రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 21, 2019

727 : ఆరునెలల అందాలు - 1

2018 జులై రెండో వారం నుంచి 2019 జనవరి రెండో వారం వరకూ నోటెడ్
సినిమాలు 38 విడుదలయ్యాయి. వీటిలో రోమాంటిక్ కామెడీలు 6,
రోమాంటిక్ డ్రామాలు 2, బ్రొమాన్స్1, హార్రర్ కామెడీ 1, కామెడీలు 2
విడుదలయ్యాయి. ఫ్యామిలీలు 4, యాక్షన్ 13, స్పై1, సస్పెన్స్ థ్రిల్లర్ 2, ఫాంటసీలు 2,
సైన్స్ ఫిక్షన్ 1, రాజకీయం 1, బయోపిక్ 1, రియలిస్టిక్ 1,  విడుదలయ్యాయి.
ఈ 38 లో 4 హిట్టయ్యాయి, 5 ఏవరేజీలు కాగా, మిగిలిన 29  ఫ్లాపయ్యాయి.
వీటి జాతకాలు నిర్ణయించిన మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ లెలా వున్నాయో చూద్దాం. ముందుగా  రోమాంటిక్ కామెడీలతో ప్రారంభిద్దాం...

1. నర్తనశాల 
నాగశౌర్య – కశ్మీరా పరదేశీ; శ్రీనివాస్ చక్రవర్తి (కొత్త దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : పాయింటు కొత్తదే, స్టేజి నాటకం చిత్రీకరణ – ఫ్లాప్

క్రియేటివ్ యాస్పెక్ట్  : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్  
          గేపాత్రలతో రోమాంటిక్ కామెడీ తెలుగులో కొత్త కథే. తరానికి యూత్ అప్పీల్ వున్నదే. కానీ అయిడియా వరకే కొత్త, దాంతో అల్లిన కథంతా పాతావకాయ. సినిమా కథ అనికూడా చెప్పలేకుండా స్టేజి డ్రామాలా తీశారు. ఇప్పటి సినిమా లక్షణాలేవీ కన్పించని అరిగిపోయిన పాత స్కూలు మూస అన్పించారు. ఎత్తుకున్న గేఅనే పాయింటు వదిలేసి ఏటో వెళ్ళిపోయే దారీ దిక్కూలేని వ్యవహారం. హీరోయిన్ తో రోమాన్స్ గానీ, ‘గేరోమాన్స్ గానీ, కామెడీ గానీ లేకుండా ఏం తీశారో, ఎవరికోసం తీశారో అర్ధంగాని అయోమయం. 

2. పేపర్ బాయ్
                                        సంతోష్ శోభన్ – రియా సుమన్; వి. జయశంకర్ (కొత్త దర్శకుడు)

                                              మార్కెట్ యాస్పెక్ట్ : గిటార్ ప్రేమ బదులు వీణ ప్రేమ – ఫ్లాప్
  

                                        
క్రియేటివ్ యాస్పెక్ట్: అచ్చులో చదువుకునే కథాకథనాలు - ఫ్లాప్ 

           యూత్ అప్పీల్ కి వాస్తవ దూరమైన పాత ఫార్ములా కథ. తెర మీద చూస్తున్నప్పుడు, ఇది అచ్చులో లభిస్తే చదువుకోవడానికి బావుంటుందన్పించే కథ. షార్ట్ మూవీగా తీసినా కూడా వర్కౌట్ అవచ్చనే కథ. అచ్చులో కథలో పాత్రల్ని, షార్ట్ మూవీస్ లో పాత్రల్ని, సినిమాకి మల్చడంలో విఫలమైన కథ. సమకాలీన సినిమాకి దూరంగా పేదింటి అబ్బాయి పెద్దింటి అబ్బాయి కోటలో రాణి పేటలో రాజాటైపు ఎన్నోసార్లు తెలిసితెలిసి తెలిసిపోయీ వున్న పురాతన కథ. రోమాంటిక్ కామెడీ అవలేదు సరికదా, వున్న కథతో రోమాంటిక్ డ్రామాగా కూడా లేదు. యూత్ కి కావాల్సింది గిటార్ ప్రేమ సినిమాలేగానీ, వీణ ప్రేమ సినిమాలు కాదనేది ఒక మార్కెట్ వాస్తవం. దీనికి దూరంగా అమార్కెటీయ మర్కటంగా తేలిందీ ప్రయత్నం.  

