రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జులై 2014, గురువారం

రివ్యూ..
దుస్సాధ్య  దృశ్యం!

దర్శకత్వం : శ్రీప్రియ
తారాగణం : వెంకటేష్, మీనా, కృతికా జయకుమార్, ఈస్థర్, నదియా, నరేష్, రవికాలే, సప్తగిరి తదితరులు
రచన : జీతూ జోసెఫ్,   సంగీతం : శరత్,  ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి,  ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి., వైడ్ యాంగిల్ క్రియేషన్స్
నిర్మాతలు : డి. సురేష్, రాజ్ కుమార్ సేతుపతి
విడుదల : 11 జులై, 2014
***
సహజ కథల భాండాగారమైన మళయాళ సినిమారంగాన్ని చూస్తే తెలుగుసినిమా రంగం ఎంత వెలవెలబోతోందో  తెలిసిపోతుంది. అసలు దక్షిణ సినిమా రాజధానిగా వున్న  చెన్నై నుంచి తెలుగు ఫీల్డు  విడిపోయినప్పుడే అప్పటివరకూ అక్కడి ఇతర భాషల టాలెంట్స్ తో వున్న కళా బంధుత్వం కాస్తా పుటుక్కున తెగిపోయి అనాధలై  పోయారు తెలుగు సినిమా శ్రామికులు. ప్రతిభని సానబెట్టుకోవడానికి చెన్నై కళాకారులతో దశాబ్దాలుగా కొనసాగిన ఇంటరాక్టివ్ సాంగత్యం లేక, సృజనాత్మకత అంటే ఏమిటో మర్చిపోయి, పరాయి డివిడిలు చూసి తెలుగులోకి దిగుమతి చేసుకునే  బడాయి పండితులుగా,  అసహజ కథల అత్తెసరు క్వాలిటీ సినిమాల కుంభ వృష్టికి ‘మేతమధనం’  చేశారు. అటు తమిళ మలయాళ సోదరులుమాత్రం తరాలు మారినా జీవితపు భిన్న పార్శ్వాల  మీద అదే అధారిటీతో సహజ కథల్ని తవ్వితీసే సృజనకారులై వెలిగిపోతున్నారు. అలాటి వొక సృష్టిగా మలయాళంలో  ‘ద్రిశ్యం’ తీసి ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త ఒరవడికి నాంది పలికారు.  ఇదే నాంది తప్పీజారీ ఎవరైనా తెలుగులో పలకబోతే అవహేళన చేసే అధార్టీ ధాటీగా తిష్టవేసి వుంటుందని చెప్పొచ్చు!

కొత్తదనాన్ని ఏదో ఇతరభాషల్లో  హిట్టయితేనే మన హీరోలు రీమేక్ చేసి,  దయతల్చి తెలుగు ప్రేక్షకులకి అందించాలే తప్ప, లేకపోతే ఒరిజినల్ గా కొత్తదనానికి నోచుకునే అదృష్టమే లేని పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ పుణ్యమాని ఈ అరువు దెచ్చుకున్న కొత్తదనం వచ్చింది. ‘మనం’ అనే డైరెక్టు కొత్తదనానికి బ్రహ్మరథం పట్టినట్టుగానే ఈ రీమేకుకీ  పట్టంగట్టి, మళయాళ టాలెంటు కి నిరాజనాలందిస్తూ,  తమ సంస్కారాన్ని తెలియజేసుకుంటున్నారు   తెలుగు ప్రేక్షకులు- హాట్సాఫ్!!

మలయాళంలో జీతూజోసేఫ్ దర్శకత్వం వహిస్తే, తెలుగుకి నటి శ్రీప్రియ దర్శకతం వహించడం ఆసక్తికర పరిణామం.  తమిళ, కన్నడల్లో ఐదారు సినిమాలకి దర్శకత్వం వహించి వున్న శ్రీప్రియ,  తెలుగులో వెంకటేష్ ని హేండిల్ చేస్తూ ‘దృశ్యం’ తీయడం, అదీ సూపర్ హిట్టవడం గొప్ప విషయమే.

ఇప్పుడు తెలుగులో ప్రేక్షకాభిరుచి మారిందనడానికి ఇలాటి కుటుంబ కథా చిత్రాలు  హిట్టవడమే  నిదర్శనం. ఈ ఏడాది తొలిసగంలో ఇరవై వరకూ ఫక్తు ప్రేమ సినిమాలు, కామెడీలు  విడుదలైతే అవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఒక కుటుంబ సమస్యని జోడిస్తూ- ఆ నేపధ్యంలో ప్రేమల్ని డౌన్ ప్లే చేస్తూ తీసిన ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ఇప్పుడు ‘దృశ్యం’లాంటి సినిమాలకే పట్టం గడుతున్నారు ప్రేక్షకులు.

ఈ పట్టం గట్టడం లో నగర జీవితమా, గ్రామీణ జీవితమా అన్న వివక్ష లేదు. గ్రామీణ వాతావరణంలో గ్రామీణుల జీవితాల్ని సంక్షుభితం చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టం ( నేర న్యాయ వ్యవస్థ) ని సవాలు చేస్తూ చూపించినా ప్రేక్షకుల హర్షధ్వానాలు లభిస్తున్నాయంటే, ఇందులో పరీక్షకు  పెట్టిన సమస్య  ప్రతి సామాన్యుడుదీ కావడమే కారణం.

ఇలాటి ఈ ‘దృశ్యం’ లో అసలేముందో ఇప్పుడు చూద్దాం!


మంచి కుటుంబం మీద మరకలు!
అరకులోయ దగ్గరలో రాజవరం అనే వూళ్ళో రాంబాబు ( వెంకటేష్) అనే కుటుంబీకుడు కేబుల్ టీవీ నడుపుకుంటూ ఉంటాడు. ఇతడికి భార్య జ్యోతి( మీనా), చదువుకుంటున్న కూతుళ్ళు అంజూ (కృతికా జయకుమార్), అనూ (ఈస్థర్) వుంటారు. ఇతను నాల్గో తరగతి వరకే చదివిన అనాధ ( సినిమా హీరో ఇలాగే వుండాలి కదా!). ఈ రాంబాబుకి పొద్దస్తమానం టీవీ ముందు కూర్చుని సినిమాలు చూడడమే పని. ఎవరికే సమస్య వచ్చినా  తను చూసిన సినిమాల్లో పరిష్కారాల్ని సిఫార్సు  చేస్తూంటాడు. వూళ్ళో అందరికీ ఆప్తుడిలా ఉంటాడు- ఒక్కడికి తప్ప. అతను కానిస్టేబుల్ వీరభద్రం (రవి కాలే). ఒక తగాదా వచ్చి ఇతను అవకాశం కోసం చూస్తూంటాడు. రాంబాబు భార్యా పిల్లలకి అందరు మధ్య  తరగతి వాళ్లకి లాగే ఎన్నో కోరికలుంటాయి. తనకున్న ఆదాయంతో వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తూంటాడు.

ఒకసారి ఇంటర్ చదువుతున్న అంజూ కాలేజీ వాళ్ళు ఏర్పాటుచేసిన నేచర్ క్యాంప్ కి వెళ్తుంది. అక్కడో రాత్రి ఆమె బాత్రూం లో వుంటే సెల్ ఫోన్ తో వీడియో తీస్తాడు వరుణ్ ( రోషన్ బషీర్). ఇతను పోలీస్ ఐజీ గీత (నదియా) కొడుకు. ఆ తర్వాత ఇంటికొచ్చాక, రెండో తేదీ రాత్రి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అంజూ ఆమె తల్లి జ్యోతీ ఇతనితో తలపడినప్పుడు అంజూ కొట్టిన దెబ్బకి చచ్చిపోతాడు వరుణ్. భయంతో శవాన్ని  ఐదెకరాల ఇంటి ఆవరణలోనే కప్పెట్టేసి రాంబాబు వచ్చాక చెప్పేస్తారు.

ఇక రాంబాబు ఎట్టి  పరిస్థితిలో కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆందోళనతో  పగిలిన వరుణ్ సెల్ ఫోన్ లో సిమ్ కార్డు తొలగిస్తాడు, కారు తీసికెళ్ళి నీటి కుంటలో తోసేస్తాడు. భార్యా పిల్లలతో విజయనగరం వెళ్ళిపోయి, అక్కడి హోటల్లోనూ, సినిమా హాల్లోనూ తాము వున్నట్టు ఆధారాలు సృష్టిస్తాడు...

తిరిగి వచ్చాక పోలీసులు ప్రత్యక్షమౌతారు. కానిస్టేబుల్ వీరభద్రం, వరుణ్ కారుని రాంబాబు తీసికెళ్తూండగా చూశాడు. దాంతో అసలే పగబట్టి వున్న అతను పదేపదే పై అధికారులకి ఇది నూరిపోస్తూ రాంబాబుని కుటుంబం సహా పోలీస్ స్టేషన్ కి  ఎక్కిస్తాడు.

రాంబాబు భార్యాపిల్లలకి విజయనగరం ఎపిసోడ్ గురించి ఎలాగెలా చెప్పాలో- ముందే చెప్పి వుంచాడు.  దీంతో పోలీసుల ప్రశ్నలకి అందరూ ఒకేలా చెబుతూంటారు. వరుణ్ కన్పించకుండా పోయిన రోజు, మర్నా డూ తాము విజయనగరంలోనే వున్నట్టు గోడ కట్టినట్టు చెప్పడంతో, ఐజీ సహా పోలీసులందరికీ ఎటూ పాలుపోదు. ఇక వాళ్ళ ని హింసించడం మొదలెడతారు.

ఐనా నిజం చెప్పకుండా మొండికేసిన వీళ్ళందర్నీ పోలీసులు ఎలా దారికి తెచ్చారు, తెచ్చినప్పుడు రాంబాబు దాన్ని కూడా ఎలా తిప్పి కొట్టి,  పోలీసుల మీద పై చేయి సాధించాడు, మొత్తానికే హత్య కేసు లేకుండా ఏం చేశాడు...అన్నవి ఈ థ్రిల్లర్ లో మిగిలిన అంశాలు.

వెంకటేష్ కి వయసుకి తగ్గ పాత్ర ఇది. ఐతే కథ పక్క దార్లు పట్టకుండా, ఉపకథలూ డ్యూయెట్లూ కూడా లేకుండా,  ఎత్తుకున్న పాయింటునే పట్టుకుని సాగడంతో మాంచి బిగువు సాధ్యపడింది. ఈ బిగువు వల్లే నటనలూ పకడ్బందీ గా వచ్చాయి. వెంకటేష్, మీనా సహా నటీ నటులందరూ ఈ సిన్మాకి సారధులే. కథా బలమే ఈ నటనలకి బలం. దర్శకురాలు శ్రీప్రియ వెంకటేష్ నుంచి సైతం ఎలాటి బిల్డప్పులకి తావులేని సహజ నటనని మలయాళంలో మోహన్ లాల్ కేమాత్రం  తీసిపోని విధంగా రాబట్టు కోవడం ఆమె ప్రతిభని చాటి చెప్తోంది.

ఎస్. గోపాల రెడ్డి ఛాయాగ్రహణంలో విజువల్స్ బావున్నాయి. శరత్ నేపధ్య సంగీతం కూడా ఓకే. అలాగే మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ కూడా.

ఇక ఈ సినిమాకి  బయట పరిస్థితి  చూస్తే,  మలయాళ ఒరిజినల్ చూశాక,  కేరళ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్ సేన్ కుమార్- ఇది నేరాల్ని ప్రోత్సహించేలా వుందని వ్యాఖ్యానించి నంతలోనే, మరో ప్రకటన కూడా చేయాల్సి వచ్చింది. కేరళలోనే ఒక హత్య చేసిన ఇద్దరు నిందితులు,  తాము ‘ద్రిశ్యం’ ఇచ్చిన స్ఫూర్తితోనే శవాన్నీ, హతుడి సిమ్ కార్డునీ మాయం చేశామని చెప్పుకొ చ్చినట్టు ఆ ప్రకటన సారాంశం!

ఆ ఒరిజినల్ తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం  - ఇది కల్పిత కథే,  దీన్ని సీరియస్ గా తీసుకోకూడదని అనడమూ, తమాషాగా తీసుకోలేని ప్రేక్షకుల కోసం మళ్ళీ ముగింపులో సర్ది చెప్పే ప్రయత్నం చేయడమూ, అంతా ఒక అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే ఈ సినిమా! కథలో పరీక్షకు  పెట్టిన సమస్య  తరచూ  సామాన్య పౌరులకి ఎదురయ్యేదే అయినా, ఇలా పరిష్కరించ వచ్చా అన్నదే బుద్ధి జీవుల సందేహం! ఆ మాటకొస్తే, ఇది కథే లేని కథ! ఫస్టాఫ్ లోనే ఒక ఘట్టం దగ్గర శాశ్వతంగా పరిష్కారమై పోయిన సమస్యకి,  హీరో పనిమాలా తవ్వుకున్న తన గోతి! అదెలాగో ఈ కింది విభాగంలో చూద్దాం.

స్క్రీన్ ప్లే సంగతులు!

Visuals can be deceiving…అని ‘దృశ్యం’ టైటిల్ కింద ట్యాగ్ లైన్ పెట్టారు. విజువల్స్ ఏమిటి- సిల్లీగా సినిమా సాంకేతిక భాష? - Appearances can be deceptive -అని ఉండాలేమో. ‘దృశ్యాలు ఏమార్చవచ్చు’ అనేకంటే, ‘కన్పిస్తున్నవి కనికట్టు కావొచ్చు’  అనడం సందర్భోచితంగా వుంటుంది. ఐతే ‘కనిపిస్తున్నవి కనికట్టు కావొచ్చు’ అని ఎవరికి  ఉద్దేశించి నట్టు? ప్రేక్షకులకా? ఏ రహస్యాలూ లేకుండా హీరో చేసింది చేసినట్టు ముందే చూపించేస్తున్నప్పుడు ఇక కనికట్టు ఏముంది? హీరో అబద్ధపు దృశ్యాలు సృష్టిస్తున్నాడని  ప్రేక్షకులకి తెలిసిపోయేదే.

 

మరి హీరో ప్రత్యర్ధులైన పోలీసులకి ఉద్దేశించారా? హీరోనీ, అతడి కుటుంబాన్నీ ప్రశ్నించేటప్పుడు పోలీసులకి ఇలాటి కనికట్టు దృశ్యాల సంగతులు ఇంకా నేర్చుకోవాల్సిన కొత్త విషయాలేం కావు. కాబట్టి  వాళ్లకి  ఉద్దేశించడంలో కూడా అర్ధం లేదు (కానీ వాళ్ళకే ఉద్దేశించినట్టు అర్ధం వస్తోంది!)). రహస్యాలు ప్రేక్షకులకి అసలే తెలియకుండా హీరో ఓ రకంగా, పోలీసులు ఇంకో రకంగా దృశ్యాలు రక్తి కట్టిస్తూంటే, అది ప్రేక్షకుల్ని అతలాకుతలం చేస్తూంటే, అప్పుడా ట్యాగ్ లైన్ వాళ్లకి వర్తించ వచ్చు. అంటే అప్పుడది ఎండ్ సస్పెన్స్ కథ అవ్వాలి. కానీ ఇదీ కాలేదు.

