రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Friday, May 23, 2014


   రివ్యూ..         

                              సృజనాత్మక నివాళి!
రచన- దర్శకత్వం : విక్రమ్ కె. కుమార్
తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంతా, శ్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ  తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్ - ఛాయాగ్రహణం :  పి ఎస్ వినోద్ - కళ : రాజీవన్ - ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
యాక్షన్ : విజయన్ - నృత్యాలు : బృంద  - సంభాషణలు : హర్షవర్ధన్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్  - నిర్మాతలు : అక్కినేని కుటుంబం
విడుదల :  23 మే, 2014 - సెన్సార్ : U/A
***
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నిండు జీవితం సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అయినట్టు ఆయన నటించిన చివరి చలనచిత్రం సెలెబ్రేషన్ ఆఫ్ న్యూ యేజ్ తెలుగు సినిమా.  ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నవరసాల పనోరమా. ఈ శుక్రవారం నుంచి మల్టీ స్టారర్ సినిమాలకి కొత్తర్ధం చెబుతూ కొత్త శకం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

దర్శకుడు విక్రం కుమార్ ముందుగా ’ఇష్క్’ తో ప్రూవ్ చేసుకున్నాకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద సాహసించి చె య్యేసేందుకు అనుమతి లభించింది. వేసిన చెయ్యి సరాసరి అక్కినేనికి నిజమైన సృజనాత్మక నివాళి అయి నిరూపించుకుంది. ఒక కుటుంబంలోని మూడు తరాలకి చెందిన నల్గురు హీరోలతో కొత్తతరహా కథా సంవిధానంతో కట్టిపడేసే చాతుర్యం ఈ దర్శకుడిది.

మల్టీ స్టారర్ ‘మనం’ వాణిజ్య సినిమాలతో వుండే అన్ని మూఢ విశ్వాసాల్నీ బద్దలు కొడుతూ, మూస పద్ధతుల అన్ని సంకెళ్ళనీ తెంపేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు సినిమా నిరక్షరాశ్యులనే స్థిరపడిన నమ్మకాల్ని, అవకరాల్ని  అపహాస్యం చేస్తూ ఇవాళ బిగ్గెస్టు బాక్సాఫీసు బొనంజా అయికూర్చుంది.

దీని క్రెడిట్ ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జునకి పోతుంది. ‘మనం’ సినిమా చూడకపోతే మనోలోకాల లోతుల సెలెబ్రేషన్ కి మనుషులు దూరమైనట్టేనని లాకులు ఎత్తేసి మరీ చెబుతున్నారు...


వందేళ్ళ ప్రయాణంలో బంధాలు!
1920లో ప్రారంభమై, ప్రస్తుత కాలానికి ఐదారేళ్ళు ముందుకెళ్ళి 2020 లో ముగిసే శతాబ్ద కాలపు ఈ పునర్జన్మల సైకో ఎనాలిసిస్ కథ,  1983లో ప్రారంభమై ఇలా సాగుతుంది... రాధామోహన్ (నాగ చైతన్య), కృష్ణవేణి (సమంత) లు పెళ్ళిచేసుకుని బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు ని కంటారు. నాగేశ్వరరావు ఐదారేళ్ళు వున్నప్పుడు ఇద్దరూ కొట్లాడుకుని విడిపోదామనుకుంటారు. లాయర్ ని కలవడానికి కారులో బయల్దేరినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ముప్పై ఏళ్ల తర్వాత బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు (నాగార్జున) బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగి ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ నడుపుతుంటాడు. ఓరోజు ఫ్లయిట్ లో పక్కసీట్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ని చూసి స్టన్ అవుతాడు. ఈ స్టూడెంట్ నాగార్జున (నాగచైతన్య) అచ్చం తన తండ్రి రాధా మోహన్ లాగే ఉండడంతో తండ్రే మళ్ళీ పుట్టాడని - నాన్నా-  అంటూ దగ్గరవుతాడు. తండ్రే మళ్ళీ పుడితే తల్లికూడా పుట్టే ఉంటుందని ఆమెకోసం వెతుకుతుంటాడు.


