ ని ఏక్ దమ్మున పెంచేసిన అర్జున్ రెడ్డి తర్వాత నుంచి  వంగా టాలీవుడ్ లో  ఖాళీగానే వున్నాడు. 2017 లో అర్జున్ రెడ్డి విడుదలైంది. అప్పట్నుంచీ ఈ నాల్గేళ్ళూ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. తెలుగు స్టార్స్ కి అతడి కథలు నచ్చలేదని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక లాభం లేదని బాలీవుడ్ వైపు దృష్టి సారించాడు. అక్కడ అదృష్టం పలకరించింది. అర్జున్ రెడ్డి రీమేక్ కి షాహిద్ కపూర్ అంగీకరించాడు. దీంతో అక్కడి నిర్మాణ సంస్థతో కబీర్ సింగ్ తీస్తే అది అతి పెద్ద హిట్టయ్యింది. 60 కోట్ల బడ్జెట్ తో తీస్తే 370 కోట్లు వసూలు చేసింది. ఇది వంగా సాధించిన పెద్ద రికార్డు. ఇది 2019 లో జరిగింది. తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టి  మళ్ళీ ప్రయత్నాలు చేసీనా, నో అనే చెప్పింది టాలీవుడ్.

నిజానికి అర్జున్ రెడ్డి కి కూడా నిర్మాతలు దొరకలేదు. నాల్గేళ్ళూ తిరిగి తిరిగి విసిగి, తానే స్వయంగా నిర్మించేందుకు పూనుకున్నాడు. తండ్రి, సోదరుడు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అలా 5 కోట్ల బడ్జెట్ తో అర్జున్ రెడ్డి నిర్మించారు. అది 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయినా తెలుగు స్టార్లు ఆసక్తి చూపలేదు.

        కబీర్ సింగ్ హిట్ ని చూసి కూడా తెలుగు స్టార్లు అవకాశమివ్వక పోవడంతో మళ్ళీ బాలీవుడ్ కెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ రణబీర్ కపూర్ తో ఓకే అయ్యింది. సందీప్ చెప్పిన యానిమల్ స్టోరీకి కబీర్ సింగ్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కూడా వెంటనే ఓకే చెప్పి ఎననౌన్స్ కూడా చేసేశారు. ఇక చక చకా పరిణితి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి స్టార్లు కూడా ఇందులో నటించేందుకు బుక్కైపోయారు.

        ఇదీ సందీప్ రెడ్డి లక్ బ్యాడ్ లక్ ల దొబూచులాట. బాలీవుడ్ లోనే లక్ వున్నట్టు అనుకోవాలి. అక్కడే సెటిలైతే తెలుగు నుంచి రెండో రామ్ గోపాల్ వర్మ అవుతాడు. ఇక టాలీవుడ్ కి రాంరాం, బాలీవుడ్ గయా రామ్ అనుకుని సెకండ్ వర్మ అయిపోతే సరి!
***

1

  

8, మార్చి 2021, సోమవారం


       అసలీ సినిమా మొత్తాన్నీ గమనిస్తే నాటక ధోరణిలో గాథ కన్పిస్తుంది. గాథ అంటేనే పాత స్కూల్లో చెప్పేది. నాటకంలో ఒక్కో అంకానికి తెరపడుతున్నట్టు ఒక్కో చాప్టర్ గా నిదానంగా సాగే ఈ గాథకి ఈ ధోరణిలోనే బలమైన ఆకర్షణ వుంది. అది హృదయాలకి గాలం వేస్తుంది. పాత అనేది లేదు. సాంప్రదాయం లేకపోతే ఆధునికత్వం లేదు. సాంప్రదాయం లేకపోతే దేన్ని చూసి ఆధునికత్వం వస్తుంది. సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యుదయం పుడుతుంది. సాంప్రదాయం లేకపోతే అభ్యుదయం ఎక్కడ్నుంచి పుడుతుంది. పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేకపోతే ఠాట్ వీల్లేదని ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కడుంటాయి. వాళ్ళూ వీళ్ళూ కొట్టుకోవడం, వీధిన పడ్డం ఎక్కడుంటుంది. కాబట్టి సాంప్రదాయ అంశలేని ఏ ఆధునిక జీవితంకళవ్యవహారం లేదు. దాన్ని కూడా కలుపుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడున్న సినిమాల మేకింగ్ కి సినిమా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు కాలేకపోతున్నారు. ఏదో పైపైన చూసేసి మర్చిపోవడమే. ఎంత హిట్ అన్పించుకున్నా మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకులు ఒకప్పటి లాగా వుండడం లేదు. సినిమా ప్రేక్షకుల్లోని ప్రేక్షకుల్ని చంపేస్తున్న ఈ మేకింగ్ తీరు తెన్నుల్ని సంస్కరించుకోవడానికి దేర్ విల్ బి బ్లడ్ లాంటి గాథలు ఎంతైనా ఉపయోగపడవచ్చు.  

