కొన్ని సినిమాల్లో వెంటాడే దృశ్యాలుంటాయి. వెంటాడ్డానికి జీవంతో తొణికిస లాడ్డం కారణం. దృశ్యాల్లో తీసే ప్రతీ షాటూ వాటికీ శాశ్వతత్వం కల్పించడం. రైటర్ పని పాత్రని సృష్టించి దాని మానాన వదిలెయ్యడం. పాత్రని పట్టకుని తను కథ నడపడం కాదు. పాత్ర దాని కథ అదే నడుపుకునే ఫస్ట్ హేండ్ డ్రైవ్ అవకాశం కల్పించడం. మేకర్ పని కూడా షాట్స్ ని బయట నుంచి పాత్రల మీద రుద్దడం కాదు, లోపలి నుంచి ఇన్నర్ ఇంజనీరింగ్ జరపడం. అందచందాలు ఫైపైన లేపనాల వల్ల రావు, లోపలికి తీసుకునే పానీయాల వల్ల వస్తాయి. షాట్స్ కూడా లేపనాలు కాకుండా పానీయాలు కావాలి. అప్పుడు జీవం వస్తుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయి. చాలా సినిమాల్లో ఈ వరస కన్పించదు. అందువల్ల ఆ సీన్లు థియేటర్ లోంచి బయటకి కొస్తే గుర్తుండవు. పాత్రల్లోపలి నుంచి దాని దృక్కోణాన్ని చూస్తూ షాట్స్ ఆలోచించకుండా, బయటి నుంచి మేకర్ తనదేదో దృక్కోణంతో పాత్రమీద షాట్స్ ని రుద్దితే ఏకత్వం చెడి దృశ్యం నిలబడదు. ఆర్ట్ సినిమాల్ని, లేదా మన ప్రాంతీయ సినిమాల్ని చూస్తూంటే ఇదే అర్ధమవుతుంది. ఇందుకే ఇవి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందుతూంటాయి.
ఆర్ట్ సినిమా మేకింగ్ కమర్షియల్ సినిమాల కెందుకనుకోవచ్చు. ఆర్ట్ సినిమాలే కాలాన్ని బట్టి మారి కొంత కమర్షియాలిటీనీ కూడా కలుపుకుని, ఫ్యూజన్ తో క్రాసోవర్ సినిమాలుగా వస్తూంటే, కమర్షియల్ సినిమాలు ఆర్ట్ సినిమాల్లోంచి వీలైనవి తీసుకోవడం పరువు తక్కువేం కాదు.
1977 లో తన ఐదవ సినిమాగా శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’ ఇవాళ్టికీ ఇవాళ్టి సినిమాలాగే వుంటుంది కథతో, పాత్రలతో, మేకింగ్ తో. మరాఠీ ప్రేక్షకుల ‘సావిత్రి’ అనదగ్గ నాటి పాపులర్ హీరోయిన్ హంసా వాడ్కర్ సంక్షుభిత ప్రేమల విషాద కథ ఇది. సంక్లిష్టమైన హంసా పాత్రని స్మితా పాటిల్ నటించింది కేవలం 22 ఏళ్ల వయసులోనే. కథలో సినిమా హీరోగా అనంత్ నాగ్, దర్శకుడుగా నసీరుద్దీన్ షా, ధనికుడుగా అమ్రిష్ పురీ కన్పిస్తారు. ప్రసిద్ధ ఆర్ట్ సినిమాల దర్శకుడు గోవింద్ నిహలానీ ఛాయాగ్రహణం సమాకూర్చాడు.
ఇందులో ప్రారంభంలో కుటుంబ దృశ్యం వుంటుంది. ప్రారంభంనుంచీ ఈ దృశ్యం షాట్స్ పరంగా కట్టి పడేస్తూ ముందుకు లాక్కెళ్తుంది. చాలా మతిపోగొట్టే షాట్ కంపోజింగ్, డ్రామా. ఈ దృశ్యం చూడమని ఇద్దరు ముగ్గురు దర్శకులకి క్లిప్పింగ్ పంపిస్తే, చూసి థ్రిల్లయి పోయారు. ఇక దీని గురించి రాయక తప్పని పరిస్థితి...
ఈ సీను నేపథ్యమేమిటంటే ...
సీను ఎలా వుందో చూద్దాం :
1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు.
2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి (కిరణ్ విరాలే) చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది.
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి (సులభా దేశ్ పాండే) టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం తిప్పుకుంటుంది.
4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి.
5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు.
6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు.
7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలోతగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది.
8. కోపాన్ని అణుచుకుంటూ, ‘నువ్వు మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మం టాడు.
9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా.
10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళి టాక్సీనాపి ఎక్కేస్తుంది...
ఇక్కడ భూమిక ఆమె పేరు కాదు
డిక్షనరీ అర్ధంలో ‘పాత్ర’
వివిధ క్లిష్ట దశల్లో తన జీవితమనే నాటకంలో తను - ఉష అలియాస్ ఊర్వశి (స్మిత పాత్ర పేరు) - పోషించాల్సి వచ్చిన విభిన్న పాత్రలు. ఈ కథకి స్క్రీన్ ప్లే సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనెగళ్ రాశారు (శ్యాం బెనెగళ్ తన పేరు వినమ్రంగా చివర వేసుకున్నారు). సంభాషణలు సత్యదేవ్ దుబే రాశారు. పాత్రల అంతరంగ ప్రగాఢ మథనం కథని, దృశ్యాల్ని కట్టిపడేసేట్టు తీర్చిదిద్దింది.
ఇప్పుడు పై దృశ్యపు షాట్ డివిజన్ సంగతుల కెళ్ళే ముందు, ఈ దృశ్యంలో ఏది ఎందుకుందో, ఏ చర్య కర్ధమేంటో చూద్దాం. పై దృశ్యాన్ని 10 భాగాలుగా విభజించాం (దృశ్యాలు రాయడం ఈజీ, విశ్లేషించాలంటే చాట భారతం. ఒక దృశ్యాన్ని విశ్లేషించడానికి పట్టే కాలంలో పది దృశ్యాలు రాయొచ్చు. కాబట్టి విశ్లేషకుల్ని చిన్న చూపు చూడరాదు). పై దృశ్య విభాగాల్లో పాత్రల చర్యలు, చర్యల వల్ల పుట్టే మాటలు, ఎక్కడ ఎలా పడాలో అక్కడ అలా పడడాన్ని గమనించ వచ్చు, అంతే కాదు, ఏ స్క్రీన్ టైముతో ఏ సిట్యుయేషన్లో ఎలా కెమెరాలో రివీలవ్వాలో - అక్కడ అప్పుడు అలా పాత్రలు ప్రత్యక్షమవడాన్ని కూడా సూక్ష్మ దర్శిని పెట్టి చూడొచ్చు. కొన్ని వస్తువుల సమయానుకూల ప్రయోగం కూడా చూడొచ్చు. ఇలా మైక్రో లెవెల్లో ఈ సీన్ని చూసినప్పుడే సీను చెరగని ముద్ర వేస్తుంది.
ఒకే షాట్ లో, లేదా కొన్ని షాట్స్ లో నటీనటులందర్నీ ఎలాపడితే అలా కూడేసి, నటింపజేయడం దృశ్య కథన మంటారా? పోనీ డ్రామా అంటారా? అనరు. దృశ్యానికీ దృశ్యం లోపల దాని స్ట్రక్చరుంటుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి ఏ స్ట్రక్చరుంటుందో అదే దృశ్యంలోపలా వుంటుంది. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలుంటాయి. ఆ విభాగాల్లో అవే వాటి బిజినెస్సులుంటాయి. ప్రారంభ ముగింపులుంటాయి. స్క్రీన్ ప్లే ఒక హీరో లేదా హీరోయిన్ తో వున్నట్టే, దృశ్యమూ ఆ దృశ్యాన్ని బట్టి హీరో లేదా హీరోయిన్ తో వుంటుంది. ఆ పాత్రకి దృశ్యంలో ఓ ప్రారంభం, ముగింపూ వుంటాయి.
పై దృశ్యం స్మితా పాటిల్ ది, అమోల్ పలేకర్ ది కాదు. అందుకని ఆమె కేంద్రంగానే దృశ్య కథనముంది. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటి నుంచి ఇంట్లోకి వచ్చింది. పలేకర్ తో సంఘర్షించి కన్నీళ్ళతో ఇంట్లోంచి బయటికెళ్ళి పోయింది. ఇదీ సీనులోకి పాత్ర రాకపోకల - ప్రారంభ ముగింపుల డైనమిక్స్, లేదా ద్వంద్వాలు. ఆరు నిమిషాల్లో జీవితమే మారిపోయింది.