3. 24 కిస్సెస్ 


అదిత్ అరుణ్ – హేబ్బా పటేల్;  అయోధ్య కుమార్ (ఒక సినిమా దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : ముద్దుల అప్పీల్ ని పిల్లల ఆకలి కథ మింగేసింది - ఫ్లాప్ 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్ 
              కథలో చెప్పిన 24 ముద్దుల థియరీకి ఆధారాలేమిటోచూపించలేదు. వాత్సాయనుడు కూడా చెప్పివుండడు. ఇది కల్పితమనుకోవాలి. కానీ ఇది నిజమేనుకుని యూత్ ఫాలో అయ్యే అవకాశముంది. అప్పుడు అమ్మాయిలే  ఫినిష్ అయిపోయేలాగా కథ వుంది. ఎలాగంటే, ఈ  కథలో చూపించినట్టుగా ముద్దుల సెక్షన్ కాస్తా శృంగార సెక్షన్ గా మారిపోవచ్చు. అప్పుడు లబోదిబోమనడమే కథలో లాగా.  అప్పుడు ఈ కథలోలాగా సినిమాటిక్ ఫార్ములా పరిష్కారాలతో బయటపడలేరు. సుఖాంతం చేసుకోలేరు. అయితే ఒక ‘మంచి ఉద్దేశం’తో ప్రారంభమయ్యే ఈ ముద్దులు పోనుపోను బూతుగా మారిపోయిన విషయం కూడావుంది. ఇంకా ముద్దుల కథ మధ్యలో, గతంలో దర్శకుడు తీసిన మిణుగురులుకథని కూడా బోనస్ గా ఇచ్చాడు. దర్శకుడు గతంలో తీసిన  మిణుగురులుహేంగోవర్ లోంచి ఇంకా బయటికి రాలేదు. ముద్దుల కథలో అన్నంకోసం తపించే వీధిబాలల ఆక్రందనల కథేమిటో అర్ధం గాదు సెకండాఫ్ లో.


4. పడిపడి లేచె మనసు 

శర్వానంద్- సాయిపల్లవి; హను రాఘవపూడి (3 సినిమాల దర్శకుడు) 

మార్కెట్ యాస్పెక్ట్ : ట్రాజిక్  రోమాన్స్ - ఫ్లాప్. 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ - ఫ్లాప్
          ఫస్టాఫ్ పాత మూస ఫార్ములా లవ్ ట్రాక్, అది కూడా  హీరోహీరోయిన్ల చిన్నపిల్లల లాంటి సిల్లీ మనస్తత్వాలతో. ఇంటర్వెల్లో ‘మరోచరిత్ర’ పాయింటుతో ట్రాజిక్ లవ్ ప్రారంభం. ఇప్పుడెంత సూపర్ స్టార్లయినా ట్రాజడీ కథలెవరిక్కావాలి. తెలిసిన సమచారాన్నిబట్టి సెకండాఫ్ లో కన్యూజన్ వుందని దర్శకుడు వేరే రచయితని రాయమని అడిగాడు. ఆ రచయిత రాయలేదు. దర్శకుడు అలాగే తీశాడు. అసలే ట్రాజడీని అతుకుల బొంత కథనం మరింత ట్రాజడీగా మార్చింది.
 5.. హలో గురూ ప్రేమ కోసమే


రామ్ - అనుపమా పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్; త్రినాధ రావు నక్కిన (ఐదు సినిమాల దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : రోమాంటిక్ కామెడీ ప్రమాదం తప్పింది - ఏవరేజి