ఇంకో బిజినెస్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ గా అచ్చం తన అమ్మలాగే ప్రియ (సమంత) కన్పించడంతో అమ్మా అని పిలుస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఇలా  అమ్మానాన్నలతో  ఇంటరాక్ట్ అవుతూ  గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన వీళ్ళిద్దర్నీ కలిపేదెలా అని లోచిస్తున్నప్పుడు, ఒక యాక్సిడెంట్ కేసులో డాక్టర్ అంజలి(శ్రియ) పరిచయమవుతుంది. ఈమె కోరిక మీద ఆ ప్రమాద  బాధితుడు చైతన్య (అక్కినేని నాగేశ్వర రావు ) కి రక్తదానం చేయడాని నాగేశ్వర్రావు వెళ్ళినప్పుడు,  అక్కడ ఎనభై ఏళ్ల చైతన్య వీళ్ళిద్దర్నీ పూర్వ జన్మలో తన తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్సైట్ అవుతాడు. 1920లలో వీళ్ళిద్దరూ లక్ష్మీ- సీతారాముడులు!

గతజన్మలో ప్రియ, నాగార్జునలు నాగేశ్వరరావు తల్లిదండ్రులైతే, నాగేశ్వర్రావూ అంజలిలు చైతన్య పేరెంట్స్ అన్నమాట. ఆర్టిస్టులుగా చెప్పుకుంటే, నాగ చైతన్య నాగార్జున తండ్రి అయితే, నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు తండ్రి అన్నమాట!

ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సరికొత్త కాన్సెప్ట్, కాంబినేషన్లు. ఇలా సూపర్ స్టార్ల కుటుంబాలతో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ రొటీన్ మూస ఫార్ములా సినిమాలే. కొన్నయితే వాళ్ళ  వంశాలదే గొప్ప అన్న టైపులో ఇగోలకి పోయిన చిత్రీకరణలు. ‘మనం’లో ఈ మూస లేదు, మీసాలు తిప్పడాలూ లేదు. మనమంటూ .. సినిమాచూసే ఆబాలగోపాలాన్నీ తమతో బాటూ కలుపుకుపోయే సమ్మిళిత వినోదాల పంట. ఓ పాత పాటని గుర్తు తెచ్చుకుంటే, ‘రానున్న విందులో నీవంతు అందుకో’ అని ప్రేక్షకుల్ని సమాదరించిన  నిరాడంబరత. అక్షరాలా ప్రేక్షకులు అక్కినేని కుటుంబపు ఈ సెలెబ్రేషన్ లో తామూ పాలుపంచుకుంటున్న ఫీలింగ్ ని పంచిపెట్టిన హ్యూమిలిటీ.

తమిళ-తెలుగు సినిమాల దర్శకుడు విక్రం కుమార్ - మిమ్మల్ని ఇంద్రుల్నీ చంద్రుల్నీ చేసి చూపిస్తానని అక్కినేని హీరోలతో చెప్పివుండొచ్చు. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి వుంటే ఈ సినిమా గురించి ఇవ్వాళ్ళ చెప్పుకోడానికి ఏమీ వుండేది కాదు. ఎన్నో జన్మలు, పునర్జన్మలు –ఏంతో సంక్లిష్టత-అయినా చాలా సింప్లిసిటీ, కన్ఫ్యూజన్ లేని క్రియేటివిటీ, పాత్ర చిత్రణలు, సంభాషణలు. ఇక  సంగీతం, ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, యాక్షన్ కోరియోగ్రఫీ, ఎడిటింగ్  సమస్తం అంతర్జాతీయ ప్రమాణాలకి తీసిపోకుండా  వున్నాయి.

మెలోడ్రామానీ, విషాదాల్నీ చూపించినట్టే చూపించి, కట్ చేసే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ పద్ధతితో గురుదత్ ‘ప్యాసా’ ని తలపించే దర్శకత్వాన్ని చూడొచ్చిక్కడ.

