రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మార్చి 2021, సోమవారం


       అసలీ సినిమా మొత్తాన్నీ గమనిస్తే నాటక ధోరణిలో గాథ కన్పిస్తుంది. గాథ అంటేనే పాత స్కూల్లో చెప్పేది. నాటకంలో ఒక్కో అంకానికి తెరపడుతున్నట్టు ఒక్కో చాప్టర్ గా నిదానంగా సాగే ఈ గాథకి ఈ ధోరణిలోనే బలమైన ఆకర్షణ వుంది. అది హృదయాలకి గాలం వేస్తుంది. పాత అనేది లేదు. సాంప్రదాయం లేకపోతే ఆధునికత్వం లేదు. సాంప్రదాయం లేకపోతే దేన్ని చూసి ఆధునికత్వం వస్తుంది. సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యుదయం పుడుతుంది. సాంప్రదాయం లేకపోతే అభ్యుదయం ఎక్కడ్నుంచి పుడుతుంది. పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేకపోతే ఠాట్ వీల్లేదని ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కడుంటాయి. వాళ్ళూ వీళ్ళూ కొట్టుకోవడం, వీధిన పడ్డం ఎక్కడుంటుంది. కాబట్టి సాంప్రదాయ అంశలేని ఏ ఆధునిక జీవితంకళవ్యవహారం లేదు. దాన్ని కూడా కలుపుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడున్న సినిమాల మేకింగ్ కి సినిమా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు కాలేకపోతున్నారు. ఏదో పైపైన చూసేసి మర్చిపోవడమే. ఎంత హిట్ అన్పించుకున్నా మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకులు ఒకప్పటి లాగా వుండడం లేదు. సినిమా ప్రేక్షకుల్లోని ప్రేక్షకుల్ని చంపేస్తున్న ఈ మేకింగ్ తీరు తెన్నుల్ని సంస్కరించుకోవడానికి దేర్ విల్ బి బ్లడ్ లాంటి గాథలు ఎంతైనా ఉపయోగపడవచ్చు.  

      ఇప్పుడు ఎండ్ విభాగాని కొచ్చాం. మిడిల్ 2 లో భూములున్న బాండీ వచ్చి, పైప్ లైన్ వేసుకోవడానికి భూములు కావాలంటున్న డానీ ని బ్లాక్ మెయిల్ చేసే దగ్గర ఆగాం. డానీ చేసిన హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని ఈ బ్లాక్ మెయిల్. ఇప్పుడు డానీకి భూములు కావాలంటే, చర్చికి వచ్చి మతంలో చేరాలని బాండీ ఆదేశం. ఇది పీపీ 2 ఘట్టం. మతాన్ని వ్యతిరేకించే డానీకి ఇది ఇరకాటంలో పెట్టెసే ఘట్టం. గాథ మతాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమయింది పీపీ 1 దగ్గర. దీనికి సమాధానంగా మతాన్ని ఒప్పుకోవాల్సిన ఈ పీపీ 2 ఘట్టం. గాథకి పీపీ 1 సమస్యా స్థాపన, పీపీ 2 పరిష్కార మార్గం. పీపీ 1, పీపీ 2 ల మధ్య ఈ  మిడిల్ 1, మిడిల్ 2 లతో వుండేదే సినిమా కథ (గాథ). దీని తర్వాత వుండేది కథ (గాథ) కాదు, కథకి (గాథకి) ముగింపు కథనం...

    ఎండ్ కథనం :  చర్చిలో డానీ ప్రాయశ్చిత్తం. డానీ ప్రత్యర్ధి పాస్టర్ ఇలై కార్యక్రమం నిర్వహిస్తాడు, ప్రభువు వైపు చూస్తూ నేను పాపిని, కొడుకుని వదిలేశానని పదేపదే గట్టిగా చెప్పమంటాడు. చెప్పాక డానీ జుట్టు పట్టుకుని సైతాను వదిలిస్తాడు. డానీ పునీతుడవుతాడు. ఇక బాండీ భూముల్ని లీజుకి తీసుకుని పైపు లైన్ వేయడం ప్రారంభిస్తాడు.

        ఎక్కడో వుంటున్న కొడుకుని తీసుకొచ్చి కలుపుతారు. కొడుకుని హత్తుకుంటాడు. కొట్టమని చెంప మీద కొట్టించుకుంటాడు. ఇక కొడుకు జ్యూనియర్ డానీతో ఆనందంగా జీవితం గడుపుతాడు. జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత వచ్చి విడిగా వ్యాపారం చేసుకుంటాను, వాటా పంచమంటాడు. పంచనంటాడు డానీ. తండ్రిగా నిన్ను ఒప్పుకుంటాను గానీ, పార్టనర్ గా నీతో పొసగడం లేదంటాడు జ్యూనియర్. నీ తండ్రెవరు, అక్రమ సంతానానివి నువ్వని దూషిస్తాడు డానీ. అనాధగా దొరికితే పెంచి పోషించానంటాడు. తన గురించి ఈ కొత్త విషయాలు తెలుసుకున్న జూనియర్ విరక్తితో వెళ్ళిపోతాడు.

మరికొంత  కాలం గడిచి పోతుంది. ఆయిల్ మోతుబరిగా ఇంకింత ఎదిగి విశాలమైన బంగాళాలో ఒంటరిగా వుంటాడు డానీ. తాగుడు మరుగుతాడు. ఇప్పుడు ఇలై వస్తాడు. చాలా రిచ్ గా వుంటాడు. ఇన్నాళ్ళూ మతప్రచారం చేస్తూ దేశాలు తిరిగానంటాడు. రేడియో ప్రచారం కూడా చేశానంటాడు. తన కెందరో ఫ్యాన్స్ ఏర్పడ్డారంటాడు. కొన్నాళ్ళ క్రితం బాండీ చనిపోయాడనీ, బాండీ మనవడు హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడనీ, ఇప్పుడు తమకున్న భూములు అమ్మేయదల్చుకున్నాడనీ అంటాడు. డానీ లీజుకి తీసుకున్న ఆ భూములు కొనేసుకుంటే, తనకి కొంత కట్ మనీ వస్తుందనీ, తను చాలా ఇబ్బందుల్లో వున్నాననీ అంటాడు. పాత బాకీ ఐదువేలు కూడా ఇమ్మంటాడు.

        అయితే నువ్వు దొంగ పాస్టర్ నని ఒప్పుకో, మతం మూఢ నమ్మకమని అరిచి చెప్పుకో- అంటాడు డానీ. ఇలై అలాగే చేసేస్తాడు. తను దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్తాడు. ఇలై చేత ఇలా చెప్పించాక, ఆ భూములు తనకి పనికిరావని చల్లగా చెప్తాడు డానీ. ఆ భూముల్లో స్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురుని తాగి పడేశా నంటాడు.

షాక్ తిన్న ఇలై అన్యాయం చేయవద్దంటాడు
, అన్యాయమే చేస్తానని ఇలైని కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చంపేసి, ఐయామ్ ఫినిష్డ్ అంటాడు. ది ఎండ్.

***

    విశ్లేషణ : మతం -పెట్టుబడి రెండిటి గాథ కొలిక్కి వచ్చింది. సంఘర్షించుకుంటే మతానికేమీ కాలేదు, పెట్టుబడికేమీ కాలేదు. అయ్యింది వాళ్ళిద్దరికే. నెగెటివ్ క్యారక్టర్లు గా మారిన క్యారక్టర్ల గాథ. ఈ గాథలో ఏ వొక క్యారక్టర్ విజయాన్నీ చూపలేరు. మతం మీద పెట్టుబడి విజయం, లేదా పెట్టుబడి మీద మత విజయం చూపలేరు. అసహజంగా వుంటుంది. మతం పెట్టుబడిని నాశనం చేయదు, పెట్టుబడి మతాన్నీనాశనం చెయ్యదు. మతం మీద నాస్తిక విజయం, పెట్టుబడి మీద కమ్యూనిస్టు విజయం చూపించ వచ్చు. మతమని ఒకరు, పెట్టుబడి అని ఒకరూ సంఘర్షించుకుంటే ఇద్దరూ అంతమవాలి, లేదా రాజీ పడాలి చివరికి. ఇది రాజీపడి సుఖాంతమయే గాథ కాలేదు. డానీ ఇలైలు మతం-పెట్టుబడి భావజాలాలు పరస్పర ఆధారభూతాలని గుర్తించలేదు. వాటిని అడ్డుపెట్టుకుని కక్ష తీర్చుకుందామనుకున్నారు. శిక్షలు పొందారు.

***

        2. ఈ ఎండ్ కథనంలో తిరిగి మిడిల్ 2 కథనం లోలాగే  క్యారక్టర్ల వారీ చాప్టర్లున్నాయి. పీపీ 2 లో బ్లాక్ మెయిల్ తో ఎంటరైన బాండీ, ఈ ఎండ్ ప్రారంభంలో డానీని చర్చిలో చేర్పించి నిష్క్రమిస్తాడు. ఈ చాప్టర్లో డానీ వదిలేసిన కొడుకు ప్రస్తావన వుండడంతో, తర్వాతి చాప్టర్ ఆ కొడుకు రాకతో ప్రారంభమవుతుంది. కొడుకు తను అక్రమ సంతానమని తెలుసుకుని వెళ్ళి పోయాక, ఇలై రాకతో చివరి చాప్టర్ ప్రారంభమవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా మూడు చాప్టర్లతో ఈ ఎండ్ వుంది. ఈ నాటక శైలి తెలుగులో వస్తే, బాగా లేదని  కొన్ని రివ్యూలే ఆడియెన్స్ కి మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. దేన్ని ప్రమోట్ చేయాలో, దేన్ని డీమోట్ చేయాలో తెలుసుకోక పోతే.

***

         3. మొదటి చాప్టర్లో చర్చిలో డానీ నిష్కృతి పేర ఇలై ప్రతీకార పండగ చేసుకున్నాడు. వెనుకటి మిడిల్ 2 లో, బాకీ డబ్బుల కోసం వచ్చిన ఇలైని బురదలో పడేసి ఎడాపెడా కొట్టాడు డానీ. దాని ప్రతీకారమిలా... మిడిల్ 1 లో ప్రచ్ఛన్న పోరాటంగా, మిడిల్ 2 లో ప్రత్యక్ష పోరాటంగా సాగిన ఈ ప్రత్యర్ధుల మధ్య యాక్షన్ రియాక్షన్ల్ పరంపర, ఈ ఎండ్ లో కొలిక్కి వచ్చే క్రమం ప్రారంభమైంది.

        వ్యాపారం కోసం విధిలేక మతంలో చేరడాని కొచ్చిన డానీ చేత, పాపినని చెప్పిస్తాడు పాస్టర్ ఇలై. చెప్పించి, కొడుకుని వదిలేసిన పాపం ప్రభువు వైపు చూసి చెప్పమంటాడు. చెప్పాక, మోకాళ్ళ మీద కూర్చున్న డానీని ఎడాపెడా కొడుతూ సైతానుని వదిలిస్తాడు. కానీ ఆల్రెడీ తనలోనే సైతానుతో వున్న ఇలైని కూడా ప్రభువు గమనిస్తూనే వున్నాడు...

        నిజంగా డానీకి పాప ప్రక్షాళన అయ్యిందా? పాపాలన్నీ చెప్పుకున్నాడా? హెన్రీని హత్య చేసిన విషయం చెప్పుకోలేదు. ఇది కర్మ ఫలంగా తర్వాత యాక్షన్లో కొస్తుంది. హెన్రీ హత్యని అడ్డుపెట్టుకుని డానీని బ్లాక్ మెయిల్ చేసి మతంలో చేర్పించిన బాండీ, ఈ  విజయానికి ఆనందిస్తున్నాడు. ఇది బాండీ విజయమేనా?

డానీ చేసిన హత్యని స్వార్ధానికి ఉపయోగించుకున్నబాండీ, తనూ నేరంలో భాగస్వామి అయ్యాడు. హత్య విషయం కూడా డానీ చేత చెప్పిస్తే, డానీ అరెస్టయి అతడి బిజినెస్ వుండదు, తను భూములు లీజుకిచ్చి లాభపడే అవకాశముండదు. అందుకని నేరం గురించి తెలిసినా దాచి పెట్టాడు. మరి ఈ బ్యాడ్ కర్మకి శిక్షేమిటి?