 

కాబట్టి ఇలా కాన్సె ప్చ్యు వల్ క్లారిటీతో బాటు, ట్యాగ్ లైన్ పదాల కూర్పు  సైతం అర్ధవంతంగా లేనప్పుడు కథ గందరగోళమై పోతుంది. అసలు కాన్సెప్ట్ ఏంటో, దాని కథనం ఎలా సాగాలో  దర్శకుడికే/ రచయితకే అర్ధంకాకుండా పోయే ప్రమాదముంది. ఒరిజినల్ దర్శకుడు-రచయిత  జీతూ జోసెఫ్ కి ఈ సినిమాతో చాలా పేరొచ్చింది. అతడి ఈ సృష్టిని ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అనీ, ఇది రైటర్స్ మూవీ అనీ, అతను జీనియస్ స్టోరీ టెల్లర్ అనీ, ఏన్ అన్ బిలీవబుల్ మూవీ అనీ, చాలా చాలా పొగడ్తల్లో ముంచెత్తాయి మలయాళ, తెలుగు మీడియాలు. విరగబడి రేటింగ్స్ కూడా ఉదారంగా ఇచ్చేశాయి. జాతీయ ప్రింట్ మీడియా కూడా ఇదే బాట తొక్కింది.

ఇది మలయాళ ఒరిజినల్ కథకాదు. ఇందుకే ఏక్తాకపూర్ తలపట్టుకు కూర్చుంది. జీతూ జోసెఫ్ ఈ కథని ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే జపాన్ నలల్లోంచి ఎత్తేశాడు. దీన్ని హిందీలో తీద్దామని ఏక్తాకపూర్ ఈ నవలా హక్కులు కొనుక్కుంది. ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ తో, విద్యాబాలన్ కథానాయికగా, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్దిఖీ లు ఇతర పాత్రధారులుగా తీద్దామనుకుంది.  తీరా జోసెఫ్ చూపించిన హస్తలాఘవం ‘ద్రిశ్యం’ చూసి ఠారెత్తి పోయింది. తన సినిమా పూర్తిగా ఆపేసుకుంది.


ఇంకా ఈ నవల ఆధారంగా లీగల్ గా జపాన్, కొరియా భాషల్లో సినిమాలొచ్చాయి. హాలీవుడ్ లోనూ  రానుంది. ఇల్లీగల్ గా సౌతిండియా లో స్వైర విహారం చేస్తోంది. మళయాళ, కన్నడ, తెలుగు భాషల తర్వాత, తమిళ రీమేక్ కమల్ హాసన్ తో తయారవుతోంది! ఎక్కడో ఉక్రేయిన్ లో ‘ద్రిశ్యం’ ని ఓ విద్యార్థి పైరసీ చేశాడని కేసు వేసిన జోసెఫ్, ఈ సినిమా కథా చౌర్యం గురించి ఏమంటాడో మరి! కథా చౌర్యం ఓకే అయితే  పైరసీ ఓకే కాదా?



ఐతే జోసెఫ్ ఈ నవలని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు. అదే విషాదం. అలా చేసి వుంటే, ఈ సినిమా ఇంత  గందరగోళం కాకుండా అర్ధవంతంగా వుండేది. ఏక్తా కపూర్ కూడా కొనుక్కున్న హక్కుల  ప్రకారం తీస్తే, నవల్లోలాగా ఇద్దరు గణిత- భౌతిక శాస్త్ర మేధావుల మధ్య  పోటాపోటీ మర్డర్ మిస్టరీ గేమ్ గా అలాగే వుండేదేమో.

నవల ప్రకారం...ఒకావిడ వుంటుంది. ఆమెకో కూతురుంటుంది. పక్కింట్లో గణిత మేధావి ఉంటాడు. ఓ  రెండో తేదీ రాత్రి, విడాకులిచ్చిన భర్త వచ్చి మళ్ళీ డబ్బుల కోసం దాడి చేస్తాడు. ఆత్మ రక్షణ చేసుకునే ప్రయత్నంలో అప్రయత్నంగా ఆ తల్లీ కూతుళ్ళు అతన్ని చంపేస్తారు. గణిత మేధావికి ఆవిడ మీద ప్రేమ వుంటుంది. అతనొచ్చి కాపాడతాడు. ఆ  శవాన్ని రూపురేఖలు తెలియకుండా, వేలిముద్రలు పట్టు బడకుండా చెక్కేసి ఓ చోట పడేస్తాడు.

అక్కడ్నించీ ఆ హత్యా సమయం రెండో తేదీ రాత్రి, ఆ తల్లీకూతుళ్ళు సినిమా కెళ్ళి నట్టు ఎలిబీ సృష్టిస్తాడు. పోలీసులు ఎలాగో శవాన్ని గుర్తించి ఆమె దగ్గరికొచ్చేస్తారు. గణిత మేధావి అడ్డేసిన పకడ్బందీ ఎవిడెన్సు కి పోలీసులు చిత్తవుతారు. ఈ గణిత మేధావి క్లాస్ మేట్ భౌతిక శాస్త్ర మేధావి ఒకడుంటాడు. అతన్ని తెచ్చి ఇతని మీదికి వదుల్తారు. ఇక ఇద్దరి సిగపట్లు మొదలవుతాయి. ప్రియురాలికోసం గణిత మేధావి గెలిచాడా, పోలీసులకోసం ఫిజిక్స్ మేధావి గెలిచాడా అన్నది మిగతా థ్రిల్లింగ్ కథ.


ఈ కథలో శవాన్ని దాచేయ్యలేదు గణిత మేధావి, ‘దృశ్యం’ లో  శవాన్ని దొరక్కుండా చేశాడు హీరో. ఇంతే  తేడా. ఫస్టాఫ్ లో ఈ శవాన్ని దాచిన చోటునుంచి ఇంకో చోటికి తరలించాక కథ అక్కడితోనే ముగిసిపోయిందని గ్రహించ లేకపోయాడు దర్శకుడు!

కథని త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే కూర్చాడు. చక్కగా నలబై ఐదో నిమిషంలోనే ఫస్ట్ యాక్ట్  ముగుస్తూ హత్య జరుగుతుంది. అక్కడ్నించీ సెకండాఫ్ క్లైమాక్స్ లో చిన్న కూతురు నిజం చెప్పెసేవరకూ సుదీర్ఘంగా సెకండ్ యాక్ట్ సాగుతుంది. సినిమా కథకి సెకండ్ యాక్టే వెన్నెముక లాంటిది. అది ఫస్ట్ యాక్ట్  ముగింపులో ఏర్పాటుచేసిన సమస్యతో పోరాటంగా, దానికి మాత్రమే సంబంధించిన సంఘర్షణతో ఎత్తుకు పైయెత్తుల ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ఇందులోకి ఏమాత్రం ఫస్ట్ యాక్ట్ బిజినెస్ జొరబడ్డా బిగి సడలిపోతుంది. బిగి సడలని సెకండ్ యాక్ట్ ఎంత దీర్ఘంగా వుంటే, అంత టెన్షన్ తో చూస్తారు ప్రేక్షకులు. ఇందుకే మీడియా అంతా కూడా ఇది సీటుకు అతుక్కు పోయేలా కూర్చోబెట్టే థ్రిల్లర్ అంటూ హోరెత్తించింది.

అవసరం లేని కథతో అనవసర టెన్షన్ పెట్టడం అంటే ఇదే. సినిమా చరిత్రలో ఇలాటి సందర్భం ఇదేనేమో కూడా.
తల్లీ కూతుళ్ళు ఇంటి ఆవరణలో పాతిపెటిన శవం, తీరా క్లైమాక్స్ లో ఈ విషయం చిన్న కూతురు పోలీసులకి వెల్లడించే సరికి అక్కడ తవ్వి చూస్తే హతుడి శవం వుండదు, జంతు కళేబరం వుంటుంది.

అది పోలీసులకి ఫైనల్ బ్రేకు. దాంతో హీరో, అతడి కుటుంబం సురక్షితంగా బయట పడిపోతారు. అప్పుడు శవం గురించి భార్య అడిగినప్పుడు, మూడో తేదీ రాత్రే అక్కడ్నించి తొలగించానంటాడు. తొలగించి, ఊళ్లోనే  కడుతున్న పోలీస్ స్టేషన్ స్థలంలో పాతి పెట్టినట్టు మనకి చూపిస్తాడు దర్శకుడు. ఆ స్థలం మీద పోలీస్ స్టేషన్ కట్టేశారు. ఇక ఎన్నటికీ శవ రహస్యం బయటపడే అవకాశం లేనే లేదన్నమాట!

ఇది కూడా  ఒరిజినల్ ఐడియా కాదు.  ‘బ్లూ స్ట్రీక్’ (1999) అనే హాలీవుడ్ సినిమాలోని సిట్యుయేషనే  ఇది. ఓ దొంగ వజ్రాల్ని దోపిడీ చేసి ఓ స్థలంలో పాతిపెట్టి జైలు కెళ్తాడు. తీరా విడుదలయ్యాక వెళ్లి చూస్తే సరీగ్గా  ఆ స్థలం మీదే  కొత్త పోలీస్ స్టేషన్ కట్టి  వుంటుంది. ఈ కథనే మార్పులు చేసి తెలుగులో ‘బ్లేడ్ బాబ్జీ’ (2008) తీశారు.

ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ‘దృశ్యం’ హీరో చివరికి తనే చెప్పినట్టు ఆ మర్నాడే- అంటే ఫస్టాఫ్ లో హత్య జరిగిన మర్నాడు మూడో తేదీ రాత్రే శవాన్ని తీసేసి ఇంకెన్నటికీ,  బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని నిర్మాణంలో వున్న పోలీస్ స్టేషన్ స్థలంలో ఖననం చేసేసి- సమస్యని అక్కడికక్కడే సేఫ్ గా, శాశ్వతంగా పరిష్కరించుకుంటే, ఆ మర్నాటి నుంచి భార్య పిల్లలతో తను విజయనగరంలో వున్నట్టు కంగారుగా సాక్ష్యాలు సృష్టించుకునే వేటలో ఎందుకు పడాలి?

అదృశ్యమైన ఎం హెచ్-370 మలేషియా విమాన రహస్యంలాగే, హతుడి శవాన్ని అంత శాశ్వతంగా అడ్రసు లేకుండా చేశాకా ఇంకా ఆందోళన దేనికి?

పోలీసులు వచ్చి అడిగితే, వరుణ్ ఎవరో మాకు తెలియదనీ, కావాలంటే మొత్తం సోదా  చేసుకోవచ్చనీ అనుమతిస్తే, పోలీసులు రూఢీ చేసుకుని వెళ్లి పోయే వాళ్ళు గా?

ఇలా మూడో తేదీ రాత్రే సింపుల్ గా సమస్య తీరిపోయింది! సమస్య తీరిపోయాక ఇక కథెక్కడిది? ఫస్టాఫ్ ముప్పావు గంట తర్వాత కథే లేక పోయాక ఇంకా స్క్రీన్ ప్లే ఎక్కడిది? స్క్రీన్ ప్లే లేకపోయాక దాని విశ్లేషణ ఎక్కడిది?

దర్శకుడు పాత్ర ద్వారా పోలీసుల్ని చీట్ చేయవచ్చు, లేని కథతో దర్శకుడే అమాయక ప్రేక్షకుల్ని చీట్ చేస్తే?

పాత్రోచితానుచితాలు!
వెంకటేష్ పోషించిన రాంబాబు పాత్ర కి నాల్గో తరగతి చదువు, కేబుల్ టీవీలో సినిమాల నాలెడ్జి ఇవే సరిపోయాయి ఐజీ స్థాయి అధికారిణి ని ఫూల్ చేయడానికి. రాంబాబు సరదా మనిషి. భార్యా పిల్లలతో చక్కగా ఆనందంగా ఉంటాడు. ఇంటా బయటా ఏ గొడవలూ వుండవు,  ఆ వొక్క కానిస్టేబుల్ తో తప్ప. ఈ కానిస్టేబుల్ కేబుల్  కనెక్షన్ తీసుకున్నట్టు లేదు. చిన్న విషయానికి పెద్ద కక్ష పెంచుకుంటాడితను రాంబాబు మీద! సాధారణంగా కేబుల్ వాళ్ళూ  పోలీసులూ సత్సంబంధాలు కలిగివుంటారు. అందరి సమస్యలకి సినిమా సీన్ల సిఫార్సులతో పరిష్కారం చూపే రాంబాబు, ఎందుకో కానిస్టేబుల్ వీరభద్రంతో తన సొంత సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోడు.

నేరం చేసిన తన కుటుంబానికి చట్టం నుంచి ప్రమాదం తలెత్తినప్పుడు రాంబాబు అమోఘమైన తెలివితేటలతో ప్రవర్తిస్తున్నట్టు చూపించారు. ఈ క్రమంలో అతను నెగెటివ్ పాత్రగా –అంటే యాంటీ హీరోగా మారాలి. తద్వారా చివర్లో తన చర్యలకి తప్పక శిక్ష అనుభవించి న్యాయాన్ని స్థాపించాలి.  దీనికి విరుద్ధం గా యాంటీ హీరోకి ఏ సినిమాలోనూ ముగింపు నివ్వలేదు - ‘గాడ్ ఫాదర్’ మార్లన్ బ్రాండో సహా. చాలా అరుదుగా ‘డెత్ విష్’ లాంటి సినిమాల్లో యాంటీ హీరోని శిక్ష నుంచి తప్పించారు. అదెలాగో తర్వాత చూద్దాం. రాంబాబు విషయానికొస్తే, ఇతను నేరాన్ని ఒప్పుకుని శిక్షకి తలవంచాలనుకోలేదు. చట్టానికి దొరక్కుండా వ్యవస్థనే ధిక్కరిస్తూ గెలిచాడు. ఈ విధంగా ఇతను యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ క్యారక్టర్ అయ్యాడు. ఇది మింగుడుపడని వ్యవహారమే. ఇందుకే  రాంబాబు చేత పరోక్షంగా నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కొన్ని ముగింపు వాక్యాలు చెప్పించారు. ఇలా చెప్పడం వల్ల ఇతను దొరికిపోయినట్టే నని దర్శకుడు తెలుసుకోలేక పోయాడు!

ఈ ముగింపు వాక్యాల  గురించి ఒక న్యాయవాదిని సంప్రదించినప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం- కస్టడీలో నిందితుడి నుంచి పోలీసులు రాబట్టే వాంగ్మూలాన్ని కోర్టు పరిశీలనార్హ మైనదిగా పరిగణించదు- కానీ అదే ఇతరులముందు  అతను చేసిన నేరం గురించి నోరు పారేసుకుని వుంటే అది సాక్ష్య మవుతుంది. రాంబాబు రిజైన్ చేసిన ఐజీ ముందు, ఆమె భర్త ముందూ  అలా చెబితే, వెంటనే వాళ్ళిద్దరూ సాక్షులుగా రాంబాబు మీద కేసు పెట్టొచ్చు. అతడిక  తప్పించుకోలేడు. వాళ్ళ ముందు అతనలా  నోరు పారేసుకున్నాక, బ్రహ్మ రహస్యం శవాన్ని కూడా బయటికి రప్పించడం పోలీసులకి చిటికెలో పని!

దర్శకుడి తెలివి తక్కువతనం వల్ల రాంబాబు బతికిపోయాడు గానీ, లేకపోతే తన నోటితో తన బతుకునే  కాక, ఏ కుటుంబాన్ని చట్టాన్నుంచి కాపాడుకోవడానికి చిట్టచివరి వరకూ కష్టించాడో - ఆ కుటుంబం మొత్తాన్నీ కటకటాల పాల్జేసి కూర్చునే వాడు శుభ్రంగా!

