రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 23, 2014





ప్రకటనేసుకుని పొగత్రాగొచ్చు!


సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టూ...పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలి మెట్టూ!’...అన్నాడు తెలుగు సినీకవి.  ‘మై జిందగీకా సాథ్ నిభాతా చలాగయా...హర్ ఫిక్ర్ కో ధువేమే ఉఢాతా చలాగయా’ (జీవితం ఎలా సాగితే అలా సాగిపోతున్నా- వర్రీస్ ని పొగలో ఊది పారేస్తున్నా! ) అన్నాడింకో  హిందీ సినీ కవి. నిన్నమొన్న కాదు, ఎప్పుడో రెండుతరాల క్రితం అర్ధ శతాబ్దం కూడా దాటిపోయిన ...ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో... ఇంటిల్లిపాదీ ఈ సినిమాలకెళ్ళి ఎంజాయ్ చేసిన ఈ సిగరెట్ పాటలు, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిల్చిపోయి, ఇప్పటికీ సిగరెట్ పాటలన గానే ఇవే గుర్తొచ్చేట్టు మనోఫలకాల మీద ముద్రించుకు పోయాయి!

‘రాముడు-భీముడు’లో రేలంగి- గిరిజలు  జంటగా,  ’హమ్ దోనో’ లో దేవానంద్ సోలోగా వెలింగించిన ఈ పాటలు కామెడీ ఒకటైతే, ఫిలాసఫీ మరొకటిగా ఉత్త కాలక్షేప సాహిత్యంగా గాక, జీవితసత్యాలకి దర్పణం పట్టాయి.
ఆ తర్వాత సినిమాల్లో సిగరెట్ తాగడం స్టయిల్ స్టేట్ మెంట్ కింద మారిపోయి కాస్త వన్నె తగ్గుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ని  పైకెగరేసి నోటకరిచే ట్రిక్కుగా కమర్షియల్ గా  ఎంత పండిందో, ఆయన్ని అనుకరిస్తూ అటు హిందీలోనూ శత్రుఘ్న సిన్హా అదే ట్రిక్ ని కాపీ కొడితే అంతగానూ పేలింది. దుర్వ్యసనాలతో ఈ పాటలేంటి, హీరోయిజాలేంటీ అని ఎవరూ చీదరించుకోలేదు.

చీదరించుకోవడం ఎప్పట్నుంచీ మొదలయ్యిందంటే,  ఈ శతాబ్దం ఆరంభంనుంచీ అప్పుడున్న హీరోల మార్కెట్ తగ్గుతూ, కొత్త కొత్త కుర్ర హీరోల రాకతో,  వాళ్ళు పోషించే ఆకతాయి స్టూడెంట్స్ పాత్రలు ఎడాపెడా సిగరెట్లూ మద్యం లాగించేసే సీన్లతో నిండిపోవడం ప్రారంభమై నప్పట్నుంచీ!

అప్పుడు 2005లో గత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరచింది. సినిమాల్లో ధూమపానాన్నిపూర్తిగా  నిషేధించింది. 2003లోనే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణా చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో  సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించింది. 2004 లో ఇతర అన్ని ప్రసార-ప్రచార మాధ్యమాల్లోనూ ప్రకటనలపై నిషేధం విధించింది. అప్పుడు 2005లో సినిమాలపై దృష్టి సారించింది. నవతరం సినిమాలతో పొగాకు ఉత్పత్తులు దొడ్డిదారిన విచ్చలవిడిగా ప్రచారమవుతున్నాయని గుర్తించి- సినిమాలతో పాటు టీవీ సీరియళ్ళలోనూ ఏ పాత్రా పొగాకు ఉత్పత్తుల్ని వాడుతున్నట్టు చూపించరాదని  నిషేధం విధించింది. పాత సినిమాలు ప్రదర్శించాల్సి వస్తే ముందుగా హెచ్చరిక వేయాలని  ఆదేశించింది గత ప్రభుత్వంలోని కేంద్ర ఆరోగ్య శాఖ.

ఐతే ఈ ఆదేశాల్ని అమలుపర్చాల్సింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఈ శాఖ పై ఆదేశాల్ని పరిశీలించి కొంత సడలింపు నిస్తూ సృజనాత్మక స్వేచ్ఛ ని కాపాడాలని నిర్ణయించి, ధూమపాన  దృశ్యాలు తప్పని  సరయితే ఆ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీచేయాలని కేంద్రీయ సెన్సార్ బోర్డుకి  సూచించింది. అంతే గాక సినిమాల్లో  పొగత్రాగిన నటుడి చేత సినిమా ప్రారంభంలో పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరమనే  ప్రకటన  ఇప్పించాలనీ, ఆ దృశ్యాల కిందిభాగంలో  కూడా ఇదే హెచ్చరిక స్క్రోలింగ్ వేయాలనీ ఉత్తర్వు లిచ్చింది.