క్రియేటివ్ యాస్పెక్ట్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి తగ్గ విటమిన్ల లోపం – ఏవరేజి
          చాలాచాలా సార్లు చూసేసిన పాత కథే. కూర్చోబెట్టే బలమైన పాయింటేమీ లేదుగానీ, కథనం వేగంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది  ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో వేగం తగ్గి సెంటిమెంటల్ డ్రామాగా మారుతుంది. ఇచ్చిన మాట కోసం హీరోతో ఫ్రెండ్ గా  మెలగాల్సి వచ్చే హీరోయిన్ తండ్రి కథ ఇది. దీనికి  ముగింపు కూడా రొటీన్ గా ఇచ్చారు. కథనంలో ఎన్నో ట్విస్టులు ఇచ్చి, ముగింపుని సాదాగా వదిలేయడం పెద్ద లోపం. ఈ కథ ప్రేమకథగా హీరోహీరోయిన్ల మధ్యే సాగివుంటే మార్కెట్ కోల్పోయిన అన్ని ప్రేమ సినిమాల్లాగే ఫ్లాపయ్యేది. ప్రేమ పాయింటునే హీరోయిన్ తండ్రికీ, హీరోకీ మధ్య సెంటిమెంటల్ డ్రామాగా నడపడం ఏవరేజీగా నైనా మిగిలింది. వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంటల్ డ్రామా కాకుండా, కామెడీ నడిపివుంటే  యూత్ అప్పీల్ తో మరికొంత బాగుపడేది. 

6. చిలసౌ
                   సుశాంత్ -  రుహానీ శర్మ; రాహుల్ రవీంద్రన్ (కొత్త దర్శకుడు) 

                మార్కెట్ యాస్పెక్ట్ : కొత్తగా రియలిస్టిక్ రోమాంటిక్ డ్రామెడీ - ఏవరేజి 

                           క్రియేటివ్ యాస్పెక్ట్ : ప్రయోగాత్మకం - ఏవరేజి
           ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలారోమాంటిక్ కామెడీల హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడయ్యాడు. హిట్సు లేని హీరో సుశాంత్ తో రోమాంటిక్ డ్రామెడీ తీశాడు. ప్రేమ సినిమాలంటే హీరో హీరోయిన్లు అపార్ధాలతో విడిపోవడమో, ప్రేమలో ఎస్ చెప్పడానికి నాన్చడమో చేసే రెండే రెండు టెంప్లెట్స్ తో పదేపదే నిస్సిగ్గుగా వచ్చిపడుతున్న భావదారిద్ర్యపు మాయదారి కాలంలో, రవీంద్రన్ ఒక తాజాదనాన్ని మోసుకొచ్చాడు. తజాదనంలో అతడి తాలూకు తమిళతనం ఎక్కడాలేదు. తెలుగులో అత్యంత అరుదై పోయిన, కాస్త నిజ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్ ప్రేమ సినిమాల కొరత తీరుస్తూ, కథ ఏమీ లేకుండానే ఒకే రాత్రి జరిగే కథతో కథంతా కూర్చోబెట్టి చెప్పాడు.

         
లా 6 రోమాంటిక్ కామెడీల్లో 2  ఏవరేజీలు, 4 ఫ్లాపులు వచ్చాయి. ఇంకా విడుదలైన చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలు 50, 60 వుంటాయి. ఇవన్నీ అట్టర్ కంటే అట్టర్నర ఫ్లాపులు. ఇంకా విడుదలయ్యే ఛాన్సే లేకుండా మూలనపడ్డవి వందల్లో వున్నాయి. ఇదో పెద్ద చేపల మార్కెట్. ఏదో  ప్రేమల్లో  పండితుడైనట్టు  రోమాంటిక్కు  రాసుకుని ఈ మార్కెట్ కే పరిగెడతాడు కొత్త దర్శకుడు. అక్కడే నిర్మాత వుంటాడు. పరస్పరం గాలాలేసుకుని పట్టేసుకుంటారు. ఇక గంపల్లో చేపలు, కంపెనీల్లో ఏడ్పులు. 