కొన్ని శిక్షల్ని ముందే ఖరారు చేసి పట్టేస్తుంది ప్రకృతి, ముందు జరగబోయేది దానికి తెలుసు గనుక. కర్మ ఫలాలు అడ్వాన్స్ బుకింగ్ గానూ వుంటాయి, కరెంట్ బుకింగ్ గానూ వుంటాయి. ఎదైతే అది తీసుకుని షో చూసుకోవాలి. ఆ షో హిట్టే అవుతుంది, తెలుగు సినిమాల్లాగా 90% ఫ్లాప్స్ తో వుండదు. రేపు ఈ శిక్షనుంచి బాండీ తప్పించుకున్నా వారసులు తప్పించుకోలేరు. చూద్దాం ఏం జరుగుతుందో. మతం, పెట్టుబడి లాంటి వన్నీ మనుషులు ఏర్పర్చు కున్నవి. మతమైనా, పెట్టుబడి అయినా, మరేదైనా, అన్నిటికీ పైనుండేది మనుషులు ఏర్పర్చని ప్రకృతే.  అది యాక్షన్ రియాక్షన్ల బిజినెస్ తో బిజీగా వుంటుంది.

***

       4. రెండో చాప్టర్లో కొడుకు జూనియర్ డానీ వస్తాడు. మిడిల్ 2 లో పనికొచ్చే హెన్రీ ని ఛూసి, పనికిరాని చెవిటి పెంపుడు కొడుకుని రైలెక్కించేసి వదిలించుకున్న డానీకి, చర్చిలో పునీతుడయ్యాక బహుమతిగా తిరిగి అదే కొడుకు. ఇప్పుడెంతో ప్రేమగా చూసుకుంటాడు. తండ్రీ కొడుకులు గతంలో సరదాగా ఆడుకున్న ఆటలు ఇప్పుడు విజువలైజ్ అవుతాయి. సడెన్ గా ఈ కొత్త డిస్కవరీ థ్రిల్ చేసి ఆనంద పరుస్తుంది మనల్ని. ఎందుకంటే బిగినింగ్ లోగానీ, మిడిల్ రెండు విభాగాల్లో గానీ, వీళ్ళిద్దరి సాన్నిహిత్యం ఎక్కడా చూపించలేదు. ఎక్కడ చూపిస్తే రక్తి కట్టి సినిమా టాప్ అప్ అవుతుందో (వేరేపదం దొరక్క టాప్ అప్ అని వాడేశాం), అక్కడ చూపించేందు కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టాడు దర్శకుడు. ఇది డైనమిక్స్. మనమేం చేస్తామంటే, ఫాదర్ - ఛైల్డ్ సెంటి మెంటని అక్కడా చూపించి, ఇక్కడా చూపించి చెడగొడతాం. ఎక్కడా టాప్ అప్ అవదు సినిమా. రీఫ్రెష్ అవదు. చద్దన్నంలా పడుంటుంది.

        జూనియర్ పెద్దవాడై మేరీని పెళ్లి చేసుకుంటాడు. మేరీని ఇప్పుడు చూపించడు దర్శకుడు. చిన్నతనంలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వున్న మేరీకి, నాస్తికుడైన డానీ అండగా వున్నాడు. అతను ఆల్రెడీ నాస్తికుడు, ఆమె కాబోయే నాస్తికురాలు. ఇద్దరికీ అక్కడ సరిపోయింది. గత చాప్టర్లో, చర్చి సీనులో ఇలై డానీ చెమ్డా లెక్కదీసింతర్వాత, మతంలో చేరిన అతడ్ని, బేబీ మేరీ వాటేసుకుంటుంది. ఇలా తనుకూడా డానీని ఫాలో అయి మతాన్ని ఒప్పుకుని, ఫ్యామిలీ అయిందని ఈ ఒక్క షాట్ లో కథ చెప్పాడు దర్శకుడు. దీన్ని అండర్ లైన్ చేసుకోవచ్చు టిప్ బావుంటే.

ఇప్పుడు పెద్దవాడైన జూనియర్ మేరీని పెళ్లిచేసుకున్న విషయం డానీకి చెప్పడం ద్వారా తెలియజెస్తాడు దర్శకుడు. ఇక మెక్సికోలో విడిగా వ్యాపారం చేసుకుంటానని, వాటా పంచమని జూనియర్ అంటాడు. ఇలా జూనియర్ వాటా అడిగేసరికి, డానీకి జూనియర్ బాస్టర్డ్ గా కన్పిస్తాడు. ఎవడికి పుట్టావని అంటాడు. బాస్టర్డ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ అని తిడతాడు. అనాధగా దొరికితే పెంచుకున్నానంటాడు. చాలా తూలనాడుతాడు. తన జన్మరహస్యం ఇలా తెలుసుకుని షాక్ తిన్న జూనియర్, ఏమీ చేయలేక ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు.  