దీనిపై ప్రముఖ హిందీ నిర్మాత మహేష్ భట్  ఢిల్ల్లీ హై కోర్టుని ఆశ్రయించారు. 2009 లో ఢిల్ల్లీ హై కోర్టు ధూమపానం పై సెన్సార్ ఆంక్షల్ని కొట్టి వేసింది. అయినప్పటికీ, ప్రజారోగ్య పరిరక్షణకు రాజ్యాంగం ప్రకారం ఓ పరిధిలో చర్యలు తీసుకునే వెసులుబాటు వుందని వాదిస్తూ,  కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరం సుప్రీం కోర్టు కెళ్ళింది. సుప్రీం కోర్టు ఢిల్ల్లీ  హైకోర్టు ఆదేశాల్ని కొట్టి వేసింది. అప్పట్నుంచీ 2011 వరకూ కేంద్ర ప్రభుత్వం ఇటు తనకూ, అటు సినిమా రంగానికీ అనుకూలంగా  వుండే సవరణల్ని ప్రతిపాదించడానికి  ఆలోచిస్తూ వుండి  పోయింది. అప్పుడు అదే సంవత్సరం నవంబర్ 14 నుంచి అమలయ్యేలా కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది.

2011 అక్టోబర్ 27న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...

1. ధూమపానం చేసే దృశ్యాలున్న సినిమాలకి ఏ/యూఏ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలి , 2. ధూమపానం చేసిన నటుడి వాయిసోవర్ తో, సినిమా ప్రారంభం లోనూ మళ్ళీ విశ్రాంతి తర్వాతా 20సెకన్ల నిడివితో డిస్ క్లెయిమర్ వేయాలి, 3. ధూమ పానం చేస్తున్న దృశ్యాల మీద పొగత్రాగడం ప్రాణాలకు హానికరం అన్న స్క్రోలింగ్ వేయాలి, 4. ఈ నోటిఫికేషన్ అమలయ్యే తేదీ, 2011 నవంబర్ 14 నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘న్యూ ఫిలిమ్స్’ వర్గీకరణతో సర్టిఫై చేయాలి, 6. ఇవన్నీ అమలయ్యాయా లేదా చూసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి ఒకరు సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ లో పాల్గొనాలి, 7. ఈ నోటిఫికేషన్ కంటే ముందున్న ‘పాత’ సినిమాలకి సంబంధించి సదరు ప్రదర్శనాశాల నిర్వాహకుడు 30సెకన్ల పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక హెల్త్ స్పాట్ ని సినిమా ప్రారంభ్నికి ముందు ప్రదర్శించాలి, 8. హలీవుడ్/వరల్డ్ సినిమాలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు వుంటుంది, ఎందుకంటే అవి దిగుమతైన సినిమాలు కాబట్టి...