యాంటీ హీరో శిక్ష తప్పించుకునే సినిమాలూ రాకపోలేదు.  1974లో చార్లెస్ బ్రాన్సన్ నటించిన వివాదాస్పద సినిమా ‘డెత్ విష్’ లో తన పెళ్ళైన కూతుర్ని చెరచి, భార్యని చంపిన దోపిడీ దొంగలెవరో తెలీక, వాళ్ళని పోలీసులూ పట్టుకోలేక, తనే నగరంలో కన్పించిన దొంగానల్లా చంపుకుంటూ పోతాడు. పోలీసు అధికారి ఇతన్ని పట్టుకోవాలని చూస్తాడు. చివరికి తమవల్ల కాని నేరగాళ్ల ప్రక్షాళన హీరో చేయడంతో, అతడికి క్లీన్ చిట్ ఇస్తూ,  హత్యాయుధాన్ని మాయం చేసి నగరం నుంచి సురక్షితంగా పంపించేస్తాడు!

ఈ ముగింపుని ప్రేక్షకులు అంగీకరించారు. ఎందుకంటే చట్టమే సహకరించింది కాబట్టి. ఈ సినిమానే  రాజ్ బబ్బర్ తో ‘ ఇన్సాఫ్ కా తరాజూ’ అని బీఆర్ చోప్రా హిందీలో తీశారు. దీన్నే మురళీమోహన్ హీరోగా  ‘ఇదే నా సమాధానం’ అని తెలుగులో తనే రీమేక్ చేశారు. ఇరవై ఏళ్ల కాలంలో ‘డెత్ విష్’ కి మూడు సీక్వెల్సూ వచ్చాయి.

‘దృశ్యం’ సినిమాని పట్టుకుని, పగబట్టినట్టు ఇంత రంధ్రాన్వేషణ అవసరమా అన్పించ వచ్చు. తప్పకుండా అవసరమే. ఈ సినిమా రొటీన్ మూస ఫార్ములా అయివుంటే రంధ్రాన్వేషణ తలనొప్పి వుండదు, మూస ఫార్ములాల్లో లాజిక్కులతో పెద్దగా పనుండదు గనుక. కానీ నేర పరిశోధనే ప్రధానంగా కథ సాగినప్పుడు తప్పకుండా లాజిక్కు అవసరమే. నేరపరిశోధక కథకి లాజిక్కే ప్రాణం, అది  లేకపోతే నవ్వులపాలవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్ర రాంబాబు అల్లిన కట్టు కథని, కింది నుంచీ పైదాకా పోలీసులు చేస్తూ పోయింది కూడా రంధ్రాన్వేషణే ! కేవలం రంధ్రాన్వేషణ అనే కథనం వల్లే అంత టెన్షన్ తో చూశారు ప్రేక్షకులు.

ఐతే పోలీసుల ఈ రంధ్రాన్వేషణకి పనిమాలా రాంబాబే అవకాశం కల్పించాడని ముందే చెప్పుకున్నాం-శవాన్ని బ్రహ్మ దేవుడు కూడా కనిపెట్టకుండా పోలీస్ స్టేషన్ కడుతున్న స్థలంలో పాతిపెట్టేశాకా కథ అక్కడితో బేషరతుగా ముగిసిపోయిందనీ, ఇంకా ఫ్యామిలీని కాపాడుకోవడానికి రాంబాబు ఏ తిప్పలూ పడనవసరం లేదనీ కామన్ సెన్సు  మాట్లడుకున్నాం. అయినా కుదురుగా ఉండక రాంబాబు తెల్లారి నప్పటినుంచీ హత్యా నేరాన్ని హాంఫట్ చేయడానికి విశ్వప్రయత్నాలూ చేశాడు. అందులో మొదటిది హతుడు వరుణ్ వేసుకొచ్చిన కారుని మాయం చేయడం!

రాత్రి పూట కారేసుకొచ్చిన వరుణ్, దానెక్కడో ఆపి, రాంబాబు ఇంటికి వచ్చి చనిపోయాడు. ఆ కారు అక్కడుంటే ప్రమాదమని రాంబాబు దాన్ని తీసికెళ్ళి నీటి కుంటలో ముంచేశాడు. కారుని ఎలా మాయం చేయాలా అనేదానికి తాను చూసిన సినిమాల  యాక్షన్ క్లిప్పింగ్స్ ని తల్చుకున్నాడు. ఆ సీన్ల ప్రకారం కుంటలో తోసేశాడు.

అసలు అంత తెలివైన రాంబాబు గుర్తు తెచ్చుకోవాల్సింది, కారు వున్న చోటే వదిలేసివుంటే, తమకి ప్రమాదమా కాదా అని తెలిపే సినిమా క్లిప్పింగ్స్ ని! కారుని మాయం చేసే పధ్ధతి గురించి కాదు!

అతడికి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, కనిపించ కుండాపోయిన వరుణ్ గురించి ఆచూకీ తీస్తున్న పోలీసులకి, ఎవరైనా అక్కడ వదలేసిన అతడి  కారు గురించి సమాచారమిస్తే- పోలీసులు వచ్చి చూసినా  అది మిస్టరీగానే వుంటుంది. కారిక్కడ వదిలేసి అబ్బాయి ఎక్కడికెళ్లాడబ్బా అనే ఆలోచిస్తూ ఉండిపోతారు. వరుణ్ ఆ రాత్రి రాంబాబు ఇంటికి వెళ్ళగా ఎవరూ చూడలేదు! రాంబాబు కుటుంబానికి వచ్చే ప్రమాదమేమీ లేదు! వరుణ్ అసభ్య వీడియో తీసిన రాంబాబు పెద్ద కూతురు అంజూ తో వరుణ్ కి  ఏ ఫ్రెండ్ షిప్పూ లేదు, వీడియో తీశాకే బ్లాక్ మెయిల్ చేయడానికి అతడామెతో రహస్యంగా కాంటాక్టు లోకి వచ్చాడు. ఈ సంగతి మూడో కంటికి తెలీదు. వరుణ్ కాల్ లిస్టు లో కూడా అంజూ నెంబర్ వుండదు.

వరుణ్ వదిలేసిన కారు మిస్టరీ తేల్చడానికి ఒకవేళ పోలీసులు ఇల్లిల్లూ విచారణ చేపట్టి వచ్చేసినా,  రాంబాబు నిర్భయంగా ఇల్లు మొత్తం సోదా చేసుకోమనొచ్చు-బయట ఆవరణ సహా! శవాన్ని  ఇంటి ఆవరణ లోని గోతిలోంచి తీసి, పోలీస్ స్టేషన్ స్థలం లోకి ఎప్పుడో తరలించేసి సేఫ్ అయిపోయాడు కాబట్టి!

ఇంత సింపుల్ గా పరిష్కారం కన్పిస్తూంటే, అతితెలివికిపోయి రాంబాబు కారుని దొంగిలించే పని పెట్టుకున్నాడు. ఇది గనుక చూస్తే- ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత నవలా సిరీస్ పాత్ర, క్రిమినల్ లాయర్ పెర్రీ మేసన్- ‘టట్! టట్! టట్- ఆ కారుని  ముట్టుకున్నావంటే సాక్ష్యాధారాల్ని టాంపరింగ్ చేయడమే- నువ్వు ఇరుక్కుపోవడమే!- అని రాంబాబుని లాగి అవతల పడేసేవాడు!

అసలా కారుని తీయడానికి రాంబాబుకి తాళం చెవి ఎక్కడిది? పట్టపగలు తాను ఆ కొట్టొచ్చి నట్టున్న బ్రాండ్ న్యూ పసుపురంగు కారుని అలా డ్రైవ్ చేసుకుంటూ పోతూంటే వూళ్ళో జనాల దృష్టి నాకర్షించడా?

 కారుని తీసుకు పోతున్నప్పుడు కానిస్టేబుల్ వీరభద్రం చూసేశాడు! అప్పటికింకా వీరభద్రానికి తమ ఐజీ గీత గారి కుమారుడు వరుణ్ కన్పించడం లేదన్న సంగతి తెలీదు. ఆ పసుపురంగు కారు కూడా వరుణ్ దని తెలీదు. ఆ కారేసుకుని రాంబాబు పోతూంటే చూసి తికమక పడ్డాడంతే!

తర్వాత నీటి కుంటలో కారు బయట పడడంతో పరిస్థితి తీవ్రత పెరిగిపోయింది పోలీసులకి. వరుణ్ ఎక్కడికెళ్లా డబ్బా అని వెతుక్కుంటున్న పోలీసులకి,  ఇలా అనుమానాస్పద స్థితిలో కారు బయట పడ్డంతో భయ సందేహాలు పెరిగిపోయాయి! చేతులారా ఇలా పరిస్థితిని తీవ్రతరం చేస్తూ దృశ్యం చూపించేశాడు మన ఆంధ్రా షెర్లాక్ హోమ్స్ రాంబాబు! ... నేరాలెప్పుడూ జరిగేవే, లాజిక్కే ఎప్పుడో గానీ వుండదు. కాబట్టి మనం నేరాల మీదికంటే లాజిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలబ్బా - అంటాడు ప్రియ నేస్తం డాక్టర్ వాట్సన్ తో, జగద్ప్రసిద్ధ కాకలు తీరిన క్లాసిక్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ –ది అడ్వెంచర్స్ ఆఫ్ ది కాపర్ బీచెస్ అనే కథలో!

కారు బయటపడి, వీరభద్రం చూసిన ప్రకారం కారుతో- తద్వారా వరుణ్ అదృశ్యం తో  రాంబాబుకి సంబంధం వుందని తెలిసిపోయి, వచ్చేసి పీడించడం మొదలెట్టారు పోలీసులు! శవానికి గోతులు తీయడంలో మొనగాడు అన్పించుకున్న రాంబాబు, ఇలా కారు జోలికి పోయి తన గొయ్యిని తనే తవ్వుకున్నాడన్న మాట! పూర్ ఫెలో!

తన వైపు నుంచి  ఇలా లాజిక్ లేని తిక్క పని ఇంకోటి చేస్తాడు రాంబాబు- హత్యా స్థలంలో పగిలిపోయిన వరుణ్ సెల్ ఫోన్ సిమ్ కార్డు అతడ్నేదో అంతర్జాతీయ టెర్రరిజం కేసులో బాగా ఇరికించేసేదిగా వున్నట్టే ఫీలైపోయి- క్రైం సీనులో పోలీసులు సకల జాగ్రత్తలూ తీసుకున్నట్టు,  రాంబాబు తన వేలిముద్రలు ఎక్కడ పడతాయోనని, సిమ్  కార్డుని ఎంతో జాగ్రత్తగా కాగితం లో ఎత్తి పట్టుకుని,  పొట్లం చుట్టేసి మనకి నవ్వు తెప్పిస్తాడు. ఆ సిమ్ కార్డుని ఉత్తచేత్తో ముక్కలు చేసి అవతలకి విసిరేస్తే సమస్యే తీరిపోయేదానికి ఇంత హాస్యాస్పదమైన బిల్డప్ సీను!

ఇంకా ఆ సిమ్ కార్డుని విజయనగరం కూడా తీసికెళ్ళి,  అక్కడొక షాపులో చవకలో సెకండ్ హేండ్ సెల్ ఫోన్ కొని, సిమ్ కార్డుని ఇన్సర్ట్ చేసి, సెల్ ని ఆన్ లో వుంచి, ఒక లారీలో పడేస్తాడు. వరుణ్ దగ్గర వున్నది గెలాక్సీ స్మార్ట్ ఫోన్ అయితే, అందులో వాడేది మినీ మైక్రో సిమ్ అయితే, రాంబాబు పొట్లం చుట్టుకున్నది నార్మల్ సిమ్!  దర్శకత్వంలో వచ్చిన తేడా!

ఇక వరుణ్ సెల్ ఫోన్ని మానిటరింగ్ చేస్తున్న పోలీసులకి ఆ సెల్ ఫోన్ టవర్లు మారుతూ ఖరగ్ పూర్ దాకా వెళ్లినట్టు తెలుస్తుంది. అది ఏ రూటులో ఎలా వెళ్తోందో సరదాగా ఐజీ గారికి అప్డేట్స్ చెప్పుకుంటూ గడపడమే తప్ప, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లని అప్రమత్తం చేసి ఆ సెల్ ఫోన్ ని పట్టుకోవాలన్న ఇంగితమే వుండదు అర్భక పోలీసులకి!

ఏ కథలోనైనా ఒక సెటప్ వుంటే అది చెల్లుబాటయ్యే పేఆఫ్ కూడా వుండి తీరాలి. సిమ్ కార్డుతో ఒక ఎత్తుగడ ( సెటప్) పన్నాడు గానీ రాంబాబు, దాంతో ఒరిగింది (పే ఆఫ్) ఏమీలేదు. అసలు రాంబాబు తొలగించాల్సింది, వరుణ్ సెల్ ఫోన్ శకలాల్లో తన కూతురు అసభ్య వీడియో ని సేవ్ చేసిన మైక్రో ఎస్డీ కార్డుని కదా!

అలాగే మరొక పేఆఫ్ కాని సెటప్ వుంది. ఫస్ట్ యాక్ట్ లో-  అందరికీ సినిమా పరిష్కారాలు చెప్తూ ఆదుకుంటున్నప్పుడు - ఓ పేరెంట్స్ మిస్సయిన తమ కొడుకు గురించి పోలీసులు పట్టించుకోవడంలేదని బాధపడి నప్పుడు- దీనికి కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చని, తనకి తెలిసిన లాయర్ ఉన్నాడని లీగాలిటీస్ మాట్లాడతాడు రాంబాబు. అంటే తనకో లాయర్ తెలుసుననే పాయింటుని ఎష్టాబ్లిష్ చేశారు. మరి తన కుటుంబాన్ని ఏ అరెస్టు వారెంటూ లేకుండా లాగి వ్యానులో పడేసుకుని పోలీస్ స్టేషన్ తీసికెళ్ళి- వరుణ్ ఏమయ్యాడని  పోలీసులు కుమ్మేస్తోంటే, లీగాలిటీస్ తెలిసి వున్న రాంబాబు లాయర్ని వెంటనే పిలిపించుకోడు! అతడి మామగారు కూడా ఏ లీడర్నీ ఆశ్రయించడు!

ఇలా ఇదంతా చూస్తే,  రాంబాబు పాత్ర అమాయక ప్రేక్షకుల్ని మాయ చేసి – ఇదే కరెక్టు అంటూ స్టాంపు వేసే  పాసివ్ లేదా ఫెయిల్యూర్ క్యారక్టర్ గా నిలిచిపోతుంది!
***


రాంబాబు భార్య జ్యోతి పాత్ర మోడరన్ గా బతకాలని ఉబలాటపడే మధ్యతరగతి గృహిణి, కానీ తన జెండర్ విషయానికొస్తే భావాలు మధ్య యుగాల నాటివి. అవే భావాలతో నేటితరం తన కూతుళ్ళ జీవితాల్నీ చూస్తోంది. నూరిపోస్తోంది. రాంబాబు కంటే ఎక్కువే పదో తరగతి చదివింది. తన ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకుంటోంది. రేపు ఊరు దాటిపోయి ఊరుకాని వూళ్ళో చదవబోయే కూతుళ్ళు. మరో వైపు ఆడవాళ్ళ మీద పెరిగిపోతున్న అత్యాచారాలు. వీటికి తోడవుతున్న సోషల్ మీడియా, ఇతర టెక్నాలజీలు. ఇవ్వాళ్ళ తెల్లారి కేబుల్ టీవీ ఆఫీసుకి పోతే సినిమాలు చూస్తూ మళ్ళీ తెల్లారేదాకా ఇంటికే  రాని భర్త. ఆ సినిమాల పిచ్చేంటో ఇంటిదగ్గరే టీవీకి అతుక్కుపోయి తీర్చుకోవచ్చు. ఇలా కూతుళ్ళ భద్రత గురించి ముందునుంచీ ఏ పట్టింపూ లేని భర్త. పోనీ, అత్యాచారాల నివారణకు పోలీసులు ఏం జాగ్రత్తలు చెబుతున్నారో, ఎలాంటి సెల్ ఫోన్ యాప్స్ వాడమంటున్నారో, ఎవరైనా వేధిస్తే నిర్భయంగా పోలీస్ కంప్లెయింట్ ఇమ్మని ఎందుకు చెబుతున్నారో- డజన్ల ఛానెళ్ల సాక్షిగా వీలయినప్పుడల్లా మహిళలకి మొ ర పెట్టుకుంటోంటే,  ఈవిడకి ఆ ఎవేర్నెస్సే వుండదు. కారణం తాను  మధ్యయుగాల భావాలతోనే, నాటి పరిస్థితుల్లోనే ఇంకా జీవిస్తోంది. ఎవడైనా అపకారం చేస్తే, కాళ్ళమీద పడి నా జీవితాన్ని పాడు చెయ్యకూ - అని ఏడ్చే విక్టిం మెంటాలిటీ రకం.

పట్టుమని పద్దెనిమిదేళ్ళు లేని పొట్టి కుర్రాడు వరుణ్ వచ్చి, తన కూతురు వీడియో చూపించి తనతో ఒక రాత్రి గడపాలని, లేకపోతే నెట్ లో పెట్టేస్తాననీ బెదిరిస్తూంటే,  వెంటనే గది  తలుపేసి వాణ్ణి బందీ చేసేసి భర్తకి ఫోన్ చేయాల్సింది పోయి, ప్రాధేయ పడుతుంది. ఆమె గదిలోకి వచ్చినప్పుడు తలుపు మూసేసి పైన బోల్టు బిగిస్తుంది- ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ చిల్లర గ్యాంగ్ ని తన్నడానికి గోడవున్ తలుపు మూసి తాళం వేసినట్టు- ఈమె కూడా వేలెడంత లేని పొట్టి కుర్రాడితో బిగ్ షోడవున్ కి రెడీ అయిపోతోందని మనం సంతోషిస్తాం! తీరా చూస్తే కన్నీళ్ళతో ప్రాధేయపడ్డం! ఇక్కడ కూడా సెటప్, దాని పేఆఫ్ ఫ్లాపే!

ఇలా  మా పరువు తీస్తే  మేమెంతా చచ్చిపోతామంటుంది. నీ కూతురు కాకపొతే నువ్వు నాతో గడపాలంటాడు వరుణ్. అప్పుడైనా ఈడ్చికొట్టక ఇంకా బతిలాడుకోవడం మొదలెడుతుంది. ఇలా తన ప్రమేయంలేకుండా ఆడపిల్ల పరువుపోతే, ఆమెకే కాదు, మొత్తం ఆమె కుటుంబానికీ చావే శరణ్యమనే భావజాలాన్ని కూతురి సమక్షంలో ప్రతిపాదిస్తోంది. ఇలాటి వాళ్ళుంటే పోలీసులింకా ఛానెళ్ళలో ఊదరగొడతారా?

ఇలా బెదిరించేవాడు ప్రమాదకారికాడు, వాడి నేరానికి వాడే సాక్ష్యాధారాన్ని సమకూర్చుకున్నాడని ఆమెకి అర్ధమేకాదు. ఇలాటి పరిస్థితి ఎదురయితే నేటి స్త్రీ ఏం చేయాలో అది చేసి చూపించే ప్రయత్నంలో, పొరపాటున  వాడి ప్రాణాలు తమ తల్లీ కూతుళ్ళ చేతుల్లో పోతే, కథకి కీలకమైన ఈ సీను ఇంత బలహీనంగా వుండేది కాదు! పైగా ఈ పాత్ర ఉన్నతంగా ఎదిగి నిజమైన సానుభూతిని సంపాదించుకునేది...
***


పోలీస్ ఐజీ గీత విషయానికొస్తే, ఈవిడ తన అధికార హోదా మర్చి సగటు తల్లిలా పగబట్టేసి, ఇంటరాగేషన్ మాటున ఓ కుటుంబాన్ని రాచిరంపాన బెట్టే రెబెల్ క్యారక్టర్ లా కన్పిస్తుంది. ఉన్నతాధికారిగా ఏ రూల్ బుక్ నీ ఖాతరు చేయకుండా, పోలీసుస్టేషన్ ని రౌడీ అడ్డాలా మార్చేసి, థర్డ్ డిగ్రీ తో చెలరేగిపోయిన డెసర్టర్ లా అన్పిస్తుంది. పాత్ర స్థాయిని దిగజార్చిన ఈ తరహా చిత్రణ లో కనీస స్థాయి కామన్ సెన్సు కూడా కన్పించదు. ఒకళ్ళు నేరం చేశారన్పిస్తే, దానికికారణం ఏమైవుంటుందా అని కూడా ఆలోచించదు. మోటివ్ లేకుండా ఏ నేరాన్నీ ఆపాదించలేమనీ తెలుసుకోదు. ఇంటరాగేషన్ కంటే ముందు దానికి సపోర్టు చేసే ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని  ఆమెకి తట్టదు

రాంబాబు అమాయకుడు కాబట్టి –మీ కొడుకుని మేమెందుకు మాయం చేస్తాం, కారణం చెప్పండి?-అని అడగడు. ఇతను అడక్కపోయినా రేపు ఛార్జి షీటు ఏమనిపెడతారు? ముందా కారణం ( మోటివ్ ) తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఐజీ చివరంటా ఒకటే హింసకి గురిచేస్తుంది. ఏడెనిమిదేళ్ళ చిన్న కూతుర్నీ వదిలిపెట్టదు.

రాంబాబు వరుణ్ కారుని తీసి కెళ్ళాడన్న కానిస్టేబుల్ వీరభద్రం సాక్ష్యమే ఈ కుటుంబాన్ని ఇరికిస్తే, అసలు రాంబాబు ఆ కారుని నీటి గుంటలో తోసేశాడని ఏ సాక్ష్యముంది? విచారించారా? అతను ఆగివున్న కారుని  సరదాగా కొంత దూరం తోలి వదిలేసి ఉండొచ్చు. ఇంకెవడో నడపరానివాడు నడిపి, నీటిగుంటలో పడేసి, వాడు బతికి బయటపడి పారిపోయి వుండొచ్చు!

వరుణ్ సరీగ్గా రాంబాబు ఇంటికే వచ్చాడని కూడా ఏ సాక్ష్యం వుంది? అది సేకరించారా? పోనీ రాంబాబు ఇంటిని సోదా చేశారా? పోలీస్ కుక్కల్ని తెప్పించి చూశారా? అలా చూస్తే జంతు కళేబరం దొరికేది. దాన్ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తే రాంబాబు భార్యా పిల్లలు ఆశ్చర్య పోయే వాళ్ళుగా?ఎందుకంటే, అక్కడ వరుణ్ శవం ఉండాలనే వాళ్లకి తెల్సు, రాంబాబు జంతు కళేబరం తో రీప్లేస్ చేశాడని వాళ్లకి తెలీదు. మైండ్ రీడింగూ ఫేస్ రీడింగూ తెలిసి వుంటే ఐజీకి వాళ్ళ ఆశ్చర్యానికి కారణం తెలుసునే దిశగా ఇంటరాగేషన్ ని మార్చేది. నిజం బయటపడేది!

ఐజీ పాత్రని కిల్ చేసి, రాంబాబు సోకాల్డ్ స్కిల్స్ ని హైలైట్ చేసే అసమగ్ర పాత్రచిత్రణలు ఇక్కడ జరిగాయి.
కొడుకు కన్పించకపోతే ఐజీ ముందే అతడి ఫ్రెండ్స్ ని విచారించకుండా, కథ ఆఖర్న ఓ ఫ్రెండ్ ని పట్టుకుని కొడుకు అసలేం చేశాడో అప్పుడు తెలుసుకుంటుంది. అంటే తప్పు తనవైపు కూడా వుంది.అయినా చిన్నమ్మాయిని చిత్ర హింసలకి గురిచేయించి నిజం కక్కిస్తుంది. అమ్మ, అక్క వరుణ్ శవాన్ని పాతిపెడుతోంటే చూశానని చెప్పేస్తుంది చిన్నమ్మాయి.

వెంటనే ఇజీ పటాలంతో వెళ్లి తవ్విస్తే, అక్కడ జంతు కళేబరం వుంటుంది. మరు క్షణం జనం తిరగబడి కొట్టడంతో ఐజీ పటాలంతో సహా పారిపోతుంది. చాలా ముతక క్లైమాక్స్ ఇది.

ప్రత్యక్ష సాక్షిగా చిన్నమ్మాయి స్టేట్ మెంట్ ఉన్నాక, అక్కడ శవం లేదంటే రాంబాబు మరో గేమ్ ప్లే చేసినట్టే. శవం స్థానంలో జంతు కళేబరాన్ని పెట్టడంలోనే అతను దొరికిపోతున్నాడు...ఎప్పుడైనా పోలీసు కుక్కలొస్తే ఈ కళేబరం దొరికిపోతుందని రాంబాబుకీ తెలిసే వుంటుంది. అప్పుడతను ఏం చెప్పాలనుకున్నాడు? ఎవరిదా జంతువు? రాంబాబు దగ్గర పశువులున్నట్టే లేదు, మరి ఎవరిదో పశువుని ఇంట్లో ఎందుకు పాతిపెట్టుకున్నాడు?

కారు- సిమ్ కార్డు - ఈ కళేబరం- ఈమూడూ అతడి అమెచూరిష్ చేష్టలకి నిదర్శనాలైతే, దర్శకుడు అడ్డం పడ్డాడు. అడ్డం పడి, చిన్నమ్మాయి స్టేట్ మెంట్ ఆధారంగా కేసుపెట్టే ఆలోచన ఐజీ పాత్రకి లేకుండా చేసి, జనం తిరగబడిన ఓటమిభావంతో ఆమె చేత రిజైన్ చేయించి భర్తతో సహా ఫారిన్ పంపించేశాడు!

కొసమెరు పేంటంటే, ఒక కోర్టు భవనం ఎక్స్ టీరియర్ షాటు వేసి, రాంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడని ప్రకటించడం!

ఏ కేసులో? వరుణ్ హత్య కేసేనా? అదెలా ఎప్పుడు పెట్టారు? మృతదేహం లేకుండా (corpus delicti) హత్య కేసెలా పెడతారు?

మానసిక సంఘర్షణల కథలకి, నేరపరిశోధక కథలకీ చాలా లోతులుంటాయి. ఆ లోతుల్లోకి పూర్తిగా వెళ్లి, అక్కడ్నించీ సమస్య ని చూడకపోతే, ఇలాటి పేలవమైన కథలే పెల్లుబుకుతాయి!

నవలని మార్చి నేర కథని అల్లే నేర్పు, దాని లీగల్ పరమైన అంశాల కూర్పూ సరిగ్గా లేకుండా తీసిన ఓ బలహీన ఫ్యామిలీ థ్రిల్లరే  ఈ 'దృశ్యం'!

 -సికిందర్

























29, జూన్ 2014, ఆదివారం

ఆర్టికల్ 

రెండోది తీస్తే అంతేనా!
సీక్వెల్ సినిమాల సంకటం!




             గతంలో సాధించిన ఘన విజయాలకి ఓ అంకె కలుపుకుని మళ్ళీ విజయాలు సాధించవచ్చన్న పేరాశే నేడు విచ్చలవిడిగా తెరకెక్కుతున్న కొనసాగింపు చిత్రాల పరంపర. . కొత్తవి సృష్టించలేక, సృష్టించాలన్నా అవే కథల్ని బాహాటంగా రిపీట్ చేయాల్సిన అవమానాన్ని భరించలేక, గత హిట్లకి అంకెలేసి అవే కథల్ని సాగదీసి మళ్ళీ తీయడమే కాస్తయినా పరువు నిలుపుతుందని నమ్ముతూ పాల్పడుతున్న సరికొత్త నిర్మాణాలే,  నేటి సీక్వెల్స్ అనే దిగుమతి చేసుకున్న మరో సరికొత్త హాలీవుడ్ సంస్కృతి!

            విచిత్రమేమిటంటే గతంలో రెండు తడవలుగా తీసిన తెలుగు సీక్వెల్ సినిమాలే మెగా స్టార్ చిరంజీవి సహా  ఎవరు నటించినా హిట్టయిన పాపాన పోలేదు. అయినా ఇంకేదో సర్ది చెప్పుకుంటూ మళ్ళీ సీక్వెల్స్ కి తెరతీయడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందేమో. గతంలో రామ్ గోపాల్ వర్మతీసినపుడు మొదటిసారి, తర్వాత చిరంజీవి నటించినప్పుడు రెండో సారీ సీక్వెల్స్ నిర్మాణాలు ఊపందుకుని అదొక ట్రెండ్ గా స్థిర పడలేదు. కానీ ఈసారి మామూలు ట్రెండ్ కాదు- గజ ట్రెండ్ గా ఘీంకరిస్తూ ముందుకొస్తున్నాయి చిన్నా పెద్దా సీక్వెల్  సినిమాలు!
గబ్బర్ సింగ్-2, అదుర్స్ -2, పోకిరి-2, రేసుగుర్రం -2, కిక్-2, స్వామిరారా-2, బిందాస్-2, అంతః పురం-2,  ప్రేమకథా చిత్రం-2, యమలీల-2, అల్లరి-2, ఆనందం -2, దొంగాట -2, మంత్ర -2...ఇలా రెండో నంబర్ సినిమాల లిస్టుకి అంతే వుండదు. ఇలా అంకెలే కాకుండా టైటిల్స్ ని స్వల్పంగానో, పూర్తిగానో మార్చుకుని కూడా సీక్వెల్ సినిమాలు వరస కడుతున్నాయి...’ఆదిత్య-369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య-999’,  ‘లాహిరి లాహిరి లాహిరి’ కి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘సీతయ్య’ కి కొనసాగింపుగా  ‘ఎవరి మాటా వినడు’, ‘లేడీస్ టైలర్’ కి  సాగతీతగా ‘ఫ్యాషన్ డిజైనర్- సన్నాఫ్ లేడీస్ టైలర్’... ఇలా దర్శన మివ్వబోతున్నాయి.

           వీటిలో కొన్నిటి ని  ఒరిజినల్ దర్శకులే తీయడం లేదు. దొంగాట -2, ఆనందం -2 లతో  వీటి ఒరిజినల్ దర్శకులైన కోడి రామకృష్ణ, శ్రీను వైట్ల లకి ఏ సంబంధమూ లేదు. అలాగే తమిళ మెగా దర్శకుడు శంకర్ అప్పట్లో తీసిన ‘జీన్స్’ సీక్వెల్ కి ఆయనా దర్శకుడు కాదు. ఇక ప్రస్తుతం  ‘రేయ్’  నిర్మాణంలో తలమునకలై వున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి ఏకంగా గతంలో తను తీసిన ‘లాహిరి లాహిరి లాహిరి’,  ‘సీతయ్య’ ల సీక్వెల్స్ ని ప్రకటించుకున్నారు.

        ఇక నాగార్జునతో ‘డాన్’ తీసిన లారెన్స్ రాఘవ ‘డాన్-2’ కూడా తీస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అదేమయ్యిందో తెలీదుగానీ, ఇప్పడు ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘మిర్చి-2’ లో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

        కనీసం గతంలో హిట్టయిన సినిమాల టైటిల్స్ తో వేరే సినిమాలు తీస్తే కొన్నైనా  హిట్టయ్యాయి. తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ నాటినుంచీ ఈ సరళిని గమనించవచ్చు. ‘భక్త ప్రహ్లాద’- 1931- 1967, ‘ఆలీబాబా 40దొంగలు’- 1940- 1970,  ‘అపూర్వసహోదరులు’- 1950- 1986-1989, ‘బందిపోటు’- 1963-1988, ‘పవిత్రబంధం’- 1971-1996, ‘ఆహానా పెళ్ళంట’- 1987-2011 ... స్థలాభావం చేత ఇవి కొన్ని మాత్రమే . జాబితా తీస్తే ఇలా రిపీట్ టైటిల్స్ తో హిట్టయిన సినిమాలు డజన్ల సంఖ్యలో వుంటాయి.  కానీ  సీక్వెల్స్ కీ  అదృష్టం కూడా లేదు.  ఒక్కటీ హిట్టవదు. హాలీవుడ్ లో ఏనాడో సినిమాలు పుట్టిన తొలి నాళ్లలో 1930 ల నుంచే  సీక్వెల్స్ తీయడం ఆరంభిస్తే, తెలుగులో రాంగోపాల్ వర్మ పుణ్యమా అని హిట్టయిన ‘మనీ’ (1993) కి, 1995లో  సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చింది. అది మట్టి కర్చింది. ఆతర్వాత 2004 వరకూ సీక్వెల్స్ జోలికి పోలేదు. 2004లో చిరంజీవితో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ హిందీకి రీమేకుగా హిట్టయిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కి సీక్వెల్ తీశారు. హిందీలో అదే ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ కి సీక్వెల్ గా సూపర్ హిట్టయిన ‘లగే రహో మున్నా భాయ్’ ని తీసుకుని మళ్ళీ చిరంజీవితో ‘ శంకర్ దాదా జిందా బాద్’ అని సీ క్వెల్ తీస్తే అది సూపర్ ఫ్లాపయ్యింది. ఇలా తెలుగులో మొదటి రెండు సీక్వెల్సూ ఘోరపరాజయాల పాలయ్యాక కూడా  ధైర్యం చేసి అల్లు అర్జున్ తో  ‘ఆర్య -2’ తీశారు 2009లో. ఇది కూడా ఫ్లాపయ్యింది. వర్మ తీసిన ‘గాయం-2’, ‘సత్య -2’,  ‘ఏ ఫిలిం బై అరవింద్ -2’ లు కూడా ఫ్లాపయ్యాయి. నిజానికి ఈ మూడిటి ప్రీక్వెల్స్ (తొ లిచిత్రాలు) అయిన ‘ఆర్య’, ‘గాయం’, ‘సత్య’ ‘ఏ ఫిలిం బై అరవింద్’ లు రికార్డులు సృష్టించిన చిత్రాలే. కానీ సాగదీస్తే చతికిలబడ్డాయి. పోసాని కృష్ణమురళి తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత హిట్టయ్యిందో, ‘ఆపరేషన్ దుర్యోధన-2’ అంతగా  ఫ్లాపయ్యింది. వర్మ ‘రక్త చరిత్ర’ తీసిన తర్వాత,  అట్టహాసంగా ‘రక్తచరిత్ర-2’ తీస్తే ఏమైందో తెలిసిందే!

           సాక్షాత్తూ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన మెగా హిట్ ‘చంద్రముఖి’ కి సీక్వెల్లో మళ్ళీ ఆయన నటించలేదు గానీ, మన విక్టరీ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాపయ్యింది. తగుదునమ్మా అని జేడీ చక్రవర్తి మళ్ళీ ‘మనీ’ , ‘మనీ మనీ’ లకి ట్రీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ (2011) అని తీస్తే,  షరామామూలుగా  ఏమాత్రం మనీ తిరిగి రాలేదు. మోర్ మనీ అని ఆశలు మాత్రం చాలా  పెట్టుకున్నారు.

          కృష్ణుడు తో ‘వినాయకుడు’ హిట్టయ్యాక, మళ్ళీ’ విలేజిలో వినాయకుడు’ గా వస్తే ఉండ్రాళ్ళు దక్కలేదు. ఓ మాదిరిగా హిట్టయిన ‘వెన్నెల’ ని నటుడు వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి అ కథతో సంబంధంలేని ‘వెన్నెల వన్ పాయింట్ ఫైవ్’ తీసి సీక్వెల్ గా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం ప్రేక్షకుల్ని ఒప్పించలేదు. అలాగే హిట్టయిన తమిళ డబ్బింగ్ ‘విల్లా’ కి సంబంధంలేని ‘విల్లా-2’ వస్తే తిప్పికొట్టారు ప్రేక్షకులు. సీక్వెల్స్ ఇలా అడ్డగోలుగా వెర్రితలలేసే స్థాయికి పడిపోతున్నాయి. సేక్వెల్ అర్థాన్నే మార్చేస్తున్నాయి. ఇంకా పాత హిట్స్ అయిన ‘ బొబ్బిలి రాజా’, ఖైదీ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లకి కూడా సీక్వెల్స్ తీస్తా మని బెదిరిస్తున్నారు ఈ  సినిమాలు తీయని వేరే దర్శకులు. పాత సినిమాలని మళ్ళీ నిర్మిస్తున్నప్పుడు దర్శకులు మారినా అభ్యంతర ముండదు. అక్కినేని నాగేశ్వరరావు  ‘దేవదాసు’ ని విజయనిర్మల రీమేక్ చేస్తే అదేంటీ అని ఎవరూ అనలేదు. రీమేక్స్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ సీక్వెల్స్ కి ఓ పధ్ధతి వుంటుంది. ఒరిజినల్ దర్శకుడి సొత్తు అయిన ఓ హిట్ ని వేరే దర్శకుడు సొంతం చేసుకుని సీక్వెల్ తీయడం ఏమాత్రం వృత్తి  తత్త్వం అన్పించుకోదు. కానీ ఉన్న అనేకానేక అనారోగ్య ధోరణకి ఇది కూడా ఓ ట్రెండ్ గా తోడై పోయిందిప్పుడు.
అసలిదంతా హిందీ వైపు చూసి వేసుకుంటున్న వాతలు. అయితే హిందీలో ఒకరి సృజనాత్మక ఆస్తితో మరొకరు  సీక్వెల్స్ తీసే అపసవ్య ధోరణి కన్పించదు.  ఒరిజినల్ తీసిన  దర్శకులే సీక్వెల్స్ మీద సీక్వెల్స్  తీస్తూ హిట్లు కొడుతున్నారు. హేరాఫేరీ-2, కోయీ మిల్ గయా-2,  మున్నాభాయ్ -2, దబంగ్-2,  దోస్తానా- 2 , జన్నత్-2, ఆషికీ-2, రేస్-2, ఢమాల్-2,  రాగిణి ఎం ఎం ఎస్-2, మర్డర్-2,3, రాజ్-2,3, క్రిష్- 2,3,   ధూమ్- 2,3,  గోల్ మాల్ -2,3,4. ...ఈ దశాబ్దంన్నర కాలంలో ఇవన్నీ ఇవన్నీ హిట్లూ సూపర్ హిట్లే.
తెలుగులో ఎందుకు హిట్ కావడం లేదంటే, కేవలం క్రియేటివిటీ లోపించడం వల్లే. మొదటి దాన్ని మరిపించేదిగా రెండోది వుండాలి. కానీ రెండోది తీస్తే ఇక అంతే  సంగతులు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.

            తమిళం వైపు చూస్తే, నాన్ అవన్ ఇల్లై, ముని, పిజ్జా లకి సీక్వెల్స్ తీస్తే హిట్టయ్యాయి. సింగం తర్వాత సూర్య సింగం-2 లో నటిస్తే అదీ హిట్టయ్యింది. కమలహాసన్ విశ్వరూపం-2, మురుగ దాస్  తుపాకీ-2 తీయబోతున్నారు. ఇండియన్, రోబోలకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ( బాక్స్ చూడండి). తెలుగులో లాగా  తమిళం లో అంత సీక్వెల్స్ వేలంవెర్రి లేదు. అతి తక్కువ సంఖ్యలో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొనసాగింపుల్ని పక్కన బెట్టి కొత్త కథల మీదే దృష్టి పెడుతున్నారు.

           ‘ఇప్పుడు కథకులు లేరు, కథలకి ఐడియాలు కొరవడుతున్నాయి. ఐడియాలు  వున్నా కొత్త  కథలతో సాహసించ లేకపొతున్నారు. పూర్తి అభద్రతా భావంతో కొట్టు మిట్టాడుతున్నారు. సురక్షిత మార్గం సీక్వెల్స్ తీయడమే నని భావిస్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాత్రతో మళ్ళీ తీస్తే గట్టెక్కుతామని నమ్ముతున్నారు. కొత్త కథలే కాదు, కొత్త పాత్రల్ని సృష్టించాలన్నా ఏదో భయం, దీన్ని భయం అనేకన్నా భావ దారిద్ర్యం అనాలి...’అని అంటున్న సీనియర్ హిందీ రచయిత కమలేష్ పాండే మాటలు హిందీకి కన్నా తెలుగుకే ఎక్కువ వర్తిస్తాయేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇలా తీస్తున్న హిందీ సీక్వెల్సే హిట్టవుతున్నాయి. ఈ కిటుకు ఏంటో ముందు పట్టుకో గలిగితే, తర్వాత  తీరిగ్గా తెలుగు సీక్వెల్స్ గురించి ఆలోచించవచ్చు.

              రవితేజతో కిక్- 2 కి కమిటయిన దర్శకుడు సురేంద్ర రెడ్డి,   ఒరిజినల్ లోని రవితేజ పాత్రని తీసుకుని కొనసాగింపుగా కాకుండా,  కొత్త కథ తయారు చేసినట్టు చెబుతున్నారు. ఈ పాత్ర ‘కిక్’ తో ఎంతో పాపులర య్యింది. దీన్ని మళ్ళీ ఎంజాయ్ చేయవచ్చు ప్రేక్షకులు. హిట్టయిన పాత్రలాధారంగా సీక్వెల్స్ తలపెడితే సత్ఫలితా లుండొచ్చు, కానీ, హిట్టయిన కథలాదారంగా తీస్తే ఏమౌతుందో చెప్పలేం. ప్రస్తుతం తలపెడుతున్న చిన్నా పెద్దా సీక్వెల్స్ లో చాలా వాటికి హిట్టయిన పాత్రల్లేవు. హిందీలో చూస్తె ఎక్కువగా హిట్టయిన పాత్రలతోనే తీస్తున్నారు. కథలతో తీసినా చాలావరకూ హిట్టయ్యాయి. అంటే క్వాలిటీ కి కట్టు బడ్డారన్న మాట. మున్నాభాయ్, హేరాఫేరీ, కోయీ మిల్ గయా, గోల్ మాల్, దబంగ్, ధూమ్, క్రిష్, దోస్తానా, రేస్   లలోని పాత్రలు బాగా హిట్టయినవే. ఆషికీ, రాజ్, మర్డర్, రాగిణి- ఎం ఎం ఎస్ మొదలైనవి చిన్న చిత్రాలు. వీటిని కథా  బలం ఆధారంగా సీక్వెల్స్ తీసి విజయాలు సాధించారు.తెలుగులో ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ది విలక్షణ పాత్ర. అది కౌబాయ్ ప్రవర్తనల గుర్తుండి  పోయే పోలీసు పాత్ర. కానీ ‘పోకిరి’ లో మహేష్ బాబుది సాధారణ అండర్ కవర్ పోలీసు అధికారి పాత్రే. దీనికి ఏ ప్రత్యేకతలూ లేవు. అలాగే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ పురోహితుడి సాత్విక పాత్ర ఆ సినిమా వరకే చెల్లుతుంది గానీ, సీక్వెల్ కి పనికొచ్చేంత క్రేజీ పాత్రేం కాదది. ‘రేసుగుర్రం’ లో అల్లు అర్జున్ పాత్ర సైతం డిటో. పైగా దీనికి పాత్ర చిత్రణా పరమైన  లోపాలెన్నో వున్నాయి. విశ్లేషిస్తే ఇదొక అసమర్ధ పాత్ర. పైగా టైటిల్ కి తగ్గట్టు రేసు గుర్రమే కాదు. నటి ‘లేడీస్ టైలర్’ లో

           ఇక ‘యమలీల’ సహా రాబోయే చిన్న చిన్న సీక్వెల్స్ అన్నీ కథా బలం ఆధారంగా తీసుకోవాల్సినవే. ఐతే ‘యమలీల’ సీక్వెల్ కాదంటున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. కొనసాగింపు కాకుండా కొత్త కథతో ఇది సిరీస్ చిత్రం అంటున్నారు. సిరీస్ చిత్రమ నుకుంటే దీని తర్వాత ఇంకా తీస్తూ వుండాలి, హాలీ వుడ్ లో జేమ్స్ బాండ్ చిత్రాల్లాగా. కృష్ణా రెడ్డి ఒకటి తీసి సిరీస్ అనకుండా మరి కొన్ని యమలీలలు తీస్తూ పోతారేమో  చూడాలి.

              ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయంలో, సీక్వెల్ అనేది ప్రీక్వెల్ కి సహజ సిద్ధమైన కొనసాగింపుగా వుండాలి, కానీ మన నిర్మాతలు, దర్శకులూ సంబంధంలేని వేరే కథ జోడించి పార్ట్ టూ అని ప్రచారాలు చేసుకుంటున్నారు, ప్రీక్వెల్  హేంగోవర్ తో వుండే  ప్రేక్షకులు,  తీరా థియేటర్ లోకెళ్ళి చూసి కంగు తింటున్నారు...

            ఒక పంపిణీ దారుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. ముందు తీసిన సినిమాతో రెండో దానికి సంబంధంలేని కథ ఉండడమే వీటి వైఫల్యాలకి కారణమంటున్నారు. నిజమే, మొదటే కథల్నీ పాత్రల్నీ ఇక సృష్టించుకునే ఓపికా తీరికా లేక సులభమార్గం సీక్వెల్స్ ని ఎంచుకున్నప్పుడు, వీటితో కూడా ప్రేక్షకులతో నిజాయితీగా ఉండకపొతే ఎలా?

            చూడబోతే ఈ ఏడాది, వచ్చే ఏడాదీ నంబర్ టూ సినిమాలు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టున్నాయి. ఐతే ఇలా డజన్ల సంఖ్యలో క్యూ కడుతున్న తెలుగు సీక్వెల్స్ లో ఒకటి రెండూ మెప్పించలేకపోయినా, మిగిలిన వాటి మొహం చూడక పోయే ప్రమాదముంది ప్రేక్షకులు. గ్రాఫిక్స్ సినిమాలు, త్రీడీ సినిమాలూ ఎలా వెన్వెంటనే మొహం మొత్తాయో సీక్వెల్స్ హంగామా కూడా అయ్యోరామా అన్పించుకునే అపాయం పొంచే  వుంటుంది. కనుక అందరూ ఒకే సారి పోటాపోటీగా ప్రారంభించకుండా, ఒకటి రెండిటి ఫలితాలు చూసి ముందడుగు వేయకపోతే ఇంతే  సంగతులవుతుంది. ఎలాగూ రెండోది తీస్తే ఏమయ్యిందో దాఖాలాలున్నాయి ఇదివరకే.
ప్రేక్షకులు కొత్త  పాత్రలతో, కొత్త  కథలతో ముందు కెళ్లాలనుకుంటారు. ఉన్న చోటే వుండి పోయి ఈ రెండేళ్ళూ అవే పాత్రలూ, అవే టైటిల్స్ తో అవే కథల కొనసాగింపులూ చూస్తూ బోరు కొట్టించుకోవాలనుకోరు. అసలే ఇంట్లో జీడిపాకం సీరియళ్ళతో నానా యాతనలు  పడుతున్నారు. ఇంకా జీడిపాకం సినిమాలని  కూడా అంటే ఎవరికీ చెప్పుకుంటారు?   ధోరణి ఇలాగే కొనసాగితే  టాలీవుడ్ లో సరుకై పోయిందని మొత్తంగా థియేటర్లకి డుమ్మా కొట్టినా కొట్టొచ్చు!

-సికిందర్
( 'ఈవారం'- జులై 2014)

27, జూన్ 2014, శుక్రవారం

రివ్యూ..


మళ్ళీ అదే ఎపిసోడ్ల వైఫల్యం!


రచన- దర్శకత్వం : దేవ కట్టా
తారాగణం: నాగ చైతన్య అక్కినేని, సమంత, రాకుల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, జీవీ, జెపి, బ్రహ్మానందం, ఎమ్మెస్, వేణు మాధవ్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్,    కెమెరా: శ్రీకాంత్ నరోజ్,  ఎడిటింగ్ : గౌతమ్ రాజు.

 నిర్మాత : కె. అచ్చి రెడ్డి , సెన్సార్ :  ‘A’ ,     విడుదల : 27 జూన్, 2014,     
*****
మొన్ననే క్లాసిక్ కుటుంబ కథా చిత్రం  మనం’  సూపర్ సక్సెస్ తో మరింత క్రేజ్ ని పెంచుకున్న  అక్కినేని నాగ చైతన్య,  ‘ఆటో నగర్ సూర్య’ తో  ఇక చెలరేగిపోతాడన్న అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ఒకటే పరంపరగా విడుదల వాయిదాలు పడుతూ వచ్చిన ‘ఆటో నగర్ సూర్య’ షరామామూలు ఫలితాన్నే ఇస్తుందని ఎవరూ ఊహించి వుండరు. ఎంతటి బడా సినిమా అయినా  విడుదల వాయిదాలు  పడితే హిట్టయిన సందర్భాలు లేవు. ఐతే ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఈ ప్రమాదంలో పడాలనిలేదు. దర్శకుడు దేవకట్టా  సరైన ‘దృష్టి’ తో ఈ సినిమా తీసివుంటే దీనికీ గండం వుండేది కాదు.

దర్శకుడు దేవకట్టా తో వచ్చిన సమస్యేమిటంటే,  ఆయన భారీ కథలకి లేత హీరోల్ని ఎన్నుకుంటారు. గత చిత్రం ‘ప్రస్థానం’ లో అంత బరువైన కథకి, పాత్రలకీ  సరిపోని శర్వానంద్, సందీప్ కిషన్ లలాంటి యంగ్ హీరోల్ని తీసుకున్నట్టే,  ప్రస్తుత భారీ డైలాగుల బరువైన సినిమాకీ అంతే యంగ్ స్టార్ నాగ చైతన్య ని తీసుకున్నారు. యాక్షన్ హీరోగా రాణించాలని విఫలయత్నం చేస్తున్న నాగచైతన్య చేత ఇంత సీరియస్ సినిమా దేవకట్టా చేస్తారని ఎవరూ ఊహించరు.  ఈ రోజుల్లో పెద్ద స్టార్స్ సినిమాలకే యాక్షన్ ని ఫక్తు ఎంటర్ టైనర్ గా చేసి చూపిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఇలాటి కమర్షియల్ యాక్షన్ సినిమాల ట్రెండ్ కి  దేవ కట్టా ఎంత కొత్త అన్పిస్తారంటే, ఆయన ఎన్నుకున్న ఈ కథ ఎంత పాతకాలం నాటిదో అంత!

ఇంకో అనాధ బాధ!

ఐదేళ్ళప్పుడు సూర్య ( నాగ చైతన్య) అనాథ అవుతాడు. అప్పుడు  తల్లి కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మేనమామ ( సాయికుమార్ )సూర్యని చేరదీయడు. దీంతో  ఆటోనగర్ లో పనిలో చేరి కాలక్రమంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు.  అక్కడే  ఇంజనీరింగ్ కూడా పూర్తి  చేసి విడుదలవుతాడు.

అతడికో కల వుంటుంది- బ్యాటరీతో నడిచే కారు తయారు చేయాలని. ఆటోనగర్ లో ఈ పని ప్రారంభించబోతే నగర మేయర్ ( మధు), అతడి రౌడీ వర్గం ( జయప్రకాష్ రెడ్డి, అజయ్, జీవా ) అడ్డుపడుతూంటారు.  వీళ్ళంతా ఆటోనగర్ మీద, అక్కడి వర్కర్స్ యూనియన్ మీదా  అధికారం చెలాయిస్తూ అక్రమ సంపాదనలకి  అలవాటు పడివుంటారు. ఈ కొత్త  వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇక ఎదురుతిరగడం  మొదలెడతాడు సూర్య.
ఇంకోవైపు మేనమామ కూతురుగా సిరి (సమంత) వుంటుంది. ఈమెతో ప్రేమకి మేనమామ అడ్డుగా వుంటాడు. ఈ ప్రేమ సంగతి అలావుంచితే, అతడి ధ్యేయం ఇప్పుడు ఒక్కటే - ఆటోనగర్ లో రౌడీ రాజ్యాన్ని అంతమొందించడం. ఇదీ కథ!

నటనలు- సాంకేతికాలు

2011 లో రాంగోపాల్ వర్మ తీసిన ‘బెజవాడ’, అంతకి ముందు వాసూ వర్మ దర్శకత్వంలో 2009 లో ‘ జోష్’, మళ్ళీ 2011 లో అజయ్  భుయాన్ దర్శకత్వంలో ‘దడ’ అనే మూడు యాక్షన్ చిత్రాల్లో నటించి విఫలమైన నాగ చైతన్య తిరిగి అదే యాక్షన్ హీరో గా నిరూపించుకోవడం  కోసం ఈసారి  చేసిన ప్రయత్నం కూడా పారలేదు.  ఈసారి మాస్ పాత్ర నటించడంలో కొంత ఇంప్రూవ్ ఐనప్పటికీ, అతను సాఫ్ట్ రోల్స్ లో రోమాంటిక్ పాత్రలు పోషిస్తేనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకునే అవకాశం వుంది.

సమంత కి సరైన పాత్రేలేదు. ఈ తరహా మూస ఫార్ములా సినిమాల్లో హీరోయిన్ పాత్ర గల్లంతవడం మామూలే. ‘దూకుడు’ ద్వితీయార్ధంలో సమంత సమూలంగా మాయమైనట్టుగానే, ఇక్కడ కూడా ఆ ఉన్న కురచ పాత్ర కాస్తా సెకండాఫ్ లో ఐపు లేకుండా పోయింది.

మిగతా పాత్రల్లో పాత  విలన్లందరూ పోటీలు పడి వీలైనంత పాత  ధోరణిలోనే నటించుకుపోయారు. సెకండాఫ్ లో   నైతే మరీ పాత సినిమా విలన్స్ లా అరుపులు అరిచారు. బ్రహ్మానందం- వేణుమాధవ్ ల కామెడీ  విషయానికొస్తే, దీన్ని కామెడీ అని కూడా ఎలా అంటారో దర్శకుడే స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.

సాంకేతికంగా చూస్తే కెమెరా వర్క్ లో చాలా ఎగుడు దిగుళ్ళు న్నాయి. అసలీ సినిమా కథాకాలం 1970- 90 ల నాటిది. ఆ కాలాన్ని ప్రతిబింబించే వాతావరణ కల్పన కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి, ఆ కాలంలో  తీసిన పాత సినిమా చూస్తున్నట్టే తయారయ్యింది.

అనూప్ రూబెన్స్ సంగీతంలో  ‘మన్ చలీ’ అనే ఒక్క పాట తప్ప మరేదీ ఆకట్టుకోదు.  ఆకట్టుకోక పోగా,    అకస్మాత్తుగా కథకి అడ్డుతగుల్తూ వచ్చిపోతూంటాయి.

దర్శకత్వపు తీరుతెన్నులు

దర్శకుడు దేవకట్టా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే అక్కడ సినిమా దర్శకత్వం కోర్సు చేశారు. స్క్రీన్ ప్లే మీద అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, సినిమా తీసే  విషయానికి వస్తే మాత్రం ఆ జ్ఞాన సంపద ఏమై  పోతుందో అర్ధంగాదు. పాత్ర చిత్రణ గురించి, పాత్ర ప్రయాణం గురించీ వివరించే జోసెఫ్ క్యాంప్ బెల్ రాసిన  ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ గ్రంథ పఠనమంతా ఏమై పోతుందో తెలీదు. ఈ సినిమాకి ఆయన ఒక దర్శకుడిగా కంటే మాటల రచయితగా ఎక్కువ నిరూపించుకోవాలని ఉబలాటపడ్డారు. పట్టుకున్న కలానికి పట్టుపగ్గాలే లేనట్టు పుంఖాను పుంఖాలుగా డైలాగులు రాసుకుంటూ పోయారు. ఈ డైలాగులు కాలం చెల్లినవి. ఈ రోజుల్లో ఇంతేసి భారీ డైలాగులు చూడం. పైగా రాస్తున్నది ఒక యువ స్టార్ కోసం అన్న దృష్టి కూడా లేకుండా అలాటి డైలాగులు జొప్పించారు.

‘మీరంతా మారిపోయారు బాబాయ్, నిజం చెప్పాలంటే దూరంగా పారిపోయారు’ - అనే అరిగిపోయిన ప్రాస డైలాగు,

‘నేనింకా  పసివాడినే, మనిషే వ్యవస్థ అని తిరుగుతున్న ఆరేళ్ళ పసోడిని’ - అనే అజ్ఞానపు డైలాగు,

‘నేను అనాథనే కానీ  అనామకుడ్ని కాదు, నా పేరు సూర్య, ఆటో నగర్ సూర్య’ - అనే బలహీన  డైలాగు,

‘నాకు తెలిసి మనుషుల్లో నాలుగే జాతులున్నాయ్, తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తినగలిగినంత మాత్రమే పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు, ఈ ముగ్గుర్నీ దోచుకు తినే నాలుగో జాతి –లోఫర్ జాతి’  – లాంటి భారీ డైలాగులూ చాలా వున్నాయి...

వ్యవస్థ మనిషిని నిర్ణయించదనీ,  మనిషే ఒక వ్యవస్థ అనే అర్ధంలో ఇంకో డైలాగూ  వుంది. సంఘ జీవి అయిన మనిషి సమాజం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తనకు తానే ఒక  వ్యవస్థ అవుతాడా? అంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనా? నీ కట్టు బాట్లు, సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, నీతీనిజయితీలూ నీవరకు ఉంచుకో, బయట నువ్వు తిరిగే సొసైటీ యావత్తూ అత్యాశ, స్వార్ధం, ఈర్ష్యాసూయలు, అధికార దాహం  అనే నాలుగు మూల స్థంభాలమీద ఏర్పడి ఉంది, వీటిని కాదనుకుని పోలేవు- అని జిడ్డు కృష్ణమూర్తి ఏనాడో తేల్చేశాడు కదా?

చచ్చినట్టూ మనిషనే వాడు ఉన్న మత వ్యవస్థలో, అది అదుపు చేసే రాజకీయ వ్యవస్థలో పనిచేసుకు బతకాల్సిందేగా? కాకపొతే బతకలేనప్పుడు ఎదురుతిరుగుతాడు, అంతే. తానుంటున్న వ్యవస్థ అనే ఛత్రాన్ని మాత్రం తప్పించలేడు. వ్యవస్థ  అనేది ఆటవికతనం నుంచి పరిణామం చెంది ఏర్పడ్డ నాగరికత. మనిషిగా దర్శకుడే ఒక వ్యవస్థ ఐతే, ఈ సినిమా విడుదల ఇన్నిసార్లు ఎందుకాగుతుంది?

ఈ డైలాగుల ఆర్భాట మంతా  డైలాగుల కోసమే అన్నట్టు వుందే తప్ప, వీటిని ఆచరించి చూపే పాపాన హీరో పోడు సరికదా, దర్శకుడు  డైలాగుల మీద చూపించిన ‘శ్రద్ధ’  మిగతా కథా కథనాల మీద చూపించే ప్రయత్నం అస్సలు చేయలేదు.

ఈ కథా కథనాలు మరోసారి సినీ మాధ్యమానికి  పొసగని  ఎపిసోడ్ల  టైపు,  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటేషన్ టెక్నిక్ తీరు !

స్క్రీన్ ప్లే సంగతులు!


ఈ సినిమాలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి చెప్పుకోవడాని కేమీలేదు, ఎందుకంటే దురదృష్ట వశాత్తూ ఇది స్క్రీన్ ప్లే కాలేకపోయింది. స్క్రీన్ ప్లే అంటే సినిమాకి పనికొచ్చేది, అంతేగానీ ఈ సినిమాలో ఉన్నట్టుగా టీవీ ఎపిసోడ్లు కాదు. స్క్రీన్ ప్లేకి ఒకటి -రెండు- మూడు-అని మూడంకాలుంటాయి. టీవీ ఎపిసోడ్లకీ మూడంకాలుంటాయి,  అయితే అవి ఏ ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే పద్ధతిలో వాటి సీన్లు నడిచి, ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్య గా, దాంతో మాత్రమే సంఘర్షణనగా, దానికి మాత్రమే పరిష్కారంగా ఒకే ఒక్క కథ వుంటుంది.


ప్రస్తుత సినిమాలో ఒక ప్రధాన సమస్య – దాంతో సంక్షోభం అనే నడక లేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!  ఉదాహరణకి- డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ,  ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ....ఇలా ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో ‘టైగర్ హరిశంద్ర ప్రసాద్’ ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ ‘సిటిజన్’ ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో ’వార్ హార్స్’ ఫ్లాపయ్యింది.

కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల  ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారు. ఇది సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీ చిత్రాలకీ పనికొస్తుంది.

ఇంటర్వెల్ కొచ్చేసరికి కూడా ఒక ప్రధాన సమస్య (మెయిన్ పాయింటు) లేదు. ఇంటర్వెల్లో వాహనాల వేలం పాటలకి భీకర పోరాటాలు పెట్టి,  హీరోకే ఆ  విజయాన్ని అందించి, వేలం పాట పత్రాల మీద “క్లోజ్డ్!”  అని పెద్ద శబ్దంతో ముద్ర కొట్టించడం ఎలా ఉందంటే- ఈ సినిమా ఫట్ ! – అన్నట్టే వుంది!

There is no hook at the mid - point to sustain the audiences interest anymore   -అన్నమాట! ఇక ఎందుకోసం  ప్రేక్షకులు ద్వితీయార్ధం చూడాలి? మళ్ళీ ద్వితీయార్ధలో చూపించింది కూడా  ఆ వేలం పాట చేజారిపోయిందని విలన్లు మళ్ళీ ఇంకో దాడికి పూనుకోవడమే. ఇలా దాడులకి ప్రతిదాడులతోనే హీరో క్యారక్టర్ ని రియాక్టివ్ గా చేసి నడిపించారు సినిమా ప్రారంభం నుంచీ. చివరికి విలన్ కొడుకుని హీరో కిడ్నాప్ చేశాకకూడా, మళ్ళీ ఎపిసోడ్ల పద్ధతే కొనసాగించారు.

దీంతో ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. పైగా రెండు గంటలా 40 నిమిషాల నిడివి ఒకటీ. మర్నాడు  12 నిమిషాలు కత్తిరించారు. గంట కత్తిరించినా ఈ సినిమా బోరుని తప్పించలేరు.  ఎందుకంటే ఈ సినిమానే విషయం లేని నస కాబట్టి.

రాముడు అనే మంచి బాలుడు ఉదయం లేచి పళ్ళు తోముకున్నాడు, స్నానం చేశాడు, తయారయ్యాడు, తిన్నాడు, ఆఫీసుకి పోయాడు, పనిచేశాడు, తిన్నాడు, సాయంత్రం తిరిగొచ్చాడు, బట్టలిప్పుకుని స్నానంచేశాడు, రిలాక్స్ అయ్యాడు, మళ్ళీ  తిన్నాడు,  మళ్ళీ పడుకున్నాడు- ఇది నస!

రాముడు అనే మంచిబాలుడు ఉదయం  పళ్ళు తోముకుంటోంటే నిన్న బాస్ తిట్టిన తిట్లు గుర్తొచ్చాయి, బ్రష్ పడేసి స్నానం చేస్తూ బాస్ ని తన్నాలనుకుని  జారిపడ్డాడు. కాలు బెణికింది. నొప్పి కాలితో  అలాగే  ఆఫీసు కెళ్ళాడు. బాస్ మళ్ళీ తిట్టాడు. కాలు బావుంటే ఈసారి జాడించి తన్నే వాణ్ణి  అనుకున్నాడు. నొప్పి కాలితో సరిగ్గా పని  చేయలేక పోయాడు. ఇంకింత ఫైరయ్యాడు బాస్. వాడి మొహాన ఫైలు పెట్టి కొట్టి, ఇంటికొచ్చి భార్యని తన్నాడు- భార్య కోర్టు కెక్కింది- బాస్ పోలీసుల్ని పిలిపించాడు. ఇదీ పస. అసలు కథకి పెద్ద టర్నింగ్ పాయింట్!

విచారకరంగా ఇరవై కోట్ల బడ్జెట్ తో అట్టహాసంగా తీసిన ప్రస్తుత సినిమాకి మొదటి ఉదాహరణే  వర్తిస్తోంది!

పాత్రోచితనుచితాలు! 
జోసెఫ్ క్యాంప్ బెల్ 
ఐదేళ్లపుడు అనాధ అయిన హీరో తర్వాత చదువుకుంటున్నట్టు కన్పించడు. ఓ మెకానిక్ దగ్గర పనిలోకి చేరతాడు. పదహారేళ్ళ వయసులో  డీజిల్ తో నడిచే కారు కనిపెడతాడు. అడ్డొచ్చిన వడ్డీ వ్యాపారస్థుణ్ణి చంపి జైలు కెళ్తాడు. జైల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతూ, బ్యాటరీతో నడిచే కారు డిజైన్ చేస్తాడు.

ముందు కనిపెట్టిన డీజిల్ తో నడిచేకారు ఏమయ్యింది? దాంతో దేశంలోనే గొప్పవాడు ఐపోవచ్చుగా? అది మర్చిపోయి మళ్ళీ బ్యాటరీ కారు ఏమిటి? జైల్లో తను చదివింది ఇంజనీరింగ్ డిగ్రీయా, లేక డిప్లొమానా? డిగ్రీకి అవకాశంలేదు. దూరవిద్యద్వారా  ఆటోమొబైల్ డిప్లొమా చెయ్యొచ్చు. అసలు స్కూలు కెళ్ళినట్టు కన్పించని కుర్రాడికి  ఏకంగా ఇంజనీరింగ్ చదివే అక్షరజ్ఞానం, ఆంగ్ల పరిజ్ఞానం ఎలా వచ్చాయి? అతను మైనారిటీ తీరని బాల నేరస్థుడే. అతన్ని సాధారణ జైల్లో ఉంచరు. ఎంత పెద్ద నేరం చేసినా మూడేళ్లకి మించి శిక్ష వెయ్యరు. ఇంతకీ ఇతను మూడేళ్ళే  జైల్లో ఉన్నట్టా, లేక డిగ్రీ చేస్తే అది పూర్తి  చేసి ఐదేళ్లకి బయటికి వచ్చాడా?

అసలు పదహారేళ్ళ మైనర్ కుర్రాడి మీద ఓ పెద్ద రౌడీ ముఠా దాడి చేస్తే, ఆత్మరక్షణ కోసం ఆ అమాయక కుర్రాడు చంపితే కోర్టు శిక్షిస్తుందా? పైగా ఒక కేస్ హిస్టరీ లేని, జీనియస్ అన్పించుకున్న కుర్రాణ్ణి? అతడి భవిష్యత్తునీ?
ఇంజనీరింగ్ చేశాడంటే శిక్షా కాలంలో అతను చాలా సంస్కరింప బడ్డట్టే. అలాటివాడు బయటికొచ్చాక ఏం చేస్తాడు?  అసలు అతడి ధ్యేయ మేమిటి? అసలు ముందు కనిపెట్టిన ఆ డీజిల్ కారు పేటెంట్ అమ్ముకుని బాగుపడ్డం మానేసి, ఇంకో బ్యాటరీ కారూ  అంటూ బయల్దేరాక, మళ్ళీ తనని  జైలుపాలు చేసిన ఆ కుళ్ళు ఆటోనగర్ కే పోతాడా, లేక ఇంకో కొత్త  చోట తన కొత్త ప్రాజెక్టు పనితో కొత్త జీవితాన్ని మొదలెట్టుకుంటాడా?

పాత్రే ఇంత గందరగోళంగా ఆవిష్కృత మైనప్పుడు, ఇక అది కథ నడిపే పధ్ధతీ అంతే అల్లకల్లోలంగా వుంటుంది. నిజానికి పాత్ర ఇలా ప్రయాణించా లనుకోలేదు, దర్శకుడే  తను ఫిక్స్ అయిపోయిన కథకోసం పాత్రౌచిత్యాన్ని ఇలా దెబ్బ తీశాడు. పాత్రకి ఓ దిశా, గమ్యం, ధ్యేయం లేకుండా చేశాడు. దీంతో పాత్ర ప్రాథమ్యాలు మరచి ప్రవర్తించింది. జైల్లో కష్ట పడి చదివి ఏర్పర్చుకున్న జీవితలక్ష్యాన్ని తీసి మూలకి విసిరేసి, అసాంఘిక శక్తులమధ్య తనూ లుంపెన్ శక్తిగా మారిపోయి వ్యర్థ జీవితాన్ని ఎంచుకుంది. కథలో హీరోయిన్ లాగే, బ్యాటరీ కారూ ఏటో మయమై పోయింది!
దర్శకుడు తన కథని త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో ఆలోచించి వుంటే ఇలా జరిగేది కాదు. జోసఫ్ క్యాంప్ బెల్ పాత్ర ప్రయాణ నమూనా ఈ క్రింద చూడండి.

స్ట్రక్చర్ మరచి ఎపిసోడ్ల సొద 
 ఎత్తుకోవడంతో-

సిడ్ ఫీల్డ్ చెక్ లిస్టులో గుర్తిస్తే- 

1. the main character has no point of view,
2. the story seems confusing,
3. story goes off in too many directions,
4. the   material is flat and boring,
5. main  character is too passive and reactive,
6. the story is predictable and contrived,
7. the main character is too reactive, too internal, seems to disappear off the page,
8. dramatic need of the main character is vague, undefined

ఇన్ని పాత్ర సంబంధమైన లోపాలవల్ల కథే చెడిపోయింది.

ఇక- పాత్ర బలిమి విషయానికి వస్తే, కుర్ర వయసులో అతనేం మొనగాడని నగర మేయర్ సహా కరుడుగట్టిన హంతక ముఠాకి సవాళ్లు విసురుతాడు? తనకి ఎవరి బ్యాకింగ్ వుంది? ఎవరు గాడ్ ఫాదర్ గా వున్నారు? తనలాంటి నల్గురు కుర్రాళ్ళని పెట్టుకుని ఏం చూసుకుని చెలరేగి పోతున్నాడు. విలన్ల ముందు అతను బచ్చా. క్షణంలో అతన్ని లేపెయ్యగలరు. కానీ ఇక్కడ  విలన్లని కూడా దెబ్బ తీస్తూ పాత్ర చిత్రణలు జరిగాయి. పోలీస్ కమీషనర్ సహా అందరూ బఫూన్లుగా మారిపోయారు. పోనీ హీరో జైలు నుంచి విడుదలై ఇంతప్పుడే ఒక  మర్డర్ చేసొచ్చిన దేవాంత తకుడనే బిల్డప్ తో, దగాపడిన తన జీవితం సాక్షిగా,  మాంచి ఎమోషనల్ థ్రస్ట్ తో విలన్ల గుండెల్లో దడ పుట్టిస్తూ వచ్చాడా అంటే అదీలేదు. కామెడీగా వచ్చాడు. ఏ విచారమూ లేదు.  

పాత్రల ప్లేస్ మెంట్ తో జరిగిన మరో తప్పిదం- ప్రధాన విలన్ని చివరిదాకా హీరో ముందుకు తేకుండా అనుచరులతోనే పోరాటాలు చూపడం. దీంతో కూడా విసుగెత్తిపోయింది సినిమా. ఆ ప్రధాన విలన్ ఇంటర్వెల్లో నైనా ప్రత్యక్షమయ్యే కమర్షియల్ కథన చాతుర్యం కొరవడ్డం విచిత్రం.

ఒకభారీ బడ్జెట్ సినిమాకి బేసిక్స్ లేని స్క్రిప్టుతో ముందు కెళ్ళడంతో ఎప్పుడో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, విడుదల వాయిదాలు పడ్డం జస్ట్ ఒక ఎక్స్ క్యూజ్ మాత్రమే, అంతే!

- సికిందర్
























23, మే 2014, శుక్రవారం


   రివ్యూ..         

                              సృజనాత్మక నివాళి!
రచన- దర్శకత్వం : విక్రమ్ కె. కుమార్
తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంతా, శ్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ  తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్ - ఛాయాగ్రహణం :  పి ఎస్ వినోద్ - కళ : రాజీవన్ - ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
యాక్షన్ : విజయన్ - నృత్యాలు : బృంద  - సంభాషణలు : హర్షవర్ధన్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్  - నిర్మాతలు : అక్కినేని కుటుంబం
విడుదల :  23 మే, 2014 - సెన్సార్ : U/A
***
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నిండు జీవితం సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అయినట్టు ఆయన నటించిన చివరి చలనచిత్రం సెలెబ్రేషన్ ఆఫ్ న్యూ యేజ్ తెలుగు సినిమా.  ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నవరసాల పనోరమా. ఈ శుక్రవారం నుంచి మల్టీ స్టారర్ సినిమాలకి కొత్తర్ధం చెబుతూ కొత్త శకం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

దర్శకుడు విక్రం కుమార్ ముందుగా ’ఇష్క్’ తో ప్రూవ్ చేసుకున్నాకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద సాహసించి చె య్యేసేందుకు అనుమతి లభించింది. వేసిన చెయ్యి సరాసరి అక్కినేనికి నిజమైన సృజనాత్మక నివాళి అయి నిరూపించుకుంది. ఒక కుటుంబంలోని మూడు తరాలకి చెందిన నల్గురు హీరోలతో కొత్తతరహా కథా సంవిధానంతో కట్టిపడేసే చాతుర్యం ఈ దర్శకుడిది.

మల్టీ స్టారర్ ‘మనం’ వాణిజ్య సినిమాలతో వుండే అన్ని మూఢ విశ్వాసాల్నీ బద్దలు కొడుతూ, మూస పద్ధతుల అన్ని సంకెళ్ళనీ తెంపేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు సినిమా నిరక్షరాశ్యులనే స్థిరపడిన నమ్మకాల్ని, అవకరాల్ని  అపహాస్యం చేస్తూ ఇవాళ బిగ్గెస్టు బాక్సాఫీసు బొనంజా అయికూర్చుంది.

దీని క్రెడిట్ ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జునకి పోతుంది. ‘మనం’ సినిమా చూడకపోతే మనోలోకాల లోతుల సెలెబ్రేషన్ కి మనుషులు దూరమైనట్టేనని లాకులు ఎత్తేసి మరీ చెబుతున్నారు...


వందేళ్ళ ప్రయాణంలో బంధాలు!
1920లో ప్రారంభమై, ప్రస్తుత కాలానికి ఐదారేళ్ళు ముందుకెళ్ళి 2020 లో ముగిసే శతాబ్ద కాలపు ఈ పునర్జన్మల సైకో ఎనాలిసిస్ కథ,  1983లో ప్రారంభమై ఇలా సాగుతుంది... రాధామోహన్ (నాగ చైతన్య), కృష్ణవేణి (సమంత) లు పెళ్ళిచేసుకుని బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు ని కంటారు. నాగేశ్వరరావు ఐదారేళ్ళు వున్నప్పుడు ఇద్దరూ కొట్లాడుకుని విడిపోదామనుకుంటారు. లాయర్ ని కలవడానికి కారులో బయల్దేరినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ముప్పై ఏళ్ల తర్వాత బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు (నాగార్జున) బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగి ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ నడుపుతుంటాడు. ఓరోజు ఫ్లయిట్ లో పక్కసీట్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ని చూసి స్టన్ అవుతాడు. ఈ స్టూడెంట్ నాగార్జున (నాగచైతన్య) అచ్చం తన తండ్రి రాధా మోహన్ లాగే ఉండడంతో తండ్రే మళ్ళీ పుట్టాడని - నాన్నా-  అంటూ దగ్గరవుతాడు. తండ్రే మళ్ళీ పుడితే తల్లికూడా పుట్టే ఉంటుందని ఆమెకోసం వెతుకుతుంటాడు.


ఇంకో బిజినెస్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ గా అచ్చం తన అమ్మలాగే ప్రియ (సమంత) కన్పించడంతో అమ్మా అని పిలుస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఇలా  అమ్మానాన్నలతో  ఇంటరాక్ట్ అవుతూ  గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన వీళ్ళిద్దర్నీ కలిపేదెలా అని లోచిస్తున్నప్పుడు, ఒక యాక్సిడెంట్ కేసులో డాక్టర్ అంజలి(శ్రియ) పరిచయమవుతుంది. ఈమె కోరిక మీద ఆ ప్రమాద  బాధితుడు చైతన్య (అక్కినేని నాగేశ్వర రావు ) కి రక్తదానం చేయడాని నాగేశ్వర్రావు వెళ్ళినప్పుడు,  అక్కడ ఎనభై ఏళ్ల చైతన్య వీళ్ళిద్దర్నీ పూర్వ జన్మలో తన తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్సైట్ అవుతాడు. 1920లలో వీళ్ళిద్దరూ లక్ష్మీ- సీతారాముడులు!