      ఇప్పుడు ఎండ్ విభాగాని కొచ్చాం. మిడిల్ 2 లో భూములున్న బాండీ వచ్చి, పైప్ లైన్ వేసుకోవడానికి భూములు కావాలంటున్న డానీ ని బ్లాక్ మెయిల్ చేసే దగ్గర ఆగాం. డానీ చేసిన హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని ఈ బ్లాక్ మెయిల్. ఇప్పుడు డానీకి భూములు కావాలంటే, చర్చికి వచ్చి మతంలో చేరాలని బాండీ ఆదేశం. ఇది పీపీ 2 ఘట్టం. మతాన్ని వ్యతిరేకించే డానీకి ఇది ఇరకాటంలో పెట్టెసే ఘట్టం. గాథ మతాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమయింది పీపీ 1 దగ్గర. దీనికి సమాధానంగా మతాన్ని ఒప్పుకోవాల్సిన ఈ పీపీ 2 ఘట్టం. గాథకి పీపీ 1 సమస్యా స్థాపన, పీపీ 2 పరిష్కార మార్గం. పీపీ 1, పీపీ 2 ల మధ్య ఈ  మిడిల్ 1, మిడిల్ 2 లతో వుండేదే సినిమా కథ (గాథ). దీని తర్వాత వుండేది కథ (గాథ) కాదు, కథకి (గాథకి) ముగింపు కథనం...

    ఎండ్ కథనం :  చర్చిలో డానీ ప్రాయశ్చిత్తం. డానీ ప్రత్యర్ధి పాస్టర్ ఇలై కార్యక్రమం నిర్వహిస్తాడు, ప్రభువు వైపు చూస్తూ నేను పాపిని, కొడుకుని వదిలేశానని పదేపదే గట్టిగా చెప్పమంటాడు. చెప్పాక డానీ జుట్టు పట్టుకుని సైతాను వదిలిస్తాడు. డానీ పునీతుడవుతాడు. ఇక బాండీ భూముల్ని లీజుకి తీసుకుని పైపు లైన్ వేయడం ప్రారంభిస్తాడు.

        ఎక్కడో వుంటున్న కొడుకుని తీసుకొచ్చి కలుపుతారు. కొడుకుని హత్తుకుంటాడు. కొట్టమని చెంప మీద కొట్టించుకుంటాడు. ఇక కొడుకు జ్యూనియర్ డానీతో ఆనందంగా జీవితం గడుపుతాడు. జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చి విడిగా వ్యాపారం చేసుకుంటాను, వాటా పంచమంటాడు. పంచనంటాడు డానీ. తండ్రిగా నిన్ను ఒప్పుకుంటాను గానీ, పార్టనర్ గా నీతో పొసగడం లేదంటాడు జ్యూనియర్. నీ తండ్రెవరు, అక్రమ సంతానానివి నువ్వని దూషిస్తాడు డానీ. అనాధగా దొరికితే పెంచి పోషించానంటాడు. తన గురించి ఈ కొత్త విషయాలు తెలుసుకున్న జూనియర్ విరక్తితో వెళ్ళిపోతాడు.