          రోమాంటిక్ కామెడీలు హిట్టవ్వాలంటే అప్రోచ్ మార్చాలి గురూ, అప్రోచ్ మార్చాలి. ముందు నేటి యూత్ ని స్టడీ చేసి రియలిస్టిక్ అప్రోచ్  నేర్చుకోవాలి. ఇంకా పిల్లకాయ లొట్టపీసు ప్రేమలు తీయడానికి సిగ్గుపడాలి. అసలు రోమాంటిక్ కామెడీల నిర్వచనం, జానర్ మర్యాదలు తెలిస్తే గా.
ముసలి మైండ్ సెట్ తో ముసలి ప్రేమలు తీసి ముంచడమేగా.

సికిందర్ 

726 : రివ్యూ



రచన – దర్శకత్వం : సౌమిక్ సేన్
తారాగణం : ఇమ్రాన్ హాష్మీ, శ్రేయా ధన్వంతరీ, స్నిగ్ధదీప్ ఛటర్జీ,
నిర్మాతలు : భూషణ్ కుమార్, తనుజ్ గార్గ్, పర్వీన్ హాష్మీ, మనూజ్ శర్మ తదితరులు  
సంగీతం : రోచక్ కోహ్లీ, గురు రణధావా తదితరులు, ఛాయాగ్రహణం : అల్ఫోన్స్ రాయ్
బ్యానర్స్ : టీ సిరీస్ ఫిలిమ్స్, ఎలిప్సిస్ ఎంటర్ టైన్మెంట్, ఇమ్రాన్ హాష్మీ ఫిలిమ్ ప్రొడక్షన్
విడుదల : జనవరి 18, 2019
***
        ర్డర్, గ్యాంగ్ స్టర్, జన్నత్ మొదలైన హిట్స్ తో ఓ వెలుగు వెలిగిన ఇమ్రాన్ హష్మీ, ఆ తర్వాత ఫ్లాప్స్ తో దాదాపు కనుమరుగయ్యే స్థితి కొచ్చాడు. మళ్ళీ మర్డర్- 4 లో నటిస్తే తప్ప వెలుగులోకి రాలేననుకున్నాడేమో ఆ ప్రయత్నంలో వున్నాడు. ఈ లోగా ‘వై చీట్ ఇండియా’ లో నటించి దీన్ని కూడా ఫ్లాప్ చేసుకున్నాడు. దీని గురించి చాలా గొప్పగా ఇంటర్వ్యూలిచ్చాడు. ఇంటర్వ్యూకి తగ్గట్టు ఓపెనింగ్స్ కూడా లేవు. స్టూడెంట్స్ గురించి తను చెప్పింది స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ ఎవరూ పట్టించుకోలేదు. ఇంతకీ ఏమిటి ఈ ‘వై చీట్ ఇండియా’? స్టూడెంట్స్ తో ఏం సంబంధం? స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు చూడాలి? ఎందుకు చూడకూడదు?...ఇది తెలుసుకుందాం. 