అయితే 1920ల నాటి పల్లె వాతావరణాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ దృశ్యాత్మక విశేషాలకి తగ్గట్టే కాలీన స్పృహ తో సంగీతబాణీలూ ఉండాల్సింది. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘రివాల్వర్ రాణి’లో ఇలాటిదే 1990ల నాటి కాలానికి తగిన బాణీలతో ఓ పాట పెట్టారు. ‘మనం’ లో కూడా సంగీతపరంగా ఆ ఫ్లాష్ బ్యాక్ కి పీరియడ్ ఫీల్ తీసుకు రావొచ్చు- ‘ఆదిత్య -369’ లో ‘జాణవులే’ పాటతో ఇళయరాజా తెచ్చినట్టు. డిజైనర్ పీరియడ్  ఫ్లాష్ బ్యాక్ వల్ల వేరియేషన్ లోపించి కథాకాలాలన్నీ ఒకేలా తయారయ్యాయి.

ఇక నాగార్జున-నాగచైతన్యల బాండింగ్, సమంతాతో నాగార్జున కెమిస్ట్రీ, నాగచైతన్య-సమంతాల కెమిస్ట్రీ/ఫిజిక్సూ, మళ్ళీ నాగార్జున-శ్రియల రెండుజన్మల ‘ఐలవ్యూ అంటే ఇలాఇవ్వు’ రోమాన్స్...మొత్తం వీళ్ళందరితో వయసుమీరిన అక్కినేని నాగేశ్వరరావు రియల్ టైమ్ తక్కుటమారాలూ... ‘ధర్మదాత’ లో ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి-అని కొడుకుల్ని తరిమేసిన వైరాగ్యం నుంచీ ఇప్పుడందరూ వున్న ఏకాకిలా అక్కినేని ఎంతో హుషారు నటన కనబర్చి జోష్ తెప్పించారు. చివర్లో సూపర్ ఇంపోజ్ చేసిన ‘నేను పుట్టాను’ పాట బిట్ తో అల్లరల్లరి!


విడుదలకాని ‘ఆటోనగర్ సూర్య’ ని పట్టుకుని సినిమాలేక త్రిశంకు స్వర్గంలో వున్న నాగచైతన్య బాగా ఇంప్రూవ్ అయి తిరిగొచ్చాడు. వెళ్ళిపోయిన తాతగారి  లెగసీని ముందుకు తీసుకుపోయేందుకు తాతగారికి హామీపడినట్టు నటించాడు. అయితే నటించినవన్నీ-ఒకటిరెండు తప్ప-కామెడీ సీన్లే కావడంతో అతనెంత వరకూ ఆల్ రౌండర్ అవగలడో ఈ సినిమాతో చెప్పడం కష్టం.

సీనియారిటీ కొచ్చిన నాగార్జునకి సీనియర్ శ్రియతో రోమాన్స్ వల్ల ఇబ్బందేం ఏర్పడలేదు. హీరోయిన్ సమంత యూత్ అప్పీల్ కే గాక, పాత్రలో వున్న ‘బరువుబాధ్యతల్ని’ కూడా మోయడానికి సరీగ్గా సరిపోయింది. కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ లు అంత కామెడీ లేని పక్కపాత్రలకి సర్దుకున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానున్న మరో అక్కినేని వంశాంకురం అఖిల్ ల అతిధి పాత్ర ప్రవేశాలతో కలుపుకుని ఈ ‘మనం’ పరిపూర్ణం అయింది.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటంటే, నిజజీవితంలో అక్కినేని హీరోల బంధుత్వాల్ని తిరగేసి చూపించడం! ఇదే లేకపోతే ఈ  పునర్జన్మల కథలకి కొత్తదనమే లేదు. మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలోనే పునరావృత మవుతూ వస్తున్న  అవే పునర్జనల కథలకి ఇది అనూహ్యమైన టర్నింగ్ పాయింట్. వంశంలో మూడు నాలుగు తరాల హీరోలు ఉంటేతప్ప సాధ్యంకాని అపూర్వ  ప్రయోగం.

అయితే సమస్యల్లా ఓ నూరేళ్ళ సుదీర్ఘ కాలపు కథ చెప్పాల్సి రావడం. దీన్ని ఎక్కడ ప్రారంభించి, ఏ ఏ మజిలీలు దాటించి, గమ్యానికి చేర్చాలి?