మరికొంత  కాలం గడిచి పోతుంది. ఆయిల్ మోతుబరిగా ఇంకింత ఎదిగి విశాలమైన బంగాళాలో ఒంటరిగా వుంటాడు డానీ. తాగుడు మరుగుతాడు. ఇప్పుడు ఇలై వస్తాడు. చాలా రిచ్ గా వుంటాడు. ఇన్నాళ్ళూ మతప్రచారం చేస్తూ దేశాలు తిరిగానంటాడు. రేడియో ప్రచారం కూడా చేశానంటాడు. తన కెందరో ఫ్యాన్స్ ఏర్పడ్డారంటాడు. కొన్నాళ్ళ క్రితం బాండీ చనిపోయాడనీ, బాండీ మనవడు హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడనీ, ఇప్పుడు తమకున్న భూములు అమ్మేయదల్చుకున్నాడనీ అంటాడు. డానీ లీజుకి తీసుకున్న ఆ భూములు కొనేసుకుంటే, తనకి కొంత కట్ మనీ వస్తుందనీ, తను చాలా ఇబ్బందుల్లో వున్నాననీ అంటాడు. పాత బాకీ ఐదువేలు కూడా ఇమ్మంటాడు.

        అయితే నువ్వు దొంగ పాస్టర్ నని ఒప్పుకో, మతం మూఢ నమ్మకమని అరిచి చెప్పుకో- అంటాడు డానీ. ఇలై అలాగే చేసేస్తాడు. తను దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్తాడు. ఇలై చేత ఇలా చెప్పించాక, ఆ భూములు తనకి పనికిరావని చల్లగా చెప్తాడు డానీ. ఆ భూముల్లో స్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురుని తాగి పడేశా నంటాడు.

షాక్ తిన్న ఇలై అన్యాయం చేయవద్దంటాడు
, అన్యాయమే చేస్తానని ఇలైని కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చంపేసి, ఐయామ్ ఫినిష్డ్ అంటాడు. ది ఎండ్.

***

    విశ్లేషణ : మతం -పెట్టుబడి రెండిటి గాథ కొలిక్కి వచ్చింది. సంఘర్షించుకుంటే మతానికేమీ కాలేదు, పెట్టుబడికేమీ కాలేదు. అయ్యింది వాళ్ళిద్దరికే. నెగెటివ్ క్యారక్టర్లు గా మారిన క్యారక్టర్ల గాథ. ఈ గాథలో ఏ వొక క్యారక్టర్ విజయాన్నీ చూపలేరు. మతం మీద పెట్టుబడి విజయం, లేదా పెట్టుబడి మీద మత విజయం చూపలేరు. అసహజంగా వుంటుంది. మతం పెట్టుబడిని నాశనం చేయదు, పెట్టుబడి మతాన్నీనాశనం చెయ్యదు. మతం మీద నాస్తిక విజయం, పెట్టుబడి మీద కమ్యూనిస్టు విజయం చూపించ వచ్చు. మతమని ఒకరు, పెట్టుబడి అని ఒకరూ సంఘర్షించుకుంటే ఇద్దరూ అంతమవాలి, లేదా రాజీ పడాలి చివరికి. ఇది రాజీపడి సుఖాంతమయే గాథ కాలేదు. డానీ ఇలైలు మతం-పెట్టుబడి భావజాలాలు పరస్పర ఆధారభూతాలని గుర్తించలేదు. వాటిని అడ్డుపెట్టుకుని కక్ష తీర్చుకుందామనుకున్నారు. శిక్షలు పొందారు.

***

        2. ఈ ఎండ్ కథనంలో తిరిగి మిడిల్ 2 కథనం లోలాగే  క్యారక్టర్ల వారీ చాప్టర్లున్నాయి. పీపీ 2 లో బ్లాక్ మెయిల్ తో ఎంటరైన బాండీ, ఈ ఎండ్ ప్రారంభంలో డానీని చర్చిలో చేర్పించి నిష్క్రమిస్తాడు. ఈ చాప్టర్లో డానీ వదిలేసిన కొడుకు ప్రస్తావన వుండడంతో, తర్వాతి చాప్టర్ ఆ కొడుకు రాకతో ప్రారంభమవుతుంది. కొడుకు తను అక్రమ సంతానమని తెలుసుకుని వెళ్ళి పోయాక, ఇలై రాకతో చివరి చాప్టర్ ప్రారంభమవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా మూడు చాప్టర్లతో ఈ ఎండ్ వుంది. ఈ నాటక శైలి తెలుగులో వస్తే, బాగా లేదని  కొన్ని రివ్యూలే ఆడియెన్స్ కి మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. దేన్ని ప్రమోట్ చేయాలో, దేన్ని డీమోట్ చేయాలో తెలుసుకోక పోతే.

***

         3. మొదటి చాప్టర్లో చర్చిలో డానీ నిష్కృతి పేర ఇలై ప్రతీకార పండగ చేసుకున్నాడు. వెనుకటి మిడిల్ 2 లో, బాకీ డబ్బుల కోసం వచ్చిన ఇలైని బురదలో పడేసి ఎడాపెడా కొట్టాడు డానీ. దాని ప్రతీకారమిలా... మిడిల్ 1 లో ప్రచ్ఛన్న పోరాటంగా, మిడిల్ 2 లో ప్రత్యక్ష పోరాటంగా సాగిన ఈ ప్రత్యర్ధుల మధ్య యాక్షన్ రియాక్షన్ల్ పరంపర, ఈ ఎండ్ లో కొలిక్కి వచ్చే క్రమం ప్రారంభమైంది.

        వ్యాపారం కోసం విధిలేక మతంలో చేరడాని కొచ్చిన డానీ చేత, పాపినని చెప్పిస్తాడు పాస్టర్ ఇలై. చెప్పించి, కొడుకుని వదిలేసిన పాపం ప్రభువు వైపు చూసి చెప్పమంటాడు. చెప్పాక, మోకాళ్ళ మీద కూర్చున్న డానీని ఎడాపెడా కొడుతూ సైతానుని వదిలిస్తాడు. కానీ ఆల్రెడీ తనలోనే సైతానుతో వున్న ఇలైని కూడా ప్రభువు గమనిస్తూనే వున్నాడు...

        నిజంగా డానీకి పాప ప్రక్షాళన అయ్యిందా? పాపాలన్నీ చెప్పుకున్నాడా? హెన్రీని హత్య చేసిన విషయం చెప్పుకోలేదు. ఇది కర్మ ఫలంగా తర్వాత యాక్షన్లో కొస్తుంది. హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని డానీని బ్లాక్ మెయిల్ చేసి మతంలో చేర్పించిన బాండీ, ఈ  విజయానికి ఆనందిస్తున్నాడు. ఇది బాండీ విజయమేనా?

డానీ చేసిన హత్యని స్వార్ధానికి ఉపయోగించుకున్నబాండీ, తనూ నేరంలో భాగస్వామి అయ్యాడు. హత్య విషయం కూడా డానీ చేత చెప్పిస్తే, డానీ అరెస్టయి అతడి బిజినెస్ వుండదు, తను భూములు లీజుకిచ్చి లాభపడే అవకాశముండదు. అందుకని నేరం గురించి తెలిసినా దాచి పెట్టాడు. మరి ఈ బ్యాడ్ కర్మకి శిక్షేమిటి?

కొన్ని శిక్షల్ని ముందే ఖరారు చేసి పట్టేస్తుంది ప్రకృతి, ముందు జరగబోయేది దానికి తెలుసు గనుక. కర్మ ఫలాలు అడ్వాన్స్ బుకింగ్ గానూ వుంటాయి, కరెంట్ బుకింగ్ గానూ వుంటాయి. ఎదైతే అది తీసుకుని షో చూసుకోవాలి. ఆ షో హిట్టే అవుతుంది, తెలుగు సినిమాల్లాగా 90% ఫ్లాప్స్ తో వుండదు. రేపు ఈ శిక్షనుంచి బాండీ తప్పించుకున్నా వారసులు తప్పించుకోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. మతం, పెట్టుబడి లాంటి వన్నీ మనుషులు ఏర్పర్చు కున్నవి. మతమైనా, పెట్టుబడి అయినా, మరేదైనా, అన్నిటికీ పైనుండేది మనుషులు ఏర్పర్చని ప్రకృతే.  అది యాక్షన్ రియాక్షన్ల బిజినెస్ తో బిజీగా వుంటుంది.

***

       4. రెండో చాప్టర్లో కొడుకు జూనియర్ డానీ వస్తాడు. మిడిల్ 2 లో పనికొచ్చే హెన్రీ ని ఛూసి, పనికిరాని చెవిటి పెంపుడు కొడుకుని రైలెక్కించేసి వదిలించుకున్న డానీకి, చర్చిలో పునీతుడయ్యాక బహుమతిగా తిరిగి అదే కొడుకు. ఇప్పుడెంతో ప్రేమగా చూసుకుంటాడు. తండ్రీ కొడుకులు గతంలో సరదాగా ఆడుకున్న ఆటలు ఇప్పుడు విజువలైజ్ అవుతాయి. సడెన్ గా ఈ కొత్త డిస్కవరీ థ్రిల్ చేసి ఆనంద పరుస్తుంది మనల్ని. ఎందుకంటే బిగినింగ్ లోగానీ, మిడిల్ రెండు విభాగాల్లో గానీ, వీళ్ళిద్దరి సాన్నిహిత్యం ఎక్కడా చూపించలేదు. ఎక్కడ చూపిస్తే రక్తి కట్టి సినిమా టాప్ అప్ అవుతుందో (వేరేపదం దొరక్క టాప్ అప్ అని వాడేశాం), అక్కడ చూపించేందు కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టాడు దర్శకుడు. ఇది డైనమిక్స్. మనమేం చేస్తామంటే, ఫాదర్ - ఛైల్డ్ సెంటి మెంటని అక్కడా చూపించి, ఇక్కడా చూపించి చెడగొడతాం. ఎక్కడా టాప్ అప్ అవదు సినిమా. రీఫ్రెష్ అవదు. చద్దన్నంలా పడుంటుంది.

        జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. మేరీని ఇప్పుడు చూపించడు దర్శకుడు. చిన్నతనంలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వున్న మేరీకి, నాస్తికుడైన డానీ అండగా వున్నాడు. అతను ఆల్రెడీ నాస్తికుడు, ఆమె కాబోయే నాస్తికురాలు. ఇద్దరికీ అక్కడ సరిపోయింది. గత చాప్టర్లో, చర్చి సీనులో ఇలై డానీ చెమ్డా లెక్కదీసింతర్వాత, మతంలో చేరిన అతడ్ని, బేబీ మేరీ వాటేసుకుంటుంది. ఇలా తనుకూడా డానీని ఫాలో అయి మతాన్ని ఒప్పుకుని, ఫ్యామిలీ అయిందని ఈ ఒక్క షాట్ లో కథ చెప్పాడు దర్శకుడు. దీన్ని అండర్ లైన్ చేసుకోవచ్చు టిప్ బావుంటే.

ఇప్పుడు పెద్దవాడైన జూనియర్ మేరీని పెళ్లిచేసుకున్న విషయం డానీకి చెప్పడం ద్వారా తెలియజెస్తాడు దర్శకుడు. ఇక మెక్సికోలో విడిగా వ్యాపారం చేసుకుంటానని, వాటా పంచమని జూనియర్ అంటాడు. ఇలా జూనియర్ వాటా అడిగేసరికి, డానీకి జూనియర్ బాస్టర్డ్ గా కన్పిస్తాడు. ఎవడికి పుట్టావని అంటాడు. బాస్టర్డ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ అని తిడతాడు. అనాధగా దొరికితే పెంచుకున్నానంటాడు. చాలా తూలనాడుతాడు. తన జన్మరహస్యం ఇలా తెలుసుకుని షాక్ తిన్న జూనియర్, ఏమీ చేయలేక ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు.  