గతజన్మలో ప్రియ, నాగార్జునలు నాగేశ్వరరావు తల్లిదండ్రులైతే, నాగేశ్వర్రావూ అంజలిలు చైతన్య పేరెంట్స్ అన్నమాట. ఆర్టిస్టులుగా చెప్పుకుంటే, నాగ చైతన్య నాగార్జున తండ్రి అయితే, నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు తండ్రి అన్నమాట!

ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సరికొత్త కాన్సెప్ట్, కాంబినేషన్లు. ఇలా సూపర్ స్టార్ల కుటుంబాలతో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ రొటీన్ మూస ఫార్ములా సినిమాలే. కొన్నయితే వాళ్ళ  వంశాలదే గొప్ప అన్న టైపులో ఇగోలకి పోయిన చిత్రీకరణలు. ‘మనం’లో ఈ మూస లేదు, మీసాలు తిప్పడాలూ లేదు. మనమంటూ .. సినిమాచూసే ఆబాలగోపాలాన్నీ తమతో బాటూ కలుపుకుపోయే సమ్మిళిత వినోదాల పంట. ఓ పాత పాటని గుర్తు తెచ్చుకుంటే, ‘రానున్న విందులో నీవంతు అందుకో’ అని ప్రేక్షకుల్ని సమాదరించిన  నిరాడంబరత. అక్షరాలా ప్రేక్షకులు అక్కినేని కుటుంబపు ఈ సెలెబ్రేషన్ లో తామూ పాలుపంచుకుంటున్న ఫీలింగ్ ని పంచిపెట్టిన హ్యూమిలిటీ.

తమిళ-తెలుగు సినిమాల దర్శకుడు విక్రం కుమార్ - మిమ్మల్ని ఇంద్రుల్నీ చంద్రుల్నీ చేసి చూపిస్తానని అక్కినేని హీరోలతో చెప్పివుండొచ్చు. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి వుంటే ఈ సినిమా గురించి ఇవ్వాళ్ళ చెప్పుకోడానికి ఏమీ వుండేది కాదు. ఎన్నో జన్మలు, పునర్జన్మలు –ఏంతో సంక్లిష్టత-అయినా చాలా సింప్లిసిటీ, కన్ఫ్యూజన్ లేని క్రియేటివిటీ, పాత్ర చిత్రణలు, సంభాషణలు. ఇక  సంగీతం, ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, యాక్షన్ కోరియోగ్రఫీ, ఎడిటింగ్  సమస్తం అంతర్జాతీయ ప్రమాణాలకి తీసిపోకుండా  వున్నాయి.

మెలోడ్రామానీ, విషాదాల్నీ చూపించినట్టే చూపించి, కట్ చేసే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ పద్ధతితో గురుదత్ ‘ప్యాసా’ ని తలపించే దర్శకత్వాన్ని చూడొచ్చిక్కడ.

అయితే 1920ల నాటి పల్లె వాతావరణాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ దృశ్యాత్మక విశేషాలకి తగ్గట్టే కాలీన స్పృహ తో సంగీతబాణీలూ ఉండాల్సింది. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘రివాల్వర్ రాణి’లో ఇలాటిదే 1990ల నాటి కాలానికి తగిన బాణీలతో ఓ పాట పెట్టారు. ‘మనం’ లో కూడా సంగీతపరంగా ఆ ఫ్లాష్ బ్యాక్ కి పీరియడ్ ఫీల్ తీసుకు రావొచ్చు- ‘ఆదిత్య -369’ లో ‘జాణవులే’ పాటతో ఇళయరాజా తెచ్చినట్టు. డిజైనర్ పీరియడ్  ఫ్లాష్ బ్యాక్ వల్ల వేరియేషన్ లోపించి కథాకాలాలన్నీ ఒకేలా తయారయ్యాయి.

ఇక నాగార్జున-నాగచైతన్యల బాండింగ్, సమంతాతో నాగార్జున కెమిస్ట్రీ, నాగచైతన్య-సమంతాల కెమిస్ట్రీ/ఫిజిక్సూ, మళ్ళీ నాగార్జున-శ్రియల రెండుజన్మల ‘ఐలవ్యూ అంటే ఇలాఇవ్వు’ రోమాన్స్...మొత్తం వీళ్ళందరితో వయసుమీరిన అక్కినేని నాగేశ్వరరావు రియల్ టైమ్ తక్కుటమారాలూ... ‘ధర్మదాత’ లో ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి-అని కొడుకుల్ని తరిమేసిన వైరాగ్యం నుంచీ ఇప్పుడందరూ వున్న ఏకాకిలా అక్కినేని ఎంతో హుషారు నటన కనబర్చి జోష్ తెప్పించారు. చివర్లో సూపర్ ఇంపోజ్ చేసిన ‘నేను పుట్టాను’ పాట బిట్ తో అల్లరల్లరి!


విడుదలకాని ‘ఆటోనగర్ సూర్య’ ని పట్టుకుని సినిమాలేక త్రిశంకు స్వర్గంలో వున్న నాగచైతన్య బాగా ఇంప్రూవ్ అయి తిరిగొచ్చాడు. వెళ్ళిపోయిన తాతగారి  లెగసీని ముందుకు తీసుకుపోయేందుకు తాతగారికి హామీపడినట్టు నటించాడు. అయితే నటించినవన్నీ-ఒకటిరెండు తప్ప-కామెడీ సీన్లే కావడంతో అతనెంత వరకూ ఆల్ రౌండర్ అవగలడో ఈ సినిమాతో చెప్పడం కష్టం.

సీనియారిటీ కొచ్చిన నాగార్జునకి సీనియర్ శ్రియతో రోమాన్స్ వల్ల ఇబ్బందేం ఏర్పడలేదు. హీరోయిన్ సమంత యూత్ అప్పీల్ కే గాక, పాత్రలో వున్న ‘బరువుబాధ్యతల్ని’ కూడా మోయడానికి సరీగ్గా సరిపోయింది. కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ లు అంత కామెడీ లేని పక్కపాత్రలకి సర్దుకున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానున్న మరో అక్కినేని వంశాంకురం అఖిల్ ల అతిధి పాత్ర ప్రవేశాలతో కలుపుకుని ఈ ‘మనం’ పరిపూర్ణం అయింది.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటంటే, నిజజీవితంలో అక్కినేని హీరోల బంధుత్వాల్ని తిరగేసి చూపించడం! ఇదే లేకపోతే ఈ  పునర్జన్మల కథలకి కొత్తదనమే లేదు. మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలోనే పునరావృత మవుతూ వస్తున్న  అవే పునర్జనల కథలకి ఇది అనూహ్యమైన టర్నింగ్ పాయింట్. వంశంలో మూడు నాలుగు తరాల హీరోలు ఉంటేతప్ప సాధ్యంకాని అపూర్వ  ప్రయోగం.

అయితే సమస్యల్లా ఓ నూరేళ్ళ సుదీర్ఘ కాలపు కథ చెప్పాల్సి రావడం. దీన్ని ఎక్కడ ప్రారంభించి, ఏ ఏ మజిలీలు దాటించి, గమ్యానికి చేర్చాలి?

ఇలాటి సందేహమే వరల్డ్ క్లాసిక్ ‘గాంధీ’ (1982) తీసిన దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకీ వచ్చిందని సిడ్ ఫీల్డ్ పేర్కొంటాడు ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న పుస్తకంలో. శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ మహావృక్షంలాంటి మహాత్ముడి జీవితాన్ని సినిమా కథగా  ఎలా రూపొందించాలి? మహాత్ముడి జీవితంలో అన్ని ఘట్టాలనీ చూపించుకు రాలేం. అప్పుడది డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివిటీ తో పనుండదు. అందుకని అటెన్ బరో శల్యపరిక్ష జరిపి మహాత్ముడి జీవితంలో మూడే ఘట్టాలు స్క్రీన్ ప్లేకి బలమైన ఫౌండేషన్స్ కాగలవని నిర్ణయించాడు. అవి 1. దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా పోరాట జీవితం, 2. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమం, 3. హిందూ ముస్లిముల సమస్య. ముగింపుగా హత్య!

ఈ మూడింటి ఆధారంగానే  సంఘర్షణాత్మక కథ అల్లి,  తెరమీద మహాత్మాగాంధీ జీవిత చరిత్రకి సమగ్రత సాధించాడు అటెన్ బరో. సిడ్ ఫీల్డ్  చేసిన ఈ విశ్లేషణ ప్రకారమే చూస్తే,  2007లో అబ్బాస్ ఖాన్ తీసిన ‘గాంధీ మై ఫాదర్’ సినిమాకీ ఇదే స్క్రీన్ ప్లే ఫౌండేషన్ కన్పిస్తుంది. గాంధీ కుమారుడి యాభై ఏళ్ల జీవితకాలాన్ని అటెన్ బరో ఫార్ములా ననుసరించే చిత్రించినట్టు మనకర్ధమౌతుంది.
2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్  ‘హ్యాపీ డేస్’ స్క్రీన్ ప్లే కీ ఇదే అటెన్ బరో ఫౌండేషన్ కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళు  హ్యాపీ గా గడిచిపోయే అనుభవాల సారంగా ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ అనుభవాల్లో వేటిని తీసుకుని కథ తయారుచేయాలి? అనుభవాలు కలగాపులంగా వుంటాయి. వ్యక్తిగత, కాలేజీ గత, ప్రాపంచిక...ఇలా విభిన్న పార్శ్వాలుగా  అనుభవాలు కలగలిసిపోయి వుంటాయి. గాంధీ జీవిత కథ  లాంటి సమస్యే ఇక్కడ కూడా. కాకపొతే టైంలైన్ తక్కువ. అప్పుడు 1. కాలేజీలో కొత్త విద్యార్థుల ర్యాగింగ్, 2. చదువుల్లో ఎదురయ్యే సమస్యలు, 3.  ప్రేమల గురించి స్ట్రగుల్- అనే మూడు బ్లాకులుగా నాల్గేళ్ళ  టైంలైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని మాత్రమే పొందుపర్చడంతో స్క్రీన్ ప్లేకి అంత బలం చేకూరింది.

 ‘మనం’ లో నూరేళ్ళ  టైం లైన్ని చూసినప్పుడు ఇందులో మూడు జీవిత కాలాలు ఇమిడివున్నాయి.  1. నాగార్జున-శ్రియ ల పూర్వజన్మ జీవితకాలం, 2. నాగ చైతన్య- సమంతల పూర్వజన్మ జీవితకాలం, 3. తిరిగి అక్కినేని నగెశ్వర రావుని కలుపుకుంటూ, ఈ రెండు జంటల వర్తమాన జీవితకాలం. వీటిన్నిటినీ కలిపి ఓ కథగా చెప్పాలంటే ఈ జీవితకాలాల్లో ఏ ఏ ఘట్టాల్ని ప్రధానంగా తీసుకోవాలి?

ఈ కథ ఆదిమధ్యంతాలన్నిటా (గత జన్మల్లో, ఇప్పుడూ) ఓకే సంఘటన పునరావృతమవుతూంటుంది. అది మోటారు వాహన ప్రమాద సంఘటన. దీంతో చావుపుట్టుకల చక్రభ్రమణంలో పడి పాత్రలు నలుగుతూంటాయి. చావకపోతే పునర్జన్మ లేదుకాబట్టి వేర్వేరు కాలాల్లో రెండు జంటల చావులు చూపించక తప్పదు. మళ్ళీ పునర్జన్మల్లో వాళ్ళకి పుట్టిన పిల్లలతో కనెక్ట్ చేయకా తప్పదు. ఇలా కథా పథకం డిసైడ్ అయితే వాటికి  తగ్గ ఘట్టాల్ని  ఎంపిక చేసుకోవడం సులభమే.

1. నాగచైతన్య-సమంతల ప్రేమా పెళ్ళీ, రోడ్డు ప్రమాదంలో మరణం, వాళ్ళ కొడుకుగా నాగార్జున మిగలడం, 2. నాగార్జున- శ్రియల ప్రేమాపెళ్ళీ, రోడ్డుప్రమాదంలో మరణం, వీళ్ళ కొడుకుగా అక్కినేని నాగేశ్వర రావు మిగలడం, 3. మొత్తం అందరూ కలిసి వర్తమానకాలంలో మళ్ళీ రోడ్డు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం!

ఐతే కథ ఎక్కడ్నుంచీ ప్రారంభించాలి? 1920లలో నాగార్జున- శ్రియల కథ దగ్గర్నుంచా? ఇలాటి పని అటెన్ బరో కూడా చేయలేదు. అటెన్ బరో 1948లో గాంధీ హత్యతో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి గాంధీ కథ మొదట్నుంచీ చెప్పుకొస్తాడు. అలాగని మరీ గాంధీ ప్రారంభ దినాల జోలికి పోకుండా, 55 ఏళ్ల క్రితం 1893లో 24 ఏళ్ల యువలాయర్ గా వున్నప్పుడు, దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారంతో అతణ్ణి రైల్లోంచి తోసేసే- అతడి జీవితాన్ని సమూలంగా మలుపుతిప్పేసే - సంఘటనతో ప్రారంభిస్తాడు.

ఎందుకిలా చేశాడంటే, పాశ్చాత్య స్క్రీన్ ప్లేలని సశాస్త్రీయంగా రచించు కుంటారు కాబట్టి. సొంత నమ్మకాలతో ఏదో బుద్ధికి ఎంత తోస్తే అంత రాసుకునే  మనబోటి వాళ్ళం రచిస్తే, భలే సెంటిమెంటల్ గా ఉంటుందని, గాంధీ బాల్యజీవితం దగ్గర్నుంచీ ఎత్తుకుని అవతలివాడికి తెగ బోరు కొట్టిస్తూ, మనం తెగ సంతృప్తి చెంది తరిస్తాం!
శాస్త్రీయంగా ఓ కథ అనుకోవాలంటే,  ముందుగా ప్లాట్ పాయిట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్-2 లని గుర్తించి, వాటినాధారంగా చేసుకుని ఆలోచించకపోతే, సినిమా కథ సవ్యంగా రానట్టే!

అందుకే, మొదటి అంకం అంతంలో ప్లాట్ పాయింట్- 1 కి దారి తీసేందుకు పనికొచ్చే, కథని మలుపు తిప్పే ‘రైలు సంఘటన’ గాంధీ జీవితంలో ఉందని గుర్తించిన అటెన్ బరో- దాంతోనే కథని (మొదటి అంకాన్ని) ప్రారంభించాడన్న మాట సశాస్త్రీయంగా!

‘మనం’ లో కూడా మరీ 1920 ల దాకా వెనక్కెళ్ళ కుండా, మధ్యస్తంగా 1983 లో,  నాగచైతన్య 23 ఏళ్ల కుర్రాడిగా వున్నప్పట్నుంచే  కథ నెత్తుకున్నాడు దర్శకుడు. యువ పాత్రలతో కథ ప్రారంభించడం బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది కాబట్టి ‘గాంధీ’ లో ఫాలో అయినట్టే  ‘మనం’ లోనూ ఫాలో అయ్యారు.

contd...