ఇలాటి సందేహమే వరల్డ్ క్లాసిక్ ‘గాంధీ’ (1982) తీసిన దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకీ వచ్చిందని సిడ్ ఫీల్డ్ పేర్కొంటాడు ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న పుస్తకంలో. శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ మహావృక్షంలాంటి మహాత్ముడి జీవితాన్ని సినిమా కథగా  ఎలా రూపొందించాలి? మహాత్ముడి జీవితంలో అన్ని ఘట్టాలనీ చూపించుకు రాలేం. అప్పుడది డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివిటీ తో పనుండదు. అందుకని అటెన్ బరో శల్యపరిక్ష జరిపి మహాత్ముడి జీవితంలో మూడే ఘట్టాలు స్క్రీన్ ప్లేకి బలమైన ఫౌండేషన్స్ కాగలవని నిర్ణయించాడు. అవి 1. దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా పోరాట జీవితం, 2. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమం, 3. హిందూ ముస్లిముల సమస్య. ముగింపుగా హత్య!

ఈ మూడింటి ఆధారంగానే  సంఘర్షణాత్మక కథ అల్లి,  తెరమీద మహాత్మాగాంధీ జీవిత చరిత్రకి సమగ్రత సాధించాడు అటెన్ బరో. సిడ్ ఫీల్డ్  చేసిన ఈ విశ్లేషణ ప్రకారమే చూస్తే,  2007లో అబ్బాస్ ఖాన్ తీసిన ‘గాంధీ మై ఫాదర్’ సినిమాకీ ఇదే స్క్రీన్ ప్లే ఫౌండేషన్ కన్పిస్తుంది. గాంధీ కుమారుడి యాభై ఏళ్ల జీవితకాలాన్ని అటెన్ బరో ఫార్ములా ననుసరించే చిత్రించినట్టు మనకర్ధమౌతుంది.
2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్  ‘హ్యాపీ డేస్’ స్క్రీన్ ప్లే కీ ఇదే అటెన్ బరో ఫౌండేషన్ కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళు  హ్యాపీ గా గడిచిపోయే అనుభవాల సారంగా ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ అనుభవాల్లో వేటిని తీసుకుని కథ తయారుచేయాలి? అనుభవాలు కలగాపులంగా వుంటాయి. వ్యక్తిగత, కాలేజీ గత, ప్రాపంచిక...ఇలా విభిన్న పార్శ్వాలుగా  అనుభవాలు కలగలిసిపోయి వుంటాయి. గాంధీ జీవిత కథ  లాంటి సమస్యే ఇక్కడ కూడా. కాకపొతే టైంలైన్ తక్కువ. అప్పుడు 1. కాలేజీలో కొత్త విద్యార్థుల ర్యాగింగ్, 2. చదువుల్లో ఎదురయ్యే సమస్యలు, 3.  ప్రేమల గురించి స్ట్రగుల్- అనే మూడు బ్లాకులుగా నాల్గేళ్ళ  టైంలైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని మాత్రమే పొందుపర్చడంతో స్క్రీన్ ప్లేకి అంత బలం చేకూరింది.

 ‘మనం’ లో నూరేళ్ళ  టైం లైన్ని చూసినప్పుడు ఇందులో మూడు జీవిత కాలాలు ఇమిడివున్నాయి.  1. నాగార్జున-శ్రియ ల పూర్వజన్మ జీవితకాలం, 2. నాగ చైతన్య- సమంతల పూర్వజన్మ జీవితకాలం, 3. తిరిగి అక్కినేని నగెశ్వర రావుని కలుపుకుంటూ, ఈ రెండు జంటల వర్తమాన జీవితకాలం. వీటిన్నిటినీ కలిపి ఓ కథగా చెప్పాలంటే ఈ జీవితకాలాల్లో ఏ ఏ ఘట్టాల్ని ప్రధానంగా తీసుకోవాలి?