     తమ పొజిషనేంటో తెలుసుకోకుండా ఎవర్నీ నమ్మి పని చేయకూడదు. ఒట్టి చేతులే మిగులుతాయి. బాల్యం నుంచీ డానీయే తండ్రి అనుకున్న జూనియర్, తల్లి ఏదని అడగలేదు. అడిగివుంటే తన పొజిషన్ అప్పుడే తెలిసేది. అందుకనుగుణంగా జీవితాన్ని మల్చుకునే వాడు. డానీ మీద ఆధారపడేవాడు కాదు. ఇదేమీ తెలుసుకోకుండా డానీ పార్టనర్ గా చేస్తే పార్టనర్ గా వుండి పోయాడు. కంపెనీ అభివృద్ధికి కష్టపడ్డాడు. ఇప్పుడు  తండ్రిగా డానీ ఓకే గానీ, పార్టనర్ గా పొసగడం లేదని వాటా అడిగేసరికి, బాస్టర్డ్ అన్నాడు. కనువిప్పయి, చేసేది లేక పడ్డ కష్టమంతా వదులుకోవాల్సి వచ్చింది జూనియర్ కి.

        తండ్రిగా ఓకే అనుకున్నాడు. హెన్రీని చూసి తనని రైలెక్కించి వదిలించుకున్న కోపం, పాలల్లో లిక్కర్ కలిపి తాగించిన కసీ అన్నీ మర్చిపోయాడు జ్యూనియర్ - తిరిగి వచ్చిన తనతో, చేసిన తప్పుకి డానీ చెంప మీద కొట్టించుకోవడంతో. తండ్రిగా ఓకే అన్పించాడు అప్పట్నుంచీ డానీ.

        కానీ తండ్రిగా కూడా ఓకే కాదనీ, చిన్నప్పట్నుంచీ తనని వ్యాపారంలో ఫ్యామిలీ లుక్ కోసమే వాడుకున్నాడనీ, అలా నమ్మించడానికే చిన్నప్పుడే పార్టనర్ గా చేశాడనీ తెలుసుకోలేకపోయాడు జూనియర్. తండ్రిగా నువ్వు ఓకే అనడంలో, ఓకే కాదన్న అతడికి తెలీని సత్యమూ దాగుంది. అదిప్పుడు బయటపడింది. ఇదీ డైలాగులు రాసే కళ. ఎవ్విరీథింగ్ ఈజ్ కనెక్టెడ్. గాథతో ఎక్కడో కనెక్ట్ అయ్యే వుంటున్నాయి డైలాగులు. తెలుగులో ఈ కళ ప్రదర్శించ వచ్చా? చాలా ఇన్స్ ఫైరింగ్ గా వుంది.

        డానీ సంగతి. డానీకి ఆనాడు జూనియర్ని పార్టనర్ గా చేయడానికి కన్పించని బాస్టర్డ్, ఈనాడు వాటా అడిగేసరికి బాస్టర్డ్ లా కన్పించాడు. తనని నమ్మిన మేరీ కోసమైనా సంయమనంతో లేడు. కొడుకుని వదిలేసిన పాపంతో ప్రభువు ముందు చెంపలు వాయించుకుని మతంలో చేరిన తను, తిరిగి అదే కొడుకుని శాశ్వతంగా వెళ్ళ గొట్టేశాడు. డానీ మారలేదు, మారడు. తియ్యటి సినిమాలు, కమ్మటి హీరోయిజాలూ మనుషులెలా వుంటారో చూపించవు.

***

       5.  మూడో చాప్టర్ కల్లా చాలా కాలం గడిచిపోతుంది. డానీ అల్ట్రా  రిచ్ గా పెద్ద బంగాళాలో ఒంటరిగా వుంటూ, తాగుడు మరుగుతాడు. నిజానికి భావిజీవితం గురించి కలలు గంటూ, తమ్ముడ్ని అంటూ వచ్చిన హెన్రీకి మిడిల్ 2 లో ఏం చెప్పాడు డానీ - పెద్ద బంగాళా కట్టుకుని మనుషులకి దూరంగా జీవించాలని...అతను మనుషుల్ని మొదట్నుంచీ అసహ్యించుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్న పెద్ద బంగాళాలోనే వున్నాడు- కోరుకున్నట్టు తను అసహ్యించుకునే మనుషులకి దూరంగానే వున్నాడు- అయితే కొడుకుని వెళ్ళ గొట్టుకుని, నా అనే వాళ్ళంటూ సైతం లేని దిక్కులేని జీవితంతో, తాగుడే తోడై...

           మనుషులతో వుండడమనేది సార్వజనీన ప్రవర్తన. ఇది కాదనుకున్నందుకు సొంత మనుషులే వుండని దిక్కులేని జీవితమైంది.  మనమేం మాట్లాడతామో ఆలోచించి మాట్లాడాలి. రైటుగా మాట్లాడితే రైటుగా రిసీవ్ చేసుకుంటుంది సబ్ కాన్షస్, రాంగ్ గా మాట్లాడితే రాంగ్ గా రిసీవ్ చేసుకుని అది మోతాదు మించి నిజం చేసేస్తుంది. ఈ మైండ్ మెకానిక్స్ గురించి ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్ అన్న అరవై ఏళ్ళ నాటి ప్రసిద్ధ పుస్తకంలో చక్కగా వివరిస్తాడు డాక్టర్ జోసఫ్ మర్ఫీ.

        ఇక ఇలై ఎంటరవుతాడు. ఈ మొత్తం గాథలో యాక్షన్ జరగడానికి పాత్రలు స్వయంగా చర్యలు తీసుకోవడం లేదని గమనించాలి. ఉదాహరణకి, మిడిల్ 2 లో డబ్బులడిగితే బురదలో వేసి ఇలైని కొట్టిన డానీ మీదికి ఇలై వెంటనే పోలేదు. తర్వాత డానీయే ఖర్మరా బాబూ అనుకుని మతంలో చేరడానికి చర్చికి వెళ్ళి, ఇలైకి చిక్కి దేహశుద్ధి చేయించుకున్నాడు. అలా దేహశుద్ధి చేయించుకున్న డానీ కూడా వెంటనే వెళ్ళి ఇలైని చిత్త శుద్ధితో తన్నలేదు.

కాలమే ఒకళ్ళ ముందు ఒకళ్ళని అవసరాలు సృష్టించి వ్యూహాత్మకంగా ప్రవేశ పెడుతూ, సెట్ రైట్ చేస్తోంది. కాలమే యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేని చూసుకుంటోంది. నిజ జీవితం ఇలాగే వుంటుంది. మనల్ని ఎవరో ఏదో అన్నాడని బదులు తీర్చుకోవాల నుకుని తీర్చుకోకుండా వుండి పోతాం. అతనే అవసరం పడి తర్వాతెప్పుడో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు చూసుకుంటాం చూసుకోవాలనుకుంటే. గాథ ఈ స్కీముతో నడుస్తోంది. నిజ జీవితంలో జరిగే స్కీము. కమర్షియల్ కథల్లో చిరంజీవి వెంటనే వెళ్ళి రావుగోపాలరావుని కొట్టకపోతే రుచించదు. నిజ జీవితంలో మన చేతగానిది చిరంజీవి చేసి చూపాలనుకుంటాం. కథ యాక్టివ్ క్యారక్టర్లతో తియ్యటి డ్రీమ్ వరల్డ్ అయితే, గాథ పాసివ్ క్యారక్టర్లతో రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో మనం పాసివ్ క్యారక్టర్లమే. సినిమాల్లో లాగా వెళ్ళి కొట్టలేం, సాంగేసుకోలేం .

***

      6. అలా మత ప్రచారమంటూ లోకం చుట్టిన వీరుడిగా తిరిగి తిరిగి డానీ దగ్గరికే వచ్చాడిప్పుడు ఇలై. టైమ్ ఈజ్ ది గ్రేటెస్ట్ లెవెలర్. కర్మల బాకీ తీర్చడానికి. డానీ చేతికి చిక్కాడిప్పుడు. ఆనాడెప్పుడో ప్రక్షాళన పేరుతో చర్చిలో నన్ను కొట్టావ్, ఇప్పుడు నిన్ను కొడతా టైపులో చిక్కాడు. పాస్టర్ ఇలై ఇప్పుడు కమీషన్ ఏజెంట్ అయిపోయాడు. బాండీ మనవడి భూముల్ని డానీకి అమ్మించి కమీషన్ పొందాలని. అలాగే పాత బాకీ ఐదువేలు ఇమ్మని కోరుతున్నాడు... తన కర్మల బాకీ మర్చిపోతున్నాడు...చర్చిలో చేసిన అవమానంతో ఐదు వేలు బాకీ అడిగే అర్హత కోల్పోయాడు. తానే చేసిన అవమానం తాలూకు బ్యాడ్ కర్మ బాకీ పడ్డాడు. దాన్ని అదే రూపంలో వసూలు చేసుకుంటున్నాడిప్పుడు డానీ... అయితే నువ్వు దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్పుకో అంటూ.

        తప్పలేదు ఇలైకి డబ్బవసరంతో. నేను దొంగ పాస్టర్ ని, మతం మూఢ నమ్మకం అని స్లోగన్స్ ఇస్తాడు. ఇప్పుడు డానీ భూములు బేరమాడుకోవాలి. బేరమాడుకోడు. ఇలైని సర్వ భ్రష్టుడ్ని చేయాలి.  అందుకే అంటాడు, ఇంకెక్కడి భూములూస్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురంతా ఎప్పుడో తాగేశాననీ.

     అప్పట్లో బాండీ భూముల చుట్టూ ఇలై వాళ్ళ భూములే కొన్నాడు చమురు కోసం. ఆ భూముల్లో చుట్టూ బోర్లు వేసి, భూములు అమ్మని బాండీ భూముల్లో చమురంతా కూడా తోడేశాడు డానీ!

     భోరు మంటాడు ఇలై. అన్యాయం చేయవద్దని ఏడ్చేస్తాడు. మొదటి చాప్టర్లో బాండీ విజయం గురించి చెప్పుకున్నాం. డానీ చేసిన హత్యని పురస్కరించుకుని, డానీని బ్లాక్ మెయిల్ చేసి లాభపడాలనుకున్నాడు బాండీ. అలా ఆ హత్యా నేరంలో భాగస్వామి అవుతూ బ్యాడ్ కర్మ రాసుకున్నాడు  అలా బాండీ అనుకున్న ప్లాను పారి డానీకి భూముల్ని లీజుకిచ్చి లాభపడ్డాడు. ఆ బ్యాడ్ కర్మ అడ్వాన్సుగా శిక్ష రాసేసిందని కూడా చెప్పుకున్నాం. ఆ శిక్ష ఇదే...ఆల్రెడీ ఆ భూముల్లో చమురు తాగేశాడు డానీ. ఈ శిక్ష నుంచి బాండీ తప్పించుకున్నా, బాండీ చేసిన దాంతో సంబంధం లేని మనవడు తప్పించుకోలేకపోయాడు. పెద్దలు చేసే పాపాలు పిల్లలకి అంటుకుంటాయని ఇందుకే అంటారు.


           ఇక నైతికంగా, ఆర్ధికంగా పూర్తిగా పతనమై రోదిస్తున్న ఇలైని, కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చేసిన ఒక హత్యతో దొరకని డానీ, ఈ హత్యతో దొరికిపోతూ ఐయామ్ ఫినిష్డ్ అంటాడు.

***

        ఇంత చెప్పుకున్నాక, ఇంకా ఈ నాల్గు భాగాల సుదీర్ఘ వ్యాసానికి ఉపసంహారం అవసరం లేదు. జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ దేర్ విల్ బి బ్లడ్ రూపంలో మనముందు కొచ్చిన ఈ కదిలించే గొప్ప గాథ, తెలుగులో గాథలు తీసి ఔన్నత్యాన్ని సాధించడానికేమైనా ఉపయోగపడుతుందేమోనని భావిద్దాం.

        ఈ వ్యాసాల్ని ఒకే బంచ్ గా పీడీఎఫ్ తీసి, డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో వుంచమని అంటున్నారు. ఎనిమిది వేల పదాలతో, 37 పేజీల ఈ నాల్గు వ్యాసాలు, ఒక చోట కాపీ పేస్ట్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులోనే వున్నాయి.

 సికిందర్