ఈ చట్టం ఈ రూపం తీసుకోవడానికి ఆరేళ్ళు పట్టింది. 2005 లోనే ఈ చట్ట సవరణకి  బీజం వేసినప్పటికీ, భారతీయ సినిమాల్లో  పొగత్రాగే దృశ్యాల ప్రభావం పై 2003లోనే హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని ప్రకారం భారతదేశం ప్రతియేటా 8 కంటే ఎక్కువ  భాషల్లో 900 సినిమాలని ఉత్పత్తి చేస్తోంది. ఈ సినిమాలు పాతిక కోట్ల యువతని ఆకర్షిస్తున్నాయి.  వీటిలో 76% సినిమాలు పొగత్రాగే దృశ్యాలతో నిండి ఉంటున్నాయి. పొగత్రాగే అలవాటున్న యువతలో 52% మంది సినిమాల్లో చూసే నేర్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2500 మంది పొగాకు ఉత్పత్తుల సేవనం కారణంగా చనిపోతున్నారు. సిగరెట్లు, గుట్కా, బీడీల వంటివి ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. టీనేజిలో వుండే ప్రేక్షకులు తమ అభిమాన తార తెరమీద తరచూ పొగత్రాగడం చూసి ప్రభావితం అయ్యే అవకాశాలు పదహారు రెట్ల కంటే ఎక్కువే వుంటుంది.  హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాల్లోనూ పొగత్రాగే దృశ్యాల సరళి ప్రమాదకర పోకడలకి పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈనేపధ్యంలో సినిమాల్లో ఈ పోకడల్ని అరికట్టే విధాన నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని వివిధ దేశాలకు సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మరో అధ్యయన సంస్థ ప్రకారం పొగత్రాగే వారి శాతం 1991లో 13% వుంటే, 2002 లో అది 52 శాతానికి పెరిగింది. హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాలూ స్మోకింగ్ ని క్యాజువల్ చర్యగా చూపిస్తున్నాయి. అలాగే ఇళ్లల్లో పొగత్రాగే వారి సంఖ్య తగ్గి, బయట త్రాగే వారి సంఖ్య పెరిగింది. 16-18 మద్య వయసున్న యువతీ యువకుల్ని సర్వే చేస్తే, సినిమాల్లో పొగ త్రాగడాన్ని ఫ్యాషన్ అన్న అర్ధంలో చూపిస్తూంటే,  అది చూసి తామూ పొగత్రాగడం అలవాటు చేసుకున్నామనీ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత  సుభాష్ ఘాయ్ అయితే,  తను  టీనేజిలో వున్నప్పుడు తెర మీద దేవానంద్ పొగత్రాగడం చూసి ప్రభావితుడ్ని అయ్యానని చెప్పుకున్నారు. అప్పట్లో సిగరెట్ తాగే వ్యక్తి గొప్ప ఆలోచనాపరుడై ఉంటాడని భావించే వాళ్ళమనీ, అలాగే సిగరెట్ తాగే నటుడుకి మంచి నటనాసామర్ధ్యం కూడా ఉంటుందని అభిప్రాయముండే దనీ, సిగరెట్ తాగని నటుడికి టాలెంట్ గానీ, సృజనాత్మకతగానీ పెద్దగా ఉండవని డిసైడ్ అయ్యేవాళ్ళమనీ  వివరించారు.

ఈ అధ్యయనం ప్రకారం పొగ త్రాగడాన్ని యువత దైనందిన జీవితంలో ఒక భాగంగా తేలిగ్గా తీసుకుంటోంది. హిందీ సినిమాలతో బాటు దక్షిణాది సినిమాల్లో విలన్ గాక, హీరోయే  సిగరెట్లు తాగే దృశ్యాలు  పెరిగిపోతున్నాయి. సినిమాలకీ, యువత ప్రవర్తనలకీ  మధ్య బలమైన సంబంధం వుంది. సినిమాల్లో చూపిస్తున్న పొగ త్రాగే దృశ్యాల తీవ్రత వాస్తవంగా దేశంలో పొగత్రాగే పరిస్థితి కన్నా బాగా ఎక్కువ వుంది.

ఇంతవరకూ బాగానే వుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత కేంద్రప్రభుత్వం చట్ట సవరణలు చేసి అమలుపరచడం మొదలుపెట్టింది- ఈ అమలు పరచడం దగ్గరే విమర్శల పాలవుతోంది! ధూమపాన నిషేధ బాధ్యతంతా సినిమాలదే అన్నట్టు చేతులు దులిపేసుకుంటోంది...

పాటకు తగ్గట్టే  పాట్లు!

మళ్ళీ సరదా సరదా సిగిరెట్టూ పాటేసుకుంటే..

‘ఊపిరి తిత్తుల క్యాన్సర్ కిదియే కారణం అన్నారు డాక్టర్లూ... కాదన్నారులే పెద్ద యాక్టర్లూ!
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారూ ...దద్దమ్మలు అది విన్నారూ!’

ఈ పాట స్ఫూర్తి తోనే స్పాట్ రూపొందించారేమో అన్నట్టుంది నిర్వాకం ... హాస్పిటల్ బెడ్ మీద నోటి క్యాన్సర్ రోగి...గుట్కాలు తిని తన పరిస్థితి ఎలా  తయారయ్యిందో చూడమన్నట్టు  స్టేట్ మెంట్. ఊపిరితిత్తుల్ని పిండుతున్న చేతులు...ఆ ఊపిరితిత్తుల్లోంచి సిగరెట్లలో వుండే టార్ –పాటలో అన్నట్టు ‘కఫము’ అందామా- కాలుష్యం పిండే కొద్దీ చిక్కటి ద్రవరూపంలో నల్లగా బీకరులోకి కారే దృశ్యం...శుభమా అంటూ సినిమాని ఎంజాయ్ చేసేందు కొస్తే వెగటు పుట్టే ఈ జుగుప్సాకర దృశ్యాలేమిటిరా బాబూ అన్పించే ట్టు, సినిమా మొదట్లో, మళ్ళీ ఇంటర్వెల్లో రిపీట్ చేసే ఆనందం!

ఈ స్పాట్లో కన్పించే నోటి క్యాన్సర్ రోగి ముఖేష్ హరానే అమాంతం ఈ పొగాకువ్యతిరేక ఉద్యమం చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ‘బ్రాండ్  అంబాసిడర్’ గా మారిపోయాడు. అంతలో చనిపోయాడనుకోండి, అది వేరే విషయం. అయితే స్మోకింగ్ సీన్లున్న సినిమాలకి ఈ స్పాట్ ని తప్పనిసరి చేయడంతో ప్రేక్షకుల పడిన నరకయాతన ఇంతా అంతా కాదు. పొగత్రాగడం వల్ల నష్టాలకన్నా ఈ హింస ఎక్కువైపోయింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ హింసని ప్రేక్షకుల మీద రుద్దడం  భావ్యమా అని దేశంలో  ఏ నిర్మాత  కూడా ఆలోచించలేదు. ఆలోచించి వుంటే ఈ హింస నుంచి ప్రేక్షకుల్ని కాపాడడానికైనా స్వచ్చందంగా సిగరెట్ సీన్లు చిత్రీకరించే వాళ్ళు కాదు. ఈ రకంగా సినిమాల్లో ప్రభుత్వం ఉద్దేశించిన ధూమపాన దృశ్యాల నిషేధం అమలైపోయేది. సిగరెట్ ఫ్రీ సినిమాలతో కొత్తగా యువత స్మోకింగ్ అలవాటూ కొని తెచ్చుకునే ప్రమాదమూ  తప్పేది.

కానీ ఒక మంచి పని జరగడానికి అస్సలు వీల్లేదుగా?  ప్రజలే చచ్చినట్టూ వాళ్ళ యుక్తి కొద్దీ చెడు ప్రభావాల బారి నుంచి తెలివిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడాలి.  ప్రభుత్వమూ నిర్మాతలూ పొగత్రాగని ప్రేక్షకుల మనోభావాలని పట్టించుకోకుండా,  అంత జుగుప్సాకర స్పాట్ తో పొగత్రాగే వాళ్ళనీ భయపెట్టినా ఫలితం లేకపోవడం వల్లనేమో- దాన్ని ఉపసంహరించుకుని మరో స్పాట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సిగరెట్ సినిమా’ లకి ఇదే అమలవుతోంది.  ‘ఏమయ్యిందీ నగరానికీ...’  అంటూ ఆందోళనగా ప్రారంభమయ్యే ఈ స్పాట్లో ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూపిస్తూ,  అందులో కూర్చుని ఆడవాళ్ళు ఇబ్బంది పడేలా పొగ మేఘాలు సృష్టిస్తున్న పొగరాయుళ్ళ మీద కామెంట్లు చేస్తుంది...చూడగానే ఈ స్పాట్ ఎంత తెలివితక్కువైనదో తెలిసిపోతుంది. ఫ్యామిలీ రెస్టారెంట్లు కాదుకదా, ఇతర ఏ హోటళ్ళలోనూ కూర్చుని పొగ తాగరాదన్న ఇంగితజ్ఞానం స్మోకర్లకుంది. చాయ్ సిగరెట్లకి ఘనతవహించిన అడ్డాలైన చాలా ఇరానీ హోటళ్ళలో కూడా నో స్మోకింగ్ నోటీసులు పెట్టేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చాలన్నా పక్కనెవరైనా వుంటే దూరంగా వెళ్లి కాలుస్తున్నారు స్మోకర్లు. స్మోకర్లకి ఈపాటి  స్మోకింగ్ మర్యాద తెల్సు. వాళ్ళని అవమానిస్తూ ఇంత  అవాస్తవికమైన స్పాట్ ని తయారుచేసి సినిమాహాళ్ళకి అంటగడితే ఏ ప్రయోజనం నెరవేరుతుంది? అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా, ఇంకే అధ్యయన సంస్థ అయినా ఘోషిం చిందేమిటి? ప్రభుత్వం కూడా గుర్తించిం దేమిటి? సినిమాలు చూసి టీనేజర్లు సిగరెట్లకి అలవాటు పడుతున్నారనేగా? అలాటి టీనేజర్లని టార్గెట్ చేసే స్పాట్ లేనా ఇవి? టీనేజర్ల పాత్ర లేని ఇలాటి స్పాట్స్ ఎన్ని వేసి ఏం లాభం? ఈ హెచ్చరికలు మనక్కాదులే, పొగత్రాగే పెద్దోళ్ళకి – అనుకోరా వాళ్ళూ?