 కథ
 
     రాకీ (ఇమ్రాన్ హాష్మీ) ఇంజనీరింగ్ ప్యాసవలేక, తన అన్న డాక్టర్ అవడం చూసి, తనని ఫెయిల్ చేసిన విద్యావ్యవస్థ మీద కక్షగట్టి ఎంట్రెన్స్ మాఫియాగా మారతాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకి ఎంట్రెన్స్ రాసే విద్యార్థుల్ని టార్గెట్ చేస్తాడు. డబ్బున్న కుటుంబాల్లో  తెలివిలేని స్టూడెంట్స్ కి ఎరవేసి, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుని, ఎంట్రెన్స్ లో ర్యాంకులు  సంపాదించిన డబ్బులేని తెలివైన స్టూడెంట్స్ చేత ఎంట్రెన్సులు రాయిస్తాడు. ప్యాసవలేని రిచ్ స్టూడెంట్స్ స్థానంలో ప్యాసైన పూర్ స్టూడెంట్స్ చేత ఎంట్రెన్సులు రాయించడానికి విద్యాశాఖాధికారులు కూడా కుమ్మక్కవుతారు. ఇలా రాకీకి చిక్కి ఎంట్రెన్సులు రాస్తున్న పేద విద్యార్థి సత్తు (స్నిగ్ధదీప్ ఛటర్జీ). ఇతడికి జబ్బుతో వున్న తల్లి, అప్పుల్లో వున్న తండ్రి, పెళ్లికున్న అక్క (శ్రేయా ధన్వంతరీ) వుంటారు. ఈ భారమంతా తనే మోయాలి. కాబట్టి రాకీ అందించే భారీ మొత్తాలు తీసుకుని పరీక్షలు రాస్తూంటాడు. ఇతడి అక్కతో రాకీ ప్రేమలో పడతాడు. సత్తు ఒక రెయిడింగ్ లో దొరికిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. రాకీ ఎంబీఏ పేపర్ లీక్ చేసిన కేసులో దొరికి పోతాడు. ఇప్పుడు రాకీ ఎలా సమర్ధించుకున్నాడు? ఇతడికి శిక్షపడిందా, విడుదలైపోయాడా?...ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ
       కథలో విషయముంది, కథనం చేతగాలేదు. 2011 లో సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా రిజర్వేషన్ల సమస్య మీద ‘ఆరక్షణ్’ తీశాడు. అమితాబ్ బచ్చన్ ప్రొఫెసర్ గా, సైఫలీ ఖాన్ దళిత విద్యార్ధిగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించారు బాగానే వుంది. ఈ కథ ఫస్టాఫ్ వరకూ రిజర్వేషన్ల సమస్యతో సాగి, దీన్నేం చేయాలో అర్ధం గానట్టు, సెకండాఫ్ మొదలు కాగానే కాలేజీల్లో ఆర్ధిక అక్రమాల కథగా మారిపోయింది. ప్రేక్షకులందరూ నవ్వుకున్నారు. ఇలాగే ‘వై చీట్ ఇండియా’ కథతో కూడా ప్రేక్షకుల్ని  చీట్ చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ ఎంట్రెన్స్ మాఫియాగా ఎత్తుకున్న కథని, సెకండాఫ్ మొదలుకాగానే ఎంబీఏ పేపర్ లీక్ స్కాముగా మార్చేశాడు. విద్యావ్యవస్థలో ఒక సమస్యతో ఒకే  కథ చేయలేక దైన్యంగా నిలబడ్డాడు.

ఎవరెలా చేశాడు
      ప్రతీ ఒక్కరూ 1980 లనాటి సినిమా అన్నట్టే చేశారు. ఒక్క ఇమ్రాన్ హాష్మీ తప్ప అందరూ కొత్త వాళ్ళే. ఇమ్రాన్ హాష్మీ హీరో స్టయిల్ @ 1980 లాగా వున్నాడు. పైగా ఒక మాఫియా అన్నట్టు గాక ఒక టీచర్ లాగా కన్పిస్తాడు. పాత్ర ఒకటైతే గెటప్ వేరు, నటన వేరు, డైలాగులు వేరు. ఒక చోట తనే అంటాడు, “నాకు హీరో అవ్వాలన్న కోరిక లేదు, విలన్ నయ్యే టైంలేదు” అని! మరెందుకు ఈ సినిమాలో వున్నట్టు? ఇంకో చోట, “నేను కిలాడీని, ఆటాడుకుంటున్నా, నమస్తే!” అంటాడు. ఏం ఆటాడుకున్నాడో అర్ధమేగాదు! ఇంకో చోట, “నాకు పై వాడి ఆశీస్సులున్నాయి, ఓన్లీ క్యాష్ తీసుకుంటా” అంటాడు. సహనిర్మాతగా దీనికి కలెక్షన్స్ వచ్చే ఆశీస్సులైతే లేవు ( తొలిరోజు ఆలిండియా బాక్సాఫీసు : కోటీ 70 లక్షలు). 

          సామాన్య యువతిగా కొత్త హీరోయిన్ శ్రేయ పాత్ర పాత సినిమా తరహా పాత్రయినా,  నటన బావుంది. రియలిస్టిక్ సినిమాలకి పనికొస్తుంది. ఆమె తమ్ముడి పాత్రలో కొత్త నటుడు స్నిగ్ధదీప్ ఫర్వాలేదు. పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో కొత్తనటుడు అమర్ తల్వాలా దృష్టినాకర్షిస్తాడు. ఐతే సమస్య ఎక్కడొచ్చిందంటే, అందరూ పాత సినిమా పాత్రలు నటిస్తున్నట్టు వుంటారు. కోర్టులో ప్రాసిక్యూటర్, జడ్జి పాత్రలేసిన నటులైతే నవ్వొచ్చేలా వున్నారు.   

          ప్రొడక్షన్ విలువలు చాలా సాధారణంగా వున్నాయి. లొకేషన్స్ ఆకర్షణీయంగా లేవు. ఆర్ట్ సినిమా పేద వాతావరణం కన్పిస్తూంటుంది. కమర్షియల్ విలువలు ఏ కోశానా కన్పించవు. దర్శకత్వం చాలా బలహీనం. స్టూడెంట్స్ సినిమా తీస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ని ఆకట్టుకునే యూత్ అప్పీల్ ఏ మాత్రం లేదు.

చివరికేమిటి 
     ఈ సినిమా దేశంలో పెద్ద చర్చ లేవదీస్తుందన్నాడు ఇమ్రాన్. పదహారేళ్ళుగా నటిస్తున్నా, ఏ సినిమా చర్చలేవదీసి రచ్చ చేస్తుందో కూడా తెలుసుకోనట్టుంది. మొదలెట్టిన కథ మధ్యలో వదిలేసి, ఇంకో కథకి శ్రీకారం చుట్టి - కళ్ళల్లో కారం కొట్టిన సంగతి కూడా తెలీడం లేదు. దర్శకుడు సౌమిక్ సేన్, బాలీవుడ్ కథల స్థాయి పెంచిన ఇటీవలి బెంగాలీ దర్శకుల ముందు తీసికట్టుగా తయారయ్యాడు. కథ, కథనం, దర్శకత్వం ఇంత హాస్యాస్పదంగా వుండడం – అదీ ఒక బర్నింగ్ టాపిక్ విషయంలో- చాలా విచారకరం. మరింకో దర్శకుడైతే ఈ విద్యార్ధి లోకం కథని విద్యార్ధులు క్యూ కట్టేలా తీసేవాడు. ఈ సినిమా ఎవరికోసమన్న సృహ కూడా దర్శకుడికి లేదు. 

          ఫస్టాఫ్ లో ఎంట్రెన్స్ స్కాము కథలో ఏకపక్షంగా ఇమ్రాన్ కార్యకలాపాలే (ఇవి అప్పుడప్పుడు తోచినప్పుడు చేస్తూంటాడు) తప్ప- అవతల తను టార్గెట్ చేసిన పేద, ధనిక వర్గాల విద్యార్ధుల వైపు నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచీ కథ చెప్పడు – ఒక్క సత్తు  అనే పేద విద్యార్టి తల్లిదండ్రులతో తప్ప.  ఎంట్రెన్స్ రాయడానికి తమ పిల్లలతో కోలాహలంగా వచ్చే తల్లిదండ్రుల్ని చూపించడం వరకే చేస్తాడు. చదువులంటే ఇంజనీరింగ్, మెడిసిన్లే అన్న ధోరణిలో తల్లిదండ్రుల ప్రవర్తన చూపించే జోలికిపోడు. పేద విద్యార్ధి సత్తు తల్లిదండ్రులు డబ్బుల కోసం మాఫియాకి లొంగడం కూడా పొసగదు. ఇంట్లో చదివించే పరిస్థితులు లేకపోయినా కష్టపడి చదివి, 276 వ ర్యాంకు సంపాదించిన కొడుకుచేత దొంగ పరీక్షలు రాయించి చెడగొట్టడమేమిటో, నేరస్థుడై ఆత్మహత్య చేసుకునేలా చేయడమేమిటో అర్ధం గాదు. దీనివల్ల పిల్లలతో తల్లిదండ్రుల అమెరికా కలలు అన్న పాయింటే ఎగిరిపోయింది! ఈ పాయింటు సినిమా ప్రారంభంలోనే చెప్తాడు. 