     తమ పొజిషనేంటో తెలుసుకోకుండా ఎవర్నీ నమ్మి పని చేయకూడదు. ఒట్టి చేతులే మిగులుతాయి. బాల్యం నుంచీ డానీయే తండ్రి అనుకున్న జూనియర్, తల్లి ఏదని అడగలేదు. అడిగివుంటే తన పొజిషన్ అప్పుడే తెలిసేది. అందుకనుగుణంగా జీవితాన్ని మల్చుకునే వాడు. డానీ మీద ఆధారపడేవాడు కాదు. ఇదేమీ తెలుసుకోకుండా డానీ పార్టనర్ గా చేస్తే పార్టనర్ గా వుండి పోయాడు. కంపెనీ అభివృద్ధికి కష్టపడ్డాడు. ఇప్పుడు  తండ్రిగా డానీ ఓకే గానీ, పార్టనర్ గా పొసగడం లేదని వాటా అడిగేసరికి, బాస్టర్డ్ అన్నాడు. కనువిప్పయి, చేసేది లేక పడ్డ కష్టమంతా వదులుకోవాల్సి వచ్చింది జూనియర్ కి.

        తండ్రిగా ఓకే అనుకున్నాడు. హెన్రీని చూసి తనని రైలెక్కించి వదిలించుకున్న కోపం, పాలల్లో లిక్కర్ కలిపి తాగించిన కసీ అన్నీ మర్చిపోయాడు జ్యూనియర్ - తిరిగి వచ్చిన తనతో, చేసిన తప్పుకి డానీ చెంప మీద కొట్టించుకోవడంతో. తండ్రిగా ఓకే అన్పించాడు అప్పట్నుంచీ డానీ.

        కానీ తండ్రిగా కూడా ఓకే కాదనీ, చిన్నప్పట్నుంచీ తనని వ్యాపారంలో ఫ్యామిలీ లుక్ కోసమే వాడుకున్నాడనీ, అలా నమ్మించడానికే చిన్నప్పుడే పార్టనర్ గా చేశాడనీ తెలుసుకోలేకపోయాడు జూనియర్. తండ్రిగా నువ్వు ఓకే అనడంలో, ఓకే కాదన్న అతడికి తెలీని సత్యమూ దాగుంది. అదిప్పుడు బయటపడింది. ఇదీ డైలాగులు రాసే కళ. ఎవ్విరీథింగ్ ఈజ్ కనెక్టెడ్. గాథతో ఎక్కడో కనెక్ట్ అయ్యే వుంటున్నాయి డైలాగులు. తెలుగులో ఈ కళ ప్రదర్శించ వచ్చా? చాలా ఇన్స్ ఫైరింగ్ గా వుంది.

        డానీ సంగతి. డానీకి ఆనాడు జూనియర్ని పార్టనర్ గా చేయడానికి కన్పించని బాస్టర్డ్, ఈనాడు వాటా అడిగేసరికి బాస్టర్డ్ లా కన్పించాడు. తనని నమ్మిన మేరీ కోసమైనా సంయమనంతో లేడు. కొడుకుని వదిలేసిన పాపంతో ప్రభువు ముందు చెంపలు వాయించుకుని మతంలో చేరిన తను, తిరిగి అదే కొడుకుని శాశ్వతంగా వెళ్ళ గొట్టేశాడు. డానీ మారలేదు, మారడు. తియ్యటి సినిమాలు, కమ్మటి హీరోయిజాలూ మనుషులెలా వుంటారో చూపించవు.

***

       5.  మూడో చాప్టర్ కల్లా చాలా కాలం గడిచిపోతుంది. డానీ అల్ట్రా  రిచ్ గా పెద్ద బంగాళాలో ఒంటరిగా వుంటూ, తాగుడు మరుగుతాడు. నిజానికి భావిజీవితం గురించి కలలు గంటూ, తమ్ముడ్ని అంటూ వచ్చిన హెన్రీకి మిడిల్ 2 లో ఏం చెప్పాడు డానీ - పెద్ద బంగాళా కట్టుకుని మనుషులకి దూరంగా జీవించాలని...అతను మనుషుల్ని మొదట్నుంచీ అసహ్యించుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్న పెద్ద బంగాళాలోనే వున్నాడు- కోరుకున్నట్టు తను అసహ్యించుకునే మనుషులకి దూరంగానే వున్నాడు- అయితే కొడుకుని వెళ్ళ గొట్టుకుని, నా అనే వాళ్ళంటూ సైతం లేని దిక్కులేని జీవితంతో, తాగుడే తోడై...