మీ ఆశయాలు నాకొద్దు బాబూ!

ఇలాటి  ధూమపానం నిషేధ విధానంతో ప్రభుత్వ నిర్వాకం చూసి ప్రేక్షకులు ఇంకో విధంగా కూడా నష్టపోతున్నారు. అసలు కాస్త కళాభిరుచి వున్న ప్రేక్షకులెవరికైనా ఈ ప్రభుత్వ విధానం కళారూపాల  పట్ల దొరతనంగానే  అన్పిస్తుంది. ఎందుకంటే విసుగుతో చూడాల్సి వచ్చే స్పాట్స్, అంతే గాక  సిగరెట్ సీన్లు  వచ్చినప్పడల్లా  ఆరోగ్యానికి హానికరమని కింద స్క్రోలింగ్...ఇవి ఓ  చిత్రకారుడు గీసిన బొమ్మ మీద ఇంకెవరో వచ్చి గీతలు గీసిన ఫీలింగ్ ని కలగజేస్తాయి. కోపం తెప్పిస్తాయి. దృశ్యం మీద నుంఛి ఆ స్క్రోలింగ్ మీదికి దృష్టి మళ్లుతూ,  మొత్తంగా సినిమా వీక్షణా నుభవం భంగమౌతుంది. ఇలా ఈ స్క్రోలింగ్- స్పాట్ ల వీరంగం ఇప్పటివరకూ దేశంలో ఏ దర్శకుడికీ, నిర్మాతకీ అభ్యంతరకరంగా తోచలేదు- ఆ ఒక్కడికి తప్ప! ఆయన సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు వుడీ అలెన్!  మీ మతిమాలినతనంతో నేను తీసిన దృశ్యాల్ని కలుషితం చేసుకోలేను, మీ ఆశయాలకో నమస్కారం , నా సినిమాని  మీ దేశంలో విడుదల చెయ్యను పొమ్మని వెళ్ళిపోయాడు.

తను తీసే సినిమాలకి ఎప్పుడూ ఏదో ఒక ఆస్కార్ అవార్డు పొందే దర్శకుడు వుడీ  అలెన్ 2013లో తీసిన ‘బ్లూ జాస్మిన్’ కి మనదేశంలో సెన్సార్  పొగ సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం జేసింది . అందులో హీరోయిన్ కేట్ బ్లాంచెట్ పొగత్రాగే దృశ్యాలు రెండున్నాయి. వీటిమీద స్క్రోలింగ్ వేసి, సినిమా లో రెండు సార్లు స్పాట్ వేయాలని కోరింది సెన్సార్ బోర్డు. వుడీ అలెన్ తీవ్రంగా మండిపడ్డాడు. నా దృశ్యాల మీద  మీరెవరు పెత్తనం చెలాయించడానికి? అని విరుచుకు పడి, నా సినిమాని మీ దేశంలో విడుదల చెయ్యనని స్పష్టం చేశాడు. ఆ విధంగా ఆ సినిమాని చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు. తర్వాత డీవీడీ ల్లో చూడొచ్చు, అది వేరు. అయితే  ఈ సినిమాలో సిగరెట్లు తాగి నటించిన కేట్ బ్లాంచెట్ కి ఆస్కార్ ఉత్తమనటి అవార్డు లభించడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో సెన్సార్ బోర్డే చెప్పాలి!

1975 ఎమర్జెన్సీ కాలం లో సినిమాల్లో మద్యం, రక్తం చూపించ కూడదని నిబంధనలు విధించినప్పుడు , విలన్ పాత్రలు విధిలేక కూల్ డ్రింకులు మాత్రమే  త్రాగి రంకె లేసేవి. రక్తాలు పారించలేక పిడిగుద్దులు మాత్రమే గుద్దుకుని ఫైటింగ్  సీన్లు ముగించేసేవి. పద్మాలయా బ్యానర్ లో  హీరో కృష్ణ తీసిన ‘రామరాజ్యంలో రక్తపాతం’ అన్న టైటిలున్న పోస్టర్లలో  ‘రక్తపాతం’ మీద ‘రక్త పాశం’ అంటూ సాత్వికమైన స్లిప్పులు అతికిం చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సృజనాత్మక స్వే చ్ఛా అంటూ నినదించడానికి వీల్లేదు. అప్పట్లో ఏ స్వేచ్ఛ కీ రోజులుకావు. ఇప్పడు అన్ని స్వేచ్ఛలూ పరిఢవిల్లుతున్నా ఏ గొంతూ పెగలడం లేదు. ఒక్క ఆ విదేశీయుడు మాత్రమే తన సృజనాత్మక స్వేచ్చ కోసం తన సినిమా విడుదలనే వదులుకుని పోయాడు.

ప్రకటనేసుకుంటే ఎంత ఉవ్వెత్తున పొగమేఘాలు సృష్టించుకున్నా మాకేం అభ్యంతరం లేదనే ధోరణిలో ప్రభుత్వ ప్రవర్తన వుంటే,  ఈ మాత్రం దానికి సృజనాత్మక స్వేచ్చంటూ మనకెందుకు గొడవని ప్రకటనేసేసి ఉధృతంగా పోగసీన్లు జొప్పించేస్తున్నారు మన నిర్మాతలు. బాలీవుడ్ లో చెప్పనవసరం లేదు, టాలీవుడ్ లోనూ మహేష్ బాబు దగ్గర్నుంచీ అల్లుఅర్జున్ వరకూ ప్రతీ పేరున్న యువ స్టారూ వెండితెర మీద పొగత్రాగేసి తరిస్తున్నారు.  దక్షిణ కొరియాలో కూడా ఈ ధోరణే ప్రబలి ఎక్కడికి దారితీసిందో తెలుసుకుంటే పొగ త్రాగకుండానే భయంతో జబ్బున పడతాం. దక్షిణ కొరియాలో సినిమాల్లో స్మోకింగ్ దృశ్యాలపై నిషేధాన్ని కచ్చితంగా అమలుపర్చక పోవడంతో, సినిమాల్లో కావాలని హీరోల చేత సిగరెట్లు తాగే సీన్లు ఎడాపెడా పెట్టేస్తూ, అది సృజనాత్మక స్వేచ్చంటూ దబాయిస్తూ పోయారు. ఫలితంగా దేశ జనాభాలో 80 శాతం  మంది పోగారాయుళ్ళుగా మారిపోయి ప్రమాదం అంచున చేరుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు సిగరెట్ల కంపెనీలు నిర్మాతల్ని ఇంకా ఎగదోసి, హీరోయిన్ల చేత కూడా తాగించడం మొదలెట్టించారు. అదేమని నిలదేస్తే,  మహిళా శక్తినీ , ఇంకా మాట్లాడితే స్త్రీ స్వేచ్చనీ ప్రమోట్ చేస్తున్నామంటున్నారు! ఆ విధంగా దేశంలో స్త్రీలు కూడా సిగరెట్లు తాగేట్టు ఎగదోసి వ్యాపారాలు పెంచుకుం టున్నారు.

ఈ పరిస్థితి మనదాకా రాదనీ గ్యారంటీ లేదు. అప్పుడు మనదేశంలో దమ్ముకొట్టే ఆడా మగా లెక్కకందకుండా పోయి, ఆ సమూహం థియేటర్ లలోకూడా స్మోకించుకోవడానికి ఛాన్సివ్వాల్సిందే నంటూ పెద్ద  ఉద్యమం చేపట్టినా ఆశ్చర్యం లేదు.

ఇందాకటి పాటని ఇంకో సారి వేసుకుంటే...

థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించి నారందుకే...కలక్షన్లు లేవందుకే! ‘ అన్నట్టు తయారవుతుంది ప్రకోపించిన పొగరాయుళ్ళ తో/పొగరాయమ్మ లతో పరిస్థితి!

కొసమెరు పేంటంటే –  గత ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల్ని అమలుపర్చాల్సిన కేంద్ర సమాచార ప్రసారాల  శాఖ మంత్రివర్యులే - అంత సీనేం లేదు,  పొగగోల మనకెందుకు లెండి, లైట్ తీసుకోండి –అని కేంద్రీయ సెన్సార్ బోర్డు చెవిలో ఊదినట్టు ఓ ఎన్జీఓ  సంస్థ కూపీలాగి బయటపెట్టింది!


-సికిందర్
('ఈవారం' మేగజైన్, జూన్' 2014 సంచిక )