          ఈ మధ్య చదువుల మీద వచ్చిన ఒక తెలుగు సినిమాలో చూపించినట్టు, ఇంట్లో కూతురున్నా ఆమె చదువు ముఖ్యం కానట్టు, కొడుక్కే ముద్దు చేస్తూ, అన్నీ సమకూరుస్తూ చదివించే తల్లిదండ్రుల్లాగా, ఇక్కడా సత్తు తల్లిదండ్రులుంటారు. బేటీ బచావో లేదు, బేటీ పడావో లేదు అనాగరిక సినిమాలకి. తల్లిదండ్రులు వివక్ష చూపిస్తున్నారని తమ్ముడి మీద ఆ అక్క ఈర్ష్యాసూయలు పెంచుకోవాలి నిజానికి. అదేం జరగదు. దొంగ పరీక్షలు రాయించక ముందు బావున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు సత్తుని తెల్లారక ముందే నిద్ర లేపి హడావిడీ చేస్తూ చదువుకోవడానికి పుస్తకాలు సర్దడం, పాలల్లో హార్లిక్స్ కలిపి ప్రత్యేకంగా తాగించడం ( బాగా కలిపావా? అడుగున పౌడర్ వుంటుంది – అని తల్లితో తండ్రి ప్రత్యేకమైన డైలాగు
), ఇంట్లో ఆడపిల్ల చూస్తోందన్న స్పృహే లేకపోవడం... పౌష్టికాహారం, మంచి చదువు, బట్టలు మగ పిల్లలకే అన్నట్టు వుంటుంది.

          ఇలా చూసుకుని ప్రయోజకుడైన కొడుకుతో దొంగ పరీక్షలు రాయించడమేమిటో అర్ధంగాదు. తమ్ముడితో ఇలా చేయిస్తున్న మాఫియాతో అక్క ప్రేమలో ఎలా పడుతుందో అర్ధం గాదు. తమ్ముడు ఆత్మ హత్య చేసుకోగానే పగబట్టి, వేరే ఎంబీఏ పేపరు లీకు కేసులో పట్టిస్తుంది. ఆ మాఫియా ఇంట్లో డబ్బులిస్తూ, తమ్ముడితో దొంగ పరీక్షలు రాయిస్తున్నప్పుడు ఏమీ అనదు. 

          ఫస్టాఫ్ ఈ ఎంట్రెన్స్ కథ ఆగిపోయి, సెకండాఫ్ మాఫియాగారు ఎంబీఏ పేపరు లీక్ చేసే వేరే కథకి  వెళ్ళిపోతారు. ఇంటర్ స్థాయి టీనేజీ ఎంట్రెన్స్ కథ కాస్తా డిగ్రీ స్థాయి ఎంబీఏ కథగా మారిపోతుంది. మాఫియా దొరికిపోయి సమర్ధించుకునే మాటలు కూడా గొప్పగా వుంటాయి. సంపన్న విద్యార్దుల నుంచి డబ్బు తీసుకుని, పేద విద్యార్ధుల కిచ్చి పరీక్షలు రాయంచడం తప్పెలా అవుతుందంటాడు. ఈ వాదన నిలబడకపోయినా, ఇంత విశాల హృదయంతో రాలేదు తను. తనని ఇంజనీరింగ్ ఫెయిల్ చేసిన వ్యవస్థ మీద కక్షతో వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చుండాలి తన గతం ప్రకారం. దీనికి కూడా అర్ధం లేదు. ఇలా అన్ని కోణాల్లో బలహీన సినిమా తీసి మేధావి అన్పించుకోవాలను కున్నాడు. ముగింపులో వివిధ పత్రికల గణాంకాలతో కూడిన కటింగ్స్ అర్ధం లేకుండా. డబ్బున్న దద్దమ్మ స్టూడెంట్స్ దగ్గర డబ్బుతీసుకుని,  మాస్ కాపెయింగ్ తో పాస్ చేయించి, ఆ డబ్బుతో పేద విద్యార్ధుల్ని చదివిస్తే, కొత్త బ్రాండ్ రాబిన్ హుడ్ అయ్యేవాడేమో!

సికిందర్
https://telugurajyam.com/