వరసగా దృశ్య విభాగాలు పరిశీలిద్దాం
వివరణ : పలేకర్ అలా అసహనంగా ఎదురు చూసే మాటేమోగానీ, చేతిలో ఆ సిగరెట్ పెద్ద సస్పన్స్ అయిపోయింది. అదెప్పుడు ముట్టిస్తాడో తెలీదు. లోపలికొచ్చి కూడా ముట్టించడు. దానికి తగ్గ మానసిక స్థితి రావాలి. అదెప్పుడోస్తుందో వస్తుంది. ముట్టించబోతూంటే ఆమె కార్లో డైరెక్టర్ తో రావడం కళ్ళబడ్డాక అదే పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది. ముందామె సంగతి చూసిగానీ...
ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డప్పుడు - గడప లోపలే నిలబడ్డాడు. ఆ గడప అతడి ఇన్ఫీరియారిటీకి గుర్తు. అది దాటి ఆమె మానసిక ప్రాంగణంలోకొచ్చి మాట్లాడే ధైర్యంలేదు. పైకి ఎంత ధూంధాం చేసినా, లోలోపల ఆమె సొమ్ము తింటున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంది.
2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది.
వివరణ : ఇక్కడ కూడా సిగరెట్ ముట్టించలేదు. స్మిత అతడికేసి చూస్తూ లోపలి కెళ్ళిపోయింది. ఇంతవరకూ ఇంట్లో పలేకర్ ని తప్ప ఇంకెవర్నీ చూపించలేదు. అతడికి కూతురున్న సంగతి మనకింకా తెలీదు. స్మిత వచ్చాకే ఆమెతో ఎటాచ్ చేసి కెమెరాలోకి తెచ్చారు. ఇప్పుడు హాల్లో చదువుకుంటున్న కూతురు రివీలయ్యింది. ప్రధాన పాత్ర ననుసరించి ఒకటొకటే రివీల్ చేస్తూ సీనుని వెల్లడించే విధానం. స్మిత కూతురి చెంప ప్రేమగా నిమిరి- నువ్వివాళ్ళ ఇంటిదగ్గరేనా -అనడం, స్మిత తెల్లారే ఎప్పుడో షూటింగు కెళ్ళిపోయిందన్న సమాచారం మనకిస్తూ కథని వెల్లడిస్తోంది.
ఇక స్వింగ్ డోర్స్. స్వింగ్ డోర్స్ తోసుకుని వెళ్తుంది స్మిత. ఈ స్వింగ్ డోర్స్ ఏమిటి? ఆయారాం గయారాం. ఆమె జీవితం నిలకడగా లేదని అర్ధం. ఎప్పుడు ఈ ఇంట్లో కాపురముంటుందో, ఎప్పుడు ఎటెళ్ళిపోతుందో తెలీదనే పరిస్థితికి - లోపలికీ, బయటికీ తెర్చుకునే ఆ స్వింగ్ డోర్స్ సింబాలిజం.
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం తిప్పుకుంటుంది.
4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి.
వివరణ : ఇక స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోయిన స్మిత ఇప్పుడు అటు గదిలోంచి వేగంగా వెళ్లి పోవడాన్ని వూచల కిటికీ లోంచి చూస్తాం. ఎందుకిలా? నేరుగా ఆమెని బెడ్రూంలో చూపించ వచ్చు కదా? అలా చూపిస్తే రసోత్పత్తి జరగదు, కథోత్పత్తి కూడా జరగదు. గానుగాడించిన పిప్పి మిగుల్తుంది. ఈ కిటికీ వూచల్లోంచి ఆమెని చూపించడం పంజరంలో వున్నట్టు చూపించడం. ఇప్పుడుంటున్న ఇల్లొక పంజరం, ఇక్కడే కాదు, ఈ సీను తర్వాత కథలో ఇంకా మున్ముందు ఇంకో ముగ్గురితో సంబంధాలు కూడా పంజరాలేనని మనకి తెలుస్తాయి. అయితే ఇక్కడ అలా క్షణకాలంలో వేగంగా వెళ్ళిపోతున్నట్టు చూపించడంలో అర్ధం? ఏ పంజరాన్నీ ఆమె సహించదు. పంజరమని తెలీక సంబంధంలోకి వెళ్తుంది, తెలిసిన వెంటనే తెంచుకుని అవతల పడుతుంది. ఇప్పుడున్న పంజరంలో వుండలేక పోతోంది కాబట్టే మెరుపు వేగంతో ఆ నడక. ఆయారాం గయారాం స్వింగ్ డోర్స్ తర్వాత, దాని కొనసాగింపుగా ఈ పంజరం సింబాలిజం. స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోతే ఆమెకి పంజరాలే.
ఇక డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఆమె చెప్పులు విడవడం. అదామె దినచర్యలో భాగమే. రోజూలాగే ఇప్పుడూ ఇంటికొచ్చాక ఇంట్లోనే కదా వుంటుంది. అందుకని చెప్పులు విడుస్తోంది. ఇంకొన్ని క్షణాల్లో ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఎలా వూహించగలదు. చెప్పులు విడవడమే కాదు, చీర కూడా మార్చుకుంటోంది. అతను డిటోగా మళ్ళీ గడప అవతలే నిలబడ్డాడు. ఇప్పటికీ ఆమె మనో ప్రాంగణంలో కెళ్ళే దమ్ముల్లేవు. ఇక అద్దం ముందు స్మిత, అద్దంలో ఆమె ప్రతిబింబం- అతడి అనుమానపు బుర్రకొద్దీ ఆమెలో అతను చూస్తున్న రెండు రూపాలు. అతడి మానసిక స్థితికి కనెక్ట్ చేసే సింబాలిజం.
5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు.
వివరణ : అతనేం ఆరోపిస్తున్నాడో, దానికామె రియాక్షన్ ఎలా వుందో చూస్తున్నాం. కానీ అంత రియాక్షన్లో కూడా ఆమె వెళ్లి పోవాలన్న ఆవేశంతో సొరుగు లాగలేదు. వొంటిమీద చీర లేదు, చీర కట్టుకుందామనే సొరుగు లాగి చూస్తోంది. అతనే ఫూలిష్ గా రెచ్చగొట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటూ. ఈ డైలాగుతో కథ కూడా మనకి తెలియజేయడం. అంటే ఆమె ఇదివరకే వెళ్లి పోయిందనీ, వెళ్తే తీసుకొచ్చాడనీ. అదే సమయంలో, ఎందుకు తీసుకొస్తున్నాడనే ప్రశ్నకూడా తలెత్తి, ఇది కూడా తెలుసుకోవాలన్న ఉత్కంఠ మనకి కలిగిస్తోంది ఈ డైలాగు. ఆమె సొరుగు లాగడమనే చర్యని ఇన్ని విషయాలు తెలియ జేయడం కోసం వాడారు రచయితలు.
6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు.
వివరణ : ఇక్కడ వెంటనే సమాధానం దొరికింది. అదీ సంగతి. ఆమె సంపాదన మీద ఆధారపడ్డాడు కాబట్టే ఒకసారి వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆమె వున్నదున్నట్టు విషయం మొహం మీద చెప్పేసే సరికి, ఇక లాభంలేదని గట్టి దెబ్బ కొట్టేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా పై చేయి ఆమెది కాకూడదు. తన దగ్గర ఆమె దొంగలా దొరికిపోయే పక్కా ఎవిడెన్స్ వుంది. అందుకని ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి సిగరెట్ వెల్గించాడు! దమ్ము లాగాడు. ఈ పూట ఇంత సేపూ ఈ ఇంట్లో తనేమిటీ అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు తీరిపోయింది. క్లియరై పోయింది. ఈ సీనుకి సీనంతా తనొకే ఎక్స్ ప్రెషన్ తో వున్నాడు. ఎక్కడా ఇంకో ఎక్స్ ప్రెషనివ్వలేదు. ఇప్పుడు తను చేతికి చిక్కందని కూడా విషపు నవ్వు నవ్వలేదు. ఇక ధైర్యంగా ఇప్పుడు గడపదాటి బెడ్ రూమ్ లోకొచ్చేశాడు... డామ్ ష్యూర్ గా ఆమె మైండ్ స్పేస్ లోకి ఎంటరై పోయాడు! ఆమె సపరేట్ బ్యాక్ ఎక్కౌంటు, కొత్త సినిమా సైనింగు క్వశ్చన్ చేసేశాడు! గూడుపుఠాణీకి పక్కా ఎవిడెన్స్.
మధ్యలో పనివాడు టీ కప్పుతో వచ్చేశాడు. ఇంతసేపూ వీడెక్కడున్నాడు. కిచెన్లో వున్నాడేమో. బాత్రూంలో బట్టలుతుకుతున్నాడేమో లాజిక్కి ఇబ్బందిలేదు. అవతల స్మిత తల్లి టీ కప్పుతో అలాగే వున్నట్టుంది. పనివాడి కిచ్చి పంపింది. ఈ టీ ద్వారా పలేకర్ బలహీనతని బయట పెట్టడం దర్శకుడి ఉద్దేశం. ఇదెలాగో చూద్దాం....
7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలో తగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది.
వివరణ : అతనలా క్వశ్చన్ చేసేసరికి ఒక్క మాటతో తను తిప్పి కొట్టేసింది. పేకాటకి డబ్బంతా తగలేస్తూంటే గూడుపుఠాణీ చెయ్యకేం చేస్తుంది? అతడి ఎత్తుగడ చిత్తయి పోయింది. దీంతో బుర్ర తిరిగి, పనివాణ్ణి టార్గెట్ చేసి, టీ ఎవరు తెమ్మన్నారని తిట్టి వెళ్ళ గొట్టేశాడు. ఇది అసలుకి స్మితని తానేమీ చేయలేని బలహీనతని బయటపడేసుకోవడమే. వాతావరణం బాగా వేడెక్కింది. అవతల కూతురు లేచి గ్రాంఫోన్లో ఆలాపన పెట్టింది. వాళ్ళు ఇలా అరుచుకుంటున్నప్పుడు, తను ఇలా నిరసన తెలపడం ఆమె కలవాటయి పోయిందేమో. కూతురి నిరసన కూడా వాళ్లనాపడం లేదు. ఇప్పుడు ఇద్దర్లో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది కాకుండా, కూతురి ముందు ఇద్దరూ దోషులుగా నిలబడ్డారు. పిల్లల్ని కన్నాక తమ హక్కులు రద్దయి, పోరాటాలు బంద్ అయి, పిల్లల హక్కులూ ఆరాటాలూ తమ ముందుంటాయని తెలుసుకో లేని దివాలాకోరు సంసారం వెలగబెడుతున్నారు.
ఇక అతను దండకం ఎత్తుకున్నాడు ఫాల్స్ ఇగో బాగా ప్లాట్ అయిపోయి - పూర్వం ఆమె కుటుంబాన్ని తను ఆదుకోవడం గురించి ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడాడు. దానికీ ఆమె కొట్టినట్టు జవాబియ్యడంతో మళ్ళీ బుర్ర తిరిగి, ఆమెనేమీ చెయ్యలేక ఈసారి కూతుర్ని టార్గెట్ చేస్తూ బలహీనత బయటపెట్టుకున్నాడు - రికార్డు ఆపమని అరుస్తూ. ఇంతకంటే అతనేం పీకలేడని టీ ద్వారా, గ్రాంఫోన్ రికార్డు ద్వారా చెప్పడం. అదే సమయంలో, స్మిత పూర్వ జీవితం మీద ఆసక్తి కల్గించడం. నిజంగా అతడన్నంత దారుణంగా వుందా పూర్వం ఆమె కుటుంబ పరిస్థితి? రెండోది, గతంలో ఆమె ఎవరితో వెళ్ళిపోయి వుంటుంది? ఈ రెండిటి గురించీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తామేమోనని మనం ఎదురు చూసేలా చెయ్యడానికి ఈ డైలాగుల ప్లాంటింగ్. ఇక అతను కూతురి మీద అరిచేసరికి, ఆమె అతడి మీద అరిచింది. ఇక టాపిక్ కూతురి మీదికి మళ్ళిపోయింది. కూతురి మీద ఫోకస్ అవుతూ సీను మలుపు తిరిగింది...
8. కోపాన్ని అణుచుకుంటూ, ‘మళ్ళీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మంటాడు.
వివరణ : ఆ సిగరెట్ నలిపెయ్యడం ఆమెని నలిపేస్తున్నట్టు ఫీలై పోవడమే. సిగరెట్ తో ఇదింకో బలహీన వ్యక్తిత్వ ప్రదర్శన. చివరికి సిగరెట్ కథ ఇలా ముగిసింది. సిగరెట్ ఈ సీనులో సందర్భానుసార డైనమిక్స్ లో మన దృష్టి నాకర్షిస్తూ లైవ్ గా పాలుపంచుకుంది. ఈ సీనులో టీ, గ్రాంఫోన్, సిగరెట్, ఏ వస్తువు వాడినా, అది కథనో, పాత్రల్నోబయట పెట్టడానికే వ్యూహాత్మకంగా ప్లే చేశారు తప్ప- కథనీ, పాత్రల్నీవదిలేసి అలంకార ప్రాయంగా ప్రయోగించలేదు.
9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి, కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా.
వివరణ : అతడంత మాటన్నాక ఆమె ఎందుకాగుతుంది. సాధారణంగా చిత్రణ లెలా వుంటాయంటే, ఆమె సూట్ కేసు సర్దుకుని కూతుర్ని బరబరా లాక్కుని వెళ్ళిపోతూ వుంటుంది ... ఇది బయటి నుంచి రచయిత తన డామినేషన్ తో పాత్ర మీద రుద్దే దుశ్చర్య. ఇందులో పాత్ర ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ ఎక్కడుంది. మానవ సహజ డ్రామా ఎక్కడుంది? ఇంత సేపూ స్మిత తన గురించి, తన జీవితం గురించీ దూకుడుగా ఆలోచిస్తోందని మనకి తెలుస్తూనే వుంది. ఆమెకి కూతురి ధ్యాసే లేదు. కూతురు, ‘అమ్మా, నిజంగా వెళ్తున్నావా?’ అనేసరికి ఈ లోకంలో కొచ్చింది. ఉక్రోషమంతా దిగిపోయి కూతుర్ని గుర్తించింది. ఇప్పుడు తనే కాదు, తనతో కూతురూ అని తెలుసుకుంది. ఆగిపోయి ఆమెని రమ్మంది. ఇప్పుడామె ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ కరక్టుగా వచ్చాయి. అతనామె నాపుతూ, సుష్మ తన కూతురన్నాడు. దీనికామె, ‘నిజంగా?’ అంది వ్యంగ్యంగా. ఈ డైలాగు అన్పించడంలో ఉద్దేశం, అతడి పాత్ర చిత్రణలో మిగిలున్న అంశం కూడా పూర్తి చెయ్యడం. అతను భార్యనీ, అత్తనీ మాత్రమే కాదు, కూతుర్ని కూడా కూతుర్లా చూడలేదని. భార్య డబ్బూ, తన సుఖం - ఇంతే అతడి జీవితమని. ఈ డైలాగు పాత్రలోంచి సహజంగా వచ్చింది కాబట్టి రచయిత రాశాడు.
కూతురా మాట అనగానే నిలబడి పోయిన స్మిత కి -ఇటు చూస్తే కిచెన్ దగ్గర్నుంచి తననే చూస్తున్న తల్లి కన్పిస్తుంది, అటు చూస్తే తననే చూస్తున్న పలేకర్ కన్పిస్తాడు హాల్లోంచి. వాళ్ళు కూడా ఆమె సమాధానం కోసం చూస్తున్న అర్ధంలో ఫ్రేములోకి రావడం. ఎప్పుడెలా ఎవరు మాత్రమే ఫ్రేములోకి రావాలో, లయ బద్దంగా ఆ ప్రక్రియే కొనసాగుతోంది మొదట్నించీ సీనంతా.
10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళిపోయి టాక్సీనాపి ఎక్కేస్తుంది...
వివరణ : అతడలా సవాలు విసిరేసరికి సమాధానం లేదు ఓటమి తప్ప. ఈ సీనులో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇక్కడ సీను కూతురి మీద ఫోకస్ అయినప్పుడు తప్ప. అప్పుడంతా రౌద్ర రసంతో వుంది, ఇప్పుడు కరుణ రసానికొచ్చింది. ఆమెకి కన్నీళ్లు రావడం రావడం ముందు ఇంకెప్పుడో గాకుండా, ఇప్పుడు కూతురితో కనెక్ట్ అయి వస్తేనే, హ్యూమన్ ఎలిమెంట్ జతపడి సీను క్లయిమాక్స్ సమగ్రమవుతుంది.
సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్ లిద్దరూ ప్రసిద్ధ నాటక రచయితలూ కూడా. నాటక రచన ఆర్గానిక్ గా వుంటుంది. పైగా సినిమాల్లో పది సీన్లు వేసి చెప్పే విషయాన్నీ ఒక్క సీన్లో స్థలకాలాల ఐక్యతతో చెప్పేస్తారు. ఇందుకే ఈ సీను ఇలా వచ్చింది - బోలెడు - బోలెడు సమాచారమందిస్తూ, గత వర్తమాన భవిష్యత్ కాలాలకి సంబంధించి.
ఆరు నిమిషాలు - 41 షాట్లు
ఇప్పుడు ఈ సీనుకి షాట్లు తీసిన విధానం చూద్దాం. షాట్స్ పొందిక వాక్యంలో పదాల పొందికంత అందంగా వుంటేనే అదొక వెండితెర పాఠ్యమవుతుంది. స్మూత్ గా సాగిపోయే విజువల్ లాంగ్వేజి అవుతుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయని ఈ వ్యాసం ప్రారంభం
లో ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పుకున్నాం. ఈ ప్రకారం కొన్ని కీలక షాట్స్ కి అర్ధాలు చూద్దాం.
1. మిడ్ షాట్ లో బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పలేకర్, సిగరెట్ ముట్టుంచుకోవడానికి అగ్గిపెట్టె తీసి ఆగిపోతూ కిందికి చూశాడు. లో- యాంగిల్లో కారు దిగుతున్న స్మిత కన్పించింది. తనని తాను ఆమెకంటే ఉన్నతంగా భావించుకునే రకం కాబట్టి, పైనుంచి కిందికి ఆమెని చూస్తున్నట్టు ఒకే లో - యాంగిల్ షాట్. కింద సపరేట్ గా వాళ్ళిద్దరి షాట్స్ వేయలేదు. వేస్తే రసభంగం.
2. ఆమె మెట్లెక్కి ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా అదే లో- యాంగిల్ షాటే అతను తలుపు దగ్గర్నుంచి చూస్తూంటే. ఆమె సజెషన్ లో అతణ్ణి చూస్తున్నట్టు కింది నుంచి హై యాంగిల్ షాట్ వేయలేదు. తన కంటే ఉన్నతంగా ఆమె అతణ్ణి చూసే ప్రశ్నేలేదు కాబట్టి.
3. ఆమె తలుపు దగ్గర అతణ్ణి చూసుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడు, అతడితో సమంగా మీడియం క్లోజప్ లోకి వచ్చింది. ఇప్పుడింకా ఘర్షణ మొదలవని మామూలు స్థితి కాబట్టి, సమంగా మీడియం క్లోజప్ లోకొచ్చింది. తర్వాత ఘర్షణ మొదలయ్యాక ఆమె మామూలు మీడియం క్లోజప్ లో వుండదు. ఫైర్ బ్రాండ్ గా బిగ్ క్లోజప్స్ లో వుంటుంది.
4. ఆమె బెడ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు పక్క గది కిటికీ వూచల్లోంచి ఆమెని చూపిస్తూ పానింగ్ షాట్. ఈ సినిమాలో ఆమె ప్రతీ రిలేషన్ షిప్ లోనూ పురుషుడితో పంజరంలో వున్నట్టే ఫీలవుతుంది. అందుకని కిటికీ వూచల్లోంచి ఈ షాట్.
5. అతను బెడ్ రూమ్ తలుపు దగ్గరికొచ్చి ఆగినప్పుడు, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు వున్న ఆమెకి, అతడికీ మీడియం క్లోజప్సే ఇచ్చారు. వాగ్యుద్ధం ఇప్పుడిప్పుడే తారా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి.
6. అతను దర్శకుడితో సంబంధాన్ని అంటగట్టి మాటాడినప్పుడు తారా స్థాయికి వెళ్ళింది. ఆమె కోపం పెట్రేగిన ఈ ఉద్రిక్త క్షణాల్లో మామూలు క్లోజప్ కాదు, బిగ్ క్లోజప్ లో కొచ్చేసింది. అతను అదే మీడియం క్లోజప్ లో వుండి పోయాడు. ఇప్పుడిక ఆమె రివోల్ట్ అవుతున్న పతాక దశ ఇదన్నమాట. ఇంతవరకూ ఎక్కడా బిగ్ క్లోజప్ ఆమె మీద వేయకుండా జాగ్రత్త పడ్డారు.
7. ఇప్పుడతను కదిలి ఆమెతో బిగ్ క్లోజప్ లోకి వచ్చేశాడు. ఇలా రావడానికి కారణం ఆమెతో సమంగా ఫైర్ అవుతూ, కొత్తగా తీవ్రారోపణ చేస్తున్నాడు. తనకి చెప్పకుండా ఆమె కొత్త బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచినట్టూ, ఇంకో కొత్త సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసినట్టూ. ఈ నిజంతో ఆమె ఆలోచించుకోవాలన్నట్టు బిగ్ క్లోజప్ లోంచి తప్పుకుంది.
8. దానికామె సమాధానం చెప్తున్నప్పుడు తిరిగి ఇద్దరూ మీడియం క్లోజప్ లో. అప్ అండ్ డౌన్స్ ని షాట్స్ ఫాలో అవుతున్నాయి.
9. ఇప్పుడామె గతంతో ఆమె మీద ప్రతాపం చూపిస్తూ అతను బిగ్ క్లోజప్ లోకొస్తే, కెమెరా అతణ్ణి ఫాలో అయి పక్కనున్న ఆమెనీ ఫ్రేములోకి తీసుకుంది. అతడి ప్రతాపం పూర్తయ్యాక, ఆమె ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చి తప్పుకోవడంతో, షాట్ కట్ అయింది.
10. దీంతో అతను సపరేట్ గా బిగ్ క్లోజప్ వేసుకుని, రికార్డు పెట్టిన కూతురి మీద అరుపులు అరవడం.
11. వెంటనే ఆమె కూడా బిగ్ క్లోజప్ లోకొచ్చేసి, రికార్డు ఎందుకాపాలని అంతకంటే అరుపులు అరవడం.
12. దీంతో తలుపు దగ్గరున్న అతను ఠక్కున మీడియం క్లోజప్ లోకొచ్చేశాడు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయే బహానాలు వెతుకుతున్నావా - అంటూ.
13. పుల్ బ్యాక్ చేస్తే ఆమే అదే ఫ్రేములో అతడి సమీపంలో వుంది. ఆమె ఇలా ముందు కొస్తున్నట్టు చూపించలేదు. ఆమెని తలుపు దగ్గరే అతడి ముందుంచి, పుల్ బ్యాక్ చేస్తే, ఆమె ముందుకు కదిలిన అర్ధమే వచ్చింది. అంటే వెళ్ళిపోవడానికి ఇక సిద్ధమని.
14. స్మిత సూట్ కేసు పట్టుకుని వెళ్లి పోతున్నప్పుడు, కూతురు అన్న మాటకి ఆగిపోయి, అటు చూసినప్పుడు, కన్పించిన తల్లి బ్లర్ అవుతుంది. ఆమెకి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని స్మిత ఫీలవక పోవడం వల్ల.
15. స్మిత ఇటు తిరిగి చూసినప్పుడు, పలేకర్ ని కూడా బ్లర్ గానే చూసింది. కేర్ చేయనట్టు. అతను ముందుకొచ్చి కూతురి గురించి సవాలు విసిరినప్పుడు. మీడియం క్లోజప్ లోనే వుంది...ఇక ఆమెకి బిగ్ క్లోజప్స్ లేవు. పరాజితురాలు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించిన తల్లికే కూతుర్ని అప్పగించింది.
ఈ విధమైన షాట్స్ కలబోతతో సీను తెరకెక్కింది. దర్శకుడు శ్యాం బెనెగళ్ విజన్తో సీను క్లాసిక్ హోదాకి చేరింది. ఈ సీను స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ సీనే. స్మిత షూటింగ్ ముగించుకుని డైరెక్టర్ తో ఇంటికొచ్చే రెండు సీన్ల తర్వాత, మూడే సీనే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ ఒక్క సీనులోనే సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ వరకూ వుండే ఓ ఇరవై సీన్ల విషయమంతా వుంది. గ్రేట్ కదూ? నాటక టెక్నిక్ వల్ల ఇలా కుదిరింది. ఈ వొక్క సీన్లోనే బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో వుండే పాత్రల పరిచయం, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్సూ ప్లే అయ్యాయి. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇప్పుడామె గోల్ ఏమిటో దేవుడెరుగు. ఈ సీను తర్వాత చిన్నప్పట్నుంచీ ఆమె ఫ్లాష్ బ్యాక్.
ప్రాంతీయ సినిమాల్లో ఇలాటి టెక్నిక్స్ వుంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో అవే టెంప్లెట్స్ తప్ప రాయడానికేమీ వుండడం లేదు...
ప్రాంతీయ సినిమాల్లో ఇలాటి టెక్నిక్స్ వుంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో అవే టెంప్లెట్స్ తప్ప రాయడానికేమీ వుండడం లేదు...
―సికిందర్