           మనుషులతో వుండడమనేది సార్వజనీన ప్రవర్తన. ఇది కాదనుకున్నందుకు సొంత మనుషులే వుండని దిక్కులేని జీవితమైంది.  మనమేం మాట్లాడతామో ఆలోచించి మాట్లాడాలి. రైటుగా మాట్లాడితే రైటుగా రిసీవ్ చేసుకుంటుంది సబ్ కాన్షస్, రాంగ్ గా మాట్లాడితే రాంగ్ గా రిసీవ్ చేసుకుని అది మోతాదు మించి నిజం చేసేస్తుంది. ఈ మైండ్ మెకానిక్స్ గురించి ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్ అన్న అరవై ఏళ్ళ నాటి ప్రసిద్ధ పుస్తకంలో చక్కగా వివరిస్తాడు డాక్టర్ జోసఫ్ మర్ఫీ.

        ఇక ఇలై ఎంటరవుతాడు. ఈ మొత్తం గాథలో యాక్షన్ జరగడానికి పాత్రలు స్వయంగా చర్యలు తీసుకోవడం లేదని గమనించాలి. ఉదాహరణకి, మిడిల్ 2 లో డబ్బులడిగితే బురదలో వేసి ఇలైని కొట్టిన డానీ మీదికి ఇలై వెంటనే పోలేదు. తర్వాత డానీయే ఖర్మరా బాబూ అనుకుని మతంలో చేరడానికి చర్చికి వెళ్ళి, ఇలైకి చిక్కి దేహశుద్ధి చేయించుకున్నాడు. అలా దేహశుద్ధి చేయించుకున్న డానీ కూడా వెంటనే వెళ్ళి ఇలైని చిత్త శుద్ధితో తన్నలేదు.

కాలమే ఒకళ్ళ ముందు ఒకళ్ళని అవసరాలు సృష్టించి వ్యూహాత్మకంగా ప్రవేశ పెడుతూ, సెట్ రైట్ చేస్తోంది. కాలమే యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేని చూసుకుంటోంది. నిజ జీవితం ఇలాగే వుంటుంది. మనల్ని ఎవరో ఏదో అన్నాడని బదులు తీర్చుకోవాల నుకుని తీర్చుకోకుండా వుండి పోతాం. అతనే అవసరం పడి తర్వాతెప్పుడో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు చూసుకుంటాం చూసుకోవాలనుకుంటే. గాథ ఈ స్కీముతో నడుస్తోంది. నిజ జీవితంలో జరిగే స్కీము. కమర్షియల్ కథల్లో చిరంజీవి వెంటనే వెళ్ళి రావుగోపాలరావుని కొట్టకపోతే రుచించదు. నిజ జీవితంలో మన చేతగానిది చిరంజీవి చేసి చూపాలనుకుంటాం. కథ యాక్టివ్ క్యారక్టర్లతో తియ్యటి డ్రీమ్ వరల్డ్ అయితే, గాథ పాసివ్ క్యారక్టర్లతో రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో మనం పాసివ్ క్యారక్టర్లమే. సినిమాల్లో లాగా వెళ్ళి కొట్టలేం, సాంగేసుకోలేం .

***

      6. అలా మత ప్రచారమంటూ లోకం చుట్టిన వీరుడిగా తిరిగి తిరిగి డానీ దగ్గరికే వచ్చాడిప్పుడు ఇలై. టైమ్ ఈజ్ ది గ్రేటెస్ట్ లెవెలర్. కర్మల బాకీ తీర్చడానికి. డానీ చేతికి చిక్కాడిప్పుడు. ఆనాడెప్పుడో ప్రక్షాళన పేరుతో చర్చిలో నన్ను కొట్టావ్, ఇప్పుడు నిన్ను కొడతా టైపులో చిక్కాడు. పాస్టర్ ఇలై ఇప్పుడు కమీషన్ ఏజెంట్ అయిపోయాడు. బాండీ మనవడి భూముల్ని డానీకి అమ్మించి కమీషన్ పొందాలని. అలాగే పాత బాకీ ఐదువేలు ఇమ్మని కోరుతున్నాడు... తన కర్మల బాకీ మర్చిపోతున్నాడు...చర్చిలో చేసిన అవమానంతో ఐదు వేలు బాకీ అడిగే అర్హత కోల్పోయాడు. తానే చేసిన అవమానం తాలూకు బ్యాడ్ కర్మ బాకీ పడ్డాడు. దాన్ని అదే రూపంలో వసూలు చేసుకుంటున్నాడిప్పుడు డానీ... అయితే నువ్వు దొంగ పాస్టర్ ననీ, మతం మూఢ నమ్మకమనీ అరిచి అరిచి చెప్పుకో అంటూ.

        తప్పలేదు ఇలైకి డబ్బవసరంతో. నేను దొంగ పాస్టర్ ని, మతం మూఢ నమ్మకం అని స్లోగన్స్ ఇస్తాడు. ఇప్పుడు డానీ భూములు బేరమాడుకోవాలి. బేరమాడుకోడు. ఇలైని సర్వ భ్రష్టుడ్ని చేయాలి.  అందుకే అంటాడు, ఇంకెక్కడి భూములూస్ట్రా వేసి మిల్క్ షేక్ లా చమురంతా ఎప్పుడో తాగేశాననీ.

     అప్పట్లో బాండీ భూముల చుట్టూ ఇలై వాళ్ళ భూములే కొన్నాడు చమురు కోసం. ఆ భూముల్లో చుట్టూ బోర్లు వేసి, భూములు అమ్మని బాండీ భూముల్లో చమురంతా కూడా తోడేశాడు డానీ!

     భోరు మంటాడు ఇలై. అన్యాయం చేయవద్దని ఏడ్చేస్తాడు. మొదటి చాప్టర్లో బాండీ విజయం గురించి చెప్పుకున్నాం. డానీ చేసిన హత్యని పురస్కరించుకుని, డానీని బ్లాక్ మెయిల్ చేసి లాభపడాలనుకున్నాడు బాండీ. అలా ఆ హత్యా నేరంలో భాగస్వామి అవుతూ బ్యాడ్ కర్మ రాసుకున్నాడు  అలా బాండీ అనుకున్న ప్లాను పారి డానీకి భూముల్ని లీజుకిచ్చి లాభపడ్డాడు. ఆ బ్యాడ్ కర్మ అడ్వాన్సుగా శిక్ష రాసేసిందని కూడా చెప్పుకున్నాం. ఆ శిక్ష ఇదే...ఆల్రెడీ ఆ భూముల్లో చమురు తాగేశాడు డానీ. ఈ శిక్ష నుంచి బాండీ తప్పించుకున్నా, బాండీ చేసిన దాంతో సంబంధం లేని మనవడు తప్పించుకోలేకపోయాడు. పెద్దలు చేసే పాపాలు పిల్లలకి అంటుకుంటాయని ఇందుకే అంటారు.


           ఇక నైతికంగా, ఆర్ధికంగా పూర్తిగా పతనమై రోదిస్తున్న ఇలైని, కొట్టి కొట్టి చంపేస్తాడు డానీ. చేసిన ఒక హత్యతో దొరకని డానీ, ఈ హత్యతో దొరికిపోతూ ఐయామ్ ఫినిష్డ్ అంటాడు.

***

        ఇంత చెప్పుకున్నాక, ఇంకా ఈ నాల్గు భాగాల సుదీర్ఘ వ్యాసానికి ఉపసంహారం అవసరం లేదు. జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ దేర్ విల్ బి బ్లడ్ రూపంలో మనముందు కొచ్చిన ఈ కదిలించే గొప్ప గాథ, తెలుగులో గాథలు తీసి ఔన్నత్యాన్ని సాధించడానికేమైనా ఉపయోగపడుతుందేమోనని భావిద్దాం.

        ఈ వ్యాసాల్ని ఒకే బంచ్ గా పీడీఎఫ్ తీసి, డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో వుంచమని అంటున్నారు. ఎనిమిది వేల పదాలతో, 37 పేజీల ఈ నాల్గు వ్యాసాలు, ఒక చోట కాపీ పేస్ట్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులోనే వున్నాయి.

 సికిందర్