ఈ కథ ఆదిమధ్యంతాలన్నిటా (గత జన్మల్లో, ఇప్పుడూ) ఓకే సంఘటన పునరావృతమవుతూంటుంది. అది మోటారు వాహన ప్రమాద సంఘటన. దీంతో చావుపుట్టుకల చక్రభ్రమణంలో పడి పాత్రలు నలుగుతూంటాయి. చావకపోతే పునర్జన్మ లేదుకాబట్టి వేర్వేరు కాలాల్లో రెండు జంటల చావులు చూపించక తప్పదు. మళ్ళీ పునర్జన్మల్లో వాళ్ళకి పుట్టిన పిల్లలతో కనెక్ట్ చేయకా తప్పదు. ఇలా కథా పథకం డిసైడ్ అయితే వాటికి  తగ్గ ఘట్టాల్ని  ఎంపిక చేసుకోవడం సులభమే.

1. నాగచైతన్య-సమంతల ప్రేమా పెళ్ళీ, రోడ్డు ప్రమాదంలో మరణం, వాళ్ళ కొడుకుగా నాగార్జున మిగలడం, 2. నాగార్జున- శ్రియల ప్రేమాపెళ్ళీ, రోడ్డుప్రమాదంలో మరణం, వీళ్ళ కొడుకుగా అక్కినేని నాగేశ్వర రావు మిగలడం, 3. మొత్తం అందరూ కలిసి వర్తమానకాలంలో మళ్ళీ రోడ్డు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం!

ఐతే కథ ఎక్కడ్నుంచీ ప్రారంభించాలి? 1920లలో నాగార్జున- శ్రియల కథ దగ్గర్నుంచా? ఇలాటి పని అటెన్ బరో కూడా చేయలేదు. అటెన్ బరో 1948లో గాంధీ హత్యతో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి గాంధీ కథ మొదట్నుంచీ చెప్పుకొస్తాడు. అలాగని మరీ గాంధీ ప్రారంభ దినాల జోలికి పోకుండా, 55 ఏళ్ల క్రితం 1893లో 24 ఏళ్ల యువలాయర్ గా వున్నప్పుడు, దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారంతో అతణ్ణి రైల్లోంచి తోసేసే- అతడి జీవితాన్ని సమూలంగా మలుపుతిప్పేసే - సంఘటనతో ప్రారంభిస్తాడు.

ఎందుకిలా చేశాడంటే, పాశ్చాత్య స్క్రీన్ ప్లేలని సశాస్త్రీయంగా రచించు కుంటారు కాబట్టి. సొంత నమ్మకాలతో ఏదో బుద్ధికి ఎంత తోస్తే అంత రాసుకునే  మనబోటి వాళ్ళం రచిస్తే, భలే సెంటిమెంటల్ గా ఉంటుందని, గాంధీ బాల్యజీవితం దగ్గర్నుంచీ ఎత్తుకుని అవతలివాడికి తెగ బోరు కొట్టిస్తూ, మనం తెగ సంతృప్తి చెంది తరిస్తాం!
శాస్త్రీయంగా ఓ కథ అనుకోవాలంటే,  ముందుగా ప్లాట్ పాయిట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్-2 లని గుర్తించి, వాటినాధారంగా చేసుకుని ఆలోచించకపోతే, సినిమా కథ సవ్యంగా రానట్టే!

అందుకే, మొదటి అంకం అంతంలో ప్లాట్ పాయింట్- 1 కి దారి తీసేందుకు పనికొచ్చే, కథని మలుపు తిప్పే ‘రైలు సంఘటన’ గాంధీ జీవితంలో ఉందని గుర్తించిన అటెన్ బరో- దాంతోనే కథని (మొదటి అంకాన్ని) ప్రారంభించాడన్న మాట సశాస్త్రీయంగా!

‘మనం’ లో కూడా మరీ 1920 ల దాకా వెనక్కెళ్ళ కుండా, మధ్యస్తంగా 1983 లో,  నాగచైతన్య 23 ఏళ్ల కుర్రాడిగా వున్నప్పట్నుంచే  కథ నెత్తుకున్నాడు దర్శకుడు. యువ పాత్రలతో కథ ప్రారంభించడం బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది కాబట్టి ‘గాంధీ’ లో ఫాలో అయినట్టే  ‘మనం’ లోనూ ఫాలో అయ్యారు.

contd...
No comments: